ఎవరి అవిశ్వాసం వారిదే

  ఎవరి (అ) విశ్వాసం వారిదే తెరాస అధినేత కేసీఆర్ అవిశ్వాస తీర్మానానికి ముహూర్తం పెట్టినప్పటి నుండి ఇంతవరకు స్థబ్దుగా ఉన్న రాష్ట్ర రాజకీయాలలో ఒక్కసారిగా చలనం వచ్చింది. ఈ సారి ప్రతిపక్షాలు చేస్తున్న అవిశ్వాస తీర్మాన ఆలోచనలో చాల ప్రత్యేకత ఉంది. సాధారణంగా ప్రతిపక్షాలు అవిశ్వాసం ప్రసక్తి తేగానే ఉలిక్కిపడవలసిన రాష్ట్ర ప్రభుత్వం నిశ్చింతగా తనపని తానూ చేసుకుపోతుంటే, ఆ ప్రతిపాదన తెచ్చిన విపక్షాలు మాత్రం తమలో తాము కీచులాడుకోంటూ ప్రజల ముందూ నవ్వులపాలవుతున్నాయి. అవిశ్వాసం వల్ల తమ ప్రభుత్వం పడిపోతుందని భయపడవలసిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు ప్రతిపక్షాల కీచులాటలు చూసి అవహేళన చేస్తోంది. అయినా ప్రతిపక్షాలు తమ అవిశ్వాస పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నాయి.   ఇక, తాజా వార్తా ఏమిటంటే ఇంతవరకు తెరాస పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని ప్రకటిస్తూ, తెలుగుదేశం పార్టీని నిలదీస్తూ వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, అకస్మాత్తుగా తన వ్యూహం మార్చుకొని, తానే స్వయంగా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకొంది. తెరాస ‘తెలంగాణా అంశం’ ప్రధానంగా చేసుకొని అవిశ్వాస తీర్మానం పెడుతున్నందున, తాము దానికి మద్దతు ఇస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో అది తమకు రాజకీయంగా నష్టం కలిగిస్తుందని ఆ పార్టీ అభిప్రాయపడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. కానీ, ఆ విషయాన్నీ బహిరంగంగా ప్రకటిస్తే తెరాస తమపై యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది గనుక, ప్రధాన ప్రతిపక్షమయిన తెలుగు దేశం పార్టీ తన బాధ్యతలను విస్మరించినందువల్లే తాము ఆ బాధ్యతలు స్వీకరిస్తూ స్వయంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించుకొన్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీడియాకు చెప్పుకొంటోంది.   అందువల్ల ఈ రోజు తెరాస వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు రెండూ వేర్వేరుగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నాయి. తత్ఫలితంగా ప్రభుత్వాన్ని పడగొట్టే విషయంలో ఆ రెండు పార్టీలు కూడా చేతులు కలిపే ఆలోచన లేదని స్పష్టం చేసాయి.   గనుక, ఈ అవిశ్వాస తీర్మానాలవల్ల కిరణ్ సర్కార్ కు వచ్చే ప్రమాదం ఏమిలేకపోగా వాటివల్లనే ఆయన ప్రభుత్వం రాజకీయ లబ్దికూడా పొందగలదు కూడా. ఐదు సం.లు పాలించమని ప్రజలు ఎన్నుకొన్న తమ ప్రజా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఈ విధమయిన స్వీయ రాజకీయప్రయోజనాల కోసం అన్యాయంగా పడగొట్టేందుకు విఫలయత్నాలు చేశాయని కిరణ్ సర్కార్ రేపటి నుండి ప్రచారం చేసుకొని ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేయవచ్చును. కానీ, ఐకమత్యం లోపించిన ఆపార్టీ ఈ సదవకాశాన్ని పూర్తిగా ఉపయోగించు కోలేకపోవచ్చును.   ఇక, ఇంతవరకు తెలుగు దేశం పార్టీని అవిశ్వాస తీర్మానంపై నిలదీస్తూ వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెరాస ప్రతిపాదిస్తున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఈయకుండా ఇప్పుడు తాను కూడా వేరేగా అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా, నిజంగా ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసింది.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెపుతున్నట్లు కేవలం రాజకీయ లబ్ధికోసమే ఈ డ్రామాలు ఆడుతునట్లు ఆ రెండు పార్టీలు కూడా ఋజువు చేసాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ మాట వర్తిస్తుంది. నిజంగా ఆపార్టీకి ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనే ఉంటే తెరసాతో చేతులు కలిపి ఆ పని చేసి ఉండాలి. కానీ, శాసన సభలో తన తీర్మానానికి తగిన మద్దతు కూడా లేదని, తన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని తెలిసికూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవడంలోనే ఆ పార్టీకి ఈవిషయంలో చిత్తశుద్ది లేదని నిరూపిస్తోంది.   తెరాస తన అవిశ్వాస తీర్మానం ‘తెలంగాణా అంశం’ పై అని ప్రకటించడం ద్వారా, ప్రధాన ప్రతిపక్షలయిన తెదేపా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ముందే ఒక లక్ష్మణరేఖ గీసి, తనతో చేతులు కలపకుండా జాగ్రత్త పడింది. ‘తెలంగాణా అంశం’ పెడితే ఆ రెండు పార్టీలు తమతో చేతులు కలపవని తెలిసి కూడా తెరాసా ఆవిధంగా చేయడం గమనించినట్లయితే, ఆ పార్టీకి కూడా నిజంగా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పడిపోవడం ఎంత మాత్రం ఇష్టం లేదని అర్ధం అవుతోంది. కేవలం స్వీయ రాజకీయ ప్రయోజనాలకోసమే ఆ పార్టీ ఈ అవిశ్వాస ఆలోచలు చేసినట్లు స్పష్టం అవుతోంది.   ఇక, ఈ రెండు పార్టీల డ్రామాలు,వ్యూహాలను ముందుగానే ఊహించినందువల్లనో లేక ప్రస్తుత పరిస్థితుల్లో కిరణ్ సర్కారును కూల్చడం ఇష్టం లేకనో తెలుగు దేశం పార్టీ మొదటి నుండే ఈ అవిశ్వాస ఆలోచనలకు దూరంగా ఉండిపోయింది. ఇక, ఈ అవిశ్వాస ఆలోచనలు చేసిన తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలే అందరి ముందు నవ్వులుపాలు అవబోతుండగా, వారినిరువురినీ ఎదుర్కొన్న కిరణ్ కుమార్ రెడ్డి దైర్యవంతుడిగా మరో మారు నిరూపించుకోబోతున్నారు.   ఈ రాజకీయ అవిశ్వాస పోరాటాల నుండి చంద్రబాబు నాయుడు క్షేమంగా బయటపడినప్పటికీ ద్వంద ప్రమాణాలు అవలంబిస్తునందున ఆయన నమ్మదగిన వ్యక్తి కాదని విపక్షాలు చేస్తున్న ప్రచారం వలన చాలా అపఖ్యాతి మూట గట్టుకోకతప్పలేదు. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే, ఈ అవిశ్వాస తీర్మానాల వలన కిరణ్ కుమార్ రెడ్డికి ఏమాత్రం నష్టం కలుగకపోగా ఊహించని మేలు జరిగింది. ఆయన చెప్పినట్లు ఇక 2014 ఎన్నికల వరకు ఆయన ప్రభుత్వానికి డోకాలేదని భావించవచ్చును.

‘ఇద్దరు ఇటలీ నావికుల పెరోల్’ ధారావాహికం ప్రారంభం

  కేంద్రంలో యుపీయే ప్రభుత్వానికి ఉన్న సమస్యలు సరిపోవనట్లు ఇప్పుడు కొత్తగా ‘ఇద్దరు ఇటలీ నావికుల పెరోల్’ అనే కొత్త ధారావాహికానికి తెర తీసింది. వారిరువురూ ఇటలీ దేశస్తులు కాకుండా మరే దేశస్తులయినా అయిఉంటే ప్రతిపక్షాలు అంతగా పటించుకొనేవి కావేమో. కానీ, వారు సోనియా గాంధీ మాతృ దేశమయిన ఇటలీకి చెందిన వారు కావవడంతో, ప్రతిపక్షాలు మరింత శ్రద్ధతో పార్లమెంటులో ఈ కధని ముందుకు నడిపిస్తున్నాయి.   ఇంతకీ, ఈ ధారవాహికానికి ఉపోద్ఘాతం ఏమిటంటే, గత సంవత్సరం ఇటలీ దేశానికి చెందిన నావికులు ఇద్దరు కేరళ సమీపంలో చేపలు పడుతున్న మన భారతీయ మత్స్యకారులపై కాల్పులు జరపడంతో ఆ ఇద్దరు మత్స్యకారులు అక్కడికక్కడే చనిపోయారు. భారత సముద్రజలాలో ఈ సంఘటన జరగడంతో వెంటనే మన దేశ నావికాదళం వారు, మన మత్స్యకారుల మరణానికి కారణమయిన ఆ ఇద్దరు ఇటలీ నావికులను బందించి వారిని స్థానిక పోలీసులకి అప్పగించింది.   వారు విదేశీయులయిన కారణంగా ఈ కేసులో మన విదేశీ మంత్రిత్వ శాఖ కూడా వేలు పెట్టక తప్పలేదు. వారిని డిల్లీకి తరలించి పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేసారు. అయితే, వారిరువురూ గత డిశంబరు నెలలో తమ కుటుంబముతో కలిసి క్రిస్మస్ పండుగ చేసుకొని తిరిగివచ్చి కోర్టుకి లొంగిపోతామని కోర్టుకు విన్నవించుకోవడంతో, (విదేశీ మంత్రిత్వ శాఖ కూడా అనుమతి ఇచ్చి ఉండాలి) కోర్టు వారికి అనుమతి మంజూరు చేసింది. వారు చెప్పినట్లే మళ్ళీ వచ్చి కోర్టులో లొంగిపోయారు కూడా.   తమ దేశంలో జరుగుతున్నసాధారణ ఎన్నికలలో ఓటు వేసి వచ్చేందుకు తమకు అనుమతినీయాలని వారిరువురు మళ్ళీ కోర్టుకు వినతిపత్రం ఈయడంతో, వారి సత్ప్రవర్తనను దృష్టిలో ఉంచుకొని కోర్టు వారిరువురికీ గత నెలలో 4 వారాలు పెరోల్ మంజూరు చేసింది.   అయితే, వారు మన నీతి కధలలో చెప్పుకొన్నట్లు ‘దూడకి పాలిచ్చి తిరిగి వచ్చి పులికి ఆహారం అయ్యే గంగిగోవులు’ కారు గనుక ఈ సారి భారత్ గుమ్మం దాటగానే తమ ఇటలీ ప్రభుత్వం ద్వారా వారిక తిరిగి రాబోరని ప్రకటింపజేసారు. మరీ అవసరమయితే అంతర్జాతీయ న్యాయ స్థానంలో కేసు వేసుకోవచ్చునని భారతదేశానికి ఇటలీ ప్రభుత్వం ఒక ఉచిత సలహా కూడా ఇవ్వడంతో ఈ ఇటలీ ధారావాహికం మొదలయింది.   షరా మామూలుగానే, ప్రతిపక్షాలు పార్లమెంటులో అల్లరి చేయడం, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం (సిగ్గు, మొహమాటం పడకుండా)ఎదురుదాడి చేయడం, ఆతరువాత కులాసాగా ఇటలీ దేశానికి తమ తీవ్ర అభ్యంతరాలు తెలియజేశామని చెప్పడం వంటి ఎపిసోడ్స్ అన్ని ఈ ధారావాహికంలో చకచకా పూర్తియిపోయాయి.   అందుబాటులో ఉన్నఇటలీ రాయభారి ‘డానియల్ మంసిని’కీ ఈ విషయంలో గట్టిగా క్లాసు కూడా పీకమని మన యుపీయే ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ, వారు వినకుండా, అసలు మన మత్స్యకారులను మనదేశ సముద్ర జలాలోనే చంపిన విదేశీయులని ఏవిధంగా దేశం విడిచి వెళ్ళనిచ్చేరు? అసలు వారిని ఎవరు వెళ్ళనిచ్చేరు? ఇదే తప్పు మన దేశస్తులు ఇతరదేశాలలో చేసినట్లయితే వారిని అక్కడి ప్రభుత్వాలు కూడా మనలాగే వారికి పూల దండలు వేసి ఘనంగా వీడ్కోలు పలికి సాగనంపుతాయా? అంటూ డిటెక్టివ్ ప్రశ్నలు గుప్పించడం మొదలుపెట్టడంతో, సాధారణంగా ఎన్నడూ పరుషంగా మాట్లాడే అలవాటులేని మన ప్రధాని మన్మోహన్ సింగు వారికి కూడా ఆగ్రహావేశాలు వచ్చేశాయి.   దానితో ఆయన ఇటలీ ప్రభుత్వానికి మరో హెచ్చరిక జారీ చేస్తూ, వెంటనే ‘ఆ ఇద్దరినీ’ వెనక్కు పంపకపోతే 'తీవ్ర పరిణామాలు' ఎదుర్కోవలసి ఉంటుందని తీవ్ర స్వరంతో పార్లమెంటులోనే మృదువుగా హెచ్చరించేసారు కూడా. అయితే, ఆ ‘తీవ్ర పరిణామాలు’ ఏమిటో తెలుసుకోవాలంటే తరువాయి ఎపిసోడ్ వరకు మనం ఎదురు చూడక తప్పదు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెరాసతో డబుల్ గేం ఆడుతోందా?

  రేపటి నుండి మొదలయ్యే శాసనసభ సమావేశాలలో తెరాసా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధం అవుతుంటే, దానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం చాలా నిశ్చింతగా తన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడం ప్రతిపక్షాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.   ఈ రోజు మెహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభమయిన రెవెన్యు సదసు ప్రారంభానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభలో ప్రసంగిస్తూ తానూ ప్రతిపక్షాల బెదిరింపుల భయపడేవాడిని కానని, 5సం.లు పాలించమని ప్రజలు తనకు అధికారం అప్పజేప్పినందున, తమ ప్రభుత్వానికి 2014సం.వరకు ఏ ప్రమాదం లేదని అన్నారు.   బహుశః ఆయన తమ పార్టీలో ఉంటున్న జగన్ మోహన్ రెడ్డి వర్గానికి చెందిన వారుగా ముద్రపడ్డ 9మంది శాసన సభ్యులకు తన ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఓటువేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించి ఆయన లొంగదీసుకొని ఉండవచ్చును. వారు గనుక తన ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఓటు వేయకపోతే, తన ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిలేదని గ్రహించినందునే బహుశః కిరణ్ కుమార్ రెడ్డి ఇంత నిర్భయంగా మాట్లాడగలుగు తున్నారను కోవచ్చును. బహుశః ఆ కారణం వల్లనే ఆ 9 మంది శాసన సభ్యులు ఇంతవరకు మీడియా కంట పడకుండా తప్పించుకొని తిరుగుతున్నారేమో.   అయితే, మరో వైపు వైయస్సార్ కాంగ్రెస్, తెరాసాతో కలిసి అవిశ్వాస తీర్మానంలో పాల్గొంటునపుడు ఆ తొమ్మండుగురు సభ్యులు కాంగ్రెస్ పార్టీను వీడి బయటకి రాకపోయినట్లయితే తెరాసా పెడుతున్న అవిశ్వాస తీర్మానం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఈ సంగతి తెలియకనే వారిరువురూ అవిశ్వాసంపై ముందుకు వెళ్తున్నారని భావించలేము. అంటే, ఆఖరి నిమిషంలో ఆ తొమ్మండుగురు సభ్యులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా ఓటు వేయనయినా వేయాలి.   అలా జరుగలేదంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తెరాసాతో డబుల్ గేం ఆడుతోందని భావించాల్సి ఉంటుంది. ఒక వైపు తెరాసతో కలిసి అవిశ్వాస తీర్మానంలో పాల్గొంటూనే మరో వైపు తన తొమ్మండుగురు సభ్యులను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా కూడా కాపాడేందుకు ఆ పార్టీ ఆదేశించి ఉండవచ్చును. బహుశః ఆ కారణం తోనే, వైయస్సార్ కాంగ్రెస్ అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని విస్పుష్టంగా ప్రకటించి ఉండవచ్చును. బహుశః ఆ కారణంతోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రభుత్వానికి 2014సం.వరకు ఏ ప్రమాదం లేదని ఈ రోజు కూడా దైర్యంగా చెప్పగలుగుతున్నారు.   ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనుక ఈవిధమయిన అతి తెలివి ప్రదర్శించి తెరాసను మోసం చేసినట్లయితే, అందుకు ఆ పార్టీ తెలంగాణా లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

