జయప్రద కోసం ఉండవల్లి త్యాగం ఎందుకో

  ఉత్తర ప్రదేశ్ నుండి సరాసరి ఆంధ్రా వచ్చివాలిన అందాలభామ జయప్రద, ఎన్ని గడపలెక్కి దిగినా రాజమండ్రీకి మాత్రం టికెట్ దొరక్కపోవడంతో, మళ్ళీ హుటాహుటిన డిల్లీలో సోనియమం ఇంట్లో వాలిపోయి, రాజమండ్రీ టిక్కెట్టుకి ఆమె చేత ‘మమ’ అనిపించేసుకొన్నట్లు సమాచారం. కాకపోతే, హట్టాతుగా ఎక్కడి నుంచో ఊడిపడిన ఆమెకోసం, పార్టీకి పాతకాపు వంటి ఉండవల్లిని తప్పుకోమని అడగడం సాద్యమా? అని అందరూ ఆశ్చర్యపోతుంటే, ఆయనే స్వయంగా “జయప్రద రాజమండ్రీ నుండి పోటీ చేస్తానంటే ఆమెకు నా సహకారం ఉంటుందని’ ప్రకటించి జనాలని మరింత ఆశ్చర్య పరిచారు. కానీ, ‘పార్టీ నన్ను రాజ్యసభకు పంపినా ఆ బాధ్యతా ఆనందంగా స్వీకరిస్తానని’ మరొక మాట కూడా చల్లగా అన్నారు.   స్వంత అన్నదమ్ములే టికెట్స్ కోసం కత్తులు దూసుకొంటున్న ఈ తరుణంలో, ఎక్కడి నుంచో ఎగిరివచ్చి తన సీటుకే ఎసరు పెడుతున్న జయప్రదపై నిప్పులు కక్కవలసిన ఉండవల్లి ఆమెకే సహకరిస్తానని ఎందుకంటున్నారు? ఇది అర్ధం చేసుకోవాలంటే మనం చిన్న ఫ్లాష్ బ్యాక్ సీన్ చూడక తప్పదు. గత ఎన్నికలలో రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గాలి చాలా బలంగా వీస్తున్న తరుణంలో కూడా ఉండవల్లి తన సమీప ప్రత్యర్ధి మురళి మోహన్ పై జయభేరి మ్రోగించడానికి చాలా శ్రమపడవలసి వచ్చింది.   కానీ, ఈ సారి ఆయన లేకపోగా స్వయంగా అయన కొడుకు జగన్ మోహన్ రెడ్డి పార్టీతోనే ఉండవల్లి పోటీ పడవలసి ఉంటుంది. ఒకవైపు సర్వే రిపోర్టులన్నీజగన్ వైపు మొగ్గు చూపుతుంటే, మరో వైపు గతంలో చిన్నతేడాతో తన చేతిలో ఓడిపోయిన మురళీ మోహన్ కూడా ఈసారి ఎలాగయినా ఈ ఎన్నికలలో గెలవాలనే పట్టుదలతో పోటీలో ఉండనే ఉన్నారు. ఇక, అధికారం చెప్పటిన నాటి నుండి రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటం ఆడేసుకొంటున్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కష్టపడి సంపాదించిపెట్టిన కాంగ్రెస్ వ్యతిరేఖ ఓటు కూడా ఉండనే ఉంది.   ఇటువంటి సమయంలో రాజమండ్రీ మీద ఎగురుతున్న జయప్రదను చూసి అందరూ కాకిని చూసినట్లు మొహం తిప్పుకొంటుంటే, ఉండవల్లికి మాత్రం ఈ క్లిష్ట సమయంలో తనను రక్షించేందుకే అంత దూరం నుండి ఎగురుకొంటూ వచ్చి రాజమండ్రీ చుట్టూ చక్కర్లు కొడుతున్న ఓ రెక్కలులేని దేవతలా జయప్రద కనిపించారు.   అందుకే ఆయన “సోనియమ్మ ఆదేశిస్తే ఎటువంటి త్యాగాలకయినా సిద్దం. ఆమె ఆదేశిస్తే ఏ బాధ్యత (పదవి) అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తానని” రెండు బలమయిన పంచ డైలాగులు పలికాల్సి వచ్చింది. తద్వారా  ఉండవల్లి ఆమె మనసును గెలుచుకోవడంతో బాటు, ఒంటి నుండి చమట బొట్టు చిందించకుండా లోక్ సభ నుండి ఆయన రాజ్యసభకు మారిపోవచ్చును. అదే రాజమండ్రీ పట్టుకు వ్రేలాడితే ఓటమిని ఎదుర్కోవడానికే పోరాడినట్లు ఉంటుంది తప్పవేరే ప్రయోజనం ఉండదు. అందువల్ల రాజమండ్రీ సీటుని జయప్రద కొదిలేస్తే ఆమె తిప్పలేవో ఆమె పడుతుంది, సోనియమ్మ చల్లని చూపులు తనపై ప్రసరిస్తే రాజ్య సభలో సీటు, ఇంకా అదృష్టం బాగుంటే ఏకంగా కేంద్ర మంత్రి పదవి అన్నీ ఈ చిన్న త్యాగంతోనే దక్కే అవకాశం ఉంది.   ‘మరక మంచిదేనని, సబ్బుకి కూడా సంస్కారం ఉంటుందని’ కనిపెట్టి సబ్బుల కంపెనీలు వాళ్ళు మనకి చెప్పినట్లే, ముక్కు మొహం తెలియని జయప్రద కోసం త్యాగం చేయడం కూడా ఒకందుకు చాలా మంచిదేనని ఉండవల్లి అనుకొంటే మనం కాదనగలమా?.

పాదయాత్రా ఫలం పార్టీకే అంకితం

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీకోసం’ అంటూ పాదయాత్ర మొదలుపెట్టి నేటికి సరిగ్గా 208 రోజులయింది. 63సం.ల వయసులో ఏకధాటిగా 2,817 కి.మీ దూరం నడవడానికి కేవలం ఒంట్లో ఆరోగ్యం ఒకటే సరిపోదు. మొదలుపెట్టిన పనిని పూర్తి చేయగలననే ఆత్మవిశ్వాసం, పట్టుదల కూడా ఉండాలి. అవి చంద్రబాబులో పుష్కలంగా ఉండబట్టే, ఆయన ఈ రోజు తన పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేయగలిగారు.   గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున అనంతపురం జిల్లా, హిందూపురంలో మొదలుపెట్టిన పాదయత్రలో ఆయన 16 జిల్లాలు, 84 నియోజకవర్గాలు, 160 మండలాలు, 1246 గ్రామాలలోగల వివిధ కులాలు, మతాలూ, జాతులు, వృత్తులు, తరగతుల ప్రజలను, పార్టీ కార్యకర్తలను మరియు నేతలను స్వయంగా కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకోగలిగారు. తద్వారా అధికారంలో ఉన్నపుడు వారితో ఏర్పడిన దూరాన్ని తొలగించుకొని మళ్ళీ వారికి చేరువకాగలిగారు. అదేవిధంగా ఆయనను స్వయంగా కలుసుకొన్న ప్రజలకు ఆయనపట్ల ఒక అవగాహన ఏర్పడింది.   ఈ పాదయాత్ర ద్వారా నాలుగు ముఖ్య ప్రయోజనాలు సిద్దించాయి. 1. ప్రజలకి చేరువగా పార్టీని తీసుకువెళ్ళడం. 2.పార్టీని అంతర్గతంగా బలోపేతం చేసుకోవడం. 3.ప్రజా సమస్యలు, పార్టీ పరిస్థితి పట్ల ఆయన స్వయంగా అవగాహన పొందడం. 4.తనపట్ల, పార్టీ పట్ల ప్రజలలో సానుకూలత ఏర్పరచడం.   తన పాదయాత్రలో చంద్రబాబు మారుమూల గ్రామాలలో పార్టీకోసం పనిచేసే అనామక కార్యకర్తలు మొదలుకొని నగరాలలో, పట్టణాలలో ఉండే నేతల వరకు అందరినీ స్వయంగా కలిసి మాట్లాడి మళ్ళీ వారిలో పోరాట స్పూర్తిని నింపగలిగారు. ప్రతీ జిల్లా పర్యటనలో నియోజక వర్గాల వారిగా పార్టీ ప్రతినిధులతో సమావేశం అవుతూ ఒకవైపు పార్టీ వ్యవహారాలను చక్కబెట్టుకొంటూ, పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేసుకొంటూనే, మరో వైపు అన్ని వర్గాల ప్రజలతో ఆయన మమేకం అవడంవలన పార్టీ పట్ల వారిలో సానుకూల వాతావరణం సృష్టించారు.   మంచి పరిపాలన దక్షుడిగా పేరు పొందిన చంద్రబాబు తన పాదయాత్రలో వివిధ జిల్లాలో పార్టీ పరిస్థితిని స్వయంగా అంచనా వేసుకోవడం ద్వారా రాబోయే ఎన్నికలకి తగిన ప్రణాలికలు వ్యూహాలు రచించుకోగలిగే అవకాశం కూడా ఏర్పడింది. గ్రామస్థాయి నుండి పట్టణ, నగర స్థాయి వరకు ఉండే అనేక స్థానిక సమస్యలపట్ల ఆయన స్వయంగా అవగాహన పెంచుకోవడమే కాకుండా, వాటిని తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏవిధంగా పరిష్కరిస్తుందో తెలియజేసే ఒక నిర్దిష్టమయిన జిల్లా డిక్లరేషన్ కూడా ప్రకటిస్తూ ప్రజలని ఆకట్టుకొన్నారు.   అదేవిధంగా వివిధ జిల్లాలో పార్టీ నేతల మద్యన ఉన్న విబేధాలను తొలగించే ప్రయత్నాలు చేసారు. కొన్నిసర్దుబాట్లు, మార్పులు చేర్పులతో, అలిగిన నేతలకు కొన్ని తాయిలాలు, అవసరమయిన చోట క్రమశిక్షణా చర్యలు తీసుకొంటూ, గత 9ఏళ్లుగా అధికారానికి దూరమయి అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నపార్టీని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నాలు చాలా గట్టిగానే చేసారు. పార్టీ అధ్యక్షుడే స్వయంగా ఇందుకు పూనుకోవడంతో ఎన్నికల సమీపిస్తున్న ఈ తరుణంలో ఈవిధంగా పార్టీని అంతర్గతంగా బలపరుచుకోవడం చాలా మంచి ఆలోచనే.   అయితే ఈ పాదయత్ర ప్రభావం ప్రజల మీద, పార్టీ కార్యకర్తలు, నేతల మీద రాబోయే ఎన్నికలవరకు ఉంటుందా లేదా అనే సంగతిని పక్కన పెడితే, చంద్రబాబు తన తన పాదయాత్ర ద్వారా పార్టీని పటిష్టపరుచుకొని పార్టీ ప్రభావం ప్రజల మీద ప్రసరించేలా చేయగలిగారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును. చంద్రబాబు పాదయాత్రను విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా తనలో ఆత్మవిశ్వాసం, కార్యదీక్ష, పట్టుదల ఏమాత్రం తగ్గలేదని ప్రజలకు సమర్ధంగా తెలియజేయగలిగారు. రాబోయే ఎన్నికలలో ఆయన పార్టీ విజయం సాదిస్తే ఆయన తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చేసిన ఈ పాదయాత్రకు, ఆయన పడిన శ్రమకు ఫలితం దక్కినట్లే భావించవచ్చును. .

ఎందరో ప్రధాని అభ్యర్దులు. అందరికీ వందనాలు!

  బహుశః స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంతవరకు ఎన్నడూ కూడా ప్రస్తుతం ప్రధాని పదవిపై జరుగుతున్నంత చర్చ జరగలేదు. ఇంత కాలం దేశం గాంధీ నెహ్రూ వంశీకుల చేతిలోంచి బయటపడక పోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చును. గతంలో సోనియా గాంధీకి కూడా ఈ అవకాశం వచ్చినప్పుడు ఆమె ఇటలీ మూలాలను ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో ఆమె వెనక్కు తగ్గవలసి వచ్చింది తప్ప, కాంగ్రెస్ వాదులు చెపుతున్నట్లు ఆమె ప్రధాని పదవిని త్యాగం చేయలేదని అందరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ, దేశాన్ని ఆమె పరిపాలిస్తున్నారనే సంగతి బహిరంగ రహస్యమే.   దేశానికి సుదీర్గ కాలం ఏకచత్రాదిపత్యం వహించి పరిపాలించిన ఆ కుటుంబ ప్రాభాల్యమే నేటికీ బలంగా ఉన్నపటికీ, మకుటం లేని యువరాజుగా పేర్కొనబడుతున్న రాహుల్ గాంధీ ప్రధానిపదవి పట్ల కొంచెం అకాల వైరాగ్యం ప్రదర్శించడంవలన “అయితే మరెవరూ?” అనే ప్రశ్న కాంగ్రెస్ లో ఉత్పనం అయింది.   కర్ణుడికి సహజ కవచకుండలాలు కలిగి ఉన్నట్లు, ప్రధాని డా. మన్మోహన్ సింగ్ కి కూడా సమర్దుడు, ఆర్ధిక వ్యవహారాలలో నిపుణుడు, నిష్కళంక చరితుడు, వివాదరహితుడు, మేధావి, సౌమ్యుడు వగైరా వగైరా భుజకీర్తులన్నీ కలిగిఉన్నపటికీ, కాంగ్రెస్ నేతలెవరి కంటికి ఆయన ఆనకపోగా, ఆయన కుర్చీలో కూర్చోని ఉండగానే ఆయనను తప్పించడం గురించి పార్టీలో చర్చకు అనుమతి నీయడం ఇంకా దారుణం.   రాహుల్ గాంధీ ప్రధాని పదవి పట్ల అనాసక్తి చూపుతున్నపటికీ, 65 ఏళ్లుగా కాంగ్రెస్ సంస్కృతీ గురించి ఏమాత్రం అవగాహన ఉన్నవారయినా ఆ కుర్చీ రాహుల్ గాంధీకే రిజర్వ్ చేయబడి ఉందని చెపుతారు. స్త్రీలకూ ప్రసూతి వైరాగ్యం, మనుషులకు శ్మశాన వైరాగ్యం అన్నట్లు, వరుస ఓటములను చవి చూసిన రాహుల్ గాంధీకి ప్రస్తుతం రాజకీయ వైరాగ్యం కలిగినా అది తాత్కాలికమేనని చెప్పవచ్చును. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి అందిస్తున్న బీజేపీ నుండి ఆయన సరిగ్గా అందుకోగలిగితే అప్పుడు ఆ రాజకీయ వైరాగ్యం కూడా మాయమయిపోవడం ఖాయం.   అయితే మోడీ ప్రభావంతో బీజేపీకి దేశంలో రాజకీయ వాతావరణం కొంచెం సానుకూలంగా కనిపిస్తున్నపటికీ, మోడీ వ్యతిరేఖత ఆ పార్టీ పట్ల శాపంగా మారింది. అందువల్లే నేటికీ ఆయనకు కర్ణాటక ఎన్నికల బాద్యతను దైర్యంగా అప్పగించలేక, అటు కర్ణాటకను వదులుకోలేక బీజేపీ నానా అవస్థలు పడుతోంది. కర్ణాటకలో అవినీతి గనులను తవ్వి పోసిన బీజేపీ నేతలని ప్రజలు ఎంతమాత్రం నమ్మడానికి సిద్దంగా లేరని ఖచ్చితంగా చెప్పవచ్చును. అద్వానీ మొదలు సుష్మా స్వరాజ్ వరకు ఎందరు నేతలు పర్యటించి, ఎన్ని గొప్ప ప్రసంగాలు చేసినా, అక్కడా వారి ప్రభుత్వంపట్ల ప్రజలలో ఏర్పడిన వ్యతిరేఖ భావాలను తుడిచిపెట్టలేరు. ఇదే రాహుల్ గాంధీ కి ఒక గొప్పవరంగా మారనుంది. బీజేపీ మోడీ అస్త్రాన్ని వాడుకొని ఉంటే, రాహుల్ గాంధీ పని కొంచెం కష్టమయేదేమో!   ఇక ప్రధాని పదవికి ప్రధాన అర్హత రాజకీయ మద్దతే తప్ప వేరే ఏ ఇతర అర్హతలు అవసరం లేదని దృడంగా నమ్మే మాయవతి, ములాయం సింగులు, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారు కూడా 3వ,4వ,5వ ఫ్రంటు అంటూ అందరూ తలొక ఫ్రంటు పెట్టుకొని తమ ప్రయత్నాలు గట్టిగానే చేసుకుపోతున్నారు.   దేశానికి ఇక సంకీర్ణ ప్రభుత్వాలు తప్పవని, నేడు కాకపోతే రేపయినా తాము ప్రధాని అవడం ఖాయమని వారు బల్లగుద్ది మరీ చెపుతుంటే ప్రజలు ఇప్పటి నుండే భయబ్రాంతులవుతున్నారు. అందువల్ల రాబోయే ఎన్నికలను అటువంటివారు అగ్నిపరీక్షగా భావిస్తే, అవి యావత్ భారతీయుల విజ్ఞతకి పరీక్షగా భావించవలసి ఉంటుంది.

కాంగ్రెస్ ప్రభుత్వాలు దొందుకు దొందు దొందప్పలే

  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దొందుకు దొందు దొందప్పలే అన్నట్లు ఉంది. ఇక్కడ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం బయ్యారం గనుల్లో చిక్కుకొని విలవిలాడుతుంటే, అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు గనుల్లో చిక్కుకొని బయట పడలేక నానా తిప్పలు పడుతోంది. అయినప్పటికీ, రెండు చోట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు మొండివైఖరితోనే ప్రతిపక్షాలను ఎదుర్కోవడం విశేషం.   రాష్ట్రంలో బయ్యారం గనుల వ్యవహారంలో కిరణ్ కుమార్ తెలంగాణ నేతలను పూచికపుల్లతో సమానంగా పరిగణిస్తూ తన నిర్ణయాన్నిగట్టిగా సమర్దించుకొంటుంటే, కేంద్రంలో సోనియా గాంధీ బొగ్గు గనుల వ్యవహారంలో ‘ప్రతిపక్షాలను అరుచుకోనివ్వండి మనపని మనం చేసుకు పోదామని’ అనడం గమనిస్తే ఇద్దరి వైఖరిలో తేడా ఏమి లేదని అర్ధం అవుతోంది.   బొగ్గు గనులలో జరిగిన అక్రమాలపై సీబీఐ తయారు చేసిన నివేదికను సుప్రీం కోర్టులో సమర్పించక ముందే, న్యాయ శాఖామంత్రి తన వద్దకు తెప్పించుకొని అందులో కొన్ని సవరణలు చేయడంతో, ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. అందుకు సంజాయిషీ ఇస్తూ మంత్రిగారు కేవలం నివేదికలో భాష, వ్యాకరణ దోషాలను మాత్రమే సరిదిద్దారని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్దించుకోవడం నిజంగా సిగ్గు చేటు. న్యాయ శాఖా మంత్రి దేశానికి న్యాయం చేయకపోగా కాంగ్రెస్ ప్రభుత్వంలో బయటపడుతున్న అవినీతి గనులను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. పార్లమెంటులో ప్రతిపక్షాలు చేస్తున్న ఈ విమర్శలకు కాంగ్రెస్ వద్ద ఉన్న ఏకైక అస్త్రం ఎదురు దాడి చేయడమే. అయినా ప్రతిపక్షాలు రాజీనామాలకు పట్టుబట్టడంతో సోనియా గాంధీ “ప్రతిపక్షాలను అరవనీయండి మనం పట్టించుకోనవసరం లేదు” అని అనడం తాము ఎవరికీ జవాబు చెప్పుకోనవసరం లేదని చెప్పడమే. ఆమె ఆవిధంగా చెప్పడం ప్రభుత్వానికి మన ప్రజాస్వామ్య వ్యవస్థపట్ల, ప్రతిపక్షాల పట్ల ఎంత చిన్నచూపో తెలియజెపుతోంది.   అదేవిధంగా మొన్న సోనియా గాంధీ తమ పార్టీ నేతలకు మరో చక్కటి ఉపదేశం కూడా చేసారు. “ప్రజలు, ముక్యంగా యువతకి మనం సాదించిన ఘనకార్యాల పట్ల బొత్తిగా సంతృప్తి లేదు. ఎంత చేసినా ఇంకా ఏదో చేయలేదనే మనల్ని నిందిస్తున్నారు. వారికి తగిన విధంగా మనం సమాధానం చెప్పవలసి ఉంది. వారు విమర్శిస్తే దానికి మీరు కూడా దీటుగా జవాబు ఈయండి,” అని ఉద్బోధించారు.   మరి ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? అనే ప్రశ్న మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. ఏ విషయంలోనూ స్వపక్షాన్నే కలుపుకు పోలేని కిరణ్ కుమార్ రెడ్డి, ఇక విపక్షాలను మాత్రం ఏవిధంగా కలుపుకు పోగలరు? అందువల్ల కేంద్రాన్ని దానిని నడిపిస్తున్న తమ అధినేత్రి సోనియా గాంధీ అడుగు జాదలలోనే నడుస్తూ ఆమెనే ఆదర్శంగా భావిస్తూ, ప్రతిపక్షాలతో డ్డీ కొంటున్నారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.   ఇంకా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య చాలానే దగ్గర పోలికలున్నాయి. రెండు చోట్ల ప్రభుత్వాలు బొటాబొటి మెజార్టీతో నడుస్తునాయి. అయినా, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడంలో దొందుకు దొందే. అక్కడ వరుసపెట్టి 2జీ, వాద్రా భూముల కుంభకోణాలు, బొగ్గు గనులు కుంభకోణాలు, యఫ్.డీ.ఐ., అగస్టా హెలికాఫ్టర్ల అవినీతి బాగోతాలు, లంచాలు వరుసగా బయట పడుతున్నాకూడా కాంగ్రెస్ ఏలికలు ఏదో సాదించి పడేసినట్లు నిర్లజ్జగా భోర విరుచుకొని మరీ తిరుగుతుంటే, ఇక్కడ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చాపక్రింద దాచిపెట్టి పోయిన అవినీతి భాగోతాలు, సీబీఐ చార్జ్ షీట్లు, పదవుల కోసం మంత్రుల డిల్లీ టూర్లు, పార్టీలో కుమ్ములాటలు, తెలంగాణ సమస్య, దానివల్ల మళ్ళీ కొత్త ముఠాలు, వారి అసమ్మతి, కరెంటు కోతలు, సామాన్యుడి బ్రతుకు భారం చేస్తున్న కరెంటు చార్జీలు, ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా నెత్తికెత్తుకొన్న బయ్యారం గనుల వ్యవహారాలతో ప్రభుత్వానికి పరిపాలనకు సమయం చిక్కడం లేదు.   ఈవిధంగా కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు దొందుకు దొందు దొందప్పలేనని రుజువు చేసుకొనేందుకు ఒక దానితో మరొకటి పోటీ పడుతున్నాయి.

బయ్యారం గనులలో ప్రతిపక్షాలు, ఇందిరమ్మ కలలలో ముఖ్యమంత్రి

  ఒకవైపు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు బయ్యారం గనులలో పడి గిలగిలా కొట్టుకొంటుంటే, దానిని కెలికిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం హాయిగా అమ్మ హస్తం పట్టుకొని రాబోయే ఎన్నికల తరువాత కూడా తన కుర్చీ తనకే ఖాయం చేసుకోవాలని (ఇందిరమ్మ) కలలు కంటున్నారు. ఇంతవరకు కళంకిత మంత్రుల రాజీనామాకోసం, ముక్యంగా సీబీఐ చార్జ్ షీటులో పేరు నమోదు చేయించుకొన్నసబితా ఇంద్రారెడ్డి రాజీనామా కోసం డిమాండ్ చేసే తీరిక, సమయం రెండూ కూడా ఇప్పుడు ఎవరికి లేవు. ఎందుకంటే అందరు బయ్యారం గనులలో పడి కొట్టుకొంటున్నారు.   అంతే కాదు, కరెంటు కోతలు, కరెంటు చార్జీలు, సర్ చార్జీల వడ్డింపుల గురించి కూడా మాట్లాడేందుకు సమయం లేదిప్పుడు. ఇక అటువంటప్పుడు ఎక్కడో మహారాష్ట్ర వాళ్ళు కట్టుకొన్నబాబ్లీ ప్రాజెక్టు గురించి, ఇంకా దూరంలోఉన్న డిల్లీలో జరుగుతున్న అంతులేని తెలంగాణ చర్చల గురించి మాట్లాడే సమయమా ఇది?   అందుకే, మంత్రి ధర్మాన ప్రసాదరావు “కిరణ్ కుమార్ తక్కువోడేమి కాడని” ఒక సర్టిఫికేట్ జారీ కూడా చేసారు ఈ మద్యనే. ప్రతిపక్షాల వారినందరినీ ఇంత చక్కగా మరిపించగల బయ్యారం అంశంపై చర్చలు మరికొంత కాలం ఇలాగే సాగిపోతే, ఈ లోపుగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మునిసిపల్ ఎన్నికలకి కూడా చల్లగా ఏర్పాట్లు చక్కబెట్టుకొనే వీలుచిక్కుతుంది.   ఒకవేళ ఈలోగా ప్రతిపక్షాలు ఎలాగో ఆ బయ్యారం గనుల(మైకం)లోంచి బయటపడి తాము మోసపోయామని గ్రహించి ఆయనను నిలదీస్తే, “సరే! మీ మాట నేనెందుకు కాదనాలి? అయితే బయ్యారం క్యాన్సిల్ !” అని ఒకే ఒక ముక్కతో ఆటకి షో చెప్పేసి మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి మరోకొత్త ఆట మొదలుపెట్టవచ్చును. అందుకే “తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ” అన్నారు.

ముకేష్ అంభానీకి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు సమంజసమేనా

  దేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయేతర వ్యక్తికి ‘జెడ్’ కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థల అధిపతి ముకేష్ అంభానీకి త్వరలో ఈ సౌకర్యం కలుగనున్నది. రెండు నెలల క్రితం ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదుల నుండి అందిన లేఖలో, జైలులో ఉన్న తమ అనుచరుడు డానిష్ అనే ఉగ్రవాదిని వెంటనే విడిచిపెట్టకపోతే, దక్షిణ ముంబై అల్టామౌంట్ రోడ్డులో ఆయన కట్టుకొన్న 27అంతస్తుల ఆంటిల్ల భవనాన్ని పేల్చివేస్తామని హెచ్చరించడంతో, ఆయన తనకు రక్షణ కల్పించవలసిందిగా ప్రభుత్వాన్నికోరడంతో హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకొంది. ఆయనకు రక్షణ కల్పించేందుకు అత్యాధునిక ఎస్కార్ట్ వాహనాలు మరియు దాదాపు 25మంది బ్లాక్ క్యాట్ కమెండోలు త్వరలో హోంమంత్రిత్వ శాఖ కేటాయించనుంది.   కానీ, ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయంపట్ల సీఆర్పీయఫ్ అధికారులు మాత్రం కొంచెం అసంతృప్తి ప్రకటిస్తునట్లు సమాచారం. తాము నక్సలైట్లను నియoత్రణ కొరకు ఇప్పటికే తగిన సిబ్బంది లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు కొత్తగా ఈ బాధ్యతలు కూడా అప్పగిస్తే తమపై మరింత భారం పడుతుందని, ఇటువంటి పనులకు ప్రత్యేకంగా నియమింపబడిన సి.ఐ.యస్.యఫ్ సేవలను ఉపయోగించుకొంటే బాగుంటుందని వారు అభిప్రాయ పడుతున్నారు.   అదేవిధంగా, అంభానీ నివాసముండే అల్తామౌంట్ రోడ్డులోఉన్న తమ భవనానికి, తమకు రక్షణ కొరకు ఒక ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయమని అంభానీ ముంబై పోలీసులను కోరడంతో, వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆ ప్రదేశంలో పోలీసు స్టేషన్ నిర్మించడానికి అవసరమయిన స్థలం సంపాదించడం, పోలీసు స్టేషన్ నిర్వహించడం తమ తలకు మించిన భారం అని వారు చెప్పినప్పుడు అంభానీ తన భవనంలోనే క్రిందన కొంత స్థలం ఇవ్వజూపినా వారు సాంకేతిక కారణాలతో నిరాకరించినట్లు సమాచారం. కానీ, ఇప్పుడు కేంద్రం ఏకంగా ఆయనకు జెడ్ కేటగిరి రక్షణ కల్పించడంతో ఆయన కొరకు ఇప్పుడు ప్రత్యేకoగా ఒక వ్యవస్థే ఏర్పాటు అవుతోంది.   దేశంలో అత్యధిక పన్నులు చెల్లిస్తు, భారత ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నముకేష్ అంభానీ వంటివారు రక్షణ కోరడం, అందుకు ప్రభుత్వం అంగీకరించడం రెండూ కూడా సమజసమే. కానీ రేపు దేశ వ్యాప్తంగా ఉన్న వేలాది ప్రముఖులలో కొన్ని వందల మంది నుండి ఇటువంటి విన్నపాలే వచ్చినట్లయితే అప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుంది? అంభానీకి రక్షణ కల్పించి మిగిలిన వారికి కల్పించలేమని చెప్పగలదా? ఒక వేళ తప్పసరి పరిస్తితుల్లోకల్పించవలసి వస్తే ఆ భారం ప్రభుత్వం భరించగలదా? అని ప్రభుత్వం కూడా లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది.   ఇటువంటి ప్రముఖులకు రక్షణ కల్పించవలసిన బాధ్యతా ప్రభుత్వం మీద ఉన్నపటికీ, అటువంటి ప్రత్యేక సేవలు అందిస్తున్నoదుకు, పూర్తి ఖర్చులను వారి వద్ద నుండే వసూలు చేయడం వలన ప్రభుత్వం మీద కనీసం కొంత భారం తగ్గుతుంది. ఆలా కాకుండా అంభానీలతో తమకు, తమ ప్రభుత్వానికి ఉన్న సంబంధాలను, అవసరాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఉచిత సేవలు అందించడం మొదలుపెడితే, రేపు మిగిలిన వారు కూడా జెడ్ క్యాటగిరీ రక్షణ కోరుతూ హోంమంత్రిత్వ శాఖా ముందు క్యూకట్టే ప్రమాదం ఉంది.   మన రాజకీయనాయకులకు ముందు వెనుకా ఎస్కార్ట్ వాహనాలు, తిరగడానికి ఎర్రబుగ్గ కార్లు, బాత్రూం కి వెళ్ళాలన్నా వెనుక బ్లాక్ క్యాట్ కమెండోలు ఉండటం ఒక గౌరవ చిహ్నంగా భావిస్తున్న ఈ తరుణంలో ఇటువంటి ఉచిత జెడ్ క్యాటగిరి రక్షణ సేవలు అందించడం అటువంటి వారిని ప్రోత్సాహించడమే అవుతుంది. కనుక, రిలయన్స్ తన ప్రతీ సేవకు ప్రజల దగ్గర నుండి తగిన మూల్యం వసూలు చేస్తున్నట్లే ప్రభుత్వం కూడా వారి నుండి వసూలు చేయడం మేలు.   ఒకవేళ ఇటువంటి అభ్యర్ధనలు ఇంకా వచ్చినట్లయితే, ఇదే ప్రాతిపాదికన వ్యవహరించి వారి రక్షణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయగలిగితే అనేక మంది యువకులకు ఉపాధి కూడా లభిస్తుంది.

పోయిన పరువు బయ్యారంతో తిరిగొస్తుందా

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల ఖమ్మం జిల్లాలో గల బయ్యారం ఇనుపగనులను విశాఖలో గల వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం తెరాసకు ఆయాచితం వరంలా దక్కింది. ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమాలు పక్కన బెట్టి, ఎన్నికలు, టికెట్లు అంటూ పక్క దారిపట్టడంతో ప్రజలలో విశ్వసనీయత కోల్పోయింది. తెలంగాణ విషయంలో చిత్తశుద్ధి లేదనే అపకీర్తి మూట కట్టుకొన్నతెరాసకి, ముఖ్యమంత్రి నిర్ణయం, మళ్ళీ తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకోనేందుకు ఒక చక్కటి అవకాశం అందించిoది.   “తెలంగాణ ప్రాంతంలో ఉన్న బయ్యారం గనులను కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర ప్రాంతానికి దోచిపెడుతున్నాడు. ఇక్కడి నుండి ఒక్క గ్రాము ఖనిజాన్ని కూడా బయటకి వెళ్ళకుండా అడ్డుకొంటాము, అవసరమయితే దీనికోసం మా ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధం,” అంటూ భీకర ప్రతిజ్ఞలు చేస్తున్నారు. తెరాస నేతలకి తల నరుకోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ప్రాణాలు అర్పించడం వంటివి కూడా ఇప్పుడు ఊతపదాలుగా మారిపోయాయి. ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టడానికే ఇటువంటి మాటలు ఉపయోగించడం అత్యవసరం అని వారు భావిస్తున్నట్లున్నారు.   వారికి తమ తెలంగాణ ప్రజల మీద, వారి హక్కుల మీద, వారి కష్టాల పట్ల నిజంగా సానుభూతి ఉండి ఉంటే, ఉద్యమం పేరిట వారి బ్రతులతో చెలగాటం ఆడుకొనేవారే కాదు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ర్ రెడ్డి కాలంలో ప్రైవేట్ వ్యక్తులకు బయ్యారం గనుల కేటాయింపులు జరుగుతున్నపుడు వారెవరికీ ఆయనని గట్టిగా అడిగే దైర్యం లేకపోయింది. ఏళ్ల తరబడి బయ్యారంలో ప్రైవేట్ వ్యక్తులు తవ్వుకుపోతున్నా గుర్తుకు రాని స్టీల్ ప్లాంటు ఆలోచన ఇప్పుడు ఒక ప్రభుత్వ రంగ సంస్థకు గనులు అప్పగించగానే గుర్తుకు రావడం విశేషం.   ఎంతసేపు తెలంగాణ ప్రాంతం దోపిడీకి గురవుతొందనే వితండ వాదన చేయడం తప్ప, తెలంగాణ ప్రాంత, ప్రజల అభివృద్ధికోసం ఎన్నడూ పోరాడింది లేదు. పదేళ్ళుగా తెలంగాణ కోసం ఉద్యమాలు చేస్తున్న తెరాస తమ ప్రాంతాలలో స్టీల్ ప్లాంటులు, విద్యుత్ కర్మాగారాలు వంటి పరిశ్రమలు పెట్టాలని గట్టిగా అడిగిన సందర్బం లేదు. తమ ఉద్యమాలతో ప్రభుత్వం మెడలువంచుతామని గొప్పలు పోయే సదరు నేతలు, ఆ పనేదో తెలంగాణ అభివృద్దికోసం నిజంగా చేసి చూపించి ఉంటే వారి మాటలకు ప్రజలలో విలువ ఉండేది. కానీ, వారు తమ ఉద్యమాన్ని కూడా స్వార్ధ రాజకీయప్రయోజనాలకే వాడుకొన్నారు తప్ప , ప్రజల గోడు, ప్రజల సమస్యలు ఎన్నడూ వారికి పట్టలేదు.   ప్రజలను కలుపుకుపోలేని ఉద్యామాలు ఎన్నడూ విజయవంతం కాలేవు. అయినప్పటికీ, తెరస తనకు లాభం తెచ్చిపెట్టే మార్గం ఎంచుకొని ముందుకు సాగిపోతోంది. సోనియాగాంధీ దేవతని పొగిడిన నోటితోనే ఆమె తెలంగాణ ప్రజలను పొట్టనపెట్టుకొనే రాక్షసి అని అంటాడు. ఉద్యమాలు చేసి తెలంగాణ సాదిస్తామన్న కేసీఆర్, ఆతరువాత డిల్లీలో లాబీయింగ్ చేస్తే తెలంగాణ వస్తుందన్నారు. ఈ రోజు ఉద్యమాల వల్ల తెలంగాణ రాదూ, ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలిస్తేనే తెలంగాణ వస్తుందని నమ్మబలుకుతున్నారు.   పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తననెవరూ చూడట్లేదనే భ్రమలో ఉన్నట్లే, ప్రస్తుతం కేసీఆర్ కూడా తన ఆలోచనలను ప్రజలు అర్ధం చేసుకోలేరనే భ్రమలో ఎన్నికలు, పార్టీ టికెట్లు అంటున్నారిప్పుడు. అందువల్లే, ఆయన పట్ల, తెరాస పట్ల ఇప్పుడు తెలంగాణ ప్రజలలో క్రమంగా వ్యతిరేఖత పెరుగుతోంది. అయితే, వారికి తెరాస తప్ప వేరే గత్యంతరం లేకపోవడమే కేసీఆర్ కు కలిసివచ్చిన అదృష్టమని చెప్పవచ్చును.   ఇటువంటి తరుణంలో అందివచ్చిన బయ్యారం గనుల అంశంతో పోయిన పరువును మళ్ళీ దక్కించుకోవాలని తెరాస నేతలు ఆరాటపడుతున్నారు. వారు చెపుతున్న బయ్యారం సూత్రం తెలంగాణలో మరియు రాష్ట్రంలో ఉన్న యన్టీపీసి విద్యుత్ ఉత్ప్పత్తి కర్మాగారాలకు కూడా వర్తింపజేయగాలరా? కేంద్రప్రభుత్వ అధీనంలో నడిచే (వైజగ్) స్టీల్ ప్లాంట్లు, యన్టీపీసి వంటి సంస్థలను, వాటి కార్యక్రమాలను తెలంగాణ రంగుటద్దాలు పెట్టి ప్రజలకి చూపబోవడం తెరాస నేతల దిగజారుడు రాజకీయాలకి పరాకాష్టగా చెప్పవచ్చును. వారికి నిజంగా తమ ప్రాంతం మరియు ప్రజల మీద అభిమానం గనుక ఉంటే, బయ్యారం గనుల గురించి అభ్యంతరాలు తెలిపే బదులు అక్కడ తమకు స్టీల్ ప్లాంట్ కావాలని పోరాటం చేయడం మంచిది.

