సానుభూతి వ్యూహాన్ని సానబెడుతున్న జగన్!

రాజకీయాల్లో బాగా రాటుదేలిన నేతలు రెండు వ్యూహాలు అమలు చేస్తుంటారు! ప్లాన్ A… ఇది ఏంటంటే… తమ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఎదురు దాడి చేయటం! ఇక ప్లాన్ B… దీంట్లో భాగంగా తమ మీద వచ్చిన ఆరోపణ గురించి అస్సలు మాట్లాడరు! కాకపోతే, మరో దారిలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న తామే బాధితులమని ప్రచారం చేసుకుంటారు. తమకు ఓటు వేసే ఆలోచనలో వున్నవార్ని మరింతగా ఒడిసి పట్టుకునేలా సానుభూతి సంపాదించుకుంటూ వుంటారు! ఇదంతా చెప్పుకోటానికి కారణం… జగన్!     జగన్ ఏనాటికైనా ఏపీ ముఖ్యమంత్రి అవ్వొచ్చు. కానీ, అదెప్పుడో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అందుక్కారణం ఆయన మీద వున్న తీవ్రమైన ఆర్దిక అభియోగాలే! ఏ క్షణాన జైలుకి వెళతారో తెలియని పరిస్థితి. మరోవైపు ఏ జిల్లాలో ఎన్ని వందల కిలో మీటర్ల దూరంలో పాదయాత్రలో వున్నా ఆయన ప్రతీ శుక్రవారం కోర్టుకు వచ్చి వెళుతుంటారు. ఇలాంటి సంకట స్థితి మరే రాజకీయ నేతకు ప్రస్తుతం లేదు. మరీ ముఖ్యంగా, ఒక రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత ప్రతీ వారం కోర్టుకు హాజరు కావటం కూడా దేశంలో ఎక్కడా లేదు. మరి ఇలాంటి జగన్ని ఓటర్లు ఎందుకు నమ్మాలి? దీని వల్లే ఆయనను అభిమానించే వాళ్లు ఎంతగా ఓట్లు వేసినా చంద్రబాబు సీఎం అయ్యారు గత ఎన్నికల్లో! అవినీతిని, అనుభవాన్ని రెండిట్నీ దృష్టిలో పెట్టుకునే ఓటర్లు జగన్ ను ప్రతిపక్షానికి పరిమితం చేశారు!     2014 పోతే పోయింది 2019 నాదే అనుకుంటున్న జగన్ వీలు చిక్కినప్పుడల్లా ప్లాన్ బీ అమలు చేస్తున్నారు. అంటే… సానుభూతి ఫార్ములా అన్నమాట! తండ్రి వైఎస్ మరణించాక నెలలు,సంవత్సరాల తరబడి ఓదార్పు యాత్ర చేసిన జగన్ ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. అంతలోనే ఈడీ ఆయనకు షాకిస్తూ భార్య భారతీ పేరును కూడా ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది! అదే విషయం మీడియాలో వచ్చింది. వెంటనే జగన్ అసలు పక్కన పెట్టి కొసరు మీద దృష్టి పెట్టారు. భారతి పేరు కూడా ఛార్జ్ షిట్ లో ఎందుకు చేరింది? ఆమెకు జగన్ అవినీతితో సంబంధం వుందా? అసలు తన భార్య పేరు ఛార్జ్ షిట్లో వుందనే వార్త నిజం కాదా? మీడియా చెప్పిందంతా అబద్ధమేనా? … ఇలాంటి విషయాలేవీ వైసీపీ అధినేత మాట్లాడలేదు. తెలివిగా ‘’నా భార్యని కూడా టార్గెట్ చేశారు’’ అంటూ సింపతీ యాంగిల్ తీసుకొచ్చారు!     కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల్లు చేసుకున్నాడు అంటూ స్వయంగా జగనే వ్యక్తిగత విమర్శలు చేశారు! ఇప్పుడు మాత్రం మీడియా తన భార్యని అనవసరంగా వివాదంలోకి లాగుతోందని బాధపడిపోయారు! వ్యక్తిగత దాడి తాము చేస్తే ఒక న్యాయం... ఎదుటి వారు చేస్తే మరో తర్కం! ఇదీ వరస! అసలింతకీ మీడియా చెప్పింది కరెక్టా? తప్పా? జగన్ ఎదుర్కొంటోన్న అవినీతి ఆరోపణల్లో భారతికి ప్రమేయం వుందని ఈడీ భావిస్తోందా? లేదా? వీటికి జగన్ వద్ద సమాధానం లేదు! ఆయన చెప్పుకొచ్చే ఏకైక పాయింట్… ‘’ నా భార్య పేరు ఛార్జిషీట్లో వుందని మీడియాకు ఎలా తెలిసింది? ‘’ ఇదొక్కటే!     జగన్ తన భార్య గురించి వస్తోన్న వార్తల్ని ఖండించకుండా కేవలం మీడియాను అనుమానించటం, అలాగే, తన కుటుంబాన్ని రోడ్డుకీడుస్తున్నారని వాపోవటం చూస్తుంటే… సానుభూతి కోణం తప్ప మరేదీ కనిపించటం లేదు. అయితే, జగన్ అమలు చేసిన ప్లాన్ బీ ఎంత వరకూ రిజల్ట్స్ ఇస్తుంది? ఎన్నికలు వస్తేగానీ తెలియదు. గతంలో వైఎస్ మరణించిన అనంతరం వెల్లువెత్తిన సానుభూతి తనని సీఎం చేస్తుందని జగన్ బలంగానే భావించారు. కానీ, అలా జరగలేదు. మరి ఇప్పుడు ఏమవుతుందో…

రాజకీయాల్లో నేరస్తులు .... సుప్రీంలో వాదనలు

భారత రాజకీయ వ్యవస్థలో నేరగాళ్ల నిరోధాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం కట్టడి చేయనుందా..?. దేశ రాజకీయ వ్యవస్థలో  నానాటికి పెరుగుతున్న నేరగాళ్ల ప్రమేయం సుప్రీం చొరవతో తగ్గనుందా...? దేశంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీలలో రౌడీలు, గుండాలు, వివిధ కేసుల్లో కీలకమైన నేరగాళ్లుగా నమోదైన వారు చట్ట సభలలో ఠీవిగా కూర్చుంటున్నారు. ప్రజలకు సంబంధించిన పలు కీలక చట్టాలకు వారు ఆమోద ముద్ర వేస్తున్నారు. ఇది దేశానికి అంత మంచిది కాదు. నేరాలూ, ఘోరాలు వివిధ కుంభకోణాలతో సంబంధం ఉన్నవారు, మహిళలపై అత్యాచారలు చేసిన వారు, భార్యల, బంధువులను హత్య చేసిన కేసులలో ఉన్నవారు చట్ట సభలకు ఎన్నికవుతున్నారు. వారి ప్రభావంతో కీలకమైన బిల్లుల పాస్ అవుతున్నాయి. అంతే కాదు నేరగాళ్లకు కఠిన శిక్షలు వేసేందుకు రూపొందించిన బిల్లులకు సభలలోకొన్ని ఆమోదం పొందడంలేదు.      ఇది దేశానికి క్షేమకరం కాదు. 2014 సంవత్సరం లెక్కల ప్రకారం శాసన కర్తలలో దాదాపు 34 శాతం మందికి నేర చరిత్ర ఉందని వెల్లడయింది. గడచిన నాలుగేళ్లలో ఈ సంఖ్య దాదాపు 10 శాతం పెరిగిందని ఓ అంచన. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్, బిహార్, ప‌శ్చిమ బెంగాల్, మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు, ఉత్తర‌ప్రదేశ్ స‌హా ప‌లు రాష్ట్రాల నుంచి నేర చ‌రిత్ర ఉన్న వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఇది ఆయా రాష్ట్రాల ప్రజ‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. పార్లమెంటు, శాసన సభలలో నానాటికి పెరిగిపోతున్న నేరగాళ్లను నిరోదించాలంటూ పబ్లిక్‌ ఇంట్రేస్ట్ ఫౌండేషన్ సంస్థ సుప్రీం కోర్టులో వ్యాజ్యం వేసింది. దీనిపై ప్రారంభమైన విచారణలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో జస్టిస్ ఆర్.ఎఫ్. నారీమన్, జస్టిస్ ఏ.ఎం. ఖన్విల్కర్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ‌ ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. భారత దేశ న్యాయ, రాజకీయ చరిత్రలో ఇది ఓ మైలురాయి. ప్రభుత్వ న్యాయ‌వాదుల‌కు, సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల‌కు మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రిగింది.     ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు చేసిన వ్యాఖ్యలు కొన్నిదేశ రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతున్నాయి. దేశ రాజ‌కీయ వ్యవ‌స్ధలో నేర చ‌రిత్ర ఉన్న వారి జోక్యం పెర‌గ‌రాద‌ని సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు అన్నారు. దీనిపై వారు ఆందోళ‌న వ్యక్తం చేశారు. దేశంలో ఇంతవరకూ రాజకీయాలకు న్యాయస్థానాలకు మధ్య ఎప్పుడూ ఇంతటి వైరం లేదు. ఈ వ్యాజ్యంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయ వ్యవస్థకు మచ్చుతునకలు. దేశంలో రాజకీయ వ్యవస్థ నేరపూరితం కాకూడదంటూనే పార్లమెంటు, న్యాయవ్యవస్థల మధ్య ఓ లక్ష్మణరేఖ ఉందని, దాన్ని ఇరువురూ దాటకూడదని సుప్రీం పేర్కొంది. ఈ వ్యాఖ్యలను ఆషామాషీగా చూడకూడదు. అలాగే కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టుల మధ్య వివాదంగానూ  పరిగణించరాదు. గత కొంతకాలంగా కేంద్రం, సుప్రీం ఉప్పూ, నిప్పుగా ఉన్నాయి. రాజకీయాలలో నేరచరితుల పాత్రపై ఈ రెండు వ్యవస్థలు ఒకరిపై ఒకరు మండిపడుతున్నారు. ఈ సందర్భంలో సుప్రీం రాజకీయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ నాయకులను కలవర పెడతాయి. అయితే సుప్రీం కనబరచిన తీరును మాత్రం దేశ ప్రజలు హర్షిస్తారు. చట్టసభలలో ప్రజలకు ఉపయోగపడే చట్టాలను చేయడంలో నేరగాళ్ల పాత్ర లేకుండా చేసేందుకు సుప్రీం వ్యక్తం చేసిన అభిప్రాయాలు కొంత వరకూ దోహదపడతాయి. ఇది భారత రాజకీయ వ్యవస్థకు శుభ పరిణామం. భవిష‌్యత్తులో రాజకీయ వ్యవస్థ మరింత బాగుపడడానికి శుభశూచకం. దేశంలో అత్యున్నత న్యాయస్థానం వ్యవహరించిన తీరు సదా అభినందనీయం. దేశానికి ముందు ముందు మంచిరోజులు వస్తాయనడానికి ఓ నిదర్శనం.

రాజుకుంటున్న రాఫెల్

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వివాదం నానాటికీ రాజకుంటోంది. గత పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభలను కుదిపేసిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం తాజాగా భారతీయ జనతా పార్టీ మాజీ నాయకుల నుంచి విమర్శలకు దారి తీసింది. దీంతో భారతీయ జనతా పార్టీ పరిస్ధితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. లోక్‌సభలోను, రాజ్యసభలోనూ  భారతీయ జనతా పార్టీని... ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి, తెలుగు వారి కోడలు నిర్మలా సీతారామన్ మెడకు చుట్టుకుంది. ఇన్నాళ్లూ ప్రతిపక్షాలు...ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రమే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై విరుచుకుపడ్డారు.   దీంతో ఈ అంశంపై దేశవ్యాప్తంగా అందరూ ఈ కుంభకోణంలో ఏమీ లేదని, ప్రతిపక్షాలు చేస్తున్న అనవసర వివాదమనే భావించాలరు. అయితే తాజాగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, వాజపేయి ప్రభుత్వంలో  మంత్రులుగా చేసిన యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో  పెద్ద కుంభకోణమే జరిగిందంటూ రోడెక్కారు.  దీంతో బిజెపి ప్రభుత్వం రక్షణలో పడింది. మరో ముఖ్యంగా రాజీవ్ గాంధీ ప్రభుత్వ హయాంలో బోఫోర్స్ కుంభకోణాన్ని వెలికి తీసి జాతీయ స్థాయిలో ఆ మాటకొస్తే అంతర్జాతీయ స్ధాయిలో పేరు తెచ్చుకున్న సీనియర్ జర్నలిస్టు అరుణ్ శౌరీ ఈ రాఫెల్ ఉదంతంపై పెదవి విప్పడంతో జాతీయ స్ధాయిలో అందరి చూపు రాఫెల్ వైపు మళ్లింది. అరుణ్ శౌరి అయితే ఈ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం బోఫోర్స్ కంటే చాలా పెద్ద కుంభకోణమని తేల్చారు.   ఈ ఇద్దరు సీనియర్ నేతలు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీయే ఈ రాఫెల్ కుంభకోణానికి సూత్రధారి అని నిప్పులు చెరిగారు. ఈ కుంభకోణం నుంచి బయటపడేందుకు ప్రధానమంత్రి వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు దారి తీస్తోందని వారిద్దరు ఆరోసిస్తున్నారు. అయితే వాస్తవాలు కూడా వారి వాదనకే బలాన్ని చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రి, తెలుగు వారి కోడలు నిర్మలా సీతారామన్ మార్చి మార్చి చేస్తున్న ప్రకటనలు కూడా రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై అనుమానాలు రెకెత్తిస్తోంది. ఇంతకు ముందు చేసుకున్న విమానాల కొనుగోలు ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారన్నది అందరినీ దొలుస్తున్న ప్రశ్న. ఇలా చేయాలని వైమానిక దళం ప్రభుత్వాన్ని కోరిందా. అలా అయితే సంబంధిత పత్రాలు ఏమయ్యాయి అన్నది ప్రధాన ప్రశ్న. వేల కోట్ల రూపాయల ఒప్పందానికి చెందిన పత్రాలు అన్నీ ప్రభుత్వం దగ్గర జాగ్రత్తగా ఉండాలి కదా... అన్నది మౌలిక ప్రశ్న. పాత ఒప్పందాల రద్దు అనంతరం కొత్త ఒప్పందాలను వైమానిక దళం పరిశీలించిందా...? లేక ఆర్ధిక లబ్ది కోసం ప్రభుత్వమే ఈ ఒప్పందాలను మార్చిందా...? అన్నది మరో ప్రధాన ప్రశ్న. ఒకవేళ రెండోదే జరిగితే దీనికి పూర్తి బాధ్యత నరేంద్రమోదీ, రక్షణమంత్రి నిర్మాల సీతారామన్‌లదే అవుతుంది. తమకు ఎలాంటి విమానాలు కావాలో... వాటి నాణ్యత, ధర వంటివి నిర్ణయించాల్సింది రక్షణ శాఖే. వారిని సంప్రదించకుండా ఈ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం నడిచిందంటే ఇందులో ప్రభుత్వ పాత్ర ఉన్నట్లుగానే భావించాలి.     రాఫెల్ యుద్ధ విమానాల తొలి కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత ప్రభుత్వం మళ్లీ మరోసారి కొనుగోలు చేయడానికి టెండర్లు పిలవాలి కదా... ? కాని ప్రభుత్వం అలా ఎందుకు చేయలేదన్నది దేశమంతా అడుగుతున్న ప్రశ్న. దీనికి ప్రధాని, రక్షణ మంత్రి సమాధానం చెప్పాల్సి ఉంది. కుంభకోణంలో ప్రధాన అంశం ఈ కాంట్రాక్ట్‌ను రక్షణ వ్యవహారాలు, యుద్ధ విమానాల కొనుగోలు అంశాలపై కనీస అనుభవం కూడా లేని అనీల్ అంబానీ సంస్ధకు అప్పగించడం కూడా వివాదమవుతోంది. ఇది దేశ ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేస్తున్న వ్యవహారంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కుంభకోణం గురించి ముందే ప్రధాన మంత్రి ఊహించి ప్రభుత్వ రక్షణ కోసం కీలకమైన రక్షణ శాఖకు మహిళను మంత్రిని చేశారా... ? అనే అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే యుద్ధ విమానాలకు సంబంధించిన డబ్బు చేతులు మారిందంటున్నారు. అదే జరిగితే విమానాలు ఇంకా ఎందుకు రాలేదన్నది కూడా పెద్ద ప్రశ్న.     ఈ 36 విమానాలు ఒప్పందం కుదిరిన రెండేళ్లలో వస్తాయని అప్పట్లో చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క విమానం కూడా భారత్‌కు చేరకపోవడానికి ఏమని సమాధానం చెప్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీని ఏ విషయంలోనూ ఇరుకున్న పెట్టలేకపోతున్న ప్రతిపక్షాలకు ఈ రాఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారం పెద్ద ఆయుధమనే చెప్పాలి. ఈ ఆయుధంతోనే రాబో‍యే ఎన్నికల్లో ప్రతిపక్షాలు... మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎదుర్కోనుంది. చూడాలి.. రానున్న ఏడాది కాలంలో ఇంకెన్ని కుంభకోణాలు బయట పడతాయో...? బయటపడిన కుంభకోణాలు ఎలా తెరమరుగవుతాయో....? తేలాలంటే మరో ఏడాది ఆగాల్సిందే....  

చింతే తప్ప... చినుకు లేదు...

నాలుగు చినుకులు రాల్చమ్మా అంటూ ఆకాశం కేసి చూస్తున్నారు తెలుగు రైతులు. ఖరీఫ్ ముగిసే రోజులు దగ్గర పడుతున్నా వరుణ దేవుడి కరుణ మాత్రం తెలుగు రైతులపై కురిపించడం లేదు. సీజన్ ముగియడానికి ఇక ఎన్నో రోజులు లేదు. వర్షాలు మాత్రం రైతులను ఊరిస్తున్నాయి తప్ప ఎక్కడా చినుకు జాడే లేదు. ఈ ఏడాది సగటు వర్షపాతం కంటే కూడా తక్కువగానే వర్షాలు కురిసాయి. దీంతో పంటలకు సిద్ధమైన రైతులు అటు ఆకాశం వైపు... కింద భూమి వైపు చూస్తున్నారు. ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా వర్షాలు పడడం లేదు.     అయితే ఈ సంవత్సరం  వేసవి కాలంలో ఎండలు మరింత మండిపోవడంతో వర్షాలు కూడా ఆ స్ధాయిలోనే ఉంటాయని వాతావరణ శాఖ పేర్కోంది. దీంతో నగరాల్లోని వారు ఎండలను తిట్టుకుంటూ గడిపినా... గ్రామాల్లో రైతు కుటుంబాలు మాత్రం ఊరించే వర్షాల కోసం ఉవ్విళ్లూరుతూ గడిపారు. వేసవి కాలం వెళ్లింది. వర్షాకాలం వచ్చింది. తొలి వారం, పది రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిపినా ఆ తర్వాత నుంచి చినుకు జాడే లేదు. ఖరీఫ్ సీజన్ ముగిసి పోతున్న దశ కూడా వచ్చేసింది. ఆకాశంలో అక్కడక్కడా... అప్పుడప్పుడు మబ్బుల పొరే తప్ప వర్షం మాత్రం కరుణ చూపించలేదు.     పొలాల్లో రైతులు విత్తు నాటి... ఎరువుల కోసం పడిగాపులు పడి.... వ్యవసాయ పనుల కోసం సమాయత్తమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా ఏరువాకను ఓ పండగలా ప్రారంభించింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం నాయకులు ఈ పండుగను రాష్ట్రం అదిరిపోయేలా ప్రారంభించారు. ఇక తెలంగాణలో కూడా ప్రభుత్వం అట్టహాసంగానే ఏరువాకకు స్వాగతం పలికింది. ఖరీఫ్‌కు ముందు వచ్చే ఉగాది నాడు పంచాగకర్తలు కూడా ఈ ఏడాది వర్షాలు భారీగా ఉంటాయని, రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని ముక్తాయింపు ఇచ్చారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ప్రభుత్వాలు, పండితులు చెప్పినంత మాత్రాన వరుణుడు కరుణిస్తాడా...!? కరుణించలేదు. చినుకు నేలపై రాలలేదు. దీంతో రైతుల పరిస్ధితి దీనాతిదీనంగా... దారుణంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించి చేతులు దులుపుకుంది. ప్రత్నామ్నాయ ఏర్పాట్లపై ఏ ప్రభుత్వాలు శ్రద్ధ చూపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌పై రైతులు ఆశలు వదులుకోవాల్సిందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సాగునీరు అందించే ఏ ప్రాజెక్టులోను సరిపడా నీరు లేదు.     నాగార్జనసాగర్ ప్రాజెక్టు కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ఆరు లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టు ఉంది. దానికి సరిపడా నీరు అందించేందుకు సాగర్ సిద్ధంగా లేదు. ఈ ప్రాజెక్టు నుంచి 54 టిఎంసీల నీరు సాగుకు అవసరం. అయితే ఇక్కడ ఒక్క టిఎంసీ కూడా లేకపోవడం ఇరు రాష్ట్రాల రైతులను కలవరపరుస్తోంది. ఈ ఖరీఫ్‌లో నీటిని అందించలేమంటూ నీరుపారుదల శాఖ ఇంజనీర్లు చేతులెత్తేశారు. ఇక గోదావరి బేసిన్‌లో కూడా సరిపడా నీళ్లు లేవు. గోదావరి బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టుల్లో నీరు లేదు. దీంతో రైతుల పరిస్ధితి అగమ్య గోచరంగా మారింది.     ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోనూ కూడా చుక్క నీరు లేదు. ఇక్కడి ప్రాజెక్టుల్లో కూడా తెలంగాణ ప్రాజెక్టుల పరిస్థితే కనిపిస్తోంది. వ్యవసాయాధారిత దేశంలో రైతుల బతుకులు దీనావస్ధకు చేరుతున్నాయంటే దీనికి కారణం... నైతిక బాధ్యత కచ్చితంగా ప్రభుత్వాలదే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా నిర్ణయం తీసుకుని రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలి. నీటి ఆధారిత పంటలపై కాకుండా వాణిజ్య పంటలు, నీరు తక్కువ అవసరం ఉండే పంటలపై శ్రద్ధ పెంచేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలి. రైతులకు అవసరమైన అన్ని చర్యలను పంటల సీజన్ ప్రారంభానికి ముందే తీసుకోవాలి. దీనికి ఏ ఒక్క ప్రభుత్వమో పూనుకుంటే చాలదు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా రైతులు దీనావస్ధలోనే ఉన్నారు కనుక అందరూ కలిసి కార్యాచరణ రూపొందించాలి. ఇందుకోసం తమ తమ రాజకీయాలను పక్కన పెట్టాలి. రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలి. నూటికి 70 మందికి పైగా రైతులే ఉన్న దేశంలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గుపడాలి.     పరిశ్రమలే దేశాభివ్రద్ధికి గీటురాయి అనుకుంటే ఆ పరిశ్రమలకు అనుమతిచ్చే వారు, ఆ పరిశ్రమల యజమానులు, అందులోని ఉద్యోగులు, వారి వారి కుటుంబాలు.. అందరూ తినేది పట్టెడన్నమే అని గుర్తెరగాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. మరి ఆ అన్నాన్ని స్రష్టించిన వారిని ఏమనాలి. ఇంకేమంటాం.. పరబ్రహ్మలు... అంటే భూమ్మీద నడయాడే దేవుళ్లుగానే భావించాలి. అవును... నిజం... ముమ్మాటికి నిజం... రైతులే కళ‌్ల ముందు కదలాడే ప్రత్యక్ష దైవాలు. దైవం కన్నెర్ర చేస్తే సమస్త లోకాలు మాడిపోతాయనే ఎరుక అన్ని ప్రభుత్వాలకు రావాలి.  

ఆకాశం లాంటి జీవితం! నక్షత్రాల్లాంటి విశిష్టతలు!

ఇప్పుడు దేశమంతా కరుణానిధి గురించే చర్చించుకుంటోంది! స్వయంగా ప్రధాని మోదీ చెన్నైకి చేరుకుని దివంగత దిగ్గజానికి నివాళి అర్పించారు. 94 ఏళ్ల కరుణానిధి అయిదు సార్లు సీఎంగా తమిళనాడును పరిపాలించి చరిత్ర సృష్టించారు! అయితే, కలైంగర్ ది విలక్షణ వ్యక్తిత్వం. అందువల్లే ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. పరమ నాస్తికుడిగా ముద్రపడ్డ ఆయన తల్లిదండ్రులు తనకు పెట్టిన దేవుడి పేరును మార్చుకోవటం మొదలు పెద్ద కొడుకును కాదని చిన్న కొడుకును పార్టీ అధినేతగా నియమించటం వరకూ అడుగడుగునా అంకితభావం, తెలివితేటలు ప్రదర్శించారు. కరుణానిధి జీవితంలోని విభిన్న కోణాల్ని, విశేష అంశాల్ని ఇప్పుడు చూద్దాం.     1924లో జన్మించిన కరుణానిధి తన సుదీర్ఘ ప్రస్థానాన్ని సాదాసీదాగా ప్రారంభించారు. ఆయన బాగా డబ్బున్నవారు కాదు. పలుకుబడి కలిగిన రాజకీయ , వ్యాపార కుటుంబంలోని వారు కూడా కాదు. మధ్యతరగతి మూలల నుంచీ అంచెలంచెలుగా ఎదిగారు. అయితే, ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు దక్షిణామూర్తి. ఇది శివుడి నామాల్లో ఒకటి. కానీ, క్రమక్రమంగా నాస్తికుడుగా మారిన కరుణానిధి దేవుడి పేరును తాను కలిగి వుండటం అంగీకరించలేదు. అందుకే, దక్షిణామూర్తి కాస్త కాలక్రమంలో కరుణానిధి అయ్యారు. దీని వెనుక కూడా ఒక పెద్ద ఉద్యమమే వుంది.     కరుణానిధి 14 ఏట నుంచే సామాజిక ఉద్యమాల పట్ల ఆకర్షితుడయ్యారు. జస్టిస్ పార్టీ నేత అయిన అళగిరి స్వామి ప్రసంగాలకు ప్రేరితుడై ఒక యువజన సంఘం స్థాపించారు. తరువాతి కాలంలో ఒక విద్యార్థి సంఘం కూడా నెలకొల్పారు! అయితే, కరుణానిధి నాయకత్వ లక్షణాలకి అసలు అవకాశం 1953లో వచ్చింది. అప్పటి నెహ్రు ప్రభుత్వం తమిళనాడులోని కళ్లకుడి అనే ప్రాంతాన్ని దాల్మియాపురంగా మార్చాలని భావించింది. డీఎంకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ, అనాటి 29 ఏళ్ల దక్షిణామూర్తి ఒకడుగు ముందుకేసి కదులుతున్న ట్రైన్ కు అడ్డంగా పడుకున్నారు. చివరకు, అరెస్టై జైలుకి వెళ్లారు. 35 రూపాయల ఫైన్ కట్టమంటే నిరాకరించి సంవత్సరం జైల్లో గడిపారు. ఆఖరుకు, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కళ్లకుడి పేరు మార్చలేదు. అందుకోసం తీవ్రపోరాటం చేసిన దక్షిణామూర్తిని జనం కళ్లకుడి కొండ కరుణానిధి ( కళ్లకుడిని జయించిన కరుణానిధి! ) అని తమిళంలో పొగిడేవారు! అదుగో… అలా కరుణానిధి ఆయన మారు పేరైపోయింది! తరువాత అదే అసలు పేరైపోయింది.     మారిన పేరుతో చరిత్రలో తన పేరు రాసిపెట్టుకున్న కరుణానిధి తన అందరు సంతానానికి తమిళ పేర్లే పెట్టారు. సినిమా రచయిత, కవి అయిన కలైంగర్ కు తమిళం అంటే చాలా ఇష్టం. కాకపోతే, ప్రస్తుతం డీఎంకే పగ్గాలు కరుణ తరువాత అందుకోబోతోన్న స్టాలిన్ కు మాత్రం తమిళ భాషలో పేరు పెట్టేలేదు! అందరిలో కరుణానిధికి స్టాలిన్ అంటేనే ఎక్కువ ఇష్టం! అయినా ఆయనకు రష్యా నాయకుడి పేరు పెట్టటానికి కారణం… స్టాలిన్ చనిపోయేనాటికి కరుణానిధి చిన్న కుమారుడు కేవలం నాలుగు రోజుల పసివాడు. అతడికి స్టాలిన్ అని పేరు పెట్టుకుంటానని కరుణానిధి ఒక బహిరంగ సభలో ప్రకటించారు. అప్పట్లో భారత్ రష్యాకు దగ్గరగా వుండటంతో స్టాలిన్ చనిపోయిన తరువాత అనేక సంస్మరణ సభలు జరిగాయి. అలాంటి ఓ సభలోనే తన కొడుక్కి స్టాలిన్ అని పేరు పెట్టారు కరుణ! స్టాలిన్ కు నిజానికి కరుణానిధి పెట్టాలనుకున్న పేరు… అయ్యాదురై! ఎందుకంటే, ఆయన తన అభిమాన నేత పెరియార్ ను ‘అయ్యా’ అనేవారు. అలాగే మరో మహానేత అన్నాదురైలో దురై అనే పదం వుంది! ఈ రెండూ కలిపి అయ్యాదురై అని పెట్టాలనుకున్నారట. కానీ, అంతలోనే రష్యా కమ్యూనిస్టు పాలకుడు స్టాలిన్ మరణంతో ఆయన పేరు కరుణ కొడుక్కి స్థిరపడిపోయింది! అంతా సవ్యంగా సాగితే వచ్చే ఎన్నికల్లో ఈ భారతీయ స్టాలిన్ తమిళనాడును ఏలే ముఖ్యమంత్రి కావొచ్చు!     కరుణానిధి రచయిత, కవి అయినా కూడా ఎంతో తెలివితేటలున్న రాజకీయ నాయకుడు కూడా! డీఎంకే పార్టీకి అన్నాదురై తరువాత పెద్ద దిక్కైన ఆయన క్రమంగా ఆ పార్టీని తన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నాడు. ఆ క్రమంలో ఎంజీఆర్, వైగో లాంటి నాయకుల్ని అవతలకి పంపించాడు. చివరకు, తన కొడుకుల్లోనూ అంతగా నమ్మకం లేని పెద్ద కొడుకు అళగిరిని పక్కకు పెట్టేశాడు. చిన్న కొడుకు స్టాలిన్నే అందలం ఎక్కించారు. ఇప్పుడు డీఎంకేలో తిరుగులేని శక్తిగా స్టాలిన్ ఎదిగిపోయారు. అందుకు కారణం గత రెండు దశాబ్దాలుగా కరుణానిధి స్టాలిన్ ను పార్టీలో అంచెలంచెలుగా పెంచుతూ రావటమే! ఇది కరుణానిదిలోని రాజకీయ కోణం! ఇలాంటి వ్యూహాల కారణంగానే ఆయన సుదీర్ఘ ప్రస్థానం సాధ్యమైంది! ముఖ్యమంత్రిగా పాలనలోనూ కరుణానిధి దేశంలో చాలా మందికి కొత్త దారులు చూపించారు. ఇవాళ్ల ఎన్నికల మ్యానిఫెస్టోలు విడుదల కాగానే మనకు వినిపించే ఫ్రీ గిఫ్టుల సంస్కృతి ఒక విధంగా ఆయనే పాప్యులర్ చేశారు. 1967లో మొదటిసారి సీఎం అయినప్పుడు చెన్నైలో మనుషులు లాగే రిక్షాలను ఆయన నిషేధించారు. వారికి సైకిల్ రిక్షాలను ఉచితంగా అందించారు. అలా మొదలైన ఆయన ఉచిత సంక్షేమ పథకాల పరంపర కొనసాగుతూనే వచ్చింది. 1989లో ఉచిత విద్యుత్ కూడా ఆయనే మొదటిసారి అందించారు! ఇక 2006లో కరుణానిధి ఉచిత కలర్ టీవీలు అందిస్తామని ప్రకటించి సాటి రాజకీయ నేతలకి పెద్ద షాకే ఇచ్చారు!     కేవలం ఉచిత పథకాలే కాదు… పాలనలో అడుగడుగునా కరుణానిధి తన ముద్ర వేసే వారు. ఆయన వ్యక్తిగత జీవితంలో తాళికట్టమని పట్టుబట్టినందుకు ప్రేమను , ప్రేయసిని వదులుకున్నారు! ఎందుకంటే, ఆయన నాస్తికుడు కాబట్టి! కానీ, అదే కరుణానిధి ముఖ్యమంత్రిగా తమిళనాడులోని ఆలయాల పునరుద్ధరణ, పునర్నిర్మాణాలకు ఎంత ఖర్చు చేశారో తెలుసా? 420 కోట్లకు పైనే! తన వ్యక్తిగత నమ్మకాలు పాలనలో ప్రభావం చూపనీయలేదాయన! అలాగే, పార్టీపైన , తన కుటుంబంపైనా కూడా ఆయన ఏనాడూ నాస్తికత్వం రుద్దలేదు. ఆయన ఇంట్లో పూజలు జరిగిన ఫోటోలు మీడియాలో వస్తే కూడా కరుణ చలించలేదు. తన నమ్మకాలు, ఇంట్లోని వారు విశ్వాసాలు వేరు వేరంటూ కుండబద్దలు కొట్టారు! మాధవ సేవని నమ్మని కరుణానిధి మానవ సేవని మాత్రం మనస్ఫూర్తిగా నమ్మేవారు! అందుకే, ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందించారు. స్వయంగా తన తల్లి పేర ట్రస్టు స్థాపించి పేదలకు సాయం అందిస్తూ వస్తున్నారు. తన తదనంతరం తాను మొట్ట మొదటిసారి చెన్నైలో కొన్న గోపాలపురం ఇల్లు కూడా హాస్పిటల్ గా మార్చాలని ఆయన కోరుకున్నారు! ఇంత కాలం కలైంగర్ నివాసంగా వున్న ఆ భవనం ఇక మీదట ఆసుపత్రి కాబోతోంది! ఇలా బోలెడు విభిన్న కోణాల సమ్మేళనమే… కరుణానిధి! అందుకే, ఆయన తన ప్రస్థానం దేవుడ్ని నమ్మని నాస్తికుడిగా మొదలు పెట్టి… చనిపోయే క్షణానికి… కొన్ని లక్షల మందికి ‘దేవుడు’ కాగలిగారు!

సెలవు మహా నాయక సెలవు

ద్రవీడ సూరీడు అస్తమించాడు. తొమ్మిది పదుల జీవితంలో ఆరు పదుల రాజకీయ జీవితాన్ని నెరపిన రాజకీయ దురంధరుడు  కన్నుమూశారు. దైవం... దైవాలయమే జీవితంగా గడిపిన కుటుంబంలో పుట్టి ఆ దైవం అస్తిత్వాన్నే ప్రశ్నించి... చివరి వరకూ నాస్తికునిగా జీవించిన ఆ మహా మనిషి అందరిని విడిచి అందని లోకాలకు వెళ్లిపోయారు. కళ్లకుడి కొండ కరుణానిధి. ఇది పెట్టుడు పేరు. అసలు పేరు దక్షిణామూర్తి. ఆ పరమేశ్వరుడి గుడిలో నాదస్వరం వాయించే కుటుంబంలో పుట్టారు.     అయితే ఆ దేవుడే లేడని, కళ్లకు కనిపించని అవాస్తవాల కంటే ఎదురుగా కనిపించే వాస్తవాలే దైవమని నమ్మి తన పేరును మార్చుకున్నారు దక్షిణామూర్తి. హిందీకి వ్యతిరేకంగా తమిళనాట జరిగిన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న దక్షిణామూర్తి రైల్వే స్టేషన్ లో  రైలుకు ఎదురెళ్లి మరీ ఉద్యమించారు. ద్రవిడ ఉద్యమ స్ఫూర్తితో దేవుడి పేర్లను వదిలేయాలన్న ప్రేరణతో దక్షిణామూర్తి పేరును కళ్లకుడి కొండ కరుణానిధి... అంటే కళ్లకుడిని గెలిచిన కరుణానిధిగా మారారు.  ఆరు దశాబ్దాల క్రితం జరిగిన ఆ సంఘటన తర్వాత కరుణానిధిగానే ఆయన తమిళ ప్రజల మనసు గెలుచుకున్నారు.     వెనుకబడిన వారి ఆశాదీపం పెరియార్ రామస్వామి, అన్నాదురైల శిష్యుడిగా ఎదిగిన కరుణానిధి వారి సిద్ధాంతాలను జీవిత చరమాంకం వరకూ వదలలేదు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఐదు పర్యాయాలు పని చేసిన కరుణానిధి తెలుగు వారు.ముత్తువేల్, అంజుగం దంపతులకు జన్మించిన దక్షిణామూర్తిగా జన్మించిన కరుణానిధి పూర్వీకులు తెలుగు వారు. ప్రకాశం జిల్లా. ఎప్పుడో వారి తాతలు బతుకు తెరువు కోసం తమిళనాడుకు వలస వెళ్లిపోయారు. ఇది తెలిసినప్పటి నుంచి కరుణానిధి తనను కలిసేంుదుకు వచ్చిన తెలుగు వారితో చాలా ఆప్యాయంగా... ప్రేమగా ఉండేవారు. మేమూ తెలుగు వారమే అంటూ పలకరించే వారు. చిన్నతనం నుంచి ఉద్యమాలే ఊపిరిగా బతికిన కరుణానిధి నేటి తరానికి ఉద్యమ స్ఫూర్తిని అందించిన మహనీయుడు. కరుణానిధి చిన్నతనంలోనే ఉద్యమబాట పట్టారు. ఆయన స్వగ్రామం కల్లకుడి పేరును దాల్మియాపురంగా మార్చడాన్ని ఆయన నిరసించారు. దీనికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. అలా ప్రారంభమైన ఆయన ఉద్యమ గుణం జీవిత చరమాంకం వరకూ కొనసాగింది. మాజా ముఖ్యమంత్రి, మహానటుడు ఎం.జీ.రామచంద్రన్ కలిసిన స్నేహం వటుడింతై అన్నంతగా పెరిగి పెద్దదైంది.     చదివింది ఎనిమిదో తరగతే అయినా కరుణానిధి తన సాహిత్యంతో లక్షలాది మందికి ప్రేరణ అయ్యారు. ఎం.జీ. రామచంద్రన్ మరణంతో డిఎంకె రెండుగా చీలిపోయి కరుణానిధి, సినీ నటి జయలలితల వర్గాలు ఉప్పు, నిప్పుగా మారాయి. వారిద్దరి వ్యక్తిగత వైరం తమిళ ప్రజలను ఇబ్బందులు పాలు చేశాయి. జయలలిత ముఖ్యమంత్రిగా పని చేసినంత కాలం కరుణానిధిపై కక్షపూరిత రాజకీయాలే చేశారు. వీటిని తట్టుకుని మళ్లీ సముద్రంలో అలలా పైకి లేచే వారు కరుణానిధి. తాను బతికి ఉన్నంత వరకూ తాను నమ్మిన సిద్ధాంతాలను ఎట్టివ పరిస్ధితుల్లోనూ వదలని కరుణ, ప్రేమ ఆయనది.     మరణించినంత వరకూ నాస్తికుడిగా... పెత్తందారితనానికి వ్యతిరేకిగా, ఉత్తర భారతదేశ ఆధిపత్యానికి తలవొంచని వానిగా, అగ్రవర్ఱ దాష్టీకాలను వ్యతిరేకించే మనీషిగానే బతికారు కరుణానిధి. అదే ఆయనను తమిళనాట కోట్ల మందిలో ఒకడిగా కాకుండా... కొట్ల మందికి ఒకడిగా మిగిల్చింది. తమిళ రాజకీయాలు వ్యక్తిగత కక్షలకు ప్రతీకగా నిలుస్తాయి. దీనికి జయలలిత ముఖ్యమంత్రిగా ఉండగా కరుణానిధి చూపించిన కక్ష పూరిత చర్యలే నిదర్శనం. అవే కక్షలు ఇప్పుడు కరుణానిధి మరణం తర్వాత కూడా వెలుగు చూడడం దారుణం. కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో నిర్వహించేందుకు అనుమతించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం  మాత్రం అందుకు ససేమిరా అంటోంది. మెరీనా బీచ్‌లో అన్నాదురై మ్యూజియం పక్కన స్ధలం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీనికి గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అడ్డంకిగా ఉందంటూ కొర్రి పెట్టింది. ఇది ఓ మ‌‍హా నాయకుడ్ని అవమానించడంగానే పరిగణించాలి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దీనికి సానుకూలంగా ఉన్నట్లుగా చెబుతూనే చేయాల్సన పని చేసేశారు. ఇదీ తమిళ రాజకీయం. ముందు ముందు తమిళనాడులో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజెప్పేందుకే ఇది చక్కని ఉదాహరణ.     తమ నాయకుడ్ని మరణాన్ని తట్టుకోలేని అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారి శోకం ముందు మెరీనా బీచ్ సముద్రం కూడా తోడైంది. అంతటి మహా నాయకుడి మరణం తట్టుకోలేనిది. ఆ మహా నాయకుడి మరణానికి ఎవరూ బాధ్యులు కాదు. కాలధర్మాన్ని అనుసరించి కరుణానిధి తన శరీరాన్ని వదిలారు. అయితే అనంత వాయువుల్లో కలిసి ఆయన ఆత్మ మాత్రం తమిళ ప్రజల కోసం... వారి పురోగమనం కోసం పరితపిస్తూనే ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని తెలుగు వన్ యాజమాన్యం... సిబ్బంది మనసారా కోరుకుంటోంది. సెలవు మహా నాయక సెలవు.

దిల్లీని ఢీకొట్టిన ద్రవిడ దర్పం కరుణానిధి..!

ముత్తువేల్ కరుణానిధి... ఆధునిక తమిళ ఇతిహాసంలో ఆయనది ఒక ప్రత్యేక అధ్యాయం! దశాబ్దాలపాటు ద్రవిడ నేలను కనుసైగలతో శాసించాడు. అభిమానులు ఆయనను ఆరాధనతో 'కలైంగర్' అని కీర్తిస్తారు. అంటే కళాకారుడు అని అర్థం. ఆయన నిజంగానే రాజకీయ కళని ఔపోశన పట్టిన కళాకారుడు!     1969-2011 నడుమ మొత్తంగా ఐదు సార్లు తమిళనాడుకు సీఎంగా పని చేశారు. అయితే ఈ రాజకీయ చాణక్యుడు రాజకీయాల్లోకి రాకముందు కోలీవుడ్ సినీ పరిశ్రమలో సంభాషణల రచయిత! తమిళంలో ఆయన కథలు, నాటకాలు, నవలలు లాంటివెన్నో విరచించారు. తమిళ సాహిత్యంలో ఆయన పాత్ర అద్వితీయం! 1924లో బ్రిటీష్ కాలపు మద్రాస్ ప్రెసిడెన్సీలోని  తిరుక్కువలైలో కరుణ జన్మించారు. తమిళ నాయి బ్రాహ్మణ కుటుంబం ఆయనది. తల్లిదండ్రులు ముత్తువేలర్, అంజుగం. జీవితకాల నాస్తికుడైన కరుణానిధికి తల్లిదండ్రులు పెట్టిన పేరు… దక్షిణా మూర్తి! స్కూలు రోజుల్లోనే డ్రామా, కవిత్వం, రచనల్లో ఆయన ప్రతిభ ప్రదర్శించారు. జస్టిస్ పార్టీలో ప్రముఖ నాయకుడైన అళగిరిస్వామి ప్రసంగాలతో తరువాతి కాలంలో ఉత్తేజితుడయ్యాడు! 14వ ఏట నుంచే సామాజిక పోరాటాల వైపు ఆకర్షితుడయ్యాడు.     సినిమా రచయితగా 'రాజకుమారి' చిత్రంతో ప్రస్థానం ప్రారంభించారు కరుణానిధి. రాజకుమారి చిత్రంలో హీరో ఎంజీఆర్. అప్పుడు మొదలైన వారిద్దరి పరిచయం స్నేహంగా మారి చాలా కాలం పాటు కొనసాగింది. కానీ, రాజకీయాల్లోకి వచ్చాక మాత్రం ఎంజీఆర్, కలైంగర్ దూరమయ్యారు. ఆ తర్వాత శివాజీ గణేషన్ సినిమాలతో పాటు మరెన్నో చిత్రాలకు కరుణానిధి రచయితగా పని చేశారు. 14 ఏళ్ల వయసులోనే కరుణ అళగిరిస్వామి స్ఫూర్తితో స్థానికంగా ఓ యూత్ సొసైటీని నడిపారు. ఆ తర్వాత 'తమిళనాడు తమిళ్ మనవర్ మండ్రమ్' అనే విద్యార్థి సంఘానికి ఊపిరిపోశారు. కళ్లకూడి టౌన్ పేరును దాల్మియాపురంగా మార్చడంపై జరిగిన పోరాటంలో డీఎంకే తరపున ఆయన పోరాడారు.     33 ఏళ్ల వయసులో 1957లో డీఎంకే తరపున ఆయన తమిళనాడు అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1961లో డీఎంకే కోశాధికారిగా, 1962లో ప్రతిపక్ష డిప్యూటీ లీడర్ గా బాధ్యతలను నెరవేర్చారు. 1967లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. 1969లో అన్నాదురై చనిపోయాక తమిళనాడు ముఖ్యమంత్రి అయిన కరుణానిధి డీఎంకే తొలి అధినేత కూడా! పెరియార్ మీద ఉన్న గౌరవంతో అన్నాదురై తాను ఉన్నంత కాలం అధ్యక్ష పదవిని  ఖాళీగా ఉంచేవారు. అన్నాదురై పార్టీ జనరల్ సెక్రటరీగానే పిలవబడేవారు. అలా డీఎంకే ఫస్ట్ ప్రెసిడెంట్ అనిపించుకున్నది కూడా కరుణనే! అంతే కాదు తమిళ సినీ సెలబ్రిటీ సీఎం అవ్వటం కూడా కలైంగర్ తోనే మొదలైంది! ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలపు పరీక్షా సమయంలో రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఆమెను వ్యతిరేకించలేదు. తమిళనాడులోని డీఎంకే మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టింది. ఆ సందర్భంగా ఎంతోమంది డీఎంకే నేతలు అరెస్ట్ అయ్యారు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత జనతా పార్టీతో కరుణ జతకలిశారు. దీనికి కొన్నేళ్ల ముందే పార్టీ నుంచి ఎంజీఆర్ ను కరుణ బహిష్కరించారు. దీంతో, అన్నాడీఎంకే పార్టీని ఎంజీఆర్ స్థాపించారు. ఎమర్జెన్సీ తర్వాత జరగిన ఎన్నికల్లో డీఎంకే ఓడిపోగా, అన్నాడీఎంకే విజయం సాధించింది. 1987లో ఎంజీఆర్ చనిపోయేంత వరకు పలు ఎన్నికల్లో డీఎంకే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయినా నిరంతర ఓటముల్లో కూడా కరుణానిధి పట్టుదలగా, తెలివిగా పార్టీని నడిపారు. నిబెట్టారు.     తమిళ చరిత్రలో సీఎంగా కలైంగర్ శకం….     1969 ఫిబ్రవరి 10 నుంచి 1971 జనవరి 4వ తేదీ వరకు     1971 మార్చి 15 నుంచి 1976 జనవరి 31 వరకు     1989 జనవరి 27 నుంచి 1991 జనవరి 30 వరకు     1996 మే 13 నుంచి 2001 మే 13 వరకు     2006 మే 13 నుంచి 2011 మే 15 వరకు కరుణను 1971లో అన్నామలై యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో, తంజావూర్ యూనివర్శిటీ  'రాజ రాజన్' బిరుదుతో సత్కరించాయి. 2001లో ఫ్లైఓవర్ల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ జయలలిత డీఎంకే అధినేతను అరెస్ట్ చేయించింది. ఎల్టీటీఈ ఉగ్రవాద సంస్థకు కూడా కరుణానిధి మద్దతిచ్చారంటారు. 2009లో ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ తనకు మంచి మిత్రుడని స్వయంగా కరుణనిధే చెప్పటం గమనార్హం! మూడు పెళ్లిల్లు చేసుకున్నాడు ఈ తమిళ చాణుక్యుడు! పద్మావతి అమ్మాల్, దయాళు అమ్మాల్, రజతి అమ్మాల్ ఆయన భార్యలు. ముగ్గురు భార్యలతో ఆయనకు కలిగిన సంతానం…  ముత్తు, అళగిరి, స్టాలిన్, తమిళరసు, సెల్వి, కనిమొళి…

పవన్‌ది ఆర్భాటం... జగన్‌ది ఆరాటం… చంద్రబాబుకే ఆస్కారం!

