ప్రతిపక్షాల కొంప ముంచిన అవిశ్వాసం

  కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా రెండు నెలల క్రితం శాసనసభలో కిరణ్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వల్ల ఆయన ప్రభుత్వానికి జరిగిన నష్టం ఏమి లేకపోగా, అది ప్రవేశపెట్టిన ప్రతిపక్ష పార్టీలే తీవ్రంగా నష్టపోయాయి. చంద్రబాబు పరోక్ష సహకారంతో అవిశ్వాస గండం అవలీలగా గట్టెక్కిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఇనుమడించిన ఉత్సాహంతో దూసుకుపోతుంటే, ఆ సందర్భంగా పార్టీ విప్ ను దిక్కరించిన కారణంగా ఏకంగా 15 మంది శాసన సభ్యులు అనర్హత వేటుకి బలయిపోయారు. తద్వారా కిరణ్ కుమార్ ప్రభుత్వం ఇప్పుడు శాసనసభలో మరింత బలం పుంజుకొన్నారు. శాసన సభ సమావేశాల ప్రారంభానికి రెండ్రోజుల ముందే స్పీకర్ వ్యూహాత్మకంగా శాసనసభ్యుల మీద అనర్హత వేటు వేయడంతో ఇప్పుడు సభలో 145 స్థానాలతో అధికార పార్టీ మరింత బలపడింది. అందువల్ల ఇప్పుడు ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం గురించి మరో మారు ఆలోచించే ప్రయత్నం కూడా చేయలేవు. ఒకవేళ చేయదలచుకొన్నా కూడా సభా నియమాల ప్రకారం ఒకే దఫాలో సాగుతున్న శాసన సభ సమావేశాలలో వరుసగా మూడవసారి అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడానికి వీలులేదని రాజ్యంగా నిపుణులు చెపుతున్నారు.   ఈవిధంగా చూస్తే, తెరాస, వైకాపాలు అత్యుత్సాహానికి పోయి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వల్ల వైకాపాకే తీరని నష్టం కలిగింది. రాజకీయ అనుభవ రాహిత్యంతో ఆ పార్టీ అనాలోచితంగా ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం వలన పార్టీ విప్ప్ లు దిక్కరించి మరీ ఆ పార్టీకి విధేయత ప్రకటించినందుకు వారికి బహుమానంగా అనర్హత వేటు పది వారందరూ ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులుగా మారారు. సాధారణ ఎన్నికలకి కేవలం పది నెలలే మిగిలి ఉన్నందున ప్రస్తుతం ఉప ఎన్నికలు ఎన్నికలు నిర్వహించబోమని ఎన్నికల కమిషనర్ హెచ్. ఎస్. బ్రహ్మ సూచన ప్రాయంగా ప్రకటించడంతో అధికార పార్టీ ఊపిరి పీల్చుకుంది. కాంగ్రెస్ అధిష్టానం అండతో పార్టీలో చెలరేగిన అసమ్మతిని అణచిపారేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేటి నుండి మొదలయ్యే శాసన సభా సమావేశాలలో మరింత చెలరేగిపోవడం ఖాయం.

అభిమానుల బలహీనతే పెట్టుబడిగా సాగుతున్న ఐపీయల్

  ఐపీయల్ మ్యాచులు మన క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయమని దేశంలో క్రికెట్ అభిమానులు అందరూ చాలా సంతోషించారు. వివిధ దేశాలకు చెందిన తమ అభిమాన క్రికెట్ ఆటగాళ్ళను అందరూ కలిసి ఆడుతుంటే వారికి అదో పండుగే అయింది. దానికి సినీరంగం, చీర్ గర్ల్స్ గ్లామర్ కూడా తోడవడంతో వారి సంబరానికి అంతే లేదు. చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురయినప్పటికీ, అటు క్రికెట్ అభిమానులకు ఆనందం, ఇటు క్రికెట్ బోర్డుకి, ఆటగాళ్లకి కాసుల వర్షం కురిపిస్తూ ఐపీయల్ ఇంతవరకు సజావుగా సాగిపోయింది.   అయితే, శ్రీశాంత్, అజయ్, అంకిత్ ముగ్గురూ స్పాట్ ఫిక్సింగ్ కేసులో పట్టుబడటంతో, క్రికెట్ అభిమానులకి తమ కళ్ళ ముందు జరుగుతున్న ఆట నిజమయిన ఆట కాదని తెలిసి దిగ్బ్రాంతి చెందారు. ఆ వెంటనే, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని గురునాథ మయప్పన్, రాజస్తాన్ రాయల్స్ యజమానులు అయిన బాలివుడ్ నటి శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా కూడా ఐపీయల్ పై బెట్టింగ్ చేస్తూ దొరికిపోయారు. ఇక, ఇండియన్ టీం క్యాప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ కూడా రితీ స్పోర్ట్స్ అనే వ్యాపార సంస్థలో వాటాలు కలిగి నలుగురు ఆటగాళ్ళను ముందుగానే ఫిక్స్ చేసుకోవడం మరింత అనుమానాలకు రేకెత్తించింది.   ఈ మొత్తం వ్యవహారలన్నిటినీ కూడా ఎక్కడో దుబాయ్ లో కూర్చొన్న దావూద్ ఇబ్రహం వంటి సంఘ వ్యతిరేఖ శక్తులు నియంత్రిస్తుండటం కొసమెరుపు. ప్రజల క్రికెట్ అభిమానాన్నిఒక బలహీనతగా గుర్తించిన సదరు శక్తులన్నీ కలిసి వారితో ఈవిధంగా ఆడుకోవడం ఆరంబించాయి. అప్పుడు అభిమానులకు తాము ప్రోత్సహిస్తున్నది క్రికెట్ ఆటనా లేక వ్యాపారన్నా లేక జూదాన్నా అనే ప్రశ్నతలెత్తింది. తమ విలువయిన సమయాన్ని కష్టార్జితాన్నిపణంగాపెట్టి వారందరూ కలిసి ఆడుతున్న ఈ ఐపీయల్ మ్యాచులలో తామే అందరి కంటే ముందు క్లీన్ బౌల్డ్ అయిపోయామని అర్ధం చేసుకొని వారు నివ్వెర పోయారు.   జంటిల్ మ్యాన్ గేం అని చెప్పబడుతున్న క్రికెట్ ఆట వెనుక ఇన్ని దుష్ట శక్తులు, కుట్రలు, కుతంత్రాలు ఉన్నట్లు తెలిసిన తరువాత కూడా ఆ ఆటలో ఆనందం వెత్తుకోవాలని చూస్తే అది తమ బలహీనతకు మరో మారు లొంగిపోవడమే కాకుండా అటువంటి సంఘ విద్రోహ శక్తులకు పరోక్షంగా తమ మద్దతు తెలిపినట్లే అవుతుందని చాలా మంది క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారిప్పుడు.   ఈ ఐపీయల్ మ్యాచుల వల్ల దేశానికి ఖ్యాతి, ఆదాయం రాకపోగా ఉన్నపరువు గంగలో కలిసిపోయి, సొమ్ములు విదేశాలకు తరలిపోతున్నాయి. నేడు ఈ మ్యాచులలో కొందరు సినీతారలు ప్రత్యక్షంగా పాల్గొంటే, సాక్షాత్ బీసీసీఐ బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్, ఆయన అల్లుడు మేయప్పన్, విందూ సింగ్, దావూద్ ఇబ్రహీం వంటి వారందరూ తెర వెనుక నిలబడి కధను నడిపిస్తున్నారు. ఇవి కేవలం ఇంత వరకు బయటపడిన కొన్ని పేర్లు మాత్రమే. ఇంకా ఈ వ్యవహరంలో ఎన్ని పెద్ద తలకాయలున్నాయో ఎవరికీ తెలియదు. స్విస్ బ్యాంకులని కూడా తమ అవినీతి సంపాదనతో నింపి పడేసిన మన రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు కోట్లు కురిపిస్తున్న ఈ ఐపీయల్ మ్యాచ్చులకి దూరంగా ఉంటారని మనం భావించనవసరం లేదు. ఎంత పెద్ద అవినీతో భాగోతానయినా అవలీలగా కప్పి పుచ్చగల సమర్దులయినవారు తమ పేర్లు బయటపడకుండా పైకి కొందరి బొమ్మలే కనిపించేలా తగిన జాగ్రత్తలు తీసుకొనే ఉంటారు.   ఇక, ఇటువంటి అనైతిక ఆటలో తానూ భాగస్వామిని కాలేనని గౌరవంగా తప్పుకొన్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ని ఆదర్శంగా తీసుకొని ఆయన అభిమానులు కూడా ఈ ఐపీయల్ మ్యాచులుకి దూరంగా ఉంటే మేలేమో. ఇంత ఘోరంగా మోసం చేసిన ఐపీయల్ మ్యాచులు ఇప్పుడు వారికి ‘ఐ-ఓపెనర్’ అయ్యాయి.

కాంగ్రెస్ పంచాయితీలో ఇంతకీ తేలిందేమిటి?

  డిల్లీలో కాంగ్రెస్ పంచాయితీ ఇక ఒక కొలిక్కి వచ్చినట్లే ఉంది. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో పెద్ద తలకాయలన్నిటికీ పేరుపేరునా పిలిచి సింగల్ గా మరియు సామూహికంగా వేర్వేరు రకాల అక్షింతలు వేసి సాగనంపుతున్నట్లు తెలుస్తోంది. కానీ, ఎవరికీ ఏ టైపు అక్షింతలు వాడిందో పెరుమాళ్ళకే ఎరుక గనుక, వారందరూ బయటకి వచ్చినప్పుడు మాత్రం ఏదో ఘనవిజయం సాదించినట్లే కాలరేగరేసుకొని మీడియాతో మాట్లాడకుండా, ఒకరికొకరు ఎదురుపడకుండా జాగ్రత్త పడుతూ రాష్ట్రంలో తిరిగి వచ్చి పడుతున్నారు.   ఇంతవరకు ఎవరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఏమి చెప్పలేదు గనుక, మీడియా కూడా తనకు తోచినట్లు మంచి రుచికరమయిన మసాలా దట్టించి కధనాలు వండి వడ్డిస్తోంది. జనాలు కూడా వారి వారి టేస్టుల బట్టి వాటిలోంచి తమకు నచ్చిన వాటిని వడ్డించుకొని ఆనందిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు రాష్ట్రంలో జరగబోయే తంతును బట్టే డిల్లీ పంచాయితీలో ఏమి జరిగిందో కనిపెట్టుకొనే పని జనాలదే అవుతుంది.   ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ ఇంటికి వచ్చి చప్పుడు చేయకుండా కూర్చుంటే ముఖ్యమంత్రిని ఎదిరిస్తున్నందుకు ఆయనకు సోనియమ్మ అరగంట సేపు తలంటి పంపిందని భావించవచ్చును. ఒకవేళ, ఆయన కలలు కంటున్న హోంమంత్రి పదవి ఇస్తే, ముఖ్యమంత్రిని మరీ అంత రెచ్చిపోవద్దని హెచ్చరించినట్లు అనుకోవచ్చును.   ఒకవేళ ముఖ్యమంత్రి రామచంద్రయ్యకు మంగళ హారతి ఇచ్చేస్తే, చిరంజీవికి సోనియమ్మ అక్షింతలు వేసినట్లు చెప్పుకోవచ్చును. రామచంద్రయ్యను క్యాబినెట్ లో చిరంజీవి పఠం పెట్టుకొని మెగాభజన చేసుకోనిస్తే, ఇక రెడ్డిగారు అమ్మహస్తం పట్టుకొన్నపటికీ, పగటి (ఇందిరమ్మ) కలలు కనవద్దని, ఒక్క బంగారు తల్లినే కాకుండా పార్టీలో ఉన్న చిరంజీవి, రామచంద్రయ్య, దామోదర, జానారెడ్డి ఇత్యాది బంగారు తండ్రులను కూడా పట్టించుకోమని అమ్మ ఆదేశించినట్లే అనుకోవచ్చును.   ఇక, డిల్లీలో పంచాయితీలు ముగిస్తే, రేపటి నుండి మంత్రులందరూ మళ్ళీ పరిపాలన మీద దృష్టి పెడతారని ప్రజలు అత్యాశకి పోతున్నారు. కానీ, ఒకసారి తెలంగాణా అంశం, మరోసారి అవిశ్వాసం, మరోసారి కళంకిత మంత్రుల ఉద్వాసన, ఇంకోసారి మంత్రి పదవుల భర్తీ, అసమ్మతి నేతల బుజ్జగింపులు వంటి అనేక సీరియస్ సమస్యలు ఒకదాని తరువాత మరొకటి వచ్చిపడిపోతుంటే, ప్రభుత్వం తమను పట్టించుకోలేదని ప్రజలు బాధపడటం అవివేకం.అప్పటికీ వారు డిల్లీ నుండి తిరిగి వచ్చినప్పుడల్లా రాష్ట్రాన్ని పరిపాలిస్తూనే ఉన్నారు కదా పాపం.

ఆ మెగాజీవికే అంత ప్రాదాన్యం ఎందుకు

  ‘చిరంజీవితో సోనియా గాంధీ మంతనాలు’ అంటూ ఇప్పటికీ మీడియా ఊహించవలసినదంతా ఊహించి, చెప్పదలచుకొన్నదంతా చెప్పేసింది. పనిలో పనిగా చిరంజీవికి కూడా మీడియా బాగానే కవరేజ్ దొరికింది. చిరంజీవి తన వీరభక్తుడు రామచంద్రయ్యపై వేటు పడకుండా మెగా చక్రం అడ్డు వేయడానికే సోనియమ్మను కలిసాడని కొందరు విశ్లేషిస్తే, కిరణ్ కుమారుడిపై తన అసంతృప్తి వెళ్ళగక్కేందుకే కలిసాడని మరో విశ్లేషణ సాగింది. అదేమి కాదు మరో రాజశేఖరెడ్డి లక్షణాలు కనబరుస్తున్న కిరణ్ రెడ్డికి చెక్ పెట్టేందుకే, ఆయనని వ్యతిరేఖిస్తున్నజీవులందరితో సోనియమ్మ మంతనాలు చేస్తోందని మరికొందరు కనిపెట్టారు. మొత్తం మీద చిరంజీవి-సోనియా సమావేశం ద్వారా జనానికి కూడా కొంత రాజకీయ పరిజ్ఞానం పెరగడం ఇక్కడ నాలుగో పాయింటుగా అనుకోవచ్చును.   అయితే, కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో ఉన్నఅనేక సీనియర్లని, సోనియా-రాహుల్ భజనమండలి అధ్యక్షులు, కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులు దక్కని జనాలు, అసంతృప్త తెలంగాణావాదులు వంటి భిన్నజాతులని కాదని కేవలం చిరంజీవికే ఎందుకు ప్రాధాన్యం ఇస్తోంది? ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు ముప్పై ఏళ్లబట్టి పార్టీలో పనిచేసిన తెలంగాణా యంపీలు, రెండు రోజులు పార్లమెంటు మెట్ల మీద పడిగాపులు కాసినా దొరకని సోనియమ్మ దర్శనం, కేవలం ఈ ఒక్క జీవికే ఎందుకు అంత అవలీలగా దొరుకుతోంది?   పార్టీలో అంతమంది అతిరధ మహారధుల వంటి నేతలుండగా నిన్నగాక మొన్న రాజకీయాలలోకి, పార్టీలోకి వచ్చిన ఈ సరికొత్త జీవి ద్వారానే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఎందుకు ఆరా తీస్తున్నట్లు? వంటి అనేక భేతాళ ప్రశ్నలకి సమాధానాలు వెతికితే, ప్రజారాజ్యం కండువాపైన కాంగ్రెస్ కండువా కప్పుకొని ఆయన వెనక తిరుగుతున్న17 మంది శాసనసభ్యులు ఇప్పటికీ ప్రజారాజ్యం కండువాను పదిలంగానే ఉంచుకొన్నట్లు, వారందరూ కూడా రామచంద్రయ్యలాగ దైర్యంగా చిరంజీవి భజనలో పాల్గొనలేకపోతున్నపటికీ, రానున్న ఎన్నికలలో టికెట్స్ కోసం చిరంజీవి నిప్పుల్లో దూకమన్నా దూకేందుకు సిద్దంగా ఉన్నారని తన పెంపుడు చిలకల ద్వారా సోనియమ్మ గ్రహించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మనుగడకు ఆ 17 మంది వీరభక్తుల మద్దతు ఎంత అవసరమో ఆమెకు తెలియంది కాదు. గనుక, చిరంజీవితో కాసేపు మాట మంతికి, తద్వారా ఆయనకి దక్కే ఆ మాత్రం మీడియా కవరేజ్ వల్ల ఆమెకు, పార్టీకి లాభమే తప్ప వచ్చే నష్టం ఏమీ లేదు.   ఇక, కిరణ్ కుమార్ రెడ్డి పోరుపడలేక ఒకవేళ రామచంద్రయ్యను పీకదలిస్తే అదేదో ముందుగానే మెగాజీవి చెవిలో వేసి, శాస్త్రప్రకారం పీకితే అప్పుడు ఆయనే పార్టీ నిర్ణయాన్ని వెనకేసుకొనే బాధ్యత తీసుకోవచ్చు కూడా. లేదా, కిరణ్ మొత్తుకొన్నారామచంద్రయ్యను పీకడం లేదనే ఓ చల్లని మాట చెప్పి ఆ జీవిని సంతోషపెట్టవచ్చు కూడా.   సినీరంగంలో స్వయంకృషితో పైకి వచ్చిన ఈ జీవి పార్టీలో చేరి గట్టిగా ఏడాది కూడా తిరుగక ముందే కాంగ్రెస్ పార్టీ నీళ్ళు బాగానే ఒంట బట్టించుకొంటున్నాడు గనుక రానున్నఎన్నికలలో ఆయన రెడ్డి రాజ్యాన్ని ఒక ‘కాపు’ కాస్తాడనే అడియాస కూడా లేకపోలేదు.

పాలిటిక్స్ లో లేటెస్ట్ ట్రెండ్- ‘సీట్లు, నోట్లు, ఓట్లు’

  రామాయణం మొత్తాన్ని కట్టే, కొట్టే, తెచ్చే అని మూడు ముక్కల్లో చెప్పుకొంటునట్లే, ఇప్పుడు ఎన్నికల తంతుని కూడా సామాన్యులకి సైతం అర్ధం అయ్యే బాషలో ఎంచక్కగా సీట్లు, నోట్లు, ఓట్లు అని మూడు ముక్కల్లో వివరించి చెపుతున్న మన రాజకీయనాయకుల విజ్ఞతకు ప్రజలు అబ్బురపడుతున్నారు.   మొన్నామద్య తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ‘ఎన్నికలలోఖర్చుపెట్టలేనివారు పార్టీ టికెట్స్ కోసం అనవసరంగా హైరానా పడొద్దు’ అని కుండ బద్దలు కొడితే, మీడియా “కేసీఆర్ డబ్బున్న వాళ్ళకే టికెట్స్ ఇస్తాడట!” అని ఏదో ప్రళయం ముంచుకు వచ్చేస్తోందన్నట్లు మీడియా గగ్గోలు పెట్టేసింది. దానిమీద చర్చలు, విశ్లేషణలతో మరో హాట్ టాపిక్ దొరికే వరకు వారం రోజులు లాగించేసింది కూడా. అది చూసి పామరజనం ‘రాజకీయాలు నానాటికి దిగజారిపోతున్నాయంటూ’ ఓ పెద్ద నిట్టూర్పు విడిచి, మీడియా చెపుతున్నతరువాత అంశానికి వారుకూడా కూల్ గా షిఫ్ట్ అయిపోయారు.   నలుగురితో నారాయణ, గుంపులో గోవిందా అనే ఓల్డ్ ఫార్ములా ఫాలో అయిపోతేనే బెటర్ అనుకొన్న చంద్రబాబు కూడా కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకొని, పార్టీ టికెట్ ఆశించే అభ్యర్దులు వెనక ఎన్ని ‘రాళ్ళు’ పోగేసుకొన్నారో చూసిన తరువాతనే వారి పేర్లు తన లాప్ టాప్ లో టికెట్స్ ఆశించేవారి లిస్టుకి యాడ్ చేస్తున్నట్లు సమాచారం.   అయితే, ఆయనను అపార్ధం చేసుకొని పార్టీ విడిచిపెట్టినపోయిన దాడి వీరభద్రరావు, కడియం శ్రీహరి వంటి వారు, “చంద్రబాబు కేవలం డబ్బున్న పారిశ్రామిక వేత్తలను, వ్యాపారవేత్తలను ఇవాళ్ళ రేపు బాగా లైక్ చేస్తున్నాడు. వారికే టికెట్స్ ఇస్తున్నాడు తప్ప మావంటి ‘మిడిల్ క్లాస్’ రాజకీయనాయకులను బొత్తిగా పట్టించుకోవడం లేదంటూ అవాకులు చవాకులు మాట్లాడారు. పార్టీ నుండి బయటకి జంప్ చేసిన వారు ఏదయినా వాగొచ్చు గనుక, వారి విమర్శలను కొంచెం లైట్ తీసుకోక తప్పదు. కానీ, పార్టీలో ఉన్న’అప్పర్ మిడిల్ క్లాస్ పోలిటిషియాన్’ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి వారు సైతం మహానాడు సాక్షిగా అటువంటి డైలాగులే పలికి, ఒక పద్దతిలో ముందుకు సాగిపోతున్న చంద్రబాబు సున్నితమయిన మనసుని నొప్పించారు. బుచ్చయ్యగారు చెప్పిన దానిప్రకారం తెదేపా కూడా ఆ తానులో ముక్కేనని స్పష్టం అవుతోంది.   ఈ ‘సీట్లు, నోట్లు, ఓట్లు’ ఫార్ములాను సరిగ్గా అర్ధం చేసుకోలేని పామర జనం ‘మరి తమ పార్టీకి కార్యకర్తలే బలమని చంద్రబాబు పదేపదే ఎందుకు చెపుతున్నట్లు?’ అని ఒక వెర్రి ప్రశ్న వేయవచ్చును. ‘పార్టీలో కార్యకర్తలందరూ పార్టీ జెండాలు మోసి, పార్టీని (టికెట్స్ పుచ్చుకొన్నవారిని) గెలిపించడానికే ఉన్నారని, అది వారి బాధ్యత’ అని చంద్రబాబు మొదటి నుండి స్పష్టంగానే చెపుతున్నారు. ఆయన అంత స్పష్టంగా చెపుతున్నా కోడా అర్ధం చేసుకోక ఇటువంటి వెర్రి ప్రశ్నలు వేస్తున్న ప్రజలను, కార్యకర్తలను ఏమనాలి?   ఇక, ఎన్నికలలో నోటుకి, సీటుకి, ఓటుకి మద్య ఉన్న ఈ కనబడని లింకును తప్పించడం ఎవరి వల్లా కాదని మొన్న మొన్ననే మెగా సోదరుడు నాగబాబు కూడా అభిప్రాయం వ్యక్తం చేసారు. ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు పూర్తిగా కరెప్ట్ అయిపోయున్నారు గనుక నోటు, సీటు, ఓటు ఫార్ములా ఇప్పుడు అన్ని పార్టీలు అమలు చేయక తప్పదని ఆయన తన బాధాకరమయిన ఏడాది రాజకీయ అనుభవ సారాంశాన్ని అంతా రంగరించి మనకి తెలియజేసి చాలా పుణ్యం కట్టుకొన్నారు. దీనినే ప్రాక్టికల్ ఎప్రోచ్ అంటారేమో కదా!   అందువల్ల ఈ ఫార్ములాను ఎంతో నిబద్దతతో, విజయవంతంగా అమలుచేస్తున్న మన రాజకీయ పార్టీలను అనవసరంగా ఆడిపోసుకోవడం మాని మనమూ మన వాటాలు క్లెయిమ్ చేసుకొంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొంటూ భావితరాలకు ఆదర్శంగా నిలుద్దాము.

తెలంగాణాలో రేసులో వెనుకబడిన బీజేపీని గెలిపించేదెవరు

  నిన్న హైదరాబాదులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ పార్టీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్, సీనియర్ నేత వెంకయ్య నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్న ఆ సభలో అందరూ ముక్తకంటంతో కేవలం బీజేపీ మాత్రమే తెలంగాణా ఇవ్వగలదని, కాంగ్రెస్, తెరాసల వల్ల కాదని తెలియజేసారు.   తెలంగాణా అంశంపై మొదటి నుండి బీజేపీ స్పష్టమయిన వైఖరి కనబరుస్తున్నపటికీ, పార్టీ నేతలపై అవినీతి మరకలు, విపక్షాల దాడులు వంటివేమీ లేకపోయినప్పటికీ, ఆ పార్టీ తెలంగాణాలో బలపడలేకపోయింది. అందుకు ప్రధాన కారణం తెరాస అధ్యక్షుడు కేసీఆరేనని చెప్పక తప్పదు. ఆయనకున్న ప్రజాకర్షణ, వాగ్ధాటి, వ్యూహరచనా నైపుణ్యం ముందు బీజేపీ నేతలు వెలవెల పోతున్నారు.   కేసీఆర్ పై ఎన్ని అపనిందలు మూట కట్టుకొన్నపటికీ, ఎన్నివిమర్శలు ఎదుర్కొంటున్నపటికీ ఆయన వాటిని దీటుగా ఎదుర్కొంటూ, ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకు దూసుకు పోతుంటే, ఏ సమస్యా, వివాదాలు లేని బీజేపీ మాత్రం ఈ రేసులో వెనుకబడిపోయింది. స్థానికంగా ఎటువంటి ఆకర్షణీయమయిన నేతలు లేని ఆపార్టీ, ఈ సభకు తమ జాతీయ నాయకులయిన రాజనాథ్ సింగ్, వెంకయ్య నాయుడులను రప్పించి, తద్వారా తెరాసపై పైచేయి సాదించడానికే ఈ సభ నిర్వహించింది.   మంచి వక్తగా పేరొందిన వెంకయ్య నాయుడు తన సహజ సిద్దమయిన ప్రాస బాషతో వచ్చిన ప్రేక్షకులను చాలా గొప్పగా ఆకట్టుకొన్నారు. ఆయన చెప్పిన డైలాగులలో మచ్చుకి కొన్ని: ‘తెలంగాణ కోసం బీజేపీకి బటన్ నొక్కండి.. బీజేపీ తెలంగాణ బిల్లు బటన్ నొక్కుతుంది’. తెలంగాణపై కాంగ్రెస్ ఇప్పటికి ఎన్నిసార్లో ‘నెల’ తప్పింది.మళ్ళీ ఇప్పడు మరోసారి నెల తప్పబోతోంది. హెడ్‌లైన్స్ కోసమే కాంగ్రెస్ డెడ్‌లైన్లు విధిస్తోంది. తెలంగాణను ఇడ్లీ, దోశతో పోల్చిన కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. భూమి (కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం) , ఆకాశం (అగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణం), పాతాళం (బొగ్గు కుంభకోణం), అంతరిక్షం (2జీ కుంభకోణం), నీరు, నిప్పు, ఉప్పు, చివరికి చెప్పు కూడా వదలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఎద్దేవా చేసారు. 14, 17 సీట్లు ఇవ్వండి, ఇతర జాతీయ పార్టీలకు మద్దతునిస్తామంటున్న పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.   ఆపార్టీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్, కిషన్ రెడ్డి, కొత్తగా పార్టీలో చేరిన నాగం జనార్ధన్ రెడ్డి అందరూ కూడా ప్రాంతీయ పార్టీ అయిన తెరాస వల్ల తెలంగాణా రాదని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఈయదని, అందువల్ల తెలంగాణా కోరుకొనే వారందరూ తమకే ఓటువేయాలని కోరారు. ఈ సభ ద్వారా బీజేపీ తెలంగాణా పట్ల తన చిత్తశుద్ధిని బాగానే చాటుకొన్నపటికీ, అవేవీ కేసీఆర్ జిత్తుల ముందు నిలవవని బహుశః వారికీ తెలిసే ఉండాలి. అందువల్ల రాబోయే ఎన్నికలలో ఆ పార్టీ రాష్ట్రం నుండి ముఖ్యంగా తెలంగాణా ప్రాంతం నుండి మరిన్ని సీట్లు రాబట్టుకోవాలంటే వెంకయ్య నాయడు వంటి బలమయిన నాయకుడు ఎన్నికలవరకు కూడా ఇక్కడే తిష్టవేసి కేసీఆర్ ను ఎదుర్కొన్నపుడే సాద్యం అవుతుంది తప్ప ఏదో ఒకట్రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తే ఫలితం ఉండదు.

మెగాభక్తుడిపై కిరణ్ వేటేస్తే కుదురుద్దా?

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి డీయల్ ను బర్త్ రఫ్ ఆడించేసి తన పంతం నెగ్గించుకొన్నారు. గనుక, తరువాత మెగాభక్తుడు రామచంద్రయ్యపై వేటు వేస్తారా లేదా అనేది లేటెస్ట్ టాపిక్. ఆయన దేవాదాయ శాఖలో ఉన్నపటికీ, నిత్యం మెగా అసమ్మతి భజన మాత్రమే చేస్తూ, ముఖ్యమంత్రి కుర్చీలో మెగాజీవి కూర్చొంటే చూడాలని పరితపించిపోతున్నారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఆయనపై కూడా వేటువేసి ఇంటికి వెళ్లి భజన చేసుకోమని పంపించేస్తారా? లేక అమ్మదయ పుష్కలంగా ఉన్నచిరంజీవి శరణు పొందిన ఆ మెగా భక్తుడిని తన పక్కలో బల్లెంలా ఉంచుకొని అసమ్మతి భజన చేసుకోనిస్తారా? ఒకవేళ ఆయనపై వేటువేస్తే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న 17మంది మెగాభక్తులు (ప్రజారాజ్యం శాసనసభ్యులు) కూడా రామచంద్రయ్య పాటకు తాళం వేస్తే, మరి అప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి దైర్యంగా వారందరినీ కూడా బయటకి పంపుతారా? లేక వారి భజన పాటలకు చలించకుండా గుండె నిబ్బరం చేసుకొని అమ్మహస్తం పట్టుకొని ముందుకు సాగిపోతారా? అనే కొన్ని ధర్మ సందేహాలు సర్వత్రా నెలకొని ఉన్నాయి.   అయితే, తన భక్తుడు కోరుకొంటున్నఆ చిన్నకోరికను ఎన్నడూ కాదనని బోళాశంకరుడు వంటి చిరంజీవి, తన మనసులో మాటనే ఆయన బయటపెడుతున్నందుకు కిరణ్ కుమార్ రెడ్డి వేటువేస్తే ఆయనపై తన మూడో కన్ను తెరిచి శివతాండవం చేయకుండా ఊరుకొంటారా? తన మరో భక్తుడు శ్రీనివాసరావుతో కలిసి ఆయన కూడా అసమ్మతి గంట కొట్టకుండా ఊరుకొంటారా? అని పండిత పామరుల అనుమానం.   కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించి పారేసిన చిరంజీవికి ఆగ్రహం కలిగితే, రేపు ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ప్రాదేయపడినప్పటికీ ఆయన ఒప్పుకొంటారా? అని కొందరు కాంగ్రెస్ వాదులు కూడా బెంగపెట్టుకొన్నారు.   ఇటువంటి పరిస్థితులలో పార్టీలో తన భక్తులు, కిరణ్ కుమార్ రెడ్డి కి బలయిపోయిన అసమ్మతి నేతలతో కలిసి, సాటి కులపోడు బొత్స సత్తిబాబుతో హస్తాలు కలిపి నేడు కాకపోయినా రేపయినా ముఖ్యమంత్రికి చెక్ పెట్టి ఆయన కుర్చీలో కర్చీఫ్ వేయకుండా ఊరుకొంటారా అని అజ్ఞానులయిన ప్రజలకి కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఏమయినప్పటికీ, రామచంద్రయ్యపై వేటువేసే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం బెటరేమోనని పబ్లిక్ టాక్!

రాహుల్ గాంధీ మళ్ళీతన గూట్లోకి వెళ్ళిపోయారా?

  కాంగ్రెస్ ప్రభుత్వమంటేనే డిల్లీ నుండి రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేయబడే ప్రభుత్వమని అర్ధం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నాకూడా ముఖ్యమంత్రులు డిల్లీ పరిగెత్తాల్సిందే తప్ప స్వయంగా తీసుకోవడానికి వీలులేదని అందరికీ తెలిసిన విషయమే. కానీ, రాహుల్ గాంధీ పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పటిన తరువాత పార్టీలో అధికార వికేంద్రీకరణం జరిగి, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పార్టీ వ్యవహారాలలో అధిష్టానం కలుగజేసుకోకూడదని ఆయన కాస్త గట్టిగానే చెప్పారు. అయితే, ఇటువంటి ఆలోచనలు, ఆశయాలు కాంగ్రెస్ సంస్కృతికి సరిపడవని ఆయనకీ ఈ పాటికే అర్ధం అయిఉంటుంది. ఆయన ఉపాధ్యక్షుడిగా బాద్యతలు తీసుకొన్నపటి నుండి ఇంతవరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లెక్కలేనన్ని సార్లు డిల్లీ ప్రదక్షిణలు చేసారు, చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు కూడా.   రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టి చాలా కాలమే అయినప్పటికీ ఆయన ఇంతవరకు పార్టీపై తనదైన ముద్ర వేయలేకపోయారు. 'ఒక వ్యక్తికి ఒకే పదవి' అని ఆయన తెచ్చిన ప్రతిపాదనను కూడా కనీసం ఆయన ఇంతవరకు పార్టీలో అమలు చేయలేకపోవడమే అందుకు ఒక చిన్న ఉదాహరణ. ఆయన రాబోయే ఎన్నికల తరువాత ప్రధాని పీటం అధిష్టిస్తారని అందరూ భావిస్తున్నారు. కానీ ఆయన అందుకు తగ్గట్లుగా వ్యవహరించడం లేదనే చెప్పాలి.   ఆయన ఇంతవరకు ఎటువంటి కీలక సమస్యలపై తన అభిప్రాయం వ్యక్తం చేయలేదు. కనీసం పరిష్కారం కనుగొనే విషయంలో చొరవ కూడా చూపలేదు. ఇప్పటికీ, రాష్ట్ర నేతలు డిల్లీ వెళ్ళి సోనియా గాంధీని ఆజాద్ ని కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారు తప్ప, రాహుల్ గాంధీతో చర్చించరు. ఆయన కూడా పెద్దగా చొరవ తీసుకోనట్లు కనబడటం లేదు.   దీనిని బట్టి ఆయనకు నిజంగానే ప్రధాని పదవిపై వ్యామోహం లేదని అర్ధం అవుతోంది. అంతే కాకుండా, కాంగ్రెస్ పార్టీని మార్చడం తనవల్ల కాదనే చేదు నిజం కూడా ఆయనకు బహుశః అర్ధమయినందునే, నైరాశ్యతకులోనయి మళ్ళీ తన గూట్లోకి వెళ్ళిపోయినట్లున్నారు.

