కేశినేని నాని పొగపెట్టుకున్నారా? పెట్టారా?

తెలుగుదేశం పార్టీతో కేశినేని నాని తెగతెంపులు ఖాయమైనట్లే కనిపిస్తున్నాయి. అయితే నాని ఆరోపిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీయే పొమ్మనలేక పొగపెట్టిందా? లేక పార్టీలో తమ్ముడు చిన్ని ఎదుగుదలను ఓర్వలేక తానే పొగపెట్టుకున్నాడా అంటే.. వేళ్లన్నీ కేశినేని నానివైపే చూపుతున్నాయనడంలో సందేహం లేదు. 2019 ఎన్నికలలో వైసీపీ హవాలో సైతం తాను గెలిచానని చెప్పుకుంటున్న నాని.. విజయవాడలో తెలుగుదేశం బలంతోనే తాను విజయం సాధించగలిగానన్న విషయాన్ని కన్వీనియెంట్ గా విస్మరిస్తున్నారు.

ఇక ప్రస్తుత పరిస్థితుల్లో  తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ చెప్పుకుంటున్న నాని విజయం విషయంలో వ్యక్తం చేస్తున్న ధీమాపై మాత్రం పరిశీలకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే నాని తనకు మహానాడుకు ఆహ్వానం అందలేదనీ, అలాగే బెజవాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికీ పిలవలేదని అంటున్నారు. తెలుగుదేశం ఎంపీ అయిన కేశినేని నాని ఆహ్వానం అందలేదనడమేమిటన్న ప్రశ్నకు మాత్రం ఆయన దగ్గర సమాధానం ఉన్నట్లు కనిపించడం లేదు. బొట్టు పెట్టి పిలవడానికి ఆ రెండు కార్యక్రమాలూ ఎవరింట్లోనో జరిగిన పెళ్లిళ్లూ, పేరంటాలూ కావు. పార్టీ కార్యక్రమాలు. పార్టీ కార్యక్రమానికి పార్టీ ఎంపీకి ఆహ్వానం ఏమిటి? స్వచ్ఛందంగా వెళ్లి చురుకుగా ఆ కార్యక్రమంలో నిమగ్నం కావాలి. అలా కాకుండా తనకు పార్టీతో ఏం సంబంధం లేదన్నట్లు దూరంగా ఉండి ఆహ్వానం అందలేదంటూ రాగాలు తీయడం ద్వారా ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నారో చెప్పకనే చెప్పినట్లైంది.

గత కొంత కాలంగా అంటే తమ్ముడు చిన్ని పార్టీలో చురుకుగా పాల్గొనడం మొదలెట్టినప్పటి నుంచీ కేశినేని నాని తీరులో తేడా వచ్చింది.  తమ్ముడా, తానా తేల్చుకోవాల్సింది పార్టీయే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీని వెనుక వైసీపీ వత్తాసు ఉందన్న అనుమానాన్ని తెలుగుదేశం శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.   ఏది ఏమైనా నాని తీరు వల్ల ఆయన తనంత తానుగా తెలుగుదేశం పార్టీకి దూరం కావాలనే నిర్ణయించుకున్నారన్నది విస్పష్టంగా తేలిపోతోంది.

గుర్రాన్ని ఎవరైనా చెరువు వరకూ తీసుకు వెళ్లగలరు కానీ, నీళ్లు తాగించలేరుగా. నాని పరిస్థితి కూడా సరిగ్గా అలాగే తయారైంది. పార్టీలో ఉండటం, ఉండకపోవడం ఆయన ఇష్టం. పార్టీ మాత్రం పని చేసే వాళ్లకే ప్రాముఖ్యత ఇస్తుందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన మాట కేశినేని నానికి కూడా వర్తిస్తుంది.