కొత్త స్నేహాలు కొత్త కష్టాలు

  ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు ఎవరో దారినపోయే దానయ్య అక్బరుద్దీన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ పీకకి చుట్టుకొన్నాయి.   అసలే పుట్టెడు కష్టాల్లో మునిగున్న వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి ఈవ్యహారం తలకు మించిన భారంగా మారింది. రాష్ట్రంలోమిగిలిన అన్ని రాజకీయ పార్టీలు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండిస్తుంటే, ఒక్క వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకు మౌనం వహిస్తోంది అని ప్రతిపక్షాలు అడుగుతుంటే జవాబు చెప్పుకోలేక సతమతమవుతోంది.   ఇక వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి బద్దవిరోదయిన తెలుగుదేశం పార్టీకూడా ‘మియా, బీబీ రాజీ హై క్యా?’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లుగా మారింది వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి. నిన్నమొన్నటివరకు యం.ఐ.యం.తో అంటకాగిన కాంగ్రెస్ పార్టీ సైతం అక్బరుమియాని నిలదీస్తుంటే, వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ ఏమిటి చప్పుడు చెయ్యట్లేదు? అని దెప్పి పొడుస్తున్నా జవాబు చెప్పలేకపోతోంది.   వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ, యం.ఐ.యం. పార్టీల మద్యన కొత్తగా పరిమలిస్తున్న స్నేహసంబందాలే అందుకు కారణమని మీడియా కూడా విశ్లేషించినా కూడా దానికి వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ మౌనమే సమాధానం అంది.   అసలు వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో వెనకడుగు ఎందుకు వేస్తోందని ఆలోచిస్తే, మొదటిది యం.ఐ.యం. పార్టీతో స్నేహ సంబందాలు కొనసాగించాలానే దాని ఆలోచన కనబడుతుంది. ఆ పార్టీతో చేయి కలిపితే రానున్న ఎన్నికలలో ఆ పార్టీకి ఉన్న ముస్లింఓటు బ్యాంకును తన ఖాతాపద్దులో రాసేసుకోవచ్చుననే ఆలోచన కనిపిస్తుంది. అందువల్లే ప్రస్తుతం వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ దైర్యంచేసి నలుగురితో నారాయణ అని అనలేకపోతోంది. ఒకవేళ అంటే ఆ పార్టీతో నిఖాకి ముందే తలాక్ అయిపోతుందని దానికి తెలుసు. దానితోనే ముస్లిం ఓటు బ్యాంకుకి నీళ్లోదులుకోక తప్పదని కూడా తెలుసు గనుకనే ఈ మౌనం.   అలాగని, ఇప్పుడు మానంవహిస్తే, అసలే చేతిలో మతగ్రంధం పట్టుకొని తిరుగుతూ క్రీస్టియన్ మతస్తులను, ముఖ్యంగా ఆమతం పుచ్చుకొన్న వారినీ తమ పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ, వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీని ఎప్పుడో మతతత్వ పార్టీగా మార్చేరన్న అపప్రద నిజం చేసినట్లవుతుంది. అప్పుడు వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ, యం.ఐ.యం.పార్టీలు రెండుకూడా ఒకే కలుగులోదాగిఉన్నరెండు ఎలుకలు వంటివని అందుకే చేతులు కలుపుతున్నాయని శత్రుపార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.   అదికాక, వారి ఈ స్నేహం హిందూ ఓటు బ్యాంకుని కూడా ఏంతో కొంత ప్రభావితం చేయకమానదు. కానీ, కాలక్రమంలో ప్రజలు ఈవిషయాన్ని మరిచిపోవచ్చును. అయినా కూడా మిగిలిన పార్టీలు మాత్రం ఎన్నికల సమయంలో దీనిని ప్రజలకి గుర్తుచేసి తమ ప్రధాన అస్త్రంగా మార్చుకొనేందుకు ప్రయత్నించకమానవు. అందుకే, ప్రస్తుతం వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ మౌనప్రదర్శన చేయక తప్పట్లేదు.   ముందు నుయ్యి వెనుక గొయ్యి చందాన్న తయారయిన ఈ విషయంలో ఎలా ప్రతిస్పందిన్చాలో, దానికి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో అని వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ మౌనం పాటిస్తూ ‘కిం కర్తవ్యమ్?’ అంటూ లోలోన ఆలోచనలు చేస్తోంది.   అయినా, దారినపోయే ఒక దానయ్య చేసిన వ్యాఖ్యలు కూడా వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ తలకు చుట్టుకోవడం దాని దురదృష్టంగాక మరేమిటి? ‘నయి సాల్ కేలియే హమారీ తోఫా కబూల్ కరో’ అంటూ అక్బర్ ఇచ్చిన ఈ నూతన సంవత్సర కానుకని మరి వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుందా లేక ఇప్పుడే తలాఖులు చెప్పుకొని బయట పడుతుందో చూడాలి మరి.

చంద్రబాబు @ 1500 కి.మీ

      తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 63 సం.ల వయసులో రాష్ట్ర మంతటా పాదయాత్ర చేయాలని ఒక క్లిష్టమయిన, సాహసోపేతమయిన నిర్ణయం తీసుకొన్నపుడు, పార్టీ సీనియర్ నేతలు అందరూ అయన నిర్ణయాన్ని వ్యతిరేఖించారు. ఇక, అయన స్వంత కుటుంబము ఏవిదంగా స్పందించి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చంద్రబాబు తన నిర్ణయానికే కట్టుబడి గత అక్టోబరు నెలలో అనంతపురం జిల్లా హిందూపురం నుండి తన పాదయాత్ర మొదలు పెట్టినపుడు, అయన కుటుంబసభ్యులు, పార్టీ నేతలు కూడా ఆయన ఆరోగ్యం, వయసు దృష్ట్యా చాలా ఆందోళన చెందారు. ఏదోఒకరోజు, ఆయనంతట ఆయనే పాదయాత్ర విరమిస్తున్నట్లు ప్రకటన చేస్తారని భావించేరే తప్ప, అయన ఏకంగా 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక కొత్త రికార్డు సృష్టించి, ఈవిదంగా తెలుగుదేశంపార్టీ కీర్తి ప్రతిష్టలను ఇనుమడించగలరని ఎవరూ కూడా ఆనాడు ఊహించలేకపోయారు. అచంచలమయిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న చంద్రబాబు కొద్ది రోజుల క్రితమే 1000కి.మీ. పాదయాత్ర పూర్తిచేసుకొని అందరి మన్ననలు పొందుతూ ముందుసాగి, నేడు వరంగల్ జిల్లా దస్రూనాయక్ తండా వద్ద తన పాదయాత్రలో 1500 కి.మీ. మైలురాయి కూడా దాటి మరో కొత్త రికార్డు సృష్టించేరు.   ఆ విదంగా చంద్రబాబు ఈ నూతన సంలో ఒక నూతన రికార్డ్ సృష్టించడమేగాకుండా, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యస్. రాజశేకర్ రెడ్డి చేసిన 1468 కి.మీ. పాదయాత్ర రికార్డును కూడా అయన అదిగమించారు. రాజశేకర్ రెడ్డి 53 సం.ల వయసులో 1468 కి.మీ. పాదయాత్రచేయగా, చంద్రబాబు 63 సం.ల వయసులో1500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక కొత్త రికార్డు సృష్టించి అందరినీ సంభ్రమాశ్చర్యాలలోముంచెత్తారు.   తనకంటే వయసులో ఏంతో చిన్నవ్యక్తి అయిన ప్రతిపక్షపార్టీ నేత ఆరోగ్యకారణాలతో పాదయాత్ర చేయలేక మద్యలోనే విరమించుకొంటే, చంద్రబాబు ఈ వయసులో కూడా ఉత్సాహంగా పాదయాత్ర కొనసాగించడం అందరిని ఆకర్షించింది.

కోటి సంతకాలు జగన్ను జైలు నుంచి బయటపడేయగలవా?

  తెలంగాణాలో జోరుగా సాగుతున్న తన పాదయాత్రని షర్మిల అకస్మాత్తుగా ముగించేయడంతో, గత కొన్ని రోజులుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒకరకమయిన స్తబ్దత నెలకొంది. ఆ స్తబ్దతని, నిశబ్దాన్ని చెందిచడానికేనన్నట్లు మొదలుపెట్టిన కోటి సంతకాల సేకరణ జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని బయటకి తీసుకురాలేదని తెలిసినా కూడా కొనసాగించక తప్పని పరిస్థితి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది. కోటి సంతకాలతో ఒక ముద్దాయిని జైలు నుండి విముక్తం చేయగలిగేమాటయితే, ఈ పాటికి మనదేశంలో జైళ్లలో ఉన్న బడానేతలందరూ ఎప్పుడో బయటపడేవారు. ఆ సంగతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియక కాదు. గానీ, పార్టీలో ఏదో ఒక కార్యక్రమం జరగకపోయినట్లయితే, అది పార్టీ కార్యకర్తల మనోబలాన్ని దెబ్బతీసి చివరికి పార్టీ ఉనికికే ప్రమాదంగా మారవచ్చును. అందుకే కోటి సంతకాల కార్యక్రమం మొదలయింది. షర్మిల పాదయాత్ర జరుగుతున్నంత కాలం కూడా చురుకుగా ఉన్న ఆ పార్టీనేతలు, కార్యకర్తలు ప్రస్తుతం చేసేదేమిలేక కోటి సంతకాల సేకరణలో పాల్గొంటూ, పార్టీ త్వరలో సరయిన రాజకీయ కార్యక్రమం ఏదయినా నిర్వహిస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు.   అయితే, ప్రస్తుతం నాయకత్వ సమస్యతో ఇబ్బందిపడుతున్న ఆ పార్టీలో చొరవ తీసుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఒకవేళ ఎవరయినా చొరవతీసుకొని ముందుకువచ్చి నిలబడి కార్యక్రమాలు మొదలుపెడితే, పార్టీలో ఎవరి నుండి ఏవిమర్శలు ఎదుర్కోవలసి వస్తుందనో భయంతో నేతలందరూ పత్రికా స్టేట్మెంట్ లకే పరిమితమవుతున్నారు. తద్వారా, రాష్ట్రంలో పార్టీలో కార్యకర్తల సందడి, పార్టీ ఉనికి కూడా తగ్గినట్లు కనిపిస్తోంది.   ఈ నిశబ్దాన్ని చేదించేందుకు పార్టీ గౌరవాధ్యాక్షురాలు వై.యస్. విజయమ్మే మళ్ళీ చొరవక తీసుకోక తప్పట్లేదు. ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన తెరాస నేత మహిపాల్ రెడ్డి పార్టీలో జేరెందుకు సముఖత చూపించడంతో, ఆ సందర్భాన్ని ఉపయోగించుకొంటూ మెదక్ జిల్లాలో ఒక భారీ బహిరంగసభను విజయమ్మ ఆద్వర్యంలోనిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.   ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనపై తన అభిప్రాయం స్పష్టంగా తెలియజేయని కారణంతో, తెలంగాణా వాదులు ఆ పార్టీపై ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తుతున్న ఈ తరుణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ మొట్టమొదటి సభకి చాలా ప్రాదాన్యం ఉందని చెప్పవచ్చును. ఈ సభ విజయవంతం కావడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమని చెప్పవచ్చును. అదే సమయంలో, తెలంగాణావాదులు కూడా తమనిరసనలు తెలియజేయడానికి కూడా ఇదే సభను వాడుకొనే అవకాశం ఉండటంవల్ల ఇది కీలకమయిన సభగానే భావించవచ్చును.   ఈ సభలోనే విజయమ్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇకముందు ఎవరు నడిపించబోతున్నారో కూడా ప్రకటించే అవకాశం ఉంది. గనుక ఈ సభకు మరింత ప్రాదాన్యత ఉంటుంది.   ఏదేమయినా, సారధిలేకుండా నడుస్తున్న రధం వంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య తీరేవరకు అన్నిపార్టీలకు చులకనగానే కనిపిస్తుంది.

వై.యస్సార్.కాంగ్రేసులో కొత్త లుకలుకలు

      ఒకనాడు వై.యస్.జగన్మోహన్ రెడ్డిని తెలంగాణాలో కాలుకూడా పెట్టనీయని తెలంగాణా ప్రజలు, ఆ తరువాత షర్మిల చేపట్టిన పాదయత్రకి తరలివచ్చేరంటే, అందుకు జగన్మోహన్ రెడ్డి లేదా అతని తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిల ప్రభావం మాత్రం కానేకాదని చెప్పవచ్చును. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మొదటినుండి అత్యంత విదేయురాలిగా ఉంటున్న కొండా సురేఖ, గత సంవత్సరకాలంగా చేసిన కృషికారణంగానే, తెలంగాణా ప్రజల మనసులలో వై.యస్సార్.సి. పార్టీ పార్టీ పట్ల తెరాస నాటిన వ్యతిరేకభావజాలాన్ని కొంతమేరయిన తొలగి, షర్మిల పాదయాత్రకి కొంత సానుకూల స్పందన కనబడిందని చెప్పవచ్చును. ఆ విదంగా పార్టీని తెలంగాణాలో క్రమంగా పునరుజ్జీవింపజేసిన కొండా సురేఖ తెలంగాణాలో వై.యస్సార్.సి. పార్టీకి ముఖచిత్రంగా నిలిచిందని నిసందేహంగా చెప్పవచ్చును. అందువల్లనే, ఆ పార్టీకి అన్నీ తానయి తెలంగాణాలో ఆమె చక్రం తిప్పుతోందని, ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే స్వయంగా అంగీకరిస్తున్నారు. అయితే, వారి ఆ అంగీకారం వెనుక కొండా దంపతుల ఆధిపత్య ధోరణిని పట్ల, ముఖ్యంగా ఆమె భర్త కొండా మురళి వైఖరిపట్ల పార్టీ నేతల అసంతృప్తి కూడా దాగిఉంది.   వై.యస్సార్.సి. పార్టీలో ఎవర్ని జేరనీయలో, ఎవరిని జేరనీయకుడదో కొండా మురళి నిర్నయించుతుండటం, దానిని సురేఖ నిర్ణయంగా భావిస్తూ పార్టీ అదినాయకులు ఆమోదం తెలుపుతుండటం, తెలంగాణాలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలకు చాలామందికి ఇబ్బందికరంగా మారింది. నిన్న మొన్నటి వరకు కూడా వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీలో జేరాలనుకొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి హట్టాతుగా తన నిర్ణయం మార్చుకొని, కాంగ్రెసును వీడితే తెరాస జేరుతాను తప్ప వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీలో జేరానని ప్రకటించడమే ఇందుకు ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు ఆ పార్టీ నేతలు.  అతనే గాకుండా, కాంగ్రేసుకు చెందిన జీవన్ రెడ్డి, గోనే ప్రకాష్ రావు, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వంటి అనేక మంది సీనియర్లు తమ కంటే రాజకీయాలలో జూనియర్ అయిన కొండా మురళి ముందు చేతులు కట్టుకొని నిలబడటం ఇష్టంలేకనే ఆ పార్టీకి దూరంగా నిలిచిపోయినట్లు తెలంగాణాకు చెందిన కొందరు వై.యస్సార్.సి. పార్టీనేతలు అంటున్నారు. పార్టీ వ్యహారాల్లో మురళి ప్రమేయం తగ్గినపుడే, పార్టీ వైపు చూస్తున్న అనేక మంది ఇతర పార్టీలకు చెందిన సీనియర్లు, జూనియర్లూ వారి అనుచరులతో కలిసి వచ్చి పార్టీలోజేరి తెలంగాణాలో పార్టీని బలపరచగలరని భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం పార్టీలో, తెలంగాణాలో మురళి ‘హవా’ కొనసాగుతునందున, అది సాద్యం కాకపోవచ్చని, తద్వారా పార్టీ చాలా నష్టపోతోందని వై.యస్సార్.సి. పార్టీలో చాలామంది నేతలు అభిప్రాయపడుతున్నారు. అందువల్లనే, ఆ పార్టీకి చెందిన వై.వి.సుబ్బారెడ్డి వంటి సీనియర్లు జగన్ కుటుంబముతో వారికున్న సన్నిహిత సంబందాల కారణంగా, కొండా దంపతులకు బద్ద వ్యతిరేఖిగా ముద్రఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావును (తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు) నేరుగా పార్టీ అధిష్టానం వద్దకే తీసుకువెళ్ళి పార్టీలో సభ్యత్వం ఇప్పించారని తెలుస్తోంది. అంతే గాకుండా, క్రమంగా కొండా దంపతుల ఆదిపత్య ధోరణి కట్టడి చేయాలనే ఆలోచనతోనే, వై.వి.సుబ్బారెడ్డి వంటి కొందరు నేతలు, పార్టీ అదినేతలను కలిసి, మొన్న జరిగిన అఖిలపక్షసమవేశానికి కొండా సురేఖ పేరును ఆఖరి నిమిషంలో  తొలగింపజేసి, ఆమెకు బదులుగా మహేష్ రెడ్డిని పంపించినట్లు సమాచారం. అయితే, కొండా దంపతులను వ్యతిరేఖిస్తున్నవారు కూడా కొండా సురేఖ చిత్తశుద్దిని శంకించకపోయినప్పటికీ, ఆమె భర్త కొండా మురళి ఆధిపత్య ధోరణిని మాత్రం భరించలేక పోతున్నారని తెలుస్తోంది. ఈ విభేదాలు క్రమంగా ముదిరి పాకాన్న పడినట్లయితే, అప్పుడు వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో తన ఉనికిని కాపాడుకోవడం కన్నా ముందు పార్టీ అంతర్గత కుమ్ములాటలలో కుప్పకూలిపోకుండా కాపాడుకోవలసి ఉంటుంది. ఏది ఏమయినా, ప్రస్తుతం, వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి సరయిన దశానిర్దేశం చేయగల నాయకుడు లేకపోవడంవల్లనే, ఇటువంటి చిన్న సమస్యలు కూడా పెనుసమస్యలుగా మారేందుకు దోహదపడుతున్నాయని చెప్పవచ్చును. ఇటీవల తెలుగుదేశం పార్టీలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు యఫ్.డి.ఐ. బిల్లు విషయంలో వోటింగులో పాల్గోననప్పుడు ఆ పార్టీలో చెలరేగిన ఇంతకంటే పెద్ద దుమారాన్ని ఆ పార్టీనేత చంద్రబాబు పాదయాత్రలో ఉన్నపటికీ ఎంతో సమర్దవంతంగా అదుపుచేయడం చూసినట్లయితే, పార్టీకి పటిష్టమయిన నాయకత్వం ఎంత అవసరమో తెలియజేస్తోంది. గానీ, దురదృష్టవశాత్తు వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం నాయకత్వ లోపమే పెను సమస్యగా మారింది.

ధామినీ! మమ్మల్ని క్షమించు తల్లీ!

  డిల్లీ అత్యాచార భాదితురాలు (ధామిని) మృతితో ఒక విషాదకర అధ్యాయం ముగిసింది. తనకు బ్రతకాలని ఉందని ఆమె కోరుకోన్నపటికీ బ్రతకలేకపోయింది. ఆమె స్త్రీగా జన్మించడమే ఆమెకు ఈ మరణ దండన విదించింది. ఆమెకే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో పుట్టిన స్త్రీకయినా ఇటువంటి అనుభవాలే ఎదురవడం విచారకరం. కేవలం స్త్రీలకే గాకుండా ఆడపిల్లగా పుట్టిన పాపానికి అన్నెం పున్నెం ఎరుగని పసిపాపలు కూడా కామందుల పశువాంచకి బలయిపోవడం చూస్తే, మన చుట్టూ మానవ రూపంలో తిరుగాడుతున్న మృగాలు ఎంత విచ్చలవిడిగా తిరుగుతున్నాయో తెలుస్తోంది. ఉయ్యాలలో నిద్రించే పసికందుని, ట్వింకిల్... ట్వింకిల్... లిట్టిల్ స్టార్ అని ముద్దుముద్దుగా పలికే పసి బాలలను కూడా ఒంటరిగా వదలలేని దుస్థితిలో మన సమాజం ఉందంటే అది మనందరికీ కూడా సిగ్గుచేటు.   ఒకవైపు డిల్లీలో జోరుగా ఆందోళనలు సాగుతుండగానే మరో వైపు యధేచ్చగా అత్యాచారాలు జరుగుతుండటం, వాటికి ప్రజల, ప్రభుత్వస్పందన నామమాత్రంగానయిన కరువవడం మనం డిల్లీ సంఘటన నుండి ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని గుర్తు చేస్తోంది. ఏదయినా ఒక సంఘటన జరిగిన వెంటనే కొద్ది రోజుల పాటు అందరూ ఉవ్వెత్తున ప్రతిస్పందనలు వ్యక్తం చేయడం, ఆ తరువాత మళ్ళీ ప్రజలు తమ దైనందిన జీవితచర్యలలోములిగిపోవడం, ప్రభుత్వం కూడా మరోఅంశం వైపు మరలి పోవడం జరుతోందేతప్ప ఎదురయిన ప్రతీ సమస్యకి పరిష్కారం వెతికి, అమలు చేసే వరకు పట్టుదల చూపాలని ఎవరు అనుకోకపోవడం వల్లనే, ఇటువంటి తీవ్ర సమస్యలు పునరావృతమవుతున్నాయి. అది డిల్లీ అత్యాచార సంఘటన కావచ్చును లేదా ముంబై దాడులు కావచ్చును. ప్రతీ అంశంపైన మన ప్రతిస్పందనలు తాత్కాలిక భావోద్వేగాలతో కూడుకోన్నవే తప్ప, సకారాత్మకమయిన చర్యలు మాత్రం అరుదుగా కనిపిస్తాయి.   ప్రస్తుతం మన ప్రభుత్వము, న్యాయస్థానాలు వెంటనే స్పందించి కొన్ని చర్యలు చేపడుతున్నపటికీ, మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఎప్పటికప్పుడు చట్టాలలో మార్పులు చేసుకోవడం, సమాజంలో చైతన్యం తెచ్చేందుకు నిరంతర కార్యక్రమాలు చెప్పటడం వంటివి జరగాలి.   ప్రభుత్వము చిత్తశుద్ధితో, అకుంటిత దీక్షతో అమలు చేస్తున్న ఒకేఒక కార్యక్రమం ‘పోలియో నివారణ’ ద్వారా నేడు మనదేశం పోలియో మహమ్మారి నుండి ఏవిదంగా బయట పడగలిగిందో చూస్తే, ఎటువంటి పనయినా చిత్తశుద్దితో చేపడితే తగిన ఫలితాలు తప్పక వెలువడతాయని తెలుస్తోంది. ప్రజలలో చైతన్యంతోనే ఇటువంటి అత్యాచారాలు పూర్తిగా సమసిపోతాయని చెప్పలేకపోయినా, కొంత మేరకు వాటి తీవ్రత తగ్గించగలమని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును.   అయితే, ఇటువంటి సమస్య పరిష్కారానికి సమాజం తన కుటుంబం నుండే ప్రయత్నాలు మొదలుపెట్టవలసి ఉంటుంది. విద్య, ఆహారం, వస్త్రధారణ, కట్టుబాట్లు వంటి అనేక విషయాలలో మన సమజం బాలబాలికల మద్య తీవ్ర వ్యత్యాసం చూపుతూ, మగపిల్లలను కొంచెం ‘అధిక సమానం’ అనే రీతిలో పెంచడంవల్లనే, ఆ ప్రభావంతో పెరిగిన మగపిల్లలు తరువాతకాలంలో స్త్రీల పట్ల చులకనభావం ప్రదర్శిచడం జరుగుతోంది.   నిజం చెప్పాలంటే మన భారతీయ సంస్కృతికి లేదా ప్రపంచంలో మరే ఇతర దేశాల సంస్కృతికి అయినా అద్దం పట్టేవారు సాధారణంగా మహిళలే అయి ఉండటం, మహిళల ప్రత్యేకతని చాటిచెపుతోంది. అటువంటి మహిళల పట్ల సభ్య సమాజం తలదించుకొనే విదంగా మానవమృగాల హేయమయిన చర్యలకి పాల్పడుతున్నపటికీ మనం స్పందించకపోతే సమాజంలో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది. అంతే గాకుండా, భావితరల ముందు మనం దోషులుగా నిలబడవలసిన దుస్థితి కూడా ఎదుర్కోకతప్పదు.   చట్టాలు, శిక్షలు ఎన్ని మార్పులు చేసుకొనప్పటికీ, మనమంతా కలిసి భావిభారత పౌరులుగా తీర్చి దిద్దలనుకొంటున్న బాలలను బాల్యం నుండే కుటుంబంలో, తరగతి గదుల్లో బాలల మనస్సులో మనం మంచి విత్తులు నాటగలిగిన నాడు, సమాజంలో నేర ప్రవృత్తికూడా క్రమంగా అంతరించే అవకాశం ఉంది.

పాతపాటనే మళ్ళీ పాడిన ‘అఖిలం’

      గారెల రుచి ఎలాఉంటుందో అందరికీ తెలిసినప్పటికీ, మళ్ళీ తినబోతూ గార్ల రుచి అడగినట్లుగానే, ఈ రోజు కేంద్రం నిర్వహించిన అఖిలపక్షసమావేశంలో ఏఫలితాలు వస్తాయో అందరూ ముందుగానే ఊహించినపటికీ, అడియాసతో అందరూ ఫలితాలకోసం మళ్ళీ ఆత్రంగా టీవీలముందు కూర్చొని ఎదురుచూసారు. అందరూ ఊహించిన ఫలితాలే వెలువడి ప్రజల రాజకీయ పరిణతిని మరోమారు నిరూపించాయి.   కాంగ్రెస్, వై.యస్సార్.కాంగ్రెస్, తెలుగుదేశం మూడు పార్టీలు కూడా రాష్ట్రవిభజనపై తమ స్పష్టమయిన వైఖరి చెప్పకుండా ఈసారీ తప్పుకొని, తెలంగాణావాదుల ఆగ్రహాన్ని నేటినుండి చవిచూడనున్నాయి.   హోం మంత్రి సుషీల్ కుమార్ షిండే స్వయంగా కాంగ్రేసుపార్టీకి చెందినవాడయినప్పటికీ, తన పార్టీ అభిప్రాయాలను చెప్పకుండా ఈసమావేశంలో ఆయన కేవలం ఒక ప్రేక్షకపాత్ర పోషిస్తూ, మిగిలిన పార్టీల అభిప్రాయాలు సేకరించడనికే ప్రాదాన్యతని ఇచ్చేరు. అయితే, ఈ సమావేశంలో ఆయన రెండు కీలకనిర్ణయాలు ప్రకటించారు. అందులో మొదటిది రాష్ట్రవిభజనపై ఇదేఆఖరి సమావేశం అనే ప్రకటన కాగా, సరిగ్గా నెలరోజులలోపు తెలంగాణాసమస్యని పరిష్కరిస్తామని చేసిన ప్రకటన రెండవది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ‘నెలరోజుల గడువు’ తనకు తానూ విదించుకోవడం ఒక్కటే అది చేసిన సానుకూల ప్రకటనగా భావించ వలసి ఉంటుంది.   అయితే, అది తెలంగాణాకి సానుకూలమని అనుకోవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే, రాష్ట్ర విభజన సమస్యపై కాంగ్రెస్ ముందు అనేక పరిష్కారాలున్నాయని మనకి తెలుసు. రెండవ యస్సార్సి వేయడం లేదా తెలంగాణా అభివృద్ధి మండలిని ఏర్పాటుచేయడం వంటి మార్గాలువేటినయినా అది ఎంచుకొని పరిస్తితులు తనకు అనువుగా మారేవరకు, తెలంగాణా సమస్యని మరికొంతకాలం సాగాదీయవచ్చును.   అయితే, ఈ సమావేశంలో మొట్టమొదట మాట్లాడిన కాంగ్రెస్ ప్రతినిధి సురేష్ రెడ్డి మాత్రం తెలంగాణాకి అనుకూలంగా మాట్లాడారు. అయన సమావేశం ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ తానూ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్నే స్పష్టంగా వ్యక్తంచేసానని తెలిపారు. అయితే, సమావేశంలో ఆఖరిగా మాట్లాడిన మరో కాంగ్రెస్ సభ్యుడు గాదే వెంకటరెడ్డి మాత్రం రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని అన్నారు. తద్వారా, సురేష్ రెడ్డి వాదనలు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలుగా పరిగనించలేని పరిస్తితి ఏర్పడింది.   ఇక, ముందే ఊహించినట్లు తెలుగుదేశం పార్టీ, వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర విభజన బాద్యతను కేంద్రం మీదకి నెట్టేసి, ప్రస్తుత రాష్ట్రంలో నెలకొన్నరాజకీయ అనిశ్చితితికి దానినే బాద్యురాలిని చేసి చేతులు దులుపుకొని బయట పడ్డాయి. ఆరెండు పార్టీలు కేంద్రం ఏనిర్ణయం తీసుకొన్నా స్వాగతిస్తామని చెపుతూ బంతిని కాంగ్రేసు కోర్టులో పడేశాయి.   ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తానూ 2008లో కేంద్రానికి ఇచ్చిన లేఖకే ఇప్పటికీ కట్టుబడి ఉన్నామంటూ చెప్పి, తానూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలో వద్దో అనే విషయంపై స్పష్టమయిన ప్రకటన చేయకపోవడంవల్ల నేటినుండి తెలంగాణావాదుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడనున్నది.   రాష్ట్ర విభజన విషయంలో మొదటినుండి ఒక కచ్చితమయిన అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సిపీఐ, భారతీయజనతాపార్టీ, తెరాస. పార్టీలు ఖచ్చితంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలని కోరగా, సిపియం పార్టీ రాష్ట్ర విభజనని వ్యతిరేకించింది. ఇటీవల, కాంగ్రేసుకు మద్దతు ఉపసంహరించిన యం.ఐ.యం. పార్టీకూడా రాష్ట్ర విభజనని వ్యతిరేకించింది. తప్పని సరయితే, రాష్ట్రాన్ని రాయల తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాలుగా విభజించాలని కోరింది.   మొత్తం మీద ఈ అఖిలపక్షసమావేశం ద్వారా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నెల రోజుల సమయం దొరకపుచ్చుకోగలిగింది. అప్పటికి ప్రజలని, మీడియాని ఆకర్షించే మరో సంఘటన ఏదయినా జరుగకపోదా, తెలంగాణా సమస్యని మరికొంత కాలం సాగాదీయలేకపోతామా అని కాంగ్రెస్ పార్టీ ఊహించుకొని సంతోషపడుతున్నా ఆశ్చర్య పోనవసర లేదు. తెరాస. అధినేత  కెసిఆర్ నేరుగా డిల్లీనుండే రేపు తెలంగాణాబంద్ కు పిలుపునిచ్చేసారు. ఇక రేపటినుండి తెలంగాణా బందులకు, నిరసన కార్యక్రామాలకు ప్రజలు సిద్దంగా ఉండక తప్పదు. రేపటినుండి, తెలుగుదేశం, కాంగ్రెస్, యస్సార్ కాంగ్రెస్ పార్టీలు మూడూ కూడా తెలంగాణాలో తీవ్రఇబ్బందులను ఎదుర్కొనవచ్చును.  

