ముఖ్యమంత్రికి మరో అగ్ని పరీక్ష

  త్వరలో పదవీ విరమణ చేయనున్న ఐదుగురు శాసనమండలి-సభ్యులు పొంగులేటి సుధాకరరెడ్డి, ధీరావత్‌ భారతీ నాయక్‌, ఇంద్రసేన్‌రెడ్డి, లక్ష్మీ దుర్గేశ్‌, పుల్లా పద్మావతిలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మరో అగ్ని పరీక్షను తెచ్చిపెట్టారు. శాసన సభ్యుల కోటాలో ఎన్నికయిన వారి ఐదు స్థానాలను, మారిన రాజకీయ సమీకరణాల నేపద్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే దక్కేలా చేయడం నిజంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అగ్నిపరీక్ష వంటిదే.   ఒక్కో శాసనమండలి సభ్యుడి ఎన్నికకి 29.3 ప్రథమ ప్రాధాన్యతా వోట్లు అవసరం కాగా, కాంగ్రెస్ తన 155 మంది శాసనసభ్యుల బలంతో అవలీలగా ఐదుగురు శాసనమండలి సభ్యులను గెలిపించుకోలిగేది. కానీ, కొద్ది రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చాలా ఆర్భాటంగా జగన్ అనుచరులయిన 9మంది శాసన సభ్యులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేయడంతో, పార్టీ పరిస్థితి ఒక్కసారిగా తలక్రిందులయింది. 155 మంది శాసనసభ్యుల నుండి వారిని తీసేస్తే కేవలం 146 మంది మాత్రమె మిగులుతారు.   అయితే, వారు కిరణ్ కుమార్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరిస్తున్నట్లు కానీ, వారిని బొత్స సత్యనారాయణ ప్రకటించినట్లుగా ఇంతవరకు పార్టీ నుండి బహిష్కచడం గానీ జరుగనందున, ఆ 9 మంది సభ్యుల కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ లేనట్లే లెక్క. అందువల్ల పార్టీకి వారి మద్దత్తు ఉంటుందనే నమ్మకం లేదు. అందుకు ప్రధాన కారణం బొత్స చేసిన ప్రకటనేనని చెప్పక తప్పదు.   ఆయన తన ప్రకటనతో జగన్ వర్గానికి ఒక సవాలు విసిరడంతో, వారు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు వేచి చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో శాసనమండలి ఎన్నికలు ఎదుర్కోవలసి రావడంతో కిరణ్ కుమార్ రెడ్డికి కొంచెం ఇబ్బందే. ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది శాసన సభ్యులు, ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన మజ్లిస్‌ పార్టీతో కానీ చేయి కలిపితే వారి బలం (మజ్లిస్ 7 మంది సభ్యులతో కలిపి) మొత్తం 24 అవుతుంది. అప్పుడు, కాంగ్రెస్ పార్టీలో నేటికీ శాసన సభ్యులుగా కొనసాగుతున్న 9 మంది జగన్ అనుచరులను కూడా కలుపుకొంటే వారి మొత్తం బలం 33 అవుతుంది. ఒక శాసనమండలి సభ్యుడి ఎన్నికకి 29.3 ప్రథమ ప్రాధాన్యతా వోట్లు అవసరం కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 33 మంది సభ్యులు ఉన్నందున, ఆ పార్టీ సులభంగా ఒక స్థానాన్ని కైవసం చేసుకోగలదు.   ఉన్న 5 స్థానాలలో ఒకటి కోల్పోవడం అంటే ప్రభుత్వానికి కొంత ఇబ్బందే గనుక ఆ ఒక్క స్థానాన్ని ఎలా తిరిగి దక్కించుకోవాలనేదే కిరణ్ కుమార్ రెడ్డికి ఒక పరీక్ష కాబోతోంది. పార్టీలో ఉన్న జగన్ అనుచరులను ఆయన నయాన్నో భయన్నో నచ్చచెప్పుకొంటారా, లేక మళ్ళీ మజ్లిస్ తో బేరాలు చేసుకొంటారా లేక ఏమయితే అయింది లెమ్మని ఒక స్థానాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వదులుకుంటారా చూడాలి.   అయితే, కిరణ్ కుమార్ రెడ్డి ఈ పరీక్షలో కూడానెగ్గినట్లయితే అది ఆయన రాజకీయ చతురతకి నిదర్శనంగా నిలబడటమే కాకుండా, సహకార ఎన్నికల గురించి లేనిపోని గొప్పలు చెప్పుకొంటున్నాడని పార్టీలో తనను విమర్శిస్తున్నవారికి కూడా జవాబు చెప్పినట్లవుతుంది. అంటే కాకుండా అవకాశం దొరికినప్పుడల్లా తన కుర్చీ కింద మంట రాజేయాలని చూస్తున్న బొత్స సత్యనారాయణకు కిరణ్ తన సత్తా చాటిచూపినట్లవుతుంది.

తెలంగాణా అంశంపై బిజెపికి అంత ఆసక్తి దేనికో?

  భారతీయజనతా పార్టీ గత రెండు దశబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలలో తన కమలాన్ని వికసింపజేయాలని ఎంతగా ప్రయత్నిస్తున్నపటికీ, కర్ణాటకలో తప్ప మరి వేరే ఏ రాష్ట్రంలోను మొగ్గ తొడగలేకపోయింది.అధికారంలో ఉన్న ఆ ఒక్క రాష్ట్రంలో కూడా తిరుగుబాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి ఎడ్యురప్ప సొంత కుంపటి పెట్టి బీజేపీకి ఎసరు పెడుతుండటంతో, అక్కడ కూడా ఆపార్టీ పరిస్థితి (ఎడ్యురప్ప) తుమ్మితే ఊడిపోయే ముక్కులా దయనీయంగా తయారయింది.   ఇక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఉన్నబలమయిన ప్రాంతీయ పార్టీలు బీజేపీ ఆయా రాష్ట్రాలలో కాలు కాదుకదా, వేలు కూడా పెట్టేందుకు చోటు మిగల్చకపోవడంతో, మూడు రాష్ట్రాలలో ఆ పార్టీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. అయితే, గత దశాబ్దకాలంగా సాగుతున్న తెలంగాణా ఉద్యమం, బీజేపీకి రాష్ట్రంలో ఊహించని ఒక కొత్త అవకాశాన్నిఅందజేసింది. మొదట్లో బీజేపీ తెలంగాణా విషయంలో కొంచెం సందిగ్ద పడినప్పటికీ, అదే తమకు రాష్ట్రంలో కాలుమోపేందుకు ఒక చక్కటి అవకాశం కల్పిస్తోందని గ్రహించిన బీజేపీ తెలంగాణా విషయంలో మరిక ఎన్నడూ కూడా వెనుతిరిగి చూడలేదు. నాటి నుండి నేటి వరకూ కూడా బీజేపీ తెలంగాణా ఉద్యమాలలో కీలక పాత్ర పోషిస్తూ, క్రమంగా తెలంగాణాలో తన బలం పెంచుకొనగలిగింది.   అదే సమయంలో, బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణా విషయంలో నిర్ద్వందంగా తన అభిప్రాయాన్ని ప్రకటిస్తూ, తాము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా 100 రోజుల్లోనే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. నిన్న ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో అదే విషయాన్నీ మరో మారు దృవీకరిస్తూ, యు.పీ.ఏ. ప్రభుత్వం గనుక తెలంగాణా ఈయకపోతే, తాము అధికారంలోకి రాగానే తెలంగాణా ఇస్తామని మరోమారు స్పష్టం చేసారు.   కాంగ్రెస్ పార్టీ నాన్చుడు ధోరణితో విసిగెత్తిపోయిన తెరాస అధినేత కేసీఆర్ కూడా యు.పీ.ఏ. కాకపొతే ఎన్డీయే మరో ప్రత్యామ్నాయం ఉందంటూ ప్రకటించాడు.   ఇక, రాష్ట్రంలో బీజేపీ విషయానికి వస్తే, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు లేని ఒక గొప్ప అవకాశం అది కలిగిఉంది. ఆ మూడు పార్టీలు కూడా రాష్ట్రంలో తమ పరిస్థితులు తలక్రిందులవుతుందనే భయంతో తెలంగాణా అంశంపై నేటికీ నోరు మెదపడానికి భయపడుతుండగా, రాష్ట్రంలో తెలంగాణాలో తప్ప మరే ఇతర ప్రాంతాలలో ప్రభావం చూపని బీజేపీ సరిగ్గా ఇదే కారణంతో ఆరెండు పార్టీలను అధిగమించి నిర్ద్వందంగా తెలంగాణా అనుకూల నిర్ణయం ప్రకటించి, చురుకుగా ఉద్యమంలో పాల్గొంటోంది.   తద్వారా బీజేపీకి రాష్ట్రంలో కొత్తగా కోల్పోయేదేమి లేకపోయినా, తెలంగాణాలో తానూ చేస్తున్న ఉద్యమాలవల్ల కనీసం తెలంగాణా ప్రాంతాలలోనయినా తన జెండా ఎగురవేయగలిగే అవకాశం దక్కుతుందని అది ఆశపడుతోంది.   అయితే, తెలంగాణా బలంగా ఉన్న తెరాసను కాదని తానూ ఒంటరిగా గెలవగలదని ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ, బీజేపీకి రాష్ట్రంలో తన ప్రాభల్యం పెంచుకొనేందుకు ఇంతకంటే వేరే ప్రత్యామ్నాయ అవకాశం కూడా లేదు గనుక తెలంగాణా అంశం పట్టుకొని ముందుకు సాగిపోతోందని చెప్పవచ్చును.   ఒకవేళ ఆ పార్టీకి కూడా ఆంద్రా ప్రాంతంలో గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉండిఉంటే, బహుశః బీజేపీ కూడా తెలంగాణా అంశంపై కాంగ్రెస్,వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరినే అవలంబించి ఉండేదేమో!

బాంబులతో రాజకీయనాయకుల బంతులాటలు

  రాష్ట్రం నుండి తెలంగాణా విడిపోతే నక్సలయిట్లకు నిలయంగా మారుతుందనే అంశంపై గతంలో రాజకీయ నేతల మద్య చాలా తీవ్ర స్థాయిలో వాదప్రతివాదాలు జరిగాయి. ఇప్పుడు హైదరాబాద్ బాంబు ప్రేలుళ్ళ నేపద్యంలో తెలంగాణా విడిపోతే హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు నిలయంగా మారుతుందని అంటూ మంత్రి టీజీవెంకటేష్ కొత్త చర్చ మొదలుపెట్టగా, దానికి విజయవాడ యం.పీ.లగడపాటి రాజగోపాల్ వంతపాడటంతో సహజంగానే మళ్ళీ తెలంగాణావాదుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి.   మొట్ట మొదట పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, “రాష్ట్ర విభజన జరగకుండా ఆపేందుకు టిజి వెంకటేష్, లగడపాటి ఇద్దరూ ఈ బాంబు ప్రేలుళ్ళలో ఏమయినా పాత్ర పోషించారా? కుట్రలో వీరికి ఏమయినా భాగం ఉందా అనే కోణంలో కూడా విచారణ చెప్పటాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు. అయితే, ఉగ్రవాదులతో, దేశద్రోహనేరంతో తోటి కాంగ్రెస్ వారిని ముడిపెట్టడం ఎంతవరకు సబబో ఆయనకే తెలియాలి. తద్వారా ప్రతిపక్షాలకు ఆయన ఎటువంటి సందేశం ఇస్తున్నారో ఆయనకి అర్ధం అయినట్లు లేదు.   వీరి గొడవ ఇలా సాగుతుంటే, మరో వైపు తెలంగాణా జేయేసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కూడా రంగ ప్రవేశం చేసి, అసలు కాంగ్రెస్ అసమర్ధ పరిపాలనవల్లనే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని, రాష్ట్రం మొత్తం ఉగ్రవాదులకు నిలయంగా మారిందని, అందుకు రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీనే తప్పు పట్టాలని అన్నారు.   దేశ భద్రతకే పెనుసవాలు విసిరిన ముష్కర మూకలను ప్రాంతాలకు, మతాలకు అతీతంగా కలిసికట్టుగా ఎదుర్కోనవలసిన ఈ తరుణంలో, ఈ విదంగా బాంబు ప్రేలుళ్ళను కూడా రాజకీయం చేసి, ప్రాంతీయవాదం, సమైక్యవాదం అంటూ మీడియాకెక్కి మరీ మన రాజకీయ నాయకులు కీచులాడుకోవడం ప్రజలకు వారిపట్ల ఏహ్యత కలిగిస్తోంది. ఇటువంటి వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకొనందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు.

వాగ్దానాలొకరివి, అమలు చేసేవారువేరొకరూ?

  జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు ఆ పార్టీలో అధికారికంగా ఏ పదవీ లేకపోయినప్పటికీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె గత కొన్ని నెలలుగా పాదయాత్ర చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీని అభిమానించేవారు ఎవరయినా ఆ పార్టీ కోసం పనిచేయవచ్చును. కనుక ఆమె పాదయాత్రను కూడా ఎవరూ తప్పుపట్టలేరు. కానీ, ఆమె ఆ పార్టీ అధ్యక్షుడి సోదరి అనే ఏకైక అర్హతతో పార్టీ తరపున వాగ్దానాలు గుప్పించడం మాత్రం సహేతుకంగా లేదు. అదేపని, పార్టీ గౌరవద్యక్షురాలిగా ఉన్న ఆమె తల్లి విజయమ్మగారో, లేదా పార్టీలో అధికారిక బాధ్యతలు నిర్వహిస్తున్న మరెవరయినా చేసి ఉంటే సహేతుకంగా ఉండేది. కానీ షర్మిల, పార్టీతో ఏ సంబంధము లేకపోయినా తన సోదరుడు జగన్ తరపున షర్మిల లెక్కలేనన్ని పెద్దపెద్ద వాగ్దానాలు అవలీలగా గుప్పించడం చాలా విడ్డూరం.   పార్టీలో ఏ అధికారిక హోదా కలిగి ఉందని ఆమె కేవలం పార్టీ అధ్యక్షుడి చెల్లెలు అనే ఏకైక హోదాతో ఈ విధంగా వాగ్దానాలు చేయడమంటే, పార్టీని కుటుంబ వ్యవహారం గా చూస్తున్నారు తప్ప ఒక రాజేకీయ వేదికగా భావించడంలేదని అనుకోవాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఇప్పుడు ఆమె చేస్తున్న వాగ్దానల్లన్నీ కూడా నీటి మీద వ్రాతలే అనుకోక తప్పదు. ఇందుకు మరో ప్రత్యామ్నాయం ఏమిటంటే, పార్టీలో అధికారికంగా ఏదో ఒకపదవి చేప్పట్టి ఆప్పుడు ఇటువంటి వాగ్దానాలు పుంకానుపుంకాలుగా చేసుకోవచ్చును. లేదా పనిలోపనిగా ఆమె ఇప్పుడు (తన సోదరుడి తరపున) ప్రజలకు చేస్తున్నవాగ్దానాలను, అతను ఖచ్చితంగా అమలుచేస్తాడని లేదా తనే స్వయంగా అతనిచేత అమలు చేయిస్తానని, మరో ప్రత్యేక వాగ్దానం కూడా చేస్తుండటం మంచిది.   రాజకీయపార్టీలు అధికారికంగా చేస్తున్న వాగ్దానాలకే దిక్కు లేన్నపుడు, పార్టీతో ఏ సంబందమూ లేని ఆమె చేస్తున్న వాగ్దానాలను, వేరొకరు ఎలా అమలుచేస్తారని ఆలోచిస్తే, ఇదంతా ఎంత నిరుపయోగమయిన కార్యక్రమమో అర్ధం అవుతుంది. ఆమె తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్న కారణంగా తమ పార్టీని బ్రతికించి ఉంచుకోవడానికి మాత్రమే పాదయాత్రలు చేస్తూ, పార్టీని గురించి ప్రచారం చేసుకొంటూ, అధికార పార్టీని విమర్శించుకొంటూ ముందుకు సాగిపోవచ్చును. ఇంకా ఆసక్తి ఉంటే,  కానీ ఈవిధంగా తన నోటికొచ్చిన వాగ్దానాలు ఎడాపెడా చేసుకుపోవడం, ప్రజలను తన అన్నకు ఓటేయమని కోరడం, అతనికి ఓటేస్తే తన వాగ్దానాలన్నిటినీ అతను నేరవేరుస్తాడని చెప్పడం విచిత్రంగా ఉంది.   ఉదాహరణకు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గనుక, అతను చేసే వాగ్దానాలకు అధికారికంగా చేసినవని చెప్పవచ్చును. (వాటిని అతను అమలు చేస్తాడా లేదా అనేది తరువాత సంగతి) కానీ, అదే అతని కుమారుడు లోకేష్ పాదయాత్రలు చేసి వాగ్దానాలు చేసినట్లయితే మాత్రం వాటికి విలువ ఉండదు.   కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీకి మొదటి నుండే ఒక అధికారం కట్టబెట్టారు. గనుక, అతని వాగ్దానాలకు కూడా అధికారికమయినవే అవుతాయి. ప్రస్తుతం అతను పార్టీ ఉపాద్య్యక్షుడు కూడా అయ్యాడు గనుక, అతని ప్రతీ వాగ్దానం కూడా పూర్తీ అధికారికంగా చెలామణి అవుతాయి.   కనుక, షర్మిల కూడా పార్టీలో అధికారికంగా ఏదయినా పదవి పుచ్చుకొని, అప్పుడు ఇటువంటి వాగ్దానాలు చేస్తే సబబుగా ఉంటుంది. లేకుంటే, ఆమె ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నట్లు భావించవలసి ఉంటుంది.

మళ్ళీ రాష్ట్రానికి అవే విదిలింపులు

  గత మూడు దశాబ్దాలుగా రైల్వేమంత్రిగా ఎవరు బాధ్యతలు చేప్పటినప్పటికీ, అందరికీ మన రాష్ట్రం అంటే చిన్న చూపే. వివిధ రాష్ట్రాలకు చేసిన కేటాయింపులతో పోలిస్తే, మన రాష్ట్రం ఎప్పుడు కూడా ఆఖరి వరుసలోనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ మనుగడకు 42 మంది యం.పీ.లను మన రాష్ట్రం అందిస్తున్నప్పటికీ, మరెందుకో తెలియదు కానీ మొదటి నుండి మన రాష్ట్రం అంటే చిన్నచూపే. అయినప్పటికీ, కేంద్రం పట్ల మన విదేయతలో వీసమంత మార్పులేదు. నిలదీసి ప్రశ్నించే ప్రసక్తే లేదు.   తమిళనాడు, ఒరిస్సా, రాజస్తాన్,బీహార్, బెంగాల్ మొదలయిన రాష్ట్రాలకు చెందిన నేతలు, తమకు అవసరమయిన ప్రాజెక్టులను, రైల్వే లయిన్లను, కొత్త రైళ్ళను తీవ్ర ఒత్తిడి చేసి మరీ సాధించుకొంటుంటే, మన రాష్ట్రానికే చెందిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సాక్షాత్ రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నపటికీ కొత్తగా సాదించింది ఏమి లేదు. ఇక రైల్వేలోఉన్న మంత్రిగారే ఏమిచేయలేన్నపుడు, ఇక మన 42 మంది యం.పీ.లు మనకి ఏదో ఓరగబెడతారనుకోవడం ఒట్టి భ్రమ.   కొంతమంది యం.పీ.లు తమకి తెలంగాణా సమస్య కంటే మరేమీ ప్రాధాన్యం లేదని బహిరంగంగానే చెపుతారు. మిగిలిన వారు రాజకీయ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో, పార్టీ అంతర్గత కుమ్ములాటలతో, తమ స్వంత వ్యాపారాలు, కాంట్రాక్టులతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు.   రాష్ట్ర ప్రయోజనాలకంటే స్వప్రయోజనాలే వారికి మిన్న. ఒకవేళ ఎవరయినా యం.పీ. డిల్లీ చుట్టూ తిరిగి ఒక రైల్వే ప్రాజెక్ట్ కానీ, మరొకటి కానీ సాదించేందుకు కృషి చేస్తుంటే, తమ రాజకీయ ప్రాభల్యం ఎక్కడ దెబ్బతింటుందో అనే బెంగతో, అతని లేదా ఆమె కాళ్ళుపట్టుకు లాగడానికి ప్రయత్నించేవారే తప్ప, వారితో చేతులు కలిపి కృషిచేయడం అరుదు. కొందరికి ప్రాంతీయ వాదం అడ్డొస్తే, మరికొందరికి అసూయ, అహం, బేషజం వంటివి అడ్డొస్తాయి.   మొత్తం మీద, ప్రతీ ఏట రైల్వేమంత్రిగారు మనకి మొండి చేయడం చూపడం, మనకి రావాల్సిన, దక్కాల్సిన, రైళ్ళను, ప్రాజెక్టులను ఇరుగుపొరుగు రాష్ట్రాలవారు గద్దలా తన్నుకు పోవడం షరా మామూలే. ప్రజలు నిస్సహాయంగా చూస్తూ ఈ విధంగా ఆక్రందనలు చేయడము మామూలే.   తిరుపతి, విశాఖలలో కొత్త రైల్వే జోన్ల ఏర్పాటు, రాష్ట్రంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను దేశంలో ప్రముఖ నగరాలతో కలుపుతూ కొత్త రైళ్ళు వంటి డిమాండ్లు చాలానే ఉన్నపటికీ, ఈసారి రైల్వే బడ్జెట్లో కర్నూల్ లో వేగన్ రిపేర్ వర్క్ షాప్, 22కొత్త లైన్ల నిర్మాణానికి అనుమతులు మాత్రమే పెర్కొనవలసినవి. ఈ కొత్త ప్రాజెక్టులు ఈ ఏడాది మొదలు పెడితే అవి ఎన్ని సంవత్సరాల తరువాత పూర్తవుతాయో ఎవరికీ తెలియదు. అందువల్ల వాటివల్ల రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు ఒరిగేదేమీ లేదు.   రాష్ట్రానికి రెండు,మూడు కొత్త రైళ్ళను విదిలించిన మన రైల్వేమంత్రి బన్సాల్ గారు, విజయవాడలో రైల్‌నీరు బాటిలింగ్‌ ప్లాంటును, విశాఖలో డిల్లీ తరహాలో (విదేశీ) పర్యాటకులకు విలాసవంతమయిన విశ్రాంతి గదులను ఏర్పాటు చేయడమే ఆయన మన రాష్ట్రానికిచ్చిన ఒక పెద్దవరం అన్నట్లు అభివర్ణించి చెప్పడం పుండు మీద కారం చల్లడమే అవుతుంది. విజయవాడలో నీళ్ళ ప్లాంటు, విశాఖలో విలాసవంతమయిన విశ్రాంతి గదులవల్ల రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల వారికి ఏమి ప్రయోజనమో ఆయనే చెప్పాలి.   ప్రజలు కోరుకొంటున్నవాటికి, ఆయన ఇస్తున్నవాటికీ ఎక్కడా పొసగదు. ప్రజలకి కొత్త రైళ్ళు కావాలి, కొత్త రైల్వే జోన్లు కావాలి, ఉపాధి కల్పించే కోచ్చ్ ఫ్యాక్టరీ కావలి తప్ప నీళ్ళ ప్లాంటులు, లిఫ్టులూ, విలాసవంతమయిన విశ్రాంతి గదులు కాదు. మన యం.పీ.లలో చైతన్యం లేనపుడు, మంత్రిగారు మాత్రం ఏమిచేస్తారు? అడగందే అమ్మయినా పెట్టదని పెద్దలు ఊరికే అనలేదు.

మంత్రిగారి అసందర్భ ప్రసంగం

  పదవి, అధికారం మరి నోటిని అదుపుతప్పేయలా చేస్తాయా లేక మనిషిలో ఉండే సహజ సిద్దమయిన చపలచిత్తమే నోరు జారెలా చేస్తుందో ఖచ్చితంగా చెప్పలేము కానీ, సాధారణంగా అధికారంలో ఉన్నవారు చాలామంది నోరు జారడం తరచూ మనం గమనిస్తుంటాము. కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణకు హైదరాబాదులో నిన్న ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ పురస్కారాన్నిప్రధానం చేస్తున్నసందర్భంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి గీతారెడ్డి తదితరులు అందరూ పాల్గొన్న సభలో సర్వే సత్యనారాయణ గారి ప్రసంగం ఇలా సాగింది.   “మంత్రి గీతారెడ్డికి కూడా ఆమె తల్లిలాగే మంచి నాయకత్వ లక్షణాలున్నాయి. అందువల్ల, ఆమె కూడా ముఖ్యమంత్రి పదవికి అన్నివిధాల అర్హురాలు. దేవుడు అవకాశమిస్తే భవిష్యత్తులో ఆమె ముఖ్యమంత్రి పదవి చేపడతారు. అంటే, ఇప్పుడున్న ముఖ్యమంత్రిని దించాలనేది నా ఉద్దేశ్యం కాదు. ఒకవేళ రాష్ట్రవిభజన జరిగి తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే, ఆమె మొట్టమొదటి ముఖ్యమంత్రి అవుతారు. ఆమెకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా నేను సోనియాగాంధీ మీద ఒత్తిడి తెస్తాను.”   “అసలు మొదట ఆమెకే ఉపముఖ్య మంత్రి పదవి దక్కవలసింది. కానీ, తెలంగాణలో మాదిగల జనాభా ఎక్కువగా ఉన్నందునే, దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. ఏమయినప్పటికీ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ఆమెనే ముఖ్యమంత్రి చేసేందుకు నేను కృషి చేస్తాను,” అన్నారు.   ఇంతటితో ఆగినా కొంత బాగుండేది, కానీ ఆయన తన ప్రసంగమ కొనసాగిస్తూ, "కొన్ని రోజుల క్రితం తెలంగాణ బర్నింగ్ అంశం కారణంగా కొన్ని అడ్డంకులు వచ్చాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కుర్చీలోంచి దించేయాలని కొందరు అవకాశవాదులు చాలా గట్టిగా ప్రయత్నించారు. అప్పుడు నేనే స్వయంగా సోనియా గాంధీని కలిసి, ఆ పని చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తరచూ ముఖ్యమంత్రులను మారుస్తుందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తే, ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని ఆమెకు నచ్చజెప్పాక ఆమె ఆ ప్రయత్నం విరమించుకొన్నారు. (అంటే కిరణ్ కుమార్ రెడ్డి పదవిని నేనే కాపాడాను అని ఆయన ఉద్దేశ్యం అన్నమాట.)   ఆ తరువాత గీతారెడ్డి కులం గురించి ప్రస్తావిస్తూ “ఆమె దళిత మహిళ అయినప్పటికీ ఒక అగ్ర కులస్తునితో వివాహం జరిగింది,” అంటూ మరో అసందర్భ ప్రకటన చేసారు. తరువాత, ఆయన ప్రసంగం రిజర్వేషన్ల మీదకి మళ్ళింది. “దళితుడనయిన నేను గత ఎన్నికల్లో జనరల్ స్థానమైన మల్కాజ్గిరి నుంచి పోటీ చేశాను. దళితులలో ‘క్రీమీ లేయర్’ కు చెందిన వెంకటస్వామికి, గీతారెడ్డికి, నాకు, ఐఎఎస్ల పిల్లలకు అసలు రిజర్వేషన్లు ఎందుకు?'' అని ప్రశ్నించారు. తమను తాము దళితులలో ‘టాటా’లుగా ఆయన అభివర్ణించుకొంటూ, తమ స్థాయి నేతలకీ, ఐఎఎస్ ఆఫీసర్లకి ఏవిధమయిన రేజర్వేషన్లూ ఉండనవసరం లేదని ఆయన అభిప్రాయ పడ్డారు.   సర్వే గారి ఈ ప్రసంగం, పక్కనే ఉన్న ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, గీతారెడ్డికి ఆయన తమను పొగుడుతున్నాడో లేక తమ పరువు తీస్తున్నాడో అర్ధం కాని పరిస్థితి. ఆయనను సన్మానం చేసి అవార్డు ప్రధానం చేద్దామని ఆహ్వానిస్తే, ఆయన ఈవిధంగా అప్రస్తుత ప్రసంగం చేసి అందరినీ ఇబ్బంది పరిచాడు.   సభకు సంబందించని అంశాలను ఉటంకిస్తూ ఆయన చేసిన అసందర్భ ప్రసంగం బహుశః కేంద్రమంత్రిగా తానూ వారందరికన్నా ఒక మెట్టు పైన ఉన్నానని చాటుకోవడానికో లేక రాష్ట్ర రాజకీయాలను తానూ శాసించగలనని చెప్పుకోవడానికో తెలియదు కానీ మొత్తం మీద తన అసందర్భ ప్రసంగంతో అందరినీ ఇబ్బందికర పరిస్థితుల్లో నిలబెట్టి అవార్డు స్వీకరించాడాయన.

నేతల పర్యటనల పరమార్ధం ఏమిటో?

  హైదరాబాదులో బాంబు ప్రేలుళ్ళు జరిగిననాటి నుండి నేటి వరకు కూడా అధికార ప్రతిపక్ష పార్టీల నేతలందరూ మొదట సంఘటన స్థలానికి, అక్కడి నుండి నేరుగా క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రులకు ఏదో తీర్ధయత్రలకి వచ్చినట్లు వరుసకట్టి మరీ వస్తున్నారు. ఈ రోజు ప్రదాని డా. మన్ మోహన్ సింగ్ కూడా వచ్చివెళ్ళడం జరిగింది.   ఘటనా స్థలంలోకి ఎవరుపడితే వారు చొచ్చుకు రావడం వల్ల అత్యంత కీలకమయిన ఆధారాలన్నీ పోతున్నాయని దర్యాప్తు సంస్థలవారు బారికేడ్లు కట్టేంతవరకు కూడా, ముఖ్యమంత్రితో సహా మన నేతలందరూ కూడా అనాలోచితంగా లోనికి ప్రవేశిస్తూనే ఉన్నారు. ఇక, తీవ్ర గాయాలతో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నవారిని, ఈ విధంగా ఒకరి తరువాత మరొకరు చొప్పున రాజకీయనాయకులు వస్తూ పరామర్శించడం వల్ల రోగులకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని వైద్యులు ఎంత మొత్తుకొంటున్నా కూడా ఈ తీర్ధప్రజని ఎవరూ ఆపలేకపోతున్నారు. కారణం అందరూ వీఐపీలే. ఎవరిని కాదనలేని నిస్సహాయత వైద్యులది.   ఈ రెండు సమస్యలకి తోడుగా వరుసకట్టి వస్తున్న నేతలందరికీ ప్రేలుళ్ళ గురించి, రోగుల పరిస్థితి గురించి మళ్ళీ మళ్ళీ మొదటి నుంచి వివరించవలసి రావడంతో అటు సంబందిత అధికారులకి, రోగులకి, వైద్యులకి అందరికీ కూడా తల ప్రాణం తోక్కి వస్తోంది. ఇది సరిపోదనట్లు, వస్తున్న పెద్దలందరికీ భద్రత కల్పించడం, వారికి ప్రోటోకాల్ పాటించడం మరో పెద్ద ప్రహసనంగా మారింది. ఈ రోజు ప్రధాని రాక సందర్భంగా రాష్ట్ర రాజధానిలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణల కొరకు పోలీసు బలగాలు అన్ని అంకితమయిపోయాయి.   దర్యాప్తు సంస్థలకు అత్యంత కీలకమయిన ఈ సమయంలో, ఇటువంటి వీవీఐపిల ఆగమనం కొత్త ఇబ్బందులు సృష్టిస్థాయి. దర్యాప్తుపై దృష్టి కేంద్రీకరించవలసిన ఈ సమయంలో, రాజకీయ నాయకులకు భద్రత కల్పించడానికి, వారికి సకల మర్యాదలతో రెండు ప్రాంతాలకు పర్యటింపజేసి సాగనంపడానికి వారి సమయం సరిపోతోంది. ఈ ఇబ్బందుల గురించి సంబందిత అధికారులెవరూ దైర్యంగా చెప్పే అవకాశం లేదుగనుక, రాజకీయనేతలే వారి సమస్యని అర్ధం చేసుకొని వారిని దర్యాప్తు, వైద్యులని చికిత్స చేసుకోనివ్వడం సముచితం.   అసలు ఈ దుర్ఘటన పట్ల బాధపడుతూ వచ్చిన వారికంటే, రాజకీయంగా తప్పని సరి పరిస్థితులవల్లనే ఈ తీర్ధప్రజ పెరిగిందని చెప్పవచ్చును. అధికారంలో ఉన్నవారు, ప్రతిపక్షాల విమర్శలకు గురికావలసి వస్తుందని పర్యటిస్తుంటే, ఇంత పెద్దదుర్ఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించకపోతే రాజకీయంగా సమస్యలోస్తాయనే భయంతో ప్రతిపక్షాలు క్యూలు కడుతున్నాయి.   అధికార పార్టీ నేతలు తమది నైతిక బాధ్యత అని భావిస్తే, ప్రతిపక్షాలు ప్రజలకు సానుభూతి చూపడం తమ బాధ్యత అంటూ పర్యటిస్తున్నాయి. అందరి ఉద్దేశ్యం కూడా ప్రజల దృష్టిలో తాము అత్యంత బాధ్యతాయుతమయిన రాజకీయనాయకులుగా ప్రదర్శించుకొందామనే ఆరాటమే తప్ప, తమ పర్యటనలవల్ల ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదని వారికీ తెలుసు.   ఇంత ఘోర దుర్ఘటన జరిగినప్పుడు కూడా అధికార ప్రతిపక్షాలలో ఐక్యంగా స్పందించాలనే ఆలోచన కలుగలేదు, ప్రతిపక్షాలను చూసి అధికార పార్టీ పర్యటిస్తే, అధికార పార్టీని ఇరుకున బెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రతిపక్షాలు పర్యటిస్తున్నాయి. ఒకరి మీదమరొకరు మాటల తూటాలు పేల్చుకోవడమే తప్ప, ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా కలిసి కూర్చొని ఒక పరిష్కారం కనిపెడదామనే ఉద్దేశ్యం అంతకన్నాలేదు.   ప్రజలలో చైతన్యం రావాలని పిలుపునిచ్చే మన రాజకీయ నాయకులు, ముందు తాము చైతన్యం అయితే బాగుంటుంది.

