నితీష్ కంటే లాలూకే మొగ్గు చూపిన బిహార్ ప్రజలు?
posted on Nov 8, 2015 6:01PM
.jpg)
బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఊహించనంతగా ఎదురుదెబ్బతింది. మోడీ ప్రభావంతో బిహార్ ఎన్నికలలో అవలీలగా గెలవగాలమనుకొంటే కనీసం మీడియా సంస్థలు ఊహించినన్ని సీట్లు కూడా గెలుచుకోలేక చతికిలపడింది. ఈ ఎన్నికల ఫలితాలపై సర్వే చేసిన అన్ని మీడియా సంస్థలు కూడా నితీష్-లాలూల మహా కూటమి విజయం సాధిస్తుందని ఖచ్చితంగా చెప్పాయి. అదే సమయంలో ఎన్డీయే కూటమి కనీసం 90-100 సీట్లయిన గెలుచుకోవచ్చునని ప్రకటించాయి. కానీ బిహార్ ప్రజలు వాటి అంచనాలను తారుమారు చేస్తూ బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమికి కేవలం 58 సీట్లు మాత్రమే ఇచ్చేరు. డిల్లీ ఎన్నికల తరువాత మళ్ళీ మరోసారి నరేంద్ర మోడీ-అమిత్ షాలకు బిహార్ లో చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
కొద్ది సేపటి క్రితమే బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. నితీష్-లాలూల మహా కూటమి మొత్తం సీట్లు గెలుచుకొంది. ఇక బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి కేవలం 58సీట్లు మాత్రమే గెలుచుకొంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసివచ్చేయి. కాంగ్రెస్ మొత్తం 43స్థానాలకు పోటీ చేయగా వాటిలో 27 సీట్లు గెలుచుకొంది. ఇంత చక్కటి విజయం చవి చూసి కాంగ్రెస్ పార్టీకి చాలా కాలం అవడంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం పెల్లుబుకుతోంది.
ఈ ఎన్నికలలో విశేషం ఏమిటంటే నితీష్ కుమార్ పరిపాలన, సమర్ధత, నిజాయితీలను చూసి ప్రజలను ఓట్లు వేయాలని మహాకూటమి కోరగా, ప్రజలు నితీష్ కుమార్ పార్టీ (జె.డి.యూ.)కి 71 సీట్లు, అవినీతి ఆరోపణలలో జైలుకి కూడా వెళ్లి వచ్చిన లాలూ ప్రసాద్ యాదవ్ కి చెందిన ఆర్.జే.డి. పార్టీకి 81 సీట్లు కట్టబెట్టారు. కానీ అందరూ నితీష్ కుమారే ఈ ఎన్నికలలో విజయం సాధించారని చెపుతుండటం, ఆయనకే అభినందనలు తెలియజేస్తుండటం విశేషం.