పరకామణి అవకతవకల కేసు.. సీఐడీకి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు

తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి సొమ్ము అవకతవకల కేసును సీఐడీకి అప్పగిస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడు రవికుమార్ పై అభియోగాలను కొట్టివేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును నిలిపివేసిన హైకోర్టు  ఈ కేసును విచారించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాల్సిందిగా సీఐడీని ఆదేశించింది.జగన్ హయాంలో  తిరుమల పరకామణిలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  పరకామణిలో చోరీచేస్తూ పట్టుబడిన నిందితుడి నుంచి కొన్ని ఆస్తులను టీటీడీకి విరాళంగా అందజేయించి మిగిలిన ఆస్తులను అప్పట్లో టీటీడీలో పనిచేసిన కొందరు ఉన్నతాధికారులు, పోలీసులు, రాజకీయ ప్రముఖులు వాటాలుగా పంచుకున్నారన్న ఆరోపణల నిగ్గు తేల్చడానికి రంగం సిద్ధమైంది.  

 కేసు వివరాల్లోకి వెడితే.. తిరుమల పరకామణిలో రవికుమార్‌ ఓ మఠం తరఫున పనిచేసేవారు. ఏళ్ల తరబడిగా గుమస్తాగా ఉంటూ విదేశీ కరెన్సీ లెక్కించేవారు. చాలా కాలంగా విదేశీ కరెన్సీని పక్కదోవ పట్టించారనే ఆరోపణలు ఆయనపై  ఉన్నాయి.   2023 ఏప్రిల్‌ 29న విదేశీ కరెన్సీని లెక్కిస్తూ అందులో కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులలో దాచుకోగా, అనుమానంతో సిబ్బంది తనిఖీలు చేయగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.  ఆయనపై అప్పటి ఏవీఎస్వో సతీష్‌కుమార్‌ ఫిర్యాదుతో రవికుమార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఆరోజు రవికుమార్ వద్ద లభ్యమైనవి 900 డాలర్లు వాటి విలువ అప్పట్లో అప్పట్లో  72 వేల రూపాయలుగా తేల్చారు. అంతకు ముందు చాలా కాలం నుంచీ కూడా రవికుమార్ పరకామణిలో  కోట్ల రూపాయలు కాజేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే రెడ్ హ్యాండెడ్ గా రవికుమార్ దొరికిపోయిన తరువాత  కొందరు వైసీపీయులు, అప్పటి టీటీడీలో పని చేస్తున్న కొందరు అధికారులు, పోలీసు అధికారులు రంగ ప్రవేశం చేసి తమ్మిని బమ్మిని చేసి కేసు నీరుగారిపోయేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పరకామణిలో కాజేసి రవికుమార్ సంపాదించిన ఆస్తులలో కొన్నిటిని టీటీడీకి గిఫ్ట్ డీడ్ గా రాయించి, మిగిలిన వాటిని బినామీల పేరిట స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  ఆ కారణంగానే నిందితుడు రవికుమార్ ను అరెస్టు చేయకుండా ఆ కేసును లోక్ అదాలత్ లో పెట్టి రాజీ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాడు లోక్ అదాలత్ రవికుమార్ పై కేసు కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును నిలిపివేసి.. సీఐడీ విచారణకు ఆదేశించింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu