ఓ వైపు బిగింపు..మరో వైపు సడలింపు.. అవినాష్ విషయంలో సీబీఐ విచిత్రాలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ తొలిసారిగా నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో ఆయన ను ఎ8 గా చేర్చింది. భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్ పై గురువారం (జూన్8) సీబీఐ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో సీబీఐ అవినాష్ ను నిందితుడిగా, ఎ8గా పేర్కొంది. అదే సమయంలో అవినాస్ విషయంలో మరో బ్రహ్మాండమైన ట్విస్ట్ వెలుగులోనికి వచ్చింది.  సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం, బెయిలుపై విడుదల చేయడం అన్నీ జరిగిపోయాయని బయటకు వచ్చింది.  

అయితే ఈ విషయాన్ని అటు అవినాష్ రెడ్డి.. ఇటు సీబీఐ కూడా అత్యంత గోప్యంగా ఉంచారు.  తెలంగాణ హైకోర్టులో అవినాష్ కు ముందస్తు బెయిలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ బెయిలు సందర్భంగానే కోర్టు సీబీఐ  అవినాష్ ను అరెస్టు చేసి విచారించాలనుకుంటే అరెస్టు చేసి వెంటనే ఐదు లక్షల పూచీకత్తుతో విడుదల చేయాలన్న షరతు విధించిన సంగతి విదితమే.   ఆ ప్రకారమే కోర్టు ఆదేశాల మేరకు  విచారణకు హాజరైన అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసి వెంటనే ఐదు లక్షల పూచికత్తు తీసుకుని విడుదల  చేసింది. ఇదేంటి కోర్టుకు ఇవ్వాల్సిన పూచీకత్తును అవినాష్ సీబీఐకి ఇవ్వడమేంటి? సీబీఐ వాటిని అంగీకరించి విడుదల చేయడమేమిటి? అన్న అనుమానాలు వస్తే అది అమాయకత్వమే. ఎందుకంటే సీబీఐ అవినాష్ విషయంలో గతంలో ఎన్నడూ ఎవరి విషయంలోనూ చూపనంత ఉదారత చూపుతోంది.

ఒక వైపు కోర్టుల్లో అవినాష్ వివేకా హత్య కేసులో కీలకంగా వ్యవహరించాడని పేర్కొంటూనే.. అరెస్టు విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడంలేదు.  అవినాష్ అరెస్టు బెయిలుపై విడుదల వ్యవహారం ఎంత రహస్యంగా ఉంచారంటే.. ఈ కేసులో సీబీఐ కంటే చురుకుగా, చొరవగా తండ్రి హంతకులకు శిక్ష పడాలంటూ.. కోర్టుల చుట్టూ తిరుగుతూ.. కేసు ఇంత వరకూ రావడానికి కారణమైన వివేకా కుమార్తె సునీతకు కూడా తెలియలేదు. అందుకే ఆమె అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వ్యులను సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయించారు. ఆమె పిటిషన్ శుక్రవారం (జూన్ 9) సర్వోన్నత న్యాయస్థానం ఎదుటకు వచ్చే అవకాశం ఉంది.  ఇప్పుడు అవినాష్ ను సీబీఐ అల్ రెడీ అరెస్టు చేసి బెయిపుపై విడుదల చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టులో ముందస్తు బెయిలుపై కాకుండా బెయిలును రద్దు చేయాలన్న అంశంపై విచారణ జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరో వైపు అవినాష్ ను ఉపయోగం లేని అరెస్టు చేసి బెయిలిచ్చి విడుదల చేసిన సీబీఐ, ఇదే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను సీబీఐ కోర్టులో గట్టిగా వ్యతిరేకించింది.  ఆ సందర్భంగా కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో అవినాష్ రెడ్డిని ఎ8గా పేర్కొంది. మరో సారి ఏపీ సీఎం జగన్ పేరునూ ప్రస్తావించింది. తొలి సారిగా అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చింది.  

హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో తండ్రీ కొడుకులు భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డీ చాలా కీలకంగా వ్యవహరించారని, కేసు వద్దని.. వివేకా మృతదేహానికి పోస్టుమార్టం అవసరంల ేదనీ సీఐ శంకరయ్యకు అవినాష్ గట్టిగా చెప్పారని సీబీఐ ఆ అఫిడవిట్ లో పేర్కొంది. సీబీఐకి ఏం చెప్పొదని దస్తగిరిని బెదరించడంలోనూ, ప్రలోభపెట్టడంలోనూ అవినాష్ పాత్రే కీలకమని స్పష్టం చేసింది.  వివేకా హత్య కేసులో భారీ కుట్రపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్న సీబీఐ భాస్కర్ రెడ్డికి బెయిలు ఇవ్వొద్దంటూ సీబీఐ కోర్టులో గట్టిగా వాదించింది.  భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్ పై సీబీఐ కోర్టు శుక్రవారం (జూన్ 9) తీర్పు వెలువరించనుంది.