వల్లభనేని వంశీ వైసీపీలో ఉన్నారా?

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంకా వైసీపీలో ఉన్నారా? కాదు కాదు అసలు రాజకీయాలలో ఉన్నారా? అన్న అనుమానాలు ఆ పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమౌతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు వల్లభనేని వంశీ గన్నవరం సమీపంలోనే నివాసం ఉంటున్నారు. అయినా వైసీపీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ ఆయన ఇంటి ఛాయలకు కూడా వెళ్లడం లేదు. అలాగే వంశీ కూడా పార్టీ వారితో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. 

వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన వంశీ.. తెలుగుదేశం అగ్రనాయకులు, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. అయితే..  2024 లో ఓడిపోయిన తర్వాత వల్లభనేని వంశీ నోటికి తాళం వేసుకున్నారు. గన్నవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో వంశీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆ ఓటమి తరువాత వంశీ నియోజకవర్గంలో పెద్దగా కనిపించింది లేదు.  

ఆ తర్వాత  జైలు పాలయ్యారు. బెయిలుపై బయటకు వచ్చారు. అయినా రాజకీయాలలో కానీ, పార్టీ వ్యవహారాలలో కానీ కలుగజేసుకోవడం లేదు. పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో గన్నవరం నియోజకవర్గానికి వైసీపీ ఇన్ చార్జిగా ఆయనను తప్పించి మరొకరిని నియమించే అవకాశాలున్నాయని అంటున్నారు. తొలుత ఈ ఇన్ చార్జిగా వంశీ సతీమణి పంకజశ్రీ పేరు వినిపించినా, అందుకు పంకజశ్రీ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో.. మరొకరి కోసం గాలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.   మొత్తం మీద జగన్ చెప్పిన వైసీపీ అందగాడు వల్లభనేని వంశీ పార్టీకి దూరమయ్యారనీ, త్వరలోనే రాజీనామా ప్రకటన వెలువడినా ఆశ్చర్యంలేదనీ పరిశీలకులు అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu