పాకిస్తాన్లో అశాంతికి మూల్యం చెల్లిస్తున్న భారత్

  రెండు నెలల క్రితం పాకిస్తానీ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ వద్ద భారత సరిహద్దులలోకి జొరబడి ఇద్దరు భారత జవాన్లను క్రూరంగా చంపడమే కాకుండా, వారిలో హేమంత్ అనే ఒక సైనికుడి తల నరికి తీసుకుపోయినప్పుడు మన జాతీయ రాజకీయపార్టీలన్నీ చాలా హడావుడి చేసాయి. కానీ, ఆ తరువాత ఆ సంగతిని పక్కన పడేసారు. మళ్ళీ మొన్న ఉగ్రవాదులు ఏకంగా మన సైనికుల శిభిరం మీదనే దాడి జరిపి ఐదుగురు సైనికులను పొట్టన బెట్టుకొన్నారు. మళ్ళీ మన రాజకీయ పార్టీలు అంతే హాడావుడి చేసాయి.   మన పార్లమెంటు మీద దాడికేసులో అఫ్జల్ గురూను ఉరితీయడాన్ని ఖండిస్తూ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఈ నెల 14న ఏకగ్రీవ తీర్మానం చేసింది. అంతే గాకుండా, అతని శవాన్ని అతని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని మరొక తీర్మానం కూడా చేసింది.   మన దేశం మీద దాడిచేసే ఉగ్రవాదులను తన గడ్డపై అనుమతించడమే కాకుండా, వారి దాడిలో అనేక మంది అమాయకులయిన ప్రజలను ప్రాణాలు కోల్పోతుంటే, అటువంటి వారిని పట్టుకొని దండించకపోగా, వారికి ఆశ్రయం కూడా ఇస్తూ, తిరిగి భారత్ ను తప్పు పడుతోంది. గత మూడు దశాబ్దాలలో పాకిస్తాన్ దుశ్చర్యలు నానాటికీ పెరుగుతున్నాయే తప్ప, ఎన్నడూ తగ్గుముఖం పట్టలేదు. భారత్ ఆ దేశంతో ఎంత సంయమనంగా ప్రవర్తిస్తున్నపటికీ, దానిని అలుసుగా తీసుకొని పాకిస్తాన్ పదే పదే ఇటువంటి కవ్వింపు చర్యలకు ప్రయత్నిస్తోంది.   భారత్ లో జరిగిన ప్రతీ ఉగ్రవాద దాడికీ మూలాలు పాకిస్తాన్ లో ఉండటం, ఇక్కడ దాడులకు పాల్పడిన వారు నేరుగా ఆ దేశానికి పారిపోయి అక్కడ నిర్భయంగా ప్రజల మధ్య సంచరించడం వంటివి గమనిస్తే, పాకిస్తాన్ కి మన దేశంపట్ల ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో స్పష్టం అవుతుంది.   నిన్న జరిగిన పార్లమెంటు సమావేశాలలో ఉభయ సభలు కూడా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఖండిస్తూ, భారత్ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించాయి. అంతే కాకుండా, ప్రస్తుతం పాకిస్తాన్ అధీనంలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీరు కూడా భారతదేశానిదేనని ఏకగ్రీవ తీర్మానం చేసాయి. పాకిస్తాన్ మన కాశ్మీరులో కొంత భాగం ఆక్రమించుకొన్న తరువాత కూడా అవకాశం దొరికినపుడల్లా అంతర్జాతీయ వేదికల మీద కాశ్మీర్ సమస్యను లేవనెత్తే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ, ఇంతవరకూ దానిని ఖండించడంతోనే సరిపెడుతున్న భారత్, మొట్టమొదటిసారిగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మాదేనని నిర్ద్వందంగా ప్రకటన చేయడం ఆ దేశానికి ఒక హెచ్చరిక వంటిది. అయితే, ఇటువంటి హెచ్చరికలకు భయపడితే అది పాకిస్తాన్ దేశం ఎందుకవుతుంది? మాటకు మాట ఇచ్చేందుకు ఎన్నడూ వెనుకాడని పాకిస్తాన్ త్వరలోనే భారత పార్లమెంటు చేసిన తీర్మానాన్ని ఖండిస్తూ మరో తీర్మానం చేయవచ్చును.   వీటివల్ల ఉభయ దేశాలకు ఒరిగేదేమీ లేకపోయినా, అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాలు మరింత చెడుతాయి. పాకిస్తాన్ కు కూడా ఆసంగతి బాగానే తెలిసినప్పటికీ, నాటికి ఆ దేశంలో క్షీణిస్తున్న పరిస్థితుల నుండి ప్రజల దృష్టి మళ్ళించి తాత్కాలిక ఉపశమనం పొందేందుకు ఇటువంటి చవకబారు ప్రయత్నాలు చేస్తుంది.   ఒకవైపు తాలిబాన్లు బాంబులు పేల్చుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తుంటే, మరో వైపు ఆ తాలిబాన్లను వేటాడే మిషతో అమెరికా తన డ్రోన్ విమానాలతో పాక్ ప్రజల మీద బాంబుల వర్షం కురిపిస్తోంది. అయినా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ప్రభుత్వాధీనంలో ఉండవలసిన సైనికాధికారులే ప్రభుత్వాన్ని తమ కనుసన్నలలో నడిపిస్తున్నారు. అవినీతికి, అసమర్ధతకు మారుపేరుగా మారిన ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు వీదులకేక్కి నిరసనలు తెలియజేయడం అక్కడ నిత్య కృత్యంగా మారిపోయింది. నానాటికి పెరుగుతున్న ద్రవ్యోల్భణం, దిగజారుతున్న ప్రజల జీవన పరిమాణాలు అన్నీ కలిపి ఆదేశాన్ని 'అశాంతి నిలయం'గా మార్చాయి. ఈ సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్ళించేందుకు భారతదేశాన్నిబూచిగా చూపిస్తూ పాకిస్తాన్ చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలకు భారత్ మూల్యం చెల్లించుకోవలసి రావడం చాల విచారకరం.  

మజ్లిస్ కూడా కాంగ్రెస్ పార్టీకి (అ)విశ్వాసం ప్రకటిస్తోందా?

  మజ్లిస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీతో తలాక్ చెప్పుకొని బయటపడిన తరువాత తంతే బూరెల గంపలో పడినట్లు వెళ్లి జైల్లో పడ్డారు. బూరెలో గంపలో పడితే బూరెలు తినే అవకాశం ఉన్నట్లే, జైల్లో పడితే తమ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రచారం, వివిధ టీవీ చానళ్ళలో ఇంటర్వ్యూలు, ప్రస్తుతం ఎన్నికలు లేవు గానీ ఉండి ఉంటే సానుభూతి ఓట్లు కూడా జలజలా రాలిపోయేవి.   అధికార హస్తం పట్టుకొని తిరిగినంతకాలం సాక్షాత్ కలెక్టరు మీద చేయిచేసుకొన్నాపట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, తమ చేయి వీడిన మరుక్షణమే బీ.సీ.నాటి కేసులన్నీ తిరగదోడించి మరీ ఎండకన్నెరుగని తమని నిర్దాక్షిణ్యంగా జైల్లో వేయించిందని పళ్ళు కొరుకొన్న ఒవైసీ సోదరులకు, కిరణ్ కుమార్ రెడ్డి పై పగ తీర్చుకొనేందుకు నేడు ఒక అపూర్వమయిన అవకాశం వచ్చి ఒళ్లో వాలితే, దానిని వదులుకొంటారని ఎవరూ భావించరు.   కానీ, ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ కిరణ్ కుమార్ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో విఫలమయింది కనుక అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని అంటూనే, తాము ప్రతిపక్షాలు పెడుతున్న అవిశ్వాసానికి మద్దతు తెలుపుతాము కానీ దాని వల్ల ప్రభుత్వంపై ఏ ప్రభావం ఉండబోదు గనుక తాము వోటింగులో మాత్రం పాల్గొనమని చెప్పారు.   రాష్ట్రంలో మునిగిపోనున్న కాంగ్రెస్ పడవలోంచి ముందు జాగ్రత్తగా బయటకి దూకేసిన మజ్లిస్ పార్టీ, జైల్లో ఉన్నపటికీ జగనే మంచోడు అంటూ ఆ పార్టీవైపు నాలుగు రాళ్ళు విసిరి చూసింది. దానికి అటునుండి ‘నిశబ్దంగా జవాబు’ వచ్చింది కూడా. అంటే ఒవైసీ సోదరులు విద్వేష ప్రసంగాలు చేసినప్పుడు అన్నిపార్టీలు విమర్శలు గుప్పిస్తే, వైకాపా మాత్రం నిశబ్దంగా సమర్దించింది. ఒవైసీ సోదరులు కోర్టులు జైళ్ళ చుట్టూ తిరుగుతూ ఆపసోపాలు పడుతుంటే ఎవరూ పట్టించుకోనప్పుడు కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీని వీడిన వారికి ఈ చిత్ర హింసలు తప్పవు అంటూ తమ అనుభవాలని వారితో పంచుకొంటూ సానుభూతి చూపించింది.   భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొని ఎన్నికలలో పోటీచేసే ఆలోచనలున్న మజ్లిస్ పార్టీ, మరిప్పుడు వైకాపా పెడుతున్న అవిశ్వాసానికి ఎందుకు మద్దతు ఈయడంలేదో, కాంగ్రెస్ ప్రభుత్వం పై పగ తీర్చుకొనే అపూర్వ అవకాశాన్ని ఎందుకు ఒదులుకొంటోందో అని ధర్మ సందేహాలకు మూడు జవాబులు కనిపిస్తాయి.   1. కాంగ్రెస్ పార్టీ చేతిలో చేయేసుకొని తిరిగితే ఎంత సుఖమో, ఆ చేయి వదిలితే అంత కష్టమని అనుభవ పూర్వకంగా తెలుసుకొన్న ఒవైసీ సోదరులు వెంటనే కాకపోయినా, ఎన్నికల లోపు ఎప్పుడయినా తిరిగి కాంగ్రెస్ హస్తం అందుకొనే ఆలోచనలో ఉండవచ్చును. అందువల్ల కిరణ్ ప్రభుత్వానికి బ్యాడ్ కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చినా, అవిశ్వాసం మాత్రం చూపలేదు. మరి అందుకేనేమో కిరణ్ కుమార్ రెడ్డి కూడా మజ్లిస్ నేతలను మళ్ళీ ఎన్నడూ ఒక్క మాట కూడా అనలేదు.   2. జైల్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి విడుదల కాకమునుపే వెళ్లి వాటేసుకోవడం కంటే, ఒకవేళ అతను విడుదల అయితే అప్పుడే వాటేసుకొని దండలు కూడా వేయొచ్చును. లేకుంటే ఏ తెలుగుదేశం పార్టీ వెనుకో పోయినట్లయితే మరే ఇబ్బందీ ఉండదు, అని మరో ఆలోచన కూడా ఉండి ఉండవచ్చును.   3. ఒకసారి తొందరపడి ఎదురుదెబ్బలు తిన్నారు గనుక, ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేయకుండా, ఎన్నికల వరకు ఓపికపడితే అప్పటి పరిస్థితులను బట్టి ఏదో ఒక పార్టీని ఆశ్రయించడమో, లేక పరిస్థితులు అనుకూలిస్తే ముందే ప్రతిజ్ఞ చేసినట్లు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయవచ్చునని ఆలోచనతోనే ప్రస్తుతం అవిశ్వాసానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకొని ఉంటారు. మొత్తం మీద ప్రతిపక్షాలన్నీ అవిశ్వాసంలోనే విశ్వాసం కూడా ఉందని నిరూపించుతున్నాయి.

కాంగ్రెస్ సిగ్నల్స్ పట్టించుకోని కేసీఆర్

  అడగందే అమ్మయినా అన్నం పెట్టదనట్లు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అడగకుండా తెలంగాణా ఎందుకు ఇస్తుంది? తెలంగాణా ఉద్యమాలు పతాక స్థాయికి చేరినప్పుడు తెలంగాణా నేతలను చూస్తేనే ఉలికులికి పడిన కాంగ్రెస్ అధిష్టానం, ఇప్పుడు దోశలు, పెసరట్లు అంటూ వెటకారం చేయగలుగుతున్నారంటే అందుకు కారణం ఎన్నికల (అ)జెండాలు, (అ)విశ్వాస తీర్మానాలను వేసుకొన్న ఉద్యమపార్టీ ఊసరవెల్లిలా రంగులు మార్చుకొంటూ క్రమంగా రాజకీయ పార్టీగా మారడమే ప్రధాన కారణమా? లేక ఈ మిషతో తెలంగాణా ఉద్యమాన్నిపక్కదారి పట్టించిన తెరాస అధ్యక్షుడు కే.చంద్రశేకర్ రావు మాటకి ఇక తెలంగాణా ప్రజలలో విలువలేదని వారు గ్రహించడం వలనే ఈ విధంగా మాట్లాడే దైర్యం చేయగలుగుతున్నారా? లేక మరేదయినా బలమయిన కారణాలు ఉన్నాయా?   గులాం నబీ ఆ ‘జాదూ’, హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే పెట్టిన ‘నెలరోజుల్లో తెలంగాణా విడుదల’ను అకస్మాత్తుగా ఆఖరి నిమిషంలో తెర మీద ప్రత్యక్షమయ్యి తన మంత్రం దండంతో ఆపేసిన తరువాత, చెలరేగిపోతారనుకొన్న తెరాస, తెలంగాణా జేయేసీ నేతలు కూడా తమ ఉద్యమ జెండాలు పక్కన పడేసి, ఎన్నికల జెండాలు పట్టుకోవడంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఖంగు తింది.   ఈ లోగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణాపై కొత్త పల్లవి అందుకోవడమే కాకుండా, ఆ పాటతో తెలంగాణా ప్రజలను కూడా బాగానే ఆకట్టుకొన్నారు. ఆయన తెలంగాణాలో పాదయాత్ర మొదలుపెట్టక ముందు ఆయనకు తెలంగాణాలో ఉన్నవ్యతిరేఖత తెలంగాణా పల్లవి అందుకొన్నాక పూర్తిగా మారిపోయింది. తెదేపా తెలంగాణా పల్లవి అందుకోవడంతో తెలంగాణా లో అదృశ్యం అయిపోతుందన్న తెదేపా మళ్ళీ బలపడటమే కాకుండా, సహకార ఎన్నికలలో కూడా విజయం సాదించ గలిగింది. ఆయన పార్టీకి తెలంగాణాలో మద్దతు పెరగడానికి మరో కారణం తెలంగాణా ఉద్యమంపట్ల చిత్త శుద్ధిలేని తెరాస అధినేత కేసీఆరే కారణం అని చెప్పవచ్చును.   ఆయన తెలంగాణా ఉద్యమాన్ని ఏవిధంగా భ్రష్టు పట్టించేడో గమనించిన తెలంగాణా ప్రజలలో చంద్రబాబు పట్ల అవ్యాజమయిన ప్రేమ ఏది లేకపోయినప్పటికీ, మాట నిలకడలేని కేసీఆర్ ను నమ్ముకోవడం కంటే మంచి పరిపాలనాదక్షుడిగా పేరుతెచ్చుకొన్న చంద్రబాబును నమ్ముకోవడమే మేలనే భావన కలగడం వల్లనే ఆయనను తెలంగాణా ప్రజలు ఆదరించారు. తత్ఫలితంగా తెలంగాణా జిల్లాలలో చంద్రబాబుకు, తెలుగు దేశం పార్టీ కి అనూహ్యంగా మద్దతు పెరిగింది.   ఈ పరిణామాలు చూసి మొదట కంగారు పడిన తెరాస నేతలూ, వారి నాయకుడు కేసీఆర్ ‘నైవేద్యం పెడితే మా మహిమ చూపిస్తామనే గ్రామ దేవతల్లాగా,’ మా అభ్యర్ధులను గెలిపిస్తేనే తెలంగాణా సెంటిమెంటు గెలిచినట్లు, లేదంటే మనం ఓడిపోయినట్లే అని ప్రజలకు నచ్చచెప్పుకొని శాసనమండలి ఎన్నికలలో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు బయటపడ్డారు. కేవలం మూడు నాలుగు జిల్లలో పట్టభద్రులకి, ఉపాద్యాయులకే పరిమితమయిన శాసనమండలి ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికలతో సమానంగా భావించి వారందరూ ఎంత చెమటోడ్చినా తాము నిలబెట్టిన ముగ్గురులో ఇద్దరినీ మాత్రమే గెలిపించుకోగలిగారు. ఇదేమంత చెప్పుకోవలసిన విషయం కానప్పటికీ, అది తెలంగాణా ప్రజలలో తెరాస పట్ల పెరుగుతున్న నిరాసక్తతకు ఒక చిన్న ఉదాహరణగా నిలుస్తుంది.   అయినప్పటికీ, ఇంకా పూర్తిగా మేల్కోనని కేసీఆర్ ను చూసి తెరాస కార్యకర్తలే కాకుండా విపక్షాలు కూడా ఆశ్చర్యపోయాయి. ఇక, సాధారణ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే గడువు మిగిలి ఉందని అందరూ భావిస్తున్నపటికీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రాష్ట్రంలో, దేశంలో తనకు అనుకూల వాతావరణం ఏర్పడగానే ఎన్నికలకు వెళ్లాలని ఆత్రంగా ఎదురు చూస్తోంది. దేశంలో మిగిలిన ప్రాంతాల పరిస్థితుల సంగతి ఎలా ఉన్నపటికీ, 42మంది పార్లమెంటు సభ్యులను అందించే మన రాష్ట్రంలో, తమ పార్టీలో కలిసిపోయెందుకు సిద్ధంగా ఉన్న తెరాస, దాని అధినేత కేసీఆర్, వారి ఉద్యమాలు చప్పగా చల్లారిపోవడంతో ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరో వైపు జగన్ మోహన్ రెడ్డి క్రమంగా బలం పుంజుకోవడం గమనించిన కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమయింది. కానీ, అదే విషయాన్నీ నేరుగా కేసీఆర్ తో చెప్పడం అంటే కొరివితో తల గోక్కోవడమేనని తెలుసు గనుక, వాయలార్ రవి చేత ముందుగా ‘తెలంగాణా దోశలు వేయించి’ తెలంగాణా నేతలలో కొంచెం వేడి పుట్టించింది.   గానీ, ఆ వేడి ఏంతో కాలం నిలవకపోవడంతో మళ్ళీ ఇటీవలే హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే చేత ‘తెలంగాణా ఇవ్వడం అంత వీజీ కాదు. ఇస్తే దేశంలో విదర్భ, గూర్ఖా ల్యాండ్ వంటి ప్రత్యెక రాష్ట్ర డిమాండులు మళ్ళీ మేము తలకెత్తుకోలేము. అందువల్ల తెలంగాణా గురించి డెడ్లయిన్ లు, ఆశలు పెట్టుకోవద్దు’ అని మరోమారు తెలంగాణావాదులను గిల్లి చూసారు. కానీ, తెరాస నేతలటువంటి మాటలకి, వెటకారానికి స్పందించడం ఎప్పుడో మానేశారు.   ప్రస్తుతం వారి దృష్టి అంతా రాబోయే ఎన్నికల మీదే ఉంది. శాసన మండలి ఎన్నికలకే చెమటోడ్చవలసివచ్చిన తెరాస వచ్చే సాధారణ ఎన్నికలలో గెలుస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేకపోయినా, ఆ పేరుతొ పార్టీ టికెట్ల కేటాయింపు అనే చాల పెద్ద వ్యవహారంలో ఇప్పుడు తలమునకలయి ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆజాద్, షిండే, వాయలార్ రవి వంటి వారిచేత కాంగ్రెస్ అధిష్టానం నోరు జార్పించినా తెరాస నేతల్లో మాత్రం ఉలుకుపలుకు లేదు.   బహుశః అందువల్లేనేమో నిన్న ముఖ్యమంతి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ తో పోలిస్తే తెరాస, వైకాపాలు చిన్న పార్టీలు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలు అని మరో మారు గిల్లి చూసారు. కానీ, ఇటువంటి మాటలకి ప్రతీసారీ తాత్కాలికంగా స్పందించడమే తప్ప కాంగ్రెస్ అధిష్టానం ఆశిస్తున్న తెలంగాణా వేడి మాత్రం రగలడం లేదు.   తెలంగాణాలో మళ్ళీ కొంచెం వేడి రగిలితే, తెలంగాణాపై ఏదోఒక నిర్దిష్టమయిన ప్రకటన చేసేసి, కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు తెరాసను ‘కాంగ్రెస్ గంగలో కలిపేసుకొని’, తమ ‘చేతిలో చేయేసి’ నడిచేందుకు చొరవ చూపుతున్న జగన్ మోహన్ రెడ్డిని ముందు పెట్టుకొని ‘కుడి ఎడమల డాల్ కత్తులు మెరియగా’ అన్నట్లుగా ఎన్నికలకు వెళ్ళినట్లయితే, ఇక ఏ చంద్రబాబు కూడా తమను ఆపలేడని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, కేంద్రం నుండి కాంగ్రెస్ పంపిస్తున్న ఈ 3జీ సిగ్నల్స్ ను తెరాస అధ్యక్షుడు కేసేఆర్ మరెందుకో సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నట్లు కనిపిస్తోంది.   తెలంగాణా కోసం కాంగ్రెస్ గంగలో మునగడం వల్ల, ఇప్పుడు అనుభవిస్తున్న ఈ రాజభోగం పోగొట్టుకోవడం కంటే, ఎన్నికలలో వీలయినన్ని సీట్లు సంపాదించుకొని అందరితో చెలగాటం ఆడుకోవడమే తమకి ఎక్కువ లాభమని కేసీఆర్ లెక్కలు కేసీఆర్ కు ఉండటం వల్లనే బహుశః కాంగ్రెస్ ప్రసారం చేస్తున్న3జీ సిగ్నల్స్ కూడా ఆయన సరిగ్గా క్యాచ్ చేయడం లేదనుకోవాలి.   మరిప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని ఏవిధంగా గిల్లుతుందోలేక కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణా లో మరొకరిని పైకి తీసుకువస్తుందో చూడాలి.

ప్రతిపక్షాలకు కృతజ్ఞతలు: కాంగ్రెస్

  రాష్ట్రంలో మూడు ప్రధాన ప్రతిపక్షలయిన తెదేపా, తెరాస మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇటీవల కాలంలో ఎదుట పార్టీ వారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కుమ్మకయ్యారనే ఆరోపణలు చేసుకోవడం సర్వసాధారణ విషయం అయిపోయింది. కానీ, ఈ ఆరోపణలపై కాంగ్రెస్ మాత్రం ఇంత వరకు ఎన్నడూ ఖచ్చితంగా స్పందించలేదు. ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న 9 మంది జగన్ మోహన్ రెడ్డి అనుకూల వర్గానికి చెందిన శాసన సభ్యుల అండతోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తుండటం చేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏమి అనలేని నిస్సహాయ స్థితిలో ఉంది.   అటువంటప్పుడు, తెదేపా, తెరాసలు ఒకరిపై మరొకరు తమ పార్టీతో రహస్య ఒప్పందాలు చేసుకొన్నాయని ఆరోపణలు గుప్పించుకొంటున్నపుడు, వారి మద్యలో దూరి భంగపడే బదులు, వారిని ఆవిధంగానే కీచులాడుకోనిస్తేనే తమకు మేలని కాంగ్రెస్ భావించి ఉండవచ్చును. ప్రతిపక్షాల అనైక్యతే తమ పార్టీకి శ్రీరామరక్ష అని కాంగ్రెస్ పార్టీ గ్రహించడం వల్లనే వారి ఈ కీచులాటలలో కలుగజేసుకోకుండా దూరంగా మసులుతోంది.   కాంగ్రెస్ ప్రభుత్వాని కూల్చిపడేస్తామని భీషణ ప్రతిజ్ఞలు చేసిన తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఈ రోజు కిరణ్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఒకేసారి రెండు వేర్వేరు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి, ప్రభుత్వాన్నికూల్చలేదు సరికదా వారే కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రీరామరక్షగా నిలిచారు. ఇక తెలుగు దేశం పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీని ప్రజల మద్య ఎన్ని తిట్లు తిట్టినా, తమ ప్రత్యర్ధ పార్టీలకి ఎట్టి పరిస్థితుల్లో తమవల్ల ప్రయోజనం దక్కకూడదనే ఏకైక ఆలోచనతో అవిశ్వాస తీర్మానానికి దూరంగా ఉంటూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ పార్టీకూడా శ్రీరామరక్షగా నిలిచింది.   ఈ పరిణామాలను బట్టి ప్రతిపక్షాల అనైక్యత కాంగ్రెస్ పార్టీకి ఎంత మేలు చేస్తోందో అర్ధం అవుతుంది. రాబోయే ఎన్నికల సమయంలో కూడా బహుశః ఈ పరిస్థితులే గనుక కొనసాగితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు పేరుపేరునా కృతజ్ఞలు చెప్పుకోక తప్పదు.

ఎవరి అవిశ్వాసం వారిదే

  ఎవరి (అ) విశ్వాసం వారిదే తెరాస అధినేత కేసీఆర్ అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం పెట్టినప్పటి నుండి ఇంతవరకు స్థబ్దుగా ఉన్న రాష్ట్ర రాజకీయాలలో ఒక్కసారిగా చలనం వచ్చింది. ఈ సారి ప్రతిపక్షాలు చేస్తున్న అవిశ్వాస తీర్మాన ఆలోచనలో చాల ప్రత్యేకత ఉంది. సాధారణంగా ప్రతిపక్షాలు అవిశ్వాసం ప్రసక్తి తేగానే ఉలిక్కిపడవలసిన రాష్ట్ర ప్రభుత్వం నిశ్చింతగా తనపని తానూ చేసుకుపోతుంటే, ఆ ప్రతిపాదన తెచ్చిన విపక్షాలు మాత్రం తమలో తాము కీచులాడుకోంటూ ప్రజల ముందూ నవ్వులపాలవుతున్నాయి. అవిశ్వాసం వల్ల తమ ప్రభుత్వం పడిపోతుందని భయపడవలసిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు ప్రతిపక్షాల కీచులాటలు చూసి అవహేళన చేస్తోంది. అయినా ప్రతిపక్షాలు తమ అవిశ్వాస పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నాయి.   ఇక, తాజా వార్తా ఏమిటంటే ఇంతవరకు తెరాస పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని ప్రకటిస్తూ, తెలుగుదేశం పార్టీని నిలదీస్తూ వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, అకస్మాత్తుగా తన వ్యూహం మార్చుకొని, తానే స్వయంగా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకొంది. తెరాస ‘తెలంగాణా అంశం’ ప్రధానంగా చేసుకొని అవిశ్వాస తీర్మానం పెడుతున్నందున, తాము దానికి మద్దతు ఇస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో అది తమకు రాజకీయంగా నష్టం కలిగిస్తుందని ఆ పార్టీ అభిప్రాయపడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. కానీ, ఆ విషయాన్నీ బహిరంగంగా ప్రకటిస్తే తెరాస తమపై యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది గనుక, ప్రధాన ప్రతిపక్షమయిన తెలుగు దేశం పార్టీ తన బాధ్యతలను విస్మరించినందువల్లే తాము ఆ బాధ్యతలు స్వీకరిస్తూ స్వయంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకొన్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీడియాకు చెప్పుకొంటోంది.   అందువల్ల ఈ రోజు తెరాస వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ వేర్వేరుగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నాయి. తత్ఫలితంగా ప్రభుత్వాన్ని పడగొట్టే విషయంలో ఆ రెండు పార్టీలు కూడా చేతులు కలిపే ఆలోచన లేదని స్పష్టం చేసాయి.   గనుక, ఈ అవిశ్వాస తీర్మానాలవల్ల కిరణ్ సర్కార్ కు వచ్చే ప్రమాదం ఏమిలేకపోగా వాటివల్లనే ఆయన ప్రభుత్వం రాజకీయ లబ్దికూడా పొందగలదు కూడా. ఐదు సం.లు పాలించమని ప్రజలు ఎన్నుకొన్న తమ ప్రజా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఈ విధమయిన స్వీయ రాజకీయప్రయోజనాల కోసం అన్యాయంగా పడగొట్టేందుకు విఫలయత్నాలు చేశాయని కిరణ్ సర్కార్ రేపటి నుండి ప్రచారం చేసుకొని ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేయవచ్చును. కానీ, ఐకమత్యం లోపించిన ఆపార్టీ ఈ సదవకాశాన్ని పూర్తిగా ఉపయోగించు కోలేకపోవచ్చును.   ఇక, ఇంతవరకు తెలుగు దేశం పార్టీని అవిశ్వాస తీర్మానంపై నిలదీస్తూ వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెరాస ప్రతిపాదిస్తున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఈయకుండా ఇప్పుడు తాను కూడా వేరేగా అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా, నిజంగా ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసింది.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెపుతున్నట్లు కేవలం రాజకీయ లబ్ధికోసమే ఈ డ్రామాలు ఆడుతునట్లు ఆ రెండు పార్టీలు కూడా ఋజువు చేసాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ మాట వర్తిస్తుంది. నిజంగా ఆపార్టీకి ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనే ఉంటే తెరసాతో చేతులు కలిపి ఆ పని చేసి ఉండాలి. కానీ, శాసన సభలో తన తీర్మానానికి తగిన మద్దతు కూడా లేదని, తన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని తెలిసికూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవడంలోనే ఆ పార్టీకి ఈవిషయంలో చిత్తశుద్ది లేదని నిరూపిస్తోంది.   తెరాస తన అవిశ్వాస తీర్మానం ‘తెలంగాణా అంశం’ పై అని ప్రకటించడం ద్వారా, ప్రధాన ప్రతిపక్షలయిన తెదేపా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ముందే ఒక లక్ష్మణరేఖ గీసి, తనతో చేతులు కలపకుండా జాగ్రత్త పడింది. ‘తెలంగాణా అంశం’ పెడితే ఆ రెండు పార్టీలు తమతో చేతులు కలపవని తెలిసి కూడా తెరాసా ఆవిధంగా చేయడం గమనించినట్లయితే, ఆ పార్టీకి కూడా నిజంగా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పడిపోవడం ఎంత మాత్రం ఇష్టం లేదని అర్ధం అవుతోంది. కేవలం స్వీయ రాజకీయ ప్రయోజనాలకోసమే ఆ పార్టీ ఈ అవిశ్వాస ఆలోచలు చేసినట్లు స్పష్టం అవుతోంది.   ఇక, ఈ రెండు పార్టీల డ్రామాలు,వ్యూహాలను ముందుగానే ఊహించినందువల్లనో లేక ప్రస్తుత పరిస్థితుల్లో కిరణ్ సర్కారును కూల్చడం ఇష్టం లేకనో తెలుగు దేశం పార్టీ మొదటి నుండే ఈ అవిశ్వాస ఆలోచనలకు దూరంగా ఉండిపోయింది. ఇక, ఈ అవిశ్వాస ఆలోచనలు చేసిన తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలే అందరి ముందు నవ్వులుపాలు అవబోతుండగా, వారినిరువురినీ ఎదుర్కొన్న కిరణ్ కుమార్ రెడ్డి దైర్యవంతుడిగా మరో మారు నిరూపించుకోబోతున్నారు.   ఈ రాజకీయ అవిశ్వాస పోరాటాల నుండి చంద్రబాబు నాయుడు క్షేమంగా బయటపడినప్పటికీ ద్వంద ప్రమాణాలు అవలంబిస్తునందున ఆయన నమ్మదగిన వ్యక్తి కాదని విపక్షాలు చేస్తున్న ప్రచారం వలన చాలా అపఖ్యాతి మూట గట్టుకోకతప్పలేదు. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే, ఈ అవిశ్వాస తీర్మానాల వలన కిరణ్ కుమార్ రెడ్డికి ఏమాత్రం నష్టం కలుగకపోగా ఊహించని మేలు జరిగింది. ఆయన చెప్పినట్లు ఇక 2014 ఎన్నికల వరకు ఆయన ప్రభుత్వానికి డోకాలేదని భావించవచ్చును.

‘ఇద్దరు ఇటలీ నావికుల పెరోల్’ ధారావాహికం ప్రారంభం

  కేంద్రంలో యుపీయే ప్రభుత్వానికి ఉన్న సమస్యలు సరిపోవనట్లు ఇప్పుడు కొత్తగా ‘ఇద్దరు ఇటలీ నావికుల పెరోల్’ అనే కొత్త ధారావాహికానికి తెర తీసింది. వారిరువురూ ఇటలీ దేశస్తులు కాకుండా మరే దేశస్తులయినా అయిఉంటే ప్రతిపక్షాలు అంతగా పటించుకొనేవి కావేమో. కానీ, వారు సోనియా గాంధీ మాతృ దేశమయిన ఇటలీకి చెందిన వారు కావవడంతో, ప్రతిపక్షాలు మరింత శ్రద్ధతో పార్లమెంటులో ఈ కధని ముందుకు నడిపిస్తున్నాయి.   ఇంతకీ, ఈ ధారవాహికానికి ఉపోద్ఘాతం ఏమిటంటే, గత సంవత్సరం ఇటలీ దేశానికి చెందిన నావికులు ఇద్దరు కేరళ సమీపంలో చేపలు పడుతున్న మన భారతీయ మత్స్యకారులపై కాల్పులు జరపడంతో ఆ ఇద్దరు మత్స్యకారులు అక్కడికక్కడే చనిపోయారు. భారత సముద్రజలాలో ఈ సంఘటన జరగడంతో వెంటనే మన దేశ నావికాదళం వారు, మన మత్స్యకారుల మరణానికి కారణమయిన ఆ ఇద్దరు ఇటలీ నావికులను బందించి వారిని స్థానిక పోలీసులకి అప్పగించింది.   వారు విదేశీయులయిన కారణంగా ఈ కేసులో మన విదేశీ మంత్రిత్వ శాఖ కూడా వేలు పెట్టక తప్పలేదు. వారిని డిల్లీకి తరలించి పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేసారు. అయితే, వారిరువురూ గత డిశంబరు నెలలో తమ కుటుంబముతో కలిసి క్రిస్మస్ పండుగ చేసుకొని తిరిగివచ్చి కోర్టుకి లొంగిపోతామని కోర్టుకు విన్నవించుకోవడంతో, (విదేశీ మంత్రిత్వ శాఖ కూడా అనుమతి ఇచ్చి ఉండాలి) కోర్టు వారికి అనుమతి మంజూరు చేసింది. వారు చెప్పినట్లే మళ్ళీ వచ్చి కోర్టులో లొంగిపోయారు కూడా.   తమ దేశంలో జరుగుతున్నసాధారణ ఎన్నికలలో ఓటు వేసి వచ్చేందుకు తమకు అనుమతినీయాలని వారిరువురు మళ్ళీ కోర్టుకు వినతిపత్రం ఈయడంతో, వారి సత్ప్రవర్తనను దృష్టిలో ఉంచుకొని కోర్టు వారిరువురికీ గత నెలలో 4 వారాలు పెరోల్ మంజూరు చేసింది.   అయితే, వారు మన నీతి కధలలో చెప్పుకొన్నట్లు ‘దూడకి పాలిచ్చి తిరిగి వచ్చి పులికి ఆహారం అయ్యే గంగిగోవులు’ కారు గనుక ఈ సారి భారత్ గుమ్మం దాటగానే తమ ఇటలీ ప్రభుత్వం ద్వారా వారిక తిరిగి రాబోరని ప్రకటింపజేసారు. మరీ అవసరమయితే అంతర్జాతీయ న్యాయ స్థానంలో కేసు వేసుకోవచ్చునని భారతదేశానికి ఇటలీ ప్రభుత్వం ఒక ఉచిత సలహా కూడా ఇవ్వడంతో ఈ ఇటలీ ధారావాహికం మొదలయింది.   షరా మామూలుగానే, ప్రతిపక్షాలు పార్లమెంటులో అల్లరి చేయడం, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం (సిగ్గు, మొహమాటం పడకుండా)ఎదురుదాడి చేయడం, ఆతరువాత కులాసాగా ఇటలీ దేశానికి తమ తీవ్ర అభ్యంతరాలు తెలియజేశామని చెప్పడం వంటి ఎపిసోడ్స్ అన్ని ఈ ధారావాహికంలో చకచకా పూర్తియిపోయాయి.   అందుబాటులో ఉన్నఇటలీ రాయభారి ‘డానియల్ మంసిని’కీ ఈ విషయంలో గట్టిగా క్లాసు కూడా పీకమని మన యుపీయే ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ, వారు వినకుండా, అసలు మన మత్స్యకారులను మనదేశ సముద్ర జలాలోనే చంపిన విదేశీయులని ఏవిధంగా దేశం విడిచి వెళ్ళనిచ్చేరు? అసలు వారిని ఎవరు వెళ్ళనిచ్చేరు? ఇదే తప్పు మన దేశస్తులు ఇతరదేశాలలో చేసినట్లయితే వారిని అక్కడి ప్రభుత్వాలు కూడా మనలాగే వారికి పూల దండలు వేసి ఘనంగా వీడ్కోలు పలికి సాగనంపుతాయా? అంటూ డిటెక్టివ్ ప్రశ్నలు గుప్పించడం మొదలుపెట్టడంతో, సాధారణంగా ఎన్నడూ పరుషంగా మాట్లాడే అలవాటులేని మన ప్రధాని మన్మోహన్ సింగు వారికి కూడా ఆగ్రహావేశాలు వచ్చేశాయి.   దానితో ఆయన ఇటలీ ప్రభుత్వానికి మరో హెచ్చరిక జారీ చేస్తూ, వెంటనే ‘ఆ ఇద్దరినీ’ వెనక్కు పంపకపోతే 'తీవ్ర పరిణామాలు' ఎదుర్కోవలసి ఉంటుందని తీవ్ర స్వరంతో పార్లమెంటులోనే మృదువుగా హెచ్చరించేసారు కూడా. అయితే, ఆ ‘తీవ్ర పరిణామాలు’ ఏమిటో తెలుసుకోవాలంటే తరువాయి ఎపిసోడ్ వరకు మనం ఎదురు చూడక తప్పదు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెరాసతో డబుల్ గేం ఆడుతోందా?

  రేపటి నుండి మొదలయ్యే శాసనసభ సమావేశాలలో తెరాసా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధం అవుతుంటే, దానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం చాలా నిశ్చింతగా తన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడం ప్రతిపక్షాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.   ఈ రోజు మెహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభమయిన రెవెన్యు సదసు ప్రారంభానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభలో ప్రసంగిస్తూ తానూ ప్రతిపక్షాల బెదిరింపుల భయపడేవాడిని కానని, 5సం.లు పాలించమని ప్రజలు తనకు అధికారం అప్పజేప్పినందున, తమ ప్రభుత్వానికి 2014సం.వరకు ఏ ప్రమాదం లేదని అన్నారు.   బహుశః ఆయన తమ పార్టీలో ఉంటున్న జగన్ మోహన్ రెడ్డి వర్గానికి చెందిన వారుగా ముద్రపడ్డ 9మంది శాసన సభ్యులకు తన ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఓటువేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించి ఆయన లొంగదీసుకొని ఉండవచ్చును. వారు గనుక తన ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఓటు వేయకపోతే, తన ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిలేదని గ్రహించినందునే బహుశః కిరణ్ కుమార్ రెడ్డి ఇంత నిర్భయంగా మాట్లాడగలుగు తున్నారను కోవచ్చును. బహుశః ఆ కారణం వల్లనే ఆ 9 మంది శాసన సభ్యులు ఇంతవరకు మీడియా కంట పడకుండా తప్పించుకొని తిరుగుతున్నారేమో.   అయితే, మరో వైపు వైయస్సార్ కాంగ్రెస్, తెరాసాతో కలిసి అవిశ్వాస తీర్మానంలో పాల్గొంటునపుడు ఆ తొమ్మండుగురు సభ్యులు కాంగ్రెస్ పార్టీను వీడి బయటకి రాకపోయినట్లయితే తెరాసా పెడుతున్న అవిశ్వాస తీర్మానం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఈ సంగతి తెలియకనే వారిరువురూ అవిశ్వాసంపై ముందుకు వెళ్తున్నారని భావించలేము. అంటే, ఆఖరి నిమిషంలో ఆ తొమ్మండుగురు సభ్యులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా ఓటు వేయనయినా వేయాలి.   అలా జరుగలేదంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెరాసాతో డబుల్ గేం ఆడుతోందని భావించాల్సి ఉంటుంది. ఒక వైపు తెరాసతో కలిసి అవిశ్వాస తీర్మానంలో పాల్గొంటూనే మరో వైపు తన తొమ్మండుగురు సభ్యులను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా కూడా కాపాడేందుకు ఆ పార్టీ ఆదేశించి ఉండవచ్చును. బహుశః ఆ కారణం తోనే, వైయస్సార్ కాంగ్రెస్ అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని విస్పుష్టంగా ప్రకటించి ఉండవచ్చును. బహుశః ఆ కారణంతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రభుత్వానికి 2014సం.వరకు ఏ ప్రమాదం లేదని ఈ రోజు కూడా దైర్యంగా చెప్పగలుగుతున్నారు.   ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనుక ఈవిధమయిన అతి తెలివి ప్రదర్శించి తెరాసను మోసం చేసినట్లయితే, అందుకు ఆ పార్టీ తెలంగాణా లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

చంద్రబాబు సరికొత్త వ్యూహం ఫలించేనా?

  నిన్న చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా ఈ సారి ఎన్నికలకి ఆరు నెలలు ముందుగానే అభ్యర్దుల ఎంపిక ప్రక్రియను మొదలుపెడతామని ప్రకటించారు. ఇది తేదేపాకు సరికొత్త ఎత్తుగడగా ఆయన అభివర్ణిస్తున్నపటికీ, ఇటీవల కొంత కాలంగా పార్టీలో పెరుగుతున్న అసంతృప్తినీ, తనకు వ్యతిరేఖంగా తోక జాడిస్తున్న సీనియర్లను, పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ వైపు దూకుతున్న అసంతృప్తి నేతలనూ అందరినీ ఏక కాలంలో తన దారికి తెచ్చుకొనే ప్రయత్నంగానే భావించవచ్చును.   సాధారణంగా రాజకీయపార్టీలు టికెట్లు కేటాయించడం మొదలుపెట్టగానే, సహజంగానే పార్టీలో మళ్ళీ క్రమశిక్షణ, అధిష్టానం పట్ల వినయ విదేయతలు పెల్లుబుకుతాయి. (ఆ కార్యక్రమం తరువాత టికెట్ రాని అభ్యర్ధుల అలకలు, వేరే పార్టీకి వలసలు కూడా సహజమే.) అందువల్ల నిన్న చంద్రబాబు చేసిన ప్రకటనతో పార్టీలో అసమ్మతి చాలా త్వరగా అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయి.   గత ఆరు నెలలుగా ఆయన పార్టీ కార్యాలయానికి దూరంగా తిరుగుతూ చేస్తున్న పాదయాత్రల వల్ల, ఆయన పార్టీ అంతర్గత వ్యవహారాలపై తన దృష్టి కేంద్రీకరించ(లే)క పోవడంతో ఏర్పడిన సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగానే బహుశః ఆయన ఈ ప్రకటన చేసి ఉండవచ్చును. ‘ఎన్నికలకి ఆరు నెలల ముందుగానే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలుపెడతాము,’ అన్న ప్రకటనలో ఆయన ఇచ్చిన ‘టైమింగ్’ కూడా ఉద్దేశపూర్వకంగా పెట్టిందే. ఎందుకంటే, ఆయన పాదయాత్ర ముగిసే సరికి మరో రెండు నెలలయినా పట్టే అవకాశం ఉంది. అంటే మే నెలలో ఆయన పాదయాత్ర ముగించుకొని మళ్ళీ తన కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది.   ఇక ప్రతిపక్షాలవారు ఎంత మధ్యంతర ఎన్నికల ఊహా గానాలు వినిపిస్తున్నపటికీ, కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్యలో లేదా ఇంకా ఆలస్యంగా ఎన్నికలకి వెళ్ళే ప్రయత్నం చేయవచ్చును. ఎందుకంటే, 9 రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు కూడా జరిగే ఆ సమయంలో కాంగ్రెస్ సాధారణ ఎన్నికలకు కూడా వెళ్ళే సాహసం చేయకపోవచ్చును. అంటే చంద్రబాబు తన పాదయాత్ర ముగించుకొని తిరిగి వచ్చే సమయానికి సరిగ్గా ఆరు నెలల సమయం ఉంటుందన్నమాట.   అందువల్ల చంద్రబాబు తిరిగి తానూ పార్టీ కార్యాలయానికి వచ్చిన తరువాత అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని ఆశ చూపడం ద్వారా ఆయన తన పాదయాత్ర సాగుతున్నంత కాలం పార్టీలో పరిస్థితులు అదుపులో ఉంచేందుకు ప్రయత్నించినట్లు కనబడుతోంది. సర్వరోగ నివారిణి అయిన ఈ దివ్యౌషద ప్రభావం త్వరలోనే పార్టీపై తప్పక కనిపిస్తుంది. ఆయన తన పాదయాత్ర ముగించుకొని పార్టీ కార్యాలయానికి తిరిగి వచ్చిన తరువాత పార్టీ పరిస్థితులను తన అదుపులో తెచ్చుకొనే ప్రయత్నాలు ఎలాగు చేస్తారు. కానీ, అంతవరకూ పార్టీని అదుపులో ఉంచడానికి ఇంతకంటే దివ్యౌషదం మరొకటి ఉండదని అనుభవజ్ఞుడయిన చంద్రబాబుకి తెలుసు గనుకనే ఆయన ఈ ‘ఎన్నికలు-అభ్యర్ధుల ఎంపిక’ అనే మందు వాడి ఉంటారు.   ఇక, ఈ ప్రకటన వెనుక ఆయన ఉద్దేశ్యాలు ఏవున్నపటికీ, ఆయన దానిని అమలు చేసినప్పుడు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఏర్పడుతాయి. పార్టీ అభ్యర్ధులను ఆరు నెలలు ముందుగానే ప్రకటించడం వలన, టికెట్ ఇచ్చిన నేతలకే సదరు నియోజక వర్గాల భాద్యతలు అప్పజెప్పడం ద్వారా అక్కడ పార్టీ విజయావకాశాలు పెరగవచ్చును. అదే సమయంలో, తమకు వ్యతిరేఖంగా పనిచేసే అసమ్మతి నేతలను లొంగ దీసుకొనే తిప్పలు కూడా సదరు అభ్యర్ధులే పడక తప్పదు గనుక, చంద్రబాబు తన చేతికి మట్టి అంటకుండా పైపైనుండి పార్టీని పర్యవేక్షిస్తూ ఎన్నికలకు సిద్ధం కావచ్చును.

నరేంద్ర మోడీ చెప్తున్న కొత్త భాష్యాలు

  నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రాన్నిముఖ్యమంత్రిగా పాలిస్తున్న2002 సం.లో ఆ రాష్ట్రంలో జరిగిన దారుణమారణకాండ నేటికీ అయన పాలిట పెను శాపంగా మిగిలిపోయి, దేశానికి ప్రధానిగా చేపట్టగల ఒక మహత్తర అవకాశానికి ఆయనని ఆమడ దూరంలో ఉంచుతోంది. గుజరాత్ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగి, రాష్ట్రాన్ని ప్రగతి పధంలో తీసుకుపోతున్న ఆయన గుజరాత్ రాష్ట్రం బయట కాలుపెడితే చాలు, ఇప్పటికీ నిరసనలు ఎదుర్కోక తప్పడం లేదు. ఆయన చేసిన ఘోర తప్పిదమే ఆయనకు, ఆయన ఉజ్వల భవిష్యత్తుకు మద్య ఒక కనిపించని అడ్డుగోడలా నిలిచి, ఆయన తెలివితేటలకు పరీక్ష పెడుతోందిప్పుడు.   ఆయన ఇప్పుడు ఒక ద్వైదీమానమయిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు నానాటికి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ, ఆయన సమర్ధతకు ప్రపంచ దేశాల ప్రశంసలు. మరో వైపు, ఎక్కడికి వెళితే అక్కడ నిరసనలు, ఆయన రాకకి అభ్యంతరాలు.   ఇటీవల డిల్లీలో శ్రీరాం కాలేజీలో ఆయనను ముఖ్య అతిధిగా ఆహ్వానించినప్పుడు ఆయన చేసిన ప్రసంగంతో లోనున్న విద్యార్ధులు ఎంతో స్పూర్తి పొందగా, అదే కాలేజిలో మరికొందరు విద్యార్దులు బయట నిలబడి ఆయన రాకకు నిరసనలు తెలియజేసారు. ఈ సంఘటన ఆయన ప్రస్తుతం ఎదుర్కొంటున్న వింత పరిస్థితులకి అద్దం పడుతోంది.   ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘వైబ్రాంట్ గుజరాత్ సదస్సు’ కు “పాకిస్తాన్” తో సహా అనేక దేశాల నుంచి వ్యాపార వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు తరలివచ్చి ఆయనను, ఆయన రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచం గుర్తించిందని ఋజువు చేసారు. కానీ, మొన్న అమెరికాలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొనేందుకు ఆయనకు అమెరికా ప్రభుత్వం విసా నిరాకరించడం ఆయనకు చెంప దెబ్బ అయింది. మానవ హక్కులను కాపాడటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనకు వీసా నిరాకరిస్తున్నట్లు అమెరికా తెలియజేసింది. భావి భారత ప్రధాని కావాలని కలలు కంటున్న నరేంద్రమోడీకి ఇది నిజంగా చెంప దెబ్బే అని చెప్పక తప్పదు. అందువల్ల ఆయన అమెరికాకు స్వయంగా వెళ్ళే అవకాశం లేకపోవడంతో, వీడియో కాన్ఫరెన్సు ద్వారా గుజరాత్ రాష్ట్రం నుండే ఆయన అమెరికాలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు.   ఇక ఆయన తన ప్రసంగంలో మొట్టమొదటిసారిగా తన పరిపాలనలో జరిగిన తప్పులు (మారణకాండ) గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘ప్రజలకు సమర్ధమయిన పరిపాలన అందించగలిగితే వారు ప్రభుత్వం చేసిన తప్పులను కూడా క్షమిస్తారు’ అని అన్నారు.   అంటే, తానూ అందిస్తున్న సమర్ధమయిన పాలనతో సంతృప్తి పొందిన ప్రజలు, తనను గెలిపించిడం ద్వారా, వారు ‘తన తప్పులను’క్షమించారని ఆయన ఉద్దేశ్యం కావచ్చును. తనవల్ల నష్టపోయిన ప్రజలే తనను మన్నించి గెలిపించినప్పుడు, అమెరికా వంటి ఇతరదేశాలు ఇంకా తటపటాయించడం ఏమిటని ప్రశ్నించడం కూడా ఆయన ఉద్దేశ్యం కావచ్చును.   కానీ, దాదాపు 1200 మంది ఆమయకులయిన ప్రజల మరణానికి కారకుడని నిందించబడుతున్న ఆయన, కోర్టుల నుండి చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకొని తప్పించుకోవచ్చును కానీ, ప్రజల దృష్టిలో, ముఖ్యంగా ఆ దారుణానికి గురయిన వర్గం దృష్టిలోఆయన ఎన్నటికీ నేరస్తుడిగానే మిగిలిపోతారు.   మంచి వక్తగా పేరున్న నరేంద్ర మోడీ తన వాక్చాతుర్యంతో తన తప్పులను కప్పిపుచ్చుకొని దేశభక్తి పూరితమయిన తన ప్రసంగాలతో ప్రజలను సమ్మోహితులను చేయవచ్చును. కానీ, తానూ స్వహస్తాలతో వ్రాసుకొన్నతన గత చరిత్రను మాత్రం ఆయన ఎన్నటికీ చెరుపుకోలేరు.   ఆయన నోటితోనే ఆయన స్వయంగా ‘ప్రజలకు సమర్ధమయిన పరిపాలన అందించగలిగితే వారు ‘ప్రభుత్వం చేసిన తప్పులను’ కూడా క్షమిస్తారు’ అని చెప్పడం ద్వారా తానూ చేసిన తప్పులను ఆయన పరోక్షంగానయినా అంగీకరించినట్లు అర్ధం అవుతోంది.   అయితే, తన తప్పులకు సవరణలు చేసేబదులు, సదరు వర్గం ప్రజలను తనను క్షమించమని బహిరంగంగా ఆయన కోరిఉంటే, వారు ఆయనను క్షమించేవారేమో! ఒకవేళ వారు క్షమించకపోయినా, ఆయన ఆవిధంగా కోరినందుకు మిగిలిన ప్రజలయినా క్షమించేవారేమో! ఏదిఏమయినపటికీ, ఆయన చేసిన తప్పులే ఆయనకు నేడు శాపాలుగా మారి, ఆయనకు అగ్నిపరీక్షలు పెడుతున్నాయని చెప్పవచ్చును. వాటిని ఆయన అధిగమించి తన ప్రసంగంలో చెప్పినట్లు ‘అన్నిటి కంటే దేశమే మిన్న’ అని ఋజువు చేయగలిగితే ఆయన జన్మ ధన్యం అయినట్లే!

