మీలో ఉన్న ఈ అలవాట్లే మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తాయి..!


ఒక మనిషి వ్యక్తిత్వం ఆ మనిషి జీవితంలో ఎదుగుదలను,   ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్ణయిస్తుంది. ప్రతి ఒక్కరూ తాము కరెక్టే అనుకుంటూ ఉంటారు. ఇలా కరెక్టే అనుకోవడం ఆ మనిషికి తన మీద తనకు నమ్మకం ఉండటం కావచ్చు. కానీ.. కొన్నిసార్లు ఇట్లాంటి నమ్మకాలు,  వ్యక్తిలో ఉండే కొన్ని గుణాలు వ్యక్తిని దెబ్బతీస్తాయి.  వాటిని సరిగా అర్థం చేసుకోలేని పక్షంలో అవి వ్యక్తిని పాతాళానికి తొక్కేస్తాయి కూడా.  ఆ అలవాట్లేంటో తెలుసుకుంటే..

ఆధిపత్యం..

ప్రతిసారీ  అభిప్రాయాన్ని చెప్పే అలవాటు ఉందా? వాదనలో ఎదుటి వ్యక్తి మాట వినకుండా నిర్ణయం తీసుకుంటారా?

అలా అయితే తెలియకుండానే ఆధిపత్య వ్యక్తిత్వంలో భాగమయ్యే అవకాశం ఉంది.  ఇది క్రమంగా సంబంధాలలో దూరాన్ని సృష్టించవచ్చు. ప్రతి పరిస్థితిలోనూ నాయకత్వం వహించడం అవసరం కావచ్చు, కానీ అది అహం,  నియంత్రణగా మారినప్పుడు అది సంబంధాలకు ,  స్వంత వ్యక్తిత్వానికి హాని కలిగిస్తుంది. సంబంధంలో కనెక్షన్ ముఖ్యం, నియంత్రణ కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని గుర్తించాలి.

సంభాషణలో అంతరాయం..

సంభాషణ మధ్యలో  ఎవరినైనా పదే పదే అంతరాయం కలిగిస్తే లేదా ఎల్లప్పుడూ మీ అభిప్రాయాన్ని ముందుగా తెలియజేస్తే, అది ఆధిపత్య ప్రవర్తన. ఇతర వ్యక్తులు ఈ రకమైన ప్రవర్తనను ఇష్టపడరు.  వారు మీతో మాట్లాడకుండా ఉంటారు. దీన్ని సరిచేసుకోవాలంటే..  ఇతరులు మాట్లాడటం ముగించిన తరువాత   సమాధానం ఇవ్వాలి.  మీరు మాట్లాడిన తరువాత వారి సమాధానం వినాలి.

సొంత నిర్ణయాలు..

స్నేహం, సంబంధం లేదా ఆఫీసులలో  ప్రతిసారీ "ఏమి చేయాలో" ఎవరికి వారు  నిర్ణయించుకోకూడదు.  ఒక వేళ అలా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే  ఎదుటి వ్యక్తి ఆలోచనలకు స్థలం ఇవ్వడం లేదని అర్థం. ప్రతి విషయాన్ని ఇతరులకు ఒక ఆర్డర్ లాగా సొంతంగా నిర్ణయం తీసుకుని అధికారం చూపిస్తే అది చాలా తప్పు. దాన్ని సరిదిద్దుకోవాలి.  నలుగురు పాల్గొనే ఒక విషయంలో నలుగురి నిర్ణయాలు,  నలుగురి ఆలోచినలు, నలుగురి వ్యక్తీకరణలు కూడా ఉండాలి.

వాదనలో గెలవాలనే తత్వం..

 చర్చ సమయంలో ఎల్లప్పుడూ వాదనలో గెలవడానికి ప్రయత్నిస్తే లేదా వాదనలో గెలిచిన తర్వాత  అభిప్రాయాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తే.. ఇది కూడా ఆధిపత్యానికి సంకేతం. వాదనలో గెలవడం కాదు, అర్థం చేసుకోవడం ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. ప్రతిసారీ వాదనలో గెలవడానికి ప్రయత్నించకూడదు.  ఇతరులు ఏమి చెబుతారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. విషయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప.. నష్టం చేకూరినా సరే.. తన మాటే నెగ్గాలి అనే స్వభావం పనికిరాదు.

అందరూ తనకు నచ్చినట్టు ఉండాలని అనుకోవడం..

ప్రతి ఒక్కరికీ ఒక ఆలోచన,  ఒక అభిప్రాయం,  కొన్ని ఇష్టాఇష్టాలు.. ఉంటాయి.  వాటికి తగినట్టే వారి ప్రవర్తన కూడా ఉంటుంది. కానీ ఇతరులను మార్చడానికి ప్రయత్నించేవారు లేదా వారి అభిప్రాయమే ఫైనల్ అని కోరుకునే వ్యక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు అని అర్థం.  మీ ఇష్టానుసారం ఇతరులను మార్చడానికి ప్రయత్నించే బదులు, వారి ఆలోచనలు, జీవనశైలి,  ప్రవర్తనను స్వీకరించడమే ఉత్తమమైన వ్యక్తిత్వం.  ఎదుటి వ్యక్తిని యాక్సెప్ట్ చేయడం వల్ల ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావు. అట్లాగే.. తన వ్యక్తిత్వ గౌరవాన్ని నిలబెట్టుకుంటూనే.. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించడం చేసినట్టు అవుతుంది.

                              *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu