యన్టీఆర్ అందరి వాడు మరి వైయస్స్ఎవరి వాడు?
posted on May 7, 2013 @ 4:57PM
నేడు డిల్లీలో స్వర్గీయ యన్టీఆర్ విగ్రహావిష్కరణతో యావత్ తెలుగుజాతి చాలా సంతోషించింది.ఈ రోజు పార్లమెంటులో ఆయన విగ్రహావిష్కరణకు హాజరయిన అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు హాజరవడం ఆయన పట్ల వారికి ఉన్న గౌరవానికి అద్దం పడుతోంది. అంతకు ముందువరకు ఒకవైపు నందమూరి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన పురందేశ్వరి ఆయనను మా వాడంటే మావాడని యుద్ధం చేశారు. మద్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా రంగ ప్రవేశం చేసి ఆ పార్టీ ఉద్దేశ్యాలు ఏవయినప్పటికీ “ఆయన అందరి వాడు, యావత్ తెలుగు ప్రజలకి చెందినవాడని” పెద్ద యుద్ధమే చేసింది.
ఇక నందమూరి అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయనను సాక్షాత్ దివి నుండి భువికి దిగివచ్చిన శ్రీకృష్ణ భగవానుడని నమ్మి పూజలు కూడా చేస్తుంటారు. తెలుగు భాషాభిమానులకు ఆయనను ఒకందుకు ఇష్టపడితే, కళాకారులు, సినీ రంగంవారు ఆయనను మరో కారణంతో ఇష్టపడతారు. ఆయనను వేర్వేరు అంశాల ఆధారంగా అందరూ కూడా ఆయనను అభిమానిస్తుంటారు. ఇక నందమూరి కుటుంబ కధా నాయకులకు, ముఖ్యంగా బాలకృష్ణ, జూ.యన్టీఆర్, తారక్, కళ్యాణ్ తదితరులకు ఆయన పేరు తలవందే పొద్దు గడవదు.
ఇక తెలుగుదేశం పార్టీ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొంటోంది. చివరికి ఆయన తీవ్రంగా వ్యతిరేఖించిన కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆయన అభిమానులే అంటే అతిశయోక్తి కాదు.
ఇక మాజీ ముఖ్య మంత్రి డా. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు ఆయనను, ఆయన కీర్తి ప్రతిష్టలను, చివరికి ఆయన ప్రవేశ పెట్టిన పధకాలను కూడా స్వంతం చేసుకోవడానికి కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు చాలా పోటీ పడ్డాయి. కానీ కాలక్రమంగా, ఆయన జమానాలో జరిగిన అవినీతి భాగోతాలు ఒకటొకటిగా బయటపడుతుండటంతో మెల్లిగా కాంగ్రెస్ పార్టీ ఆయనను, ఆయనకు సంబందించిన ప్రతీ జ్ఞాపకాన్ని వదిలించుకొని బయటపడాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఇక, అదేవిధంగా ఒకనాడు ఆయనను ఇంద్రుడు, చంద్రుడు అని భజన చేసిన మంత్రులు ఆనం రామినారాయణ రెడ్డి వంటి వారు ఆయనను నేడు ఒక పెద్ద దగాకోరుగా అభివర్ణిస్తున్నారు. ఆయన వలననే తామంతా ఈ రోజు సీబీఐ ఉచ్చులో చిక్కుకొన్నామని సబితా ఇంద్రారెడ్డి, గీత రెడ్డి, కన్నా లక్ష్మి నారాయణ, మోపిదేవి వెంకట రమణ తదితర మంత్రులు, శ్రీలక్ష్మి తదితర ఐఏయస్ అధికారులు ఆయనను నిందిస్తున్నారు.
తెలంగాణా మంత్రులు, తెరాస నేతలు ఆయన తమ ప్రాంత ప్రజల పొట్టకొట్టి, నీళ్ళు దోచుకొన్న దొంగ అని నిందిస్తున్నారు. ఇక మీడియాలో కేవలం సాక్షి తప్ప, మిగిలినవన్నీ కూడా ఆయన అవినీతి భాగోతాలను కధలు కధలుగా వర్ణిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఒక్క జగన్ పార్టీకి తప్ప ఎవరికీ అక్కరలేకుండా పోయారు.
కానీ, యన్టీఆర్ ను స్వంతం చేసుకోవడానికి జగన్ పార్టీ కూడా పోటీ పడటం ఆయన గొప్పదనాన్ని చాటి చెపుతోంది. ఇద్దరూ నేతలు కూడా రాష్ట్రంపై, దేశంపై పెను ప్రభావం చూపినవారే. ఒకరు ఆచంద్రార్కం నిలిచిపోయే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకొని ప్రజల మనసులు గెలుచు కొంటే, మరొకరు అవినీతికి మారు రూపంగా మిగిలిపోయారు.
స్వర్గీయ యన్టీఆర్ అందరి వాడుగా నిలిచిపోతే, స్వర్గీయ డా.రాజశేఖర్ రెడ్డి కేవలం కొందరివాడుగా మిగిలిపోయారు. ఒకరిని స్వంతం చేసుకోవడానికి అందరూ పోటీ పడుతుంటే, మరొకరి నీడ తమ మీద పడితే ఉలికికులికి పడుతున్నారు. ఒకరు అందరి హృదయాలు కొల్లగొట్టిన గజదొంగ. అయినా ఆయన అంటే అందరికీ ఇష్టమే! కానీ మరొకరు..?