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షం అంటే ఎవరు? వైసీపీ అధినేత జగన్, ఆయన ఎమ్మెల్యేలు! అయితే, వారు అసెంబ్లీని, పార్లెమంట్ ను కూడా బహిష్కరించి రోడ్లపై తిరుగుతున్నారు. అందులో లాజిక్ ఏంటో జగన్ కే తెలియాలి! అయితే, ఒక్క ఎమ్మెల్యే సీటు లేకున్నా జనసేన కూడా ప్రతిపక్ష గుడారంలోనే చలికాచుకుంటోంది! 2014లో అధికార టీడీపీకి మిత్రపక్షంగా ప్రస్థానం మొదలు పెట్టి ఇప్పుడు పూర్తిస్థాయిలో అపోజిషన్ అయిపోయింది. అది తప్పేం కాకపోయినా… చంద్రబాబును టార్గెట్ చేయాలనే తాపత్రయంలో పవన్ జగన్ కంటే ఎక్కువ తొందరపడిపోతున్నారు! సినిమా గ్లామర్ కలిసొచ్చే విషయమే అయినా దాన్ని సమర్థంగా వాడుకుని ఓట్లుగా మార్చుకునే వ్యవహార శైలి అస్సలు ప్రదర్శించటం లేదు!     ప్రతిపక్షాలంటే అధికార పక్షాన్ని తిట్టాలి. సీఎంని ఆడిపోసుకోవాలి. అంత వరకూ ఓకే. కానీ, వైసీపీ, జనసేన లాంటి రెండు పార్టీలు పెట్టుకుని, వాటికి అధినేతలమని చెప్పుకునే వారు ఎంత సీరియస్ గా పాలిటిక్స్ చేయాలి? మీడియాలో ఎప్పటికప్పుడు అన్నీ రికార్డ్ అవుతుంటాయి. అటువంటప్పుడు పవన్, జగన్ లు ఏది మాట్లాడినా జనం ప్రతిస్పందనని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. కానీ, ఇద్దరు యువనేతలూ ఆ పని చేస్తున్నట్టు కనిపించటం లేదు. ఈ మధ్యే పబ్లిగ్గా కాపు రిజర్వేషన్లపై  ఏదేదో మాట్లాడి గాలికిపోయే దాన్ని నెత్తిన వేసుకున్నారు జగన్. ఆయన నాన్ సీరియస్ పాలిటిక్స్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఋజువయ్యాయి…     మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకి అప్పజెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకు? అందుకు తగిన వాదనలు, కారణాలు గవర్నమెంట్ వద్ద వుండే వుంటాయి. కానీ, అవేవీ పట్టించుకోకుండా జగన్ మధ్యాహ్న బోజన పథకం ప్రైవేట్ వారికి ఇవ్వద్దని రోడ్డెక్కని మహిళలకి మద్దతు ప్రకటించారు! ఇదీ సంతోషమే! ప్రతిపక్ష నేతగా ఆయన అలాగే చేయాలి. కానీ, సమస్య ఏంటంటే… రోడ్డుపైన వున్న మహిళల్ని ఆయన నేరుగా వెళ్లి పరామర్శించలేదు. పోనీ ఆయన పార్టీ నుంచీ ప్రముఖ నేతలైనా వెళ్లి మద్దతు పలకలేదు. కేవలం ట్విట్టర్ లో నాలుగు లైన్లతో సరిపెట్టారు! అదీ ఏమని? షరా మామూలుగా నేను సీఎం అయితే మధ్యాహ్నా భోజన పథకం ప్రైవేట్ సంస్థలకు అప్పగించను, నిరసనలు తెలుపుతున్న మహిళలకే అప్పజెబుతాను, బిల్లు సకాలంలో చెల్లిస్తాను, మరింతగా నిధులు కేటాయిస్తాను! ఇదీ వరస! కాపు కార్పోరేషన్ కి వెయ్యి కోట్లు మొదలు మద్యాహ్న బోజన పథకం వరకూ అన్నిటికి తాను సీఎం అయితే ఏం చేస్తారో చెబుతున్నారు కానీ… జగన్ ఇప్పుడు ఏం చేస్తారో చెప్పటం లేదు! మధ్యాహ్న బోజనం మహిళలకు మద్దతుగా వైసీపీ శ్రేణులు నిరసనలు చేయాలని మాట వరసకి కూడా జగన్ చెప్పలేదు!     ఇక ఇప్పుడు పవన్ విషయానికొద్దాం… కర్నూల్ జిల్లాలో క్వారీల్లో మంటలు చెలరేగి కొందరి ప్రాణాలు పోయాయి. కొందరికి గాయాలయ్యాయి. నిజంగా పెద్ద విషాదం. కానీ, అమాంతం అక్కడ వాలిన జనసేనాని పరామర్శ కంటే హంగామా చేశారు. క్వారీల్ని సందర్శించిన ఆయన చనిపోయిన వారి బంధువుల్ని ఓదార్చారు. గాయపడ్డ వార్ని పరామర్శించారు. అంత బాగానే వున్నా కర్నూల్ లో ఎంటరైన ఆయనకు జనసేన కార్యకర్తలు భారీ ఆహ్వానం పలికారు. వాహనాలతో ర్యాలీ చేసి దుమ్ము రేపారు. యధావిధిగా పవర్ స్టార్ కోసం కేరింతలు కొట్టారు! వేలాది జనం మధ్యలో పవన్ చంద్రబాబుపై రెగ్యులర్ విమర్శలు చేసేశారు. అసలు క్వారీల్లో ప్రమాదం వల్ల జనం చనిపోతే రోడ్లపై జనసేన కోలాహలం ఏంటి? పవన్ కే తెలియాలి! తన యాత్రలో భాగంగా ఎలాగూ కర్నూల్ వస్తారు కదా… అప్పుడు హడావిడి చేయవచ్చు కదా? అవతల అభాగ్యుల ప్రాణాలు పోయినప్పుడే పార్టీ ప్రచారం కూడా జరిగిపోవాలా?     పరామర్శకని వచ్చి నినాదాలు, ర్యాలీలు చేయటం పక్కన పెడితే…. క్వారీ దుర్ఘటన గురించి పవన్ ఏమన్నారు? జగన్ మధ్యాహ్న భోజన పథకం గురించి ట్వీట్లు చేసినట్టే ఈయనా సెలవిచ్చారు. అక్రమ క్వారీల్ని మూసివేయకుంటే తమ జనసైనికులే ఆ పని చేస్తారని హెచ్చరించారు! ఇది సీపీఎం, సీపీఐ వారి కమ్యూనిస్టు ఉద్యమాల భాషే తప్ప సమస్యకి ఎంత మాత్రం పరిష్కారం చూపేది కాదు! అక్రమ క్వారీలు , వాటి వల్ల ప్రమాదాలు నిజమే అయితే ఉద్యమానికి శ్రీకారం చుట్టాలి. అంతే కాని, పబ్లిక్ లో నిలబడి చంద్రబాబుని పేరు పెట్టి విమర్శిస్తూ నాలుగు హెచ్చరికలు చేసి వెళ్లిపోతే ఏం లాభం? పాలనలో అపార అనుభవం వున్న బాబు ఇలాంటి తాటాకు చప్పుడు హెచ్చరికలు ఎన్ని విని వుండరు?     మొత్తంగా ప్రతిపక్ష నేతలుగా మీడియాలో చెలామణి అవుతున్న పవన్, జగన్ ఇద్దరూ మరింత బాధ్యతాయుతమైన రాజకీయం చేస్తే బావుంటుంది. సమైక్య రాష్ట్రానికి, నవ్యాంధ్రకి రెండిటికీ సీఎంగా పని చేసిన చంద్రబాబు వీళ్లు ఎంత బాధ్యతా రాహిత్యంగా కామెంట్స్ చేస్తే అంత తేలిగ్గా ఢీకొని ముందుకు వెళ్లిపోతారు. కాబట్టి వైసీపీ అధినేత, జనసేనాని ఇద్దరూ మరింత మెచ్యూర్డ్ గా తమ రోడ్ షోలు, ట్వీట్టర్ షోలు నడిపించాల్సిన అవసరం వుంది! లేదంటే మరోమారు జనం చంద్రబాబుకే జైకొట్టేస్తారు…

ఇవేం ఆరోపణలు జీవీఎల్...

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. రాజకీయాల్లో ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం అనాది సంప్రదాయం. రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు చేయడం కూడా చాలాకాలం నుంచి వస్తున్నదే. అయితే గతంలో ఈ విమర్శలకు,ఈ బురద జల్లుకోవడానికి, ఈ అవినీతి ఆరోపణలకు ఓ నిబద్దత, ఓ నైతికత, ఓ విలువ, ఓ ఆధారం, ఓ సత్యం ఉండేవి. నేటి రాజకీయాలలో అవి కనుమరుగు కావడమే నేటి విషాధం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఆరోపణలు, ఈ విమర‌్శల స్ధాయి దాటి జరుగుతున్నాయి. అంతే కాదు... నిజానిజాలు తెలియకుండా... కనీసం తెలుసుకోకుండా నాయకులు ఎదుటి వారిపై బురదజల్లుతున్నారు. దీంతో వారి మాటలకు విలువ లేకుండా పోతోంది. దీనికి తాజా ఉదాహరణ భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీ.వీ.ఎల్. నరసింహారావు చేసిన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ పని చేస్తున్న ఉన్నతాధికారుల ఖాతాలలో ఏకంగా 59 వేల కోట్ల రూపాయల దాచిందన్న ఆరోపణ. ఇది ఆయన రాజకీయ పరిణితికి ఓ మచ్చుతునక. ఇది ఆయన అవగాహనా లేమికి ఓ పరాకాష్ట. ఇది ఆయన అనుభవానికి ఓ పరీక్ష.     ప్రతి రాష్ట్రంలోనూ ఆయా అధికారుల పేరిట ప్రభుత్వాలు కొన్ని వ్యక్తిగత ఖాతాలు తెరుస్తాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పద్దతి. వీటిని ఇంగ్లీషులో పీడీ అకౌంట్లు అంటారు. వీటిని అన్ని రాష్ట్రాలు అత్యవసర నిధుల గనిగా పేర్కొంటాయి. ఏ రాష్ట్రంలోనైనా పెద్ద ప్రాజెక్టులు నిర్వహించాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు సంబంధించిన కొన్ని అత్యవసర కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చినప్పుడు బ్యాంకుల్లో అధికారుల పేరిట ఉన్న ఈ పీడీ ఖాతాల నుంచి నిధులు వినియోగిస్తారు. రాజ్యసభ సభ్యుడు కూడా అయిన జీ.వీ.ఎల్.నరసింహారావుకు ఇది కూడా తెలియకపోవడం ఆయన అమాయకత్వాన్ని తెలియజేస్తోంది. ఆయన అన్నట్టు ఈ పీడీ ఖాతాలు తెలుగుదేశం కార్యకర్తల పేరు మీద ఉండవు. అధికారుల పేరు మీదే ఉంటాయి. రాష్ట్ర బడ్జెట్‌తో  పాటు మార్గాల ద్వారా వచ్చిన గ్రాంట్లు ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి ఈ నిధులు కూడా అంతమవుతాయి. అలాంటి కీలక సమయంలో పీడీ ఖాతాల్లోని నిధులను ప్రభుత్వాలు వినియోగించడం కద్దు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ పీడీఖాతాల్లోని నిధులను వాడతారన్న విషయాన్ని జీ.వీ.ఎల్.నరసింహారావు తెలుసుకోవడం ఆయనకే ఎంతో మేలు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాజస్ధాన్, గుజరాత్‌ల్లోనే ఈ నిధులను వాడుతున్నారు. రాజస్థాన్‌లో ఏకంగా 34, 613 కోట్ల రూపాయల నిధులను పీడీ ఖాతాల నుంచి వాడారు. దేశంలో ఇదే ఎక్కువగా వాడిన రాష్ట్రం.     ఇక మహారాష్ట్రలో అయితే 21, 605 కోట్లు, తెలంగాణలో 10, 873 కోట్లు, గుజరాత్‌లో 395 కోట్లు, హర్యానాలో 235 కోట్ల రూపాయలు ఈ ఖాతాల్లోంచి వినియోగించారనే విషయం జీ.వీ.ఎల్ గ్రహించాలి. ఆయన ఆరోపిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26, 513 కోట్ల రూపాయలు పీడీ ఖాతాల నుంచి వినియోగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కలను కాగ్ ఈ సంవత్సరమే కాదు... ప్రతి సంవత్సరం ఊటంకిస్తుంది. తెలియంది ఒక్క జీ.వీ.ఎల్.నరసింహారావుకే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తమ రాజ్యసభ సభ్యుడు జీ.వీ.ఎల్. నరసింహారావును ప్రయోగించాలనుకుంటోంది. యుద్ధం పతాక స్ధాయికి చేరినప్పుడు ఆయుధాలను చాలా ఒడుపుగా, నేర్పరితనంతో ప్రయోగించాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. గాలిలో ఖడ్గచాలనం చేస్తే ఒక్కోసారి మన పీక కూడా తెగిపోవచ్చు. ఈ విషయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఎంత త్వరగా తెలుసుకుంటే వారికి మంచిది. లేకపోతే ఇదిగో ఇలా పీకలు తెగిపోయే విమ‌ర్శలు చేసే పార్టీ మనుషులు పుట్టుకొస్తారు.

‘మోదీ సర్కార్-2’ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి!

బీజేపీ ప్రస్తుత కెప్టెన్ అమిత్ షా భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కలిశారు. ఇది పెద్ద వార్తగా నిలవలేదు తెలుగు మీడియాలో. కానీ, షా ఎందుకని ధోనిని కలిశారు? ఈ ప్రశ్నకి జవాబు చాలా ఆసక్తికరం! మరీ ముఖ్యంగా, 2019 లోక్ సభ ఫైట్ కి రెడీ అవుతోన్న టీమ్ మోదీకి ఇండియన్ టీమ్ వికెట్ కీపర్ తో చాలా అవసరమే వుంది!     ధోనిని అమిత్ షా ఊరికే కలవలేదు. సంపర్క్ సే సమర్థన్ అనే ఆలోచనతో అమలవుతోన్న వరుస భేటీల కార్యక్రమంలో భాగంగా కలిశారు. ఇదే మీటింగ్ లలో భాగంగా భారత ఆర్మీ మాజీ చీఫ్ ని, మాధురీ దీక్షిత్, రతన్ టాటా వంటి వార్ని కూడా కలిశారు. తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు రామోజీ రావుని కలిసింది కూడా అందుకే. వ్యాపారం, క్రీడలు, సినిమా… ఇలా అన్ని రంగాల వాళ్లని కలవాలని బీజేపీ భావిస్తోంది. ముఖ్యకమైన పాతిక మంది భారతీయ ప్రముఖుల్ని షా కలుస్తారు. వారికి మోదీ సర్కార్ విజయాల్ని వివరిస్తారు. తద్వారా దేశంలో వచ్చిన మార్పులు, జనాల జీవితాల్లో జరిగిన చేర్పులు అర్థమయయ్యేలా చెబుతారు. షా లాగే బీజేపీలోని నాలుగు వేల మంది పార్టీ నేతలు తమ తమ పరిధిలో ప్రముఖుల్ని కలుస్తారట. ఇలా దాదాపు లక్ష మంది ఫేమస్ ఇండియన్స్ ని బీజేపీ టార్గెట్ చేసింది. వారికి తమ సక్సెస్ ఎక్స్ ప్లెయిన్ చేయటం ద్వారా సామాన్యుల దాకా సమర్థంగా వెళ్లాలని కోరుకుంటోంది!     మన దేశంలో ఇంత కాలం దాదాపుగా కాంగ్రెస్ మార్కు రాజకీయాలే నడిచాయి. దిల్లీ పాలకులు, కాంగ్రెస్ పార్టీ అధినేతలంటే రారాజుల్లా వెలిగిపోయే వారు. ఇప్పటికీ, యాభై ఏళ్లకి దగ్గరగా వచ్చేస్తోన్న  రాహుల్ గాంధీని మన మీడియా యువరాజు అనటానికే ఇష్టపడుతుంది! ఇది తరతరాల రాజకీయ వారసత్వం ఎఫెక్ట్! మరోవైపు మోదీ, షా కొత్త తరం పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వారిద్దరూ తమదైన స్టైల్లో గుజరాతీ బిజినెస్ మైండ్ ప్రదర్శిస్తున్నారు! ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి రిలీజ్ కి సిద్ధంగా వున్న సినిమా కోసం ఆ యూనిట్ సభ్యులు ఎలా ప్రమోషన్స్ లో పాల్గొంటారో…. అలా తమ ‘మోదీ సర్కార్ టూ-2019’ సినిమా కోసం పార్టీ నేతలంతా రంగంలోకి దిగారు!     ఈ విషయం ఎంత వరకూ రాహుల్ గాంధీ గ్రహించారో గానీ ఇప్పటికైతే కాంగ్రెస్ తరుఫు నుంచీ ఎలాంటి ఎత్తుగడలు లేవు. ఒకప్పటి లాగే సినిమా, క్రీడా, వ్యాపార సెలబ్రిటీలు అంటే… తమని వచ్చి కలవాల్సిందే అనుకుంటూ కాలు మీద కాలేసుకుని కూర్చున్నట్టు కనిపిస్తోంది హస్తం వ్యూహం కర్తలు! బీజేపీ సుప్రీమ్ బాస్ తనంత తానే సెలబ్రిటీల ఇంటికి వెళ్లి తమ విజయగాథల్ని మార్కెట్ చేసుకోవటం ఖచ్చితంగా ఇతర పార్టీలు గుర్తించాల్సిన వ్యూహం. కాంగ్రెస్ తో పాటూ ప్రాంతీయ పార్టీలు కూడా మారుతోన్న గేమ్ ని అర్థం చేసుకోవాలి. రూల్స్ మారిపోతున్నాయని గ్రహించాలి. ఇప్పుడు ప్రముఖులకి పార్టీల కంటే పార్టీలకి ప్రముఖులు ముఖ్యమైపోయారు! సినిమా, క్రికెట్ సెలబ్రిటీలు ఒక్కమాట చెబితే చాలా ఓట్లే పడతాయి. చాలా సీట్లపైనే ప్రభావం వుంటుంది. దీన్ని ముందుగానే గ్రహించారు అమిత్ షా. అందుకే కాళ్లకు బలపం కట్టుకుని ప్రముఖుల ఇళ్లకు తిరుగుతూ ఇగోను పక్కన ఇండియా మొత్తం చుట్టేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ , ఇతర ప్రతిపక్షాలు తొందరగా గుర్తించకపోతే నష్టం ఎంతో కొంత తప్పకపోవచ్చు. కారణం… షా తమని కలిసిన వీఐపీలంతా వచ్చే ఎన్నికల్లో కమలానికి మద్దతు పలకకపోవచ్చు. అయినా వారితో కలిసి షా భేటీ అవ్వటమే జనాల్లోకి పాజిటివ్ సిగ్నల్స్ పంపేస్తుంది. గత ఎన్నికల్లో రజినీకాంత్ ఇంటికి మోదీనే స్వయంగా తమిళ స్టైల్లో పంచె కట్టి వెళ్లారు! ఎందుకంటే, ఇందుకే! రజిని బహిరంగ మద్దతు పలకకపోయినా ఫ్యాన్స్ కి ఇండైరెక్ట్ మెసేజ్ వెళ్లిపోయింది!     పాలిటిక్స్ లో సెలబ్రిటీలు స్వంతంగా ఎదగటం చాలా కష్టం. కానీ, వారి ప్రభావం ఓటర్లపై చాలా ఎక్కువ. ఇందుకు మంచి ఉదాహరణ మన అన్నగారు ఎన్టీఆరే! ఆయనకు ఇందిరా గాంధీ తప్పుడు లెక్కలు వేసుకుని రాజ్యసభ టికెట్ ఇవ్వలేదంటారు! అందులో నిజం వుందో లేదో గానీ ఆయన తెలుగు దేశం స్థాపించటం నేడు ఏపీలో కాంగ్రెస్ సున్నా స్థానాలు మిగలటానికి నాంది! అందుకే, ఇండియాలో సెలబ్రిటీ శక్తిని తక్కువగా అంచనా వేయటానికి అస్సలు వీల్లేదు. మరి ఈ సత్యాన్ని గ్రహించి అప్పుడే మార్కెటింగ్ మొదలు పెట్టిన బీజేపీని ఇతర పార్టీలు ఎలా ఢీకొంటాయో? చూడాలి…   