నాల్గోవ ప్రపంచ తెలుగు మహా సభలు ప్రారంభం

          తిరుపతి వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. గవర్నర్ నరసింహన్,, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పలువురు మంత్రులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ముందుగా ప్రముఖ గాయనిలు సుశీల, రావు బాలసరస్వతి మాతెలుగు తల్లి పాటను పాడగా, తెలుగు భాషపై ప్రత్యేకంగా రచించిన, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను సభలో వినిపించారు. ఆనారోగ్య కారణాల వల్ల ఆయన ప్రత్యక్షంగా పాడలేకపోతున్నట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. మరోవైపు తెలుగు మహాసభల సందర్భంగా తిరుపతిలో తెలుగుదనం ఉట్టిపడుతోంది. కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలలో సందడి నెలకొంది. కొన వూపిరితో ఉన్న తెలుగు బాషకు పూర్వ వైభవం కల్పించడమే ఈ మహాసభల అసలు లక్ష్యం.   ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగును ‘అధికార బాష’ గా నిలబెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా చర్చిస్తారు. తెలుగు బాషకు చెందిన భాషా వేత్తలు, పలు రంగాల ప్రముఖులు ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలు వివరిస్తారు. తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనే అంశంఫై ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇదే వేదికగా ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. సాహిత్యం, లలిత కళలు, సంగీత రంగాలకు ప్రత్యేకంగా అకాడమీలను ఏర్పాటు చేసే విషయం గురించి కూడా ముఖ్య మంత్రి తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు.   గ్రామ, మండల, జిల్లా,రాష్ర స్థాయిల్లో క్రమంగా తెలుగు బాషను అమల్లోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లు సమాచారం. ఈ అంశంఫై కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలుగు మహాసభల సందర్భంగా పుణ్య క్షేత్రం తిరుపతి లో తెలుగు వైభవం ఉట్టి పడుతోంది. దీనిని పురస్కరించుకొని తిరుపతి నగర పాలక సంస్థ ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దింది. ఈ సభా ప్రాంగణంలో ఐదు ఉప వేదికలను ఏర్పాటు చేశారు. ఈ ఐదు వేదికల్లో సాహిత్యం, జానపదం, రంగ స్థలం, సంగీతం, నృత్యం రంగాలకు సంభందించిన కార్యక్రమాలు జరుగుతాయి.   ఈ సభల సందర్భంగా, అధికార బాషా సదస్సు, విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలుగు వారు, సాహిత్య వేదిక, చరిత్ర, లలితా కళలు, ప్రగతి రంగం వంటి అంశాల్లో చర్చలు జరుగుతాయి. సుమారు రూ. 50 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఈ సభలకు సుమారు 40 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అలాగే, తిరుపతి నగరంలో ఆసక్తి ఉన్నవారంతా ఈ సభలకు హాజరయ్యేందుకు కూడా అవకాశం కల్పించారు.   ఈ సందర్భంగా రాష్త్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 14 మంది తెలుగు ప్రముఖులకు సన్మానం జరగనుంది. డాక్టర్ సి.నారాయణరెడ్డి (సాహిత్యం), సిఆర్.రావు (శాస్త్రం), యామినీ కృష్ణమూర్తి (నృత్యం), అక్కినేని నాగేశ్వరరావు (చలనచిత్రం), ఆచంట వెంకటరత్నంనాయుడు (నాటకం), చుక్కా సత్తయ్య (జానపదం), బాపు (కళలు), ఎస్వీ రామారావు (చిత్రకళ), ముఖేష్ (క్రీడలు), అజారుద్దీన్ (క్రీడలు)లతోపాటు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రముఖులు చివుకుల ఉపేంద్ర (న్యూజెర్సీ), గుజ్జుల రవీంద్ర (జర్మనీ), ఎం. శ్రీనివాసరెడ్డి (శాస్త్రవేత్త, అమెరికా), భాట్టం శ్రీరామమూర్తిలు ఈ జాబితాలో ఉన్నారు.   మొదటి ప్రపంచ తెలుగు మహా సభలు 1975 లో హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం లో అప్పటి ముఖ్య మంత్రి జలగం వెంగళరావు ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగాయి. ఇక మిగిలిన రెండు సభలు విదేశాల్లోనే జరిగాయి. రెండవ సభలు 1981 ఏప్రిల్ లో మలేషియాలో ఐదు రోజుల పాటు జరిగాయి. మూడో ప్రపంచ తెలుగు మహా సభలు 1990లో మారిషస్ లో జరిగాయి. ఈ సభల కోసం ప్రభుత్వం భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది. ఏడుగురు ఎస్ పి స్థాయి అధికారుల పర్యవేక్షణలో మొత్తం ఆరు వేల మంది పోలీసులు ఈ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తెదేపా సువర్ణావకాశం చేజార్చుకొందా?

  నిన్నఅహ్మదాబాద్ లో ఘనంగాజరిగిన నరేంద్రమోడీ ప్రమాణస్వీకార సభకి బాలయ్యబాబుని వెళ్ళనీయకుండా అడ్డుపడి తెలుగుదేశంపార్టీ ఒకసువర్ణావకాశాన్ని చేజేతులావదులుకొందా అనే అనుమానం ఆపార్టీశ్రేణుల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం.   గుజరాత్ ఎన్నికలలో వరుసగా మూడవసారి విజయం సాదించిన నరేంద్రమోడీ రానున్నఎన్నికలలో భారతీయపార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్దిగా పోటీచేసే అవకాశాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం నేపద్యంలో, అతని ఆహ్వానం మన్నించి దేశం నలుమూలలనుండీ వచ్చిన అతిరధ,మహారధులు నిన్నఆయన సభకు హాజరవడం ద్వారా ఆయనతో, అయన ప్రాతినిద్యం వహిస్తున్నభారతీయపార్టీతో రానున్న ఎన్నికలలో చేతులు కలిపి పనిచేసేందుకు సముఖంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.   ప్రస్తుత పరిస్తితిలో కేంద్రంలో, రాష్ట్రంలో కూడా అధికారం కోరుకొనే ప్రతీ ప్రాంతీయ రాజకీయపార్టీ కూడా, కాంగ్రేసుతో కలవడమో లేక దానికి ప్రత్యమ్నాయం కోసం చూడకతప్పని పరిస్తితి. కాంగ్రేసును వ్యతిరేకిస్తున్నవారు, కాంగ్రేసుపార్టీకి జాతీయస్థాయిలో ఏకైక ప్రత్యమ్నాయంగా నిలిచిన భారతీయపార్టీనే ఆశ్రయించక తప్పని పరిస్తితుల్లో, నిన్న మోడీ సభలో పాల్గొని నరేంద్రమోడీ చాచిన స్నేహహస్తం అందుకొనే ప్రయత్నం చేసారు.   గతంలో, యన్.డి.యే. కు మద్దతు ప్రకటించి భారతీయపార్టీకి పరోక్షంగా కలిసి పనిచేసిన తెలుగుదేశంపార్టీ, నేడుకూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంది. అటువంటప్పుడు, మోడీ సభకి బాలయ్యను కనీసం వ్యక్తిగత హోదాలోనయినా పాల్గొననీయకుండా చేసి ఒక సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకోందని ఆపార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.   ఒకవేళ, మోడీ అందిస్తున్న స్నేహ హస్తాన్ని వై.యాస్సార్.కాంగ్రెస్ పార్టీ గానీ, తెరాసగానీ అందుకొంటే అప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ పరిస్తితి చాలా దారుణంగా మారవచ్చును. కాంగ్రెస్ పార్టీ వల్లనే జైలు జీవితం గడువలసి వస్తోందని ఆవేదన చెందుతున్న జగన్ మోహన్ రెడ్డి, తన విడుదలకు భారతీయజనతా పార్టీ గానీ ఏమాత్రమయినా ఉపయోగపడగలదని నమ్మినట్లయితే అతను తప్పకుండా ఆపార్టీ చేయందుకోవచ్చును. అతని ప్రస్తుత పరిస్తితిపట్ల సానుభూతి చూపుతున్న క్రిస్టియన్ మరియు రెడ్డి వర్గాలకు చెందినవారు కూడా, అతను భారతీయజనతా పార్టీతో చేతులుకలిపినా, దానిని అతను ఆఊబిలోంచి బయటపడేందుకు చేసే ప్రయత్నంగా అర్ధంచేసుకొని అతనికే తమ మద్దతు ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంది.   ఇక, కేవలం భారతీయజనతాపార్టీ మాత్రమే తెలంగాణా ఇవ్వగలదని ఇప్పటికే పలుమార్లు ఆ పార్టీ స్పష్టంగా ప్రకటించిన నేపద్యంలో, కాంగ్రేసు పార్టీ తెలంగాణా విషయంలో అనుసరిస్తున్న సాచివేత వైఖరితో విసిగెత్తిపోయున్నతెరాస రాష్ట్ర సాధనకోసం భారతీయజనతాపార్టీతో ఎన్నికలపొత్తులకు సిద్దమయినా ఆశ్చర్య పోనవసరం లేదు.   ఒకవేళ, ఈ రెండు పార్టీలతో భారతీయజనతాపార్టీ గానీ సంబందాలు కలుపుకోగాలిగితే, అప్పుడు రాష్ట్రంలో అవి ఒక బలమయిన కూటమిగా ఏర్పడి, అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు తెలుగుదేశం పార్టీకి కూడా అసలుకే మోసం తెచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.   ఇటువంటి నేపద్యంలో, నరేంద్ర మోడీ సభకు వెళ్ళకుండా తెలుగుదేశంపార్టీ పెద్ద తప్పే చేసిందని అనుకోవచ్చును. అయితే, తెరాస., వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీలు చొరవ చూపక ముందే తెలుగుదేశం పార్టీ మేల్కొంటుందా లేక మతతత్వ పార్టీ అనే ఆలోచనతో భారతీయజనతాపార్టీకి దూరంగా ఉండి, ఏటికి ఎదురీదాలని అనుకొంటుందో తానే తెలియజెప్పాలి.   ఒకవేళ మళ్ళీ యన్.డీ.యే. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఏర్పడితే, అప్పుడు తెలుగుదేశంపార్టీ దానితో కలిసే ఆలోచనగాని ఉంటే, ఆపనేదో ఇప్పుడే చేయడం ద్వారా రాష్ట్రంలో తన పరిస్తితి చేజారకుండా చుసుకొంటూనే, మరో వైపు మళ్ళీ కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం కూడా పొందవచ్చును. అయితే, మతతత్వపార్టీతో అంటకాగితే తన మైనార్టీ ఓట్లన్నీ ఇతర పార్టీల ఖాతాలోకి జమా అయిపోతాయని గానీ ఆ పార్టీ ఆలోచిస్తూ కూర్చొంటే, అప్పడు ముందే చెప్పినట్లు మిగిలిన రెండు పార్టీలు గానీ , లేదా వాటిలో ఏ ఒక్కటయినా గానీ భారతీయజనతా పార్టీతో కలిస్తే, అప్పుడు తెలుగుదేశం పార్టీకి అసలుకే మోసం వస్తుంది.   ఇది గాకుండా, తెలంగాణా అంశంవల్ల కూడా తెలుగుదేశంపార్టీకి రానున్న ఎన్నికలలో భారీనష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రస్తుతం తెలంగాణాలో ఎన్ని పాదయాత్రలు చేసినప్పటికీ, ఎన్నికల సమయంలో తెలంగాణా సమస్యని లేవనెత్తి తెలంగాణా ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టగల నేర్పరి అయిన కేసిర్ అక్కడ తెలుగుదేశంపార్టీని గెలవనిస్తాడని అనుకోలేము.   అదేవిదంగా, ఇప్పుడు జైల్లో ఉన్నపటికీ వివిధ పార్టీల నేతలని ఆకర్షిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా రాబోవు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఒక పెనుసవాలు కాబోతున్నడని చెప్పవచ్చును.   ఈ నేపద్యంలో భారతీయజనత పార్టీ చేయందుకోవాలా, వద్దా అనే మీమాంసలో ఎంతకాలం వృధాచేస్తే అంత ఆపార్టీకే ప్రమాదం అని చెప్పవచ్చును. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోగల నేర్పు తెలుగుదేశం పార్టీకి ఉందో లేదో త్వరలోనే తేలిపోవచ్చును.   కొసమెరుపు: మోడీ నుండి ఆహ్వానం అందుకొన్న తెరాస అధ్యక్షుడు కే.చంద్రశేకర్ రావు, పిలుపు అందగానే అయన సభకు వెళ్లి ఊహించని విమర్శలు ఎదుర్కోవడం ఇష్టం లేకపోయినా, ఎందుకయినా మంచిదని ముందు జాగ్రత్తగా తాము అఖిలపక్ష సమావేశం హాడావుడిలో ఉన్నందున మీ ప్రమాణస్వీకారసభకు రాలేకపోతున్నామని. తెరాస తరపున అభినందనలు అని లేఖ వ్రాసి, భారతీయజనతాపార్టీతో పొత్తులకు తలుపులు తెరిచే ఉంచుకొని జాగ్రత్త పడ్డారు.

తె.దే.ప. తన వైఖరిని ఎందుకు ప్రకటించటలేదు?

    గత రెండు నెలలుగా తెలంగాణాలో విస్తృతంగా పాదయాత్రలు చేస్తున్న చంద్రబాబు నాయుడు, తను తన పార్టీ తెలంగాణాకి ఎంతమాత్రం వ్యతిరేఖం కాదని, అఖిలపక్షసమావేశంలో కానీ, మరెక్కడయినా గానీ, తెలంగాణాకి వ్యతిరేఖంగా మాట్లాడబోమని హామీలుఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ వారంలో జరగనున్న అఖిలపక్షసమావేశoలో తెలుగుదేశం పార్టీ ఏమిచెప్పాలనే విషయంపై చర్చించడానికి ఈరోజు తెలుగుదేశం తెలంగాణా ఫోరం నేతలందరూ కూడా చంద్రబాబుతో కరీంనగర్ లో సమావేశంఅయ్యేరు. సమావేశo తరువాత, తెలంగణా ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా వారితో మాట్లాడుతూ, తామందరమూ పార్టీ అధినేతకు తెలంగాణా విషయంపై తమ తమ అభిప్రాయాలు తెలియజేశామని చెప్పారు. రేపు పార్టీకి చెందిన సీమాంధ్రా నేతలతో కూడా చంద్రబాబు సమావేశం అయ్యి వారి అభిప్రాయాలు కూడా తీసుకొన్న తరువాత 27వ తేదిన పార్టీ తరపున అఖిలపక్షసమావేశానికి వెళ్ళే ఇద్దరిపేర్లు ప్రకటిస్తామని ఎర్రబెల్లి తెలిపారు. అయితే, పార్టీ తరపున ఇద్దరు వెళ్ళినప్పటికీ ఇద్దరూకూడా ఒకేఅభిప్రాయం వ్యక్తం చేయబోతున్నారని ఆయన తెలియజేసారు. అయితే, ఆ అభిప్రాయం ఏమిటనేది ఇప్పుడు వెల్లడించలేమని చెప్పారు.   ఇక తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ప్రకటనలు, చంద్రబాబు మాటలు విన్నట్లయితే తెలుగుదేశం పార్టీ తెలంగాణాకి అనుకూలంగా ఉన్నట్లుగా అర్ధమవుతోంది. ఇంతవరకు ఆ పార్టీకిచెందిన సీమాంధ్రా నేతలెవరూ కూడా పార్టీ సమైక్యాంద్రాకే కట్టుబడి ఉండాలని గట్టిగా కోరుతూ ప్రకటనలు చేయకపోవడం గమనించినట్లయితే, అటువైపునుండి కూడా రాష్ట్ర విబజనకు పెద్దగా అభ్యంతరాలు లేవన్నట్లే అర్ధమవుతోంది. పార్టీలో తెలంగాణాకి ఇంత సానుకూలంగా ఉన్నపటికీ, మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు తానూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి అనుకూలమని ప్రకటన చెయ్యట్లేదు?   బహుశః అది బంతిని కాంగ్రేసు కోర్టులో పడేసి ముందుగా ఆపార్టీ చేత తెలంగాణాకి అనుకూలమా లేక వ్యతిరేఖమా లేక ఎటూ తేల్చకుండా నాన్చబోతోందా అనే ప్రకటన చేయించగలిగితే, అప్పుడు వచ్చే ప్రతిస్పందనబట్టి తన నిర్ణయంలో మార్పులు చేసుకోవచ్చని ఎదురుచూస్తున్నట్లు అనుకోవచ్చును.   ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర వైపే మొగ్గు చుపినట్లయితే, తానూ తొందరపడి ముందుగా రాష్ట్ర విబజనకి అంగీకరిస్తూ ఇప్పుడే ప్రకటన చేసేస్తే, అది సీమంద్రా ప్రాంతాలలో పార్టీకి నష్టం కలిగించవచ్చును. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టనపుడు, తెలుగుదేశం పార్టీ ముందుగా విడిపోవాలనికోరుతూ నోరువిప్పి సమస్యలు తెచ్చుకోవడమెందుకు అనేది దాని ఆలోచన అయ్యి ఉండవచ్చును. పైగా కాంగ్రెస్ సమైక్యమనప్పుడు, తానూ విబజన అనిఅంటే అది కాంగ్రేసుకి సీమంద్రా ప్రాంతాలలో ఒక వరంగా మారుతుంది.   ఒకవేళ తానూ సమైక్యాంధ్రకి అనుకూలమని ప్రకటన చేసినట్లయితే, కాంగ్రేసు నెత్తినపడాల్సిన బండ చేజేతులా తన నెత్తికి ఎత్తుకొన్నట్లవుతుంది అనేది దానిఅభిప్రాయం అయి ఉండవచ్చును. అప్పుడు ఇక తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో ఇబ్బందులు తప్పవు. అందువల్లే, తెలుగుదేశం పార్టీ ఇంతవరకు రాష్ట్ర విబజనపై తన అభిప్రాయం ప్రకటించేందుకు సాహసించడంలేదు అనుకోవాలి.   అయితే, మరొక్క మూడు రోజుల్లో జరుగబోయే అఖిలపక్షసమావేశంలో తప్పనిసరిగా తన వైఖరిని తెలియజేయాల్సి వచ్చినప్పుడు, అప్పుడూ ఇదే సమస్య ఎదుర్కోవచ్చుకదా? అనే అనుమానం కలగడం సహజం.   అప్పుడు తెలుగుదేశం ఏమి చెపుతుందని ఊహిస్తే, కాంగ్రెస్ పార్టీ తన వైఖరి ఎలాగు ముందుగా తెలియజేయనని ఖరాఖండీగా చెప్పేసింది. గనుక, మళ్ళీ అఖిలపక్ష సమావేశంలోకూడా ప్రస్తుత వైఖరినే తెలుగుదేశం అవలంబించవచ్చును. అంటే, కాంగ్రెస్ కోర్టులో మళ్ళీ బంతిని పడేసి “రాష్ట్ర విబజనపై కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకొన్నా తమకు ఆమోదమే!” అని ఒకే ఒక వాక్యం చెప్పి చల్లగా బయటకి రావచ్చును. అప్పుడు, నిర్ణయం ప్రకటించాల్సిన బాద్యత కాంగ్రెస్ నెత్తినేపడి, తెలుగుదేశం సేఫ్ సైడ్ లో ఉంటుంది. అప్పుడు, మేము తెలంగాణాకి అనుకూలమో వ్యతిరేకమానో చెప్పలేదు గాబట్టి, ‘తెలంగాణా ఇచ్చేది తెచ్చేది కాంగ్రేసే’ అని డప్పు కొట్టుకొని తిరుతున్న కాంగ్రెస్ నేతల మీద తీవ్ర ఒత్తిడి మొదలవుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒడ్డున పడిన చేపపిల్లలా గిలగిలమని కొట్టుకొంటుంటే, తెలుగుదేశం తాపీగా ఒడ్డున కూర్చొని ముచ్చటగా చూడగలదు.   ఈ భయంతోనే తెరాస నేతలు చంద్రబాబు చేత ఎలాగయినా అఖిలపక్షంలో కూర్చొనే లోపుగానే అతని నోట తెలంగణా అంశంపై ‘మమ’ అనిపించేస్తే ఇక మరి దానికే కట్టుబడి ఉండక తప్పదు అని ఆలోచించి తెలంగాణాపై తెలుగుదేశం పార్టీ వైఖరిని స్పష్టంగా ముందే ప్రకటించాలని పట్టు బడుతున్నారు. గానీ, బాబు నోట ఆ ముత్యాలు రాలితే ఎరుకొందామనే వారి ఆశ అడియాశే అవుతుంది.  

అత్యాచార భాదితురాలిని రేప్ చేసిన పోలీసులు

  ఒక వైపు ‘దామిని’ (డిల్లీ బాదితురాలికి, ఆందోళనచేస్తున్న యువత పెట్టుకొన్న పేరు.) సామూహిక అత్యాచారం పై డిల్లీ నగరం అట్టుడికిపోతున్న ఈ తరుణంలో అంతకంటే హీనాతిహీనమయిన సంఘటనలు ఒక్కొకటిగా నిత్యం వెలుగులోకి వస్తూనేఉన్నాయి.   ఒక కుటుంబం తనకు అడిగినప్పుడు ఆహారం ఈయనందుకు పగబట్టి, ఇంట్లో అక్కపక్కలోనిద్రిస్తున్న పాపం,పుణ్యం తెలియని ఐదు సం.ల పసిపిల్లని ఒక క్రూర మగమృగం ఎత్తుకు వెళ్లి అత్యాచారం చేయగా, మన ఊరి పెద్దాయనే అని నమ్మి స్కూటరు ఎక్కి ఇంటికి జేరుకోవలనుకొన్న ఒక 7వ క్లాసు చదివే విద్యార్దిని ఘోరంగా బలత్కారింపబడింది. మణిపూర్ రాష్ట్రంలో అందరి ముందూ ఒక అధికారి సినిమా నటితో అసభ్యంగా ప్రవర్తించి రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చెడు.   మదమెక్కిన మగాళ్ళు ఇలాగ ప్రవర్తిస్తుంటే, అటువంటి వారిని కటినంగా శిక్షించాల్సిన మన రక్షకబటులు స్వయంగా ఆ నేరానికి పాల్పడుతూ ఇక ప్రజలు ఎవరికీ మొరపెట్టుకోవాలో తెలీని పరిస్తితిని కల్పిస్తున్నారు.   కంచే చేను మేసినట్లు గా కొద్ది రోజుల క్రితం జరిగిన ఘోర సంఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. గత నెల నవంబరులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక యువతిని కొందరు దుండగులు సామూహిక అత్యాచారం చేసారు. తీవ్ర మానసిక శారీరిక క్షోభ అనుభవిస్తున్న ఆమె కుటుంబం దైర్యంచేసి అంబేద్కర్ నగర్ లో ఉన్న పోలీసుస్టేషనులో పిర్యాదు చేసారు. అయితే, అక్కడా కొన్ని మగ మృగాలున్నాయని ఆమెకి, ఆమె కుటుంభ సభ్య్యులకీ తెలియదు పాపం. ఒకవేళ, తెలిసుంటే అసలు పిర్యాదే చేసిఉండేవారు కాదేమో.   స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ మాన్ సింగ్ దృష్టి ఆమెపై పడింది. కొన్ని రోజులు స్టేషన్ చుట్టూ ఆమెను తిపించుకోన్నాక, “నీకేసును ఫజియబాదులో ఉన్న డి.ఐ.జి.గారికి చెప్పుకొన్నట్లయితే దోషులకు వెంటనే శిక్షపడేలా చేయోచ్చు” అని పోలీసు ఇన్స్పెక్టర్ మాన్ సింగ్ చెప్పినప్పుడు అతనిని అమాయకంగా నమ్మిన ఆ యువతి అతని పోలీస్ జీప్ ఎక్కింది. ఆమెను ఫజియాబాద్ కు బదులు స్థానిక హోటల్ కి తీసుకువెళ్లి ఆమెను బలాత్కారం చేసాడు. అతనితో బాటు వచ్చిన అక్బరాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్-చార్జ్ ఎ.కె. ఉపాద్యాయ్ కూడా ఆమెపై అత్యాచారం చేసాడు. తనను కాపాడవలసిన ఇద్దరు రక్షక భటుల చేతుల్లోనే మరోమారు తానూ అత్యాచారానికి గురవడం ఆ యువతికి తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది. అయితే, ఆఖరు ప్రయత్నంగా ఎలాగో వీలుచూసుకొని అదే ఊరులో ఉన్న తన స్నేహితురాలికి తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా తన పరిస్తితి తెలియజేస్తూ కాపాడవలసినదిగా మెసేజ్ పంపగలిగింది. అది అందుకొన్న ఆమె స్నేహితురాలు వెంటనే పోలీసు ఆఫీసరు (యస్.యస్.పి.) డి.యస్. యాదవ్ ను అప్రమత్తం చేయగానే, ఆయన తన సిబ్బందిని తీసుకొని ఆ యువతిపై అత్యాచారం జరుగుతున్నహోటల్ కి చేరుకొని, ఇంకా తమ మధనఖండాని కొనసాగిస్తున్న తన ఇద్దరు పోలీసు ఆఫీసరులను పట్టుకొన్నారు.   అయితే, ఆ యువతి అప్పటికి పోలీసు కబంధ హస్తాలలోంచి బయట పడగలిగింది. గానీ, తనపై అత్యాచారం చేసిన ఇద్దరు పోలీసు ఆఫీసరులకు శిక్ష పడేలా మాత్రం చేయలేకపోయింది. నేరస్తులిద్దరూ పోలీసు శాఖకే చెందినవారయి ఉండటమే దానికి కారణం. ఆమె ఇప్పుడు ఇక ఎవరికీ మొరపెట్టుకోవాలో తెలియక ఏకంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కే నేరుగా ఒక లేఖ వ్రాసి తనగోడు వెళ్ళబోసుకోంది. అయితే, ముఖ్యమంత్రి ఇంకా స్పందిచేడా లేదా అనేది ఇంకా తెలియలేదు.   ఇటువంటి దయనీయ పరిస్తితుల్లోకి నెట్టిన కిరాతుకులను నిందించాలో లేక తనను కాపాడవలసిన వారే కభళించిన రక్షకభటులని శిక్షించాలని అడగాలో ఆమెకి తెలియట్లేదు.   డిల్లీలో జరిగిన అన్యాయాన్ని వేలదిగొంతులు ఖండిస్తూ దోషులకు ఉరిశిక్ష వేయవలసిందే అని ఉద్యమిస్తుండగా, మరోపక్క ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆ అబల ఒంటరిపోరాటం చేస్తోందిప్పుడు. ఆమెకి మద్దతుగా ఒక్క గొంతుకూడా ఎందుకు పలకట్లేదో మరితెలియదు. ఎవరి మద్దతూ దొరకని అటువంటి వారికి న్యాయం జరగుతుందని అనుకోలేము. ఎందుకంటే, కుల రాజకీయాలు చేయడంలో మన రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన ఉత్తరప్రదేశ్ లో ‘మనోడయితే’ ఇక ఏ నిబందనలూ అతనిని ఏమి చేయలేవు.   కొసమెరుపు ఏమిటంటే నిన్న రాత్రి మన మంత్రివర్యులు బొత్స సత్యనారాయణగారు అసలు “ఆడవాళ్ళూ ఎప్పుడు ఇంట్లో ఉండాలో ఎప్పుడు వీధులోకి రావచ్చునో తెలుసుకోకపోతే ఎలాగా” అని అసహనం వ్యక్తం చేసారు. అంతేగాకుండా “స్వాతంత్రం వచ్చిందకదాని అర్ధరాత్రీ అపరాత్రీ చూడకుండా ఆడవాళ్ళూ వీధులోకి వస్తే మరిలాగే ఉంటుంది పరిస్తితి” అని కూడా ఉద్బోదించారు. అయినా, జరిగినది “చిన్నసంఘటనే” అయినప్పటికీ తమ పార్టీ నేత స్వయంగా, అర్ధరాత్రి అనికూడా చూడకుండా వీధుల్లోకివచ్చి ఉద్యమం చేస్తున్న విద్యార్దులతో మాట్లాడటం అంటే గొప్పవిషయమే కదా అని ప్రజలని ప్రస్నించేరు ఆయన. ఇటువంటి నేతలు, పోలీసు వ్యవస్థా మనకున్నపుడు మనం గర్వపడక ఆందోళనలు చేయడం అవివేకం కాదా?