ప్రజలారా! మా వైఫల్యాలకు మా అభినందనలు అందుకోండి

  నిన్న అత్యవసరంగా సమావేశమయిన మన మంత్రి వర్గం చేసిన ఘన కార్యం ఏమిటంటే ప్రభుత్వ చర్యలను సమర్దిస్తూ తీర్మానాలు చేయడం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా సంఘటనా స్థలంకి వెళ్లడాన్నిఅభినందిస్తూ ఒక తీర్మానం, కేంద్రం అందించిన తోడ్పాటుకు అభినందిస్తూ మరో తీర్మానం, భాదితులకు ముఖ్యమంత్రి ఎక్స్ గ్రేషియా ప్రకటించడాన్నిసమర్దిస్తూ మరో తీర్మానం మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదించిందని మంత్రి అరుణకుమారి మీడియాకు చెప్పడం సిగ్గుచేటు.   ఇటువంటి ఆపత్కాలంలో, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వపరంగా ఏమి చర్యలు చెప్పటాలో ఆలోచించేబదులు, తమని తాము అభినందించుకొంటూ తీర్మానాలు చేసుకోవడం, మళ్ళీ ఆ విషయాన్ని చెప్పడానికి మీడియా ముందుకు రావడం సిగ్గుపడాల్సిన విషయం. ఒకవైపు తమ వైఫల్యాలు ప్రస్పుటంగా కనబడుతుండగా, తమ వైఫల్యాలకి సిగ్గుపడుతూ, ప్రజలను క్షమాపణలు కోరకపోగా, ఒకరికొకరు ఈ విధంగా అభినందనలు తెలుపుకోవడం భాదితులతో చేస్తున్నవికృత పరిహాసమే అవుతుంది.   ఇది మన ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతూ, ఈ దుర్ఘటన వల్ల వారి ఆలోచనలో వీసమంత మార్పుకూడా రాలేదని తెలియజేస్తోంది.ప్రజలు మనల్ని ప్రశ్నించ(లే)రు గనుక మనం మన వైఫల్యాలకు జవాబుదారిగా ఉండవలసిన అవసరం లేదని కిరణ్ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉంది. కానీ, రేపు ఆ ప్రజలలోనే ఎవరయినా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసు వేసినట్లయితే, అప్పుడు కిరణ్ ప్రభుత్వ పరిస్థితి ఏమిటనేది వారే ఆలోచించుకోవాలి. ఒకవేళ అదే జరిగితే అప్పుడు కూడా తాము ఇంతే దైర్యంగా ఈ అభినందనల తీర్మానాలను కోర్టుకు సమర్పిస్తే ఏమవుతుందో ఊహించుకొంటె మళ్ళీ ఇటువంటి పొరపాటులు చేయ సాహసించక పోవచ్చును.   రాష్ట్ర ముఖ్యమంత్రి, మరికొందరు కేంద్రమంత్రులు సంఘటనా స్థలానికి వెళ్లిరావడమే ఒక అబ్బురమయిన విషయంగా పేర్కొంటున్న మన కిరణ్ ప్రభుత్వం ఇటువంటి సంఘటనలే అమెరికాలో జరిగినప్పుడు, స్థానిక రాష్ట్ర మంత్రులకన్నా ముందుగా అక్కడికి ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా వెళ్లి ఏవిధంగా బాధితులకు సానుభూతి చెప్పారో, ఏవిధంగా సహాయ చర్యలను స్వయంగా పర్యవేక్షిన్చారో చూసి ఉంటే, ఈరోజు తమ పనితీరుకు, మాటలకి, ఈ అబినందలకి తప్పకుండా సిగ్గుపడేవారు.   నిఘా వర్గాలు హెచ్చరికలు లేనప్పుడు ఇటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వాలు తమ బాధ్యతల నుండి తప్పించుకోలేవు. అటువంటప్పుడు దాడులు జరగబోతున్నాయని పక్కా సమాచారం చేతిలో ఉంచుకొని కూడా స్పందించక అనేకమంది అమాయక ప్రజల ప్రాణాలను కోల్పోవడానికి కారణమయిన ప్రభుత్వం తనని తాను తిట్టుకొని సిగ్గుపడకపోగా ఈవిధంగా అభినందించుకొంటూ, మళ్ళీ ఆ విషయాన్నీ మీడియాకు ఎక్కి మరీ చాటింపు వేసుకోవడం పుండు మీద కారం చల్లినట్లు ఉంది.   ప్రతిపక్షాలను ఈ అంశంపై రాజకీయాలు చేయవద్దని సుద్దులు చెపుతున్న ప్రభుత్వం చేస్తున్న పని ఏమిటి? ఈ అభినందన ప్రకటనలు చూస్తుంటే, తమ నిర్లక్ష్యం ఖరీదు 13 నిండు ప్రాణాలని ప్రభుత్వానికి ఇంకా అర్ధం కాలేదనుకోవాలా? లేకపొతే, నిర్లక్ష్యం, నిఘా వైఫల్యాలు, నిర్లిప్తత కలబోసిన తమ ప్రభుత్వాన్నిఇటువంటి భూటకపు ప్రకటనలతో ప్రజల నుండి ఏమార్చే ప్రయత్నంలో ఈ అభినందన తీర్మానాలు చేసుకొన్నారని భావించాలా?   ఇప్పటికయినా కిరణ్ ప్రభుత్వం తమ కిరీటం, తమకు తాము తగిలించుకొన్న భుజకీర్తులు తీసి కొంచెం పక్కన పెట్టి, సాటి మానవులుగా ఆలోచించి దిద్దుబాటు చర్యలు చెప్పట్టడం మంచిది. అభినందన సమావేశాలకు బదులు, లోపాలు ఎక్కడ ఉన్నాయో, వాటిని సవరించుకోవడానికి తాము ఏమి చేయాలో వంటి విషయాలను చర్చించగలిగితే ప్రజలను ఉద్దరించినవారవుతారు.

మన ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేదెన్నడు?

  హైదరాబాదులో నిన్న జరిగిన బాంబు పేలుళ్ళు తరువాత పోలీసు అధికారుల హడావుడి, రాష్ట్రమంతటా రెడ్ఎలెర్ట్ ప్రకటన, ప్రభుత్వ ఎక్స్ గ్రేషియా ప్రకటనలు, దోషులను వదిలేదిలేదని ముఖ్యమంత్రి హామీలు, అధికార ప్రతిపక్షాల నిందారోపణలు అన్నీ ఒకదాని తరువాత మరొకటి చక్కగా పద్దతిగా జరిగిపోతూ, మనం వ్యవస్థలో అన్నివిభాగాలు కూడా సక్రమంగా పనిచేసుకుపోతున్నాయని నిరూపిస్తున్నాయి.   ఉగ్రవాదులు దాడిచేసే అవకాశం ఉందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రానికి ముందుస్తు హెచ్చరికలు చేసినప్పటికీ, సరిగా స్పందించక అలసత్వం ప్రదర్శించారని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని, ముఖ్యంగా పోలీసులను నిందిస్తున్నారు. అటువంటి హెచ్చరికలు నిత్యం వస్తున్నవేనని డీజీపీ దినేష్‌ రెడ్డి సర్దిచెపుతున్నారు.   నిన్న జరిగిన ఈ ప్రేలుళ్ళు, గతం నుండి మన ప్రభుత్వాలు ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోలేదని మరోసారి ఋజువు చేసాయి. గుణపాఠాలు నేర్చుకోకపోతే పోయె, కనీసం అటువంటి సంఘటనలు జరుగబోతున్నాయని తెలిసిన తరువాత కూడా అంత ఉదాసీనత చూపడం మనకే చెల్లు. తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పినట్లు, దేశ భద్రత మీద దృష్టి పెట్టవలసిన మన గూడచారి వర్గాలను, ప్రతిపక్షాల కదలికల మీద, వారి కార్యక్రమాల మీద దృష్టి పెట్టేందుకు మన ప్రభుత్వాలు వినియోగిస్తున్నపుడు వారి నుండి ఇంత కన్నాఎక్కువ ఏమి ఆశించగలమన్నమాటలు, నిఘా వ్యవస్థల వైఫల్యానికి కారణాలు తెలుపుతున్నాయి.   కేవలం, దోషులను పట్టుకొని ఉరితీసి, భాదితులకు ఎక్స్ గ్రేషియా విదిలించినంత మాత్రాన్న ప్రభుత్వ బాధ్యత తీరిపోదు. ప్రజల రక్షణకు వారే పూర్తీ బాద్యత వహించక తప్పదు. అందుకే వారిని ప్రజలు ఎన్నుకోన్నారని గ్రహించాలి.   అదే విధంగా, ప్రజలకు భద్రత కల్పించాల్సిన, పోలీసు శాఖను రాజకీయనాయకుల భద్రతకు, వీవీఐపీల రాకపోకల సమయంలో భద్రతకు, ఇతర పనులకు వినియోగించుకోవడం, ప్రభుత్వానికి ప్రజల భద్రతపై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలియజేస్తోంది. రాన్రాను పెరుగుతున్న ఉగ్రవాద దాడులను సమర్ధంగా ఎదుర్కొనేందుకు, ప్రత్యేకమయిన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసుకొనకపోగా, ఉన్న పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేయడం సిగ్గుచేటు.   ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, దొంగతనాలు, ఇతర చిన్న, పెద్ద నేరాలను చూసేందుకు ఏర్పాటు చేసుకొన్న మన పోలీసు వ్యవస్థను, ఉగ్రవాదులను పట్టుకోవడానికి కూడా ఉపయోగించు కోవలనుకోవడం అవివేకం తప్ప మరొకటి కాదు. అటువంటి క్లిష్టమయిన పనులను నిర్వహించేందుకు శిక్షణ పొందని పోలీసులను తప్పుబట్టే బదులు, వారి తలకు మించిన పనిని అప్పగించిన ప్రభుత్వాన్ని ఈ విషయంలో నిందించక తప్పదు.   గతంలో గోకుల్ చాట్, లుంభినీ పార్కుల వద్ద జరిగిన ఘటనల తరువాత, ప్రభుత్వం ‘అక్టోపస్’ అనే ఒక ప్రత్యేక ఉగ్రవాద నిరోధ సంస్థను సృష్టించింది. అయితే, అది కూడా సక్రమంగా పనిచేయట్లేదని ఇప్పుడు జరిగిన ప్రేలుళ్ళు నిరూపిస్తున్నాయి.   ప్రభుత్వం అంటే రాజకీయాలు, అధికారకోసం సిగపట్లు తప్ప మరొకటి కాదని నిరూపిస్తున్న మన రాజకీయ నాయకులు, ఇటువంటి క్లిష్టమయిన విషయాలలో సరయిన అవగాహన లేకపోవడం వల్లనే రాజకీయ జోక్యంతో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేస్తున్నారు. తత్ఫలితమే పునరావ్రుతమవుతున్న ఇటువంటి సంఘటనలు.   రాజకీయ నేతలలో మార్పు రానంతవరకూ, ప్రభుత్వాలలో కూడా మార్పులు ఆశించలేము. ప్రభుత్వాలలో మార్పులు రానంతవరకూ ప్రజలకి భద్రతను ఆశించలేము. మన ప్రభుత్వాలు కేవలం ‘ఫైర్ ఫైటర్’ పనికే పరిమితమవుతున్నాయి తప్ప, అసలు మంటలు అంటుకోకుండా నిరోదించే ప్రయత్నాలు మాత్రం చేయలేకపోతున్నాయి. అందువల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం కాక మానవని ప్రజలు కూడా తెలుసుకోవలసిన అవసరం ఉంది.

122 కోట్ల వైఎస్ జగన్ ఆస్తులు జప్తుకు రంగం సిద్దం

  అక్రమాస్తుల కేసులో జైలుపాలయిన జగన్ మోహన్ రెడ్డికి ఈ రోజు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. వివిధ కేసుల్లో అతని ఆస్తుల జప్తు కోరుతున్న ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఈ రోజు న్యాయప్రాధికార సంస్థ రూ.122కోట్ల విలువయిన జగన్ ఆస్తులను జప్తునకు ఆమోదం తెలిపింది. జగన్ మోహన్ రెడ్డికి సంబందించిన వేర్వేరు సంస్థలలో పెట్టుబడులకు నిధుల తరలింపులో చట్టాలను ఉల్లంఘించినట్లు ప్రాధమికంగా ద్రువీకరింపబడటంతో, న్యాయప్రాదికార సంస్థ జగన్ మోహన్ రెడ్డికి సంబందించిన వివిధ సంస్థలకు చెందిన రూ.122కోట్ల విలువయిన ఆస్తులను జప్తునకు ఈడీకి అనుమతి ఇచ్చింది. ఈ.డీ. స్వాదీనం చేసుకోనున్న జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల వివరాలు: 1.జగతి పబ్లికేషన్స్ కు చెందిన రూ.14.5కోట్ల విలువయిన ఫిక్సెడ్ డిపాజిట్లు.   2.జననీ ఇన్ఫ్రా కు చెందిన 13ఎకరాల స్థలం.   3.అరబిందో సంస్థకు చెందిన 96 ఎకరాల స్థలము మరియు రూ.3కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్లు.   4.హెత్రో డ్రగ్స్ సంస్థకు చెందిన 35 ఎకరాల స్థలము మరియు రూ.3కోట్ల ఫిక్సెడ్ డిపాజిట్లు.   5.హైదరాబాద్ లో గచ్చిబౌలీ వద్దగల బౌల్డర్ విల్లాలల 34ఇళ్ళ స్థలాలు.  

చంద్రబాబు ఆవేదన వలసలను అరికట్టగలదా?

  గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీనుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకోన్నాయి. ఇంకా ఎన్నికల గంట మ్రోగక మునుపే పరిస్థితి ఇలాఉంటే, రేపు ఎన్నికల ప్రకటన వెలువడ్డాక పరిస్థితి ఎలా ఉంటుందో అని తెలుగుదేశం పార్టీకి బెంగ మొదలయింది.   ఒకవైపు పార్టీ అధినేత ఎన్నికల ముందు పార్టీని పటిష్టపరిచే ప్రయత్నంలో తన ఆరోగ్యాన్నికూడా పణంగా పెట్టి మరీ శ్రమపడి పాదయాత్రలు చేస్తుంటే, మరో వైపు జగన్ మోహన్ రెడ్డి జైల్లోకూర్చొన్నప్పటికీ తన కార్యకర్తలను, నాయకులను ఆకర్షింఛి తనవైపు తిప్పుకోవడం ఇంకో విచారకరమయిన విషయంగ చెప్పుకోవచ్చును.   యం.యల్.సి. బొడ్డు భాస్కర రామారావు, ఇచ్చాపురం యం.యల్.ఏ. సాయి రాజ్, పాతపట్నం మాజీ యం.యల్.ఏ. మోహన్ రావు, అతని కుమారుడు వెంకట రమణ, భీమిలి పార్టీ ఇన్-చార్జ్ ఆంజనేయులు మొదలయిన వారు ఇటీవల కాలంలో పార్టీని వీడి జగన్ పంచన చేరారు. కారణాలు ఏమయినప్పటికీ, వలసలు మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు.   దీనిపై తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న చంద్రబాబు ‘అటువంటి వారు సంతలో పశువుల్లాగా జగన్ మోహన్ రెడ్డి విసిరిన డబ్బులకి అమ్ముడుపోతున్నారని’ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా ఇంచుమించు అదే రీతిలో స్పందిస్తూ ‘పార్టీవల్ల రాజకీయ జీవితం, పేరు ప్రతిష్టలు అన్నీపొందిన నేతలు ఇప్పుడు స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం తల్లివంటి పార్టీకి ద్రోహం చేసి బయటకు పోతున్నారు. అటువంటి వారిని ఏమనాలి? మోసగాళ్లనాలా, 420 గాళ్ళని పిలవాలా, లేక ఇంకేమని పిలవాలి’ అని ఆవేశంగా ప్రశ్నించారు.   అందుకు సమాధానంగా జగన్ మోహన్ రెడ్డి మద్దతుదారులు ‘ఈ విషయంలో మీ తండ్రి మాత్రం ఏమి తక్కువ తిన్నాడు’ అంటూ నిలదీస్తున్నారు.   అయితే, చంద్రబాబు, లోకేష్ లేదా మరెవరో బాధపడతారని రాజకీయనాయకులు తమ ఆలోచనలను మార్చుకోరు. ఈ విషయం చంద్రబాబుకి కూడా బాగా తెలుసు. పార్టీ నుండి వలసలు మొదలయ్యాయని బాధపడుతూ వెళ్ళేవాళ్ళను నిందించుతూ కాలక్షేపం చేసే బదులు, యుద్ద ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేప్పట్టి ఉంటే, ఏమయినా ప్రయోజనం ఉండేది. తద్వారా కనీసం ఇక ముందు వలసల జోరు ఖచ్చితంగా తగ్గి ఉండేది.   కానీ, పాదయాత్ర పైనే దృష్టి కేంద్రీకరించిన చంద్రబాబు నాయుడు, పార్టీపై ఇంకా పట్టు సాదించని లోకేష్ గానీ, మరే సీనియర్ నాయకులు గానీ ఈ విషయం పై శ్రద్ధ పెట్టకపోవడం వల్లనే ఇంకా వలసలు కొనసాగుతున్నాయి.   జైల్లో కూర్చొన్న జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ మీద వలవిసురుతున్నాడని వాపోయేబదులు, ఆ వల భారిన పడకుండా తన కార్యకర్తలని,నేతలని ఎలాగా కాపాడుకోవాలని ఆలోచించి ఉంటే ఫలితం ఉండేది. రాజకీయ పార్టీలు ఒకదానినొకటి ఆకర్షించుకోవడం నేడు కొత్తగా జరుగుతున్నదేమి కాదని అనుభవజ్ఞుడయిన చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసును. అటువంటప్పుడు పార్టీ అధినేతగా తానేమి చర్యలు చేప్పట్టి తన క్యాడర్ ను రక్షించుకోవాలో ఆలోచించాలి తప్ప, ఎదుటవాడిని ఆడిపోసుకోవడం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు.   ఇటీవల విశాఖ, కృష్ణా జిల్లాలలో పార్టీలో చెలరేగిన అంతర్ యుద్దాల వల్ల తలయెత్తిన అసంతృప్తిని ఆయన పూర్తిగా నివారించే ప్రయత్నం చేయకపోవడమే పార్టీ నిర్లిప్త ధోరణికి ఒక చక్కని ఉదాహరణ. ఏ రాజకీయ పార్టీ నాయకుడయినా ఎదో ఒక రకమయిన వ్యూహరచన చేసి శత్రువును యుద్దంలో ఓడింఛి తానూ గెలవాలనే ప్రయత్నిస్తాడు. అటువంటప్పుడు శత్రువును దీటుగా ఎదుర్కోవడానికి తగిన వ్యూహరచన చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చొని, శత్రువు తెలివిగా వ్యూహరచన చేస్తున్నాడని ఆరోపించడం అవివేకం.

ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పుచ్చుకోలేను: జానారెడ్డి

  కొందరు నేతలకి తాము ప్రధాన మంత్రి పదవికి అర్హులమనిస్తుంది. మరి కొందరికి ముఖ్యమంత్రి పదవికి తాము అన్ని విధాల అర్హులమనిపిస్తుంది. కానీ, ఎన్ని సం.లు ఎదురుచూసిన ఆ అవకాశం రానప్పుడు కడుపులో ఉన్నఆ మంట అప్పుడపుడు ఏదో ఒక రూపంలో లావాలా బుసబుసమని బయటకి ఉబికి వస్తోంటుంది. తనకు దక్కని అందలం వేరొకరికి దక్కడం ఆ మంటని మరింత రాజేస్తుంది. అప్పుడు, అది దక్కినవారిపై ఒకటీ అరా విసుర్లు తప్పవు.   ఇటువంటి తీరని కోరికతో ‘రాజకీయ నరకం’ అనుభవిస్తున్న పంచాయితీ రాజ్ శాఖా మాత్యులు కే.జానారెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవచేసుకొని తరించాలని ఉందని నిన్ననే మరోమారు ప్రకటించారు. అయితే, ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చేస్తే మాత్రం ఆయన పుచ్చుకోలేనని ఆయన తెగేసి చెప్పారు. తెలంగాణా ఇచ్చిన తరువాత అయితేనే తనకు వీలవుతుందని చెప్పారు. ఇక ముఖ్యమంత్రి పదవికి ముహూర్తం కూడా ఆయనే నిర్నయించేసుకొన్నారు గనుక, ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి గారి పదవికి ఆయన ఎసరు పెట్టబోవడం లేదని స్పష్టం అయింది.   అయితే, తానూ పార్టీ టికెట్ కోసం కానీ,మంత్రి పదవికోసం గానీ ఎప్పుడూ ఎవరి కాళ్ళు పట్టుకోలేదని, అన్నీ వాటంతటవే వచ్చి తన ఒళ్లో పడ్డాయని తెలియజేసారు. అందువల్ల ఇవాళ కాకపొతే రేపయినా ముఖ్యమంత్రి పదవికూడా అదేవిధంగా వచ్చి ఆయన ఒళ్లో పడుతుందని భావిస్తునట్లున్నారు. ముఖ్యమంత్రి పదవి ఆశించేవారు, లేదా ఆ పదవిలో ఉన్నవారు డిల్లీలో పైరవీలు చేసుకొంటారు అని ఒక చిన్నసన్నాయి నొక్కునొక్కి పనిలోపనిగా తన నోటి దురద కూడా తీర్చుకొన్నారు.   తనకి దురద ఉంటే గోక్కోవడం ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ఎదుట వాడిని గోకుతానంటేనే ఇబ్బంది వస్తుంది. ఇన్నేళ్ళుగా పార్టీకి సేవలందిస్తున్నపటికీ, తనని కాదని కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవినీయడం ఆయన కడుపులో మంటకు కారణం అయింది. అందుకే, ముగింపుగా ఆయన పై ఒక చిన్నవిసురు విసిరి జానారెడ్డి తన కడుపులో మంటను చల్లార్చుకొన్నారు.   అయితే, దానివల్ల తన కడుపు మంట చల్లారినా, కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించడం ద్వారా ఆయనతో కయ్యానికి కాలు దువ్వడమే కాకుండా, కాంగ్రెస్ అధిష్టానం  పైరవీలకే మొగ్గు చూపుతుందనే నిందవేసి, తన గోతిని తానే తవ్వుకొన్నారు పాపం. అధిష్టానం వద్ద మంచి పేరున్న కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన మాటలను సోనియాగాంధీ చెవిలో వేస్తే, ఇక ఆయన ఈ జన్మకి ముఖ్యమంత్రి కాలేరని తెలుసుకోక నోరుజారారు.   బహుశః ఇటువంటి నోటి దురద ఉన్నందునే కాంగ్రెస్ అధిష్టానం ఆయనని ఎప్పుడూ కూడా లెక్కలోకి తీసుకోలేదు. జానా రెడ్డి ఆరోపిస్తున్నట్లుగా పైరవీల సంగతి పక్కన పెడితే రోశయ్య, రాజశేఖర్ రెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారందరికీ కేవలం వారి విశ్వసనీయత కారణంగానే ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. పార్టీ అధిష్టానం పట్ల అచంచమయిన విశ్వాసం, తమ సమర్ధతను పార్టీ గుర్తించేలా చేసుకోవడం ద్వారానే వారికి ఆ పదవి దక్కింది. కానీ, జానారెడ్డిలో అవే లోపించినట్లు  కాంగ్రెస్ అధిష్టానం భావించడం వల్లనే ఆయన కల సాకారం కాలేకపోతోంది. గత కొన్ని నెలలుగా తెలంగాణా అంశం పై ఆయన పార్టీని ఏవిధంగా ఇరుకున పెట్టారో చూసినట్లయితే, కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ఎందుకు విశ్వసించడం లేదో ఆయనకే అర్ధం అవుతుంది.