ఇదా చిన్నారుల రక్షణ...?

దేశం ఎక్కడికి పోతోంది. దేశం ఏమై పోతోంది. ప్రభుత్వాలు కళ్లకు గంతలు కట్టుకుని కూర్చున్నాయేటీ...? మానవత్వం మాడి మసైపోతున్నదేమిటీ..? ప్రజా ప్రభుత్వమని చెబుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏలికలో ఈ దారుణాలేమిటీ..? యాదగిరిగుట్ట. పవిత్ర పుణ్యక్ష్రేత్రం. నిత్యం వేలాది మంది భక్తులు ఆ నరసింహస్వామిని దర్శించుకునే పవిత్ర క్షేత్రం. అయితే అక్కడ వెలుగు చూసిన, చూస్తున్న సంఘటనలు మాత్రం రక్తమాంసాలున్న వారినెవ్వరిని నిద్రపోనివ్వడం లేదు. అభం... శుభం... తెలియని చిన్న పిల్లలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. అందుకోసం ఆ నిర్వాహకులు చేస్తున్న అఘాయిత్యాలు అన్నీఇన్నీ కావు. ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయని ఏలికలకు తెలిసినా... వారిలో చలనం ఉండదు.    యాదగిరిగుట్టను తెలంగాణకు తిరుమల చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అక్కడ జరుగుతున్న సంఘటనలకు ఏమని సమాధానం చెబుతారు. పదుల సంఖ్య వ్యభిచార ముఠాలు అక్కడ సంచరిస్తూ చిన్నారుల చేత బలవంతపు వ్యభిచారం చేయించడం ఎంత దారుణం. అక్కడి అఘాయిత్యాలు బయటపడడానికి పోలీసుల పాత్ర ఏమీ లేదు. వ్యభిచార నిర్వాహకులు చేసిన పొరపాటు కారణంగా... వారి నుంచి ఓ అమ్మాయి తప్పించుకుని వచ్చి బయటి ప్రపంచానికి అక్కడి దారుణాలను వెల్లడించింది. అంతే పోలీసులు ఆ ఇళ్లపై దాడులు చేసి పదుల సంఖ్యలో చిన్నారులను కాపాడారు.     యాదగిరిగుట్టలో వెలుగుచూస్తున్న దారుణాలు వింటూంటే... పత్రికల్లో చదువుతూంటే ఎవరికైనా కన్నీళ్లు జలజలా రాలుతాయి. రైల్వే స్టేషన్ల నుంచి, బస్ స్టేషన్ల నుంచి, జాతరల నుంచి చిన్న పిల్లలను ఎత్తుకొచ్చి వారిలో ఎదుగుదల కోసం ఇంజక్షన్లు ఇచ్చి మరీ వారి చేత వ్యభిచారం చేయిస్తున్నారంటే అలాంటి వారిని ఏం చేయాలి. పోలీసుల కళ్ల పడకుండా ఉండేందుకు ఇళ్లల్లో బంకర్లు సైతం ఏర్పాటు చేసుకుని ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారంటే వారికి ఎలాంటి శిక్షలు వేయాలి. ఇలా యాదగిరిగుట్ట వ్యభిచార రొంపిలో చిక్కుకున్న వారు ఒకరు, ఇద్దరు కాదు.... వందకు పైగానే ఉన్నారు. వారంతా ఎక్కడో ఒకచోట నుంచి ఎత్తుకొచ్చిన వారే. ఓ తల్లి తన కూతురు తప్పిపోయిన కొన్నాళ్ల తర్వాత ఈ వ్యభిచార కూపంలో ఆ చిన్నారిని చూసిందంటే ఆ తల్లి ఎంత తల్లడిల్లుతుంది. గతంలో వచ్చిన ఓ సినిమాలో సంఘటనలే ఇక్కడ కనపడుతూండడంతో ఆ తల్లులు, తండ్రుల, బంధువుల మనోవేదనను ఎలా అర్ధం చేసుకోగలం. సమాజంలో ఇలాంటి నీచులు... అది కూడా సాటి ఆడవారే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారంటే వారిని ఏమనాలి. ఎలా శిక్షించాలి.     తల్లీ... మమ్మల్ని క్షమించు అని ఓ మాట అనేస్తే సరిపోతుందా... ? పోనీ మమ్మల్ని శిక్షించు అంటే చాలుతుందా.. ? ముమ్మాటికి చాలదు... ముమ్మాటికి సరిపోదు. యాదగిరిగుట్ట సంఘటనకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావూ.... ఆయన మంత్రివర్గం నైతిక బాధ్యత వహించాలి. ఇంతటి దారుణాలకు ఒడిగడుతున్న వారిని... ఇక ముందు ఇలాంటివి చేయడానికే కాదు... కనీసం ఊహించడానికి కూడా భయపడేలా శిక్ష వేయాలి. అయితే అవన్నీ జరుగుతాయా... మనది ప్రజాస్వామ్య దేశం. ఘనత వహించిన మన చట్టాలు నేరగాళ్లను రక్షించడంలో ముందుంటాయి.     ఇలా అరెస్టు అయిన నేరగాళ్లు అలా బెయిలుపై  విడుదలవుతారు. కొన్నాళ్లు ఈ కేసులు నడుస్తాయి. తర్వాత ప్రజలూ మరచిపోతారు. పోలీసులు కూడా ఇలాంటి కేసులను తర్వాత పట్టించుకోరు. మళ్లీ ఇవే సంఘటనలు జరుగుతాయి. అయితే ఊర్లు మారతాయి... ప్రదేశాలు మారతాయి... నేరగాళ్లు మారతారు.... అభం... శుభం తెలియని చిన్నారులు మారతారు. పాలకులు కూడా మారవచ్చు. మారనివి చట్టాలు.... పోలీసుల నైజం. ఇలాంటి దారుణ వ్యవస్ధ ఉన్నప్పుడు... ఇంతటి నీచపు మనుషులు ఉన్నప్పుడు... సమాజం ఎలా బాగుపడుతుంది. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు.... కుక్కల వలె... నక్కల వలె... సందులలో పందుల వలె... మనదీ ఒక బతుకేనా....మనదీ ఒక సమాజమేనా...!!

ఎన్నికల హోరు.... హమీల జోరు

ప్రారంభమైపోయింది. అగ్గి రాజుకుంటోంది. ఇంకా ఏడాది కాలం ఉన్నా దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి ఊపందుకుంటోంది. దీనికి సంకేతమే కేంద్రంలోనూ.... రాష్ట్రాల్లోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నికల హామీలు గుప్పించేస్తున్నారు. ఇదే అదను...ఓటర్లను మా వైపు తిప్పుకుందుకు అనే కొత్త రాగాలు ఆలపిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఓటర్ల మనసు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓటర్ల కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హీమీల గాలాలు అల్లుకుంటున్నారు. త్వరలో జరుగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో విజయావకాశాలను బట్టి అన్ని పార్టీలు తమ తమ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టె అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తే ఒక విధంగానూ... అనుకూలంగా వస్తే మరో విధంగానూ పావులు కదపాలని బిజేపీ కూడా భావిస్తోంది. ఈ నాలుగు రాప్ట్రాల ఫలితాలపైనా వారి భవితవ్యం ఆధారపడి ఉందని తెలుస్తోంది.     ఈ రాఫ్ట్రాలతో పాటు కేంద్రంలో కూడా అధికారం కోసం ముందుగా భారతీయ జనతా పార్టీ తన కత్తులు నూరుతోంది. ఇందులో భాగంగా రెండు దశాబ్దాలకు పైగా పార్లమెంటులో మూలుగుతున్న బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టింది. కుల రాజకీయాలకు మారుపేరుగా మారిపోయిన భారతదేశంలో బీసీ కులాలను తమ వైపు తిప్పుకుందుకు భారతీయ జనతా పార్టీతో సహా అన్ని పార్టీలు పాచికలు వేస్తున్నాయి. అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి బిజేపీ వారు ముందుగా ఈ ఎత్తుగడకు అవకాశం వచ్చింది. స్వయంగా తానను బీసీ ప్రధానిని అని చెప్పుకుంటున్న నరేంద్రమోదీ తన ప్రభుత్వంలోనే బీసీలకు మేలు జరిగిందని చెప్నుకుందుకు ఇదొక ప్రయత్నంగా భావించాలి. బీసీలు ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఈ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బీసీ ఓట్లను తమ వైపు తిప్పుకునే పన్నాగం ప్రారంభమైంది.     ఇక దేశంలో అత్యంత వెనుక బడిన వర్గాల గుర్తింపు కార్యక్రమానికి కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. ఓబీసీల వర్గీకరణ ప్రారంభించి వారి ఓట్లను కూడా కొల్లగొట్టాలన్నది ఆయన అభిమతం. ఆ పనిని కూడా లాంఛనంగా ప్రారంభించారు ప్రధానమంత్రి. కులాలు సమసిపోవాలని వేదికలపై ఊకదంపుడు ప్రసంగాలు చేసే మన నాయకుల తీరు ఎన్నికల ముందు ఎలా మారుతుందో చెప్పడానికి తాజా సంఘటనలే తార్కాణాలు.     ఎన్నికల తాయిలాలు పంచడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సిద్ధమవుతున్నారు. ఇందులో చాలా ముందున్నది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఈయన మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలోని అన్ని కులాల వారిని మచ్చిక చేసుకుందుకు పాచికలు వేస్తున్నారు. ఇక్కడ హామీలు కూడా కులాల వారీగానే ఉండడం గమనార్హం. చేతి వ్రత్తుల వారికి కొన్ని వరాలు.... ఎస్సీ, ఎస్టీలకు కొన్ని వరాలు గుప్పిస్తున్నారు. తాజాగా జోనల్ వ్యవస్ధను తీసుకువచ్చిన కె.చంద్రశేఖరరావు దాని ద్వారా గ్రామీణ స్ధాయి నుంచే తన పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణాలో పంచాయతీల సంఖ్యను పెంచి... అక్కడ ఒక్కో పంచాయతీకి ఒక్కో కార్యదర్శిని నియమిస్తున్నారు. ఇలా నియమింపబడిన కార్యదర్శలు అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులే అయినా.... అనధికారికంగా మాత్రం " పార్టీ ప్రతినిధులు "గానే పని చేస్తారనేది బహిరంగ రహస్యం. మరోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా హడావుడిగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, సింగరేణిలో కారుణ్య నియమాకాలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ల నియమకం... ఇలా అన్ని రంగాల్లోనూ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీతో యమస్పీడుగా ఉన్నారు. గడచిన నాలుగేళ్లుగా ఇవేమీ గుర్తుకు రాని కల్వకుంట్ల వారికి ఎన్నికల సమయం దగ్గర పడిందని గుర్తు రాగానే రాష్ట్రంలో పెరిగిపోయిన ఉద్యోగ ఖాళీలు గుర్తుకు రావడం ఎన్నికల జిమ్మిక్కుగానే చూడాలి.     ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికార తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పేరుకుపోయిన నిరుద్యోగులను తమ వైపు తిప్పుకునేందుకు వారికి నిరుద్యోగ భ్రతి ప్రకటించింది. నెలకు వెయ్యి రూపాయల వంతు ప్రతి ఒక్క నిరుద్యోగికి ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. దీని ద్వారా రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులు లబ్దిపొందుతారని ప్రాధమికంగా నిర్ణయించారు. అంటే ఈ 12 లక్షల ఓట్లు తెలుగుదేశానికి పడతాయని, వాటితో పాటు వారి వారి కుటుంబాలకు చెందిన ఓట్లు కూడా తమకే వస్తాయన్నది అపర చాణుక్యునిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడి ఆలోచన. ఇంతకు ముందు ఐదు రూపాయలకే అన్న క్యాంటిన్‌లో భోజనం, రెండు రూపాయలకే అల్పాహారం వంటివి ఏర్పాటు చేయడం కూడా ఓట్ల గారడీలో భాగమే. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు లేవు. ప్రత్యేక హోదా వస్తుందని... పరిశ‌్రమలు వస్తాయని... ఉద్యోగాలు లభిస్తాయని కలలు కన్న నిరుద్యోగులకు కేంద్ర చుక్కలు చూపించింది. దీంతో అక్కడ పరిశ‌్రమలు లేక నిరుద్యోగులు చాలా కాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.      నాలుగేళ్ల పాటు భారతీయ జనతా పార్టీతో ఉన్న చంద్రబాబు నాయుడు కూడా నరేంద్ర మోదీ, అమిత్ షాల రాజకీయ చతురత, నయవంచనకు తేరుకోలేకపోతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే యువత ఓటు ఎంతో అవసరమని భావించిన ఆయన నిరుద్యోగులకు ఈ భ్రతి పథకాన్ని ప్రారంభించారు. నిరుపేదల కోసం అన్న క్యాంటిన్లకు శ్రీకారం చుట్టారు. రాజకీయ పార్టీలు చేపడుతున్న పథకాల కారణంగా ఓట్లు రాలతాయి కాని... దేశంలో ప్రగతి కుంటుపడుతుంది. దేశ ప్రజలు ఏ పని చేయడానికి ముందుకు రారు. ప్రభుత్వాలే అన్ని చూసుకుంటున్నాయి కదా... ఇక మన ఏం చేయాల్సిన అవసరం లేదనే ధోరణి వస్తుంది. ఇది వాంఛనీయం కాదు. ఏ దేశ, రాష్ట్రాల ఎదుగుదలకైనా ఆయా దేశాల, రాష్ట్రాలకు చెందిన ప్రజల భాగస్వామ్యం అవసరం. వారి కఠోర శ్రమ అవసరం. అలా కాకుండా వారికి ఉపాధి చూపించకుండా.... బద్దకస్తులుగా చేయడం దేశానికి, రాష్ట్రాలకు మంచిది కాదు. మన రాజకీయ నాయకులకు ఈ విషయం తెలియంది కాదు. అయితే అధికారమనే కుర్చీ కోసం ఇవన్నీ తప్పవేమో... !!!

