అధిష్టాన దేవతలు తెలంగాణాలో పార్టీని గట్టెక్కించగలరా

 

రాష్ట్ర విభజన వ్యవహారం సాగుతున్నంత కాలం రాష్ట్రం వైపు మొహం చూపించని కాంగ్రెస్ పెద్దలు అందరూ, మళ్ళీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఒకరొకరుగా రాష్ట్రంపై వాలిపోతున్నారు. ఈనెల 30న తెలంగాణాలో ఎన్నికలు జరుగుతున్నందున ముందుగా అందరూ అక్కడే వాలిపోతున్నారు.

 

ప్రస్తుతం తెలంగాణాలో పార్టీకి చాలా అనుకూల పరిస్థితులు ఉన్నపటికీ టీ-కాంగ్రెస్ నేతల మధ్య సరయిన సయోధ్య లేకపోవడం, తెలంగాణాలో పది జిల్లాలపై పూర్తిపట్టు, ప్రజాదారణ ఉన్ననేత ఒక్కరూ లేకపోవడం, వారిలో ఏ ఒక్కరు కూడా కేసీఆర్ ని ఎదుర్కొనే సత్తా లేకపోవడం, కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలాంశాలుగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో కూడా టీ-కాంగ్రెస్ నేతలందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి పార్టీ తరపున ప్రచారం చేయలేకపోవడం గమనిస్తే వారి సిగపట్లు ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్ధమవుతుంది. ఇదే అదునుగా కేసీఆర్ తెలంగాణా జిల్లాలన్నిటిలో ప్రచారం చేసి మరింత పట్టు సాధించుకొనేందుకు సిద్దం అవుతున్నారు.

 

ఈ పరిస్థితిని చూసిన కాంగ్రెస్ అధిష్టానం ముందుగా చూసి రమ్మంటే కాల్చి వచ్చే జైరామ్ రమేష్ ను పంపింది. ఆయన తిరుగుబాటు అభ్యర్ధులను ఒక్కోకరితో మాట్లాడుతూ వారి చేత నామినేషన్లు ఉపసంహరింపజేస్తున్నారు. ఆయన పార్టీలో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చి టీ-కాంగ్రెస్ నేతలందరినీ దారిలో పెట్టేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

 

ఆ పని పూర్తవగానే ఈనెల 16న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్ నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఆ తరువాత యువరాజవారు కూడా ప్రచారానికి వేంచేస్తారు. అయితే కాంగ్రెస్ నేతలు తమను తాము తప్ప మరే ఇతర పార్టీలు ఓడించలేవని గర్వంగా చెప్పుకొనే మాటలను నిజమని నిరూపిస్తారో లేక అందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి మరో మారు తమ సత్తా చూపించి తెరాస, తెదేపా-బీజేపీలను మట్టి కరిపించి అధికారం చేజిక్కించుకొంటారో మరి కొద్ది రోజులలోనే తేలిపోనుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu