సైకిలు ఎదురొస్తే కారుకు భయమెందుకు?

 

 

 

ఇంతవరకు చంద్రబాబు ‘రెండుకళ్ళ’ సిద్దాంతంతో తెలంగాణా ప్రజలను మోసంచేస్తున్నాడని నిందించిన తెరాస, మొన్నజరిగిన అఖిలపక్షసమావేశంలో తెలుగుదేశంపార్టీ తెలంగాణాకి అనుకూల వైఖరిని ప్రకటించిన తరువాత, ఆపార్టీని మెచ్చుకోలేక, వ్యతిరేకించనూ లేక తెరాస ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. ఇంతవరకు తెలంగాణా పై పూర్తీ పేటెంట్ హక్కులు తనవేఅన్నట్లు వ్యహరిస్తున్న తెరాసకి, ఇప్పుడు తెలుగుదేశం ఈ విదంగా ప్రకటించడం మింగుడు పడకపోవడంలో పెద్ద వింతేమి లేదు.

 
బిజెపి, సి.పి.ఐ.వంటి పార్టీలు తెలంగాణాకి అనుకూలమని చెప్పినప్పటికీ కంగారు పాడనీ తెరాస ఇప్పుడు తెలుగుదేశంపార్టీ అనుకూలమని ప్రకటించేసరికి మాత్రం ఎందుకో కొంచెం అసౌకర్యంగా భావిస్తోంది. ఎందుకంటే, బిజెపి, సిపిఐ పార్టీలు రెండూ కూడా తనని ఎన్నికలలో సవాలు చేసే స్థాయిలో లేవు గనుకనే వాటిని చూసి భయపడని తెరాస, తెలంగాణాలో తెలుగుదేశంపార్టీకున్న పటిష్టమయిన క్యాడర్, ప్రజల మద్దతును చూసి అది ఇప్పుడు మరింత బలపడి, మున్ముందు ఎన్నికలనాటికి తనకి సవాలు విసిరే అవకాశం ఉండవచ్చనుననే ఆందోళనతోనే గులాబిదండు తెలుగుదేశం వెంటపడినట్లు కనిపిస్తోంది. ఇంతవరకూ, తెలుగుదేశంపార్టీ తెలంగాణా వ్యతిరేఖి అంటూ ఆ పార్టీపట్ల ప్రజలలో ఏహ్యత కల్పించగాలిగిన తెరాస, ఆ పార్టీ ఎన్నటికీ తెలంగాణా వ్యతిరేఖిగానే ఉంటేనే తనకు రాజకీయంగా మేలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. తద్వారా, తెలంగాణాలో తన మాటే వేదవాక్కుగా చెలామణి అవుతుంది, ఎన్నికలలో కూడా మరే పార్టీ తనకు పోటీ ఉండదు. గానీ, తెలుగుదేశంపార్టీ ఈవిదంగా తెలంగాణా అనుకూల వైఖరిని ప్రదర్శించి తనకు పోటీగా తయారవడం సహించలేని కారణంగానే తెరాస తెలుగుదేశంపార్టీపై విమర్శలు చేస్తోంది.

 

 తెలుగుదేశంపార్టీ షిండేకి ఇచ్చిన లేఖలో ఆ పార్టీ ప్రత్యేకతెలంగాణా కోరినట్లు తెరాసకు అర్దమయినపటికీ, రాజకీయంగా తెలుగుదేశంపార్టీని ఎదుర్కోక తప్పదు గాబట్టి, ఆ లేఖలో ఎక్కడా కూడా ‘తెలంగాణా అనేపదం’ లేకుండా వ్రాసి ప్రజలని మరోమారు మోసంచేస్తోందని ఒక అర్ధం లేని వితండవాదం మొదలు పెట్టింది. అఖిలపక్షసమావేశంలో పాల్గొన్న అన్నిపార్టీలకు అర్ధమయిన సంగతి తెరాసకు అర్ధం కాలేదంటే ఎవరు కూడా విశ్వసించరు.
 

తెలుగుదేశంపార్టీ అఖిలపక్ష సమావేశంలో తెలంగాణాకి అనుకూలంగా తన నిర్ణయం ప్రకటించిన తరువాత ప్రజా సంఘాల ఐ.క.స., ఉస్మానియా.ఐ.క.స.కు చందిన నేతలు గజ్జెల ఖంతం, రాజారామ్ యాదవ్ వంటి అనేక తెలంగాణా సంఘాలవారు  అభినందలు తెలుపుతూ చంద్రబాబును కలుస్తున్న ఈ సమయంలోనే, సీమంధ్ర వైపునుండి అతనికి మెల్లగా నిరసనలు పలకరిస్తున్నాయి. గుంటూరు జిల్లా, నరసరావుపేటకు చెందిన తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి మరోఅడుగు ముందుకువేస్తూ, త్వరలో తానూ చంద్రబాబును కలిసి పార్టీ నిర్ణయాన్నివ్యతిరేకిస్తున్నట్లు తెలియజేసి, సమైక్యంద్ర కోసం పార్టీని వీడాలనుకొంటున్నట్లు ప్రకటించేరు. మరో వైపు, సీమంద్రకు చెందిన కాంగ్రేసు నేతలయిన శైలజానాథ్ వంటివారు చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపడుతుండగా, అదే పార్టీకి చెందిన తెలంగాణా యం.పీ.లు ఆయనని అభినందిస్తూ తెలంగాణా ఏర్పడేవరకూ మాట తప్పవద్దని హెచ్చరించారు.