సునో మియా! దాల్మియా కా సస్పెన్స్ కహానీ

  రామాయణ మహాభారత భాగవతాది గ్రంధాలను యుగాల నుండి పటిస్తున్నా ఎప్పటికప్పుడు సరికొత్తగానే దర్శనమిస్తాయవి. ఆ మహత్ గ్రంధాలకు ఎంతమంది పండితులు ఎన్నిభాష్యాలు చెప్పినా అక్షయ పాత్రలో ఆహరంలా ఇంకా చెప్పవలసినవి మిగిలే ఉంటాయి.   ఇప్పుడు ఈ కలియుగంలో కూడా ఎంత చెప్పుకొన్నాఅంతు దొరకని అవినీతి కధ ఒకటుంది. అదే జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల కధ. సీబీఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపన్ను, సీబీఐ కోర్టు, సుప్రీం కోర్టు, హైకోర్టు, పోలీసులు వగైరా వగైరా శాఖలన్నీకలిసి నెలల తరబడి శ్రమిస్తున్నా కూడా జగన్ మోహన్ రెడ్డి అవినీతి భాగోతం మొదలు ఆఖరు ఎక్కడుందో కనిపెట్టలేక పోతున్నాయి. బహుశః ఈ భాగోతం మొత్తం కనిపెట్టాలంటే మరొక ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటుచేసుకోవాలేమో.   ఎంతకీ అంతమవ్వని ఈ అద్భుతమయిన ధారావాహికంలో ప్రతీ ఎపిసోడ్ లో ఒక ఆశ్చర్యకరమయిన మలుపు లేదా సన్నివేశం ఉంటుంది. పోతే, రాజమౌళి సినిమాలలో మాదిరిగానే మొత్తం ధారావాహికం అంతా ఫ్లాష్ బాక్ లోనే సాగడం దీని ప్రత్యేకత. కాకపోతే ఈ దారావాహికంలో పునర్జన్మలు ఇంకాలేవు. ఉంటే కధ మరింత రక్తి కట్టేదేమో!   ఇక ఈ రోజు ఎపిసోడ్, దాల్మియా సిమెంట్స్ కంపెనీ సీనియర్ అధికారి సంజయ్ మిత్ర (8వ ముద్దాయి), దాల్మియా సిమెంట్స్ కంపెనీ యండీ పునీత్ దాల్మియాను సీబీఐ ప్రశ్నించడం అనే సీన్ తో ఓపెన్ అవుతుంది.   సీబీఐ అధికారులకి వారు చెప్పిన వివరాలివి: దాల్మియా కంపెనీలో పనిచేసే కొంత మంది ఉన్నతాధికారుల పేర్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు విజయ బ్యాంక్ లలో మొత్తం 26 లాకర్లు తెరువబడ్డాయి. కానీ, ఈ లాకర్లు కంపెనీ సీనియర్ మేనేజర్ నీల్ కమల్ బేరి మరియు బ్యాంక్ మేనేజర్ జాయ్ దీప బసుల జాయింట్ అకౌంట్ గా నిర్వహించాబడేవి. వాటికి ‘జేఆర్’ అనేది కోడ్ వర్డ్.   ఈ లాకర్లలలో నిలువచేసిన దాదాపు రూ.100కోట్లు 2008-’09 మద్య డిల్లీ, కోల్ కతా మరియు చెన్నై లలో జగన్ మోహన్ రెడ్డికి చెందిన వివిధ కంపెనీలకు ‘అనధికార కుటుంబ ఖర్చుల పద్దు’ క్రింద పంపబడ్డాయి. అయితే ఈ సొమ్మును ఎవరికి పంపాలి, ఎంత పంపాలి వంటి వివరాలు నిర్ణయించేది మాత్రం కంపెనీ సీనియర్ సలహాదారు భరుణ్ జీ అనే పెద్ద మనిషి. ఆయనకి తప్ప ఇతరులెవరికీ ఈ విషయంలో ప్రశ్నించే అధికారం కానీ, ఈ ఖర్చులకి పద్దు నిర్వహించే అధికారం కానీ లేదు.   ఆయన పంపించే ఒక పింక్ రంగు కాగితం మీద ఎంత మొత్తం లాకర్ల నుండి ఎంత తీయాలి, ఎవరికి ఈయాలి? అనే రెండు వివరాలతో బాటు ఒక టోకెన్ నెంబర్ కూడా ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి కంపెనీలకు హవాలా మార్గం ద్వారా అందజేసే నసీం మరియు బాబు అనే వ్యక్తులలో ఎవరో ఒకరు వచ్చి టోకెన్ నెంబర్ అడుగినప్పుడు ఆ నెంబర్ చెపితే వారు అ సొమ్మును చెప్పబడిన అకౌంట్స్ లోకి బదిలీ చేస్తారు. ఈ వ్యవహారం మొత్తం కంపెనీ సీనియర్ అధికారి నీల్ కమల్ భేరి అనే వ్యక్తి చేతుల మీదుగా జరిగేది.   ఈ విధంగా 2011 వరకు కూడా లాకర్లలో సొమ్ము బయటకి వెళ్ళింది. మాజీ ముఖ్యమంత్రి వైయస్.రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత జగన్ మోహన్ రెడ్డి ఆర్ధిక సలహాదారు విజయసాయి రెడ్డి డబ్బుపంపని కోరినప్పుడు, మా మద్య ఉన్న సంబందాలను దృష్టిలో ఉంచుకొని భరుణ్ జీ తో చర్చించిన తరువాత రూ 10-20కోట్లు అయన కంపెనీ ఖాతాలోకి పంపడం అయింది. ఖచ్చితంగా ఆ మొత్తం ఎంత అనే విషయం మాత్రం కేవలం భరుణ్ జీ ఒక్కరికి మాత్రమే తెలుసు. ఈ మొత్తం వ్యవహారంలో కేవలం ఆయనదే తుది నిర్ణయం. మిగిలిన వారందరూ కూడా కేవలం నిమిత్తమాత్రులే.   ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో కొసమెరుపు ఏమిటంటే ఈ కధలో నిమిత్తమాత్రులయిన పాత్రధారులందరూ ఉన్నారు. కానీ, అసలయిన సూత్రధారి భరుణ్ జీ 2011లో మరణించారు. అదేవిధంగా అంతవరకు నిత్యం ఆఫీసుకి వచ్చిహవాలా ద్వారా కోట్ల రూపాయలను జగన్ చెప్పిన ఖాతలలోకి అవలీలగా పారింపజేసిన నసీం మరియు బాబులు కూడా సీబీఐ జగన్ డొంక లాగడం మొదలుపెట్టగానే అకస్మాత్తుగా కనబడకుండా మాయమయిపోయారు. ప్రస్తుతం వారికోసం సీబీఐ వెతుకుతోంది.   ప్రస్తుతం చాలా మంది మంత్రులు సైతం విజయవంతంగా ఆచరిస్తున్నపద్ధతినే మన పాత్రదారులు కూడా అనుసరిస్తూ కనబడని సూత్రధారి మీదకు అంతా నెట్టేసి చేతులు దులుపుకొన్నారు సూత్రదారులు ముగ్గురూ ఎపిసోడ్ చివరిలో అదృశ్యం అవడంతో ఈ సస్పెన్స్ ధారావాహికం సశేషంగా ముగుస్తుంది.   ఇంతకీ ఆ నసీం మరియు బాబు ఎలా మయమయిపోయారు? వారిద్దరూ ఎప్పటికయినా దొరుకుతారా? దొరికితే నిజం ఒప్పుకొంటారా? లేకపోతే మరో కొత్త సూత్రధారి పేరు చెప్పి వారు కూడా ఈ దారావాహికాన్ని రక్తి కట్టిస్తారా? వివరాలకు మరో ఎపిసోడ్ వరకు ఎదురుచూడండి.

కాంగ్రెస్ తెదేపాల ఆరోపణలు ద్రువీకరిస్తున్న వైకాపా

  జగన్ మోహన్ రెడ్డి చంచల్ గూడా జైలుని తన పార్టీ కార్యాలయంలా మార్చుకొని అక్కడి నుండే పార్టీ వ్యవహారాలు నడిపిస్తున్నారని ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా వంతపాడటం మొదలుపెట్టాక, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ.హనుమంతరావు మరో అడుగు ముందుకు వేసి జగన్ మోహన్ రెడ్డిని వేరే రాష్ట్రంలో వేరే జైలుకు తరలించాలని డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా వైయస్సార్ కాంగ్రెస్ ఉలిక్కిపడింది.   అయితే, అప్పుడు ఆ పార్టీ నేత అంబటి రాంబాబు, కాంగ్రెస్, తెదేపాలు చేస్తున్న ఆరోపణలు ఖండించకపోగా, జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి రాజకీయాలు చేస్తే తప్పేమేటి? అలా చేయకూడదని ఏ చట్టం చెపుతోందని ఎదురు ప్రశ్నించారు. తద్వారా కాంగ్రెస్ తెదేపాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని ఆయనే అంగీకరించినట్లయింది. ఆయన నాలిక కరుచుకొన్నపటికీ అప్పటికే జరగవలసిన అనర్ధం కాస్తా జరిగిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు తెదేపా చేస్తున్నఆరోపణలను దృవీకరించినట్లయింది.   దానితో ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణరెడ్డి ఈ ఆరోపణలలో నిజానిజాలు నిర్ధారించేందుకు వెంటనే విచారణ చేప్పట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డిని కోరడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలయింది.   ఇప్పుడు గట్టిగా ఎదురు నిలబడి మాట్లాడకపోతే క్రమంగా ఈ వ్యవహారం ముదిరి చివరికి కోర్టు జగన్ మోహన్ రెడ్డిని నిజంగానే వేరే రాష్ట్రంలో వేరే జైలుకి తరలించమని ఆదేశిస్తే, ఇప్పటికీ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తమ పార్టీకి, అది మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని తీవ్ర ఆందోళన చెందిన వైకాపా ఈ సమస్యనుండి బయటపడేందుకు ఇప్పుడు ‘జగన్ కి వ్యతిరేఖంగా కాంగ్రెస్ తెదేపాలు కుట్ర’ అనే కొత్త పల్లవి అందుకొంది. ఆ రెండు పార్టీలు కలిసి తమ అధినేతను తమకి దూరం చేసి, అతనిని జైలుకే పరిమితం చేయాలని దురాలోచనతోనే జగన్నిఏ తీహార్ జైలుకో పంపేందుకు కుట్ర పన్నుతున్నాయని వైకాపా ఆరోపణలు మొదలుపెట్టింది.   జగన్ మోహన్ రెడ్డి భార్య శ్రీమతి భారతి కూడా తన భర్తను దర్యాప్తు పేరిట ఇంకా ఎంతకాలం జైల్లో పెడతారు? అదే చంద్రబాబో, కిరణ్‌ కుమారో లోపల ఉంటే, అప్పుడు ఇలాగే తమ భార్యాబిడ్డలతో సహా వారానికి 8 మందినే కలవాలి అంటే వాళ్లు, వాళ్ల వెనకున్న పార్టీలు ఊరుకుంటాయా? అంటూ ఆమె ఒక ధర్మ సందేహం లేవనెత్తారు మంత్రులకో న్యాయం, చంద్రబాబుగారికో న్యాయం, జగన్ గారికి మాత్రం వేరే న్యాయం.. ఇదెక్కడి న్యాయం అని ఆమె ప్రశ్నించారు.   ఒక మహిళగా ఆమె తన భర్త పరిస్థితికి ఆవిధంగా ఆవేదన చెందడం సహజమే. కానీ, తన భర్తలాగే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా జైలు వెళ్ళవలసివస్తే, ఇదే విదమయిన ఇబ్బందులు ఎదుర్కొనవలసివస్తే అని ఊహాజనితమయిన ఆలోచనలతో ఒక వితండవాదన చేయడం చాలా విడ్డూరం. అమాయకుడయిన తన భర్తకి వ్యతిరేఖంగా వారిరువురూ కలిసి కుట్ర పన్నుతున్నారని, అందువల్లనే జగన్ జైలు నుండి విడుదలకాలేకపోతున్నాడని ఆమె గనుక దృడంగా నమ్ముతుంటే, అదే విషయంపై ఆమె న్యాయపోరాటం చేయవచ్చును.   ఒక పేదవాడికి అన్యాయం జరిగితే కోర్టుకి మొరపెట్టుకోవడానికి వీలుపడదేమో కానీ, జగన్ మోహన్ రెడ్డి వంటి కొట్లాదిపతికి జరుగుతున్నఅన్యాయాన్ని ప్రశ్నించేందుకు హేమా హేమీలవంటి లాయర్లను నియమించుకొని న్యాయపోరాటం చేయడం కష్టం కాదు. కానీ అతను, అతని కుటుంబ సభ్యులు, అతని పార్టీ నేతలు ఎవరూ కూడా ఆ పనిచేయకుండా కాంగ్రెస్ తెదేపాలు నిందిస్తూ కాలక్షేపం ఎందుకు చేస్తున్నట్లు? మన న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకనా? జగన్ మోహన్ రెడ్డి అమాయకుడని గ్రామీణ ప్రజలకు నచ్చజెప్పినట్లు దేశంలో ఏ కోర్టుకి నచ్చచెప్పడం కుదరదనే గ్రహింపు వలననా? లేక వేరే చెప్పలేని కారణాల వలననా? వారే చెప్పాలి.   ఇక శ్రీమతి భారతి కూడా ‘భార్యాబిడ్డలతో సహా వారానికి 8 మందినే కలవాలి’ అనే అంశంపై మాట్లాడిన మాటలు, చెపుతున్న అభ్యంతరాలు కాంగ్రెస్, తెదేపాల ఆరోపణలకే బలం చేకూర్చేవిదంగానే ఉన్నాయి. తద్వారా జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి రాజకీయాలు చేయడం, జైలు నియమ నిబంధనలను ఉల్లంఘించి 8 మంది కంటే చాలా ఎక్కువ మందినే కలుస్తున్నట్లు ఆమె కూడా అంగీకరించినట్లయింది. తద్వారా జైలు సుపరిండేంట్ బీ. సైదయ్య పై తెదేపా చేస్తున్న ఆరోపణలు కూడా అంగీకరించినట్లే అయింది.   ఈ విధంగా వైకాపా నేతలే స్వయంగా ఉన్నసమస్యను భూతద్ధంలో కాంగ్రెస్ తెదేపాలకు చూపిస్తున్నారు. ఎల్లకాలం కాంగ్రెస్ తెదేపాలను నిందిస్తూ కాలక్షేపం చేసేబదులు తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తే వెంటనే న్యాయపోరాటం చేయడం మంచిది.   అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు కలిసి కుట్రలు చేస్తున్నారని దృడంగా భావిస్తే, తమ ఆరోపణలకు సరయిన ఆధారాలుంటే వారిరువురినీ కూడా కోర్టుకీడ్చి అమీతుమీ తేల్చుకోవడం మంచిది. లేకుంటే, జగన్ మోహన్ రెడ్డి కేసుల సంగతిని కోర్టులకి వదిలిపెట్టి, ఎటువంటి రోగాలనయినా, ఎటువంటి క్లిష్ట సమస్యలయినా తన దైవికశక్తులతో చిటికలో మాయం చేసేయగల తమ స్వంత కుటుంబ సభ్యుడయిన బ్రదర అనిల్ కుమార్ ను ఆశ్రయించడం వారి ముందున్న మరో మార్గం.

రాజకీయ నేతల వితండవాదనలు

  ప్రస్తుతం రాజకీయాలలో తర్కం కంటే వితండవాదనకే ఎక్కువ బలం ఉన్నట్లు కనిపిస్తోంది. రాజకీయ నేతలు, పార్టీలు తమ తప్పులను నిజాయితీగా ఒప్పుకొనే రోజులు ఎప్పుడో పోయాయి. ఎన్ని తప్పులు చేసినా నిర్భీతిగా, నిర్లజ్జగా వితండవాదం చేస్తూ, తమను విమర్శించే వారిని తమ వాక్చాతుర్యంతో, అధికార బలంతో, ఇంకా అవసరమయితే మందబలంతో ఎదుటివాళ్ళ నోళ్ళు మూయించే నైపుణ్యం మన రాజకీయ నేతలు సంపాదించారిప్పుడు. అక్రమాస్తుల కేసుల్లో అరెస్టయిన జగన్ మోహన్ రెడ్డి అవినీతి గురించి మీడియా మొత్తం సవివరంగా సాక్ష్యాలతో సహా చూపిస్తున్నపటికీ, క్రింద కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టులు అతనికి బెయిలు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నపటికీ, అతనికి ఏ పాపం తెలియదని, అన్యాయంగా జైలులో పెట్టారని షర్మిల ఊరూరు తిరుగుతూ ప్రచారం చేయడం అందుకు ఒక ఉదాహరణ. అవినీతికి పాల్పడినందుకు సీబీఐ చార్జ్ షీటు దాఖలు చేసినప్పటికీ తమకే పాపం తెలియదని, తాము నిష్కళంక చరితులమని మన కాంగ్రెస్ మంత్రులే గాక ప్రభుత్వం కూడా వాదించడం ఇందుకు మరో ఉదాహరణ. అడ్డుగోలుగా కరెంటు చార్జీలు పెంచినప్పటికీ, ప్రజల మీద ఒక్క పైసా కూడా అదనపు భారంపడదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మైకులు బ్రద్దలయెంతగా నొక్కినొక్కి చెప్పడం ఇందుకు మరో గొప్ప ఉదాహరణ. తెలంగాణ సాదించడంకోసమే ఉద్యమం పక్కన బెట్టి ఎన్నికలలో పాల్గొంటున్నామని తెరాస చెప్పడం, కనబడని ఆ ఉద్యమం బలోపేతం చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలోజేరి టికెట్ తీసుకొంటున్నామని కాంగ్రెస్ యంపీలు చెప్పడం మరో రకమయిన వితండ వాదన. తమ పార్టీలో పోటీ చేయడానికి సరయిన అభ్యర్ధులు లేక ఇతర పార్టీల యంపీలకు, శాసన సభ్యులకు ఒకవైపు గాలం వేస్తూనే, కేవలం తెలంగాణ ఉద్యమంపట్ల నిబద్దత గలవారినే ఆహ్వానిస్తున్నామని ధర్మపన్నాలు వల్లే వేస్తున్న తెరాస నేతలది వితండవాదానకాక మరేమిటి? పార్టీలోఎన్నిలుకలుకలున్నా, ఎంతమంది బయటకి వెళ్ళిపోతున్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ‘మాపార్టీకేమి నష్టం లేదని’ వాదించే తెదేపా చేస్తున్న వితండ వాదన వలన ప్రజలెవరికీ నష్టం లేదు కనుక ఎంతయినా చేసుకోవచ్చును. నోరు విప్పితే మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒవైసీ సోదరులు మాట్లాడవలసినదంతా మాట్లాడేసి, ఆనక పోలీసులు అరెస్ట్ చేస్తే, తమపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్ని జైళ్ళలో పెడుతోందని చేసే వితండవాదం షరా మామూలే. హిందూ మతంపై, హిందువులపై పూర్తి పేటెంట్ హక్కులు తనకే ఉన్నాయనుకొనే బాజపా తానే అసలు సిసలయిన సెక్యులర్ పార్టీయని వాదించడం ఈ కోవలోకే వస్తుంది. ఇలా చెప్పుకొంటే పోతే ఇదే ఒక వితండ గ్రంధం అవుతుంది.

