రేవంత్ పేరెత్తకుండానే కేసీఆర్ ప్రసంగం.. వ్యూహాత్మకమేనా?
posted on Apr 28, 2025 11:39AM
.webp)
తెలంగాణ అసెంబ్లీకి 2023లో జరిగిన ఎన్నికలలో పరాజయం పాలై అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ చరిత్రలో అత్యంత కీలకమైన రాజకీయ సభ ఏదైనా ఉందంటే... అది ఆదివారం వరంగల్ వేదికగా జరిగిన రజతోత్సవ సభ మాత్రమే. బీఆర్ఎస్ ఆవిర్భవించి పాతికేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆ పార్టీ జరుపుకున్న రజతోత్సవ సభకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. పార్టీ పరాజయం తరువాత కేసీఆర్ పాల్గొన్న భారీ బహిరంగ సభ ఇదే కావడం గమనార్హం. అంతకు ముందు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రచార సభలలో పాల్గొన్నా.. వాటికి ఇంతటి హైపూ లేదూ, జనమూ పట్టించుకోలేదు.
కానీ బీఆర్ఎస్ (టీఅర్ఎస్) అవిర్భవించి పాతికేళ్లు పూర్తి అయిన సందర్భంగా జరిగిన ఈ బహిరంగ సభలో కేసీఆర్ దాదాపు గంట సేపు ప్రసంగించారు. ఈ ప్రసంగం మొత్తం వ్యూహాత్మకంగా సాగింది. అన్నిటికీ మించి ఇటీవలి కాలంలో కేసీఆర్ ఇంత సుదీర్ఘ ప్రసంగం చేసిన సందర్భం లేదు. సార్వత్రిక ఎన్నికల ప్రచార సభలలో ఒకటి రెండు సార్లు ప్రసంగించినా ఆ ప్రసంగాలన్నీ చప్పగా సాగాయి. క్లుప్తంగా ప్రసంగాన్ని ముగించేశారు.
అన్నిటి కంటే చెప్పుకోవలసిన విషయమేంటంటే గంట సేపు ప్రసంగంలో కేసీఆర్ ఒక్కటంటే ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావంచలేదు. అయితే ప్రసంగం మొత్తం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన విధ్వంసకరంగా ఉందని విమర్శలు గుప్పించారు. రేవంత్ సర్కార్ టార్గెట్ గా కేసీఆర్ ప్రసంగం సాగినా రేవంత్ పేరు మాత్రం ఆయన నోటి వెంట రాలేదు. గతంలో కూడా రేవంత్ పేరు ప్రస్తావించడానికి కానీ, ఆయనను అసెంబ్లీలో చూడడానికి కానీ కేసీఆర్ ఇష్టపడలేదన్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసిన అవసరం ఉంది.
ఇప్పుడు కూడా ఆయన తన నోటి వెంట రేవంత్ పేరు ఉచ్ఛరించలేదు. అసలు కేసీఆర్ అసెంబ్లీకి గైర్హాజరు కావడానికి కూడా రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటమే కారణమని కూడా పార్టీ వర్గాలు చెబుతుంటాయి. రేవంత్ నుఅందుకే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొట్టారని అంటారు. ఇప్పుడు ఆయన తాజా ప్రసంగంలో కూడా వ్యూహాత్మకంగా రేవంత్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. ఆయన పాలనను తూర్పారపట్టారు.