ఇమ్రాన్ పాక్‌కు రమ్మంటున్నాడు! ఐఎస్ఐ ఇండియాకు పంపుతోంది!

నిన్న మొన్నటి వరకూ కొట్టుకు చచ్చిన ఉత్తర, దక్షిణ కొరియాలు ఇప్పుడు దాదాపు ప్రశాంతంగా వున్నాయి! ఇది ఎవరమైనా ఊహించగలమా? కానీ, కొన్ని సార్లు అనూహ్యం అద్భుతంగా జరిగిపోతుంది! కొరియాల మధ్య కొరివి అలాగే చల్లారిందనుకోవాలి! అయితే, ఆ రెండు దేశాల్లాగే ఇండియా , పాక్ కూడా ఏ రోజుకైనా వివాదాలు మాని స్నేహం చేస్తాయా? స్నేహం సంగతి దేవుడెరుగు… కనీసం యుద్దాలు, రక్తపాతం లేకుండా వుండగలుగుతాయా? ఇది మాత్రం అనుమానమే! ఎందుకంటే, అలాంటి నక్క బుద్ధి పాక్ ప్రదర్శిస్తోంది.     ఆ దేశానికి మనపై వున్నది కేవలం కోపమే కాదు… నక్క తెలివితేటలు కూడా! భారత్ బూచిని చూపి పబ్బం గుడుపుకునే నేతలే ఆ దేశాన్ని పాలిస్తున్నారు. వార్ని ఆ దేశ ఉన్మాద సైన్యం నడిపిస్తోంది! అందుకే, ఈ నెల పదకొండున మరో కొత్త పీఎం వస్తోన్నా… పాక్ తోక మాత్రం వంకరగానే వుంటోంది. ఎంత మాత్రం నీతి, నిజాయితీలు పక్కదేశంలో కనిపించటం లేదు!     ఒక్కసారి చరిత్ర తిరగేస్తే… నెహ్రు నుంచీ మోదీ దాకా మన ప్రధానులు అందరూ పాక్ తో స్నేహం కోసమే ఆరాటపడ్డారు. ఎన్ని సార్లు ఆ దేశం వెన్నుపోటు పొడిచినా మళ్లీ మళ్లీ చర్చలకు ముందుకొచ్చారు. కానీ, అటు వైపు ఏం జరుగుతోంది? పాక్ నిస్సిగ్గుగా ఉగ్రవాదుల్ని మేపి మన మీదకు వదులుతోంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఒకవైపు ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నాడు. తన ఒకప్పటి తోటి ఆటగాళ్లు సిద్దూ, కపిల్ దేవ్, గవాస్కర్ల వంటి వార్ని రమ్మని పిలుస్తున్నాడు. పనిలో పనిగా బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ని కూడా ఆహ్వానించాడు. ఇండియన్ సెలబ్రిటీల మీదున్న ఈ ప్రేమ ఇండియా సైన్యం మీద మాత్రం పాకీలకు వుండదు. వారు ఎంత ఎక్కువ మంది భారత సైన్యాన్ని చంపుదామా అనే ఆలోచిస్తుంటారు! కాశ్మీర్ మాదే అంటూ పాకిస్తాన్ సామాన్య జనాన్ని రెచ్చగొట్టడం… ఇటు ఉగ్ర దాడులతో భారత్ ను దెబ్బతీయటం…ఇదే అక్కడి పాలకుల పని! కాబోయే పీఎం ఇమ్రాన్ కూడా ఇందుకు మినహాయింపు కాదు.      అందుకు నిఘా వర్గాల తాజా రిపోర్టే తార్కాణం! జాతీయ నిఘా విభాగం అందించిన తాజా నివేదికలో భారత్ లో జొరబడటానికి ఆరు వందల మంది టెర్రరిస్టులు రెడీగా వున్నారని పేర్కొన్నారు! ఇండియా ఆ మధ్య సర్జికల్ స్ట్రైక్స్ చేశాక ఇంత పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు సిద్ధం కావటం ఇదే మొదటిసారి! వార్ని ఎలాగోలా ఇండియాలోకి పంపేందుకు పాకిస్తాన్ సైన్యం నిర్వహించే బార్డర్ యాక్షన్ టీమ్ కూడా రెడీ అవుతోందట! సైన్యం మద్దతుతో ప్రధాని అవుతోన్న ఇమ్రాన్ పాలనలో ఇంతకంటే ఎక్కువ ఆశించటానికి ఏం లేదు. అదే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ ఇమ్రాన్ వ్యక్తిగతంగా ఉగ్రవాదుల్ని ఎగదోయకూడదని భావించినా మిలటరీ అతడి పప్పులేం ఉడకనీయదు.   ఇటువంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ చేసే ప్రమాణ స్వీకారానికి సిద్ధూ లాంటి మన రాజకీయ నాయకులు ఎగేసుకుని వెళ్లటం చాలా దారుణమైన విషయం. దీనిపై వారు మళ్లీ ఆలోచించుకోవాలి. కపిల్ దేవ్ ఇప్పటికే భారత ప్రభుత్వంతో మాట్లాడి తన అభిప్రాయం చెబుతానన్నాడు. సిద్ధూ మాత్రం తన మాజీ క్రికెట్ కొలీగ్ ప్రమాణ స్వీకారానికి వెళుతున్నట్టుగా సంతోషంగా ప్రకటించేశాడు. సిద్దూనే కాదు… గతంలో మణిశంకర్ అయ్యర్ లాంటి వారు కూడా ఉత్సాహంగా పాకిస్తాన్ కు వెళ్లి అక్కడ మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం మనకు తెలిసిందే! ఇంతగా దిగజారి రాజకీయం చేయటం దేశ భద్రతకే ముప్పు! ఇలాంటి వారిపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి శత్రు దేశంలో కాలు పెట్టకుండా చూడాలి… 

చట్టసభల్లో రభస ఎవరికి నష్టం.... !?

లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభల్లో కార్యకలాపాలను అడ్డుకుంటే ఎవరికి లాభం...!? ఎవరికి నష్టం....!? ఈ విషయంపై దేశానికే తీవ్ర నష్టమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన చెందారు. పార్లమెంటు సెంట్రల్ హలులో జరిగిన ఉత్తమ పార్లమెంటేరియన్ల అవార్డుల కార్యక్రమంలో పార్లమెంటులో సమావేశాలు జరుగుతున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేసారు. ఉభయ సభలలోను జరుగుతున్న గందరగోళంపై ఆవేదన వ్యక్తం చేసారు. సభలు ఇలా జరిగితే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. దేశంలో నెలకొన్న వివిధ సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలకు నివారణ చర్యలు తీసుకోవాల్సిన చట్టసభలలోనే ఈ గందరగోళాలపై ఆవేదన వ్యక్తం చేసారు. చట్టాలు చేయాల్సిన, వాటిని అమలు పర్చాల్సిన చట్టసభలు ఇలా ఉంటే ఎలా అని మదన పడ్డారు.     ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన, ఆందోళన, విచారం నిర్వేదన వాస్తవమే. కీలక సమయాలలో లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ్యుల ప్రవర్తన ప్రశ్నించాల్సిందే. అయితే వారందరు ఎక్కడి నుంచి వచ్చారు? వారి వారి రాజకీయ పార్టీలు ఏ దేశానికి చెందినవి.  ఆ ప్రజాప్రతినిధులు ఏ దేశ ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రధానాంశం. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు దేశంలో ఏ రాజకీయ పార్టీ చూసినా సగటు భారతీయుడు తలదించుకోవడమే తప్ప, గర్వపడే అంశం ఏదీ లేకుండా పోయింది. వారి వారి స్వప్రయోజనాలు, పార్టీల ప్రయోజనాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్న ప్రజాప్రతినిధులు సభలో ప్రవర్తిస్తున్న తీరు నిజంగా గర్హనీయం. సభ తీరుపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతోనే,  ఆయన కనుసన్నల్లోని పార్టీల ప్రతినిధులు సభలో గందరగోళం రేపుతున్నారు. చీటికీ మాటికీ సభలోని వెల్‌లోకి ప్రవేశించి సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు.     దీనిని ఏ విధంగా చూడాలి. సభలో ఈ ప్రవర్తనను ఎలా పరిగణించాలి. లోక్‌సభ, రాజ్యసభతో పాటు వివిధ రాష్ట్రాల శాసనసభలలో కూడా అధికార, ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన ఇలాగే ఉంటోంది. వివిధ రాష్ట్రాలలో జరిగిన, జరుగుతున్న పరిణామాలను చూస్తే " వీళ్లా మన ప్రతినిధులు" అని వారికి ఓటేసిన ప్రజలు బాధపడే స్థితి వచ్చింది. దీనికి కారణం జాతీయ, ప్రాంతీయ పార్టీలు కాదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నవారి తప్పులను ఎత్తి చూపాలి. అధికార పార్టీ అప్పటి వరకు తాము ఏం చేసామో సభల సాక్షిగా ప్రజలకు వివరించాలి. అలాగే ప్రతిపక్షాలు ఎత్తి చూపే అంశాలపై సానుకూలంగా స్పందించాలి. దేశ చట్టసభలలో గడచిన కొంత కాలంగా ఇవేవీ జరగడంలేదు. దీనికి కారణం ప్రజాప్రతినిధులదా? లేక ప్రజలదా? ప్రతిపక్షాలు తన శాఖపై ప్రశ్నలు సంధించే సమయానికి తాను సభలో లేకపోవాడాన్ని తప్పుగా భావించిన విదేశాలకు చెందిన  మంత్రి ఒకరు తన పదవికి రాజీనామ చేసారని సోషల్ మీడియా ఈ మధ్యనే కోడై కూసింది. అంతటి నైతికత భారత దేశ ప్రజాప్రతినిధులకు ఉంటుందా అన్నదే పెద్ద ప్రశ్న. ఎక్కడో ఓ రైలు ప్రమాదంలో ప్రయాణీకులు మరణిస్తే తన పదవికి రాజనామా చేసిన గొప్ప నాయకులు ఇప్పుడు మనకి ఉన్నారా? గొంగళిలో వెంట్రుకులు ఏరుకుంటున్న ప్రస్తుత భారతదేశంలో చర్చలకు, ప్రజాసంక్షేమానికి, ప్రజల బాగోగులకు బాధ్యత వహించే నాయకులు కనబడతారా? ఇవేవీ తన పార్టీలోనే లేనప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేయడం నాటకీయ పరిణామంగానే పరిగణించాలి.     సభల్లో గందగోళం ఏర్పడడానికి... లేదూ అలా చేయడానికి తెలుగు రాష్ట్రాలు ముందంజలోనే ఉంటాయి. దీనికి తాజా ఉదాహరణ... తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ సభ్యులిద్దరి ప్రవర్తన. ఓ అంశంపై నిరసన తెలియజేస్తున్న సమయంలో ఆ ఇద్దరు సభ్యలు స్పీకర్‌పైకి మైకుని విసిరిన తీరు తెలంగాణ సమాజం తలదించుకోనేలా చేసింది. తామ కావాలని స్పీకర్‌పైకి మైకు విసరలేదని, అది అలా జరిగిపోయిందని వారి వాదన. దీనికి ప్రభుత్వం స్పందించిన తీరు కూడా మరీ ఎక్కువగా ఉంది. ఆ సభ్యులను ఏకంగా వారి పదవీ కాలమంతా సస్పెండ్ చేశారు. రెండు నియోజకవర్గాల ప్రజలు ఎన్నుకున్న సభ్యుల్ని ఇలా పూర్తిగా సభ నుంచి వెలి వేయడం ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించడం కాదా...!? ఈ అంశంపై కోర్టు చివాట్లు పెట్టే వరకూ ప్రభుత్వం వెళ్లిందంటే ఏలికలకు ప్రజాస్వామ్యం పట్లా.. న్యాయస్ధానం పట్ల ఎంతటి గౌరవం ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి సంఘటనలకు ఒక్క తెలంగాణ మాత్రమే పరిమితం కాదు.... తమిళనాడు... కర్నాటక... ఉత్తరాది రాష్ట్రాలలోనూ ప్రతి శాసనసభలోనూ జరుగుతున్నది. ముందు అధికార పక్షంలో ఉన్న సంయమనం పాటించడం నేర్చుకుంటే ఆ తర్వాత ప్రతిపక్షాలు వారి దారిలోకి వస్తాయి. అడ్డదారిలో బిల్లులకు ఆమోదం తెలపడం... తద్వారా తమ అధికారాన్ని ప్రదర్శించడం వంటివి మానుకుంటే సభలు ప్రశాంతంగా... సవ్యంగా.... ఆదర్శప్రాయంగా జరుగుతాయి. లేకపోతే ఇదిగో ఇలాగే బాధ పడడమే మిగులుతుంది. అధికార దర్పం కోసం వివిధ రాజకీయ పార్టీలు సభల్లో ప్రవర్తిస్తున్న తీరును మార్చుకోవాలి. మార్చుకోకపోతే వారు ఎలా మారాలో ప్రజలే చెబుతారు. వారి చేతిలో వీరిని మార్చే బ్రహ్మస్త్రం ఓటు ఉంది. అదొక్కటి చాలు.... రాజకీయ నేతల్ని మార్చడానికి....

సోషల్ మీడియా సాక్షిగా … మనల్ని వెక్కిరిస్తున్న కికి కిరికిరి!