కిరణ్ కుమార్ రెడ్డి కెప్టెన్సీలో అజహరుద్దీన్!

  ఒకనాడు కేవలం సినీపరిశ్రమకు చెందిన నటీనటులు మాత్రమే రాజకీయాలలో చేరేవారు. వారికి గల ప్రజాకర్షణే వారిని అందుకు ప్రోత్సహించేది. కానీ, నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయన్నట్లు, మారిన సామాజిక పరిస్థితుల్లో అన్ని రంగాలకు చెందిన వారు కూడా వివిధ కారణాలతో వివిధ రాజకీయపార్టీలలో ప్రవేశిస్తున్నారు. ఒకవిధంగా ఇది ఆహ్వానించదగ్గ శుభపరిణామమని చెప్పవచ్చును. వివిధ రంగాలపట్ల సరయిన అవగాహనలేని మన రాజకీయ నాయకులకు, వీరి చేరిక వలన ఆయా రంగాలలో ఉండే సమస్యల గురించి, వాటికి పరిష్కార మార్గాలు గురించి కొంత అవగాహన ఏర్పడుతుంది.   ఇక, అసలు కధలోకి వస్తే, ఒకనాటి మేటి క్రికెటర్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ మొరదాబాద్ పార్లమెంటు సభ్యుడు అయిన అజహారుద్దీన్ ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసారు. ఆ తరువాత అజాహారుద్దీన్ మీడియా వారితో మాట్లాడుతూ తను రాష్ట్ర రాజకీయాలలో చేరలనుకొంటున్నట్లు చెప్పారు. కానీ, ముఖ్యమంత్రిని మాత్రం 'ఆపని మీద' కలువలేదని కేవలం ఆయనను పలుకరించి వద్దామనే కలిశానని అన్నారు. మరో ప్రశ్నకు బదులిస్తూ, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మద్య ఏర్పడిన విబేధాల గురించి తనకు తెలియదని చెప్పారు. అజహారుద్దీన్ ‘కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన చాలా బాగుందని’ ఒక సర్టిఫికేట్ కూడా జారీ చేశారు.   మజ్లిస్ కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయిన తరువాత, ముస్లిం వర్గానికి చెందిన అజాహారుద్దీన్ వంటి ఒక ప్రసిద్దమయిన వ్యక్తి జాతీయ కాంగ్రెస్ నుండి రాష్ట్రీయ కాంగ్రెస్ వైపు చూడటం కిరణ్ కుమార్ రెడ్డి కి సంతోషం కలిగించే విషయం కాగా, మజ్లిస్ పార్టీని దూరం చేసుకొన్నరాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి సమయంలో చేరడంవల్లనే తనకు ఓ ప్రాముఖ్యత ఏర్పరడుతుందని ఆయన భావిన్చడం వల్లనే రాష్ట్ర రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నట్లు భావించవచ్చును. మజ్లిస్ తమను విడిచి వెళ్ళిపోయిన తరువాత, తమ పార్టీ రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంకు కొంత మేరయినా కోల్పోయమని అర్ధం చేసుకొన్నపటికీ, చేసుకొన్నరాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం రాజకీయాలలోచాలా సహజమయిన విషయమే.   ఇప్పుడు అజహారుద్దీన్ రాకవల్ల పోగొట్టుకొన్న ఆ ఓటు బ్యాంకును పూర్తిగా కాకపోయినా కొంతయినా కైవసం చేసుకోవచ్చునని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆలోచించడం అసహజమేమి కాదు. కాంగ్రెస్ పార్టీకి, ఆయన రాకవల్ల ఇప్పటికిప్పుడు ప్రత్యేక లాభం ఏమి లేకపోయినప్పటికీ, ఆయనను సాదరంగా ఆహ్వానించి వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇచ్చినట్లయితే, మంచి క్రికెట్ కామెంటర్ గా కూడా పేరు పొందిన ఆయన, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రచార కర్తగా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.   ఇక, ఇదంతా కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి జట్టులో అజహార్ ఆడేందుకు ‘టికెట్ ఖాయం’ అయిన తరువాత జరిగే కధ కనుక,అప్పటి వరకు అజహారుద్దీన్ ఎక్సట్రా బ్యాట్స్ మ్యాన్ గా గేలరీలో కూర్చొని కిరణ్ ఆడుతున్న గేం చూస్తూ శబాష్ బాగా ఆడుతున్నారని చప్పట్లు కొట్టుకొంటూ కూర్చోక తప్పదు.

బ్రదర్ పై మైనార్టీ అస్త్రం ప్రయోగించిన తెదేపా

  అవిశ్వాస తీర్మానాన్ని అడ్డంపెట్టుకొని తనను ఇరికించజూస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ, కొత్తగా తన అమ్ముల పొదిలో జేరిన మైనార్టీ అస్త్రం ప్రయోగించింది. గతనెల గుంటూరు జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఏర్పరిచిన తెదేపా అనుబంధ క్రీస్టియన్ సంఘం అద్యక్షుడు శాంతారాం డేవిడ్ ద్వారా వైయస్సార్ కుటుంబ సభ్యుడయిన బ్రదర్ అనిల్ కుమార్ పై తెలుగుదేశం పార్టీ దాడి చేసింది. తద్వారా తమను అవిశ్వాసం తీర్మానం మిషతో ఇబ్బందులు పెడితే, అందుకు ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలియజేసింది.   తెదేపా అనుబంధ క్రీస్టియన్ సంఘం అద్యక్షుడు శాంతారాం డేవిడ్ నిన్న పార్టీ కార్యాలయం యన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. రాజశేఖర్ రెడ్డి, ఆయన అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేసారు.   స్వర్గీయ డా. రాజశేఖర్ రెడ్డి క్రీస్టియన్ మతస్తుడయినప్పటికీ ఆయన క్రీస్టియన్ ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేదని, రాష్ట్రంలో క్రీస్టియన్ మతస్తులకు సరిపోయినన్ని శ్మశానాలు కూడా లేక చాలా ఇబ్బాదులు పడుతున్నామని, శ్మశానాల కోసం స్థలాలు కేటాయించమని తాము ఇచ్చిన వినతి పత్రాలను కూడా పట్టించుకోకుండా వాటిని ఆయన చెత్తబుట్టలో పడేశారని ఆవేదన వ్యక్తం చేసారు. తమకి కనీసం శ్మశానాల కోసం స్థలాలు కూడా కేటాయించలేని ఆ పెద్దమనిషి తన అల్లుడు అనిల్ కుమార్ గనుల కోసం బయ్యారంలో లక్షలాది ఎకరాల స్థలం, మణికొండలో విలువయిన ప్రభుత్వ భూములు అప్పనంగా కట్టబెట్టేరని విమర్శించారు.   తరువాత బ్రదర్ అనిల్ కుమార్ పై తీవ్రఆరోపణలు చేస్తూ “గతంలో మా మతానికి చెందిన వారు అనేకమంది బ్రదర్ అనిల్ కుమార్ ను హైదరాబాద్, సోమాజిగూడా వద్దగల ఎలైట్ భవనంలో ఉన్న బెనేట కార్యాలయంలోనే కలిసేవారని, బేనేట సంస్థకు ఆయనే అసలు యజమాని అని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యేకంగా ఏమి రుజువులు కావాలని ప్రశ్నించారు. ఇటీవల అనుమానస్పద స్థితిలో మరణించిన బెనిటా గనుల సంస్థ యజమానిగా చెప్పబడుతున్న వీరభద్రారెడ్డికి బ్రదర్ అనిల్ కు మద్య ఏమి సంబంధం ఉందో తెలుసుకోవాలని పోలీసులు కనిపెట్టాలని, అదేవిధంగా వీరభద్రారెడ్డి మరణం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందో, ఆయన చనిపోయే ముందు ఎవరెవరికి ఫోన్ కాల్స్ చేసారో, తన తదనంతరం ఎవరెవరికి బేనేట సంస్థ చెందేట్లు ఏర్పాట్లు చేసేరో వంటి విషయాలను పోలీసులు దర్యాప్తుచేసి కనిపెట్టాలని శాంతారాం డేవిడ్ డిమాండ్ చేసారు.   ఆయన చేసిన ఆరోపణలకు త్వరలోనే బ్రదర్ అనిల్ లేదా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తగిన జవాబు ఇస్తారని వేరే చెప్పనవసరం లేదు. కానీ ఈరాజకీయ ఎత్తుగడ గమనిస్తే, రాజకీయ పార్టీలు మైనార్టీ, మహిళా, విద్యార్ధి, వెనుకబడిన కులాల అనుబంధ విభాగాలను ఎందుకు స్థాపిస్తాయో అర్ధం అవుతుంది. సదరు వర్గానికి చెందిన ఓటు బ్యాంకును గెలుచుకోవడానికి మాత్రమే కాకుండా, అవసరమయినప్పుడు ఈవిధంగా వైరి పక్షాలలో సదరు వర్గాలను ఆవర్గానికి చెందిన వారి చేతనే దాడిచేయించే వెసులుబాటు ఉంటుంది. తద్వారా ఒక వైపు తమ వైరి పక్షంలో ఆవర్గానికి చెందిన నేతలపై దాడి చేసే వెసులుబాటు పొందుతూనే, మరో పక్క న్యాయపరమయిన కేసులు తమ తలకి చుట్టుకోకుండా తప్పించుకొనే వెసులుబాటు కూడా ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఈవిధంగా అనుబంధ సంస్థలను ప్రోత్సాహిస్తున్నాయి. తద్వారా తాము సంబందిత వర్గానికి చాలా ప్రాదాన్యం ఇస్తున్నామని ప్రచారం చేసుకొనే గొప్ప అవకాశం కూడా పొందగలుగుతున్నాయి.   కానీ, యదార్ధ పరిస్థితులు చూసినట్లయితే అవన్నీ సదరు పార్టీల అమ్ముల పొదిలో అస్త్రాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయని అర్ధం అవుతుంది. ఏమయినప్పటికీ, సదరు అనుబంధ సంఘాలలో పనిచేసేవారు కూడా మారిన సామాజిక పరిస్థితుల్లో నేడు ఏదో ఒక బలమయిన రాజకీయ పార్టీ అండదండలు ఉండటం అవసరమనో లేక రాజకీయంగా ఎదిగాలనే ఆలోచనలతో వివిధ రాజకీయ పార్టీల వెనుక తిరుగుతున్నారు. అయితే, వారికి సదరు రాజకీయ పార్టీలు ఏవిదం సాయం చేస్తాయో లేదో ఖచ్చితంగా చెప్పలేకపోయినా, వారిని ఉపయోగించుకొని ఒకే వర్గానికి చెందిన ప్రజల మద్య చిచ్చు మాత్రం పెట్టగలవని ఖచ్చితంగా చెప్పవచ్చును.

The ugly battle over ‘No-Confidence motion’

  TDP has decided not to hurry in serving no-confidence motion against Kiran Kumar Reddy government as it believes that it will not serves its purpose, instead comes as a blessing for YSR Congress party for bargaining with Congress to extend its support. During the party legislative meeting held by Chandrababu Naidu at Dakaram village in Mudinepalli mandal in Krishna district on yesterday, it was decided to push YSR Congress party to frontlines in the no-confidence motion battle, instead of taking initiative. TDP decides to take appropriate step according to situation demands, when the assembly sessions begin from March 13th.   TDP’s decision irks its bitter rival YSR Congress party, which expects to corner TDP in case if it goes for no-confidence motion. Hence, its senior leader Ambati Rambabu has burst upon TDP describing them as cowards. He said “Actually, TDP doesn’t want to topple Kiran’s government as it is having secret pact with Congress to ensure our leader YS.Jagan Mohan Reddy remain in jail as much period as possible. I challenge Chandrababu Naidu to prove that he is honest with what he says to people during his padayatra about Kiran Kumar Reddy.   However, TDP retards asking why it is hesitating to take initiative while it’s blaming Congress party for putting its party president Jagan Mohan Reddy in the jail. TDP says that, when the YSRCP leaders are claiming the ruling Congress government is running on their mercy, then why are they afraid to serve no-confidence motion against Kiran Kumar Reddy government? TDP also asks whether the 9 decedent MLAs of their group hanging to Congress are still willing to extend their support to Congress or will they come out open against ruling Congress government?   While, the two opposition parties are indulged in this ugly battle, Congress is planning to disqualify the MLAs (of Jagan group), whoever revolt against it, with which they will become jobless for the next one year. Hence, all the political parties are busy drawing plans to corner their rivals in the Assembly meetings.

రాహుల్ గాంధీ, లోకేష్ ల సమావేశాలలో తేడాలు!

                        గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో తరచూ సమావేశం అవుతూ పార్టీ వ్యవహారాలలో క్రమంగా అవగాహన పెంచుకొంటున్న నారా లోకేష్, ఈ రోజు చిత్తూరు జిల్లా పలమనేరు గ్రామంలో మొట్ట మొదటిసారిగా పార్టీ కార్యకర్తలనుద్దేశించి చిన్న ప్రసంగం చేసారు. కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి లను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఒకరు అసమర్ధుడు, మరొకరు అవినీతిపరుడు అయినప్పుడు ఎవరికి ఓటేస్తారు?’ అని అడిగారు. సహజంగానే పార్టీ కార్యకర్తలు చంద్రబాబు పేరు కోరస్ గా నినదించడం షరా మామూలే.   తన తండ్రి చంద్రబాబు నాయుడు అధికారంలో లేకపోయినప్పటికీ నేటికీ అంతే సమర్ధతతో పార్టీని నిర్వహిస్తూ, ప్రజల కొరకు అలుపెరుగని పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ, పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు తెలుసుకొంటున్నారని అన్నారు. అందువల్ల తన తండ్రి చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకే వచ్చే ఎన్నికలలో తమ పూర్తి మద్దతునీయాలని కోరారు.   అయితే, లోకేష్ కేవలం తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నపుడు, తన తండ్రిని కిరణ్, జగన్ లతో పోల్చడం అనవసరం. అదే సమయంలో తన తండ్రి సమర్ధుడని చెప్పి అతనినే ఎన్నుకోమని కోరడం కూడా అసందర్భ ప్రసంగమే. ఎందుకంటే లోకేష్ తన స్వంత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు తప్ప ప్రజలను ఉద్దేశించి కాదు. తన పార్టీ కార్యకర్తలనే చంద్రబాబుకి ఓటేయమని కోరడం కొంచెం ఎబెట్టుగా ఉంది. ఎందుకంటే, పార్టీలో పనిచేస్తున్న వారికి ఆవిషయం ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పనవసరం లేదు. ఒకవేళ చెప్పవలసివస్తే అటువంటి కార్యకర్తలవల్ల పార్టీకి ఏమాత్రం ప్రయోజనం ఉండదు.   ఇంచుమించు లోకేష్ పరిస్థిలోనే ఉన్న కాంగ్రెస్ యువనాయకుడు రాహుల్ గాంధీ నిన్న డిల్లీలో తన కంటే ఏంతో సీనియర్లయిన పార్టీ నాయకులను ఉద్దేశించి చేసిన ప్రసంగం చూస్తే, వారిద్దరి మద్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా అర్ధం అవుతుంది. రాహుల్ గాంధీ తన పార్టీ నేతలకు, పార్టీలో నెలకొన్న సమస్యలను ఎత్తి చూపుతూ, వాటిని ఏవిధంగా పరిష్కరించాలో చెప్పి, పార్టీని గ్రామ స్థాయి నుండి ఏవిధంగా బలపరచాలో, గ్రామీణ కార్యకర్తలతో ఏవిధంగా అనుసంధానం అవ్వాలో తెలియజేసారు. అంతే గాకుండా వారికి స్పష్టమయిన కార్యాచరణ నిర్దేశిస్తూ తగిన ఆదేశాలు కూడా ఇచ్చారు.   ఇక్కడ ఆయన తన సీనియర్లకు ఆదేశాలు ఈయడం అనే అంశం ప్రధానం కాదు. పార్టీ సమావేశంలో ఆయన ఏవిధంగా ఆచరణాత్మక సలహాలు ఇచ్చి పార్టీ బలోపేతం చేయడానికి ప్రయత్నించారు అనేదే ప్రధాన విషయం.   లోకేష్ కూడా పార్టీ అధిష్టానం తరపున కార్యకర్తలతో మాట్లాడుతున్నపుడు, అదొక సదవకాశంగా భావించి స్థానిక సమస్యలను, పార్టీ పరిస్థితిని, కార్యకర్తల మనోభావాలను తెలుసుకొని, తన శక్తిమేర సమస్యలని పరిష్కరించడమో లేక పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారానికి కృషిచేస్తే కార్యకర్తలకి, పార్టీకి, తనకీ కూడా ప్రయోజనం కలుగుతుంది.   లోకేష్ కు ఇంకా తగిన రాజకీయ అనుభవం లేనందున, ఆయన చేసిన ఈ తొలి ప్రసంగంలో తప్పులు వెతుకనవసరం లేదు. కానీ, పార్టీ అంతర్గత సమావేశాలలోమాట్లాడవలసిన అంశాలు, బహిరంగ సభలలో ప్రజలనుద్దేశించి మాట్లాడవలసిన విషయాల మధ్యగల తేడాను లోకేష్ తెలుసుకోవడం వల్ల ఆయన మాటలకి ఒక విలువ ఏర్పడి ఆశిస్తున్న ఫలితాలు కనిపిస్తాయి.

అసమ్మత మంత్రివర్గ సమావేశం నేడే!

  మళ్ళీ మూడు నెలల విరామం తరువాత గురువారంనాడు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కాబోతోంది. సాధారణంగా మంత్రి వర్గం సమావేశం అంటే కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, శాసనసభలో ప్రతిపక్షాలను ఏవిధంగా ఎదుర్కోవాలి వంటి విషయాలను చర్చించడానికి నిర్వహిస్తారు. కానీ, ఈ మద్య జరుగుతున్న సమావేశాలలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడం సంగతెలా ఉన్నా, స్వపక్షంలో విపక్షాన్ని ఎదుర్కోవడంతోనే సరిపోతోంది.   గత సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆరోగ్యశాఖామంత్రి డా.డీయల్.రవీంద్రారెడ్డికి మద్య రెవెన్యు మంత్రి ధర్మాన ప్రసాదరావును సీబీఐ విచారణ నుండి మినహాయించడంపై పెద్ద యుద్ధమే జరిగింది. ఆరోజు మంత్రి వర్గంలో కేవలం డా.డీయల్.రవీంద్రా రెడ్డి ఒక్కరే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేఖంగా మాట్లాడారు. అయితే, ఈ సారి జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ ఒకరిపై మరొకరు కత్తులు దూసేందుకు సిద్దంగా ఉన్నారు.   ఇటీవల జరిగిన సొసైటీ ఎన్నికల సందర్భంగా పార్టీ నేతల మద్యన జరిగిన ప్రచ్చన్న యుద్ధం, ఈ సారి సమావేశాన్ని రసాబాస చేసే అవకాశం ఉంది. కడప ఎన్నికలలో డా.డీయల్.రవీంద్రారెడ్డి, సి. రామచంద్రయ్య ఇద్దరూ పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడి, కాంగ్రెస్ అభ్యర్ధుల ఓటమికి కారకులయ్యారని, అందువల్ల వారిద్దరినీ పదవులలో తొలగించాలని శాసన సభ్యుడు వీరశివా రెడ్డి మరియు వరదరాజులు రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు.   ఇక, సహకార ఎన్నికలలో తనని, తన అనుచరులను ఉద్దేశాపూర్వకంగానే ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేసారని, ఆయనకీ అందరినీ కలుపుకోనిపోయే అలవాటు లేదని మంత్రి రామచంద్రయ్య బహిరంగంగానే విమర్శించారు. ఇక, పీసీసి అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ 9మంది జగన్ వర్గీయులను పార్టీ నుండి బయటకి గెంటేస్తానని రంకెలువేయడం, దాని పర్యవసానాలతో కిరణ్ కుమార్ రెడ్డి ఆయనపై గుర్రుగా ఉన్నారు.   తనను పక్కన బెట్టి, సహకార ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించినందుకు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రిపై కోపంతో రగిలిపోతున్నారు. ఇక, ఆంధ్రా మంత్రులు, తెలంగాణా మంత్రులు మద్య ఒకరినొకరు ద్వేషించుకోనేందుకు అవసరమయిన విభజన రేఖ వారి మద్యన ఎప్పుడూ ఉంది. వీటికి తోడూ తమ నెత్తి మీద కత్తిలా వ్రేలాడుతున్న అవిశ్వాస తీర్మానం కూడా ఉండనే ఉంది.   అందువల్ల ప్రజల సమస్యలపై నిర్ణయాలు, శాసనసభలో అనుసరించవలసిన వ్యూహం మొదలయిన విషయాల కంటే ముందు మంత్రుల మధ్య ఉన్న ఈ విబేధాలే సమావేశాన్ని కబళించే అవకాశం ఉంది. ఇది ఎలాగుందంటే కలిసి కాపురం చేయడానికి ఇష్టపడని మొగుడు పెళ్ళాలు, పొరుగింటి పిన్నమ్మ సంసారాన్ని చక్కబెట్టే ప్రయత్నంలా ఉంటుంది.   ముఖ్యమంత్రితో సహా మంత్రి వర్గం సమావేశంలో పాల్గొనబోతున్న మంత్రులందరికీ ఒకరితో మరొకరికి పడనప్పుడు, మరి వారు కలిసి కూర్చొని చర్చించేదేమిటో, సాదించేదేమిటో వారికే తెలియాలి.

పెళ్ళీ వద్దు, ప్రధాని పదవీ వద్దు: రాహుల్ గాంధీ

  అలనాడు సిద్దార్డుడు ప్రపంచాన్నే జయించే మహా చక్రవర్తో లేకపొతే ప్రపంచానికి శాంతి ప్రబోదించే గొప్ప సన్యాసో అవుతాడని జ్యోతిషులు చెప్పినపుడు, ఆయన తండ్రి తన కుమారుడు తప్పనిసరిగా చక్రవర్తి కావాలనే సంకల్పంతో, సిద్దార్డుడికి ప్రజల కష్టాలు, సమస్యల గురించి తెలియకుండా జాగ్రత్త పడుతూ, రాజమందిరంలోనే విద్యాబుద్దులు చెప్పించి పెళ్లి కూడా చేసాడు. అయితే, ఒకానొక రోజు ఆయన తన రాజమందిరంలోంచి బయటి ప్రపంచంలోకి వెళ్ళడం, అక్కడ తనకి తెలియని ప్రజల కష్టాలు, అశాస్వితమయిన జీవితం గురించి తెలుసుకోవడంతో, తన సంసారాన్ని, రాజ్యాన్నిత్యజించి సన్యాసిగా మారి భోదీ వృక్షం కింద తపసు చేసి బుద్ధుడుగామారి లోకానికి జ్ఞానం ప్రసాదించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.   ‘కోరికలే దుఖమునకు మూల కారణం’ అని చెప్పిన బుద్దుడి ప్రవచనాల గురించి అందరికీ తెలిసి ఉన్నపటికీ, వాటిని సాధారణ మానవులెవరూ కూడా ఇంతవరకూ జయించలేకపోతున్నారు. ఈ ఉపోద్గాతం అంత ఇప్పుడు ఎందుకంటే, కాబోయే ప్రధానిగా అభివర్ణింపబడుతున్న రాహుల్ గాంధీ కూడా నిన్నఅదే వైరాగ్య భావనలతో మాట్లాడటమే.   గౌతమ బుద్ధుడు బయటి ప్రపంచాన్ని చూడటం వల్లనే సర్వసంఘ పరిత్యాగిగా మారితే, గత 9 సం.లుగా ప్రజలమద్య జీవితం గడుపుతూ, వారి కష్ట సుఖాలను దగ్గరనుండి గమనించి అర్ధం చేసుకొన్నరాహుల్ గాంధీ బహుశః వారి కష్టాలను చూసే వైరాగ్యం పెంచుకోన్నడో, లేక దశాబ్దాలుగా తన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలిస్తున్నా వారి జీవితాలలో మార్పు తేలేకపోయినందుకు చింతిస్తూ వైరాగ్యం పెంచుకోన్నాడో తెలియదు గానీ, మొత్తం మీద గౌతమ బుద్ధుడి ‘కోరికలే దుఖమునకు మూల కారణం’ అనే ఉపదేశ సారాంశాన్ని మాత్రం బాగా వంటబట్టించుకొన్నట్లు కనిపిస్తున్నారు.   నిన్న తన పార్టీకి చెందిన యువ యమ్పీలతో మాట్లాడుతూ తానూ ఇప్పుడపుడే పెళ్లి చేసుకోనని చెపుతూ అందుకు కారణాలు కూడా వివరించారు. “పెళ్లి చేసుకొంటే సంసారం ఏర్పడుతుంది. సంసారం నుండి పిల్లలు పుట్టుకు వస్తారు. దానితో కోరికలు, స్వార్ధం కూడా పుట్టుకు వస్తాయి. నా పిల్లలే దేశంలో అధికారం చేలాయించాలనే స్వార్ధం కూడా నాలో పుట్టుకు రావచ్చును. అందువల్ల ఇప్పుడపుడే పెళ్లి ప్రసక్తి లేదని” స్పష్టం చేసారు.   అంతటి ఆగితే, కాంగ్రెస్ పార్టీ పెద్దగా చింతించేది కాదు. కానీ, ఆయన తనకు ప్రధాని పదవి మీద కూడా ఏమాత్రం ఆసక్తి లేదని బాంబు పేల్చారు. తనకు ప్రధాని పదవి కంటే కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి బలపరచడమే ప్రధానం అని అన్నారు. తన నెహ్రు-గాంధీ కుటుంబ నేపద్యమే తనకు అందలం అందుబాటులోకి తెచ్చింది తప్ప మరో కారణం లేదని కుండ బద్దలు కొట్టారు.   తన నానమ్మ ఇందిరా గాందీ కొన్ని తప్పని పరిస్తితుల్లో పార్టీలో అధికార కేంద్రం సృష్టించారని, అయితే దేశంలో ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవుగనుక, పార్టీలో, ప్రభుత్వంలో అధికార వికేంద్రీకరణ జరుగవలసిన సమయం ఆసన్నమయిందని, లక్షలాది సభ్యులుగల కాంగ్రెస్ పార్టీలో అర్హత గల ప్రతీ ఒక్కరూ కూడా అధికారంలో భాగస్వాములు కావాలని తానూ మనస్పూర్తిగా కోరుకొంటున్నానని ఆయన చెప్పారు. తద్వారా ఇక ఈ వంశపారంపర్య పాలనకు స్వస్తి చెప్పాలని అంటూ ఆయన కాంగ్రెస్ నేతల గుండెల్లో మరో బాంబు పేల్చారు.   ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకొన్న సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీ నేతలకీ ఆయన మాటలు సహజంగానే కలవరపరుస్తాయి. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా పట్టం కట్టించుకొన్న రాహుల్ గాంధీ అకస్మాత్తుగా ఇంత వైరాగ్యం ప్రదర్శించడం, అదికూడా ఎన్నికలను ఎదురుగా బెట్టుకొన్న ఈ సమయంలో పార్టీకి సారద్యం వహించి తరువాత ప్రధాని పదవిని అధిష్టించవలసిన వ్యక్తి, అలనాడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడిలా మాట్లాడటంతో కాంగ్రెస్ పార్టీ చాలా అయోమయంలో పడింది.   కాంగ్రెస్ రాజకీయాలకు పూర్తీ విభిన్నమయిన పద్దతిలో మాట్లాడుతున్న ఆయన తీరును కాంగ్రెస్ ఖండించలేక, సమర్దించలేక సతమతమవుతోంది. బహుశః ఆయన నానాటికి దిగజారుతున్న తన పార్టీ పరిస్థితిని చూసి ఆవిధంగా అన్నారో లేక తానూ ఆయాచితంగా ప్రధాని పదవిని పొందడం నిజంగా ఇష్టంలేకనే ఆయన ఆవిధంగా అన్నారో తెలియదు కానీ, వర్తమాన రాజకీయాలలో ఈ విధంగా మనసులో మాటలు బయటపెట్టడం పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది తప్ప పార్టీకి మేలుచేయదు.   తద్వారా ప్రధాని పదవి గురించి ఆయన వెల్లడించిన అభిప్రాయలు పార్టీ వ్యూహాలను బట్టబయలు చేసినట్లే అవుతుంది. ఇంతవరకు “మా ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీ విషయంలో మాపార్టీలో ఒక స్పష్టత ఉంది. మరి మీ ప్రధాని అభ్యర్ధి ఎవరు? మోడీనా, అద్వానీయా, సుష్మా స్వరాజా లేక మరేవరయినానా? అంటూ బీజేపీని ఆట పట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకి రాహుల్ గాంధీ తాజా ప్రకటనతో గొంతులో పచ్చి వెల్లక్కాయ పడినట్లయింది. రాహుల్ గాంధీ మాటలు ఇప్పుడు బీజేపీకి ఒక ఆయాచిత వరంగా లభ్యమవగా, కాంగ్రెస్ పార్టీని మనస్పూర్తిగా ద్వేషించే ప్రతిపక్షాలకు ఒక కొత్త ఆయుధంగా దొరికింది.   రాహుల్ గాంధీ వెల్లడించిన అభిప్రాయాలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా మీడియాలో పెద్ద చర్చ మొదలయింది. ప్రతిపక్షనేతలు మొదలు మానసిక తత్వ శాస్త్ర నిపుణులు వరకు అందరూ ఈ చర్చలో పాల్గొంటూ ఆయన అభిప్రాయాలను రకరకాల కోణాలలో విశ్లేషణలు చేయడం మొదలుపెట్టారు.   ఇది, కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం మేలు చేయకపోగా పార్టీకి ఊహించని సమస్యలు తెచ్చిపెట్టింది. మరి అలనాడు అర్జునుడికి గీతోపదేశం చేసి కర్తవ్యం భోదించి యుద్ధానికి సన్నధం చేసినట్లు, రాహుల్ గాంధీకి కూడా సరయిన ఉపదేశం చేసి ఎన్నికల రణరంగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు ఉరికించగల ‘శ్రీకృష్ణుడు’ ఎవరయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో లేదో చూడాలి.

హలో బ్రదర్! అని కలవరిస్తున్న బీజేపీ!

  జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన కొత్తలో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు తప్ప రాష్ట్రంలో అన్ని చిన్న పెద్ద పార్టీలు కూడా అయన పార్టీతో చేతులు కలపాలని చూసాయి. ముఖ్యంగా మతతత్వ పార్టీలుగా ముద్రపడిన మజ్లిస్ మరియు భారతీయ జనతా పార్టీలు అయనకి స్నేహ హస్తం అందించాయి. జగన్ గనుక ఖచ్చితమయిన తెలంగాణా వైఖరిని ప్రకటిస్తే తెరాస కూడా అయన పార్టీతో పోత్తులకు సిద్దమని సంకేతాలు పంపింది.   కానీ, సరయిన రాజకీయ అనుభవం లేని కారణంగా, తగిన సలహాలు ఇచ్చే రాజకీయ అనుభవజ్ఞులు కూడా పార్టీలో లేకపోవడంతో జగన్ మోహన్ రెడ్డి తనకు తోచినదారిలో ముందుకు సాగిపోతూ చిక్కుల్లో పడ్డాడు. భారతీయ జనతా పార్టీతో సంబంధాలు పెట్టుకోనని ఆయన తెగేసి చెప్పినపటికీ, రాజకీయాలలో తలపండిన ఆ పార్టీ తొందరపడలేదు. ఎన్నికలకి ఇంకా చాల సమయం ఉనందున, అప్పటికి ఆయన ఆలోచనలో మార్పు రావచ్చని బీజేపీ ఓపికగా ఎదురుచూసింది.   కానీ, కాంగ్రెస్ పార్టీ నుండి అకస్మాత్తుగా తలాకులు చెప్పుకొని మజ్లిస్ పార్టీ విడిపోవడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఆకస్మాతుగా మారిపోయింది. మజ్లిస్ కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోతూ కిరణ్ కుమార్ రెడ్డి కంటే జగనే మంచోడు అని ఒక సర్టిఫికేట్ జారీ చేయడం, ఆతరువాత అక్బరుద్దీన్ అరెస్ట్ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మౌనం వహించడం, క్రమంగా ఆ రెండు పార్టీలు దగ్గరవుండటంతో భారతీయ జనతా పార్టీ ఇక జగన్ మోహన్ రెడ్డి తమ చేజారిపోయినట్లేనని గ్రహించింది.   తమకు బద్ద విరోధి అయిన మజ్లిస్ పార్టీతో చేతులు కలుపుతున్నజగన్ మోహన్ రెడ్డిని ఇక ఎంత మాత్రం ఉపేక్షించనవసరం లేదని భావించిన వెంటనే, అంతవరకూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కనబడని తప్పులు బీజేపీకి స్పష్టంగా కనబడటం మొదలయ్యాయి. అంతే! ఆనాటి నుండి బీజేపీకి నేత ప్రభాకర్ బ్రదర్..బ్రదర్ అంటూ బ్రదర్ అనిల్ వెంటపడటం మొదలుపెట్టారు. ఆయనకి చెందిన ఆస్తులు, వివిధ సంస్థలలో ఆయన పెట్టిన పెట్టుబడులు, ఆయన సంస్థల పేర్లు, ఆయా సంస్థలలో ఆయన బినామీల పేర్లు, ఆయన చేసిన భూభాగోతాలు అన్నిటినీ ఒకటొకటిగా ప్రస్తావిస్తూ ఆయనపై దాడి తీవ్రతరం చేసారు.   బీజేపీకి తన దాడుల పరిధిలోకి జగన్ మోహన్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యులందరినీ తెచ్చే అవకాశం ఉన్నపటికీ, ఆ పార్టీ సహజంగా మతానికి ప్రాధాన్యం ఇస్తుంది గనుక, మతప్రచారం చేస్తూ, మతమార్పిడులకు ప్రోత్సాహం పలుకుతున్న బ్రదర్ అనిల్ నే తన ప్రధాన లక్ష్యంగా చేసుకొంది. అయితే, మున్ముందు ఏర్పడే రాజకీయవాతావరణాన్ని అనుసరించి బీజేపీ తన దాడుల పరిధి మరింత పెంచి మొత్తం జగన్ కుటుంబ సభ్యులను, ఆయన పార్టీని, నేతలపై యుద్ధం ప్రకటించవచ్చును.   బీజేపీని మతతత్వ పార్టీగా ముద్ర వేసి దూరం పెట్టిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు మజ్లిస్ వంటి పార్టీతో ఏవిధంగా చేతులు కలుపుతున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో కేవలం సెక్యులర్ పార్టీతోనే చేతులు కలుపుతామని ప్రకటించడంతో, బీజేపీ మరింత మండిపడింది. ఆనాటి నుండి బీజేపీ క్రమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తన దాడి తీవ్రతరం చేసింది. కానీ, బీజేపీ రాష్ట్ర శాఖా అద్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా ఇంకా ఎందుకో నోరు విప్పలేదు. బహుశః ఆయనకీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆశలు ఏమయినా మిగిలిపోయాయేమో మరి తెలియదు.   ఒకవైపు తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడులను తిప్పి కొట్టేందుకు సతమతమవుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు బీజేపీ కూడా తోడవడంతో తట్టుకోవడం కష్టంగా మారింది. తమ పార్టీ అధినేత జైల్లో ఉండటంవల్లనే బలహీనంగా ఉన్నామని అందరికీ అలుసుగా మారామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధపడుతోంది. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రధం భూమిలోకి క్రుగిందని అర్జునుడు జాలిపడిఉంటే భారతగాధ మరో విధంగా ఉండేది. గనుక, ఇప్పుడు రాష్ట్ర రాజకీయ రణరంగంలో కూడా ఎవరూ ఎవరిపైనా జాలిపడే పొరపాటు చేయరు.

