2024లో తెలంగాణ‌లో బీజేపీ ప్ర‌భుత్వ‌మే.. ఈట‌ల‌కు అమిత్‌షా స‌పోర్ట్‌..

తెలంగాణలో 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటు అవుతుంద‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ధీమా వ్య‌క్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామ‌ని ప్ర‌క‌టించారు. నిర్మల్‌లో బీజేపీ నిర్వ‌హించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న‌ అమిత్ షా కేడ‌ర్‌ను ఉత్సాహ ప‌రిచారు. తెలంగాణ‌ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని.. నిజాం రాక్షస పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిన రోజు అని గుర్తు చేశారు. తెలంగాణ విమోచన వీరుల బలిదానాలు కేసీఆర్ మరిచిపోయారా? అని నిల‌దీశారు. 

అధికారంలోకి రాకముందు సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీకి బీజేపీ బయపడదని, తాము ప్రభుత్వం ఏర్పాటు చేయగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. పటేల్‌ పరాక్రమం వల్లే హైదరాబాద్‌ విమోచనం సాధ్యమైందన్నారు.

తెలంగాణ ప్రజల్లో మార్పు మొదలైందని.. గత ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలిచాం.. వచ్చే ఎన్నికల్లో అన్ని ఎంపీ సీట్లు గెలుస్తామని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 119 సీట్లలో పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. 

నిర్మ‌ల్ స‌భ స‌క్సెస్‌తో బీజేపీలో ఫుల్ జోష్ క‌నిపిస్తోంది. బండి సంజ‌య్‌, అమిత్ షా ప్ర‌సంగాలు కార్య‌క‌ర్త‌ల‌ను, అభిమానుల‌ను ఉత్సాహ ప‌రిచాయి. ఇక అమిత్ షా ప్రసంగం చివరలో హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ని ముందుకు పిలిచి చప్పట్లతో ప్రజల మద్దతు ఇవ్వాలని పిలుపునివ్వ‌డం.. కార్య‌క‌ర్త‌ల‌ చ‌ప్ప‌ట్ల‌తో స‌భాప్రాంగ‌ణం మారుమోగ‌డంతో.. బీజేపీలో మునుపెన్న‌డూ లేని ఉత్సాహం నెల‌కొంది.