మోడీ ఇప్పుడు బిహార్ కి ఆ ప్యాకేజి ఇస్తారా...లేదా?
posted on Nov 9, 2015 1:00PM
.jpg)
బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడి ఎవరూ అడగకపోయినా ఆ రాష్ట్రానికి ఏకంగా రూ.1.65లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయినా బిహార్ ఎన్నికలలో బీజేపీ ఘోరపరాజయం పొందింది. మరి మోడీ ఇప్పటికీ తన మాటకు కట్టుబడి ఆ రాష్ట్రానికి ఇస్తానని హామీ ఇచ్చిన రూ.1.65లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి ఇస్తారా? లేక తన పార్టీని అంత అవమానకరంగా తిరస్కరించినందుకు ఆ హామీని చెత్తబుట్టలో పడేస్తారా? వేచి చూడాల్సిందే.
ఒకవేళ ఆ హామీని నిలబెట్టుకోలేకపోతే ఇక ముందు జరుగబోయే ఎన్నికలలో మోడీ హామీలను ప్రజలు విశ్వసించక పోవచ్చును. దాని వలన బీజేపీకి చాలా నష్టం జరుగుతుంది. కేంద్రం తమ ప్రభుత్వానికి ఇదివరకులాగే సహకరిస్తుందని భావిస్తున్నట్లు బిహార్ ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టబోతున్న నితీష్ కుమార్ అన్నారు.
బీజేపీకి మిత్రపక్షంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉన్నపటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయంలో పార్లమెంటులో ఆ తరువాత మళ్ళీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ ఏర్పాటు వంటి హామీలను ఇంతవరకు అమలుచేయలేదు. అటువంటప్పుడు బిహార్ లో బీజేపీని చావుదెబ్బ తీసిన నితీష్ కుమార్-లాలూ ప్రసాద్ యాదవ్ లకు ఆర్ధిక ప్యాకేజీని అందించి, వారిరురు ప్రజలలో మరింత మంచిపేరు సంపాదించుకొని, బిహార్ లో మరింత బలపడే అవకాశం మోడీ ప్రభుత్వం కల్పిస్తుందా లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బిహార్ రాష్ట్రానికి ఆర్ధిక ప్యాకేజి ఇచ్చినా ఇవ్వకపోయినా బీజేపీకే నష్టం కలిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. దానికి ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షాణమే ఆర్ధిక ప్యాకేజి ప్రకటించాలని రాష్ట్ర ప్రజలు, అధికార, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కోరుకొంటున్నాయి.