బీహార్లో బీజేపీ కుల రాజకీయం ఫెయిల్.. మరి ఏపీలో?
posted on Nov 8, 2015 9:49PM

బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ ఆ పార్టీ మతతత్వ పార్టీ అనే విమర్శలు దేశవ్యాప్తంగా వినిపిస్తూనే వుంటాయి. ఆ విమర్శల తీవ్రత చూస్తుంటే బీజేపీ మీద వున్న మతతత్వ పార్టీ ముద్ర ఎప్పటికీ చెరిగిపోదేమో అనిపిస్తూ వుంటుంది. ఇంతకాలం ‘మతతత్వ’ ముద్ర వున్న బీజేపీ మీద ఇప్పుడు కులతత్వ ముద్ర కూడా పడిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీహార్లో విజయం సాధించడం కోసం బీజేపీ కులాన్ని పావులా వాడుకుంది. జితన్ రామ్ మాంఝీ, ఇలాంటి ‘క్యాస్ట్ కార్డు’ వున్న మరికొందరు నాయకులను చేరదీయడం ద్వారా కులపరమైన లబ్ధిని ఈ ఎన్నికలలో పొందాలని బీజేపీ ప్లాను వేసింది. అయితే ఆ ప్రయత్నాలు, ప్రయోగాలు విఫలమై బీజేపీకి చేదు అనుభవాన్ని మిగిల్చాయని విశ్లేషిస్తున్నారు. బీహార్లో బీజేపీ కుల రాజకీయం ఫెయిల్ అయిందని తాజాగా వెల్లడైన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. మరి అదే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కుల రాజకీయాలను నడుపుతోంది... మరి ఆ రాజకీయాల పర్యవసానం ఎలా వుండబోతోందో!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశానికి మిత్రపక్షంగా వుండి, అధికారంలో భాగస్వామ్యం పొందిన భారతీయ జనతా పార్టీ ఏపీలో తన భవిష్యత్తు గురించి అందమైన కలలు కంటోంది. మిత్రుడు మిత్రుడే రాజకీయం రాజకీయమే అన్నట్టుగా ఏపీ బీజేపీ నాయకుల వ్యవహారశైలి వుంది. 2019లో వచ్చే ఎన్నికలలో ఏపీలో సొంతగా అధికారాన్ని సంపాదించేయాలన్న అత్యుత్సాహం బీజేపీ నాయకులలో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందుకే టీడీపీతో మిత్రధర్మాన్ని పాటించకుండా వ్యాఖ్యలు చేయడంతోపాటు కుల రాజకీయాలను కూడా నడుపుతున్నారని విశ్లేషిస్తున్నారు.
ఏపీ బీజేపీకి మొదటి నుంచి కమ్మ కులానికి చెందినవారే మహారాజపోషకులు. ఏపీలో బీజేపీ నిలదొక్కుకోవడానికి ఆ కులం వారే ప్రధానంగా కృషి చేశారు. అయితే ఆ సామాజికవర్గం బీజేపీకి ఎంతగా ఉపయోగపడుతున్నా, ఎంతయినా వాళ్ళు టీడీపీకి అనుకూలంగా వుంటారు కాబట్టి, ఆ కులాన్ని పార్టీలో ఎదగనీయకూడదన్న ధోరణి ఏపీ బీజేపీలో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాపు, రెడ్డి కులాలను మంచి చేసుకోవడం ద్వారా ఏపీలో రాజకీయంగా అగ్రస్థానానికి వెళ్ళిపోవాలని బీజేపీ భావిస్తోందని చెబుతున్నారు. ఆ ప్రయత్నాల్లోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కాపు కులానికి చెందిన సోము వీర్రాజును నియమించబోతున్నారని సమాచారం. సోము వీర్రాజు సామాన్యుడేం కాదు.. బీజేపీ ఆలోచనలను అక్షరాలా అమలు పెట్టే ‘వాగ్ధాటి’ వున్న నాయకుడు. టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీగా ఎదిగి ఆ పార్టీనే విమర్శించగల రాజకీయ చతురుడు. ఆ చతురతతోనే కాపులను, రెడ్లను బీజేపీకి స్నేహితులుగా చేసే కృషి చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.
ఆ కృషిలో భాగంగానే ఔట్ డేటెడ్ కాపు నాయకుడైన చేగొండి హరిరామ జోగయ్య రాసిన ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి ఏపీ బీజేపీ నాయకులుహాజరయ్యారు. కాపు నాయకుడు వంగవీటి రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం వుందని రాశారని తెలిసినా ఎంతమాత్రం ఇబ్బంది పడకుండా ఆ సభలో పాల్గొన్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే, చంద్రబాబు మీద కోపం వున్న పురందేశ్వరి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే రంగా హత్య జరిగిన సమయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్నారన్న విషయం ఆమె మరిచారనుకోలేం. కాపులను మంచి చేసుకోవడం కోసం, చంద్రబాబు మీద పగ తీర్చుకోవడం కోసం ఆమె ఆ సభకు మనసు రాయి చేసుకుని వెళ్ళి వుంటారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏపీ బీజేపీ నాయకులు మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్‌ని గ్రిప్‌లో పెట్టుకుని కాపు ఓటు బ్యాంకు సంపాదించుకుందామని అనుకున్నారు. అయితే నిలకడలేని పవన్ కళ్యాణ్‌ని నమ్ముకుంటే దేన్నో పట్టుకుని గోదారి ఈదినట్టని అర్థం చేసుకున్నారు. అందుకే ఇతర మార్గాల ద్వారా కాపులకు దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇటు కాపులతోపాటు వైఎస్ జగన్‌కి చేరువ కావడం ద్వారా రెడ్లను కూడా తమ పార్టీ వైపు తిప్పుకుని 2019 ఎన్నికలలో చక్రం తిప్పాలన్నది బీజేపీ వ్యూహంగా వుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తాజాగా బీహార్లో కుల రాజకీయాలు బీజేపీకి చేదు అనుభవాన్ని ఇచ్చాయి. మరి ఏపీలో ఎలాంటి అనుభవాన్ని ఇవ్వబోతున్నాయో వేచి చూడాలి.