శ్మశానంలో మంత్రి గారి నిద్ర...
posted on Dec 8, 2014 2:15PM

కర్నాటకలోని ఓ మంత్రి గారు చక్కగా శ్మశానంలో నిద్రపోయారు. ఏసీ గదిలో నిద్రపోవాల్సిన ఆయన శ్మశానంలో ఎందుకు నిద్రపోవాల్సి వచ్చింది? కర్నాటక ఎక్సయిజ్ శాఖ మంత్రి సతీష్ జర్కిహోలికి మూఢ నమ్మకాలంటే అస్సలు నమ్మకం లేదు. అలా మూఢ నమ్మకాలని పాటించేవారికి క్లాస్ పీకుతూ వుంటారు కూడా. ఈ నేపథ్యంలో ఆయన మూఢ నమ్మకాల విషయంలో ప్రజలకు అవగహన కల్పించడానికి ఆయన తన మద్దతుదారులతో కలసి ఓ రాత్రంతా కలసి శ్మశానంలో గడిపారు. శ్మశానంలోనే విందుభోజనం చేశారు. ఆ తర్వాత ఎంచక్కా ఒక సమాధిమీదే చాప, దుప్పటి వేసుకుని నిద్రపోయారు. శ్మశానాల్లో దయ్యాలు సంచరిస్తాయన్న మూఢ నమ్మకాలు ప్రజల్లో వున్నాయని, వాటిని దూరం చేయడానికే తాను శ్మశానంలో గడిపానని సదరు మంత్రి తెలిపారు. తాను పదవిలో వున్నా, లేకపోయినా మూఢ నమ్మకాలను అరికట్టడానికి నిరంతరం కృషి చేస్తూనే వుంటానని చెప్పారు.