పవన్ అందుకే ఊగిసలాటలో ఉన్నాడా?
posted on Oct 19, 2015 5:15PM

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లాలనే ఉంది కానీ అంటూ దీర్ఘాలు తీస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... తీరుపై టీడీపీ నేతలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. పవన్ కు వచ్చే ఉద్దేశం లేదని, అందుకే షూటింగ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరుగుతున్న అతిముఖ్య ఘట్టమైన రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం కంటే షూటింగ్ ముఖ్యమైనదా అంటూ ప్రశ్నిస్తున్నారు, ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు సైతం ప్రశ్నించినప్పుడు పవన్ దాటవేత సమాధానం చెప్పారని, వెళ్లాలనే ఉంది... కానీ చూద్దామంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం వెనుక ఏదో మతలబు ఉందని చెప్పుకుంటున్నారు.
2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి మిత్రపక్షంగా వ్యవహరించి... ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అధికారంలోకి కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్.... రాజధాని భూసమీకరణ, భూసేకరణ విషయంలో ప్రభుత్వంతో తీవ్రంగా విభేదించారు, టీడీపీ ఎంపీలపై ఫైరవడమే కాకుండా... భూసేకరణ నోటిఫికేషన్ కు వ్యతరేకంగా రాజధాని గ్రామాల్లో పర్యటించారు, ఈ సందర్భంగా కొన్నిసార్లు టీడీపీ నేతలు, పవన్ కల్యాణ్ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. మంత్రులు సైతం పవన్ తీరుపై మండిపడ్డారు, రైతుల నుంచి భూములు తీసుకోకుండా రాజధాని ఎలా కట్టాలో పవన్ చెప్పాలంటూ మంత్రులు వెటకారమాడటంతో పవన్ కూడా తీవ్రంగా స్పందించారు, అయితే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించవద్దంటూ టీడీపీ నేతలను చంద్రబాబు మందలించడంతో ఆ వివాదం తాత్కాలికంగా తెరపడింది. ఈ నేపథ్యంలో టీడీపీకి పవన్ కు దూరం పెరిగిందనే వార్తలు కూడా వచ్చాయి.
అయితే భూసేకరణ నోటిఫికేషన్ ను తీవ్రంగా వ్యతిరేకించి, రాజధాని గ్రామాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్... అదే కారణంతో అమరావతి శంకుస్థాపనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడని, అందుకే వెళ్లాలనే ఉంది కానీ...షూటింగ్ సమయాన్ని బట్టి చూస్తానంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు.