అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానం.. జగన్ కింకర్తవ్యం?

అమరావతి పనుల పున: ప్రారంభానికి మే2న ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు షెడ్యూల్ కూడా ఖరారైంది. మోడీ పర్యటనను విజయవంతం చేయడానికి ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సారి అమరావతి పనులకు ఎలాంటి విఘాతం కలగకుండా, అత్యంత వేగంగా పూర్తి చేయడానికి కంకణబద్ధులై ఉన్నారు. ఇప్పటికే రాజధాని అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు  41 వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లు   ఖరార య్యాయి.  అలాగే  రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.4,700 కోట్ల అంచనా వ్యయంతో ఐదు టవర్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్టేట్ సెక్రటేరియట్‌ను నిర్మాణానికి టెండర్లు పిలిచింది. అమరావతి పూర్తికి మూడు సంవత్సరాల గడువును నిర్ణయించి.. ఆ దిశగా వేగంగా ముందుకు కదులుతున్నారు.  

ఇక అమరావతి పున: ప్రారంభ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  2015లో కూడా అమరావతి ప్రారంభోత్సవానికి జగన్‌ను  ఆహ్వానించారు, కానీ అప్పుడు ఆయన ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.  ఆ తరువాత 2019లో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ మూడు రాజధానులంటూ అమరావతిని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు.  అయితే 2024 ఎన్నికలలో  జనం జగన్ ను అధికారం నుంచి దించేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికే ఓటుశారు.  

ఇప్పుడు చంద్రబాబు నిర్దిష్ట కాలవ్యవధిలో అమరావతిని పూర్తి చేయాలన్న సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. అదలా ఉంచితే.. ఇప్పుడు ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమానికి జగన్ హాజరౌతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడు సరైన కారణం చూపకుండా జగన్ ఈ కార్యక్రమానికి గైర్హాజరు అవ్వడం అంటే ప్రజాభిష్ఠాన్ని ఖాతరు చేయకపోవడమే అవుతుంది. జగన్ మూడు రాజధానుల విధానాన్ని జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించారన్నది గత ఏడాది జరిగిన ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి. ఇక అంటే జనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని అని తేల్చేశారు. ఈ దశలో అందుకు పడుతున్న కీలక ముందడుగు అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమం. ఆ కార్యక్రమానికి జగన్ తన అహంకారంతో గైర్హాజరైతే.. జనానికి మరింత దూరమౌతారు. ఆయన ఎటూ రారని ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పంపకుంటే.. అదే వేరే విషయం కానీ, ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందినా కూడా గైర్హాజరు కావడాన్ని జగన్ ఎలా సమర్థించు కుంటా రన్నది ఆయనకే తెలియాలి. కానీ, సమస్య ఏమిటంటే జగన్  జనం ఇవ్వని ప్రతిపక్ష హోదా డిమాండ్ తో అసెంబ్లీనే బాయ్ కాట్ చేశారు. అలాగే ఇప్పుడు అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమానికీ డుమ్మా కొట్టే అవకాశాలే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.