బీఎస్ఎన్ఎల్ నెత్తిన భస్మాసుర హస్తం

ఇప్పటి జనరేషన్ కు ఫఓన్ అంటే మొబైల్ అని మాత్రమే తెలుసు. 1980కి ముందు ప్రపంచాన్ని చూసిన వారికి ఫఓన్ అనే పరికరం మాత్రమే తెలుసు. అది కూడా అత్యంత ఖరీదైన వస్తువుగా తెలుసు. అప్పట్లో వీధికి ఒక్క ఫఓన్ మాత్రమే ఉండేది.  గ్రామాలలో పరిస్థితి ఇక చెప్పనక్కరలేదు. ఇలాంటి సమాచార వ్యవస్థలో వచ్చిన పెను మార్పులు ఫోన్ల స్థానంలో మొబైల్ ఫోన్లను తెచ్చాయి.

ఇప్పడు ప్రతి ఇంట్లో కనీసం అరడజను ఫోన్లు. టెలికాం విప్లవం మొబైల్ ఫోన్లతో ఆగిపోలేదు.  జనరేషన్ల పేరుతో తన సేవలను పెంచుకుంటూ ఇప్పుడు 5జీగా కొనసాగుతోంది. అలాంటి సమాచార విప్లవంలో భారత ప్రభుత్వం కూడా తన స్వంత సంస్థగా కోటి రూపాయల మూలధనంతో భారత సంచార నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ను ప్రారంభించింది.  ప్రయివేటీకరణలో భాగంగా కార్పొరేట్లను ఆహ్వానిస్తూ వచ్చిన భారత ప్రభుత్వం క్రమంగా బీఎస్ఎన్ఎల్ ను పక్కన పెట్టేసింది. భారత దేశంలో డిఫఎన్స్, రైల్వేస్ తరువాత అ త్యధిక మంది ఉద్యోగులను, ఆస్తులను కలిగిన బీఎస్ఎన్ఎల్ దివాళా తీసే విధంగా కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి.

చివరికి బీఎస్ఎన్ ఎల్ అభివృద్ధి 3జి దగ్గరే ఆగిపోయింది.  మిగిలిన కార్పొరేట్ టెలికాం సంస్థలు లాభాల బాటలో నడుస్తుంటే భారత ప్రభుత్వంలోని బీఎస్ఎన్ఎల్ నష్టాల ఊబిలో చిక్కుకుంది.  తాజాగా కేంద్రం బీఎస్ఎన్ఎల్ కు 89వేల కోట్ల రూపాయల పునరుజ్జీవ ప్యాకేజీని ప్రకటించింది.  దీంతో అనేక అనుమానాలు తెరమీదకు వచ్చాయి. 

ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన 89 వేల కోట్ల పునరుజ్జీవ ప్యాకేజీలో పలు కీలక అంశాలపై దేశంలో చర్చ సాగుతోంది.  బీఎస్ఎన్ఎల్ ను పలు రకాలుగా నష్టాలలోకి నెట్టి అప్పడప్పుడూ ప్యాజేపీలు ప్రకటించడాన్ని టెలికాం రంగ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఒకటిన్నర శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న భారత టెలికాం రంగానికి ఈ దుస్థితి పట్టడానికి కారణం మితిమీరిన కార్పొరేట్ పలుకుబడే కారణమని విమర్శలు వస్తున్నాయి.  స్పెక్ట్రం లకు బీఎస్ఎన్ఎల్ ను దూరం చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పడుు వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వడం, వాటిని దొడ్డి దారిన కార్పొరేట్ల చేతుల్లోకి పంపడానికే అని విమర్శలు ఉన్నాయి. 

దేశంలో  సుమారు 36శాతం మంది గ్రామీణ ప్రజలు బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ సేవలపై ఆధారపడి ఉన్నారు. గ్రామీణ బ్రాడ్ బాండ్ లలో అధిక లాభాలు రావు కాబట్టి కార్పొరేట్లు ఆ వైపు చూడటం లేదు.  అయినా బీఎస్ఎన్ఎల్ ఇంత వరకూ 4జి సేవలను పూర్తి స్థాయిలో అందించలేకపోతోంది.  లాభాలు తెచ్చే సేవలో పోటీ పడే కార్పొరేట్లు దేశంలోేని పేదల కోస నెట్ వర్క్ లు నడపడం లేదు.  సేవల ఏర్పాట్లపై టీసీఎల్ కు 15వేల కోట్లు చెల్లిస్తున్న బీఎస్ఎన్ఎల్, టాటాలను పెంచి పోషిస్తోంది. 4జి సేవల కోసం అవసరమైన యంత్ర పరికరాలు, సాంకేతికను కొర్పొరేట్లు చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంటే, చైనాపై ఆంక్షలు విధించిన కేంద్రం ఇక్కడి పారిశ్రామిక వేత్తల నుండే టెక్నాలజీని కొనాల్సి వస్తోంది.

 దీంతో సేవలు అంతరాయానికి గురవుతున్నాయి. టెక్నాలజీ కొనుగోళ్ల పేరుతో దేశంలోని కార్పొరేట్లు ఆ డబ్బును కూడా దిగమింగుతున్నారు. దేశ సరిహద్దులు, ఈశాన్య రాష్ట్రాలు, సమస్యాత్మక ప్రాంతాలలో ఇప్పటికీ బీఎన్ఎన్ఎల్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన 89వేల కోట్ల ప్యాకేజీ అటూ, ఇటూగా తిరిగి దేశీయ కార్పొరేట్ల జేబుల్లోకి వెళ్లబోతోంది అన్నది అక్షర సత్యం.