డబ్బులు వాళ్లకి.. జబ్బులు జనాలకి

ప్రజలను పీల్చి పిప్పి చేసిన జే బ్రాండ్  లిక్కర్
పేదల జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఊరుపేరు లేని బ్రాండ్లు
ధనదాహంతో విషం అమ్మి సొమ్ము చేసుకున్ననాటి పాలకులు 
బయట పడుతున్న నిజాలు- ఉలికి పడుతున్న నేతలు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ4 గా నమోదు అయిన రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇటీవల సీఐడీ అధికారులు విచారించారు. తర్వలో మరోసారి విచారణకు హాజరు అవ్వాలని నోటీసులు ఇచ్చారు. మాజీ డిప్యూటీ సిఎం నారాయణ స్వామిని కూడా విచారించే అవకాశం ఉందంటున్నారు. అయన జగన్ ప్రభుత్వలో ఐదు సంవత్సరాల పాటు ఎక్సెజ్ శాఖను నిర్వహించారు. వారితో పాటు గాలివీడు కు చెందిన ఎక్సెజ్ ఉన్నతాధికారి అయిన సత్య ప్రసాద్ కూడా  లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో అల్టిమేట్ టార్గెట్ జగనే అవుతారన్న భయం వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది.

వైసీపీ పాలనలో నాసిరకం మద్యం విక్రయాలు పేదల జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. మద్యం కారణంగా లివర్, కిడ్నీ, మెదడు సంబంధిత న్యూరో వ్యాధులతో ఆసుపత్రుల్లో చికిత్స పొందినవారి సంఖ్య ఆ అయిదేళ్లలో ఏటా పెరుగుతూ వచ్చింది. ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్టు ద్వారా ఆసుపత్రుల్లో ఇన్‌పేషంట్లుగా చేరి ఉచిత చికిత్స పొందినవారి గణాంకాలు.. నాసిరకం మద్యం తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. వీరు కాకుండా సొంత ఖర్చులతో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన, పొందుతున్నవారు భారీ సంఖ్యలో ఉన్నారు.

రాష్ట్రంలోని పది రకాల వ్యాధుల అధ్యయన వివరాలను ఇటీవల వెల్లడించిన సీఎం చంద్రబాబు.. అందుకు దారి తీసిన పరిస్థితులను పరిశీలించి నియంత్రణ చర్యలను చేపట్టాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. మద్యం ప్రభావిత వ్యాధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ నేపథ్యంలో ఐదేళ్లలో మద్యం ప్రభావిత జబ్బులతో చికిత్స పొందినవారి వివరాలను ఎన్టీఆర్‌ వైద్యసేవా ట్రస్టు సేకరించింది. వైసీపీ పాలనలో నాసిరకం మద్యం తాగినవారి ఆరోగ్యాలు బాగా దెబ్బతిన్నట్లు గుర్తించింది. 

28 రోగాలకు మద్యం కారణమవుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఆక్స్‌ఫర్డ్‌ పాపులేషన్‌ హెల్త్, పెకింగ్‌ విశ్వవిద్యాలయం కూడా సుదీర్ఘకాలంపాటు ఐదు లక్షల మంది మద్యం బాధితుల ఆరోగ్య పరిస్థితులపై అధ్యయనం చేసింది. 61 రోగాలకు ప్రత్యక్షంగా, 206 జబ్బులకు పరోక్షంగా మద్యమే కారణమవుతోందని ఈ సంస్థలు వెల్లడించాయి. నాసిరకం మద్యం ప్రభావం మరింత ఎక్కువే ఉంటుంది.  వైసీపీ పాలనలో ఓ మాదిరి తాగే అలవాటున్న వారికీ నాలుగేళ్లలోనే కాలేయం చెడిపోయిన సంఘటనలు నమోదయ్యాయి. బాధితుల్లో అత్యధికులు బడుగు, బలహీనవర్గాలవారే. నెలల వ్యవధిలోనే వారి ఆరోగ్యం క్షీణించింది. వీరి వయసు 25 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉందని లెక్కలు చెప్పుతున్నాయి. కరోనా ప్రభావం వల్ల 2020-21లో మద్యం దుష్పలితాల ప్రభావం కాస్త తగ్గింది. మద్యం విక్రయాలు తగ్గడమే దీనికి కారణమన్న విశ్లేషణలున్నాయి.
 వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన లిక్కర్‌ స్కాం లాంటిది దేశంలో మరెక్కడా జరగలేదంటున్నారు. వైసీపీ నాయకులు తయారు చేయించిన నాసిరకం కల్తీ మద్యంతో లక్షలాదిమంది అనారోగ్యం పాలయ్యారు. వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆయా జిల్లాల్లో విక్రయించిన బ్రాండ్లను బట్టి వాటి ప్రభావం బాధితులపై పడింది. కర్నూలు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలు లివర్ సంబంధిత వ్యాధిగ్రస్తుల్లో తొలి 5 స్థానాల్లో నిలిచాయి. 

నెల్లూరు, కర్నూలు, తిరుపతి, నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాల్లో మెదడు సంబంధిత న్యూరో కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా కిడ్నీ కేసులు నమోదయ్యాయి. 2014-19 మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్‌ వైద్య సేవా ట్రస్టు ద్వారా ఆసుపత్రుల్లో చికిత్స పొందిన కిడ్నీ బాధితుల సంఖ్య 49 వేలుగా ఉంటే 2019-24 మధ్య కాలంలో వారి సంఖ్య 91 వేలకు చేరడం గమనార్హం. ఈ గణాంకాలు చూసి విస్తుపోయిన సీఎం  చంద్రబాబు బాధితులను ఆదుకోవడానికి వైద్య విభాగాలను అలర్ట్ చేయాల్సి వస్తోందిప్పుడు.