అన్నాజీ ప్రజలను తప్పుపట్టనేల?

  దేశంలో అవినీతిని అంతం చేసేందుకు కంకణం కట్టుకొని తిరుగుతున్న సామాజిక ఉద్యమకారుడు అన్నహజారే నిన్న హైదరాబాదులో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ, దేశం నుండి అవినీతిని తరిమికొట్టేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 120 కోట్ల మంది భారతీయులలో తానూ కనీసం 6కోట్ల మందిని ప్రభావితం చేయగలిగినా తన ఉద్యమ లక్ష్యం సాదించగలనని అన్నారు. ప్రస్తుతం పార్లమెంటు ఆమోదించిన లోక్ పాల్ బిల్లుతో కేవలం 50 శాతం అవినీతిని మాత్రమే రూపుమాపగలమని, మిగిలిన దానిని అంతం చేయడానికి యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.   అన్నాహజారే అవినీతి వ్యతిరేఖంగా చేపట్టిన ఈ ఉద్యమంలో దేశాన్ని ప్రేమిస్తున్నామనుకొన్న ప్రతీ భారతీయుడు పాలుపంచుకోవలసిందే. లేదంటే ఏదో ఒకనాడు అవినీతి దేశాన్నేకబళించి వేయడం ఖాయం.   అయితే, ప్రజలను చైతన్యపరచి, దీక్షలుచేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం ప్రతీసారీ సాద్యం కాకపోవచ్చును. రెక్కాడితే గాని డొక్కాడని మధ్యతరగతి ప్రజలు ఆయన పిలుపందుకొన్న ప్రతీసారీ వచ్చి రోజుల తరబడి ఉద్యమాలు చేయలేరు. అందువల్ల తన పిలుపుకు ప్రజలు తగినరీతిగా స్పందించడం లేదనే ఆయన ఆవేదన అర్ధరహితం.   గనుక, దీనికి సరయిన ప్రత్యామ్నాయ పరిష్కారం ఏమిటంటే అన్నాహజారే కూడా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవడమే. తనవంటి నిజాయితీ పరులయిన వ్యక్తులతో ప్రభుత్వం ఏర్పరచగలిగినప్పుడే, ఆయన ఆలోచనలను, ఆశయాలను అమలు చేయడం వీలవుతుంది తప్ప కేవలం నిరాహార దీక్షలు, సభలు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని దానిలోని అవినీతిని నియంత్రించడం సాద్యం కాదని ఆయన గ్రహించవలసిఉంది. లేకుంటే, ఆయన పోరాటం కూడా, సమాజంలో మార్పు తేవాలని దశాబ్దాల తరబడి సాయుధ పోరాటం చేస్తున్న నక్సల్స్ పోరాటాల మాదిరిగానే వ్యర్ధమయిపోతుంది.   బహుశః ఈ ఆలోచనతోనే అయన సహచరుడు అరవింద్ కేజ్రీవాల్ ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ని స్థాపించి రాజకీయ ప్రవేశం చేసారు. అయితే, ఆయన గురించి అందరికంటే బాగా ఎరిగిన అన్నాహజారే ఆయన అభిప్రాయంతో ఏకీభవించకపోగా, ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళదలచిన ఆయనను విమర్శించడం ద్వారా, ‘అవినీతిపై పోరాటం’ అనే అంశంపై కేవలం తన పోరాటం ద్వారానే సాద్యం అని ఆయన భావిస్తున్నట్లుంది.   దేశానికి స్వాతంత్రం సాదించడానికి మహాత్ముడు ఒక పంధా ఎన్నుకొంటే, నేతాజీ, అల్లూరి, భగత్ సింగ్ వంటివారు మరో పంధాను ఎన్నుకొన్నారు. గానీ, వారి అందరి అంతిమ లక్ష్యం దేశానికి స్వాతంత్రం సాదించడమేనని మన అందరికీ తెలుసు. ఆనాటి పరిస్థితుల్లో అది సమర్ధనీయమే. కానీ, మారిన నేటి పరిస్థితుల్లో దేశం అంతా ఒక్కతాటిపై ఉన్నపుడు కూడా ఒక గొప్ప లక్ష్యాన్ని సాదించడానికి ఆత్మాభిమానాలు అడ్డురావడం గర్హనీయం.   యువతను తనతో చేయి కలపమని అన్నాహజారే కోరే బదులు, వారితో ఆయనే చేతులు కలిపి వారినొక సమిష్టిశక్తిగా తీర్చిదిద్దేందుకు తగిన మార్గదర్శనం చేయగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చును.

అలుపెరుగని బహుదూరపు బాటసారులు

  ఇది పాదయాత్రల సీజను. ‘పాదయాత్ర చేస్తే అధికారంలోకి రావడం ఖాయం’ అనే ఒక కొత్త సిద్దాంతం కనిపెట్టిపోయిన మహానుభావుడు స్వర్గీయ డా.రాజశేఖర్ రెడ్డికి శతకోటి వందనాలంటూ అయన కుమార్తె షర్మిల, అయన బద్ధవిరోధి చంద్రబాబు పాదయాత్రలు మొదలుపెట్టారు. అయితే, ఇద్దరూ పాదయాత్రలు చేస్తున్నారు గనుక, ఇద్దరికీ అధికారం ఎలా దక్కుతుందనేది మిలియన్ డాలర్ ప్రశ్న. కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ఇంత కష్టపడి పాదయాత్రలు చేయట్లేదు గనుక ఆ పార్టీ ఓడిపోతుందా? అనే ధర్మసందేహం కూడా మిగిలుంది.   వయసు మీదపడి ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ చంద్రబాబు ముందుకు సాగుతుంటే, మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొని షర్మిల ముందుకు సాగుతున్నారు. వీరిరువురి పాదయాత్రలో చాలావిషయాలలో సారూప్యత కనిపిస్తుంది.   ఒకరు ‘వస్తున్నా మీ కోసం’ అంటే మరొకరు ‘మరో ప్రజా ప్రస్థానం’ అంటున్నారు. ఇద్దరూ కూడా ప్రజల కోసమే వస్తున్నట్లు తెలియజేస్తున్నారన్నమాట.   ఇద్దరూ కూడా రాయలసీమలోనే పాదయాత్రలు మొదలుపెట్టారు. (చంద్రబాబు అనంతపురం జిల్లా, హిందూపురం నుండి ఆరంభిస్తే, షర్మిల ఇడుపులపాయ కడప జిల్లా నుండి ఆరంభించారు.)   ఇద్దరూ కూడా తెలంగాణాలోనే తమ 1000 కిమీ పాదయాత్ర రికార్డులు సాదించారు. ఇద్దరూ కూడా కాంగ్రెస్ భారినపడి కష్టాలనుభవిస్తున్న ప్రజలను ఒదార్చడానికే పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. గానీ, వారిద్దరూ కూడా తమ పార్టీలు అధికారంలోకి రావాలనే లక్ష్యంతోనే ప్రజలను ఓట్లేయమని కోరుతున్నారు.   ఇద్దరికీ ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీయే. (అదనంగా ఆ రెండు పార్టీలు ఒకరికొకరు శత్రువులు.)   ఇద్దరూ కూడా ఎదుట పార్టీయే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయిందని గట్టిగా చెపుతున్నారు.   షర్మిల తమ పార్టీని ఎన్నుకొంటే ‘రాజన్న రాజ్యం’ వస్తుందని చెపుతుంటే, చంద్రబాబు ‘రామరాజ్యం’ వస్తుందని అంటున్నారు.   ఇద్దరూ కూడా కాళ్ళ సమస్యల వల్లనే మద్యలో పాదయాత్రలు ఆపవలసి వచ్చింది.   బహుశః ఇద్దరూ కూడా రాష్ట్రంలో చిట్టచివరి జిల్లా అయిన శ్రీకాకుళంలోనే తమ పాదయాత్రలను ముగించే అవకాశం ఉంది.

బాబు పాదయాత్ర అనివార్యమా?

  నిన్న జరిగిన చిన్న ప్రమాదంలో చంద్రబాబు కుడి కాలు బెణికినప్పటికీ ఆయన దాదాపు ఒక కిమీ దూరం నడిచి, కాలు నొప్పి ఎక్కువ అవడంతో తన పాదయాత్ర నిలిపివేయక తప్పలేదు. కానీ, ఎన్ని ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నపటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిర్ణయించుకొన్నారు. అయితే, అయన ఆరోగ్యం పణంగా పెట్టి మరీ పాదయాత్ర చేయవవలసిన క్లిష్ట పరిస్థితులు పార్టీలో కానీ, రాష్ట్రంలో గానీ ఉన్నాయా? తీవ్ర ఆరోగ్య సమస్యలతో కూడా ఆయన తన పాదయత్ర కొనసాగించడం అంత అత్యవసరమా? అని ఆలోచించుకోవలసింది ఆయనే. ఏ పాదయాత్రతో ఆయన పార్టీని పటిష్టపరచి తిరిగి అధికారంలోకి రావలనుకొంటున్నారో, రేపు అదే పాదయాత్ర ఆయనను మంచం ఎక్కిస్తే ఆయన ఈ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని ఆయన గ్రహించాలి. పార్టీలోఉన్న అనేక మంది అతిరధమహారధులను సమన్వయపరచి, వారికి పార్టీని పటిష్టపరిచే బాధ్యతలు అప్పగించి, తను కేవలం పర్యవేక్షణకే పరిమితమయి ఉండి ఉంటే, బహుశః తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం వెల్లివిరిసి ఉండేదేమో. కానీ, ఆయనను ఆపని చేయకుండా ఆపుతున్న కారణాలేమిటో ఆయనకు, ఆ పార్టీ నేతలకే తెలియాలి. బహుశః అది ప్రజలకు, రాజకీయ వర్గాలలో తప్పుడు సంకేతాలు అందిస్తుందని ఆయన అభిప్రాయం కావచ్చును. తన సారధ్యంలో వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలనే ప్రయత్నంలో చంద్రబాబు అవసరమయిన దానికన్నా ఎక్కువే శ్రమ పడుతున్నారని చెప్పవచ్చును. గతంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి, పాదయత్ర చేయడం ద్వారానే ముఖ్యమంత్రి కావాలనే తన కలను సాకారం చేసుకొన్నారు గనుక, ఇప్పుడు, తమ పార్టీలను తిరిగి అధికారంలోకి తీసుకురావాలంటే తప్పనిసరిగా పాదయాత్రలు చేయాలనే ఒక అపోహ మన రాజకీయపార్టీలలో ఏర్పడినందునే చంద్రబాబు, షర్మిలా ఇద్దరూ కూడా ఆరోగ్యాన్ని లెక్క చేయక పాదయాత్రలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ ఆలోచనే సరయినదనుకొంటే, ఏ పాదయాత్రలు చేయని కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకోవట్లేదని భావించవలసి ఉంటుంది. ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్న కారణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తన ఉనికిని కాపాడే ప్రయత్నంలో షర్మిల పాదయత్ర చేయడం సమజసం అనుకోవచ్చును. కానీ, అటువంటి సమస్యలు లేని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోగ్య సమస్యలతో సతమత మవుతూ కూడా పాదయాత్ర కొనసాగించవలసిన అవసరం ఉందా అని ఆయన, పార్టీ నేతలే ఆలోచించుకోవాలి.