రాష్ట్రంలో ఒకవైపు గ్రీన్ ఛాలెంజ్ నడుస్తోంది. రాష్ట్ర మంత్రులు మొదలు సినిమా సెలబ్రిటీల వరకూ మొక్కలు నాటి సవాళ్లు విసురుతున్నారు. ఒకర్ని చూసి ఒకరు పచ్చదనం పెంచే మంచి పని చేస్తున్నారు! కేటీఆర్, మహేష్ బాబు లాంటి వారు ఛాలెంజ్ కు సై అనటంతో మీడియాలో కోలాహలం బాగానే వుంది! అయితే, సాక్షాత్తూ ప్రధాని మోదీ ఆ మధ్య ఫిట్ నెస్ ఛాలెంజ్ స్వీకరించారు! విరాట్ కోహ్లీ ఇచ్చిన సవాలుని తీసుకుని ఆయన ఎక్సర్సైజులు , యోగాసనాలు వంటివి చేసి వీడియో అప్ లోడ్ చేశారు. అయితే, ఆయన కర్ణాటక సీఎం కుమారస్వామిని నామినేట్ చేయటం కొంత గొడవకు దారితీసింది! కానీ, ఏ విధంగా చూసినా ఫిట్ నెస్ ఛాలెంజ్ లు, గ్రీన్ ఛాలెంజ్ లు మంచివే! హానికరమైతే అస్సలు కావు! సోషల్ మీడియా వచ్చేసి ఇప్పుడు ఏదైనా వైరల్ అయిపోతోంది. తాను చేసే పని వైరల్ ఎఫెక్ట్ కలదని ఒక్కోసారి సదరు వ్యక్తికే తెలియకపోవచ్చు కూడా! అలా తయారైంది నెట్ ప్రపంచం! ఫేస్బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్… ఇలా బోలెడు వేదికలు ఇప్పుడు జనాన్ని ప్రపంచంతో కనెక్ట్ చేస్తున్నాయి! అయితే, అదే సమయంలో నానా రచ్చకి కూడా పదే పదే కారణం అవుతున్నాయి! అటువంటి కిరికిరి వ్యవహారమే కికి ఛాలెంజ్!     ఏంటి ఈ కికి ఛాలెంజ్ ? దాని సంగతి తరువాతగానీ… ముందసలు ఈ ఛాలెంజ్ వల్ల పోలీసుల దృష్టిలో పడ్డది ఎవరో తెలుసా? సౌతిండియాలో కాస్తో కూస్తో పేరున్న రెజీనా, అదా శర్మా లాంటి సినిమా సెలబ్రిటీలు! ఈ హీరోయిన్స్ కి సోషల్ మీడియాలో కొన్ని లక్షల మంది ఫాలోయింగ్ వుంటుంది. అయినా వీరు నిర్లక్ష్యంగా కికి ఛాలెంజ్ అంటూ తిక్క పనులు చేశారు. నడుస్తున్న కార్ లోంచి దూకి… నాలుగు గెంతులు గెంతి ఎగిరొచ్చి కార్లో కూర్చున్నారు! ఇదేనట… కికి ఛాలెంజ్!     నడుస్తున్న వాహనంలోంచి కిందకు దూకడం ప్రాణంతకం! ఇది కూడా తెలియదా మన సెలబ్రిటీలకు? పైగా అదొక ఛాలెంజ్ అంటూ ప్రచారం చేసి మరోకర్ని రొచ్చులోకి లాగటం! ఏమైనా బుద్దున్న పనేనా? అసలు ఈ కికి కిరికిరి సహజంగానే వెస్టన్ కంట్రీస్ లో మొదలైంది. అక్కడున్న షిగ్గీ అనే ఓ కమెడియన్ రోడ్డు పక్కన డ్యాన్స్ చేసి… దానికి కికి ఛాలెంజ్ అనే పేరు పెట్టి ఇన్ స్టాగ్రామ్ లో వదిలాడు. కికి అతగాడి మాజీ గాళ్ ఫ్రెండ్ పేరు! అయితే, ఆ కమెడియన్ కార్ లోంచి దూకలేదు. ఊరికెనే డ్యాన్స్ చేశాడు. కానీ, ఆ కికి చాలెంజ్ ను చూసిన కొందరు పని లేని టీనేజర్లుకు అందులో కిక్ యాడ్ చేద్దామనిపించింది! అదుగో ఆ పైత్యం నుంచీ మొదలైందే కార్లోంచి కిందకు దిగి డ్యాన్స్ లు ఆడి మళ్లీ ఎక్కడం! ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో ఈ కికి దెబ్బకి చాలా మందికి దెబ్బలు తగిలాయి. కార్లోంచి దిగేటప్పుడో, ఎక్కేటప్పుడో కిందపడుతున్నారు. మెదడు వంటి అంగాలకు దెబ్బలు తగిలి ఠపా కడుతున్నారు కూడా!       తెల్లోళ్లు ఏం చేస్తే అది చేయాలని తపించిపోయే ఇండియన్స్ … మరీ ముఖ్యంగా కొందరు సెలబ్రిటీలు ఇప్పుడు కికి అంటూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. వీరు వెనకా ముందు ఆలోచించకుండా కార్లోంచి దూకి డ్యాన్స్ చేసి మళ్లీ ఎగిరొచ్చి లోపల కూర్చుంటున్నారు. దాన్ని చూసి చాలా వరకూ టీనేజర్లు తామూ ప్రయత్నిస్తున్నారట. టీనేజ్ వాళ్లే ఇలాంటి పనులు చేయటానికి కారణం వారిలో వుండే డోపమైన్ అనే హార్మోన్ కారణమట! అది టీనేజ్ లో ఎక్కువగా విడుదల అవుతుండటంతో ఎక్కడలేని ఉత్సాహం, అతి విశ్వాసం కలుగుతాయట. వాటి కారణంగా కదిలే కార్ లోంచి దూకినా తమకు ఏమీ కాదని భావిస్తారని సైకాలజిస్టులు చెబుతున్నారు. అంతే కాక ఇలాంటి తాత్కాలిక దుస్సాహసలు చేసి తాము ప్రత్యేకం అని నిరూపించుకునే తొందర కూడా వారిలో వుంటుందట!     ఈ కికి ఛాలెంజ్ కొత్తగా వచ్చిందేమో కానీ… చాలా మందికి ట్రైన్లలో, బస్సుల్లో ఫుట్ బోర్డ్ పైన టీనేజర్లు చేసే విన్యాసాలు మామూలే! కదులుతున్న ట్రైన్ల నుంచీ బయటకు దూకి తిరిగి ఎక్కుతుంటారు కొందరు యువకులు! వారి దృష్టిలో అదో పెద్ద ప్రపంచం విజయం! ఇలాంటివి పేరెంట్స్ జాగ్రత్త పడకపోతే ప్రాణాలు మీదకు వచ్చే అవకాశాలు పుష్కలం. కేవలం పిలల్ని కనేసి, వారికి డబ్బులు ఇచ్చేసి రోడ్లపై వదిలేస్తే కికి ఛాలెంజ్ కాకపోతే మరోటి రానే వస్తుంది. బలి తీసుకుని వెళ్లిపోతుంది. తరువాత తల్లిదండ్రులు ఎంత ఏడ్చినా వృథా! అందుకే, సోషల్ మీడియా ప్రభావం నుంచీ, సెలబ్రిటీలు చేసే పిచ్చి పిచ్చి ఛాలెంజ్ ల నుంచీ ఎవరి పిల్లల్ని వారే కాపాడుకోవాలి. ముందసలు పెద్దలు సోషల్ మీడియా, సెలబ్రిటీల ఆకర్షణ నుంచీ బయటపడాలి. తమ టీనేజర్లకి, యూత్ కి ఏది చేస్తే మంచో, ఏది కాదో, ఏది అనవసరమో, ఏది ప్రాణంతకమో వివరించాలి. అదొక్కటే కికి లాంటి కిరికిరీలకు పరిష్కారం! 

జనాభా గణన సహేతుకమేనా...!?

  కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేస్తున్న విన్యాసాలు దేశ ప్రజలను, రాజకీయ పార్టీలనూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. జాతీయ పౌరుల రిజస్టర్ (ఎన్ఆర్‌సీ) పేరుతో ఆసోంలో జరుగుతున్న జన గణన విమర్శలకు దారి తీస్తోంది. రాజకీయ ప్రయోజనాల కోసమే భారతీయ జనాత పార్టీ ఈ గణన చేపట్టిందని సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఆసోంలో చేపట్టిన ఈ జాతీయ పౌరుల రిజష్టర్‌లో ఏకంగా 40 లక్షల మంది ప్రజల జీవితాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దశాబ్దాల కాలంగా ఆసోంలో నివసిస్తున్న వారి స్థానికత ఇప్పుడు ప్రశ్నార్దకం అయ్యింది. వీరంతా పొరుగు దేశానికి చెందిన వారని, అక్కడి నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అనుమానిస్తోంది.      ఈ అనుమానలే జాతీయ పౌరుల రిజస్టర్ రూపకల్పనకు అంకురమైంది. ఆసోంలో జరుగుతున్న ఈ జాతీయ పౌరులరిజస్టర్ పై సర్వాత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది దేశంలో మైనార్టీలు, హిందువులు, బెంగాలీలు, బిహారీలకు సంబంధించిన సమస్యగా ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఆసోంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన 40 లక్షల మంది ప్రజానీకం ఇప్పుడు దేశంలో శరాణార్దులుగా మారారా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికల ముందు పనికి వచ్చిన వారు ఇప్పుడు హఠాత్తుగా పనికి రాకుండాపోయారా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యంగా ఆసోం పొరుగు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరుగుతున్నారు. ఈ కొత్త జాతీయ పౌరుల రిజస్టర్ తో దేశంలో అంతర్‌యుద్ధం, రక్తపాతం జరుగుతుందని మమతా దీదీ హెచ్చరిస్తున్నారు. నిజానికి రాష్ట్రాలలో జనాభా గణన అనేది ఆయా రాష్ట్రాలు నిర్వాహించాలి. అది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. కాని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ జనాభా గణనను తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. తెలంగాణలో బిసీ కులాల గణనను ఈ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టింది.     జాతీయ పౌరుల రిజస్టర్ అనే పేరుతో జనాభా గణనను జాతీయ స్థాయి పరిధిలోకి తీసుకు వచ్చి కేంద్రం కొత్త ఆచారాలకు తెర తీస్తోంది. ముఖ‌్యంగా సరిహద్దు రాష్ట్రాలపై తమ చూపును కేంద్రీకరిస్తునట్లు తెలుస్తోంది. భారత... బంగ్లాదేశ్‌ల సరిహద్దు రాష్ట్రమైన ఆసోంలో ఈ జనాభా గణన ప్రారంభించిన బిజేపి దీన్ని ఇతర రాష్ట్రాలకు వ్యాపింప చేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే దేశంలో పలు సరిహద్దు రాష్ట్రాలలో ఈ జాతీయ పౌరుల రిజస్టర్ పేరుతో మరింత గందరగోళం తలెత్తే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది దేశానికి అంత మంచిది కాదు. ప్రజలను గణన పేరుతో విభజించడాన్ని ఎవరూ హర్షించరు.  దీనిపై భారతీయ జనతా పార్టీ నాయకులు పునరాలోచించాల్సిన అవసరం ఉంది. దీనిపై సమీక్షించాల్సిన అవసరమూ ఉంది.      ఎన్నికలకు ఏడాది గడువున్న ఈ సమయంలో ఇలాంటి చిల్లరమల్లర పనులతో భారతీయ జనతా పార్టీ తన గొయ్యి తానే తవ్వుకుంటున్నట్లుగా ఉంది. లేకపోతే ఇన్నాళ్లూ లేని ఈ కొత్త గణన ఇప్పుడెందుకొచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇద్దరూ తీసుకుంటున్న నిర్ణయాలలో 90 శాతం ప్రజలు తిరస్కరించినవే. అంతే కాదు... ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నవే. అందులో ప్రధానమైనవి నోట్ల రద్దు, జిఎస్టి. వీటి కారణంగా సామాన్యులు రోడ్డున పడ్డారు. చిన్న వ్యాపారులు దిక్కుతోచని వారయ్యారు. ఇప్పుడు మళ్లీ  ఈ జనాభా గణన పేరుతో కొత్త చిక్కులకు శ్రీకారం చుడితే అది భారతీయ జనతా పార్టీకి ఆత్మహత్యాసద్రశ్యమే అవుతుంది. దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్న ఇలాంటి నిర్ణయానికి ఆ నేతల ద్వయం స్వస్తి పలుకుతారో... లేక నియంత్రత్వ ధోరణితో ముందుకు వెళ్తారో చేడాలి...!?  

అసోంలో అగ్గి… పార్లమెంట్లో పొగలు!

మన రాజకీయ నేతల అసలు స్వరూపం నిజమైన సమస్యలొచ్చినప్పుడే బయటపడుతుంది! ప్రస్తుతం పార్లమెంట్ ను కుదిపేస్తోన్న అసోం పౌరసత్వ ముసాయిదా జాబితానే ఇందుకు మంచి ఉదాహరణ! స్వతంత్రం వచ్చినప్పటి నుంచీ బాంగ్లాదేశ్ తో వున్న సరిహద్దు రేఖ వెంట సంక్షోభం ముదురుతూనే వుంది. అదిప్పుడు పాకాన పడింది. సుప్రీమ్ కలుగజేసుకుని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) తయారు చేయమని ఆదేశించింది. మంచికో, చెడుకో ప్రస్తుతం అసోంలో వున్న బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తోంది. తనకు దశాబ్దాలపాటూ అధికారం ఇస్తే ఏమీ చేయని కాంగ్రెస్ ఇప్పుడు సెక్యులర్ వీరావేశం ప్రదర్శిస్తోంది. మరోవైపు మోదీకి నేనే తగిన ప్రత్యర్థినని ఫీలయ్యే మమతా బెనర్జీ ఆవేశంతో ఊగిపోతోంది. దేశ సార్వభౌమత్వం, భద్రతా ఏమైపోయినా తమ ఓట్ల లెక్కలు తామే వేసుకుంటున్నారు అన్ని పార్టీల వారు! కేవలం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మమతా బెనర్జీలు కొన్ని గంటల వ్యవధిలో మాట్లాడిన మాటలు చూస్తే ఎవరి బాధ్యతా రాహిత్యం ఎంత వుందో తెలిసిపోతుంది!     ఇంతకీ… ఎన్ఆర్సీ అంటే ఏంటి? భారతదేశం బ్రిటీషర్ల చేతి నుంచీ విముక్తి పొందిన తరువాత మూడు ముక్కలైంది. ఒకవైపు పాకిస్తాన్ ఏర్పడగా, మరోవైపు బెంగాల్ ను చీల్చి తూర్పు పాకిస్తాన్ గా వదిలేసి వెళ్లారు తెల్లవాళ్లు. తరువాత అదే తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా మారింది. కానీ, అప్పటి నుంచీ నిరంతరం సరిహద్దు వెంట బంగ్లాదేశీయులు ఇండియాలోకి వచ్చేస్తూనే వున్నారు. పాకిస్తాన్ వెంట మనకున్న బార్డర్ లాగా బంగ్లాదేశ్ వైపున గట్టి భద్రత వుండదు. నెహ్రు కాలం నుంచీ మన్మోహన్ దాకా ఏనాడూ అక్రమంగా భారత్ లోకి వస్తోన్న బంగ్లాదేశీయుల్ని ఎవ్వరూ అడ్డుకోలేదు. వాజ్ పేయ్ కాలంలో ఆడ్వాణీ కాస్త ప్రయత్నించారు. కానీ, తమ ఓట్ల కోసం బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారిని మరే ఇతర దిల్లీ పాలకులు అడ్డుకోలేదు. ముఖ్యంగా, అసొంలో కాంగ్రెస్ కు అండగా వుంటారన్న ఆశతో అక్రమ బంగ్లాదేశీయుల్ని యధేచ్ఛగా రానిచ్చింది హస్తం పార్టీ. ఇప్పుడదే అసోంలోని అనేక వర్గాల ప్రజలకి తీవ్ర సమస్యగా మారింది…     కాంగ్రెస్ సెక్యులర్ మార్కు మైనార్టీ రాజకీయం ఎలాంటిదో బీజేపీ హిందూత్వ ఎజెండా కూడా అలాంటిదే. ఇది కొత్తదేం కాదు. అసోంలో హిందూత్వ శక్తుల్ని ఏకం చేస్తూ కమలం రాజకీయం నడిపి ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. అయితే, సుప్రీమ్ అదేశంతో నిజమైన అసామీలు ఎవరూ, అక్రమ బంగ్లాదేశీయులు ఎవరూ అనే తేల్చే పనిలో పడింది. ఇది ఎప్పుడో కాంగ్రెస్ పాలకులు చేసి వుంటే ఇంత సమస్య వచ్చేది కాదు. కానీ, వారు చేయక కాషాయ పార్టీ రంగంలోకి దిగటంతో ఇప్పుడు వివాదాలు రాజుకుంటున్నాయి. దాదాపు నలభై లక్షల మంది పౌరులు కాదని తేల్చింది ముసాయిదా జాబితా. వీరిలో మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ కుటుంబీకులు కూడా వున్నారు. ఇంకా ఒక ఎమ్మెల్యేతో సహా చాలా మందే వున్నారు. మోదీ సర్కార్ కానీ , సుప్రీమ్ కోర్టు కానీ ఈ ముసాయిదా జాబితేనే ఫైనల్ కాదని చెబుతున్నప్పటికీ కాంగ్రెస్, టీఎంసీ వంటి పక్షాలు దొరికిన అవకాశాన్ని పార్లెమెంట్లో రచ్చకి విచ్చలవిడిగా వాడుకుంటున్నాయి!     అసోం పౌరసత్వ జాబితా వివాదంపై రాజ్యసభలో మాట్లాడిన బీజేపి అధ్యక్షుడు షా తనదైన స్టైల్లో కామెంట్లు చేశారు. నలభై లక్షల మందిలో వున్న అక్రమ బంగ్లాదేశీయుల పై మన పార్టీలకు, నేతలకు ఎందుకంత ప్రేమ అంటూ రాజకీయ పంచ్ లు వేశారు. దీనికి రెచ్చిపోయిన ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటూ వస్తున్నాయి. ఇంతలోనే ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ మరింత దారుణమైన కామెంట్లు చేసింది. తనను తాను మోదీ తరువాత ప్రధాని అభ్యర్థిగా జనం ముందుకు తెచ్చుకునే ఆవేశంలో వున్న ఆమె అసోం పౌరసత్వ జాబి లేదా ఎన్ఆర్సీ వల్ల  అంతర్యుద్ధం వస్తుందని తేల్చేసింది. రక్తపాతం తప్పదని పేర్కొంది. ఇది ఎంత బాధ్యతారాహిత్యం? మమతా బెనర్జీ లాంటి ఒక అతి పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీమ్ పర్యవేక్షణలో జరుగుతోన్న పనిని తప్పుబట్టడం… పైగా పౌర యుద్ధం, రక్తపాతం లాంటి పదాలు వాడటం చాలా ప్రమాదకరం! దాని వల్ల జాబితాలో చోటు దక్కని చాలా వరకూ ముస్లిమ్ లైన వారు హింసకు దిగితే ఎవరిది బాధ్యత? అలాగే, ఆమె మాటలు ఆదేశాలుగా తీసుకుని తృణమూల్ శ్రేణులు అరాచకాలు చేస్తే పరిస్థితి ఏంటి? అవన్నీ మమతా బెనర్జీ ఆలోచించే స్థితిలో లేరు. బీజేపీ బెంగాల్లో పునాదులు వేసుకుంటోంది. కాబట్టి అక్కడి ముస్లిమ్ ఓట్లు ఆమెకు ముఖ్యం. అందుకే, సెక్యులర్ వీరావేశం ప్రదర్శిస్తున్నారు. జాబితాలో చోటు దక్కని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ఎంత చెప్పినా వినటం లేదు! సుప్రీమ్ కోర్టు పర్యవేక్షణ వున్నా కూడా మమతా బెనర్జీ లాంటి వారు బీజేపిని చూసి అనుమానించటం ఆపటం లేదు!     నిజంగా ఒక్కసారి ఈ అసోం పౌరసత్వ జాబితా సంగతి చూస్తే మన దృష్టికి వచ్చేది ఆ రాష్ట్ర స్థానిక తెగలు, బెంగాలీలకు నడుమ జరిగి నిత్య సంఘర్షణ. అది పైకి కనిపించినంత హిందూ, ముస్లిమ్ గొడవ కాదు. అసోం స్థానికులు బెంగాలీల్ని దశాబ్దాలుగా వ్యతిరేకిస్తారు. ఎలాగైతే మరాఠీలు హిందీ మాట్లాడేవారిని తరమాలని భావిస్తారో అలాగే అసామీలకు బెంగాలీలంటే పడదు. వారు బెంగాల్ వారైనా కావచ్చు, బంగ్లాదేశీయులైనా కావచ్చు. ఇది గమనించి కూడా యథేచ్ఛగా అసోంలోకి వలసల్ని ప్రొత్సహించారు గత పాలకులు. ఇప్పటికైనా సుప్రీమ్ నేతృత్వంలో అసోం ప్రభుత్వం నిజాలు నిగ్గుతేలుస్తుంటే ప్రతిపక్షాలు అడ్డు పడకపోవటం మంచిది. బీజేపీ హిందూత్వ ఎజెండాపై అనుమానాలుంటే, పేద ముస్లిమ్ లు నష్టపోతారనుకుంటే సభలో చర్చించటం ఉత్తమం. అంతే కానీ, మమత బెనర్జీ లాంటి సీఎంలే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వివాదాన్ని ముదిరేలా చేస్తే ఏ ఉపయోగం వుండదు. జాతీయ భద్రతకే ముప్పుగా మారుతుంది. అందుకే దీనిపై అన్ని పక్షాల నేతలు సంయమనం పాటించాలి. పాటించని వార్ని జనం ఓ కంట గమనించి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలి… 