తెలంగాణాలో ‘సూపర్ పవర్’గా కెసిఆర్ ప్రయత్నాలు?

        ఈ నెల 28 న ఢిల్లీ లో తెలంగాణా విషయంఫై అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఆధారంగా కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుపోవచ్చని భావిస్తున్న టిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్ర శేఖర రావు ఇదే అదనుగా కాంగ్రెస్ తో పాటు, టిడిపి, జగన్ పార్టీలను ఏదో రకంగా ఇబ్బంది పెట్టి తెలంగాణాలో సూపర్ పవర్ గా ఎదగాలని పధక రచన చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.   ఈ సమావేశాన్ని ఆసరాగా చేసుకొని మిగిలిన పార్టీలను రాజకీయంగా దెబ్బ తీసి, తెలంగాణాలో ఏకైక ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ ను నిలపాలని కూడా కెసిఆర్ ఆలోచన చేస్తున్నారు. అలాగే, తెలంగాణా విషయంలో కాంగ్రెస్ ఇప్పట్లో ఓ నిర్ణయానికి రాలేదని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంఫై ప్రజల్లో వ్యతిరేకత ఉందని,ఈ కారణాల వల్ల వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ తనకు ఎంత మాత్రం పోటీ కాదని భావిస్తున్న కెసిఆర్ ఇక టిడిపి, జగన్ పార్టీల పని పట్టాలని ఆలోచన చేస్తున్నారు.   కొత్తగా ఎదుగుతున్న జగన్ పార్టీని, తెలంగాణాలో కాస్త బలంగా ఉండే టిడిపి ని ఈ ప్రాంతంలో నిలువరించగలిగితే, ఇక తనకు ఎదురు ఉండదని ఆయన భావించినట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు ఈ సమావేశంలో ఏమి చెప్పినా ఎదురు దాడి చేయాలని ఇప్పటికే ఆయన తన పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం.   ఇక కాంగ్రెస్ తెలంగాణా ఇస్తుందని తెలంగాణా కాంగ్రెస్ నేతలే ఇవ్వలేకపోతున్న్డ దశలో వారంతా తన పార్టీలో ఎన్నికలనాటికి చేరే అవకాశం ఉందని కెసిఆర్ ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. ఈ చేరికలతో టిఆర్ఎస్ మరింత శక్తివంతం అవుతుందని కెసిఆర్ భావిస్తున్నారు.   ఏది ఎలా ఉన్నా, ఈ సమావేశంలో ఈ మూడు పార్టీలు అవలంభించే వైఖరిని అనుసరించే కెసిఆర్ తన రాజకీయ ఎత్తుగడలు వేయాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

డిల్లీ గ్యాంగ్ రేప్: చితికిన బాదితురాలి జీవితం

  డిల్లీలో క్రిందటి ఆదివారం రాత్రి మెడికల్ విద్యార్ధినిపై జరిగిన అమానుషమయిన సామూహిక అత్యాచారంకు నిరసనగా డిల్లీలో విద్యార్దులు, యువత, ప్రజలు గత మూడు రోజులుగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి నిందితులపై కటినచర్యలు తీసుకొని వెంటనే భాదితురాలికి న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసినదే. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లతో విద్యార్దీ ప్రతినిదుల చర్చలు, ప్రభుత్వ హామీలు, విద్యార్డులపై పోలీసుల లాటీ చార్జీలు, బాష్ప వాయు ప్రయోగాలు మొదలయిన వార్తలు కూడా నిత్యం చూస్తూనే ఉన్నాము.   ఇక, మరోపక్క బాధితురాలి పరిస్తితి ఇప్పటికీ చాలా ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె శరీరంలో ఉన్న చిన్న ప్రేగులకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు దానిని తొలగించేరు. మానవ శరీరంలో జీర్ణ ప్రక్రియని కొనసాగించే చిన్నప్రేగులు దాదాపు 21 అడుగుల పొడవు ఉంటాయి. డాక్టర్లు ఆమె చిన్న ప్రేగులలో కేవలం 3 అంగుళాలు పొడవు మినహా మిగిలిన దానిని మొత్తం ఆపరేషన్ చేసి తొలగించేయవలసి వచ్చింది.   మనం రోజూ తీసుకొనే ఆహరం పూర్తిగా జీర్ణం కావాలంటే దాదాపు 21 అడుగుల పొడవు అవసరమే. అప్పుడు మాత్రమే, అక్కడ జీర్ణ ప్రక్రియ పూర్తయ్యి ఆహారం నుండి శరీరానికి అవసరమయిన శక్తిని ఉత్పత్తి చేసే వివిధ రకాలయిన ప్రోటీన్లు వగైరాలు ఈ ప్రక్రియలో విడదీయబడి చిన్నప్రేగుల గోడలద్వారా శరీరంలో అన్ని భాగాలకు చేర్చబడుతుంది. అయితే, ప్రస్తుతం బాదితురాలికి కేవలం 3 అంగుళాలు పొడవున్న చిన్న ప్రేగు మాత్రమే మిగిలి ఉంది. అందువల్ల, ఆమె ఇక ఏ రకమయిన ఘనాహారం లేదా ద్రవాహారం నోటి ద్వారా ఎన్నడూ తీసుకోలేదు. ఆమె జీవించి ఉండేందుకు సెలయిన్ లేదా అటువంటి వాటి మీదే కొన్ని సంవత్సరాలవరకు ఆదారపడక తప్పదు. ఒకవేళ ఆమె పొరపాటున నోటి ద్వారా ఏ రూపంగానయినా ఆహరం తీసుకొన్నా లోపల చిన్న ప్రేగులు లేవు గనుక, వాటిని శరీరం నేరుగా బయటకి విసర్జించక తప్పదు. కనుక, డాక్టర్లు ఆమె శరీరంలో ఒక గొట్టం అమర్చవలసి వచ్చింది. దాని ద్వారా ఆమె తీసుకొన్న ఆహారం నేరుగా బయటకి వచ్చేస్తుంది.   నిన్నమొన్నటి వరకు ఏంతో హాయిగా బ్రతికిన ఒక అమాయకురాలయిన యువతి, మనుష్య రూపంలో తిరుగుతున్న క్రూర మృగాలకి బలయిపోయి ఇటువంటి దుస్తితికి జేరడం ఎవరి హృదయాలనయినా కలిచివేయక మానదు.   డాక్టర్ల అభిప్రాయం ప్రకారం, ఆమె పూర్తిగా కోలుకోనేందుకు ఒకటి లేదా రెండు సం.లు పట్టవచ్చును. అప్పుడు కేవలం అమెరికా వంటి దేశాలలో మాత్రమె అత్యంత ఖరీదయిన చిన్న ప్రేగుల మార్పిడి చికిత్స కోసం ప్రయత్నిస్తే ఆమె జీర్ణ వ్యవస్త బాగుపడవచ్చును. అయితే, మిగిలిన అవయవాల మార్పిడిలో దాదాపు 70 నుండి 80 శాతం వరకు విజయవంతం అవుతుండగా, ఈ చిన్న ప్రేగుల మార్పిడి చికిత్సలో మాత్రం కేవలం 20 నుండి 30 శాతం చికిత్సలు మాత్రమే విజయవంతం అవుతాయని డాక్టర్లు చెపుతున్నారు. అంటే, బాదితురాలికి భవిష్యత్ జీవితం అంతా ప్రశ్నార్దకమే అన్నమాట.   ఆమెకి ఇటువంటి దుస్తితి కల్పించిన దుర్మార్గులకు ఏమి శిక్ష విదిస్తే ఆమెకు న్యాయం జరుగుతుంది? అత్యాచారానికి గురయిన బాధకుతోడు, జీవితాంతం ఉండే ఈ శారీరిక బాద కూడా ఆమె భరించవలసి వచ్చినందుకు ఎవరిని బాద్యులను చేయాలి? నేరం చేసిన నేరస్తులనా? స్త్రీలకూ రక్షణ కలిపించని పోలీసులనా? సరయిన సమాజం ఏర్పరుచుకోలేని మన చేతకానితన్నానా?

దేశంలో నడుస్తున్న బ్రహ్మచారుల హవా..!

      బిజెపి నరేంద్రమోడీని కాంగ్రెస్ రాహుల్ గాంధీని 2014 ఎన్నికల్లో తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన పక్షంలో వీరివురు పోటీ మాట పక్కన ఉంచితే ఇద్దరికీ ఒక దగ్గరి పోలిక ఉంది. అదే బ్రహ్మచర్యం. నరేంద్రమోడి ఇంతవరకు వివాహం చేసుకోలేడు. ఆయన బ్రహ్మచారిగానే ఇప్పటివరకు ఉన్నారు. బహుశా భవిష్యత్తులో కూడా ఆయన తన బ్రహ్మచర్యాన్ని కొనసాగించవచ్చు. అదే తరహాలో రాహుల్ గాంధీ కూడా బ్రహ్మచారే. ఆయన కూడా ఇంత వరకు పెళ్ళి చేసుకోలేదు. పెళ్ళి చేసుకోమని సలహా ఇచ్చే మిత్రులకు ఆయన చిరునవ్వే సమాధానం చెబుతుంది. అలాగే రాబోయే కాలమంతా బ్రహ్మచారుల మాయం కానుందా. వీరబ్రహ్మంగారు చెప్పినట్టు బ్రహ్మచారుల శకం ప్రస్తుతం నడుస్తోంది. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ బ్రహ్మచారి.  బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిణిగా కొనసాగుతుంది. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా బ్రహ్మచారే. ఎన్డీయే మరో మిత్రపక్షనేత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా బ్రహ్మచారిణియే. బ్రహ్మచారిణి జాబితాలోనే ఉన్న యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి కూడా బ్రహ్మచారిణియే (ఎస్టీలకు ఉద్యోగ ప్రమోషన్ల విషయంలో బిఎస్సీ చేపట్టిన బిల్లుకు బిజెపి కూడా ఓటు మద్దతు తెలిపింది). బ్రహ్మచారుల సంఘంలో వీరంతా సభ్యులే. ఒక్క మాయావతి మాత్రమే ప్రస్తుతానికి ఎన్డీయే మిత్రపక్షంగా లేరు. కానీ భవిష్యత్తులో ఎన్డీయే భాగస్వామిగా చేరేందుకు ఆమె తన సమ్మతిని తెలియజేయవచ్చు. కానీ తమ బ్రహ్మచారి సంఘం అధ్యక్షుడు నరేంద్రమోడి ప్రధానమంత్రిత్వం కట్టబెట్టిన పక్షంలో తన మద్దతును కూడా ఇస్తానని చెప్పడం రానున్నది బ్రహ్మచారుల పాలన అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  

వాస్తు వల్లే జగన్ కి జైలు కష్టాలు..?