సూపర్‌స్టార్‌ కృష్ణ బర్త్‌డే స్పెషల్

        తెలుగు ఇండస్ట్రీలో కొన్ని అద్యాయాలు ఎప్పటికీ చెరిగిపోవు అలాంటి ఓ సువర్ణద్యాయమే సూపర్‌స్టార్‌ కెరీర్‌.. తెలుగు సినిమాను ప్రయోగాల బాట నడిపించడమే కాదు.. ఎన్నో అత్యున్నత సాంకేతిక విలువలను తెలుగు తెరకు పరిచయం చేసిన సాహసి అతను.. తొలి కౌబాయ్‌, తొలి బాండ్‌, తొలి 70MM, తొలి సినిమా స్కొప్‌, లాంటి ఎన్నో విషయాలను తెలుగు తెరకు పరిచయం చేశాడు.. ఆయన తెలుగు తెరకు తెగువ నేర్పిన సూపర్‌స్టార్‌ కృష్ణ.. 70వ యేట అడుగిడుతున్న సూపర్‌స్టార్‌ కృష్ణగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ జేస్తూ ఆ నటశేఖరుని కెరీర్‌పై ఓ లుక్‌     సూపర్ స్టార్ కృష్ణ 1943 వ సంవత్సరం, 'మే' 31 వ తేదీన గుంటూరు జిల్లా, బుర్రిపాలెంలో జన్మించారు. చిన్నప్పటినుంచే నటన మీద ఆసక్తి పెంచుకున్న కృష్ణ చదువుకునే రోజుల్లోనే ఎన్నో నాటకాల్లో నటించారు..ఎన్నో బహుమతులను కూడా గెలుచుకున్నారు.. ఆ అనుభవంతోనే 1965లో తొలిసారిగా తేనేమనసులు సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. తెలుగులో తొలిపూర్తి స్థాయి కలర్‌ సినిమా కూడా ఇదే..   అయితే తొలి రోజుల్లోనే ప్రయోగాలకు సై అన్నాడు.. కెరీర్‌ స్టార్టింగ్‌లోనే గూఢచారి 116 లాంటి స్పై సినిమా చేసి తొలి సారి బాండ్‌ క్యారెక్టర్‌ను తెలుగు తెరకు పరిచయం చేశాడు.. ఈ సినిమాతో మాస్ అండ్‌ యాక్షన్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కృష్ణ..   ఇక ఆతరువాత కృష్ణ తరువాత కృష్ణ చేసిన మరో ప్రయోగం కౌబాయ్‌.. తెలుగు నేటివిటికి అసలు సంబందం లేని కౌబాయ్‌ పాత్రతో కూడా సంచలనం సృష్టించాడు కృష్ణ. 1970లో మొసగాళ్లకు మొసగాడు సినిమాతో తెలుగు తెర మీద కౌభాయ్‌ క్యారెక్టర్‌లకు స్వాగతం పలికాడు.. తరువాత ఈ సినిమాతో ఇంగ్లీష్‌లోకి కూడా డబ్‌ అయి హాలీవుడ్‌లో కూడా రిలీజ్‌ అయింది..   ఇక కృష్ణ కెరీర్‌లోనే ఓ మైల్‌స్టోన్‌.. అల్లూరి సీతారామరాజు.. ఎన్నో ఎళ్లుగా ఎన్టీఆర్‌ చేయాలనుకుంటూ ఆగిపోతున్న అల్లూరి క్యారెక్టర్లో నటించిన కృష్ణ ఈ సినిమాతో అప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో రికార్డులను తిరగరాశాడు.. వీర రసాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఈ సినిమాలో ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటీకీ ప్రేక్షకుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే వుంటాయి. సొంత బ్యానర్ పై భారీ వ్యయ ప్రయాసలకి ఓర్చి ఆయన నిర్మించిన ఈ సినిమా, సంచలనానికి సరైన అర్ధం చెప్పింది ... కృష్ణ పేరు ప్రతిష్టలని ఎవరెస్టు శిఖరమంత ఎత్తులో నిలిపింది.        కృష్ణ కేవలం సాహసానికే కాదు డెడికేషన్‌కు కూడా పెట్టింది పేరు అందుకే ఆయన ఒక టైంలో ఒకే సంవత్సరం 17 సినిమాలు విడుదల చేసి సంచలనం సృష్టించాడు.. అంతేకాదు ఆ 17 సినిమాల్లో 9 సినిమాలు 100 రోజులు ఆడటం మరో విశేషం..        ఈనాడు లో పవర్ ఫుల్ కేరక్టర్ ని పోషించారు. కార్మిక - శ్రామిక పక్షాన నిలిచి అవినీతి రాజకీయాలపై సమర శంఖాన్ని పూరించే శక్తిగా కృష్ణ కనిపిస్తారు. ఈ సినిమాతో జనం మెచ్చిన నటుడుగా నీరాజనాలు అందుకున్న కృష్ణ, ఏకలవ్య ... అడవి సింహాలు ... ముందడుగు ...  శక్తి ... పచ్చని కాపురం ... పల్నాటి సింహం వంటి చిత్రాలతో ఘన విజయాల్ని అందుకున్నారు.        70, 80లలోనే కాదు 90వదశకంలో కూడా అద్భుతమైన చిత్రాల్లో నటించారు కృష్ణ.. నెంబర్‌ వన్‌, అమ్మదొంగా లాంటి సినిమా తో చిరంజీవి బాలకృష్ణ లాంటి స్టార్‌ హీరోలకు కూడా గట్టి పోటినిచ్చారు.. హీరోగా ... నిర్మాతగా ... దర్శకుడిగా కృష్ణ సృష్టించిన రికార్డులు అన్నీఇన్నీ కావు. పద్మాలయ బ్యానర్ పై బాలీవుడ్ చిత్రాలని సైతం నిర్మించిన ఘనత ఆయన సొంతం.   నష్టపోయిన నిర్మాతలకు పారితోషికం గురించి పట్టించుకోకుండా మళ్లీ మళ్లీ డేట్స్ ఇచ్చి ఆదుకునేవారాయన. తను నటించే సినిమా భవిష్యత్ గురించి, అది ఆడుతుందా? ఆడదా? కూడా ఆయన నిర్మొహమాటంగా చెప్పేవారు. దాదాపు 350 చిత్రాల్లో నటించిన కృష్ణ నటుడిగా మత్రమే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించి సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికి కొన్ని సినిమాల్లో గెస్ట్ లోస్ వేస్తూ అటు తన అభిమానులను ఇటు సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ.        ఇలా కళామతల్లి ముద్దుబిడ్డగా ఎన్నో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సూపర్‌స్టార్‌ కృష్ణ.. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరకుంటూ తెలుగువన్.కామ్ మరోసారి ఆ నటశేఖరునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది.

ప్రజాసేవ చేసేందుకు దీనబంధు పోరాటం

  ఏ పదవీ లేకుండా ఒట్టినే ప్రజాసేవ చేయడం ఎంత కష్టమో రాజ్యసభ సభ్యుడు టీ.సుబ్బిరామి రెడ్డిని అడిగితే చెపుతారు. వైజాగ్ లో ఉన్న అన్ని జాతులు, కులాలు, మతాలు, వర్గాల ప్రజలకు అడగకుండానే వరాలు కురిపిస్తున్న భోళా శంకరుడినని ఆయన శలవిస్తున్నారు. సినిమా రంగంలో ఉన్న మహామహులందరినీ పిలిచి వారిని సన్మానించి, కొన్ని బిరుదులు కూడా ప్రధానం చేసి, పనిలోపనిగా వారిచేత తన గొప్పదనం గురించి విశాఖ ప్రజలకు చెప్పించుకోవడం ఆయనకి అదో తుత్తి. విశాఖను ఏకంగా 40లక్షల మొక్కలతో పచ్చగా మార్చిపడేసానన్న ఆయన మాటలకు పచ్చకామెర్ల రోగులే సాక్ష్యం. మరిటువంటి గొప్పగొప్ప కార్యక్రమాలు చేస్తున్నందుకు దీన బంధు, కళాబందు వంటి బిరుదులు కూడా కొన్ని పుచ్చుకోక తప్పలేదాయనకి. అందువల్ల ప్రజలు కోరినా కోరకపోయినా వారికి మరింత సేవ చేయాలని తపించిపోతున్న రెడ్డిగారు. అందుకే వచ్చేఎన్నికలలో విశాఖ లోక్ సభ టికెట్ పుచ్చుకోవాలని డిసైడ్ అయిపోయారు.   సోనియమ్మకి తన సేవలు, బిరుదులు వగైరాల గురించి చెప్పుకొని, పనిలో పనిగా పురందేశ్వరికి టికెట్ ఈయవద్దని కూడా ఓ ఉచిత సలహా కూడా ఇచ్చి వచ్చానని ఆయనే స్వయంగా ప్రకటించుకొన్నారు.   సోనియమ్మ దగ్గర తన రేటింగ్ 100 నుండి ఒకేసారి 1000 శాతానికి పెరిగినందున, పురందేశ్వరిని నరసరావు పేటకు పొమ్మంటూ ఆయన ఒకటే పొగబెడుతుండటంతో, ఇక భరించలేక ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు రంగంలో దిగక తప్పలేదు. సుబ్బిరామి రెడ్డిని ఆయన నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణంలో కాంట్రాక్టరుగా చేస్తున్నపటి నుండి ఎరుగుదునని, అప్పుడు ఆయన డ్యాం కోసం వచ్చిన సిమెంటును బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొంటున్నపుడు పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం, ఆ తరువాత కాలంలో విశాఖ స్టీల్ ప్లాంటులో ఆయన నొక్కుళ్ళు, హైవే రోడ్ల నిర్మాణంలో అడ్డుగోలు సంపాదనల గురించి తనకు తెలుసునని, ఆవిధంగా సంపాదించిన డబ్బుతో ప్రస్తుతం సినీ రంగంలో రిటైర్ అయిపోయిన వాళ్ళని, సినిమాలు లేక ఖాళీగా ఉన్నవారిని పిలిచి సన్మానాలు చేసి పొగిడించుకోవడం ఆయనకు హాబీ అని రెడ్డిగారి భూతవర్తమాన చరిత్రలు తవ్విపోసారు.   నిస్వార్ధంగా ప్రజాసేవలో నిమగ్నమయిన తనవంటి మహనీయులకి నీలాపనిందలు తప్పవని రెడ్డిగారికీ తెలుసు గనుక, దగ్గుబాటికి మతి భ్రమించిందని సర్టిఫై చేసేసి తనపై చేసిన ఆరోపణలను సింపుల్ గా దులిపేసుకొన్నారు. గులాం నబీ ఆజాద్ తో మాట్లాడి ఒప్పించి మరీ దగ్గుబాటి దంపతులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువస్తే, ఇప్పుడు తన గత చరిత్ర అంతా తవ్విపోయడం విశ్వాస ఘాతుకమేనని, ఇటువంటి వారికి పార్టీ టికెట్ ఈయదని, వైజాగ్ టికెట్ తనే పుచ్చుకోబోతున్నానని ఆయన బల్ల గుద్ది మరీ చెపుతున్నారు.   తనకు విశాఖ లోక్ సభ సీటు వస్తే అది వైజాగ్ ప్రజల అదృష్టం అని, తనకోసం ఇంతమంది ఆత్రంగా ఎదురు చూస్తునపుడు వారిని కాదనడం ఎలా?అంటూ రెడ్డిగారు ప్రశినిస్తున్నారు. మరి పార్టీ అధిష్టానం కూడా అలాగే కోరుకొంటోందో లేదో జాబితా విడుదల చేస్తే కానీ తెలియదు.