 
ఇంతమందికి అర్ధమయిన విషయం మరి తెరాసకు అర్ధం కాలేదంటే నమ్మశక్యంగా లేదు. తెలుగుదేశంపార్టీకి చెందిన తెలంగాణానేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఇదే విషయాన్నీ ప్రశ్నిస్తూ, “మా పార్టీ ప్రత్యేక తెలంగాణా కోరడం మీకు అయిష్టంగా ఉందా లేక మేము ఆవిధంగా ప్రకటించి మీ పార్టీకి సవాలుగా తయారయమని మీరు భయపడుతున్నారా చెప్పండి? అంటూ ప్రశ్నించారు.

 
ఇక చంద్రబాబు కూడా తాము 2008 సం.లో వ్రాసిన ఏలేఖని చూసి తమతో తెరాస పొత్తుకు అంగీకరించిందో ఇప్పుడు అదే లేఖకి విలువలేదని ఎందుకు అంటోంది అని సూటిగా ప్రశ్నించేరు.

అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ నిజంగానే సమైక్యాంద్రకి మొగ్గు చూపుతూ మాట్లాడి ఉంటే, తెలంగాణా ఉద్యామలకి పురిటిగడ్డ అని పేరుపడ్డ వరంగల్ లో చంద్రబాబుని కాలుమోపనీయ కుండా అక్కడి స్థానిక ప్రజలే అడ్డుపడేవారు. గానీ, చంద్రబాబు యాత్రకి ప్రజలు చాలచోట్ల సంఘీభావం కనబరుస్తున్నట్లు వస్తున్నవార్తలును చూస్తే, వారు కూడా తెలుగుదేశంపార్టీ ఈసారి తెలంగాణాకి అనుకూలనిర్ణయం ప్రకటించిందని విశ్వసించినట్లు అర్ధం అవుతోంది.

 
తెలంగాణాలో తనకి మరే ఇతర పార్టీ కూడా పోటీ ఉండకూడదని కోరుకొనే తెరాస, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, వై.యస్సార్.పార్టీలపై  ‘తెలంగాణా వ్యతిరేఖముద్ర’ లేదా ‘సీమంద్రా ముద్ర’ వేసి ఉన్న మూడు బలమయిన పార్టీలను తెలంగాణానుండి తరిమేయాలని ఆలోచిస్తున్నట్లు అర్ధమవుతోంది. కొద్ది రోజుల క్రితం కేసిర్ తననోటితోనే కాంగ్రెస్ పార్టీలో తెరాసను కలిపేయడానికికూడా సిద్ద పడ్డానని చెప్పిన సంగతి మరిచిపోయి, తెలంగాణా ఈయకపోతే కాంగ్రెసుకు బొంద పెడతానని, నామరూపాలు లేకుండా చేస్తామని బీరాలు పలకడం చాలా విచిత్రం. రేపు అదే కాంగ్రెస్ మళ్ళీ ఏదయినా చక్రం తిప్పినట్లయితే, మళ్ళీ ఆ పార్టీ చుట్టూనే తెరాస అదినేత కేసిర్ తిరిగినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. గానీ, అతను తమ పార్టీని అంతగా కించపరుస్తుంటే దానిని ఖండించకపోగా అతనితోనే రాసుకుపూసుకు తిరగడం కాంగ్రెస్ నేతల దౌర్భాగ్యం.  తప్పనిసరయితే, అతనికే ఊడిగం కూడా చేసేందుకు సిద్దం అని కాంగ్రేసు నేతలు కొందరు చెప్పడం మరింత సిగ్గుచేటయిన విషయం. ఈ విదంగా తెలంగాణా కాంగ్రెసు సభ్యులను మెల్లగా తన దారికితెచ్చుకొంటూ, మిగిలిన రెంటినీ అడ్డుతోలగించుకొనే ప్రయత్నంలోనే, తెరాస ఇప్పుడు వై.యస్సార్.పార్టీ, తెలుగుదేశంపార్టీలపై దాడి చేస్తోందని భావించవలసి ఉంటుంది. గులాభి దండు  వై.యస్సార్.పార్టీపై ఆగ్రహం చూపడానికి కొంత అర్ధం ఉన్నపటికీ,తెలంగాణాకి అనుకూలమని చెప్పిన తెలుగుదేశంపార్టీపై కూడా విమర్శల వర్షం కురిపిస్తోందంటే, తెలుగుదేశం పార్టీ నేతలు చెపుతున్నట్లు నిజంగానే తమపార్టీని చూసి తెరాస గుండెల్లో రైళ్ళు పరుగేడుతున్నాయని భావవించవలసి వస్తుంది.