      లోటస్ పాండ్ లోని జగన్ మోహన్ రెడ్డి అత్యంత ఆధునికంగా నిర్మించుకున్న ఇంటివల్లే ఆయనకీ, ఆయన కుటుంబానికి అన్ని కష్టాలు వస్తున్నాయని వైసీపీలోని కొందరు నేతలు గతంలోనే జగన్ దృష్టికి తెచ్చారు. వాటిపై అంత నమ్మకం లేని జగన్ వాటన్నింటిని కొట్టి పడేస్తూ లోటస్ పాండ్ ఇంట్లోనే నివసిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా వాస్తు విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అప్పట్లో బంజారాహిల్స్ లోని వైఎస్ సొంత ఇంట్లో ఉన్నంతకాలం ఆయనకీ ఎలాంటి అధికారం అందలేదు. ఈ విషయంలో అప్పట్లో ఆయన ఆప్తుడు కేవీపీ పోరాడి తీవ్రంగా విభేదించడంతో ఇష్టం లేకపోయినా వైఎస్ తన మకాన్ని తన ఇంటి వెనుక వున్న కుమార్తె నివాసానికి మార్చారు. వాస్తు రీత్యా ఆ భవనంలో నివాసం ఉండటం మొదలుపెట్టిన తరువాతే వైఎస్ కు అధికారం దక్కింది. వైఎస్ఆర్ మరణం అనంతరం జగన్ కూడా కొంత కాలం అదే భవనంలో నివాసం ఉన్నారు. అక్కడ ఉన్నంత కాలం ఆయనకు కూడా కాంగ్రెస్ పార్టీలోని నాయకులు బ్రహ్మరథం పట్టారు. ఒక దశలో ముఖ్యమంత్రి పదవిని జగన్ మోహన్ రెడ్డికి కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులంతా ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. సిఎం పదవి దక్కకపోయినా జగన్ కాంగ్రెస్ లో ఒక బలమైన నాయకుడిగా ఉండేవారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రులు సైతం అప్పటి సిఎం రోశయ్యకంటే బంజారాహిల్స్ లో నివాసముండే జగన్ ఇంటికే ఎక్కువగా వచ్చిపోయేవారు ఇది గతం. ఇక ప్రస్తుతానికి వస్తే ఏ క్షణం అయితే జగన్ లోటస్ పాండ్ లోని తాను ముచ్చటపడి కట్టుకున్న నివాసానికి మకాం మార్చారో అప్పటి నుంచి ఆయనకు అన్నీ కష్టాలే మొదలయ్యాయి. ముఖ్యంగా లోటస్ పాండ్ ఇంటికి సంబంధించి పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగాయి. వివిధ దినపత్రికలు, టీవీ చానళ్ళు పతాక శీర్షికల్లో ఆ ఇంటి గురించిన వైభోగాన్ని వివరించాయి. 60 గదులు ఉన్నాయంటూ కొన్ని పత్రికలూ, 10 లిఫ్టులు ఉన్నాయంటూ కొన్ని చానళ్ళు ఆ ఇంటిని ఒక పెద్ద బూచిలా చూపెడుతూ రాద్దాంతం చేయడంతో దేశం మొత్తం జగన్ ఇంటిపైనే దృష్టి పెట్టింది. సిబీఐ కూడా జగన్ ఇంట్లోని అణువు అణువు పరిశోధించింది. కొన్ని వందల కోట్ల రూపాయలను లోటస్ పాండ్ ఇంటికి విలువ కట్టింది. ఆ ఇంట్లో జగన్ పట్టుమని పదిరోజులు కూడా నివసించింది లేదు. ఓదార్పు యాత్ర ద్వారా తరచు జనంలోనే ఉంటున్న జగన్ ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇంట్లో కుటుంబసభ్యులతో గడిపిన సందర్భాలు వేళ్ళతో లెక్కించవచ్చు. ఎంతో వివాదానికి గురైన జగన్ లోటస్ పాండ్ నివాసం ఆయనకీ కలిసిరాలేదని పరిశీలకులు అంటున్నారు. జగన్ జైలుకు వెళ్ళడం, షర్మిల జనాల్లోకి వెళ్ళడం గాయాల పాలు కావడం, ఒక పక్క సిబీఐ దాడులు, మరోపక్క ఈడీ ఆస్తుల జప్తులకై చేస్తున్న ప్రయత్నాలతో పాటు తరచు కోర్టులలో బెయిల్ లభించకపోవడం లాంటి సంఘటనలు అన్నింటికీ లోటస్ పాండ్ లోని జగన్ ఇంటి వాస్తు దోషమని కారణం ని ఎంత చెప్పిన జగన్ కానీ ఆయన తల్లి విజయమ్మ కానీ వినకపోవడంతో వైవీ సుబ్బారెడ్డితో కొందరు వైఎస్సార్ సిపి నేతలు వాస్తు మార్పులు చేయాల్సిందిగా సూచిస్తూ వాస్తుదోషాన్ని తొలగించినంత కాలం జగన్ కు ఆయన కుటుంబానికి వైకాపాకు కూడా కష్టాలు తప్పవని పలువురు వాస్తు విద్వాంసులు చెబుతున్నారు. స్వతహాగా వీటన్నింటికి విరుద్దమైన జగన్ ఏదో విధంగా మనసు మార్చుకొని వాస్తుదోషాలపై కూడా ఒక కన్ను వేస్తే బహుశా ఆయన కష్టాలు తీరవచ్చు. చంద్రబాబు కూడా ఒత్తిడులకు తలొగ్గి టిడిపి కార్యాలయాన్ని ప్రస్తుతం కొన్ని బాగాలను కూలగొట్టి తిరిగి వాస్తు విద్వాంసులు సూచించిన మేరకు మార్పులు చేర్పులు చేపట్టారు. ప్రస్తుతం టిడిపి ప్రధాన కార్యాలయంలో వాస్తు ప్రకారం మార్పులు జరుగుతున్నాయి. అవి పూర్తయిన వెంటనే బహుశా టిడిపి తన పునఃవైభవాన్ని పొందగలుగుతుంది అని ధీమాగా వాస్తు పండితులు చెబుతున్నారు. జగన్ కూడా లోటస్ పాండ్ ఇంటిని వాస్తు మార్పులు చేయగలిగితే ఆయన కష్టాలన్నీ తొలగిపోవచ్చని వాస్తు విద్వాంసులు పేర్కొంటున్నారు.  

కొండా సురేఖమ్మా! ఎందుకంత ఆవేశం?

  తే.ర.స. మరియు వై.యస్సార్. పార్టీల మద్య చిన్నగా మొదలయిన గొడవ నిన్నటి పరస్పర దాడులతో పెద్దయుద్ధంగా మారిపోయింది. తే.ర.స. పార్టీ ఎంత ఘాటుగా ప్రతిస్పందిస్తోందో అంతకంటే ఎక్కువగానే వై.యస్సార్. పార్టీ నాయకురాలు కొండాసురేఖ కూడా స్పందిస్తూ కయ్యానికి సై అంటే సై అని పందెంకోడిలాగా కాలు దువ్వుతూ తెలంగాణాలో తనకకి ఎదురేలేదనుకొంటున్న తే.ర.స. కి ఒక కొరకరాని కొయ్యలా ఆమె తయారయిందనాదంలో సందేహం లేదు.   మంచి వాగ్దాటి, రాజకీయ చతురత, పరిణతి కలిగిన ఆమె టీవీ చాన్నళ్ళలో తన ప్రత్యర్దులను డ్డీ కొంటున్న తీరుకి ఆమె శత్రువులే నివ్వెరపోతున్నారు. ‘అటువంటి నాయకురాలు మా పార్టీకి ఉంటేనా!’ అని మనసులోనయినా ఆమె దైర్యానికి, రాజకీయ పరిణతికి మెచ్చుకోకుండా ఉండలేరు. అయినప్పటికీ వారికి ఆమెని డ్డీ కొట్టక తప్పట్లేదు.   అయితే, ఇంత హట్టాతుగా కొండాసురేఖ తెరపైకి ఎందుకు రావలసి వచ్చింది అని ఆలోచిస్తే మనకి చాలా సమాధానాలే కనిపిస్తాయి. మొట్ట మొదటిగా కొద్ది రోజుల క్రితం జగన్ సోదరి షర్మిల, కేసిర్ ని తన పాదయాత్రలో ఘాటుగా విమర్శించడం, ఆ తరువాత ఆమెకి తెలంగాణాలో ఎదురయిన ఇబ్బందులూ చూసినప్పుడు, వై.యస్సార్. కుటుంభ సభ్యులు ఎవరూ కూడా కేసిర్ ని గానీ అతని పార్టీ సభ్యులని గానీ నేరుగా డీ కొట్టడం వల్ల వచ్చే ఇబ్బందులను వై.యస్సార్. పార్టీ గ్రహించినట్లు కనిపిస్తోంది. పైగా తే.ర.స. తమ పార్టీ పై వేసిన ‘సీమంద్రాముద్ర’ కూడా ఆ పార్టీవారిని నేరుగా డ్డీ కొట్టేందుకు అడ్డుపడుతోందని అనుకోవచ్చును. అప్పుడు సహజంగానే తెలంగాణాలో తమ పార్టీకి పెద్ద దిక్కుగా కనిపిస్తున్న కొండాసురేఖనే యుద్ద రంగంలో ముందును నిలిపి తెలంగాణా మనిషితోనే ఎదురు దాడి చేయించే ప్రయత్నంలోనే వై.యస్సార్. పార్టీ ఆమెని తెరపైకి తీసుకు వచ్చి ఉండవచ్చును.   ఆమెలో జగన్ పట్ల చెక్కుచెదరని నమ్మకం, అభిమానం, జగన్ కుటుంభం కోసం ఎంతటి త్యాగాలకయినా సిద్దపడే ఆమె నైజం, అపారమయిన ఆమె రాజకీయానుభవం, రాజకీయ చతురత, అపూర్వమయిన ఆమె వాగ్ధాటి అన్నీకలగలిసి ఆమెకి వై.యస్సార్. పార్టీలో తెలంగాణాలో ఒక ప్రత్యెక హోదాను అందజేశాయి.   గులక రాయితో కొట్టేవాడిని బండరాయితో కొట్టాలంటే అందుకు సమర్దుడయిన వ్యక్తిని వెత్తుకోక తప్పదు. వై.యస్సార్. పార్టీ కూడా ఇప్పుడు అదే పని చేసింది. మహాబలమయిన తే.ర.స. మరియు దాని నేతలని ఎదుర్కోవాలంటే అంతటి సామర్ద్యంగల వారినే తన యుద్దానికి నాయకుడిగా నియమించుకోవాలి. ఆ వ్యక్తీ తప్పనిసరిగా తెలంగాణా వ్యక్తీ అవడం మరొక ప్రాదమిక అర్హత. అందుకే వై.యస్సార్. పార్టీ కొండసురేఖని తన తెలంగాణా యుద్దంలో నాయకురాలిగా ఎన్నుకొని ఆమెని ముందు ఉంచి పూర్తిస్థాయిలో దైర్యంగా ఇప్పుడు యుద్ధం మొదలుపెట్టింది. రేపు తెలుగుదేశం కూడా ఇదే పద్దతి అవలంబించినా ఆశ్చర్యపోనవసర లేదు.   అప్పుడు తే.ర.స. తన తెలంగాణా మనుషులతోనే యుద్ధం చేయకతప్పదు. ఎప్పుడయితే అది ఆ పనిచేసిందో దానిపట్ల తెలంగాణా ప్రజల్లో ఏంతో కొంత విముఖత ఏర్పడకపోదు. పైగా, ఆమె కూడా పక్కా తెలంగాణా వ్యక్తే గనుక, తెరాస నాయకుల మాటలకు ప్రజల్లో ఎంత విలువ ఉంటుందో ఆమె మాటలకీ అంతే ఉంటుంది. ఒక మంచి వ్యూహంతో ముందుకు వచ్చిన వై.యస్సార్. పార్టీని ఇప్పడు తెరాస ఏరకంగా ఎదుర్కోబోతోందో త్వరలోనే తెలుస్తుంది.   గానీ ఒక్క విషయం మాత్రం నిజం! నిన్నటి వరకు ఆమె చేసిన ప్రతిభావంతమయిన యుద్ధం ద్వారా తనను తానూ సమర్డురాలయిన ఒక నాయకురాలిగా నిరూపించుకొన్న కొండసురేఖ వై.యస్సార్.పార్టీకి తెలంగాణాలో ఒకపెద్ద దిక్కుగా నిలిచి రాగల రోజుల్లో మరింత కీలక బాద్యతలు చేప్పటి ఆమే పార్టీని ముందుకు నడిపించవచ్చును.

కేసిర్! కలిసి చద్దాం... రా!