రాజకీయాలలో గొంగళిపురుగులు-సీతాకోక చిలుకలు

  కేవలం మనుషులే రాజకీయాలు చేస్తారని అందరూ భ్రమించేవారు. కానీ, ఇటీవల కాలంలో రకరకాల జంతువులూ, క్రిమి కీటకాలు కూడా రాజకీయాలలోకి తరలి వస్తున్నాయి. గతంలో కేవలం కప్పలు మాత్రం పార్టీలు దూకేవి. ఇప్పుడు పార్టీలో నుండి గొంగళీ పురుగులు బయటకి పాక్కొంటూ వెళిపోతుంటే, సీతాకోక చిలుకలు ఎగురుకొని వస్తున్నట్లు తాజా సమాచారం. ఇక గాడిదలు, దున్నపోతులు, కుక్కలు, నక్కలు వంటి జంతువులు కూడా మన రాజకీయాలలోకి ప్రవేశించి చాల కాలమే అయినా, పాపం వాటికి తగినంత ప్రచారం కానీ, గుర్తింపు కానీ ఇంత వరకు కూడా రానందుకు, అవి ఈ రాజకీయ పక్షపాత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. తమకు తగినంత ప్రాధాన్యం ఈయాలంటూ, తమ జాతులను రాజకీయ నేతలు దుర్వినియోగ పరచరాదంటూ అవి తమ రాజకీయహక్కుల కోసం పోరాడుతున్నాయి.   తమను పదవుల కోసం పడిగాపులు కాసే నేతలతో పోల్చడాన్ని గుంటనక్కలు తప్పు పడుతున్నాయి. ఎందుకంటే తాము కేవలం కడుపు నింపుకోవడానికి మాత్రమే ‘గోతి కాడ కాపలా కాస్తాము’ తప్ప నేటి రాజకీయ నాయకులులాగా ఏడేడు తరాలకి సరిపడే ఆస్తులు పోగేసుకోవడానికి కాదని వాదిస్తున్నాయి.   ఇక పార్టీని వీడిపోయేవారిని తెదేపా నేతలు ‘కుక్క మూతి పిందెల’నడాన్ని కుక్కలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. విశ్వాసానికి మారు పేరయిన తమ జాతిని ఈ విధంగా అవమానించడం చాలా అన్యాయమని అవి తీవ్రఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.   ఇక ఈ రాజకీయ నాయకులు ఒకరినొకరు తిట్టుకోవడానికి, తమ జాతిని వాడుకోవడాన్ని దున్నపోతులూ తప్పు పడుతున్నాయి. తాము మానవజాతికి ఎంత సేవ చేసినా కూడా వారికి విశ్వాసం లేకుండా ఈవిధంగా తమ జాతిని అవమాన పరచడాన్ని అవి తీవ్రంగా నిరసిస్తున్నాయి. తాము జడివానకి జడవనట్లే, నేటి రాజకీయ నాయకులు తిట్లకి, శాపనార్ధలకి జడవట్లేదని, ఎందుకంటే వారి తోలు తమకంటే ఎక్కువ మందమని దున్నపోతులు దృడంగా విశ్వసిస్తున్నాయి.   అదేవిధంగా క్రమంగా అంతరించిపోతున్న తమ జాతిని ఈ మానవులు కాపాడే ప్రయత్నం చేయక పోగా ఈ రాజకీయ నాయకులూ ఒకరినొకరు దూషించుకొనేందుకు తమ పేరును దుర్వినియోగం చేయడాని గాడిదలు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి.   ఇక అవకాశ వాదులయిన కొందరు రాజకీయ నాయకులను గోడ మీద పిల్లులు అని వర్ణిస్తూ తమని అవమానిస్తున్నారని ‘మ్యావ్ మ్యావ్’ మంటూ తమకు తెలిసిన ఒకే ఒక పదంతో పిల్లులు తీవ్రఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, రాజకీయ నాయకులు మాత్రం వాటన్నిటి భాషలలో గాండ్రిస్తూ, గర్జిస్తూ, మొరుగుతుండేసరికి ఆ రాజకీయ వింత జంతువును చూసి అన్నిజంతువులు బయపడిపోతున్నాయి.

మహానాడుతో తెదేపా అందోళనలతో వైకాపా బిజీ

  తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు నేటినుండే రెండు రోజుల పాటు సమావేశాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కాకతాళీయంగా ఒకే సమయంలో జరుగుతున్న ఆ రెండు పార్టీల కార్యక్రమాలు వేర్వేరు ఆలోచనలతో నిర్వహింపబడుతున్నట్లు పైకి కనిపిస్తున్నపటికీ, వాటి అంతిమ లక్ష్యాలు మాత్రం ఒక్కటే! రాబోయే ఎన్నికలకి పార్టీని సిద్దం చేసుకోవడం.   తొమ్మిది ఏళ్ళుగా ప్రతిపక్ష బెంచీలకు అంకితమయిపోయిన తెదేపా, మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలను ఎదుర్కోనున్నందున, పార్టీ విజయం సాధించడానికి తగిన వ్యూహ రచనలు చేసుకోవడం ఈ రెండు రోజుల మహానాడు ప్రధాన ఉద్దేశ్యం.   ఇక, అక్రమాస్తుల కేసులో అరెస్ట్ కాబడిన జగన్ మోహన్ రెడ్డి జైలులో నిర్బంధించబడి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు నిరసనలు, ఆందోళనలు చేపడుతోంది. రాబోయే ఎన్నికలలోగా అయన జైలు నుండి విడుదల అనుమానంగా ఉన్నందున, ఈ సందర్భంగా ఆందోళనలు నిర్వహించి ప్రజలలో జగన్ పట్ల సానుభూతి మరింత పెంచుకొని, అంతిమంగా దానిని ఓట్ల రూపంలోకి మార్చుకోవాలని వైకాపా ఆలోచన.   రాబోయే ఎన్నికలు తేదేపాకు జీవన్మరణ సమస్య వంటివి గనుక ఆ అగ్నిపరీక్షలో తన సర్వ శక్తులు ధారపోసి విజయం సాదించేందుకు అవసరమయిన ఆయుధాలను ఈ సమావేశాలలో సిద్దం చేసుకోబోతోంది. ఆ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు పాదయాత్రలో ప్రజలకు చేసిన వాగ్దానాన్నిటికీ ఆమోదం తెలుపుతూ ఈ సమావేశాలలో ఒక తీర్మానం ఆమోదించనున్నారు.   అదే విధంగా తెలంగాణా అంశంపై స్పష్టమయిన ఒక ప్రకటన చేయాలని కేసీఆర్ విసిరిన సవాలుని స్వీకరించి, తెలంగాణాపై మరికొంత స్పష్టత ఇచ్చి ఆ ప్రాంతంపై కూడా తిరిగిపట్టు సాధించాలని తెదేపా ఆశిస్తోంది.   ఇక, దూకుడు మీద ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన నిత్య నూతన పధకాలతో ప్రజలలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేఖ భావనల తీవ్రతను క్రమంగా తగ్గించి, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను తారుమారు చేసే ప్రయత్నాలు గట్టిగానే చేస్తునందున ఆయనను ఎదుర్కోవడానికి తగిన వ్యూహాలు సిద్దం చేసుకోవాల్సి ఉందని తెదేపా గ్రహించింది.   ఇక, క్రిందటి సారి ఎన్నికలలో తమ విజయానికి చిరంజీవి సైంధవుడిలా అడ్డుపడితే, రాబోయే ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి అడ్డుపడబోతున్నాడని గ్రహించిన తెదేపా, అతనిని ఎదుర్కొనేందుకు తగిన వ్యుహాలను సిద్దం చేసుకోకతప్పదు.   అయితే, సాదారణంగా ఇటువంటి కార్యక్రమాలను తన బల ప్రదర్శనకు మాత్రమే ఉపయోగించుకొనే తెదేపా, ఊక దంపుడు ప్రసంగాలు, విపక్షాలపై విమర్శలు, ఏవో కొన్ని మొక్కుబడి తీర్మానాలతో తన సహజ సిద్దమయిన ఆర్భాట ప్రదర్శనకే ఈ వేదికను ఉపయోగించు కొనే అవకాశం ఉంది.   వైకాపా కోటి సంతకాల కార్యక్రమయినా, విజయమ్మ రచ్చబండ కార్యక్రమయినా, షర్మిల పాదయాత్రయినా, నేటి నిరసన కార్యక్రమలయినా అన్నిటి ప్రధాన లక్ష్యం అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ అక్రమాస్తుల కేసులో జైలులో నిర్బందించబడ్డ జగన్ మోహన్ రెడ్డి పట్ల ప్రజలలో వ్యతిరేఖ భావనలు ఏర్పడనీయకుండా జాగ్రత్త పడుతూ, ఆయన నిష్కలంక చరితుడు, ప్రజల కోసం పోరాడటం వలనే జైలుకి వెళ్ళిన ఒక మహాయోధుడు, స్వర్గీయ వైయస్సార్ పధకాలను అమలుచేయగల ఏకైక వ్యక్తి అనే సానుకూల భావనలు వ్యాపింపజేసి ప్రజలలో సానుభూతి కొనసాగేలా చేయడమే.   ఇక సైన్యాధ్యక్షుడు లేకుండా ఎన్నికల రణరంగంలో అడుగుపెట్టబోతున్న వైకాపా, ఇదే విషయాన్ని తన కార్యకర్తలకి అర్ధం అయ్యేట్లు తెలియజేసి వారిని మానసికంగా సిద్దం చేయడం, అదే సమయంలో జగన్ పట్ల ప్రజలలో సానుభూతిని మరికొంత పెంచడం ఈ రెండు రోజుల కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యాలు.   ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఆ రెండు రాజకీయ పార్టీలు తమకు అందుబాటులో ఉన్న ఇటువంటి సందర్భాలను తమకనుకూలంగా వినియోగించుకోవడం సహజమే. కానీ, వాటి ప్రయత్నాలు అవి ఎంతవరకు సఫలం అయ్యాయనే సంగతిని ఎన్నికలలో విజయమే తేలుస్తుంది.

తెలంగాణాపై కాంగ్రెస్ ప్రకటనలు అనాలోచితమా, వ్యుహాత్మకమా?

  బయ్యారం గనులను వైజాగ్ స్టీల్ ప్లాంటుకి కేటాయించడంపై జరిగిన రగడ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చల్లబడిన తెలంగాణా ఉద్యమానికి బయ్యారం మళ్ళీ కొత్త ఊపిరి పోసింది. కానీ, దానిని కొత్తగా వచ్చిన ఇతర అంశాలు వెనక్కి నెట్టడంతో మళ్ళీ బయ్యారం చల్లబడింది. తెరాస మరిచిపోయిన ఆ అంశాన్ని కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ స్వయంగా త్వరలో కెలికేందుకు సిద్ధం అవుతోంది.   హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి పి. బలరాంనాయక్ మీడియాతో మాట్లాడుతూ త్వరలో బయ్యారం పైలట్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయబోతున్నట్లు వెల్లడించారు. పనిలో పనిగా తెలంగాణా ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం లేదంటూ ఆయన కూడా తెలంగాణా యంపీలను మరోసారి కవ్వించారు.   ఈవిదంగా కాంగ్రెస్ నేతలు ఒకరి తరువాత మరొకరు సున్నితమయిన తెలంగాణా అంశంపై పనిగట్టుకొని నోరు జారుతూ తెరాస మరియు ఇతర తెలంగాణా వాదులను కవ్వించడం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. బహుశః తెలంగాణా వాదులను ఎప్పటికప్పుడు కవ్విస్తూ, తెలంగాణలోకి తెదేపా, వైకాపాలు అడుగుపెట్టకుండా నిరోదించాలని దాని ఆలోచనేమో.   బయ్యారం అంశంపై వైకాపా తన వైఖరి ఏమిటో స్పష్టంగా ప్రకటించిన తరువాతనే విజయమ్మ తెలంగాణాలో తన రచ్చబండ కార్యక్రమం పెట్టుకోమని తెరాస నేత హరీష్ రావు హెచ్చరించడం ఇందుకు ఒక చిన్న ఉదాహరణ. బయ్యారం విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటన చేయడంతో తెరాస నేతలు మొదట కిరణ్ కుమార్ రెడ్డి పై విరుచుకు పడినప్పటికీ, ఆ తరువాత వారు క్రమంగా వైకాపా మరియు తెదేపాతో తీవ్ర యుద్ధం చేసారు.   తమ మాటలకి ఎటువంటి ప్రతిస్పందన వస్తుందో ఖచ్చితంగా తెలిసిఉన్న కాంగ్రెస్ పార్టీ, ఒక లెక్క ప్రకారమే సరయిన సమయంలో సరయిన డైలాగులు పేలుస్తోంది. చాకో ప్రకటన తరువాత కాంగ్రెస్ యంపీలను తన వైపు లాక్కొందామని ప్రయత్నిస్తున్న కేసీఆర్ పై ఎటువంటి అస్త్రం ప్రయోగించ బోతోందో త్వరలోనే తెలియవచ్చును. తద్వారా చాకో ప్రకటన పరమార్ధం కూడా త్వరలోనే బయటపడుతుంది.

స్పాట్ ఫిక్సింగ్ చేస్తున్న జెంటిల్ మెన్

  మన దేశంలో క్రికెట్ ఆటని ఒక మతంగా భావించేవారు, దానిని వెర్రిగా ఆరాధించేవారు కోట్ల మంది ఉన్నారు. అక్కడ గ్రౌండు లో సచిన్ కాలుకి దెబ్బ తగిలితే ఇక్కడ బాధతో విలవిలాడిపోయే వారున్నారు. ధోనీ సిక్సర్ కొడితే కేరింతలు కొట్టేవాళ్ళున్నారు. అక్కడ మన టీం గెలిస్తే ఇక్కడ స్వీట్లు పంచుకొని ఆనందపడేవాళ్ళు, వాళ్ళక్కడ ఓడిపోతే, తమ జీవితంలో సర్వస్వం కోల్పోయామని ఇక్కడ ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు. క్రికెట్ ఆటగాళ్ళంటే దివి నుంచి భువికి దిగివచ్చిన దేవదూతలని భావించేవారు మన దేశంలో కోట్లమందున్నారు. వారి గెలుపుని దేశానికి గెలుపుగా, వారి ఓటమి యావత్ దేశ ఓటమిగా నేడు అభివర్ణించబడుతోందంటే క్రికెట్ ఆటకి మన దేశంలో ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో అర్ధం అవుతోంది.   మరి ఆ క్రికెట్ ఆట ఆడే పెద్దమనుషులు కాస్తా, ఐపీయల్ మ్యాచుల పుణ్యామాని సంతలో పశువుల్లా అమ్ముడుపోతుంటే, తన అభిమాన దేవుళ్ళకి వేలం పాటల్లో పలుకుతున్న గొప్పరేటు చూసి ఆనందించాలో లేక ఆవిధంగా వారిని సంతలో పశువుల్లాగా నిలబెట్టి కొనుకొంటున్నందుకు (అమ్ముడుపోతున్నందుకు) బాధపడాలో అర్ధం కాని పరిస్థితి సగటు క్రికెట్ అభిమానిది. అయినప్పటికీ, ఏ ఒక్క అభిమాని కూడా తన మతం మార్చుకోవాలని ఎన్నడూ అనుకోలేదు. ‘ఏవిధంగానయితేనేమి, క్రికెట్ ఆట కొనసాగుతోంది కదా! అంతే చాలు’ అని తనకు తానూ సర్దిచెప్పుకొంటూ ఏఏ టీములో తన అభిమాన దేవుళ్ళున్నారో అని భూతద్దం వేసుకొని మరీ వెతుకొని వారిని, వారి ఆటని చూసి పొంగిపోతున్నాడు.   వారు గ్రౌండులో వేసే బంతులు, కొట్టే షాట్స్, చేసే పరుగులను చూసి, ఆకాశంలో చందమామను తనదేననుకొని ఆనందపడే పసిపాపాయిలా, వారి ఆట కూడా అంతా తమకోసమే అని వెర్రి భ్రమలో ఇంత కాలం అభిమానులు ఆనందపడుతూ వచ్చారు. కానీ, వారు ఆడే ఆ ఆటని వారుకాక వెనుక నుండి మరెవరో ఆడిస్తున్నారని తెలిసినప్పుడు సగటు అభిమాని గుండె బ్రద్దలయి బాధతో విలవిలలాడాడు.   క్రికెట్ ఆటలో ప్రాధమిక సూత్రాల గురించి మాత్రమే ఎరిగున్న అభిమానులకి, వాటి వెనుకున్నఈ కొత్త స్పాట్ ఫిక్సింగ్ సూత్రాల గురించి మాత్రం బొత్తిగా అవగాహన లేకపోవడంతో, తమ ఆరాధ్య దేవుళ్ళే తమని మోసం చేస్తున్నారని వాపోతున్నారిప్పుడు. తమ క్రికెట్ దేవుళ్ళని ఫ్రాంచైసీలు కోట్లు పోసి వేలం పాటలో కొనుకొన్నతరువాత కూడా, ఇంకా చిల్లర డబ్బుల కోసం తెర వెనుక ఈ కక్కుర్తి ఫిక్సింగ్ భాగోతాలెందుకని వారి ప్రశ్న.   గ్రౌండులో ఆట సరిగా ఆడలేకపోతున్నా, ఒక వైపు టీవీ ప్రకటనలలో నటిస్తూ, మరో వైపు వివిధ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా కోట్ల రూపాయలు పోగేసుకొంటూ, ప్రభుత్వోద్యోగాలు దక్కించుకొని, ఏనాడు కూడా ఆఫీసు మొహం చూడకపోయినా నెలనెలా టంచనుగా జీత భత్యాలు అందుకొంటూ, సగటు అభిమానికి అందనంత ఎత్తులో విలాసవంతమయిన జీవితాలు గడుపుతున్న ఈ క్రికెట్ దేవుళ్ళకి, ఇప్పుడు ఆట తప్ప మిగిలినవన్నీ బాగా అబ్బాయని అభిమానులు బాధపడుతున్నారు.   వారు ఆడరు. ఆడలేరు. అయినా తప్పుకొని కొత్త తరానికి అవకాశం ఈయరు అని తెలిసినప్పటికీ, గుడ్డిభక్తితో వారినే ఆరాధిస్తుంటే, ఇప్పుడు వారిలో కొందరు మరింత బరి తెగించి స్పాట్ ఫిక్సింగ్ లకి పాల్పడటం అభిమానుల గుండెలకు గాయం చేసింది.   గ్రౌండులో పొరపాట్లు జరుగకుండా ఆటను సక్రమంగా నిర్వహించవలసిన ఎంపైర్ (పాకిస్తాన్ అంపైర్ అసద్ రవూఫ్) మొదలుకొని, ఆట ఆడే శ్రీశాంత్, అజయ్,అంకిత్ నుండి క్రికెట్ బోర్డుకి అధ్యక్షుడయిన యన్.శ్రీనివాస్ అల్లుడు గురునాథ్ మెయిప్పన్ వరకు అందరూ కూడా ఈ ఫిక్సింగ్ భాగోతంలో పాత్రదారులే అని తెలిసిన తరువాత, ఇప్పుడు తమ కళ్ళ ముందు జరుగున్న ఆట నిజమయినదో లేక ముందే ఎవరో నిర్దేశించబడినట్లు ఆడబడుతోందో కూడా తెలీని పరిస్థితిలో ఆటను చూస్తున్నారు క్రికెట్ అభిమానులు.   ఇది వారి అభిమానాన్ని వమ్ము చేయడమా? లేక సొమ్ము చేసుకోవడమా? క్రికెట్ ఆడుతున్న సదరు జెంటిల్ మెన్ మరియు వారిని ఆడిస్తున్న బీసీసీఐ తేల్చి చెప్పాల్సి ఉంది.

చంద్రబాబు జీవితాన్నే మార్చేసే ఒక ఐడియా

  తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అకస్మాతుగా దేశంలో (అంటే తెలుగుదేశంలో కాదన్నమాట) పెరిగిపోతున్ననల్లధనం గురించి చింత పట్టుకొంది. నల్లదనాన్ని అరికట్టేందుకు ఆయనే ఒక మంచి ఉపాయం కూడా కనిపెట్టారు. దేశంలో 500, 1000 రూపాయల నోట్లను వెంటనే రద్దు చేస్తే నల్లధనం బెడద కూడా వదిలిపోతుందని ఆయన శలవిచ్చారు. అంతే గాకుండా వచ్చే ఎన్నికలకి తమ పార్టీ మానిఫెస్టోలో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయాలనే పాయింటు కూడా పెట్టబోతున్నట్లు తెలియజేసారు.   అసలు వచ్చే ఎన్నికలలోగానే ఆ నోట్లను రద్దు చేస్తే, ఎన్నికలలో ధన ప్రభావం బాగా తగ్గించవచ్చునని ఆయన అభిప్రాయ పడ్డారు. జగన్మోహన్ రెడ్డి వంటి అవినీతిపరులు కూడా బెట్టిన లక్షల కోట్ల నల్లధనాన్ని ఈ చిన్న ఐడియాతో అడ్డుకట్టవేయవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.   అసలు నల్లదనం గురించి ఇంత హట్టాతుగా ఆయనకీ ఎందుకు బెంగ పట్టుకొందనే సంగతిని ఆయన తన మాటలలోనే బయటపెట్టుకొన్నారు. రాబోయే ఎన్నికలు తెదేపా, తెరాస, మరియు వైకాపాలకు జీవన్మరణ సమస్య వంటివి గనుక, ఆ మూడు పార్టీలు ఎన్నికలలో విజయం సాదించడానికి ఎంతకయినా తెగించక తప్పదు. అంటే వచ్చే ఎన్నికలలో డబ్బు(నల్లధనం) విచ్చలవిడిగా వెదజల్లడం అనివార్యం అని స్పష్టం అవుతోంది.   జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల డబ్బు దోచుకొన్నాడని ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు వైకాపా ‘ఆర్ధిక శక్తి’ గురించి, ఎన్నికలలో దాని ప్రభావం గురించి ఇప్పటికే ఆయనకీ ఒక అంచనా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఎన్నికల సమయానికి కూడా జైల్లో ఉన్నపటికీ, ఆయన డబ్బే ఆయనను గెలిపిస్తుందని చంద్రబాబు ధృడంగా నమ్ముతున్నట్లు ఆయన మాటలని బట్టి అర్ధం అవుతోంది. అందువల్లే, వీలయితే ఎన్నికల ముందుగానే ఆ రెండు నోట్లను రద్దుచేస్తే, జగన్ మోహన్ రెడ్డిని పూర్తిగా నిర్వీర్యం చేయవచ్చునని ఆయన ఆలోచన కావచ్చును.   అయితే, ఆయన ఊహిస్తున్నంత, చెపుతున్నంత తేలికగా ఇటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోలేదనే సంగతి ఆయనకీ తెలుసు. కానీ, ఆయన పార్టీకి చెందిన నన్నపనేని రాజకుమారి చెపుతున్నట్లు చంద్రబాబు ఒక చర్చనయితే మొదలుపెట్టారు దాని సాధ్యాసాధ్యాలు గురించి ఆ చర్చలలో తేలుతుంది అన్నారు. అంటే, వైకాపా నేతలు ఆరోపిస్తున్నట్లు చంద్రబాబు చెప్పుచేతల్లో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన ఆదేశాలను లేదా ఈ చిన్నపాటి కోరికను తీరుస్తోందని ఆమె అభిప్రాయమేమో చూడాలి మరి. ప్రభుత్వం ఆయన చెప్పిన మాట విని, ఈ ఐడియాను కనీసం ఎన్నికలకి మూడు నెలలు ముందు, మూడు నెలల తరువాత వరకు తాత్కాలికంగా అమలు చేసినా అది తప్పకుండా ఎవరిదో ఒకరి జీవితాన్నే మార్చేయవచ్చును.

