బాలకృష్ణకి చంద్రబాబు జ్ఞానోపదేశం!
posted on Apr 12, 2014 11:15AM
.jpg)
భారతంలో బావమరిది అర్జునుడు యుద్ధం చేయనని అస్త్ర సన్యాసం చేస్తే, బావగారైన శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసి అర్జునుడిని యుద్ధ రంగంలో నిలిపాడు. ఈనాటి ఎన్నికల భారతంలో బావమరిది నందమూరి బాలకృష్ణ ఎన్నికల యుద్ధం చేస్తానని ఉత్సాహం చూపిస్తే, బావగారైన నారా చంద్రబాబు నాయుడు బావమరిది నందమూరి బాలకృష్ణకి జ్ఞానోపదేశం చేసి యుద్ధరంగం నుంచి తప్పించాడు. అసలేం జరిగిందంటే, ‘లెజెండ్’ విజయం సాధించడంతో మాంఛి ఉత్సాహంలో వున్న బాలకృష్ణ ఆ సినిమా విజయయాత్రలో హిందూపురం నుంచి ఎన్నికల బరిలో నిలబడబోతున్నట్టు ప్రకటించేశాడు. ఆ తర్వాత నేరుగా చంద్రబాబు దగ్గరకి వెళ్ళి హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి తన పేరు అనౌన్స్ చేయమని ఉత్సాహంగా అడిగేశాడట.
బాలకృష్ణ ఉత్సాహాన్ని గమనించిన చంద్రబాబు ఇప్పుడు నువ్వు పోటీ చేయడం అవసరమా అని అడిగాడట. దానికి బాలకృష్ణ తాను పోటీ చేయడానికి ఇదే సరైన సమయం అని, ఇప్పుడు పోటీ చేస్తే తాను బంపర్ మెజారిటీతో గెలుస్తానని చెప్పారట. అప్పుడు చంద్రబాబు నాయుడు బాలకృష్ణకు భారీ స్థాయిలో క్లాసు తీసుకుని, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎంత టఫ్‌గా వుందో వివరించడంతోపాటు ఈ ఎన్నికలలో బాలకృష్ణ పోటీ చేయడం మంచిది కాదని చెప్పాడట. అయితే బాలకృష్ణ మాత్రం తన ఉత్సాహాన్ని విడిచిపెట్టకపోవడంతో చంద్రబాబు కాస్తంత సీరియస్ అయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు పోటీ స్తే ఖచ్చితంగా ఓడిపోతావ్. అప్పుడు ఇటు సినిమాలకి, అటు రాజకీయాలకి జాయింట్‌గా చెడిపోతావ్ అని వార్నింగ్ ఇచ్చారట.
దాంతో జ్ఞానోదయం కలిగిన బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాను కదా.. అక్కడివాళ్ళు, అభిమానులు నిరాశపడతారేమోనని ధర్మసందేహాన్ని వ్యక్తం చేశాడట. అప్పుడు చంద్రబాబు పరిస్థితి మొత్తాన్నీ నేను సెటిల్ చేస్తానుగానీ, ఇకముందు మాత్రం నోరుజారి స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దని చెప్పాడట. ఈసారి ప్రచారంతో సరిపెట్టుకోమని సూచించాడట. బావగారి నుంచి జ్ఞానోపదేశం పొందిన బాలకృష్ణ బావమాట బంగారు బాట అనుకుంటూ తన డేట్స్ కోసం క్యూలో వున్న ఇద్దరు నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.