  ఇంకా సాధారణ ఎన్నికలు ఏడాది పైమాటే అయినా అప్పుడే రాజకీయపార్టీలు తెలంగాణా జిల్లాలపై పట్టుకోసం గట్టిప్రయత్నాలు ప్రారంబించేసాయి. చాప క్రింద నీరులా చేరి తెలంగాణాలో నెమ్మదిగా బలపడుతున్న జగన్ పార్టీని చూసి తే.ర.స. ఆందోళన చెందుతున్నట్లే, రాబోయే ఎన్నికలలో అన్ని శాసనసభ, లోక్సభ స్థానాలకి తే.ర.స. పోటీ చేయబోతోందని తెలిసిన జగన్ పార్టీకూడా అంతే ఆందోళన చెందడం సహజం. తెలంగాణాపై పూర్తీపట్టు సాదించేందుకు మొదలు పెట్టిన ప్రయత్నాలలో బాగమే నేడు కేసిర్ కొండసురేఖల మద్య జరుగుతున్న మాటలయుద్ధం. అది చివరికి హింసాత్మకంగా మారిపోయి, రేపు ఎన్నికల సమయం పరిస్తితులు ఏవిదంగా ఉండబోతున్నాయో ఇప్పుడే తెలియ జేస్తున్నాయి.   కొద్ది రోజుల క్రితం, జగన్ పార్టీ నాయకురలయిన కొండసురేఖ ఒక బహిరంగసభలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “తే.ర.స. అధినేత కేసిర్ ఇక్కడే గత ఎన్నికల సమయంలో సరిగ్గా వందరోజుల్లో తానూ తెలంగాణా సాదించి తెస్తానని వాగ్దానం చేసాడు. గానీ, ఏడాదయినా ఇంతవరకు తెలంగాణా ఊసేలేదు. అతను ఇప్పుడు మళ్ళీ కొత్త పల్లవి అందుకొని వచ్చే ఎన్నికలలో మొత్తం శాసనసభ, లోక్ సభ స్థానాలన్నిటిలో తన పార్టీనీ ప్రజలు గెలిపిస్తే అప్పుడు తప్పక నెలరోజుల్లోనే తెలంగాణా సాదించి తెస్తానని బూటకపు వాగ్దానాలు చేస్తున్నాడు. తెలంగాణా కోసం అవసరమయితే తన తలకూడా నర్రుకోవడానికి సిద్దం అని బీకర ప్రతిజ్ఞ చేసిన ఇంతవరకూ తెలంగాణా సాదించలేకపోయినా అతను ఇంకా బ్రతికే ఉన్నడేమిటి? అతని మాయమాటలు నమ్మి అమయకులయిన పిల్లలు ప్రాణాలు తీసుకొంటున్నారు. అతనేమో డిల్లీలో ప్యాకేజీలు మాట్లాడుకొంటూ తెలంగాణా పేరుతో ప్రజలని ఇంకా మోసం చేస్తునే ఉన్నాడు. అతను బ్రతికిఉండగా తెలంగాణా మాత్రం రాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. తెలంగాణా అనేది అతనికి, అతని బందువులకీ, అతని పార్టీవారికీ ఒక రాజకీయ ఉపాదిగా మారింది. వారిలో తెలంగాణా పట్ల చిత్తశుద్ది అసలు లేదు,” అని అంది ఆమె.   ఆమె మాటలకి వెంటనే స్పందిస్తూ “సీమంద్రా పార్టీలవెంట తిరిగే నీ వంటివారే ముందు ఆత్మహత్య చేసుకొని చావాలి, నేను కాదు,” అని ఘాటుగా ఆమెకి జావబిచ్చేడు కేసిర్.   దానికి కొండసురేఖ కూడా అంతే ఘాటుగా స్పందిస్తూ “తెలంగాణాకోసం నేను ఆత్మా హత్య చేసుకోవడానికి సిద్దం. నీవు సిద్దమేనా? దైర్యం ఉంటే ఇద్దరం పురుగుల మందు సీసాలు చేత్తుల్లో పట్టుకొని డిల్లీ వెళ్లి , తెలంగాణా ఇవ్వని సోనియాగాంధీ ఇంటిముందే ఒకేసారి ఆత్మహత్య చేసుకొందాము. దమ్ముంటే రా! అని కేసిర్ కి ప్రతిసవాల్ విసిరింది ఆమె.   ఈ సవాళ్ళు ప్రతిసవాళ్ళు వారిమద్య ఒక వైపు కొనసాగుతుండగానే, మరోవైపు దానికి ఎలెక్ట్రానిక్ మీడియా ఆజ్యంవేస్తూ తనవంతు తానూ అగ్గిరాజేస్తూ పోయింది. దానితో ఇరు పార్టీల నుండీ మరింతమంది కార్యకర్తలు, నేతలు మీడియా ముందుకి వచ్చి మాట్లాడటం మొదలు పెట్టేసరికి, ఒక్కసారిగా కొండసురేఖ నివాసముండే వరంగల్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు మొదలయ్యాయి. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు భౌతికదాడులకి దిగడమే గాకుండా ఒకరి కార్యాలయాలపై మరొకరు దాడి చేసుకొన్నారు కూడా.   ముందుగా తే.ర.స. కార్యకర్తలు వరంగల్ మరియు కరీంనగర్ లలో ఉన్న జగన్ పార్టీ కార్యలయాలపై దాడిచేసి విద్వంసం సృష్టించేరు. దానికి ప్రతిగా జగన్ పార్టీ కార్యకర్తలు కూడా వరంగల్లో ఉన్న తే.ర.స. కార్యాలయంపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ ఉన్న తే.ర.స. కార్యకర్తలకీ వారికీ మద్య యుద్ధం మొదలయింది. పోలీసులు లాటీ చార్జ్ చేయవలసిన పరిస్తితులు ఏర్పడాయంటే పరిస్తితి ఎంత తీవ్రంగా ఉందొ అర్ధం అవుతుంది.   ఇక, మాటలయుద్ధం ఈవిదంగా చేతలయుద్ధంగా మారడమంటే మున్ముందు ఇంతకంటే బీకర పోరాటాలు ఉండబోతున్నాయని ఒక హెచ్చరికగా కనిపిస్తోంది.   ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఇంకా రంగంలోకి దిగలేదు. జగన్ పార్టీ కంటే తెలంగాణాలో చాల పటిష్టమయిన క్యాడర్ కలిగిఉన్న, ఆ పార్టీతో కూడా తే.ర.స. ఇదే విదంగా వీదిపోరాటాలకి దిగినట్లయితే అప్పుడు పరిస్తితులు ఇంతకంటే దారుణంగా ఉండవచ్చును. ఈ మూడు రాజకీయ పార్టీలకు కూడా వచ్చే ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమయినవి గనుక తెలంగాణాపై పూర్తీ పట్టు సాదించేందుకు ఈ మూడు పార్టీలు ఇంకా తీవ్ర యుద్దాలకి దిగవచ్చును. అదే జరిగితే తెలంగాణా రాష్ట్ర సమస్య మరింత జటిలమవుతుందే తప్ప రాష్ట్రం ఏర్పడటం సాద్యం కాదని కేసిర్ మరియు తెలంగాణవాదులు తెలుసుకోవాలి.   కేసిర్ మనస్పూర్తిగా తెలంగాణా కోరుకొంటున్నట్లయితే తెలుగుదేశం, కాంగ్రెస్ మరియు జగన్ కాంగ్రెస్ పార్టీలను ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలో ఎదుర్కొని ఓడించి తన ఆశయ సాధన చేయవచ్చును. గానీ, ఈ విదంగా బౌతికదాడులకి దిగి తెలంగాణా అంతటా అరాచక పరిస్తితులు కల్పిస్తే ముందుగా నష్టపోయేది తెలంగాణా ప్రజలు మాత్రమే. ఇప్పటికే తెలంగాణా సమస్యని సాగ దీయాలని చూస్తున్న కాంగ్రేసుపార్టీకి వారు చేజేతులా ఒక చక్కటి అవకాశం అందజేసినవారవుతారు. అక్కడి అరాచక పరిస్థితులను సాకుగా చూపించి తెలంగాణా ఇవ్వడం సాద్యం కాదని కాంగ్రెస్ తప్పుకొనే అవకాశాన్ని కేసిర్ కల్పించినట్లే అవుతుంది.   ఇప్పుడతను, అతని పార్టీ తెలంగాణా కావాలని కోరుకొంటున్నారో లేక వచ్చే ఎన్నికలలో గెలవడమే ప్రధానం అని అనుకొంటున్నారో ముందుగా తేల్చుకోవాలి. దానిని బట్టే పరిస్తితులూ, ఫలితాలు ఉంటాయి. తెలంగాణా కోరుకోన్నట్లయితే అతను ముందు ఆఅంశం పైనే దృష్టి కేంద్రీకరించి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వచ్చేఎన్నికలలో గెలుపే ప్రధానం అనుకొంటే ఇదేవిదంగా అన్నిపార్టీలతో మరిన్ని యుద్దాలు చేయాల్సి రావచ్చును. తెలంగాణానా లేక ఎన్నికలా? అనేది తెల్చుకోన్నాక అతను ఆదిశలో అడుగులువేస్తె త్వరగా సత్ఫలితాలు రాబట్ట వచ్చును.   అయితే, తెలంగాణా కోసమే ఎన్నికలకి వెళ్తున్నామంటే మాత్రం తెలంగాణా ప్రజలు కూడా నమ్మరు. మిగిలిన పార్టీలుకూడా అప్పుడు కొండసురేఖ వలెనే కేసిర్ మరియు అతని పార్టీ సహచరులపై ‘తెలంగాణా పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని గట్టిగ ప్రచారం చేసుకొనే అవకాశం ఉంది.’ అప్పడు వారిలో మరింత అసహనం పెరిగి చివరికి ఇప్పటి లాగానే మళ్ళీ వీది పోరాటాలు మొదలవుతాయి.   ఏది ఏమయినా అంతిమంగా నష్ట పోయేది మాత్రం తెలంగాణా ప్రజలు మాత్రమె. రాజకీయ పార్టీలు మాత్రం కాదు.

రెండు నాల్కల రాజకీయ నాయకుడు?

  మంత్రి పదవి ఇవ్వలేదని అలిగి కాంగ్రేసుకి దూరంగా తిరుతున్న ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంభశివరావుగారు మొన్న ఆదివారంనాడు హైదరాబాదులో జరిగిన పార్టీ సమావేశానికి కూడా హాజరు కాలేదు. కానీ, ఆమర్నాడు అంటే, సోమవారంనాడు గుంటూరు ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయంలో జరిగిన సమైక్యాంధ్రసభకి మాత్రం హాజరయి తెలంగాణారాష్ట్రం పేరిట వేర్పాటు ఉద్యమాలు నడుపుతున్న కేసిర్ మరియు అతని పార్టీవారినీ తిట్టిన తిట్టు మళ్ళీ తిట్టకుండా మరీ తిట్టారాయన. అయితే, ఆ ఉద్రేకంలో కావూరివారు సెల్ఫ్ గోల్ చేసుకొని తనని తానూ ఏవిదంగా బయట పెట్టుకోన్నారో చూద్దాము.   కావూరివారు ఉద్రేకంగా ఉపన్యాసం చేస్తూ “తెలంగాణాలో కొందరు రాజకీయ నిరుద్యోగులు తమ ఆదాయవనరులు పెంచుకోవడానికి చేస్తున్న ఉద్యమం అది. ఒకవేళ, తెలంగాణాగానీ సాదించగలిగితే వారే అధికారం చేప్పట్టి మరింతగా దోచుకొందామనే దురాలోచనతోనే వారంతా తెలంగాణా ఉద్యమం చేస్తున్నరిప్పుడు. ఒకప్పుడు చంద్రబాబు వెనుక తిరిగిన కేసిర్ కి అప్పుడు తెలంగాణారాష్ట్రం అవసరమని ఎందుకు అనిపించలేదు? అప్పుడు ఆయన ఎందుకు గట్టిగా అడుగలేదు? చంద్రబాబు ప్రభుత్వంలో అతనికి మంత్రి పదవిరానందునే అతను పార్టీనుండి బయటకివచ్చి తన రాజకీయ ఉపాది కోసం ఈ తెలంగాణాఉద్యమం మొదలుపెట్టాడు. తద్వారా అతను, అతని పార్టీలో వారు హైదరాబాదు చుట్టుపక్కల సీమంద్రావారిని బెదిరించి కోట్లాదిరూపాయలు పోగేసుకొన్నారు. మళ్ళీ, తెలంగాణారాష్ట్రం గానీ ఏర్పడితే, తానూ తన పార్టీ కలిసి అధికారం పంచుకొని మరిన్నివందలకోట్లు వెనకేసుకోవాలని చూస్తున్నాడు. తెలంగాణా ఉద్యమాల పేరిట రాష్ట్రంలోఒక అనిశ్చిత పరిస్తితిని సృష్టించేరు వాళ్ళు. తన స్వార్దరాజకీయప్రయోజనాల కోసమే కేసిర్ ఇదంతా చేస్తున్నాడు. ఒకవేళ కేంద్రంగానీ అతని ఒత్తిడికి లొంగిపోయి తెలంగాణా రాష్ట్రం ప్రకటించడానికి సిద్దం అయినట్లయితే, మనమూ అందుకు దీటుగా ఉద్యమాలు చేప్పటి రాష్ట్ర విభజనని అడ్డుకోవాలి. అవసరమయితే సమైక్యాంధ్ర కోసం నేను ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు కూడా వెనుకాడను. రాష్ట్రం విచ్చినం కాకుండా కాపాడుకోవలసిన బాధ్యతా మన అందరిపై ఉంది.”   కేసిర్ ని అయన ఉద్యమాలని నోరార తిట్టిపోసిన కావూరివారు ఇక్కడ కొన్నివిషయాలు ప్రజలు గుర్తించబోరని ధీమాగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.   తనకే గనుక కేంద్రంలో మంత్రిపదవి ఇచ్చిఉంటె తానీ రోజు కాంగ్రేసు నుండి బయటకి వచ్చే ఆలోచన చేసేవారా? వచ్చి ఈ రకమయిన ఉద్యమాలు, పార్టీలు అనేవారా? ఆనాడు కేసిర్ కి మంత్రిపదవి రాకపొతే ఆయన ఏమిచేసాడని చెపుతున్నారో, ఇప్పుడు కావూరివారు అదే చేస్తామని చెపుతున్నారు.   మంత్రిపదవి రాకనే కదా ఆయన ‘కొల్లేరు సరస్సు సమస్యపై ఉద్యమం’ మళ్ళీ మొదలుపెట్టి రాస్తారోకోలు, రైల్రోకోలు చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని మొన్ననే కదా ఆయన ప్రకటించేరు. అంతేగాకుండా ఇప్పుడు తెలంగాణా ఉద్యమాన్ని అడ్డుకొనేందుకు తానూ కూడా కొత్తగా ‘సమైక్యాంధ్ర కోసం’ ఒక కొత్తపార్టీనీ పెట్టి ఉద్యమాలు చేస్తానని చెప్పి అయన కేసిర్ చేస్తున్న పనినే కదా తానూ చేస్తామని ప్రకటించుకొంటున్నారు. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్తితిని సృష్టించేడని ఒక వైపు కేసిర్ ని ఆయన పార్టీని తెడుతూనే తానూ అదే పనిని ఇప్పుడు ఎందుకు చేయాలనుకొంతున్నారో ఆయనే చెప్పాలి.   రాజకీయనిరుద్యోగులే ఇటువంటి ఉద్యమాలు చేస్తునారని కేసిర్ ని ఆడిపోసుకొన్న కావూరివారు కూడా మరి కాంగ్రేసుని వదిలిబయటకి వచ్చి తానూకూడా రాజకీయనిరుద్యోగిగా మారడం వల్లనే కదా ఇప్పుడు ఈ ఉద్యమాలు, పార్టీలు అంటున్నారు?   ఆయనే చెప్పినట్లు అలనాడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవికోసం తెలంగాణా ఉద్యమం మొదలుపెట్టి పదవిరాగానే తన ఉద్యమాన్ని పక్కనపడేసినట్లే, రేపు కావూరివారికి కూడా యు.పీ.యే. ప్రభుత్వం పిలిచి కేంద్రమంత్రిపదవి ఇస్తే, అప్పుడు ఆయన అది వద్దని ఉద్యామాలు చేసుకొంటారో లేక తన ఉద్యామాలని పక్కనపెట్టి మంత్రి పదవి చేపడతారో ఆయనే చెప్పాలి?   ఎంత అనుభవంఉన్న రాజకీయనాయకుడయినా ఈ విదంగా రెండు నాల్కల దొరణితో ప్రజలని మభ్య పెట్టదలిస్తే అది అయన రాజకీయ భవిష్యత్తుకే చేటుతెస్తుంది. ప్రజలు ఒట్టి వెర్రివాళ్ళు వాళ్ళకి మన మాటే వేదం అనుకొనే ఇటువంటి రాజకీయనేతలకి మన దేశంలో కరువులేదు. ప్రజలే అటువంటి వారికి ఎన్నికలలో సరయిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుంది.

