సమ్మక్క, సారలమ్మ గద్దెల డిజైన్ మార్పును వ్యతిరేకిస్తున్న ఆదివాసీలు
posted on Jul 5, 2025 9:07AM
.webp)
మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల డిజైన్ మార్పును గిరిజనం వ్యతిరేకిస్తున్నారు. కొత్త డిజైన్ నమూనా ఆదివాసి సంస్కృతికి వ్యతిరేకంగా ఉందని మేడారం పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీల సంప్రదాయాలకు భిన్నంగా ఏకపక్షంగా సమ్మక్క సారలమ్మ గద్దెల డిజైన్ మార్పునకు నిర్ణయం తీసుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి గద్దల వద్ద ఆదివాసి గిరిజన సంప్రదాయం మాత్రమే ఉండాలని పట్టుబడుతున్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలైన సమ్మక్క సారలమ్మల గద్దెల స్వరూపం మారనుంది. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా శాశ్వత ప్రాతిపదికన గద్దెల డిజైన్‌ను మార్చనున్నారు. మేడారంలోని ఐటీడీఏ అతిథి భవనంలోని సమావేశ మందిరంలో జరిగిన మహాజాతర సమీక్ష సమావేశంలో దేవాదాయ ఆర్కిటెక్ట్ రాజశేఖర్ ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ పై గద్దెల డిజైన్‌ను ప్రదర్శించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతరకు కొత్త గద్దెలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే గద్దెల కొత్త డిజైన్ ను ఆదివాసీ సంఘాలు మేడారం పూజారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.