మోడీ కంటే అద్వానీయే బెటరా

  బీజేపీకి ఆపద్భాంధవుడిలా కనబడుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి జనతాదళ్ (యు) నేతలకి మాత్రం రక్త పిపాసిలా కనబడుతున్నాడు. ఈ విషయంలో మోడీ కంటే అద్వానీయే చాలా బెటర్ అని తీర్మానించారు కూడా. నరేంద్ర మోడీ గనుక బీజేపీ ప్రధాని మంత్రి అభ్యర్ధి అయితే గనుక ఇక ఎన్డీయే కూటమికి తమ మద్దతు గురించి ఆలోచించనవసరం లేదని స్పష్టంగా చెప్పింది. అయితే, అదే సమయంలో ఈ కారణంగా తాము కాంగ్రెస్ హస్తం అందుకోబోమని కూడా స్పష్టం చేయడంతో బీజేపీకి కొంచెం ఊరట లబించింది.   బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోరినప్పుడు తక్షణం సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఆ విధంగానయినా ఆయనను తన బుట్టలో వేసుకొని ఆయన జేడీ(యు) పార్టీని ఎన్డీయే కూటమి లోంచి బయటకు లాగాలని చూసింది. కానీ, ఇప్పుడు జేడీ(యు) తాజా ప్రకటనతో కాంగ్రెస్ చాలా నిరాశ పడింది. అదిగాక జేడీ(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్, మోడీ విషయంలో తమ పార్టీ నాయకులను కాస్త సున్నితంగా వ్యవహరించమని కోరడం గమనిస్తే, వ్యక్తిగతంగా ఆయనకీ మోడీని సమర్దించాలని ఉన్నపటికీ, పార్టీ అభీష్టం మేరకు వెనక్కి తగ్గక తప్పట్లేదని అర్ధం అవుతోంది. అందువల్ల రానున్నరోజుల్లో బీజేపీ గనుక ఆయన ద్వారా నితీష్ కుమార్ పై ఒత్తిడి తెచ్చి, ఆయనను మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు ఒప్పించగలిగితే , ఇక కాంగ్రెస్ కి గడ్డు కాలం దాపురించినట్లేనని చెప్పవచ్చును.   నరేంద్ర మోడీకి ఇంత సానుకూలమయిన పరిస్థితులు కనిపిస్తున్న ఈ తరుణంలో, ఆయనను ఉపయోగించుకొని కేంద్రంలో అధికారం చెప్పట్టగలిగే సువర్ణావకాశం కళ్ళెదుట కనిపిస్తుంటే, జేడీ (యు) ఈ విధంగా పానకంలో పుడకలాగా గొంతులో అడ్డంపడటం బీజేపీ జీర్ణించుకోలేక పోతోంది. పైగా, ఆ పార్టీ తమ పార్టీఎవరిని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తే బాగుంటుందో చూచాయగా చెప్పడం మరింత ఇబ్బందికరంగా మారింది.   తన జీవితంలో కనీసం ఒక్కసారయినా ప్రధాని పీఠం మీద కూర్చోవాలని కలలు గంటున్న అద్వానీకి జేడీ(యు) జారి చేసిన ఈ సర్టిఫికేట్ నిజంగా సంతోషించదగినదే. కానీ ఆయన అద్వర్యంలో పార్టీ ఎన్నికలకు వెళ్లి విజయం సాదించగలదా అంటే అనుమానమే. మోడీకి గోద్రా మారణఖాండ మాయని మచ్చయితే, అద్వానికి బాబ్లీ మసీదు కూల్చివేత మచ్చగా మిగిలి ఉంది. కనుక వారిరువురిలో ఎవరు బీజేపీకి సారద్యం వహించినా వారిని విమర్శించేందుకు కాంగ్రెస్ వద్ద అవసరమయిన అస్త్ర శస్త్రాలన్నీ ఉన్నాయి. అటువంటప్పుడు, పార్టీకి విజయం సాదించిపెట్టగల నరేంద్ర మోడీ కాదనుకొని వృద్దుడయిన అద్వానీని నమ్ముకోవడం బీజేపీకి ఎంతమాత్రం ఇష్టంలేదు. అందుకే ఆ పార్టీ నరేంద్ర మోడీ వైపు మొగ్గు చూపుతోంది.   కానీ, జేడీ(యు) ఈ విధంగా అడ్డుపడటం బీజేపీకి చాలా కష్టంగానే ఉంది. ఇప్పుడు అందివస్తున్న ఈ సువర్ణావకాశాన్ని వదులుకొంటే మళ్ళీ 5 ఏళ్ళు ప్రతిపక్షబెంచీలకే పరిమితమవ్వకతప్పదనే సంగతి గ్రహించిన బీజేపీ, అదే విషయాన్నీ తన ఎన్డీయే మిత్రుడు నితీష్ కుమార్ కి నచ్చజెప్పుకోక తప్పదు. ఒకవేళ అప్పటికీ, ఆయన అభ్యంతరాలు చెప్పినట్లయితే, బీజేపీ ఇక జేడీ(యు)నే వదులుకోవచ్చును తప్ప మోడీని వదులుకోదని చెప్పవచ్చును. కానీ, ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది గనుక, ఈ లోపుగా అన్ని పార్టీల ఆలోచనలలో చాలా మార్పులు రావచ్చును.

ఒక్క కేసుకి ఇన్ని చార్జ్ షీట్లా?

  జగన్మోహన్ రెడ్డి జైలు, బెయిలు, రిమాండు పొడిగింపు, సీబీఐ కేసులు, చార్జ్ షీట్లు, విచారణలు, వాయిదాలు వగైరా మీడియాలో నిత్యం వస్తున్నవార్తల వలన సామాన్య ప్రజలకి కూడా ఇప్పుడు న్యాయపరమయిన విషయాల గురించి కొంత అవగాహన పెరిగిందని చెప్పవచ్చును. వెయ్యెకరాలు మాగాణీ పోతేపోయింది కానీ, లా మాత్రం క్షుణ్ణంగా బోధపడిందని వెనకటికి ఎవరో అన్నట్లు, రాష్ట్రంలో కొత్త పరిశ్రమల పేరిట లక్షలాది ఎకరాలు, కోట్లాది రూపాయల ప్రజాధనం పోయినప్పటికీ జగన్ అక్రామాస్తుల కేసుల వలన ప్రజలకి కూడా లా క్రమంగా అర్ధం అవుతోంది.   ఇక విషయంలోకి వస్తే, బుధవారం నాడు నాంపల్లి సీబీఐ కోర్టులోజగన్మోహన్ రెడ్డిపై ఇటీవల సీబీఐ దాఖలు చేసిన 5వ చార్జ్ షీట్ పై ఇరువర్గాల మద్య వాదనలు జరిగాయి. జగన్ మరియు విజయసాయి రెడ్డిల లాయర్లు “సీబీఐ, సుప్రీంకోర్టుకి ఇచ్చిన మాట ప్రకారం జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అన్ని అంశాలకు కలిపి ఒకే చార్జ్ షీట్ దాఖలు చేయకుండా, ఒక్కో అంశానికి వేర్వేరుగా దాఖలు చేస్తోందని, ఇది సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, అందువల్ల మొన్న సీబీఐ దాఖలు చేసిన 5వ చార్జ్ షీటునే జగన్ కేసుల్లో ఆఖరి చార్జ్ షీటుగా కోర్టు పరిగణించి, సీబీఐ మళ్ళీ ఇక చార్జ్ షీట్లు దాఖలు చేయకుండా నిరోదించాలని వారు వాదించారు.   కానీ, వారి వాదనను సీబీఐ న్యాయవాదులు త్రోసిపుచ్చుతూ, అసలు సుప్రీం కోర్టు కంసోలిడేటెడ్ చార్జ్ షీట్ వేయాలని ఎన్నడూ తమని ఆదేశించలేదని, అదేవిధంగా తాము కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో అన్ని అంశాలకు కలిపి ఒకటే చార్జ్ షీట్ వేస్తామని సుప్రీం కోర్టుకు ఎన్నడూ మాటీయలేదని, అందువల్ల వివిధ అంశాలకి వేర్వేరు చార్జ్ షీట్లు వేయడం తప్పనిసరి అని వాదించారు. అయినప్పటికీ, జగన్ మోహన్ రెడ్డి లాయర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సీబీఐ కోర్టు వారిని ఈ విషయాన్ని సుప్రీం కోర్టులోనే తేల్చుకోమని సూచించింది..

దేనికీ బాద్యత వహించని మంత్రులు

    హోం మంత్రి సబితా రెడ్డి పై సీబీఐ చార్జ్ షీట్ నమోదు చేసియగానే, కాంగ్రెస్ పార్టీ మొదట కొంచెం భయపడినా, 24గంటలు గడవక మునుపే పూర్తిగా కోలుకొని ప్రతిపక్షాలను నిలదీయగల శక్తి సమకూర్చుకోగలిగింది. అదేవిధంగా సీబీఐ తన చార్జ్ షీటులోచాలా స్పష్టమయిన ఆరోపణలు చేసినప్పటికీ, “నేనేమి తప్పు చేశానో సీబీఐయే చెప్పాలి, నాపై సెక్షన్ 420 క్రింద కేసు నమోదు చేయడం నాకు చాల బాధ కలిగించింది” అని సబితా రెడ్డి కూడా ప్రశ్నించగలుగుతున్నారు.   ప్రభుత్వం అంటే ప్రజా ధనానికి ఒక ట్రస్టీ మాత్రమే తప్ప యజమాని కాదనే సంగతి ఆమెకు తెలియని విషయమేమీ కాదు. పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నపుడు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తి స్తానని ప్రతీ ఒక్క మంత్రి చేత అందుకే ప్రమాణం చేయిస్తారు. అటువంటి కీలక బాధ్యత గల పదవిని చేప్పటి, నేను అధికారుల మీద నమ్మకంతో గుడ్డిగా ఫైల్స్ మీద సంతాకాలు చేసానని చెప్పడం బాధ్యతారాహిత్యమేనని చెప్పక తప్పదు.   కేబినేట్ తీసుకొన్న నిర్ణయాలకి ఏ మంత్రీ బాధ్యతా వహించనప్పుడు మరిక ఆ నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? తెర ముందు జరిగిన కేబినేట్ నిర్ణయాలతో కానీ, తెర వెనుక జరిగిన కధలతో గానీ తనకు సంబంధం లేదని చెపుతున్న హోంమంత్రి మరి దేనికి బాద్యత వహిస్తారు?   ఆమె స్వయంగా ఏ ప్రయోజనం పొందకపోయినప్పటికీ, ఈ అవినీతి కధలో ఆమె కూడా ఒక ప్రాధాన పాత్ర పోషించారనేది స్పష్టం. పాత్ర పోషించినప్పటికీ సూత్రదారుల నడిపినట్లే నడుచుకోవలసి వచ్చిందనేది ఆమె సంజాయిషీలు కూడా ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. గనుల శాఖలో తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేని ఆమె కీలకమయిన హోంశాఖను ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ ఏవిధంగా నిర్వహించగలరు?   తానూ ఏ తప్పు చేయలేదని ఆమె గట్టిగా నమ్ముతున్నారు గనుక, ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం కంటే, హుందాగా పదవిలోంచి తప్పుకొని న్యాయ పోరాటం చేసుకొని తన నిజాయితీని నిరూపించుకొంటే బాగుండేది. కానీ కాంగ్రెస్ సంస్కృతిలో అటువంటి హుందాతనానికి ఇప్పుడు తావు లేదు. కాంగ్రెస్ లోనే కాదు బహుశః ఏ రాజకీయ పార్టీలోను లేదనే చెప్పవచ్చును.   ఇక ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ మంత్రులందరూ కూడా ఆమెను నిసిగ్గుగా సమర్దించడంద్వారా మరో కొత్త తప్పు చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ధర్మాన ప్రసాదరావును వెనకేసుకు వస్తూ ప్రజలలో తానూ, తన పార్టీ చాలా చులకన అయ్యేరు. ఇప్పుడు హోం మంత్రి సబితా రెడ్డిని కూడా వెనకేసుకు వస్తే ఇది కూడా ఒక సరికొత్త సంప్రదాయంగా మారడం తధ్యం. రేపు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదే సంప్రదాయం కొనసాగిస్తుంది.   అదృష్టవశాత్తు మనకు బలమయిన న్యాయ వ్యవస్థ ఉంది గనుక ఇంతవరకు ఎవరికీ శిక్షలు పడకపోయినా కనీసం ఇంకా అభియోగాల నమోదు, కోర్టులు, విచారణ, బెయిలు వరకు మాత్రం వీలు ఉంది. కానీ, ఆ వ్యవస్థలోనూ ఉన్న లొసుగులను ఉపయోగించుకొని శిక్షలను తప్పించుకొనే వెసులు బాటు కూడా ఉండటమే మన దురదృష్టం.

