అనకాపల్లి బీసీ గురుకుల పాఠశాల వార్డెన్ సస్పెండ్
posted on Jul 1, 2025 8:32PM

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత భోజనంలో బొద్దింక వచ్చిన ఘటనపై అనకాపల్లి బీసీ గర్ల్స్ హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి ప్రాంతంలో ఉన్న బీసీ బాలికల గురుకుల వసతి గృహాన్ని సందర్శించేందుకు వచ్చిన హోంమంత్రి. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం లంఛ్ టైమ్ కావడంతో ఆమె అక్కడే బాలికలతో కలిసి భోజనం చేయాలని నిర్ణయించుకున్నారు. హాస్టల్ సిబ్బంది ఆమెకు కూడా భోజనం వడ్డించారు.
విద్యార్థులతో కలిసి మధ్యలో కూర్చుని భోజనం మొదలుపెట్టిన సమయంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆమె ప్లేట్‌లో బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటనతో అనిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హోంమంత్రి అయిన నా ప్లేట్‌లోనే బొద్దింకలు కనిపిస్తే, అక్కడే నివసించే బాలికలకు ఎలా క్వాలీటీ ఫుడ్ అందిస్తారని నిలదీశారు. అలాగే హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.