సీఎంను తిట్ట‌లేదు.. చ‌ర్చి భాష‌లో 'ఓ మై స‌న్' అన్నానంతే.. అయ్య‌న్న క్లారిటీ

టీడీపీ అధినేత చంద్రబాబును చంపేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడి చేయడం దారుణమన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. త‌న వ్యాఖ్య‌ల‌పై జ‌రుగుతున్న ర‌చ్చ‌పై ఆయ‌న స్పందించారు. అస‌లేం జ‌రిగిందో విడ‌మ‌రిచి చెప్పారు.

మాజీ శాసనసభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు రెండో వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లగుంట గ్రామంలో గురువారం కోడెల విగ్రహావిష్కరణ జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు సీఎం, మంత్రులపై విమర్శలు చేశారు. అయితే, అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి ఉండ‌వ‌ల్లిలోని చంద్రబాబు నివాసం ముట్టడికి ప్ర‌యత్నించారు. ఈక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాళ్లు, జెండా క‌ర్ర‌ల‌తో టీడీపీ వ‌ర్గీయుల‌పై దాడికి తెగ‌బ‌డ్డారు. బుద్దా వెంక‌న్న‌, ఎమ్మెల్యే జోగి ర‌మేశ్‌ల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వాగ్వాదం జ‌రిగింది. 

ఉండ‌వ‌ల్లి ర‌చ్చ‌పై విశాఖ న‌ర్సీప‌ట్నంలో స్పందించారు అయ్య‌న్న‌పాత్రుడు. మంత్రులు చేసిన పనులు మాత్రమే సభలో చెప్పానన్నారు. ముఖ్యమంత్రిని తాను తిట్టలేదు. చర్చిలో ఫాదర్లు.. ఓ మై సన్‌ అంటారు.. అదే రీతిలో తెలుగులో అన్నానన్నారు. త‌న‌ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు కావాలనే రచ్చ చేస్తున్నారని మండిప‌డ్డారు. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రుల పనులను బట్టే సంబోధించానని కౌంట‌ర్ వేశారు. త‌న‌ మాటల్లో తిట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని ప్ర‌శ్నించారు అయ్యన్నపాత్రుడు.  
 
ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం పద్ధతి కాదు. దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత అయ్య‌న్న‌పాత్రుడు.