చంద్రబాబు సరికొత్త వ్యూహం ఫలించేనా?

  నిన్న చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా ఈ సారి ఎన్నికలకి ఆరు నెలలు ముందుగానే అభ్యర్దుల ఎంపిక ప్రక్రియను మొదలుపెడతామని ప్రకటించారు. ఇది తేదేపాకు సరికొత్త ఎత్తుగడగా ఆయన అభివర్ణిస్తున్నపటికీ, ఇటీవల కొంత కాలంగా పార్టీలో పెరుగుతున్న అసంతృప్తినీ, తనకు వ్యతిరేఖంగా తోక జాడిస్తున్న సీనియర్లను, పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ వైపు దూకుతున్న అసంతృప్తి నేతలనూ అందరినీ ఏక కాలంలో తన దారికి తెచ్చుకొనే ప్రయత్నంగానే భావించవచ్చును.   సాధారణంగా రాజకీయపార్టీలు టికెట్లు కేటాయించడం మొదలుపెట్టగానే, సహజంగానే పార్టీలో మళ్ళీ క్రమశిక్షణ, అధిష్టానం పట్ల వినయ విదేయతలు పెల్లుబుకుతాయి. (ఆ కార్యక్రమం తరువాత టికెట్ రాని అభ్యర్ధుల అలకలు, వేరే పార్టీకి వలసలు కూడా సహజమే.) అందువల్ల నిన్న చంద్రబాబు చేసిన ప్రకటనతో పార్టీలో అసమ్మతి చాలా త్వరగా అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయి.   గత ఆరు నెలలుగా ఆయన పార్టీ కార్యాలయానికి దూరంగా తిరుగుతూ చేస్తున్న పాదయాత్రల వల్ల, ఆయన పార్టీ అంతర్గత వ్యవహారాలపై తన దృష్టి కేంద్రీకరించ(లే)క పోవడంతో ఏర్పడిన సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగానే బహుశః ఆయన ఈ ప్రకటన చేసి ఉండవచ్చును. ‘ఎన్నికలకి ఆరు నెలల ముందుగానే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలుపెడతాము,’ అన్న ప్రకటనలో ఆయన ఇచ్చిన ‘టైమింగ్’ కూడా ఉద్దేశపూర్వకంగా పెట్టిందే. ఎందుకంటే, ఆయన పాదయాత్ర ముగిసే సరికి మరో రెండు నెలలయినా పట్టే అవకాశం ఉంది. అంటే మే నెలలో ఆయన పాదయాత్ర ముగించుకొని మళ్ళీ తన కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది.   ఇక ప్రతిపక్షాలవారు ఎంత మధ్యంతర ఎన్నికల ఊహా గానాలు వినిపిస్తున్నపటికీ, కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది సెప్టెంబర్ నుండి డిసెంబర్ మధ్యలో లేదా ఇంకా ఆలస్యంగా ఎన్నికలకి వెళ్ళే ప్రయత్నం చేయవచ్చును. ఎందుకంటే, 9 రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు కూడా జరిగే ఆ సమయంలో కాంగ్రెస్ సాధారణ ఎన్నికలకు కూడా వెళ్ళే సాహసం చేయకపోవచ్చును. అంటే చంద్రబాబు తన పాదయాత్ర ముగించుకొని తిరిగి వచ్చే సమయానికి సరిగ్గా ఆరు నెలల సమయం ఉంటుందన్నమాట.   అందువల్ల చంద్రబాబు తిరిగి తానూ పార్టీ కార్యాలయానికి వచ్చిన తరువాత అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని ఆశ చూపడం ద్వారా ఆయన తన పాదయాత్ర సాగుతున్నంత కాలం పార్టీలో పరిస్థితులు అదుపులో ఉంచేందుకు ప్రయత్నించినట్లు కనబడుతోంది. సర్వరోగ నివారిణి అయిన ఈ దివ్యౌషద ప్రభావం త్వరలోనే పార్టీపై తప్పక కనిపిస్తుంది. ఆయన తన పాదయాత్ర ముగించుకొని పార్టీ కార్యాలయానికి తిరిగి వచ్చిన తరువాత పార్టీ పరిస్థితులను తన అదుపులో తెచ్చుకొనే ప్రయత్నాలు ఎలాగు చేస్తారు. కానీ, అంతవరకూ పార్టీని అదుపులో ఉంచడానికి ఇంతకంటే దివ్యౌషదం మరొకటి ఉండదని అనుభవజ్ఞుడయిన చంద్రబాబుకి తెలుసు గనుకనే ఆయన ఈ ‘ఎన్నికలు-అభ్యర్ధుల ఎంపిక’ అనే మందు వాడి ఉంటారు.   ఇక, ఈ ప్రకటన వెనుక ఆయన ఉద్దేశ్యాలు ఏవున్నపటికీ, ఆయన దానిని అమలు చేసినప్పుడు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఏర్పడుతాయి. పార్టీ అభ్యర్ధులను ఆరు నెలలు ముందుగానే ప్రకటించడం వలన, టికెట్ ఇచ్చిన నేతలకే సదరు నియోజక వర్గాల భాద్యతలు అప్పజెప్పడం ద్వారా అక్కడ పార్టీ విజయావకాశాలు పెరగవచ్చును. అదే సమయంలో, తమకు వ్యతిరేఖంగా పనిచేసే అసమ్మతి నేతలను లొంగ దీసుకొనే తిప్పలు కూడా సదరు అభ్యర్ధులే పడక తప్పదు గనుక, చంద్రబాబు తన చేతికి మట్టి అంటకుండా పైపైనుండి పార్టీని పర్యవేక్షిస్తూ ఎన్నికలకు సిద్ధం కావచ్చును.

నరేంద్ర మోడీ చెప్తున్న కొత్త భాష్యాలు

  నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రాన్నిముఖ్యమంత్రిగా పాలిస్తున్న2002 సం.లో ఆ రాష్ట్రంలో జరిగిన దారుణమారణకాండ నేటికీ అయన పాలిట పెను శాపంగా మిగిలిపోయి, దేశానికి ప్రధానిగా చేపట్టగల ఒక మహత్తర అవకాశానికి ఆయనని ఆమడ దూరంలో ఉంచుతోంది. గుజరాత్ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగి, రాష్ట్రాన్ని ప్రగతి పధంలో తీసుకుపోతున్న ఆయన గుజరాత్ రాష్ట్రం బయట కాలుపెడితే చాలు, ఇప్పటికీ నిరసనలు ఎదుర్కోక తప్పడం లేదు. ఆయన చేసిన ఘోర తప్పిదమే ఆయనకు, ఆయన ఉజ్వల భవిష్యత్తుకు మద్య ఒక కనిపించని అడ్డుగోడలా నిలిచి, ఆయన తెలివితేటలకు పరీక్ష పెడుతోందిప్పుడు.   ఆయన ఇప్పుడు ఒక ద్వైదీమానమయిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు నానాటికి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ, ఆయన సమర్ధతకు ప్రపంచ దేశాల ప్రశంసలు. మరో వైపు, ఎక్కడికి వెళితే అక్కడ నిరసనలు, ఆయన రాకకి అభ్యంతరాలు.   ఇటీవల డిల్లీలో శ్రీరాం కాలేజీలో ఆయనను ముఖ్య అతిధిగా ఆహ్వానించినప్పుడు ఆయన చేసిన ప్రసంగంతో లోనున్న విద్యార్ధులు ఎంతో స్పూర్తి పొందగా, అదే కాలేజిలో మరికొందరు విద్యార్దులు బయట నిలబడి ఆయన రాకకు నిరసనలు తెలియజేసారు. ఈ సంఘటన ఆయన ప్రస్తుతం ఎదుర్కొంటున్న వింత పరిస్థితులకి అద్దం పడుతోంది.   ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘వైబ్రాంట్ గుజరాత్ సదస్సు’ కు “పాకిస్తాన్” తో సహా అనేక దేశాల నుంచి వ్యాపార వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు తరలివచ్చి ఆయనను, ఆయన రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచం గుర్తించిందని ఋజువు చేసారు. కానీ, మొన్న అమెరికాలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొనేందుకు ఆయనకు అమెరికా ప్రభుత్వం విసా నిరాకరించడం ఆయనకు చెంప దెబ్బ అయింది. మానవ హక్కులను కాపాడటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆయనకు వీసా నిరాకరిస్తున్నట్లు అమెరికా తెలియజేసింది. భావి భారత ప్రధాని కావాలని కలలు కంటున్న నరేంద్రమోడీకి ఇది నిజంగా చెంప దెబ్బే అని చెప్పక తప్పదు. అందువల్ల ఆయన అమెరికాకు స్వయంగా వెళ్ళే అవకాశం లేకపోవడంతో, వీడియో కాన్ఫరెన్సు ద్వారా గుజరాత్ రాష్ట్రం నుండే ఆయన అమెరికాలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు.   ఇక ఆయన తన ప్రసంగంలో మొట్టమొదటిసారిగా తన పరిపాలనలో జరిగిన తప్పులు (మారణకాండ) గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘ప్రజలకు సమర్ధమయిన పరిపాలన అందించగలిగితే వారు ప్రభుత్వం చేసిన తప్పులను కూడా క్షమిస్తారు’ అని అన్నారు.   అంటే, తానూ అందిస్తున్న సమర్ధమయిన పాలనతో సంతృప్తి పొందిన ప్రజలు, తనను గెలిపించిడం ద్వారా, వారు ‘తన తప్పులను’క్షమించారని ఆయన ఉద్దేశ్యం కావచ్చును. తనవల్ల నష్టపోయిన ప్రజలే తనను మన్నించి గెలిపించినప్పుడు, అమెరికా వంటి ఇతరదేశాలు ఇంకా తటపటాయించడం ఏమిటని ప్రశ్నించడం కూడా ఆయన ఉద్దేశ్యం కావచ్చును.   కానీ, దాదాపు 1200 మంది ఆమయకులయిన ప్రజల మరణానికి కారకుడని నిందించబడుతున్న ఆయన, కోర్టుల నుండి చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకొని తప్పించుకోవచ్చును కానీ, ప్రజల దృష్టిలో, ముఖ్యంగా ఆ దారుణానికి గురయిన వర్గం దృష్టిలోఆయన ఎన్నటికీ నేరస్తుడిగానే మిగిలిపోతారు.   మంచి వక్తగా పేరున్న నరేంద్ర మోడీ తన వాక్చాతుర్యంతో తన తప్పులను కప్పిపుచ్చుకొని దేశభక్తి పూరితమయిన తన ప్రసంగాలతో ప్రజలను సమ్మోహితులను చేయవచ్చును. కానీ, తానూ స్వహస్తాలతో వ్రాసుకొన్నతన గత చరిత్రను మాత్రం ఆయన ఎన్నటికీ చెరుపుకోలేరు.   ఆయన నోటితోనే ఆయన స్వయంగా ‘ప్రజలకు సమర్ధమయిన పరిపాలన అందించగలిగితే వారు ‘ప్రభుత్వం చేసిన తప్పులను’ కూడా క్షమిస్తారు’ అని చెప్పడం ద్వారా తానూ చేసిన తప్పులను ఆయన పరోక్షంగానయినా అంగీకరించినట్లు అర్ధం అవుతోంది.   అయితే, తన తప్పులకు సవరణలు చేసేబదులు, సదరు వర్గం ప్రజలను తనను క్షమించమని బహిరంగంగా ఆయన కోరిఉంటే, వారు ఆయనను క్షమించేవారేమో! ఒకవేళ వారు క్షమించకపోయినా, ఆయన ఆవిధంగా కోరినందుకు మిగిలిన ప్రజలయినా క్షమించేవారేమో! ఏదిఏమయినపటికీ, ఆయన చేసిన తప్పులే ఆయనకు నేడు శాపాలుగా మారి, ఆయనకు అగ్నిపరీక్షలు పెడుతున్నాయని చెప్పవచ్చును. వాటిని ఆయన అధిగమించి తన ప్రసంగంలో చెప్పినట్లు ‘అన్నిటి కంటే దేశమే మిన్న’ అని ఋజువు చేయగలిగితే ఆయన జన్మ ధన్యం అయినట్లే!

కిరణ్ కుమార్ రెడ్డి కెప్టెన్సీలో అజహరుద్దీన్!

  ఒకనాడు కేవలం సినీపరిశ్రమకు చెందిన నటీనటులు మాత్రమే రాజకీయాలలో చేరేవారు. వారికి గల ప్రజాకర్షణే వారిని అందుకు ప్రోత్సహించేది. కానీ, నదులన్నీ సముద్రంలోనే కలుస్తాయన్నట్లు, మారిన సామాజిక పరిస్థితుల్లో అన్ని రంగాలకు చెందిన వారు కూడా వివిధ కారణాలతో వివిధ రాజకీయపార్టీలలో ప్రవేశిస్తున్నారు. ఒకవిధంగా ఇది ఆహ్వానించదగ్గ శుభపరిణామమని చెప్పవచ్చును. వివిధ రంగాలపట్ల సరయిన అవగాహనలేని మన రాజకీయ నాయకులకు, వీరి చేరిక వలన ఆయా రంగాలలో ఉండే సమస్యల గురించి, వాటికి పరిష్కార మార్గాలు గురించి కొంత అవగాహన ఏర్పడుతుంది.   ఇక, అసలు కధలోకి వస్తే, ఒకనాటి మేటి క్రికెటర్ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఉత్తర ప్రదేశ్ మొరదాబాద్ పార్లమెంటు సభ్యుడు అయిన అజహారుద్దీన్ ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసారు. ఆ తరువాత అజాహారుద్దీన్ మీడియా వారితో మాట్లాడుతూ తను రాష్ట్ర రాజకీయాలలో చేరలనుకొంటున్నట్లు చెప్పారు. కానీ, ముఖ్యమంత్రిని మాత్రం 'ఆపని మీద' కలువలేదని కేవలం ఆయనను పలుకరించి వద్దామనే కలిశానని అన్నారు. మరో ప్రశ్నకు బదులిస్తూ, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మద్య ఏర్పడిన విబేధాల గురించి తనకు తెలియదని చెప్పారు. అజహారుద్దీన్ ‘కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన చాలా బాగుందని’ ఒక సర్టిఫికేట్ కూడా జారీ చేశారు.   మజ్లిస్ కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయిన తరువాత, ముస్లిం వర్గానికి చెందిన అజాహారుద్దీన్ వంటి ఒక ప్రసిద్దమయిన వ్యక్తి జాతీయ కాంగ్రెస్ నుండి రాష్ట్రీయ కాంగ్రెస్ వైపు చూడటం కిరణ్ కుమార్ రెడ్డి కి సంతోషం కలిగించే విషయం కాగా, మజ్లిస్ పార్టీని దూరం చేసుకొన్నరాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి సమయంలో చేరడంవల్లనే తనకు ఓ ప్రాముఖ్యత ఏర్పరడుతుందని ఆయన భావిన్చడం వల్లనే రాష్ట్ర రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నట్లు భావించవచ్చును. మజ్లిస్ తమను విడిచి వెళ్ళిపోయిన తరువాత, తమ పార్టీ రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంకు కొంత మేరయినా కోల్పోయమని అర్ధం చేసుకొన్నపటికీ, చేసుకొన్నరాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం రాజకీయాలలోచాలా సహజమయిన విషయమే.   ఇప్పుడు అజహారుద్దీన్ రాకవల్ల పోగొట్టుకొన్న ఆ ఓటు బ్యాంకును పూర్తిగా కాకపోయినా కొంతయినా కైవసం చేసుకోవచ్చునని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆలోచించడం అసహజమేమి కాదు. కాంగ్రెస్ పార్టీకి, ఆయన రాకవల్ల ఇప్పటికిప్పుడు ప్రత్యేక లాభం ఏమి లేకపోయినప్పటికీ, ఆయనను సాదరంగా ఆహ్వానించి వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్ ఇచ్చినట్లయితే, మంచి క్రికెట్ కామెంటర్ గా కూడా పేరు పొందిన ఆయన, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రచార కర్తగా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది.   ఇక, ఇదంతా కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి జట్టులో అజహార్ ఆడేందుకు ‘టికెట్ ఖాయం’ అయిన తరువాత జరిగే కధ కనుక,అప్పటి వరకు అజహారుద్దీన్ ఎక్సట్రా బ్యాట్స్ మ్యాన్ గా గేలరీలో కూర్చొని కిరణ్ ఆడుతున్న గేం చూస్తూ శబాష్ బాగా ఆడుతున్నారని చప్పట్లు కొట్టుకొంటూ కూర్చోక తప్పదు.

బ్రదర్ పై మైనార్టీ అస్త్రం ప్రయోగించిన తెదేపా

  అవిశ్వాస తీర్మానాన్ని అడ్డంపెట్టుకొని తనను ఇరికించజూస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ, కొత్తగా తన అమ్ముల పొదిలో జేరిన మైనార్టీ అస్త్రం ప్రయోగించింది. గతనెల గుంటూరు జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఏర్పరిచిన తెదేపా అనుబంధ క్రీస్టియన్ సంఘం అద్యక్షుడు శాంతారాం డేవిడ్ ద్వారా వైయస్సార్ కుటుంబ సభ్యుడయిన బ్రదర్ అనిల్ కుమార్ పై తెలుగుదేశం పార్టీ దాడి చేసింది. తద్వారా తమను అవిశ్వాసం తీర్మానం మిషతో ఇబ్బందులు పెడితే, అందుకు ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలియజేసింది.   తెదేపా అనుబంధ క్రీస్టియన్ సంఘం అద్యక్షుడు శాంతారాం డేవిడ్ నిన్న పార్టీ కార్యాలయం యన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. రాజశేఖర్ రెడ్డి, ఆయన అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేసారు.   స్వర్గీయ డా. రాజశేఖర్ రెడ్డి క్రీస్టియన్ మతస్తుడయినప్పటికీ ఆయన క్రీస్టియన్ ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేదని, రాష్ట్రంలో క్రీస్టియన్ మతస్తులకు సరిపోయినన్ని శ్మశానాలు కూడా లేక చాలా ఇబ్బాదులు పడుతున్నామని, శ్మశానాల కోసం స్థలాలు కేటాయించమని తాము ఇచ్చిన వినతి పత్రాలను కూడా పట్టించుకోకుండా వాటిని ఆయన చెత్తబుట్టలో పడేశారని ఆవేదన వ్యక్తం చేసారు. తమకి కనీసం శ్మశానాల కోసం స్థలాలు కూడా కేటాయించలేని ఆ పెద్దమనిషి తన అల్లుడు అనిల్ కుమార్ గనుల కోసం బయ్యారంలో లక్షలాది ఎకరాల స్థలం, మణికొండలో విలువయిన ప్రభుత్వ భూములు అప్పనంగా కట్టబెట్టేరని విమర్శించారు.   తరువాత బ్రదర్ అనిల్ కుమార్ పై తీవ్రఆరోపణలు చేస్తూ “గతంలో మా మతానికి చెందిన వారు అనేకమంది బ్రదర్ అనిల్ కుమార్ ను హైదరాబాద్, సోమాజిగూడా వద్దగల ఎలైట్ భవనంలో ఉన్న బెనేట కార్యాలయంలోనే కలిసేవారని, బేనేట సంస్థకు ఆయనే అసలు యజమాని అని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యేకంగా ఏమి రుజువులు కావాలని ప్రశ్నించారు. ఇటీవల అనుమానస్పద స్థితిలో మరణించిన బెనిటా గనుల సంస్థ యజమానిగా చెప్పబడుతున్న వీరభద్రారెడ్డికి బ్రదర్ అనిల్ కు మద్య ఏమి సంబంధం ఉందో తెలుసుకోవాలని పోలీసులు కనిపెట్టాలని, అదేవిధంగా వీరభద్రారెడ్డి మరణం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుందో, ఆయన చనిపోయే ముందు ఎవరెవరికి ఫోన్ కాల్స్ చేసారో, తన తదనంతరం ఎవరెవరికి బేనేట సంస్థ చెందేట్లు ఏర్పాట్లు చేసేరో వంటి విషయాలను పోలీసులు దర్యాప్తుచేసి కనిపెట్టాలని శాంతారాం డేవిడ్ డిమాండ్ చేసారు.   ఆయన చేసిన ఆరోపణలకు త్వరలోనే బ్రదర్ అనిల్ లేదా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తగిన జవాబు ఇస్తారని వేరే చెప్పనవసరం లేదు. కానీ ఈరాజకీయ ఎత్తుగడ గమనిస్తే, రాజకీయ పార్టీలు మైనార్టీ, మహిళా, విద్యార్ధి, వెనుకబడిన కులాల అనుబంధ విభాగాలను ఎందుకు స్థాపిస్తాయో అర్ధం అవుతుంది. సదరు వర్గానికి చెందిన ఓటు బ్యాంకును గెలుచుకోవడానికి మాత్రమే కాకుండా, అవసరమయినప్పుడు ఈవిధంగా వైరి పక్షాలలో సదరు వర్గాలను ఆవర్గానికి చెందిన వారి చేతనే దాడిచేయించే వెసులుబాటు ఉంటుంది. తద్వారా ఒక వైపు తమ వైరి పక్షంలో ఆవర్గానికి చెందిన నేతలపై దాడి చేసే వెసులుబాటు పొందుతూనే, మరో పక్క న్యాయపరమయిన కేసులు తమ తలకి చుట్టుకోకుండా తప్పించుకొనే వెసులుబాటు కూడా ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఈవిధంగా అనుబంధ సంస్థలను ప్రోత్సాహిస్తున్నాయి. తద్వారా తాము సంబందిత వర్గానికి చాలా ప్రాదాన్యం ఇస్తున్నామని ప్రచారం చేసుకొనే గొప్ప అవకాశం కూడా పొందగలుగుతున్నాయి.   కానీ, యదార్ధ పరిస్థితులు చూసినట్లయితే అవన్నీ సదరు పార్టీల అమ్ముల పొదిలో అస్త్రాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయని అర్ధం అవుతుంది. ఏమయినప్పటికీ, సదరు అనుబంధ సంఘాలలో పనిచేసేవారు కూడా మారిన సామాజిక పరిస్థితుల్లో నేడు ఏదో ఒక బలమయిన రాజకీయ పార్టీ అండదండలు ఉండటం అవసరమనో లేక రాజకీయంగా ఎదిగాలనే ఆలోచనలతో వివిధ రాజకీయ పార్టీల వెనుక తిరుగుతున్నారు. అయితే, వారికి సదరు రాజకీయ పార్టీలు ఏవిదం సాయం చేస్తాయో లేదో ఖచ్చితంగా చెప్పలేకపోయినా, వారిని ఉపయోగించుకొని ఒకే వర్గానికి చెందిన ప్రజల మద్య చిచ్చు మాత్రం పెట్టగలవని ఖచ్చితంగా చెప్పవచ్చును.