కాంగ్రెస్-వైకాపా-తెరాసలు రహస్య ఒప్పందం చేసుకోన్నాయా?

  తెలంగాణా విషయం తేల్చమంటూ కాంగ్రెస్ యంపీలు తమ అధిష్టానానికి ఈ నెలాకరు వరకు గడుపు విదించచారు. మరో వైపు తెరాస అధినేత కేసీఆర్ తో మంతనాలు మొదలుపెట్టి, ఆపార్టీలో చేరేందుకు జూన్ 3వ తేదీకి ముహూర్తం కూడా పెట్టేసుకొన్నారు. అయినా, కాంగ్రెస్ అధిష్టానం నుండి కనీస స్పందన కూడా లేదింత వరకు. కానీ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాత్రం ‘పార్టీని వీడి వెళ్ళేవారిని పట్టుకొని వ్రేలాడలేము కదా’ అని వ్యాక్యానించడం పార్టీ అధిష్టానం అభిప్రాయానికి అద్దం పడుతున్నట్లుంది. తమ యంపీలు పార్టీ వీడి వెళ్లిపోయేందుకు సిద్దంగా ఉన్నారని కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసినా అది పట్టించుకోవడం లేదంటే, అది ఉద్దేశ్యపూర్వకంగానే వదులుకొనేందుకు నిర్ణయించుకొనట్లు అర్ధం అవుతుంది.   ఇప్పుడు మనం కొంచెం ఫ్లాష్ బ్యాకులోకి వెళితే, కొన్నినెలల క్రితం తెలంగాణా కోసం లాబీయింగ్ చేయడానికని డిల్లీ వెళ్ళిన కేసీఆర్ కనబడతారు. అక్కడ దాదాపు నెలరోజులు మకాం వేసిన ఆయన తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాడానికి కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు సాగించిన సంగతి కూడా మనకి కనబడుతుంది. కానీ, అవి బెడిసి కొట్టాయని ఆయనే ఆ తరువాత స్వయంగా ప్రకటించారు.   ఇదంతా కూడా కాంగ్రెస్-తెరాసల వ్యూహంలో భాగమే అయిఉండవచ్చునేమో! రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీకి తెరాస మద్దతు అత్యవసరమని తెలుసు. ఆ పార్టీ మద్దతు లేనిదే తెలంగాణాలో ఆశించినమేర సీట్లు రావని కూడా తెలుసు. అదేవిధంగా తెలంగాణాలో జగన్ మరియు చంద్రబాబులను నిలువరించాలంటే తప్పని సరిగా తెరాసతో చేతులు కలపాలి. అప్పుడే తెలంగాణాలో ఎన్నికలు ఏకపక్షం అవుతాయి. లేకుంటే ఆ నాలుగు పార్టీలమధ్య ఓట్లు చీలక తప్పదు.   కనుక, ఆ పార్టీలు తెర వెనుక చేతులు కలిపినప్పటికీ పైకి ఒకరినొకరు తిట్టుకొంటూ బద్ధ శత్రువులు లాగ ప్రవర్తిస్తుండవచ్చును. ఆ వ్యూహంలో భాగంగానే కేంద్ర కాంగ్రెస్ మంత్రులు అప్పుడప్పుడు అగ్నికి ఆజ్యం పోస్తూ తెలంగాణపై అసందర్భ వ్యాక్యలు చేస్తుండి ఉండవచ్చును.   మొన్న కేశవ్ రావు డిల్లీలో సోనియా గాంధీని కలిసి వచ్చిన తరువాత తెలంగాణాతో సహా అన్ని విషయాలపై కూలకుషంగా చర్చించామని, ఆ చర్చలతో తానూ చాలా సంతృప్తి చెందానని చెప్పిన రెండు రోజులకే, ఏఐసీసి ప్రతినిధి పీసీ చాకో ‘తెలంగాణా అంశం అసలు యుపీయే ఎజెండాలోనే లేదని’ ఒక అసందర్భ ప్రకటన చేయడం, వెంటనే తెరాస అధినేత కేసీఆర్ కాంగ్రెస్ యంపీలతో భేటీ అవడం, వారు పార్టీ మారుతారని ప్రకటించడం, అయినా కాంగ్రెస్ అధిష్టానం ఇంతవరకు స్పందించకపోవడం గమనిస్తే ఇదంతా చాలా నాటకీయంగా జరుగుతున్నట్లు అర్ధం అవుతుంది.   కాంగ్రెస్, తెరాసలు ప్రస్తుతం బద్ధ శత్రువులుగా నటిస్తూ కత్తులు దూసుకొంటున్నపటికీ, తెలంగాణా ప్రాంతం నుండి తెదేపా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను దూరం పెట్టేందుకు తెర వెనుక చేతులు కలుపుతున్నట్లు కనిపిస్తోంది. సరిగ్గా ఎన్నికల ముందుగానో, తరువాతనో కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అనుకూలంగా ఒక ప్రకటన చేసి, అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి ఆ రెండు పార్టీలు ఎన్నికల పొత్తులు పెట్టుకోవడమో లేకపోతే తెరాస వెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిసి పోవడమో జరిగినా ఆశ్చర్యం లేదు.   తద్వారా తెరాసకు తెలంగాణా సాదించిన ఘనతను కాంగ్రెస్ అప్పగిస్తే, రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచేందుకు తెరాస కాంగ్రెస్ పార్టీకి సహకరించేలా ఆ రెండు పార్టీల మద్య రహస్య ఒప్పదం జరిగి ఉండవచ్చును. ఈ రహస్య ఒప్పందం గురించి మొన్న కేశవ్ రావుకి, అంతకు ముందు తెలంగాణా కాంగ్రెస్ యంపీలకు కాంగ్రెస్ అధిష్టానం వివరించబట్టే వారిలో కొందరు అకస్మాతుగా నిశబ్ధం అయిపోగా మరికొందరు ఆ వ్యూహంలో భాగంగా త్వరలో కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరుతున్నట్లు చాటింపు వేసుకొంటున్నారేమో.   అంతిమంగా కాంగ్రెస్, తెరాసలు రెండూ కలిసిపోయినప్పుడు తెలంగాణా కాంగ్రెస్ యంపీలందరు మళ్ళీ ఎటూ కాంగ్రెస్ సముద్రంలోనే తేలుతారు గనుక, రెండు పార్టీల వ్యూహ ప్రకారం వారు కాంగ్రెస్ లోంచి తెరసలోకి దూకుతున్నట్లు నటిస్తున్నారేమో. ఈ లోగా కేసీఆర్ ‘మనకి ఆంధ్రా పార్టీలు వద్దంటూ’ ప్రచారం మొదలుపెట్టి తెదేపా, వైకాపాలపై ‘సీమాంధ్ర ముద్ర’ వేసి వాటిని తెలంగాణా నుండి బయటకి పంపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.   ఒకవేళ కేసీఆర్ రహస్య ఒప్పందం ప్రకారం నడుచుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తన చేతిలో ఉన్న చిలుకలను ఆయనపైకి విడిచే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే, తెరాసను వీడిన రఘునందన్ రావు తెరాస నేతల అవినీతి భాగోతాల చిట్టాలను సీబీఐ చేతిలో పెట్టి వచ్చారు గనుక, ఏ కారణం చేతయినా తెరాస నేతలు తోక జాడిస్తే, వారు కూడా చంచల్ గూడా జైలులో తేలే అవకాశం ఉంది.   కాంగ్రెస్-తెరాసలు నిజంగా ఈ వ్యూహం అమలుచేస్తున్నట్లయితే తెలంగాణాలో తెదేపా, వైకాపాలు ఇక గెలుపు సంగతి మరిచిపోవలసిందే.   ఇక, కొన్ని నెలల క్రితం విజయమ్మ, కొద్ది రోజుల క్రితం షర్మిల, నిన్న భారతి అందరూ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీకే తమ మద్దతు అని ప్రకటిస్తునందున, సీమంద్రా జిల్లాలలో కూడా కాంగ్రెస్-వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇదేరకమయిన వ్యూహం అమలు చేస్తునట్లు కనిపిస్తోంది. జగన్ జైలు నుండి విడుధలవ్వాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరక తప్పదు అని రైల్వే మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రావు ఇదివరకే స్పష్టం చేసారు.   అందువల్ల అక్కడ తెలంగాణా, ఇక్కడ జగన్ విడుదల అనే రెండు అంశాలతో కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో తేదేపాకు చెక్ పెట్టే అవకాశం ఉంది.

కళంకిత మంత్రుల ఉద్వాసనతో కాంగ్రెస్ లో కొత్త అధ్యాయాలు

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి వల్ల హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాలు శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావులను తన మంత్రి వర్గం నుండి తప్పించారు. దీనితో ఒక అధ్యాయం ముగియగా, మరిన్ని కొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి. అయితే అవి కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకి కూడా మరిన్ని చేదు అనుభవాలను రుచి చూపించబోతున్నాయి.   వారిరువురు తమ పదవులతో బాటు శాసన సభకు కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వారిరువురూ తమ శాసన సభ పదవులకు రాజీనామాలు చేసినట్లయితే, ఇప్పటికే బొటాబొటి మెజార్టీతో నడుస్తున్న కిరణ్ కుమార్ ప్రభుత్వం మైనార్టీలో పడే అవకాశాలున్నాయి. కానీ, ముఖ్యమంత్రి పరిస్థితులు అంతవరకు వెళ్ళనీయక పోవచ్చును.   ధర్మాన మరో అడుగు ముందుకు వేసి పార్టీకి కూడా రాజీనామా చేసి వైకాపాలో జేరే అవకాశాలున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన వైకాపాలో చేరినట్లయితే, శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికలలో ఎదురు దెబ్బతప్పక పోవచ్చును. ధర్మాన పార్టీ మారితే శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారవచ్చును.   ఇక, మొదటి విడతలో ఇద్దరికి ఉద్వాసన అయింది గనక, మిగిలిన కళంకిత మంత్రులకు కూడా అదే సూత్రం వర్తించక తప్పదు. ఇది వారిలో తీవ్ర అభద్రతా భావం పెంచుతుంది గనుక వారు కూడా అసమ్మతి ముఠాలు కట్టే అవకాశం ఉంది. ఈ విధంగా మొత్తం ఐదుగురు మంత్రులు తప్పుకొంటే, వారు ఖాళీచేసిన కుర్చీలలో రుమ్మాళ్ళు వేయడానికి ఈపాటికే కాంగ్రెస్ పార్టీలో పోటీలు మొదలయి ఉంటాయి. ముఖ్యంగా కీలకమయిన హోం మంత్రి, రోడ్లు భవనల శాఖల కోసం పోటీ గట్టిగానే ఉంటుంది. పదవులు దక్కించుకొన్నవారు పండుగ చేసుకొంటారు. దక్కని వారు అసంతృప్తి ముఠాలుగా ఏర్పడుతారు.   ఇక, మంత్రి వర్గ ప్రక్షాళణా కార్యక్రమానికి ముఖ్యమంత్రి డిల్లీ నుండి అనుమతి తెచ్చుకొన్నట్లు వస్తున్న వార్తలు నిజమయితే, ఆయన మొట్ట మొదటిగా తనను వ్యతిరేఖిస్తున్న డా. డీ.యల్. రవీంద్రా రెడ్డి, సి.రామచంద్రయ్య వంటి వారిని మంత్రి పదవుల నుండి తొలగిస్తారు. పదవులలో ఉన్నపుడే కిరణ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న అసమ్మతి నేతలు ఇప్పుడు ఆ పదవులు కూడా కోల్పోతే, పార్టీలో అసమ్మతి మరింత పెరిగే అవకాశం ఉందన్న మాట.   ఇక, మంత్రి రామచంద్రయ్యను తొలగిస్తే ఆయన వెనకుండి నడిపిస్తున్నమెగా మంత్రిగారికి కోపం కలిగించవచ్చును. అది పార్టీలో కొత్త ‘కాపు కుల సమీకరణాలకి’ మరింత ఊతమీయవచ్చును. కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక కూడా ఊడినట్లు, కళంకిత మంత్రులను తొలగించి ప్రజలలో మంచి పేరు తెచ్చుకొందామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తే, పార్టీలో చిచ్చు పెట్టుకొన్నట్లవుతుంది.   పార్టీలో అసమ్మతి కార్యకలాపాలు, మంత్రులలో అభద్రతా భావం, మైనార్టీలో ప్రభుత్వం, కొత్త కుల, రాజకీయ సమీకరణలు వంటివన్నీ జోరందుకొంటాయి. ఈ పరిస్థితులన్నీ అంతిమంగా ప్రభుత్వ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. సాధారణ పరిస్థితుల్లోనే ప్రభుత్వం పని తీరు అంతంత మాత్రంగా ఉన్నపుడు, ఇటువంటి పరిస్థితుల్లో అది మరింత దిగ జారే అవకాశం ఉంటుంది.