కాంగ్రెస్ మెడకి చుట్టుకొంటున్న జగన్ కేసులు

  సీబీఐ రాష్ట్ర హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి పేరును కూడా చార్జ్ షీట్ లో చేర్చడంతోకాంగ్రెస్ ప్రభుత్వంలో కలకలం చెలరేగింది. ఇది ముందు నుండి ఊహిస్తున్నదే అయినప్పటికీ ఆఘడియలు ఇంత త్వరగా వచ్చేస్తాయని ఊహించకపోవడంతో కలవరం తప్పలేదు. హోంమంత్రిగా యావత్ రాష్ట్ర పోలీసు శాఖకు అధినేత్రిగా ఉన్న సబితా ఇంద్రరెడ్డిపై చిల్లర నేరగాళ్ళపై మోపే 420వంటి సెక్షన్ల క్రింద చార్జ్ షీట్ దాఖలు చేయడం అవమానకరమే.   ఇప్పటికే సీబీఐ చార్జ్ షీటులోకి పేరు ఎక్కిన మంత్రి ధర్మాన ప్రసాదరావును వెనకేసుకొస్తూ కాపాడుతున్నారని ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా పటించుకోని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీద ఇప్పుడు హోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని కాపాడే పెద్ద బాధ్యత కూడా పడింది. ఆమె రాజీనామాకు అనుమతిస్తే, మంత్రి ధర్మానను మాత్రం ఎందుకు కాపాడుతున్నారనే ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ ఆమెను కూడా వెనకేసుకొస్తే కళంకిత మంత్రివర్గం అని ప్రతిపక్షాలు చేసే విమర్శలను తట్టుకోవలసి ఉంటుంది.   అయితే ఇటువంటి విమర్శలకు మంత్రులు, ప్రభుత్వాలు జడిసే రోజులు ఎప్పుడో పోయాయి. ఎవరేమిఅన్నా కూడా పట్టించుకోకుండా ముందుకు సాగిపోవడమే కాకుండా, తమపై విమర్శలు చేస్తున్న వారు గతంలో చేసిన తప్పులను ఎత్తి చూపిస్తూ మీరు తప్పు చేయగాలేనిది మేము చేస్తే మాత్రం తప్పేమిటి అని ప్రతిపక్షాలపై విరుచుకుపడి వారి నోళ్ళు మూయించగల సరికొత్త విధానం ప్రభుత్వంతో సహా దాదాపు అన్నిరాజకీయ పార్టీలు అవలంబిస్తున్నాయి గనుక సబితాఇంద్రారెడ్డిపై వచ్చే విమర్శలను కూడా ప్రభుత్వం ఇదేపద్దతిలో త్రిప్పి కొట్టవచ్చును.   నిన్నసబితాఇంద్రారెడ్డి ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తొందరపడి రాజీనామా చేయవద్దని, మంత్రి ధర్మానపై కూడా సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసిందని, ఆయన కేసు కోర్టులో నడుస్తోంది గనుక, కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకొందామని చెప్పినట్లు వార్త వచ్చింది. ఇప్పటికే ధర్మానపై సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేయడం, కోర్టులో కేసు నడుస్తుండటం తమ ప్రభుత్వానికి ప్రతికూలాంశమని ముఖ్యమంత్రి భావించకపోగా, దానినే ఆధారం చేసుకొని ఇప్పుడు సబితాఇంద్రారెడ్డిని కూడా వెనకేసుకురావడానికి ఉపయోగించుకోవడం మన రాజకీయ వ్యవస్థలో వచ్చిన పరిణతికి అద్దం పడుతోంది.   ఏది ఏమయినప్పటికీ, రాష్ట్రంలో నేరాలు అరికట్టవలసిన హోం మంత్రిపైనే నేరారోపణ జరిగినప్పుడు, పదవిలో కొనసాగేందుకు మార్గాలు వెతుకుతూ, ప్రజలకు ప్రతిపక్షాలకు సంజాయిషీలు ఇచ్చుకొంటూ అవమానకర పరిస్థితులు ఎదుర్కొనేబదులు ఆమె స్వయంగా రాజీనామా చేసి ఉండి ఉంటె బాగుండేది. కానీ, ఆవిధంగా చేస్తే హోంమంత్రిగా ఆమెకిప్పుడున్న రక్షణ కవచం తొలగిపోతుంది గనుక, మరుక్షణం సీబీఐ ఆమెను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది గనుక ఆమె రాజీనామా చేయకపోవచ్చును.   ఆమె రాజీనామా చేయకుండా మరికొంత కాలం తనని తానూ కాపాడుకోవచ్చునేమో గానీ, ఒకసారి సీబీఐ చార్జ్ షీటులో పేరు కూడా ఎక్కిన తరువాత ఎంతో కాలం కాపాడుకోలేక పోవచ్చును. కనీసం కోర్టు మెట్లు ఎక్కక తప్పని పరిస్థితి ఉంటుంది.   ఇక ఈ వ్యవహారం అధికార కాంగ్రెస్ పార్టీకి కక్కలేని మ్రింగలేని పరిస్థితి సృష్టించిందని చెప్పవచ్చును. జగన్ మోహన్ రెడ్డి మీద సందించిన సీబీఐ అస్త్రం ఇప్పుడు తిరిగి తిరిగి తన పార్టీ నేతలనే బలితీసుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిణామమే. ఇంతకాలం (సీబీఐ) చట్టం తన పని తానూ చేసుకుపోతుందని చిలకపలుకులు వల్లిస్తూ వచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కూడా ఆ పలుకులు వల్లిస్తే అర్ధం వేరేలా ఉంటుంది.   ఈ పరిణామాలకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా స్పందిస్తుందనేది కూడా చాలా ఆసక్తికరంగానే ఉంటుంది. ఆ పార్టీ పరిస్థితి కూడా ఇంచు మించు కాంగ్రెస్ పరిస్థితే అని చెప్పవచ్చును. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసమర్దుడని నిత్యం విరుచుకుపడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డిని కూడా అవినీతి మంత్రి అని విమర్శించగలరా?   ‘విశ్వసనీయత’ గురించి టముకు వేసుకొనే ఆ పార్టీ నేతలు అవినీతి రొంపిలో కూరుకుపోయిన తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కారణంగా ఎదుట వారి అవినీతిని ప్రశ్నించే సాహసం చేయలేరు. కనీసం ‘అవినీతి’ అనే పదం పలకడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది గనుకనే నేడు హోంమంత్రి సబితాఇంద్రారెడ్డిని విమర్శించలేరు, సమర్ధించ లేరు కూడా. కారణం అందరికీ తెలిసినదే. స్వర్గీయ వైయస్సార్ హయాంలో గనుల శాఖా మంత్రిగా పనిచేసిన ఆమె తమ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి లబ్దికలిగించే నిర్ణయం తీసుకొన్నారని సీబీఐ చేస్తున్న ఆరోపణలే అందుకు కారణం.   ఇక, నడుస్తున్న ఈ సీబీఐ సీరియల్లో ఒకటొకటిగా బయటపడుతున్న ఆసక్తికరమయిన ఈ సన్నివేశాలు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ పార్టీల మద్య ఎంత అవినాభావ సంబందాలున్నాయో అద్దం పడుతున్నాయి. తుంటి మీద కొడితే మూతి పళ్ళు రాలినట్లు, జగన్ మోహన్ రెడ్డి మీద కేసులు వేస్తే కాంగ్రెస్ మంత్రులు జైళ్ళకి వెళ్ళే పరిస్థితులు ఏర్పడ్డాయిప్పుడు.

చిరంజీవికి కాంగ్రెస్ బాష వచ్చేసినట్లే

  పార్టీ పెట్టడమే తరువాయి ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయం అనే ఆలోచనతో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి, పైకి మాత్రం ‘సామాజిక న్యాయం’ అంటూ అంతవరకు ఎవరూ పాడని ఒక కొత్త పాట అందుకొని, కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తానంటూ భీషణ ప్రతిజ్ఞలు చేసి చివరికి తానే వెళ్లి ఆ కాంగ్రెస్-బంగాళాఖాతంలో కలిసిపోయి కేంద్రమంత్రి పదవి పుచ్చుకొన్న సంగతి రాష్ట్రంలో చంటి పిల్లాడికి కూడా తెలుసు.   పశ్చిమగోదావరి జిల్లాలో ఆదివారం నాడు జరిగిన ఒక సభలో మాట్లాడుతూ, తను కేవలం సామాజిక న్యాయం కోసమే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో వీలినం చేశానని, అందువల్లే నేడు యస్.సి. యస్టీ. సబ్ ప్లాన్ బిల్లు అమలుకు నోచుకొందని ఆయన ప్రజలకు గుర్తు చేసారు. తనకి సామాజిక న్యాయం మీద తప్ప పదవుల మీద ఏనాడు వ్యామోహం లేదని అన్నారు. త్యాగాల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో తానూ సభ్యుడినయినందుకు చాల గర్విస్తున్నాని ఆయన అన్నారు. అదేవిధంగా కరెంటు చార్జీలు పెంచగానే తనే మొట్ట మొదట స్పందించానని, తత్ఫలితంగా ముఖ్యమంత్రి కూడా వెంటనే సానుకూలంగా స్పందించి కరెంటు చార్జీలు తగ్గించారని చిరంజీవి తెలిపారు.   ఇక, ప్రజల సొమ్ము లక్షల కోట్లు దోచుకొని జైల్లో ఉన్నపటికీ కొందరు ప్రతిపక్ష నేతలు నీతులు వల్లించడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. రాజకీయపార్టీల విగ్రహాలు పెట్టడానికి లేని అభ్యంతరం తణుకులో మహాత్మా గాంధీ విగ్రహం పెట్టడానికి ఎందుకని ఆయన ప్రశ్నించారు.   చిరంజీవి వల్లెవేస్తున్న సామాజిక న్యాయం సంగతి ఎలా ఉన్నపటికీ, తనకి తానూ మాత్రం చాల చక్కగా న్యాయం చేసుకొన్నారని ప్రజలకి తెలుసు. కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీ విలీనానికి మంత్రి పదవులు ఇవ్వడమే ప్రప్రధమ షరతులని ప్రజలందరికీ తెలిసిన విషయాన్నీ తనకు తెలియనట్లు మాట్లాడిన చిరంజీవి వాలకం చూస్తే కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లి తనను ఎవ్వరూ చూడట్లేదని అనుకొన్నట్లుంది. ఆయన ఇంత నిర్భీతిగా ఈ రోజు మాట్లడగలుగుతున్నారంటే కాంగ్రెస్ నీరు బాగా వంట బట్టించుకొన్నారని అర్ధం అవుతోంది.   యస్.సి. యస్టీ. సబ్ ప్లాన్ బిల్లు ప్రసక్తి, కరెంటు చార్జీలపై తానూ ముఖ్యమంత్రిని లొంగదీసిన ప్రసక్తి తేవడం అందుకు చక్కటి ఉదాహరణలు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో చేరి గట్టిగా ఏడాది తిరక్కుండానే చిరంజీవి కాంగ్రెస్-మార్క్ రాజకీయ లక్షణాలను బాగా వంటబట్టించుకొని ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా లొంగదీయగలగడం విశేషమే.   ఇక, ఆయన వంది మాగధులలో ఒకరయిన దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో చిరంజీవే చక్రం తిప్పబోతున్నట్లు కూడా ప్రకటించేశారు. అంటే, వచ్చే సాధారణ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి అవుదామని చిరంజీవి మళ్ళీ కలలు కంటున్నట్లున్నారు. మరటువంటప్పుడు పదవీ వ్యామోహం లేదని ఈ డప్పు ఎందుకో?