మేధోమధనమా మజాకా....

    ఏమిటి సార్... మీ బుర్ర అంతగా వాచిపోయుంది? క్యాన్సర్ కణితి వంటిదేమయిన బుర్రలో ఏర్పడిందా? పైగా మీ బుర్రలోంచి ఆ పొగలేమిటీ...చూస్తే నాకు భయం కూడా వేస్తోంది...సార్?   అబ్బా ఊరుకోవయ్యా నీ జోకులు నువ్వూను. ఇప్పుడే మాపార్టీతో మేధోమధనం చేసుకొని వస్తున్నాను...అలిసిపోయానయ్యా ఇక వస్తా!   సార్...సార్... మీ వాచిపోయిన బుర్రని చూస్తే చాలా మదించేసినట్లు కనిపిస్తోంది. మీరేవిదంగా మేధోమధనం చేసారో నాలుగుముక్కలు నాచెవిన వేసిపోదురూ...నాకూ కాస్త జ్ఞానం అబ్బుతుంది.   అబ్బబా...మా పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి అలిసిపోయానయ్యా అని చెపుతున్నా నక్షత్రకుడిలాగ నా వెంటపడుతావేమిటయ్యా...నువ్వూ?   అరరే...లక్షలు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసుకొన్న మీపార్టీ మీటింగులో, మీరే మీ పార్టీని తిట్టడం ఏమిటి సార్ విడ్డూరం కాకపోతేనూ? అయినా, అపోజిషన్ పార్టీ వాళ్ళు, మీ పార్టీలోఅలిగిన నాయకులూ తెల్లారిలేస్తే ఎలాగూ మీ పార్టీని తిడుతూనే ఉంటారు కదా? మళ్ళీ ఇప్పుడుకూడా మీ పార్టీని మీరే ఎందుకు తిట్టుకోవడం? నాకర్ధం కాలేదసలు...   అబ్బా...నీకెలా చెపితే అర్ధం అవుతుందయ్యా? నిన్నగాక మొన్నపార్టీలో జేరినవాడికి ఏకంగా కేంద్ర మంత్రిపదవి కట్టబెట్టేసి, మావంటివారిని ముసలిగుర్రాలని పక్కన పెట్టేస్తే మాకు కోపం రాదూ?   సార్! నాదో చిన్న సందేహం! అయితే మీ పార్టీ మధనానికి పిలిచింది మీ బాగోతాలు వినడానికేనా?మరి పేపర్లలో, టీవీల్లో అలా చెప్పారు...?   అబ్బాబా...ఏమిటయ్యా నీ యక్ష ప్రశ్నలూ...ధర్మ సందేహాలూ? మా గోడు చెప్పుకొందుకు మళ్ళీ మేము ప్రత్యేకంగా మరో మీటింగు పెట్టుకోవాలనా నీ ఉదేశ్యం? తెలంగాణావాడు వాడి గోడు వాడు వెల్లబోసుకొంటాడు. సమైక్యాంధ్రవాడి గోల సమైక్యాంధ్రవాడిది. పదవులు దొరకని మావంటి వారి గోడు మాది. బ్యానర్లమీద ఫోటోలువేయని వారి ఏడుపులు వాళ్ళవి. సంక్షేమ పదకాలన్నీ నా స్వంతంమే అని తన ఫొటోలతో ఒకరు పుస్తకాలు అచ్చేసుకొంటే, అందులో మా పాత్రా, ఫోటోలు లేనేలేవా అసలు? అని రుసరుసలాడే వాళ్ళు మరొకరు...ఏమి చెప్పమంటావు చెప్పు...మా మేధోమధనం గురించీ? మహాద్బుతంగా జరిగిందంటే నమ్ము.   అయితే, సార్...నాదో చిన్నడవుటు...మరి ఇంతకీ మీరందరూ కలిసి కష్టపడి ఏమి కనిపెట్టేరు మీ మేధోమధనంలో? పార్టీకి, ప్రభుత్వానికి మద్య ఎదో సయోధ్య వంటిది సాదిద్దామనే కదా మీరందరూ ఈ మీటింగు పెట్టుకోన్నారని మీడియా వాళ్ళు వ్రాసారు...?రాబోయే ఎన్నికలని ఎలా దీటుగా ఎదుర్కోవాలో నిర్నయించుకొందామనే మీరీ మీటింగు పెట్టుకొంటున్నట్లు మీడియా వాళ్ళు వ్రాసారు మరీ?   ఇదిగో...మీడియా పేరెత్తకు...నాకు ఒళ్ళు మండుతుంది. వాళ్ళు వ్రాసేవన్నీ పచ్చి అబద్దాలు..నీ వంటి వెర్రివాళ్ళే అటువంటి వార్తలన్నీ నమ్ముతారు. మేమేమి సాధించి పడేసేమో మాకూ మా పార్టీకి బాగా తెలుసు అదే విషయంపై మజ్జానం బోజనాలు అయిపోయాక అందరం సుదీర్గఉపన్యాసాలు చేసుకొని గుర్తుకుతెచ్చుకోన్నాము కూడా. మేము సాదించాల్సింది ఇంకేమి మిగల్లేదు...ఇక దేనిగురించి ఆలోచించాలి మేము? అయినా మా అప్పోజిషను వాళ్ళు మామీద ఎప్పుడూ నీలాపనిందలు వేయక మానట్లేదు...అందుకే ఆ మైకుతోనే వాళ్ళనీ ఒక దులుపు దులిపెసాము మామేధోమధనంలో.   సార్..మరి ఎన్నికలకి తయారి అవుతున్నట్లు తెలిసింది నిజమేనా?   ఆ..ఆ...ఎన్నికలా ఆ.. వస్తేరానీండి...మేము వాటికొరకే చాలా కాలంగా ఎదురుచూస్తున్నాము. మేము ఎన్నికలు ఎప్పుడూ వస్తూనే ఉండాలని కోరుకొంటాము... ఈసారి మాకు పార్టీ టికెట్స్ ఇవ్వకపోయినా మా పిల్లలకయినా ఇచ్చేట్లు మా రాహుల్ బాబు దూతలకి ఎలాగయినా నచ్చజెప్పుకోవాలి తప్పదు. మేము ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్దమే. మేము ‘అన్నీ’ సిద్దo చేసుకొనిఉంటే పార్టీ సిద్దంగా ఉన్నట్లే కదా? ఇంకా ఎన్నికల గురించి మీటింగులో ఏమాలోచించాలి..?పార్టీయే ఎవరెవరికి టికెట్స్ ఇవ్వాలో ఆలోచిoచుకోవాలి...అంతకన్నా ఆలోచించడానికీ, చేయడానికి ఏముంటుంది ఇప్పుడు?   సార్! మరయితే ఈ మేధోమధనం...?   అబ్బాబా రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుందని అడిగేడుట నీ వంటి వాడే. నీ కీ జన్మకి అర్ధం అయ్యేలా నేను చెప్పలేను...వెళ్ళు వెల్లెళ్ళు...నీ పిచ్చి ప్రశ్నలకి జవాబు చెప్పలేక నా బుర్ర మరింత వేడెక్కిపోయింది. మరో ముక్క చెప్పే ఓపిక కూడా నాకు లేదు.. వెల్లెళ్ళు...మళ్ళీ నాకు రేపు డిల్లీలో మరో మీటింగు ఉంది...ఇంత కంటే పెద్దది...   సార్...సార్....అలాగ పారిపోతే ఎలాగా సార్..అదికూడా మళ్ళీ ఇటువంటి మేధోమధనమేనా?  .........    .....   .............

“హా..హ..వేస్తే ఏకంగా వల వేసేయాలి గాని

  “హా..హ..వేస్తే ఏకంగా వల వేసేయాలి గాని మళ్ళీ గేలం ఎందుకు...?”అందో గడుసుపిల్ల ఓ సినిమాలో. మరి మన కెసిఆర్ ఆ సినిమా చూసాడో ఏమో! ఆ పిల్ల మాటలతో ప్రేరణ పొందినట్లు, ఇలాగ ఎoతకాలం ఒక్కొక్కపార్టీకీ గాలం వేసుకొంటూ రోజులు వెళ్లదీయడం అనుకొన్నాడో ఏమో మరి, ఈసారి ఏకంగా పెద్దవల పట్టుకొనివచ్చేసాడు. ఆ వలలో ఎన్ని చేపలుపడితే అన్నేపడనీ గానీ మునుపటి గాలం కన్నాకొంచెం ఎక్కువే పడవచ్చు కదా అనే ఆశాభావంతో మొన్ననే ఇతర పార్టీలలో ఉన్న తెలంగాణా య.యల్.ఏ.లు, యం.పీ.లకి వల విసిరాడు. అప్పుడు కూడా, ఎందుకయినా మంచిదని మునుపు గాలానికి తగిలించినట్లే మళ్ళీ తన వలకి కూడా ఎరలను తగిలించి మరీ విసిరేడు. “మా పార్టీలోకి రాదలచిన ఇతర పార్టీలలో ఉన్న తెలంగాణా య.యల్.ఏ.లు, యం.పీ.లకు ఇదే మా హృదయపూర్వక స్వాగతం” అనే బ్యానర్ తగిలించి విసిరిన ఆ వలకి, ఎవరయినా వచ్చి ఇర్రుకోదలిస్తే, ప్రస్తుతం వారు యేయే ప్రాంతాలనుండి గెలిచేరో వాళ్ళకి తే.ర.స. మళ్ళీ అవే స్థానాలు కేటాయించడమే గాకుండా వారి ఎన్నికల ఖర్చు మొత్తం పార్టీయే భరిస్తుందనే ఎరని కూడా తగిలించి విసరడం అయ్యింది. ఇక, ఇప్పటికే ఎంతో కాలంగా తమ పార్టీలో పదవులు అనుభవిస్తున్నపటికీ తెలంగాణా ఉద్యమం పేరుతొ తే.ర.స.తో అంటకాగుతున్నవివిధ పార్టీల నాయకులనేకమంది ఇప్పుడు తే.ర.స. విసిరిన ఆ వలలోకి దూకినాదూకవచ్చును. తెలంగాణా సాధించాలనే బలమయిన కోరికకన్నా తమపార్టీలోనే ఉంటే, తెలంగాణా సమస్య తమ రాజకీయ జీవితాన్ని ఎక్కడ దెబ్బతీస్తుందోనని బయపడేవారే ముందు అటు వైపు దూక వచ్చును. అదీగాక, ఒక వేళ తే.ర.స. ఇటువంటి పండగ సీజన్(అఖిల పక్ష సీజన్లో) బంపర్ ఆఫర్ ఇస్తున్నపుడు వెళ్ళకుండా తాత్సారం చేస్తే, రేపు వెళ్ళదలుచుకొన్నా అక్కడ తమకి సీట్లు ఖాళీ ఉండవు గనుక అప్పుడు తమ పరిస్తితి రెంటికీ చెడ్డ రేవడి అవుతుందని అనుకొనే వారు కూడా ఇప్పుడు “త్యాగాలకి” సిద్దపడవచ్చును. అప్పటికీ బయటకి రానివాళ్ళని ఏ విదంగా హ్యాండిల్ చేయాలో మన కెసిఆర్ గారికి అయన పార్టీవారికీ బాగాతెలుసు. నయాన్న పిలిచినప్పుడు రాకపోతే, బయ్యాన్నయిన పిలువక తప్పదు. తే.ర.స. కాకుండా బయట ఇతర పార్టీలలో ఉన్న వారందరూ కూడా తెలంగాణా ద్రోహులనే ట్యాగ్ ఒకటి వారికి తగిలించేస్తే కాగల కార్యం గందర్వులే చూసుకొoటారన్నట్లు వారిపని ఆ ట్యాగ్ తో పూర్తయిపోతుంది. అయితే, కే.సిఆర్. నియంతృత్వ పద్దతుల గురించి, ఆయన తన సహచరులను ‘హ్యాండిల్’ చేసే విదానం గురించి తెలిసి కూడా ఎంతమంది దైర్యం చేసి అతను విసిరిన వలలోకి దూకుతారో మరిచూడాలి. మధ్యలోనే తెరాస కారు దిగివెళ్ళిపోయిన నరేంద్ర, వంటివారిని తే.ర.స. లో జేరదలిచిన వారు ముందుగా సంప్రదిస్తే ఎంతయినా ఉపయోగo ఉండవచ్చును.   ఏమయినప్పటికీ, అఖిలపక్ష సమావేశం ముగిసిన మరుక్షణం నుండే ఇతర పార్టీలలో ఉన్న తెలంగాణా య.యల్.ఏ.లు, యం.పీ.లపై ,ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారిపై అతని పార్టీ తీవ్ర ఒత్తిడి పెట్టబోతోoది. ఆ ప్రయత్నంలో, ముందుగానే ఈ విదంగా వల పరుచుకొని తే.ర.స. కూర్చొని ఉంది. మహా అయితే, అఖిలపక్షం ముగిసేవరకు అది ఓపిగ్గా కూర్చోని ఎదురుచూడవలసి ఉంటుంది. అప్పుడు చిన్న, పెద్ద చేపలన్నీ వాటంతట అవే వలలోకి రావచ్చును. అఖిలపక్షంతో కాంగ్రెస్ తెలంగాణా ఎలాగు ఇచ్చేయబోదు గనుక, అప్పుడు ‘తెలంగాణా కోసం త్యాగాలు చేసేవారు’ తమ రాజకీయ భవిష్యత్తు కోసం కూడా కొంతయినా ఆలోచన చేయకమానరు గనుక, ముందే అటువంటి వారికి ఆహ్వాన పత్రికలు పంపితే వారు తమ పార్టీ ఉపదేశాలకి, అవి ప్రకటించ బోయే తాయిలాలకీ పడిపోకుండా నేరుగా తే.ర.స. వైపే నడుచుకొంటూ వచ్చేస్తారని తే.ర.స. అధ్యక్షులవారి ఆశ. మరి, ఇతర పార్టీలలో ఉన్న తెలంగాణా య.యల్.ఏ.లు, యం.పీ.లు ఈ బంపర్ ఆఫర్ స్వీకరిస్తారో లేక తెలంగాణా ద్రోహులుగా మిగిలిపోతారో చూడాలి మరి.