3వ ఫ్రంట్ లేదా యుపీఏకు వైకాపా మద్దతు: షర్మిల

  కొన్ని నెలల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యులో ‘తమ పార్టీ వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని’ చెప్పడం రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించింది. ఒకపక్క కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నిజగన్ మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలుపాలు చేసిందని నిత్యం దూషిస్తూనే, మరోపక్క అదే పార్టీ నేతృత్వంలో నడుస్తున్న యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తానని ఆమె చెప్పడంతో, ‘ఏనాటికయినా తల్లీ పిల్లా కాంగ్రెస్ పార్టీలు కలిసిపోతాయని’ తెదేపా చేస్తున్న ఆరోపణలను ఆమె నిజం చేసినట్లయింది.   కానీ, ఆ తరువాత కిరణ్ కుమార్ ప్రభుత్వంపై అవిశ్వాసతీర్మానం పెట్టడంతో వైకాపా మాటలకి చేతలకి ఎక్కడా పొంతన ఉండదని రుజువయింది. ఆపార్టీ కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకోవడానికి లేదా ఆ పార్టీలో కలిసిపోవడానికి ఆలోచన కనుక చేస్తుంటే, అది అవిశ్వాసం పెట్టి ఉండకూడదు. కానీ, పెట్టింది. గనుక, ఆ పార్టీతో జతకట్టే ఆలోచనలేదనుకోవాలి. పైగా తెదేపా కాంగ్రెస్ పార్టీతో కుమక్కవడం వలననే తాము కిరణ్ ప్రభుత్వాన్ని కూల్చలేకపోయామని ఆరోపించింది కూడా. అంటే, వైకాపా, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేఖిస్తునట్లు భావించవచ్చును.   అయితే, ఇటీవల షర్మిల 2000కి.మీ. పాదయాత్ర పూర్తి చేసుకొన్నసందర్భంగా ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ, గతంలో తన తల్లి చెప్పినట్లుగానే 'తమ పార్టీ వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో యుపీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని' స్పష్టం చేసారు. ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చి నట్లయితే, దానికి మద్దతు ఇస్తామని, కానీ, కేంద్రంలో 3వ ఫ్రంట్ ఏర్పడి ప్రభుత్వం ఏర్పరచలేని పరిస్థితిలోఉంటే, అప్పుడు తమ పార్టీ యుపీయే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేసారు. తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మతతత్వ పార్టీ అయిన బీజేపీ నేతృత్వంలో సాగే ఎన్డీయే ప్రభుత్వానికి మాత్రం మద్దతు ఈయబోదని ఆమె స్పష్టం చేసారు.   షర్మిల చేసిన ఈ తాజా ప్రకటనతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నిస్తునట్లు అర్ధం అవుతోంది. లేకుంటే, ఇటువంటి అసందర్భ పరిస్థితుల్లో ఆమె ఈ ప్రసక్తి తేవలసిన అవసరం లేదు. ఆమె ఈ విధంగా మాట్లాడటానికి వెనుక ఆమె పార్టీపై, ఆమె కుటుంబంపై నానాటికి పెరుగుతున్న ఒత్తిళ్ళే కారణమని చెప్పవచ్చును.   సుప్రీం కోర్టు జగన్ మోహన్ రెడ్డి బెయిలు తిరస్కరిస్తు తీర్పు వెలువరించేటపుడు, దేశంలో పెరిగిపోతున్న ఆర్ధిక నేరాలను అణచివేయవలసి ఉందని అభిప్రాయపడింది. తీవ్ర ఆర్ధిక నేరాభియోగాలు ఎదుర్కొంటున్న జగన్ మోహన్ రెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు మరియు పార్టీకి కోర్టు వెలువరచిన అభిప్రాయాలు కలవరపాటు కలిగించడం సహజమే.   పైగా, మరో కేసు సందర్భంలో సీబీఐ విచారణలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించడంతో, జగన్ మోహన్ రెడ్డి చుట్టూ సీబీఐ ఉచ్చు మరింత బలంగా బిగుసుకొనే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో, జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడప్పుడే జైలునుండి విడుదల కాకపోవచ్చుననే సంకేతాలు, ఆ పార్టీ పరిస్థితిని తలక్రిందులు చేసే అవకాశం ఉంది.   ఇటువంటి నేపద్యంలో, షర్మిల తమ పార్టీ ఇప్పటికీ కాంగ్రెస్ అనుకూలమేనని చెప్పడం, కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంగానే భావించవచ్చును. కానీ, ఎన్నికలకి ఇంకా పది నెలలు సమయం ఉన్నందున, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తొందరేమి లేదు, కనుక ఆ పార్టీ ఇప్పుడు వెంటనే స్పందించక పోవచ్చును. మున్ముందు రాజకీయ పరిస్థితులు, పార్టీ అవసరాలను బట్టి అప్పుడు వైకాపాతో ఏవిధంగా వ్యవహరించాలో కాంగ్రెస్ నిర్ణయించుకోవచ్చును.   ఈలోగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కానీ, జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి గానీ తారుమారయి, ఎవరిదయినా మరింత దిగజారితే, అప్పుడు రెండో వారిది పైచేయి అవుతుంది కనుక, తదనుగుణంగా వారి వారి వ్యూహాలు ఆలోచనలు మారే అవకాశం ఉంటుంది. ఏమయినప్పటికీ షర్మిల తెలిపిన తాజా అభిప్రాయాలతో ఆమె, ఆమె పార్టీ నేతలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని పైకి తిడుతున్నపటికీ, అవసరమయితే అదే పార్టీతో చేతులు కలపడానికి కూడా సిద్ధమని స్పష్టమయింది.   ఇక, కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినట్లయితే, దానిలో తప్పనిసరిగా తమ బద్ధ విరోధి చంద్రబాబు ఉంటారు. మరి అటువంటప్పుడు 3వ ఫ్రంట్ కి వైకాపా ఏవిధంగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకొందో కూడా తెలియదు. ఆ పార్టీకి సరయిన దిశా నిర్దేశం చేయగలవారు లేకపోవడం వలననే, ఇటువంటి పొంతనలేని నిర్ణయాల గురించి మాట్లాడుతోందని చెప్పవచ్చును.

కేసీఆర్ పైకి కేశవాస్త్రం ప్రయోగించనున్నసోనియమ్మ

  ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చాలా నెలల తరువాత కే.కేశవ్ రావుకి అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయనతో దాదాపు గంటసేపు పైగా చర్చించారు. అనంతరం కేశవ్ రావు మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీతో పార్టీ విషయాలు, తన స్వంత విషయాలు అన్నీ మాట్లాడానని, సమావేశంపట్ల తానూ చాలా సంతృప్తితో ఉన్నానని ఆయన తెలియజేసారు. అంతకు మించి మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు.   పార్టీలో అందరికంటే ఎక్కువ గట్టిగా తెలంగాణా అంశంపై మాట్లాడుతున్నవ్యక్తి ఆయనే గనుక, బహుశః తెలంగాణా అంశంపై పార్టీ వైఖరిని ఆయనకి స్పష్టంగా తెలియజేసి, తదనుగుణంగా ఆయనకు హామీ ఇచ్చిఉండవచ్చును. అందుకు ప్రతిగా రానున్నఎన్నికలలో పార్టీని గెలిపించేందుకు పార్టీలోని తెలంగాణా వాదులనందరినీ ఒక త్రాటిపైకి తెచ్చే బాధ్యత ఆయనకి అప్పగించి ఉండవచ్చును. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే తెలంగాణా వచ్చేఅవకాశం ఉంది. కనుక, తెలంగాణా నేతలు పార్టీలు మారి ఎటువంటి ప్రయోగాలు చేసినా దానివలన, తెలంగాణా మరింత ఆలస్యం అవడమే కాకుండా, అటు వారికి, ఇటు పార్టీకి ఇద్దరికీ కూడా నష్టం కలగడమే కాకుండా, అంతిమంగా అందరూ కలిసి కేసీఆర్ లబ్ది చేకూర్చిన వారవుతారని ఆమె కేశవ్ రావుకి ఉపదేశం చేసి ఉండవచ్చును.   ఇక, ఆమె స్వయంగా కేశవరావును పిలిచి మాట్లాడినందున, ఇంతకాలం తమ గోడు చెప్పుకొనేందుకు కూడా అవకాశం ఈయలేదని అధిష్టానంపై అలిగిన తెలంగాణా కాంగ్రెస్ నేతల అహం కూడా చల్లారుతుంది. తద్వారా ఇక వారు కేసీఆర్ ఉచ్చులో పడకుండా కాపాడుకోవచ్చునని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన కావచ్చును. ఈ సమావేశంతో, కేసీఆర్ తెలంగాణా కాంగ్రెస్ నేతలపై పెట్టుకొన్న ఆశలు అడియాశలయినట్లే భావించవచ్చును.   తెలంగాణా అంశంపై కాంగ్రెస్ అధిష్టానంతో రహస్య సంప్రదింపులు చేసిన కేసీఆర్ డిల్లీలో ఏమిజరిగిందో చాలా సులువుగానే అంచనా వేయగలరు. ఊహించని విధంగా సోనియాగాంధీ పావులు కదిపి, తనతో కలుస్తాడని ఆశపడిన కేశవ్ రావునే తనపై బాణంగా ఎక్కుపెట్టబోతోందని కేసీఆర్ ఈ పాటికి గ్రహించే ఉంటారు. అందువల్ల, కేశవ్ రావు తొలి స్పందన ఏవిధంగా ఉంటుందో చూసిన తరువాత, కేసీఆర్ కేశవ్ రావుని కూడా మళ్ళీ బూతులు లంఖించుకొనే అవకాశం ఉంది.