రచ్చకెక్కుతున్న రిజర్వేషన్లు....

బడుగు, బలహీన వర్గాలు, దళితులు గిరిపుత్రుల ఆర్ధిక, సామాజిక ఎదుగుదల కోసం దేశంలో రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించారు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. నిమ్న కులాలను, వారు అనుభవిస్తున్న కష్టాలను స్వయంగా అనుభవించిన అంబేద్కర్... వీటికి పరిష్కారం రిజర్వేషన్ల కల్పనే అని నిర్ధారించారు. అందుకే భారత రాజ్యంగంలో ఈ రిజర్వేషన్ల అంశాన్ని పొందుపరిచారు. దేశంలో అన్నీ రాష్ట్రాలలోను ఆయా కులాల జనాభాన్ని బట్టి రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించారు. దేశంలో ఉద్యోగ, విద్య రంగాలలో ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని నిబంధనలు విధించారు. ఈ రిజర్వేషన్ల వల్ల దేశంలో దళితులు, గిరిజనులు,  బడుగు బలహీన వర్గాల వారు అన్ని విధాల పైకి రావాలని ఆనాడు అంబేద్కర్ భావించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకూ ఈ రిజర్వేషన్ల అమలు పటిష్టంగానే జరిగింది. ఒకటి రెండు సార్లు పొరపాట్లు జరిగినా అవి పెద్దగా పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదు.     దేశంలో నానాటికి మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న ఆర్ధిక అవసరాల నిమిత్తం కొన్ని కులాలు ఈ రిజర్వేషన్లను తమకూ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయ్. ఈ డిమాండ్ దేశంలో అలా... అలా అన్ని రాష్ట్రాలకు,  అనేక కులాలకు పాకింది. ఉత్తారాది అని లేదు, దక్షిణాది అని లేదు...... ఈ రాష్ట్రం అని, ఆ రాష్ట్రం అని లేదు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోను అనేక కులాలలోను ఈ రిజర్వేషన్ల చిచ్చు దావానంలా చుట్టేసింది. ఓ తుపానులా చుట్టుముట్టింది. ఈ రిజర్వేషన్ల రావణకాష్టం నానాటికీ పెరుగుతోందే తప్ప తగ్గే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం దేశంలో ఆర్ధిక అసమానతలు నానాటికి పెరుగుతున్నాయి. డబ్బున్న వారు మరింత ఆస్తి పరులవుతున్నారు. నిరుపేదలు నానాటికి దిగజారుతున్నారు. ఈ ఆర్ధిక వ్యత్యాసంతో వివిధ కులాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి ఏకైక సంజీవిని రిజర్వేషన్లే అని ఆయా కులాల వారు నిశ్చయానికి వచ్చేసారు.     మహారాష్ట్రలో మరాఠాలు విద్య,  ఉపాధి రంగాలలో తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించాలంటూ రోడ్డెక్కారు. ఇది నానాటికి పెరుగుతోంది. ఇంతవరకూ కులాలకు మాత్రమే పరిమితమైన ఈ రిజర్వేషన్ ప్రక్రియ మరాఠాల ఉద్యమంతో కొత్త రూపు సంతరించుకుంది. కులాలకు మాత్రమే ఇన్నాళ్లూ పరిమితమైన రిజర్వేషన్లు ఇప్పుడు ప్రాంతాలకూ, వర్గాలకూ కూడా పాకడం శోచనీయం. మరాఠాలు, తమకు అన్నీ రంగాలలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది సహేతుకం కాని డిమాండ్ అని కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. దీంతో గడచిన కొన్ని రోజులుగా మహారాష్ట్ర అట్టుడుకుతోంది. వేలాదిమంది మరాఠీలు తమ డిమాండ్ సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఇది కాస్తా భగ్గుమంది. మహారాష్ట్రలోని పూణే, నాసిక్‌లతో పాటు అనేక చోట్ల మరాఠాలు ఉన్న చోట విధ్వంసం చెలరేగుతోంది. ఆత్మహత్యలకూ పాల్పడుతున్న  వైనం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉద్యమానికి రాజకీయ ప్రయోజనాలు ఆశించే వివిధ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఇదీ ఏమంత మంచిది కాదు. ఇలా ప్రాంతాల వారీగా రిజర్వేషన్లంటే దేశంలో అన్నీ రాష్ట్రాలలోను ఇలాంటి ఆందోళనలు ప్రారంభమవుతాయి.     తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోను ఈ రిజర్వేషన్ల సెగ రాజుకుంది. కాపు కులస్థులకు రిజర్వేషన్లు ఇవ్వడంపై రాజకీయ పార్టీలు పిల్లిమొగ్గలు వేస్తున్నాయ్. ఇంతకు ముందు కాపులకు రిజర్వేషన్లపై సంసిద్ధత వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా యూటర్న్ తీసుకుంది. రిజర్వేషన్లు కేంద్రం పరిధిలోనివని,  తాను రిజర్వేషన్లపై హామీ ఇవ్వలేనంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహాన రెడ్డి ప్రకటించారు. దీంతో ఆయన సెల్ఫ్ గోల్ చేసారని అధికారపక్షం ఆనంద పడుతోంది. కాపులు మాత్రం జగన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఇలా దేశంలో రిజర్వేషన్ల అంశంపై ప్రతీ రాష్ట్రంలోనూ, దేశంలో ఏదో ఒక మూల వివాదం చెలరేగుతూనే ఉంది.     ప్రతి కులాన్ని ఓటర్లుగా మాత్రమే పరిగణించే రాజకీయ పార్టీలు ఆ వైఖరి విడనాడాలి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం, ఎన్నికల్లో విజయం కోసం అసాధ్యమైన హామీలను ఇస్తే ప్రజలలో ఓ గందరగోళం ఏర్పడుతుంది. దీన్ని నివారించటానికి రాజకీయ పార్టీలు చర్యలు తీసుకోవాలి. రిజర్వేషన్లపై రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలని,  అడ్డూ అదుపు లేని హామీలు ఇవ్వడం అంత మంచిది కాదు. దీనిపై ప్రతి రాజకీయ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. రిజర్వేషన్లంటే పేదల అభ్యున్నతికి,  బడుగు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనుల అభ్యున్నతికి ఉపయోగపడేవే తప్ప... ఓట్లు రాల్చేవి కావని గ్రహించాలి. అప్పుడే దేశంలో ఈ రిజర్వేషన్లపై అనవసరపు గందరగోళానికి తెర పడుతుంది.

అమ్మ ఆగ్రహించింది

అమ్మకు కోపం వచ్చింది. అమ్మకు ఆగ్రహం వచ్చింది. అమ్మకు ఆవేదన కలిగింది. తెలంగాణ ప్రజల ఆది దేవత, గ్రామ దేవత మహంకాళి అమ్మ వారు తన జాతరలో జరిగిన... జరుగుతున్న తప్పులపై తన గళాన్ని విప్పారు. ప్రతి ఏటా సికింద్రాబాద్‌లోని మహంకాళి ఆలయంలో మహంకాళి అమ్మవారి ఆలయంలో సంప్రదాయంగా జరిగే భవిష్యవాణి కార్యక్రమంలో ఈసారి తెలంగాణ సర్కార్‌కు రుచించే అంశాలేవీ అమ్మవారు చెప్పలేదు. భవిష్యవాణి వినిపించే అవివాహిత స్వర్ణలత మాటలు స్వయంగా అమ్మవారు చెప్పిన మాటలుగానే తెలంగాణలో పరిగణిస్తారు.     ఆ మాటలకు ప్రభుత్వం కాని, ప్రజలు కాని ఎంతో విలువ ఇస్తారు. ప్రతి ఏటా ఈ భవిష్య వాణి రంగంలో అమ్మవారు చాలా అంశాలను వివరణ వంటి భరోసా ఇస్తారు. నేనున్నారా.... మీకేమీ కాదు... నే చూసుకుంటా అంటూ ధైర్యం ఇస్తారు. ఎన్నో దశాబ్దాలుగా ఇలాగే జరుగుతోంది. ఇది సంప్రదాయపు భక్తికి నిర్వచనం. ఇది సంప్రదాయపు ఆచారానికి గీటురాయి. ఇది సంప్రదాయపు నమ్మకాలకు ఓ ఆలంబన. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మహంకాళి జాతర అనంతరం ఆ మర్నాడు జరిగే రంగం కార్యక్రమం పూర్తి అయ్యింది. అయితే ఈసారి మాత్రం కాసింత భిన్నంగా... ఓకింత ఆశ్చర్యంగా అమ్మవారు భవిష్యవాణి చెప్పారు అమ్మ వారి రూపంలో ఉన్న స్వర్ణలత.      ఈ పలుకులు సర్కారు వారికే కాదు... ప్రజలకు కూడా కొత్తగానే ఉన్నాయి. భవిష్యవాణిలో అమ్మ వారు ఏమన్నా అది శిలాశాసనంగా భావించే ప్రజలు సోమవారం నాటి అమ్మవారి ప్రతి స్పందనతో నిశ్చేష్టులయ్యారు. తన వద్దకు వచ్చే భక్తులు ప్రతి సారీ ఎంతో ఆనందంగా వస్తారని, తనను దర్శించుకున్న అనంతరం ఓ అద్భుత అనుభూతితో ఇళ్లకు వెళ్తారని భవిష్యవాణిలో అమ్మ వారు చెప్పేవారు. అయితే ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా తన భక్తుల కళ్లలో ఆనందాన్ని తాను చూడలేదని, సంతోషం స్ధానంలో వారి ముఖాలలో దుఖం గూడు కట్టుకుందని భవిష్యవాణిలో వినిపించారు స్వర్ణలత. అంతే కాదు... తనకు ముక్కుపుడక ఇచ్చిన వారినే కాదని... యావత్తు ప్రజలందరినీ కాపాడుతానని చెప్పారు. ఇటీవల విజయవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముక్కుపుడక సమర్పించి తెలంగాణ రాష్ట్ర మొక్కు తీర్చుకున్నారు.     భవిష్యవాణి తన వ్యాఖ్యల ద్వారా తనకు తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలూ అనే తేడా ఉండదని, అందరిని ఓ తల్లిలా అక్కున చేర్చకుంటానని చెప్పారు. అంతే కాదు... ముక్కుపుడక ఇచ్చినంత మాత్రానా తాను అది తెచ్చిన వారిని మాత్రమే కరుణించనని చెప్పకనే చెప్పారు.  భవిష్యవాణి వాక్కులను స్వయంగా దేవత వాక్కులుగానే పరిగణించే... ఇన్నాళ్లూ పరిగణించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఇప్పుడు ఈ వ్యాఖ్యలను కూడా అలాగే చూడాలి. అలా చూస్తే తాను ఎక్కడో తప్పు చేసినట్లుగానే భావించాలి. నిజానికి ఉగాది సందర్భంగా జరిగే పంచాగ శ్రవణాలు... ఇలా జాతరల సందర్భంలో వచ్చే పూనకాలు వంటివి ప్రభుత్వాలకు అనుకూలంగే చెబుతాయి. అధికారంలో ఉన్న వారి ప్రభ వెలిగిపోతుందని, భారీగా వర్షాలు కురిసి రాష్ట్రంలో పుష్కలంగా పంటలు పండుతాయని పంచాగ శ్రవణంలో ప్రవచించడం పరిపాటి. ఈ పంచాగ శ్రవణం చేసే వారు అధికారంలో ఉన్న వారిని ప్రసన్నం చేసుకుందుకు అనేక విషయాలు వారికి అనుకూలంగా చెప్పడం కద్దు.     కాని బోనాల సందర్భంగా చెప్పే భవిష్యవాణిలో మాత్రం ఇంత వరకూ ఇలాంటి రాజకీయ, ప్రభుత్వ వ్యతిరేక అంశాలను చెప్పిన దాఖలాలు లేవు. తాను ఎప్పుడూ న్యాయం పక్షానే ఉంటానని చెప్పిన భవిష్యవాణి నర్మంగర్భంగా తెలంగాణలో న్యాయం జరగడం లేదనే అంశాన్ని చెప్పారు. అంతే కాదు... తనకు బంగారు బోనం సమర్పించడం ఒకింత ఆనందమే అయినా... రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. అంటే బంగారు బోనాలతోనూ.... వజ్రాల ముక్కు పుడకలతోనూ ప్రజలను ఏమార్చినట్లుగా తనను ఏమార్చలేరని అమ్మవారి రూపంలోని స్వర్ణలత చెప్పారు. మాయ మాటల మరాఠి గారడీలు తన వద్ద చెల్లుబాటు కావని అమ్మవారు తన భవిష్యవాణిలో చెప్పకనే చెప్పారు.     మొత్తానికి తెలంగాణలో మహంకాళి జాతరలో ప్రధాన ఘట్టం  భవిష్యవాణి ప్రతిపక్షాలకు ఓ కొత్త ఆయుధం. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి దొరికిన అద్భుత అవకాశం. ఇక తెలంగాణలో ప్రతిపక్షాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పాలన పట్ల దేవుళ్లకే వ్యతిరేకత ఉందంటూ ప్రచారం చేసుకోవచ్చు. సాక్షాత్తూ అమ్మ వారే తెరసా ప్రభుత్వాన్ని తిట్టారంటూ హోరెత్తించవచ్చు. మొత్తానికి మహంకాళి అమ్మవారి భవిష్యవాణి ఎవరి భవిష్యత్ ఎలా ఉందో నర్మగర్భంగా చెప్పిందనుకోవాలా... !?