మహిళలకు ఉచిత బస్సు.. ఆ గుర్తింపు కార్డు చాలు : ఆర్టీసీ ఛైర్మన్
posted on Jul 30, 2025 3:44PM

ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రీ బస్సు పథకానికి శ్రీకారం చుడుతున్నారని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒక గుర్తింపు కార్డుతో మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. గుంటూరులోని ఎన్టీఆర్ బస్ స్టేషన్‌లో ‘మహిళలకు ఉచిత బస్సు పథకం సన్నద్ధతపై ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావుతో కలిసి కొనకళ్ల నారాయణ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
ఈ పథకంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, సన్నద్ధతపై డిపో మేనేజర్లకు ఆర్టీసీ ఛైర్మన్ వివరించారు. పంద్రాస్ట్ నుంచి అమల్లోకి వచ్చే ఫ్రీ బస్సు సర్వీసు ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌తోపాటు నగరాల్లోని మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. వచ్చే క్యాబినెట్ సమావేశం అనంతరం దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముందన్నారు.