ఆర్థిక మాంద్యం ముప్పు ముంగిట అమెరికా!
posted on Sep 20, 2025 12:51PM

అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక మాంద్యం ముప్పు ముంగిట ఉందా? అగ్రదేశాధినేత ట్రంప్ అడ్డగోలు నిర్ణయాలు, విధానాల కారణంగా అగ్రరాజ్యం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనుందా అంటే అంతర్జాతీయంగా అత్యంత పేరు ప్రఖ్యాతలున్న ప్రముఖ ఫైనాన్షియల్ రేటింగ్ కంపెనీ మూడీస్ ఔననే అంటోంది. మూడీస్ చీఫ్ మార్క్ జాండీ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోనుందని హెచ్చరించారు. ఆ దేశంలో పెట్టుబడులు మందగిస్తున్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయన్నారు. అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలే ఇందుకు కారణమని ఆయన కుండబద్దలు కొట్టారు. కొన్ని దేశాలపై ట్రంప్ ప్రకటించిన టారిఫ్ వార్.. ఆ దేశాలపై కంటే, అమెరికాపైనే తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని మూడీస్ చీఫ్ మార్క్ జాండీ అభిప్రాయపడ్డారు. అలాగే ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానం కారణంగా దేశంలో ఉద్యోగ నియామకాలు తగ్గిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు.
ఇక ఫెడరల్ రిజర్వ్ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో వ్యాపార రంగం తీవ్రంగా ప్రభావితమౌతుందన్నారు. ఇప్పటికే పెట్టుబడులు మందగించి ఆర్థిక మాంద్యం సూచనలు కనిపిస్తు న్నాయని చెప్పారు. ఇప్పటికే నిర్మాణ రంగం, ఉత్పాదక రంగాలలో ఆ ఛాయలు కనిపిస్తున్నాయని ఉదహరించారు. ట్రంప్ టారిఫ్ వార్ ప్రభావం ఇంకా అమెరికాలో వినియోగదారులపై పూర్తి స్థాయిలో పడలేదనీ, త్వరలో అది కూడా జరుగుతుందని హెచ్చరించిన మార్క్ జాండీ.. ఆర్థిక మాంద్యంలో ఏ స్టాక్ కూడా సురక్షితం కాదని ఇన్వెస్టర్లను హెచ్చరించారు.