సోనియాను ఎదిరిస్తే కేసీఆర్ కు జగన్ గతే

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన షర్మిల తన పాదయత్రాలలో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శిసూ ఆ పార్టీ సీబీఐని అడ్డం పెట్టుకొని తన ప్రత్యర్దులందరినీ బ్లాక్ మెయిల్ చేస్తూ భయబ్రాంతులను చేస్తోందని ఆరోపించడం నిత్యం వింటున్నదే. కాంగ్రెస్ పార్టీ సీబీఐను అస్త్రంగా వాడుకొని తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డిని అన్యాయంగా జైల్లోఇరికించిందని ఆమెతో సహా ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిత్యం వింటున్నవే. తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు కూడా నిన్న అదే విధంగా మాట్లాడటం విశేషం.   బాబు జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా నిన్న ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసారు. అతని చిట్టా సోనియా గాంధీ దగ్గర ఉందని తెలిసినందునే కేసీఆర్ కాంగ్రెస్ విషయంలో కొంచెం ఆచి తూచి మాట్లాడుతున్నాడని, సోనియా గాంధీకి కోపం తెప్పిస్తే తనకు కూడా జగన్ పట్టిన గతే పడుతుందని తెలిసినందునే ఆమె ముందు కిక్కురుమనడని ఎద్దేవా చేసారు. మోత్కుపల్లి కేసీఆర్ ను టార్గెట్ చేసుకొని విమర్శిస్తున్నపటికీ, ఆ విమర్శలలో సోనియా గాంధీ తలుచుకొంటే ఎవరినయినా జైలు పాలు చేయగలదని అని చెప్పడం వాస్తవ పరిస్థితులకి అద్దం పడుతోంది.   కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న సమాజ్ వాది, బహుజన్ సమాజ్ వాది పార్టీల నేతలు ములాయం సింగ్, మయవతి ఇద్దరూ కూడా ఇదేరకమయిన ఆరోపణలు బాహాటంగానే చేస్తున్నారు. ఇక, బాజపా నాయకుడు వెంకయ్య నాయుడు మరో అడుగు ముందుకు వేసి ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ అధీనంలో సీబీఐ పనిచేసేదని కానీ ఇప్పుడు సీబీఐయే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా నిలబెట్టే స్థాయికి ఎదిగిపోయిందని తీవ్ర విమర్శలు చేసారు. అయితే, ఈ విమర్శలను అప్పుడప్పుడు సీబీఐ అధికారులు లక్ష్మినారాయణ వంటివారు ఖండింస్తున్నపటికీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఎన్నడూ నేరుగా జవాబు చెప్పడం కానీ, ఖండించకపోవడం గమనార్హం. దీనిని బట్టి చూస్తే విపక్షాలు చేస్తున్న ఆరోపణలలో నిజం ఉందని అర్ధం అవుతోంది.   గత తొమ్మిదేళ్ళలో రాష్ట్రంలో వైఎస్ కుటుంబం రూ. లక్ష కోట్లు సంపాదిస్తే, కెసిఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు గడించిందని మోత్కుపల్లి చేసిన విమర్శలు కూడా ఆలోచింపదగినవే. వారిరువురూ అక్రమాస్తులు కూడా బెట్టేరా లేదా అనే చర్చను పక్కన బెట్టి చూస్తే, ప్రతిపక్షలలో ఉన్న నేతలు ఈవిధమయిన అక్రమాలకు పాల్పడటమే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక వరంగా మారిందని, తద్వారా ఆ పార్టీ సీబీఐను అస్త్రంగా చేసుకొని ఎవరినయినా లొంగదీయగలుగుతోందని అర్ధం అవుతోంది. అంటే, కాంగ్రెస్ సీబీఐను వాడుకోవడం ఎంత నిజమో, ప్రతిపక్షాల నేతల అవినీతికూడా అంతే నిజమని అర్ధం అవుతోంది.   జగన్ మోహన్ రెడ్డి అచిర కాలంలోనే వేల కోట్లు ఖర్చు చేసి ఒక టీవీ చానెల్, ఒక పత్రిక, బెంగుళూరు, హైదరాబాద్‌, కడప తదితర ప్రాంతాలలో ఇంద్రభవనాలు వంటివి కట్టించుకోవడం, కేవలం కొన్ని సం.ల కాలంలోనే వేల కోట్లు విలువయిన ఆస్తుల సంపాదించడం ద్వారా ఆయన కాంగ్రెస్ పార్టీకి దాని చేతిలో ఉన్న సీబీఐకి చిక్కితే, కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉద్యమం పేరిట ఎంత సంపాదించుకొన్నపటికీ, వారెవరూ నేరుగా కాంగ్రెస్ అధినేత్రిని డ్డీ కొనకపోవడం వలననే ఇంత కాలం సురక్షితంగా ఉండగలుగుతున్నారని మోత్కుపల్లి నరసింహులు మాటలు వివరిస్తున్నాయి.   ఇటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి సీబీఐను వాడుకొంటోందని స్పష్టం చేస్తుంటే, అందుకు కారణం విపక్షల నేతల అవినీతి, అక్రమాస్తులేనని కూడా తెలియజేస్తోంది. అందువలన అందరూ ఆ త్రానులో ముక్కలేనని భావించవలసి ఉంటుంది.

తేదేపా మీదకు ఫ్లెక్సీ బాణాలు సందిస్తున్న జగన్

  షర్మిల తానూ జగన్నన వదిలిన బాణాన్నని గర్వంగా చెప్పుకొన్నారు. ఇప్పుడు జైల్లో కూర్చొన్న జగనన్న తెలుగుదేశం పార్టీ మీదకి ఫ్లెక్సీ బాణాలు సందిస్తున్నట్లు ఉంది. మొదట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ బ్యానర్లలో జూ.యన్టీఆర్ ఫోటోలు పెట్టినప్పుడు అదేదో కాకతాళీయంగా జరిగిందని అందరూ భావించారు. కానీ అది ఆ తరువాత కూడా కొనసాగడంతో వైకాపా ఆశించినట్లే మీడియాలో దానిపై తీవ్ర రాజకీయ చర్చ మొదలయింది. నిన్న మళ్ళీ వైకాపా బ్యానర్లలో స్వర్గీయ యన్టీఆర్ ఫోటోలు పెట్టడం, మళ్ళీ ఈ రోజు జూ.యన్టీఆర్ నటించిన బాద్షా సినిమా విడుదల అవుతున్న సందర్భంగా చీరాల మోహన్ థియేటర్ వద్ద జగన్ తో ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలు, తిరువూరు వెంకటేశ్వర థియేటర్ వద్ద కొడాలి నాని, ఎన్టీఆర్, వైఎస్ జగన్ లు ఉన్న ఫ్లెక్సీలు వెలియడంతో ఇదంతా కాకతాళీయం గా జరగట్లేదని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగానే తెలుగుదేశం పార్టీలో చిచ్చు పెట్టే ప్రయంత్నంలో భాగంగానే ఈ వ్యూహాన్ని అమలు చేస్తునట్లు అర్ధం అవుతోంది.   దీనిని ఖండించవలసిన జూ.యన్టీఆర్ కనీసం స్పందించకపోవడంతో ఆయన మౌనాన్ని కూడా సద్వినియోగం చేసుకొంటున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత జోరుగా ఈ వ్యూహాన్ని అమలు చేయడం మొదలు పెట్టింది. తద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో, ముఖ్యంగా ఆ పార్టీకి ఆయువుపట్టయిన కృష్ణా జిల్లాలో తానూ ఆశించిన విధంగా గందరగోళం సృష్టించగలిగింది. ఆ పార్టీలో అంతర్గత విబేధాలు చాలా తీవ్రస్థాయిలో ఉన్నందునే ఇంత జరుగుతున్నపటికీ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, నందమూరి సోదరులు బాలకృష్ణ, హరికృష్ణలు స్పందించలేకపోతున్నారని, జూ.యన్టీఆర్ మౌనం వైకాపాకు అర్దంగీకారం తెలియజేసినట్లేనని మీడియాలోవస్తున్నవార్తలు, విశ్లేషణలతో తెలుగుదేశం పార్టీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశించిన విధంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.   ఇటువంటి నీచ వ్యూహాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాత్కాలికంగా ప్రయోజనం పొందినప్పటికీ, అది ఆ పార్టీ ప్రతిష్టనే దెబ్బతీయక మానదు. ఇంతవరకు మన దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా బహుశః ఇంత దిగజారి తన శత్రుపార్టీల నేతలను తమ ప్రచారానికి వాడుకోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, వ్యూహాలు ఏవయినప్పటికీ, తెదేపా చెపుతున్నట్లు ఈ వ్యూహం అద్దాల మేడలో కూర్చొని ఎదుటవాడి మీదకు రాళ్ళు విసురుతున్నట్లుంది. ఇది నిజంగా ఆ భావ దారిదారిద్ర్యమేనని చెప్పక తప్పదు. రేపు జూ.యన్టీఆర్ లేదా హరికృష్ణ, బాలకృష్ణలలో ఎవరయినా దీనిని ఖండిస్తూ మాట్లాడితే, అప్పుడు తెదేపా కోసం వైకాపా తవ్వుతున్న గోతిలో ఆ పార్టీయే పడవచ్చును.   ఒకవేళ నిజంగా జూ.యన్టీఆర్ లేదా హరికృష్ణలకు చంద్రబాబు, బాలకృష్ణలపై కోపం ఉన్నపటికీ, తమ నందమూరి వంశానికి ప్రతీకగా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీని వీడి జగన్ మోహన్ రెడ్డి తో చేతులు కలిపి ఆ పార్టీలో చేరుతారని కలలో కూడా ఆశించలేము.

రాష్ట్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనా

  నిన్న కేసీఆర్ నిజామాబాద్ జిల్లా బోధన్ లో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్రంలో కొనసాగుతున్నట్లే రాబోయే ఎన్నికల తరువాత రాష్ట్రంలో కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. ఆయన తెలంగాణాలో తమ తెరాస పార్టీ పూర్తి మెజార్టీ సాధిస్తుందనే నమ్మకంతో ఆవిధంగా చెప్పినప్పటికీ, ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో నెలకొన్న అనిశ్చితత పరిస్థితి గమనిస్తే అదే జరగనున్నదని అర్ధం అవుతుంది.   తెలంగాణ విషయానికి వస్తే, అక్కడ ఇతర రాజకీయ పార్టీలు తమ గెలుపు గురించి ఎంత ధీమా వ్యక్తం చేస్తున్నపటికీ శాసనసభ స్థానాలలో మాత్రం తెరాస ఆధిక్యత కనబరచడం తద్యం. కేవలం తెలంగాణ లో పలుకుబడి, కార్యకర్తల బలం కలిగిన ఇతరపార్టీల నేతలు మాత్రమే అక్కడ విజయం సాదించవచ్చును. ఆ విధంగా చూస్తే తెరాస కనీసం 50 స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం ఉంది.   రాబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యగా చెప్పవచ్చును. 9సం.లుగా ప్రతిపక్షానికే పరిమితమయిపోయిన తెదేపా తప్పని సరిగా గెలవాలి. లేకుంటే, ఆ పార్టీలో చీలికలు లేదా పార్టీ నుండి వలసలు మొదలయిపోతాయి. ఇక జగన్ మోహన్ రెడ్డి కష్టాలు తీరాలంటే తప్పనిసరిగా రాబోయే ఎన్నికలలో పూర్తి మెజారిటీతో గెలవక తప్పదు. లేదంటే ఆయన రాజకీయ జీవితం అంధకారం అయ్యే ప్రమాదం ఉంది. అంతే గాక, ఆ పార్టీ మనుగడ కూడా కష్టమే అవుతుంది గనుక ఆ పార్టీ తన విజయం కోసం చాలా పట్టుదలగా ప్రయత్నించవచ్చును.   ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో ఎంత వ్యతిరేఖత ఉన్నపటికీ, ఆ పార్టీకి చెందిన ఘనాపాటీలు తమ పలుకుబడితో, ఆర్ధిక శక్తితో అవలీలగా గెలవగలరు. అందువల్ల రాబోయే ఎన్నికలలో ఈ 3 పార్టీలు ఓట్లను చీల్చి సమానంగా లేదా కొంచెం హెచ్చు తగ్గులతో శాసన సభ సీట్లను దక్కించుకోవడం ఖాయం.   పోలింగ్ జరిగే సమయానికి ఏ పార్టీకయినా అనుకూలంగా రాష్ట్రంలో ఊహించని రాజకీయ పరిణామాలు ఏర్పడితే తప్ప, ప్రస్తుత పరిస్థితులలో ఏ పార్టీకూడా పూర్తి ఆధిక్యం పొందలేకపోవచ్చును. అదే జరిగితే, రాష్ట్రంలో కూడా ఇక సంకీర్ణ ప్రభుత్వం తప్పకపోవచ్చును. గత 4 సం.లుగా కేంద్రంలో సంకీర్ణంతో క్షణమొక గండం దినమొక గండం అన్నట్లు అతి కష్టం మీద నెట్టుకొస్తున్నయుపీయే ప్రభుత్వ పాలనలో దేశం ఏవిధంగా ఇబ్బందులు పడుతోందో, రేపు రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర పరిస్థితి అంత కంటే దయనీయంగా మారుతుంది.   మెజారిటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలనలోనే రాష్ట్ర పరిస్థితులు ఇంత దయనీయంగా ఉన్నపుడు, ఇక నిత్యం కీచులాడుకొంటూ సాగే సంకీర్ణ ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితి ఏవిధంగా ఉంటుందో తలుచుకొంటేనే భయం కలుగుతుంది.   దీనికి పరిష్కారం ప్రజల చేతులోనే ఉంది. పార్టీలు చూపే తాత్కాలిక ప్రలోభాలకు తలొగ్గక, కులం, మతం, ప్రాంతం అనే మూడు అంశాలను పక్కన బెట్టి, ఏపార్టీకి ఓటేస్తే రాష్ట్రానికి చక్కటి పాలన అందించగలదో ఆలోచించుకొని దానికే ఓటేయడం ద్వారానే ఇటువంటి సంకీర్ణ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చును. లేకుంటే, ప్రజలకి దేరీజే క్రోకడయిల్ ఫెస్టివల్ ఇన్ ఫ్రంట్ అనుకోక తప్పదు.