ఎయిడ్స్ వ్యాప్తిలో మన రాష్ట్రానికి రెండో స్థానం
posted on Dec 1, 2012 4:34PM

దేశంలో ఎయిడ్స్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో మణిపూర్ దేశం మొత్తం మీద మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఎయిడ్స్ వ్యాప్తి 1.22 శాతంగా ఉంది. మన రాష్ట్రంలో ఈ వ్యాధి శాతం 0.75 గా ఉంది. తరవాతి స్థానాల్లో మిజోరాం (0.74), నాగాలాండ్ (0.73), కర్ణాటక (0.52), గోవా(0.43), మహారాష్ట్ర (0.42) లు ఉన్నాయి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి గులాం నబీ అజాద్ ఢిల్లీ లో ఎయిడ్స్ వ్యాప్తికి సంబంధించిన ఈ గణాంకాలను విడుదల చేశారు. 2011 గణాంకాల ప్రకారం దేశంలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 21 లక్షలు దాటింది. ఇందులో 8 లక్షల వరకూ మహిళలే ఉన్నారు. ఇందులో 15 ఏళ్ల లోపు పిల్లలు 7 శాతం వరకూ ఉన్నారు. గత సంవత్సరం ఈ వ్యాధి బారిన పడి దేశం లో 1.48 లక్షల మంది మరణించారు.
దేశం లో తొలి ఎయిడ్స్ కేసు నమోదు అయి ఇప్పటికి 30 సంవత్సరాలు అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకూ రెండున్నర కోట్ల మంది చనిపోయారు.