కోదండరాముడికి క్లారిటీ వచ్చింది
posted on May 16, 2015 10:45PM

ఎవరికైనా, ఏ విషయంలో అయినా క్లారిటీ రావడం ముఖ్యం. అలా క్లారిటీ రాకపోతే ముందుకు అడుగు వేయడం కష్టం. పాపం మొన్నటి వరకూ ప్రొఫెసర్ కోదండరామ్‌కి ఈ క్లారిటీ లేకపోవడం వల్లే చాలా టైమ్ వేస్టయింది. ఈమధ్యకాలంలో ఆయన క్లారిటీని సంపాదించుకోవడంతో మరో ముందడుగు వేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో టీఆర్ఎస్‌తో కలసి ముందడుగు వేసిన కోదండరామ్‌ని ఇతర పార్టీల వారు కేసీఆర్ జేబులో మనిషిగా విమర్శించారు. ఆ విమర్శలకు ఎంతమాత్రం వెరవకుండా టీఆర్ఎస్ మైలేజీ పెరగడానికి ఆయన తనవంతు సహకారాన్ని అందించారు. మిగతా పార్టీలు తెలంగాణ కోసం ఎంత జుట్టు పీక్కున్నా, తెలంగాణ కోసం కృషి చేసిన ఏకైక పార్టీగా టీఆర్ఎస్‌ని ప్రజల దృష్టిలో నిలపడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆయనకు రావల్సిన గుర్తింపు రాలేదన్నది మాత్రం సత్యం. ప్రభుత్వం నుంచి ఎప్పటికైనా గుర్తింపు వస్తుందేమోనని ఆశగా ఎదురుచూసిన ఆయన ఇక లాభం లేదని అర్థం చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి తనకెలాంటి గౌరవం లభించదని క్లారిటీ వచ్చిన ఆయన తాజాగా మరో పోరాటం ప్రారంభించారు.
పొలిటికల్ జేఏసీ అనేది ఇప్పుడు ముగిసిపోయిన చరిత్ర కాబట్టి ఇప్పుడు ఆయన తెలంగాణలో వున్న అనేక శక్తుల సమీకరణంగా మారిన తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టఫ్) నీడన చేరారు. ఈ ‘టఫ్’లో వున్నవాళ్ళందరూ కేసీఆర్ దృష్టిలో టఫ్ వ్యక్తులే. కేసీఆర్ అంటే విరుచుకుపడే వ్యక్తులే. ఇలాంటి వ్యక్తులందరూ వున్న ‘టఫ్’ నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కోదండరామ్ ప్రత్యేక శ్రద్ధతో పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమాల్లో ‘టఫ్’ ప్రముఖులు కేసీఆర్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ, రాళ్ళు వేస్తూ వుంటే కోదండరామ్ కూడా తనవంతుగా చిన్న చిన్న గులకరాళ్ళు విసరడం ప్రారంభించారు. భవిష్యత్తులో ఆ చిన్న గులకరాళ్ళు పెద్దపెద్ద బండరాళ్ళుగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ‘టఫ్’లో వున్నవాళ్ళందరూ తెలంగాణ వచ్చినా ప్రయోజనం ఏమీ చేకూరలేదని, కేసీఆర్ నిరంకుశ పాలన వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వారితో చేతులు కలపడం అంటే కేసీఆర్ని కోదండరామ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టే భావించాలి. పోనీలెండి, పదవి దక్కకపోయినా పోరాటం కంటిన్యూ అవుతోంది. కంగ్రాట్స్ ప్రొఫెసర్ కోదండరామ్.