ఇంటికి చేరిన ఆనందయ్య.. మందు పంపిణీపై మండే క్లారిటీ..
posted on May 28, 2021 10:21PM
ఆనందయ్య ఎక్కడ? ఆనందయ్యతో రహస్యంగా మందు తయారు చేయిస్తున్నారా? ఆ మందును ప్రముఖులకు సరఫరా చేస్తున్నారా? ఆనందయ్య మందు ఫార్ములాను కొట్టేసే ప్రయత్నం జరుగుతోందా? ఆనందయ్యపై పెద్దల ఒత్తిడి ఉందా? ఇలా అనేక ప్రశ్నలు, అంతకుమించి అనుమానాల మధ్య ఆనందయ్య ఇంటికి చేరాడు. వారం రోజుల అజ్ఞాతం తర్వాత ఆయన నింటికి చేరడం ఉత్కంఠ రేపుతోంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 21 నుంచి కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది. మందు పంపిణీ ఆగడంతో పాటు ఆయన సైతం అడ్రస్ లేకుండా పోయారు. రహస్య ప్రాంతాల్లో మందు తయారు చేస్తున్న వీడియోలు మాత్రం బయటకు వచ్చాయి కానీ, ఆయన మాత్రం ప్రజల ముందుకు రాలేదు. దీంతో, అనుమానాలు పెరిగిపోయాయి. ఉత్కంఠ రేపిన ఆనందయ్య అజ్ఞాతవాసానికి ముగింపు పలుకుతూ.. తాజాగా ఆయన కృష్ణపట్నం రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. వారం తర్వాత వచ్చిన ఆనందయ్యను కలిసేందుకు గ్రామస్థులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో, డీఎస్పీ ఆధ్వర్యంలో ఆనందయ్య నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి కృష్ణపట్నానికి రాకపోకలు నిషేధించారు.
మరోవైపు, ఆనందయ్య ఔషధంపై ఆయుష్ శాఖ అధ్యయనం కొనసాగుతోంది. అటు, ఆనందయ్య మందు వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ అంశాలపై ఆయుష్ శాఖ కమిషనర్ రాములు స్పందించారు. ఆనందయ్య ఔషధంపై సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరగనుందని వెల్లడించారు. ఔషధ పరీక్షలపై శనివారం సీసీఆర్ఏఎస్ చివరి నివేదిక కూడా రానుంది. అన్ని నివేదికలను అధ్యయన కమిటీ మరోసారి పరిశీలిస్తుందని రాములు తెలిపారు. చివరి రిపోర్డ్‌తో పాటు హైకోర్టు తీర్పు కూడా వచ్చాక.. సోమవారం ఔషధ పంపిణీపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు వచ్చిన నివేదికలు సానుకూలంగానే వచ్చాయని అన్నారు. ఆనందయ్య మందు తీసుకున్న చాలామందిని ఫోన్ ద్వారా సంప్రదించామని, వారి సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. ఈ ఔషధంపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించాల్సి ఉందని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. పంపిణీకి ముందు, ఔషధానికి ఆయుర్వేద విభాగం గుర్తింపు కోసం ఆనందయ్య దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆయుష్ శాఖ కమిషనర్ రాములు చెప్పారు.