ఏపీ రాజధాని భూ సమీకరణపై విధాన ప్రకటన
posted on Dec 8, 2014 3:18PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ సమీకరణ ప్యాకేజీ కోసం చాలా కసరత్తు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం నాడు ఆయన ఏపీ సచివాలయంలో ఏపీ రాజధాని భూ సమీకరణపై విధాన ప్రకటన చేశారు. భూ సమీకరణ కోసం పలు రాష్ట్రాలు అనుసరించిన విధానాన్ని పరిశీలించి ఒక విధానాన్ని రూపొందించామని, సైబరాబాద్ నిర్మాణంలోనూ ఇదే తరహాలో భూ సమీకరణ చేశామని చంద్రబాబు తెలిపారు సైబరాబాద్‌కి భూములిచ్చిన రైతులు ఇప్పుడు చాలా సంతోషంగా వున్నారని, ఆ సమయంలో తనపై నమ్మకం ఉంచి చాలామంది రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. రాజధాని నిర్మాణానికి అడ్డుపుల్ల వేయడానికి చాలా పార్టీలు ప్రయత్నించాయని, అయినప్పటికీ తనను నమ్మిన రైతులకు లాభం చేకూరేలా, రైతులు, రైతు కూలీలు అందరికీ న్యాయం జరిగేలా భూసమీకరణ విధానాన్ని రూపొందించామని ఆయన వివరించారు. సీఎం చంద్రబాబు చేసిన విధాన ప్రకటనలో కొన్ని ముఖ్య అంశాలు...
* మెట్ట, జరీబు భూములకు వేరువేరుగా నష్టపరిహారం.
* మెట్ట రైతులకు ఎకరాకు నివాస యోగ్య ప్రాంతంలో వెయ్యి గజాలు, వాణిజ్య ప్రాంతంలో 200 గజాలు.
* జరీబు భూములకు నివాస యోగ్యం వెయ్యి గజాలు, వాణిజ్య భూమి 300 గజాలు.
* అసైన్డ్ భూములకు నివాస యోగ్యం 800 గజాలు, వాణిజ్య భూమి 200 గజాలు.
* ఏటా మెట్టలో ఎకరాకు 30 వేల రూపాయలు, జరీబుకు 50 వేల రూపాయల పరిహారం.
* భూ సమీకరణ ప్రాంతంలోని రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ.
* ఎక్కడ భూమి తీసుకుంటే అదే జోన్‌లో భూమి కేటాయింపు. మెట్ట ప్రాంతంలో ఉండే రైతుకు మెట్టలో, జరీబు రైతుకు అదే భూమి ఇస్తాం.
* మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసి భూమి అప్పగిస్తాం.
* 12 వేల కౌలు రైతు కుటుంబాలున్నాయి. వారందరికీ అండ.
* రాజధాని ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆనందంగా వుండేలా ప్యాకేజీ.
* ఇళ్లు లేనివారు, రహదారుల విస్తరణలో ఇళ్ళు కోల్పోయే వారికి ఇళ్లు కట్టించి ఇస్తాం.
* గ్రామకంఠంలో ఇళ్ళస్థలాల క్రమబద్ధీకరణ చేసి పట్టాలు ఇస్తాం.
* భూ సమీకరణ ప్రాంతంలో అందరికీ ఉచిత విద్య, వైద్య సదుపాయం.
* ప్రస్తుతం భూముల్లో ఉన్న పంటలు రైతులకే చెందుతాయి.
* భూముల రిజిస్ట్రేషన్లు ఆపడం లేదు.
* నిమ్మ, సపోటా, జామ తోటల రైతులకు ఎకరాకు 50 వేల రూపాయల అదనపు సాయం.
* దేవాదాయశాఖ భూములు వుంటే దేవాలయాలకే భూమి ఇస్తాం. దేవాలయాలకు అన్యాయం జరగకుండా రైతుల తరహాలోనే పరిహారం.
* శ్మశానాలకు, ప్రార్థనా స్థలాలకు ప్రాధాన్యం.
* డబ్బు ఉన్న రైతులకు పారిశ్రామికవేత్తలుగా శిక్షణ ఇస్తాం.
* మంగళవారం నుంచి భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం.
* ఆనందకరమైన వాతావరణంలో రాజధాని నిర్మాణం జరగాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష.
* భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకారపత్రం ఇవ్వాలి.
* రాజధాని ప్రాంతం మూడు భాగాలుగా వుంటాయి.
* ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యాసార్థం 75 కిలోమీటర్లు.
* మిడిల్ రింగ్ రోడ్డు వ్యాసార్థం 125 కిలో మీటర్లు.
* ఔటర్ రింగ్ రోడ్డు వ్యాసార్థం 200 కిలోమీటర్లు.
* గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో భూముల సేకరణ.