అనంతపురం, ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు

 

అనంతపురం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. రికార్డ్ అసిస్టెంట్, ఫస్ట్ క్లాస్ జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్‌లకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడకు చేరుకుని డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో కలిసి జిల్లా కోర్టు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కోర్టు భవనం అంతా పోలీసులు గాలింపు చర్యలు నిర్వహించారు. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టులో ఉన్న ప్రజలందరినీ బయటికి పంపి మరీ తనిఖీలను కొనసాగించారు. 

బాంబు బెదిరింపు మెయిల్‌పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మెయిల్ ఎవరు పంపారు?.. ఎక్కడి నుంచి వచ్చింది? అనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో అనంతపురం జిల్లా కోర్టు పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల తనిఖీలు పూర్తయ్యే వరకు కోర్టు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. బాంబు బెదిరింపునకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అటు ఏలూరు కోర్టు కాంప్లెక్స్‌కు కూడా బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 1:35 గంటలకు మెయిల్ రావడంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కోర్టు కాంప్లెక్స్‌కు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అలాగే బాంబు స్క్వాడ్‌కు సమాచారం అందించారు. కోర్టులో ఉన్న న్యాయాధికారులు, సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు అందరినీ పోలీసులు బయటకు పంపించేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu