అర్ధరాత్రి మాజీ ఐపీఎస్ ఇంటి ముందు యువకుడు హల్‌చల్

 

హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి వి.కే.సింగ్ నివాసం ముందు ఓ యువకుడు నానా రచ్చ రచ్చ చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. జూబ్లీహిల్స్‌లోని మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్ ఇంటి ముందు రోడ్డు నిర్మాణ పనుల నేపథ్యంలో అధికారులు భారీ కేట్లను ఏర్పాటు చేసి రహదారిని తాత్కాలికంగా మూసి వేశారు. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి సమయంలో తర్బీజ్ అనే యువకుడు అక్కడికి చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రోడ్డు బ్లాక్ కావడంతో ఆగ్రహా నికి గురైన యువకుడు తర్బీజ్, మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్ ఇంటి గేటును కొడుతూ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడాడు. అంతేకాకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ అక్కడ తీవ్ర గందరగోళం సృష్టించాడు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వికేసింగ్ గేటు ముందు హల్చల్ సృష్టిస్తున్న యువకుడిని భద్రతా సిబ్బంది గమనించారు. యువకుడు లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భద్రత సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. 

ఈ సమయంలో తర్బీజ్ మరింత దూకుడుగా ప్రవర్తిస్తూ భద్రతా సిబ్బంది వద్ద ఉన్న వెపన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ క్రమంలోనే యువకుడు తర్బీజ్, “500 మందితో నీ ఇంటిపైకి వస్తా” అంటూ మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్‌ను బెదిరించాడు. 

అర్ధరాత్రి సమయంలో హడావుడి సృష్టించిన యువకుడు అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్ పర్సనల్ సెక్రటరీ జస్వంత్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారం భించారు. యువకుడి ప్రవర్తన, నేపథ్యం, గతంలో ఏవైనా వివాదాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu