చంద్రబాబుపై మరో రెండు కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం రేపుతోంది. హాస్పిటల్స్ బెడ్లు లేక, ఆక్సిజన్ అందక కొవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. తిరుపతి రుయాలో మరణ మృందగం మోగుతోంది. రుయాలో రెండు రోజుల్లో 48 మంది చనిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా భయంతో జనాలు వణికిపోతుండగా.. వారికి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రజల ప్రాణాలను గొలికొదిలేసి.. కక్ష రాజకీయాలపై ఫోకస్ చేసింది. ఏ టీడీపీ లీడర్ పై ఎలాంటి కేసు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు ఎలా అరెస్ట్ చేయాలనే అంశాలపైనే జగన్ రెడ్డి సర్కార్ ఫోకస్ చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ నేతల వరుస అరెస్టులు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.

టీడీపీ నేతలే కాదు ఆ పార్టీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును వదలడం లేదు వైసీపీ సర్కార్.  మూడు రోజుల క్రితమే ఆయనైప కర్నూల్ లో కేసు నమోదు చేయగా.. తాజాగా  మరో రెండు కేసులు నమోదయ్యాయి. కరోనాపై లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ  న్యాయవాదులు చేసిన ఫిర్యాదుపై గుంటూరు, నరసరావుపేట పోలీస్ స్టేషన్లలో చంద్రబాబు పై కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ప్రమాదకరమైన ఎన్440కె రకం వేరియంట్ వెలుగుచూసిందని, ఇది సాధారణ వైరస్ కంటే 10-15 రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితమైనవని, ప్రజల్లో మానసిక వేదన, అధైర్యం కల్పించాయని పేర్కొంటూ, జిల్లా కోర్టు న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో  కేసు నమోదైంది.

నరసరావుపేటలోనూ చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. ఇది కూడా కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఫిర్యాదుతోనే. చంద్రబాబు, ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు కలిసి కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పట్టణానికి చెందిన న్యాయవాది రాపోలు శ్రీనివాసరావు చేసిన ఫిర్యాదుపై నర్సారావుపేట పోలీసులు నేతలిద్దరిపై కేసులు నమోదు చేశారు. వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.