ఆ పదిమందికీ బీఆర్ఎస్ తలుపులు తెరిచే ఉన్నాయా?

బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగతున్న వేళ, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచిన, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన 10 మంది ఎమ్మెల్యేల పునరాగమనం గురించి ఆసక్తికర  చర్చ జరుగుతోంది.  నిజానికి నిన్న మొన్నటి వరకు పార్టీ కార్యనిర్వాహ అధ్యక్షుడు కేటీ రామరావు చాలా స్పష్టంగా ఆ పది మందిలో ఏ ఒక్కరినీ వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని ఖరాఖండిగా చెపుతూ వచ్చారు. అయితే.. తాజాగా కేటీఆర్ అది తన వ్యక్తిగత అభిప్రాయమనీ,  అలాంటి  అతి ముఖ్యమైన విషయంలో పార్టీ, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు.

 అంటే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని చెప్పకనే చెప్పినట్లు అయిందని అంటున్నారు. నిజానికి.. చాలా కాలంగా కేటీఆర్ పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ తలుపులు శాశ్వతంగా ముసుకు పోయాయనీ.. మళ్ళీ వస్తామని వేడుకున్నా, ప్రాధేయ పడినా  బీఆర్ఎస్ తలుపులు మళ్ళీ తెరుచుకోవని అడిగినా,  అడగక పోయిా అందరికీ చెపుతూ వచ్చారు. ఆ పది మందిని మళ్ళీ పార్టీలోకి రానిచ్చేది లేదని ఒకసారి కాదు..  ఒక భాషలో, ఒక ఇంటర్వ్యూలో కాదు ప్రతి ఇంటర్వ్యూలో అదే మాట చెపుతూ వచ్చారు. అలాగే ఆ పది నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని, చెప్పారు.  

అలాగే.. పార్టీ ఫిరాయించినఎమ్మెల్యేలు భయపడవలసిన అవసరం లేదని, ఉప ఎన్నికలు రావంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనను కేటీఆర్  ప్రతి ఇంటర్వ్యూలోనూ  తప్పు పట్టారు.  సుప్రీం కోర్టు విచారణలో ఉన్న అంశంపై  ముఖ్యమంత్రి సభలో మాట్లాడదాన్ని కూడా తప్పు పట్టారు.సుప్రీం కోర్టు కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టిందని అన్నారు. ఆ పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు తప్పవని కటీఆర్ చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తామని, ఒకటికి  పదిసార్లు చెప్పారు. అంతే కాదు, పార్టీ నాయకులు కార్యకర్తల సెంటిమెంట్స్ ను గౌరవించాలని అన్నారు. కొత్త నాయకత్వాన్ని పోటీకి సిద్దం చేస్తున్నామని చెప్పారు. మరోవంక,ఆ పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ.. కేటీఆర్ మరి కొందరు  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టు విచారణ పూర్తి చేసింది. తీర్పును వాయిదా వేసింది. ఈ నేపధ్యంలోనే కేటీఆర్  ఉప ఎన్నికలు తధ్యమని చెపుతూ వచ్చారు. 
అయితే, ఇప్పడు అదే కేటీఆర్  పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలో చేర్చుకోరాదనేది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అంటూ.. తుది నిర్ణయం తీసుకోవలసింది పార్టీనే అంటూ.. కొత్త పాట, కొత్త పల్లవి ఎత్తుకున్నారు. 

ఈ నేపధ్యంలోనే కేటీఆర్  మాటల్లో ఈ మార్పు ఎందుకొచ్చింది అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోందని అంటున్నారు. అది కూడా, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ముందు కేటీఆర్ టోన్ ఎందుకు మారింది? రజతోత్సవ సభ వేదికగా, ఎవరైనా స్వగృహ ప్రవేశం చేస్తారా? అందుకే కేటీఆర్, మాట మారిందా? అనే చర్చ జరుగుతోందని అంటున్నారు.అయినా,  పార్టీలు ఫిరాయించడం ఎలాగో, మాట మార్చడం కూడా రాజకీయాల్లో  మాములే..  అందుకే ఏనాడో కన్యాశుల్కం, గిరీశం ఒపీనియన్స్ మార్చుకోలేని వాడు పొలిటీషియన్ కాలేరని అన్నారని అంటున్నారు. సో... ఇతర విషయాలు ఎలా ఉన్నా... పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్ళీ  గులాబీ గూటికి రావాలనుకుంటే రావచ్చును.అన్ని తలుపులు అన్ని వైపులా తెరిచే ఉన్నాయి.. అంటున్నారు.