ఆమెను హింసించింది ఆ మైనరే !

 

 

 

ఢిల్లీ లో గత నెల 16 వ తేదీన జరిగిన పారా మెడికల్ స్టూడెంట్ ఫై జరిగిన అత్యాచారంలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇందులో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నాడు.

 

అత్యాచారం అనంతరం ఆ అభాగ్యురాలిని బస్సులోనుండి తోసివేయాలనే నిర్ణయం తీసుకొనడంతో పాటు, ఆమెను బస్సులో చిత్ర హింసలకు గురి చేసిన ఆ బాలుడు మాత్రం ప్రస్తుతం కఠిన శిక్ష నుండి మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఉద్యమకారులతో పాటు, పోలీసులకు కూడా మింగుడు పడని ఈ విషయంలో ఏమీ చేయలేని పోలీసులు ఆ బాలుడి పేరును చార్జ్ షీట్ లో నుండి తొలగించారు. ఇప్పటి చట్టాల ప్రకారం బాల నిందితులు ఎంత నేరానికి పాల్పడినా మూడు సంవత్సరాలకు మించి జైలులో పెట్టడానికి వీలు లేదు.

 

అసలు బస్సులో వారందరినీ అత్యాచారానికి ఉసిగొల్పింది ఆ బాలుడేనని సమాచారం ! ఆ యువతిఫై ఆ బాలుడు రెండు సార్లు అత్యాచారం చేశాడు కూడా. ఆమె జననాంగాలలోకి రాం సింగ్ తో కలిసి రాడ్ దూర్చడం వంటి దారుణ పనులకు ఒడిగట్టిన ఆ బాలుడు ప్రస్తుతం మైనర్ అయిన కారణంగా అతి తక్కువ శిక్షతో బయట పడే అవకాశం ఉంది. మైనర్ అయినా కూడా ఆ బాలుడు చేసిన పనులు దారుణంగా ఉన్నాయని, అవసరమైతే ఈ విషయంలో చట్టాలను సవరించాలని ఆ యువతి సోదరుడు మీడియా తో అన్నారు.

 

ఈ కారణాలతో బాల నేరస్తుల చట్టాన్ని సవరించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.సాక్షాత్తు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తేజేంద్ర ఖన్నా కూడా ఇలా డిమాండ్ లు చేస్తున్న వారిలో ముందు వరసలో ఉన్నారు.