తెలుగు సినిమాకు కొత్త రాజుగారు

  ‘లీడర్’ వంటి ఒక మంచి సినిమాతో తన నటప్రస్థానం ప్రారంభించిన దగ్గుబాటి రానా, ఇతర చిన్నా,పెద్ద నటులవలే కాకుండా విభిన్నమయిన పాత్రలు ఎంచుకొంటూ తన కెరీర్ తొలిదశలోనే ఎవరూ ఊహించని వేగం అందుకొన్నాడు. సాధారణంగా, ఆ దశలో ఉన్న నటులెవరయినా సినీ పరిశ్రమలో నిలద్రొక్కుకొనేవరకూ మాస్ మసాల సినిమాలు చేస్తుంటారు. గానీ, రాణా మాత్రం తన కెరీర్ తొలి దశలోనే బాలివుడ్ వైపుకు కూడా వెళ్లివచ్చేయడమే కాక, ‘కృష్ణం వందే జగద్గురం’ వంటి విభిన్నమయిన సినిమాలు చేసి అందరిని మెప్పించగలిగాడు. తత్ఫలితంగా విజయానికి, కొత్త ఆలోచనలకి మారు పేరయిన రాజమౌళి వంటి దర్శకుల దృష్టిలో పడి, మరింత విభిన్నమయిన పాత్రలు చేసే అవకాశం దక్కించుకొన్నాడు.   తెలుగు చిత్ర పరిశ్రమలో చాలారోజుల తరువాత ‘బాహుబలి’ అనే పేరుతొ తయారవుతున్న ఈ జానపద చిత్రంలో రాణాకు అవకాశం దొరకడమే కాక, అందులో ప్రభాస్ కు వ్యతిరేఖంగా ప్రతినాయకుడి పాత్ర పోషించే అవకాశం కూడా దక్కించుకొన్నాడు.   మన తెలుగు సినీ పరిశ్రమలో స్వర్గీయ నందమూరి తారక రామారావు, స్వర్గీయ యస్వీ.రంగారావు, గుమ్మడి, అక్కినేని,శోభనబాబు, కృష్ణ వంటి వారు మాత్రమే, తమ హీరో ఇమేజ్ ను పక్కన పెట్టి విభిన్నమయిన పాత్రలు పోషించి, ఆచంద్రార్కం నిలిచిపోయే కీర్తి ప్రతిష్టలను స్వంతం చేసుకోగలిగారు. అయితే, మారిన సామాజిక పరిస్థితుల్లో అటువంటి పాత్రలు చేసే దైర్యం కానీ అవకాశాలు గానీ నేటి హీరోలెవరికీ లేవని చెప్పక తప్పదు. అటువంటి గొప్ప అవకాశం దక్కించుకొన్న దగ్గుబాటి రాణా దానిని సద్వినియోగపరుచుకొంటాడనే ఆశించవచ్చును.   దగ్గుబాటి రాణా ఎటువంటి హీరో ఇమేజ్ తనని కబళించక మునుపే విభిన్నమయిన పాత్రలు పోషించే అవకాశం పొందడం ఆయన అదృష్టం అనే చెప్పాలి. ప్రభాస్, రాణా, అనుష్క, రాజమౌళి నలుగురు కలిసి చేస్తున్న ఈ సినిమా విజయవంతమయితే, మన సినీ పరిశ్రమకి కొత్త నటులు దొరకడమే కాకుండా, మన నిర్మాతలు, హీరోలు దైర్యంగా ప్రయోగాలు చేసేందుకు కూడా అది దోహదపడుతుంది.   ఇక దగ్గుబాటి రాణా ‘బాహుబలి’ జానపద సినిమాతో బాటు, చారిత్రాత్మక సినిమా ‘రాణీ రుద్రమదేవి’ కూడా చేయనున్నాడు. అందులో నిడవర్ద్యపురం ( నిడదవోలు) యువరాజైన చాళుక్య వీరభద్రుడి పాత్ర అతను పోషిస్తున్నాడు.   ఇక, అనుష్క పోషిస్తున్న రాణీ రుద్రమదేవి పాత్ర చుట్టూ తిరగే ఈ సినిమాలో నటించడం రాణాకు నిజంగా కత్తిమీద సామే అవుతుంది. ఎందుకంటే, ఇప్పటికే అరుందతి సినిమా ద్వారా అటువంటి రాజరిక పాత్రలు చేయగల గొప్ప నటిగా నిరూపించుకొన్న అనుష్క, శక్తివంతమయిన రాణీ రుద్రమదేవిగా తెరమీద ఉన్నపుడు ఆమెకు సరితూగేలా నటించడం రాణాకు చాల క్లిష్టమయిన పని అవుతుంది. కనుక దగ్గుబాటి రాణా సినీ ప్రస్థానంలో ఈ రెండు సినిమాలు చాలా కీలకమయినవని చెప్పవచ్చును. అందువల్ల, ఈ సినిమా ద్వారా రాణా తనను తానూ మరో మారు ఆవిష్కరించుకొనే అవకాశం పొందాడు. ‘రాణీ రుద్రమదేవి’ సినిమాకు గుణశేకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

చంద్రయానంలో మరో కొత్త మైలు రాయి

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన పాదయాత్రలో నేడు మరో సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. ఈ రోజు గుంటూరు పట్టణంలో స్థానిక ఆర్.టీ.సి. బస్ స్టాండ్ వద్ద చేరుకోవడంతో ఆయన 2000 కిమీ పాదయాత్ర పూర్తవుతుంది. గత అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో హిందూపురం వద్ద తన పాదయాత్ర ఆరంబించిన చంద్రబాబు నాయుడు, ఇంతవరకు అనివార్యమయిన పరిస్థితుల్లో తప్ప ఈ ఐదున్నర నెలలూ ఎక్కడా ఆపకుండా తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం సహకరించనప్పటికీ 63 ఏళ్ల వయసులో ఆయన అంత దూరం నడవడం కూడా గొప్ప విషయమే.   ఆయన ఇంతవరకు 107 పట్టణాలు, 107 మండలాలు, 55 నియోజకవర్గాలు, 2 నగరాలలో పాదయత్ర చేసి 12 జిల్లాలలో పర్యటించి, ఇప్పుడు 13వ జిల్లా గుంటూరులో గత వారం రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు.   కాంగ్రెస్ పాలనలో దుర్బర జీవితం అనుభవిస్తున్న ప్రజలను పరమార్శించాడానికే పాదయాత్ర అని ఆయన చెపుతున్నపటికీ, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలనే ప్రయత్నం, తాపత్రయం కూడా అందులో ఉంది. ఇతర పార్టీలు కూడా ఆయన బాటలోనే ముందుకు సాగుతున్నపటికీ ఆ సంగతిని ప్రస్తావించకుండా, ఆయనను విర్శించడం అహేతుకం. ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన తన పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రచారం చేసుకోవడంలో తప్పు ఏమి లేదు.   ఆయన పాదయాత్ర చేస్తూ ప్రజల మద్య ఉన్న తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను, తప్పుడు నిర్ణయాలను, వాటి ఫలితాలను గ్రామీణ ప్రజలకు సైతం అర్ధమయ్యే రీతిలో వివరించి మరీ ఆ పార్టీని ఎండగట్టడం ద్వారా, జగన్ మోహన్ రెడ్డి అవినీతి గురించి పదేపదే ప్రజలకు వివరించుతూ ఆ రెండు కాంగ్రెస్ పార్టీలకి తెలుగుదేశం పార్టీయే ఏకైక ప్రత్యామ్నాయం అనే భావన ప్రజలలో కల్పించేందుకు ఆయన చాల శ్రమించారు.   అయితే, ఆయన మాటలను ప్రజలు ఎంతవరకు విస్వశిస్తున్నారనేది ఎన్నికలు వచ్చి, ఫలితాలు వెలువడితే తప్ప తెలియదు. రాజకీయ చైతన్యం తొణికిసలాడుతున్న గ్రామీణ ప్రజలు ఏ రాజకీయ పార్టీ, నాయకుడు వచ్చినా, వారు నిర్వహించే సభలు, పాదయత్రాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అందువల్ల ఈ రోజుల్లో ప్రజల నాడిని పట్టుకోవడం రాజకీయ పార్టీలకు సైతం కష్టం అవుతోంది.   అందువల్ల చంద్రబాబు తన సుదీర్ఘమయిన ఈ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలను స్వయంగా పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకొంటూ, అదే సమయంలో అక్కడి ప్రజలకు తెలుగుదేశం పార్టీని పునర్ పరిచయం చేస్తూ, తన కార్యకర్తలను కూడా స్వయంగా కలుసుకొని వారి సాధక బాధకాలను తెలుసుకొంటూ తన పార్టీని ప్రజలతో మమేకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల తక్షణ ఫలితాలు కనబడకపోయినప్పటికీ, రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కి ఇది ఎంతో మేలు చేసే అవకాశం ఉందని చెప్పవచ్చును. ఇదే క్రమంలో, ఆయన వివిధ ప్రాంతాల నాయకుల మద్య తలయెత్తిన తీవ్ర విబేధాలు కూడా పరిష్కరించే ప్రయత్నం చేయడం కూడా ఆ పార్టీని బలోపేతం చేయవచ్చును.   రికార్డులు, మైలురాళ్ళ పట్ల ఆయనకీ ఆసక్తి లేకపోయినపటికీ, నిర్విరామంగా కొనసాగుతున్న ఆయన పాదయాత్రలో అటువంటివన్నీ సహజంగానే సిద్ధిస్తున్నాయి. అయితే, ఆరోగ్యం సహకరించనపటికీ, జనవరి 26వ తేదీతో ముగియవలసిన తన పాదయత్రను ఆయన ఇంకా కొనసాగించడం ఆయన కుటుంబ సభ్యులను, పార్టీని కలవరపరుస్తోంది. బహుశః 2000కిమీ. మైలు రాయి దాటుతున్న సందర్భంగా మళ్ళీ వారందరూ పాదయత్ర నిలిపివేయమని ఆయనపై మరోమారు ఒత్తిడి తేవచ్చును.

కిరణ్ కుమార్ పై ప్రతిపక్షాల (అ) విశ్వాసం!

  కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం మీరు పెట్టండంటే, ఆ పని మీరే చేయోచ్చుకదా అంటూ ప్రతిపక్షాలన్నీవాదులాడుకొంటుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోబాటు, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నవ్వుకొంటున్నారు. జగన్ ఉఫ్ మని ఊదితేనే తన ప్రభుత్వం పడిపోతుందని తెలిసినప్పటికీ, “దమ్ముంటే నా ప్రభుత్వాన్నిపడగొట్టండి” అని ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సవాలు విసిరినపట్టికీ, ఏ పార్టీ కూడా దైర్యం చేయలేకపోతున్నాయి.   ఎప్పుడు వీలుచిక్కితే అప్పుడు ప్రభుత్వాన్ని దింపేసి, అధికారంలోకి వచ్చేదామని ఆత్ర పడే మన రాజకీయ పార్టీలు అసలు ఇంతమంచి అవకాశం వచ్చినా ఎందుకు వదులుకొంటున్నాయి? బలహీనంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు ఎందుకు ఇంతగా వెనకాడుతున్నాయి?   నిజం చెప్పుకోవాలంటే ప్రతీ పార్టీకి ఓ కారణం ఉంది. తెలుగుదేశంపార్టీకి, కిరణ్ ప్రభుత్వాన్ని పడగొట్టడం ఇప్పుడు చేతిలో పనే అయినప్పటికీ, తెలంగాణాకు అనుకూలంగా నిర్ణయం తీసుకొన్నకారణంగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కోవడం పార్టీకి నష్టం కలిగిస్తుందని భావిస్తుండవచ్చును. కేంద్రం తెలంగాణా అంశం తేల్చిన తరువాతనో, తేల్చకుండానో తనంతట తానే ఎన్నికలు తెస్తే, అప్పుడు తెలంగాణాపై తను తీసుకొన్న నిర్ణయం ప్రభావం తన మీద పడకుండా తప్పించుకోవచ్చునని, తెలుగుదేశం పార్టీ కిరణ్ ప్రభుత్వానికి దూరంగా ఉంటోంది.   జగన్ మోహన్ రెడ్డికి ఇంతవరకు బెయిలు రానందున ఈ తరుణంలో తమ మద్దతుతో నడుస్తున్న కిరణ్ ప్రభుత్వాన్ని పడగొడితే, తమ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు ఎన్నికలని ఎదుర్కోవడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్టమే, గనుక తమ నాయకుడు జైలు నుండి విడుదల అయ్యేవరకూ కిరణ్ ప్రభుత్వం అధికారంలో కొనసాగాలని ఆ పార్టీ కోరుకొంటూ ఉండవచ్చును. కనుక, జగన్ మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అయిన మరుక్షణం కిరణ్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ పడగొట్టే అవకాశం ఉంది. (ఈ సంగతి బాగా తెలిసున్నకాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తనకి పరిస్థితులు సానుకూలం అయ్యేవరకు జగన్ మోహన్ రెడ్డిని జైలుకే పరిమితం చేయడం కూడా అనివార్యం అవుతుంది.)   ఇక, రాష్ట్రంలోకానీ, కేంద్రంలోగానీ అధికారంలోలేని కారణంగా వెంటనే ఎన్నికలు రావాలని కోరుకొనే భారతీయజనతాపార్టీ కూడా, తమ పార్టీని వచ్చే ఎన్నికలలో నడిపించే నాయకుడి పేరు ఖరారు అయ్యేవరకు, ఎన్నికలకి కొంత సమయం అవసరమని భావిస్తోంది. ఎలాగూ, ఎవరూ అవిశ్వాసం పెట్టే దైర్యం చేయరు గనుక, ఎవరయినా పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని కిషన్ రెడ్డి ఓ ప్రకటన చేసి చేతులు దులుపుకొన్నారు.   కిరణ్ కుమార్ రెడ్డి కూడా తమ అధిష్టానం తెలంగాణా అంశం తెల్చేవరకూ ఎన్నికలు రావాలని కోరుకోవట్లేదు. ఈ సమయంలో ఎన్నికలు వస్తే తమ పార్టీకి లాభం కన్నానష్టమే ఎక్కువని ఆయనకు తెలుసు. అందువల్ల ఈ పరిస్థితులన్నీ బాగా ఎరిగిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా అవిశ్వాసం పెట్టమని ప్రతిపక్షాలను సవాలు చేసినప్పటికీ, వారు ఆపని చేయలేరని తెలుసు గనుకనే ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దైర్యంగా సవాలు విసురుతున్నారు.   ఈ పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే దానివల్ల ఏమయినా లాభపడేది ఒక్క తెరాస మాత్రమే. అయితే, తెరాస కూడా సంస్థాగతంగా ఎన్నికలకి పూర్తి స్థాయిలో తయారుకానందున, మరికొంత కాలం పాటు కిరణ్ ప్రభుత్వం కొనసాగడమే మేలని భావిస్తుండవచ్చును. మరి కొంత కాలం కిరణ్ కుమార్ ప్రభుత్వం కొనసాగితే, వచ్చే శాసన సభ సమావేశాల్లో తెలంగాణా అంశంపై మరికొంత గలాటా చేసి కాంగ్రెస్ పరువు తీసి, తమ పార్టీని మరింత బలపరుచుకోవచ్చునని తెరాస ఆలోచన కావచ్చును.   ఇక, చివరాఖరుగా చెప్పుకోవలసిన పార్టీ మజ్లిస్. తన ఇద్దరు నేతలు ప్రస్తుత కేసులనుండి విముక్తి పొందడమో, లేక కనీసం ఎన్నికల తంతు పూర్తయ్యేవరకు బెయిలుపై బయట తిరిగే అవకాశం పొందడమో జరిగితే తప్ప, ఎన్నికలకు వెళ్లి ప్రయోజనం లేదని భావిస్తునందున ఆ పార్టీ కూడా అవిశ్వాసంపై వెనకాడుతోందని భావించవచ్చును.   ఈవిధంగా ప్రతీ పార్టీకి దేని కారణాలు దానికి ఉండటంతో కిరణ్ కుమార్ ప్రభుత్వానికి ప్రస్తుతం అవిశ్వాస పరీక్ష ఎదుర్కొనే ప్రమాదం తప్పింది. అయితే, రాజకీయాలలో పరిస్థితులు ఎప్పుడయినా మారిపోయే అవకాశం ఉంది గనుక, కిరణ్ కుమార్ ఇక రోజులు లెక్కబెట్టుకోవచ్చునని చెప్పవచ్చును.

తెలంగాణా ఉద్యమానికి శల్య సారధ్యం చేస్తున్నకేసీఆర్?

  అలనాడు మహాభారతంలో రధం నడపడంలో ప్రవీణుడయిన శల్యుడిని తన రధసారధిగా చేసుకొంటే, యుద్ధంలో అవలీలగా విజయం సాధించగలననుకొన్న కర్ణుడిని, ఆ శల్యుడే రకరకాల ప్రశ్నలు వేస్తూ అతని శక్తి యుక్తులమీద అతనికే అపనమ్మకం ఏర్పడేలా చేసి, అతని ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బ తీసి, చివరికి అతని ఓటమికి కారకుడయ్యాడు.   ఇక తెలంగాణా విషయానికి వస్తే కేసీఆర్ కూడా శల్య సారధ్యమే చేస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణా ఉద్యమం పతాక స్థాయికి చేరుకొన్న ప్రతీసారీ ఆయన తన ప్రసంగంతోనో, లేక రాజకీయ ఎత్తుగడతోనో దానికి బ్రేకులు వేయడమేగాకుండా వెనక్కి కూడా నడిపిస్తుంటారు. ఆయన ఒకసారి, హైదరాబాదు ఎవరికీ చెందాలనే అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామని ఒక ప్రకటన చేసి తెలంగాణా ఉద్యమం చేస్తున్నపార్టీల గుండెల్లో ఒక బాంబు పేలుస్తారు, మరోసారి నోటికీ వచ్చినట్లు జాతీయ నాయకులను తూలనాడి, కాంగ్రెస్ వారిని ఉద్యమానికి దూరం చేస్తారు.   అందరిమీద పెత్తనం చెలాయిస్తూ, తెలంగాణాపై తనకొక్కడికే సర్వ హక్కులు ఉన్నట్లు మాట్లాడే ఆయన ధోరణివల్ల, తెలంగాణా జేయేసీలో చీలికలు సృష్టించి ఉద్యమానికి బ్రేకులు వేసిన పాపం ఆయనదే. అదే విధంగా మిగిలిన వారిని కాదని సమరదీక్ష సభలో పెత్తనం చేలాయించినందుకు భారతీయజనతా పార్టీతో సహా అనేక పార్టీలు తెలంగాణా జేయేసీకు క్రమంగా దూరం జరగడం మొదలుపెట్టాయి.   బహుశః కేసీఆర్ కోరుకొంటున్నది అదే కావచ్చును, ఎందుకంటే తెలంగాణా పోరాటం చేస్తున్నఖ్యాతి, దాని ఫలాలు తనకు, తన పార్టీకే దక్కాలనే దురాలోచనే ఆయనను ఇటువంటి పనులకు ప్రేరేపిస్తుంది. ఐకమత్యంగా చేయవలసిన ఉద్యమాన్ని, ముక్కలు ముక్కలుగా చేసిన పాపం కేసీఆర్ దేనని చెప్పక తప్పదు.   సమరదీక్షలోనే తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలపడం గురించి కూడా మాట్లాడిన ఆయన, ఆ తరువాత వచ్చిన ప్రశ్నలకు జవాబు చెప్పకపోవడం కూడా ఆయన నిజాయితీని శంకించేల చేసింది. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసుకోవడానికి ఆయన ఏమి ప్యాకేజీ కోరారనే అంశం కూడా ఆమధ్య ప్రధానంగా చర్చింపబడింది.   కమునిష్టు నేత నారాయణ దానిపై స్పందిస్తూ, 4 కోట్ల మంది ప్రజలకి సంబందించిన తెలంగాణా అంశం కాంగ్రెస్-తెరాస అనే రెండు పార్టీల మద్య చేసుకోవలసిన ఒప్పందం కాదు. కాంగ్రెస్ పార్టీ ఆఫర్లు ఇవ్వడాన్ని, కేసీఆర్ బేరాలడుకోవడానికి అదేమీ వ్యాపారం కాదు, ప్రజల మనోభావాలకు సబందించిన సున్నితమయిన అంశం అని అన్నారు.   తెలంగాణా ఉద్యమంలో యదా శక్తిన పాటుపడుతున్న తెలంగాణా సమరభేరి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి కూడా కేసీఆర్ చిత్తశుద్దిని శంకిస్తూ మాట్లాడారు. ఉద్యమం కోసం పుట్టిన పార్టీ ఇప్పుడు ఉద్యమం బాట వదిలి ఎన్నికల బాట ఎందుకు పట్టింది అంటూ అయన ప్రశ్నించారు. కేసీఆర్ కూడా మొత్తం అన్ని స్థానాలకు పోటీ చేస్తామని, పార్టీలో టికెట్స్ కావలసిన వారు వెంటనే పార్టీలో జేరి టికెట్ బుక్ చేసుకోండి అంటూ ఆఫర్లు కూడా ప్రకటించారు.   కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అంశాన్ని ఎన్నికల వరకు సాగదీయగలిగితే తనకి లాభం అని అనుకొంటే, గమ్మతుగా కేసీఆర్ కూడా అదే కొంటున్నారు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఆడుతున్న తెలంగాణా చదరంగంలో అమాయుకులయిన విద్యార్ధులు అన్యాయంగా బలయిపోతున్నారు. తమ బిడ్డలు చనిపోతున్నారని వేదికలెక్కి ఆక్రోశించే పెద్దమనుషులు అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమి చేయాలని ఆలోచించకుండా, ప్రభుత్వానిదే బాధ్యత అంటూ చేతులు దులుపుకోవడం చాలా గర్హనీయం.   తెలంగాణా కావాలనుకొంటే రాజకీయ పోరాటాలు చేసుకోవచ్చు. ఆ పేరుతొ ఎన్నికలకు వెళ్ళినా ఎవరికీ నష్టం ఉండదు. గానీ, ఆమాయకులయిన ప్రజల జీవితాలతో, బంగారు భవిష్యత్ నిర్మించుకోవలసిన యువత జీవితాలతో ఆడుకోవడమే దారుణం.