మన పార్టీలకి సర్వం రాజకీయమేనా?

  మన రాష్ట్ర రాజకీయనాయకులు వివిధ అంశాలపై ప్రతిస్పందిస్తున్న తీరు చూస్తుంటే, వారికి రాష్ట్ర ప్రయోజనాలకంటే, పార్టీ ప్రయోజనాలు, స్వప్రయోజనాలే ఎక్కువని అర్ధం అవుతుంది. మొన్న హైదరాబాద్ బాంబు ప్రేల్లుళ్ళ సంఘటనను, నిన్న బాబ్లీ ప్రాజక్ట్ పై సుప్రీం కోర్టు వెలువరిచిన తీర్పు అంశాలను పట్టుకొని వారు ఆడుకొంటున్న తీరు చూస్తే ప్రజలకి వారి పట్ల క్రమంగా ఏహ్యత పెరుగుతోంది. వారిలో ఏ ఒక్కరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేకపోయినప్పటికీ, నిస్సిగుగ్గా తాము విఫలమయిన అంశాలనే పట్టుకొని మరీ రాజకీయాలు చేయడం నిజంగా సిగ్గు చేటు.   సుప్రీం కోర్టు తీర్పు తరువాత ఆంధ్ర రాజకీయ నేతలందరూ సమిష్టిగా తమపై దండయాత్ర చేస్తారని భయపడిన మహారాష్ట్ర ప్రభుత్వం, మన రాజకీయ నేతల తీరు చూసి నవ్వు కొంటోందిప్పుడు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీం కోర్టు తీర్పువల్ల మన రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమిలేదని చెప్పడంతో, తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్ది రెడ్డి తదితరులు “మరయితే ఇంతకాలం సుప్రీం కోర్టులో ఏమి గడ్డి పీకుదామని లాయర్లను పెట్టి కేసు నడిపించారంటూ” తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణాపై సర్వ హక్కులు తనవేనన్నట్లు మాట్లాడే కేసీఆర్, హరీష్ రావులు కేంద్ర రాష్ట్ర మంత్రులుగా చేస్తున్న సమయంలోనే మొదలయిన బాబ్లీ పనులను ఎందుకు అడ్డుకోలేకపోయారని వారు ప్రశ్నించారు.   ఇక, నిజామాబాద్ యం.పీ. మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ దీనికి అంతటికీ మూల కారకుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేకర్ రెడ్డే అని ఆరోపించారు. ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ పనులు మొదలుపెట్టినపుడు వాటిని అడ్డుకోమని ఆయనను తానూ ఎంతగా ప్రాదేయపడిన్నపటికీ ఆయన నిర్లక్ష్యం చేసారని, అందుకు తన వద్ద తగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆయన ఆరోపించారు.   అదే విధంగా, కేంద్రంలో ఎన్డీయే భాగస్వామిగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన చంద్రబాబు కూడా అంతే నిర్లక్ష్యం ప్రదర్శించి మహారాష్ట్ర ప్రభుత్వానికి పరోక్షంగా ప్రోత్సహించారని ఆరోపించారు. కనుక, ఇప్పుడయినా అన్నిరాజకీయ పార్టీలు , ఈ ఆరోప,ప్రత్యారోపణలు కట్టిబెట్టి రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన నీటికోసం ఏమి చేయాలో ఆలోచించాలని ఆయన కోరారు. అదే సమయంలో ఈ అంశాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తూ, తెలంగాణా అంశంపై నుండి ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నాలు చేయవద్దని ఆయన ప్రతిపక్షాలను హెచ్చరించారు.   అయితే, ఈ కుమ్ములాటలలో క్షణం తీరిక లేకుండా ఉన్న మన రాజకీయ పార్టీల ధోరణి చూస్తే, ఇప్పటికయినా మేలుకొంటాయని భావించలేము. బహుశః బాబ్లీ అంశం వచ్చి బాంబు దాడుల అంశాన్ని వెనక్కి నెట్టినట్లే, మళ్ళీ త్వరలో మరో చర్చనీయాంశం తెర మీదకి వచ్చే వరకు వారి ఈ పోరాటం కొనసాగవచ్చును.

కాంగ్రెస్ పార్టీకి చెలగాటం బీజేపీకి రాజకీయ సంకటం

  కాంగ్రెస్ పార్టీ చెలగాటం బీజేపీకి సంకటం పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లు ఉంది ఇప్పుడు బీజేపీ పరిస్థితి. రెండు రోజుల క్రితం ఆర్ధిక మంత్రి చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో బీహార్ వెనకబాటుతనం గురించి ప్రస్తావిస్తూ, ఆ రాష్ట్రం కోసం తన బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేసానని ప్రకటించారు. అయితే, అది కాకతాళీయంగా చేసిన ప్రకటన మాత్రం కాదు. దేశంలో వివిధ రాష్ట్రాల పరిస్థితి బీహార్ రాష్ట్రానికి తీసిపోకుండా ఉన్నపటికీ, ఆయన బీహార్ రాష్ట్రం పైనే ఎందుకు ప్రత్యేక మక్కువ చూపారంటే, మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది.   నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పటిననాటి నుండి ఆ రాష్ట్రంలో గణనీయమయిన మార్పులకు శ్రీకారం చుట్టడమే కాకుండా, రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పధంలోకి తీసుకు వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తప్ప మరెప్పుడు రాజకీయాలు చేయనని చెప్పే నరేంద్ర మోడీనే ఆయన ఆదర్శంగా తీసుకొని రాష్ట్రాభివృద్దికి కృషి చేస్తున్నపటికీ, ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న అయన (జనత దళ్ పార్టీ) మోడీని ప్రధాని అభ్యర్ధిగా చేయాలనే బీజేపీ నిర్ణయాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. ఒకవేళ మోడీయే ఎన్డీయేకు నాయకత్వం వహించేట్లయితే తానూ తప్పుకొంటానని కూడా స్పష్టం చేసారు.   బీజేపీ తిరిగి అధికారంలోకి రావాలంటే, ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామి అయిన జనతా దళ్, దాని అధినేత నితీష్ కుమార్ మద్దతు తప్పనిసరి. అయితే, ఇంతవరకు నితీష్ కుమార్ ను ఏదోరకంగా ఒప్పించవచ్చునని భావిస్తున్న బీజేపీకి చిదంబరం విసిరిన పాచికతో బిత్తరపోయింది.   మోడీని వ్యతిరేఖిస్తున్న నితీష్ కుమార్ ను ఎన్డీయే నుండి తమ వైపు ఆకర్షించగలిగితే, ఎన్డీయే బలం తగ్గించడమే కాకుండా, తద్వారా రాబోయే ఎన్నికలలో బీజేపీ అవకాశాలను కూడా దెబ్బతీయగలుగుతుంది. ఇప్పటికే, బీజేపీలో, ఎన్డీయేలో మోడిని వ్యతిరేఖించేవారు చాల మందే ఉన్నారు, బీజేపీ గనుక మోడిని తమ ప్రదాని అభ్యర్ధిగా ఎంచుకొంటే, మొదటగా నితీష్ కుమార్ బయటకి వచ్చేయడం ఖాయం. అది పార్టీలో, ఎన్డీయేలో విబేధాలకు దారి తీసి చివరికి ఎన్డీయే విచ్చినం అవుతుందని కాంగ్రెస్ ఆశపడుతోంది.   ఒకవేళ నరేంద్ర మోడీని కాదని మరెవరినయినా ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి అది సంతోషం కలిగించే విషయమే అవుతుంది. బీజేపీని ఎన్నికలలో గెలిపించగల సమర్దుడయిన మోడీ తప్ప మరెవరినయినా కాంగ్రెస్ పార్టీ తన యువనాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో అవలీలగా ఓడించగలదని నమ్మకంతో ఉంది. అందువల్ల బీజేపీకి ఇప్పుడు మోడీ కావాలో లేక నితీష్ కావాలో తెల్చుకోమ్మనట్లు సవాలు విసిరింది.   మోడీని కాదనుకొని నితీష్ కుమార్ ను కాపాడుకొంటే, బలహీనమయిన బీజేపీకి కాంగ్రేస్ చేతిలో ఓటమి ఖాయం. నితీష్ కుమార్ ను వదులుకొని మోడీతో ముందుకు సాగితే, పార్టీలో, ఎన్డీయేలో లుకలుకలు తప్పవు, బీజేపీకి అధికారంలో రావడానికి ఎన్డీయేలో తగిన మద్దతు సరిపోదు. ఈ ఆలోచనతో కాంగ్రెస్ చిదంబర పాచిక విసిరింది. అది ఫలిస్తుందో లేదో రానున్న కాలమే చెప్పాలి.   అయితే, నిన్న డిల్లీలోజరిగిన బీజేపీ సమావేశంలో నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మాట్లాడటం చూసినట్లయితే, బీజేపీ నితీష్ కుమార్ ను వాదులు కొని మోడీకే పట్టం కట్టాలని నిర్నయించుకొన్నట్లు కనిపిస్తోంది.

అవిశ్వాసానికి స్వాగతం: కిరణ్ కుమార్ రెడ్డి

  కొద్ది రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుండి 9మంది (జగన్ వర్గం) శాసనసభ్యులను బహిష్కరిస్తునట్లు ప్రకటన చేసిన రోజు నుండి నేటివరకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపెట్టే విషయంపై ప్రతిపక్షలలో చాలా రాద్ధాంతం జరుగుతోంది. అయినా ఎవరూ కూడా అవిశ్వాసం పెట్టేందుకు సాహసించలేకపోతున్నారు. (అందుకు కారణాలు ఇదివరకు ఇదే పేజీలో విశ్లేషించడం జరిగింది గనుక మళ్ళీ వాటిని ఇక్కడ ప్రస్తావించడం లేదు.)   కారణాలు ఏమయినప్పటికీ, రాష్ట్రంలో ఇంతవరకు చేసిన ఏ ముఖ్యమంత్రికూడా బహుశః కిరణ్ కుమార్ రెడ్డిలా ఇన్నిసార్లు అవిశ్వాసం ఎదుర్కొనే దుస్థితిని ఎరిగిఉండరు. అదేవిధంగా ఆయనలా ధైర్యంగా అవిశ్వాస తీర్మానాన్ని ఆహ్వానించిన వారు కూడా ఉండిఉండరు. ప్రతిపక్షాల బలహీనతలను గ్రహించిన ముఖ్యమంత్రికిరణ్ కుమార్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్షాలను తన ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టమని మళ్ళీ మరోమారు స్వయంగా ఆహ్వానించారు.   అదే సమయంలో గుంటూరులో పాదయాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల కూడా ‘కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టకుండా చంద్రబాబు ఎందుకు తాత్సారం చేస్తున్నాడో తనకు అర్ధం కావట్లేదని, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవడానికి వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని’ ఆమె డిమాండ్ చేసారు. ఆ అప్పుడు చంద్రబాబు ‘ఆ పనేదో మీరే చేయోచ్చును కదా!’ అని తిప్పికొట్టడం కూడా షరా మామూలే.   ఇద్దరూ కూడా తమ పాదయాత్రలో నిత్యం కిరణ్ కుమార్ రెడ్డి నామస్మరణం చేయకుండా ఉండలేని పరిస్థితి. ఆయనని, అయన ప్రభుత్వాన్ని, ఆయన పార్టీని దుమ్మెత్తి పోయడంలో వారిరువురూ పోటీలు పడుతున్నపటికీ, అయన ప్రభుత్వాన్ని కూల్చడానికి సాహసించలేకపోతున్నారు. వీరిరువురి అవిశ్వాస పోరాటాలు చూసి చివరికి ప్రజలే కాదు, వారి దయతో ప్రభుత్వం నడుపుకొస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా నవ్వుకొంటున్నారు.