The ugly battle over ‘No-Confidence motion’

  TDP has decided not to hurry in serving no-confidence motion against Kiran Kumar Reddy government as it believes that it will not serves its purpose, instead comes as a blessing for YSR Congress party for bargaining with Congress to extend its support. During the party legislative meeting held by Chandrababu Naidu at Dakaram village in Mudinepalli mandal in Krishna district on yesterday, it was decided to push YSR Congress party to frontlines in the no-confidence motion battle, instead of taking initiative. TDP decides to take appropriate step according to situation demands, when the assembly sessions begin from March 13th.   TDP’s decision irks its bitter rival YSR Congress party, which expects to corner TDP in case if it goes for no-confidence motion. Hence, its senior leader Ambati Rambabu has burst upon TDP describing them as cowards. He said “Actually, TDP doesn’t want to topple Kiran’s government as it is having secret pact with Congress to ensure our leader YS.Jagan Mohan Reddy remain in jail as much period as possible. I challenge Chandrababu Naidu to prove that he is honest with what he says to people during his padayatra about Kiran Kumar Reddy.   However, TDP retards asking why it is hesitating to take initiative while it’s blaming Congress party for putting its party president Jagan Mohan Reddy in the jail. TDP says that, when the YSRCP leaders are claiming the ruling Congress government is running on their mercy, then why are they afraid to serve no-confidence motion against Kiran Kumar Reddy government? TDP also asks whether the 9 decedent MLAs of their group hanging to Congress are still willing to extend their support to Congress or will they come out open against ruling Congress government?   While, the two opposition parties are indulged in this ugly battle, Congress is planning to disqualify the MLAs (of Jagan group), whoever revolt against it, with which they will become jobless for the next one year. Hence, all the political parties are busy drawing plans to corner their rivals in the Assembly meetings.

రాహుల్ గాంధీ, లోకేష్ ల సమావేశాలలో తేడాలు!

                        గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో తరచూ సమావేశం అవుతూ పార్టీ వ్యవహారాలలో క్రమంగా అవగాహన పెంచుకొంటున్న నారా లోకేష్, ఈ రోజు చిత్తూరు జిల్లా పలమనేరు గ్రామంలో మొట్ట మొదటిసారిగా పార్టీ కార్యకర్తలనుద్దేశించి చిన్న ప్రసంగం చేసారు. కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి లను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఒకరు అసమర్ధుడు, మరొకరు అవినీతిపరుడు అయినప్పుడు ఎవరికి ఓటేస్తారు?’ అని అడిగారు. సహజంగానే పార్టీ కార్యకర్తలు చంద్రబాబు పేరు కోరస్ గా నినదించడం షరా మామూలే.   తన తండ్రి చంద్రబాబు నాయుడు అధికారంలో లేకపోయినప్పటికీ నేటికీ అంతే సమర్ధతతో పార్టీని నిర్వహిస్తూ, ప్రజల కొరకు అలుపెరుగని పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ, పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలు తెలుసుకొంటున్నారని అన్నారు. అందువల్ల తన తండ్రి చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీకే వచ్చే ఎన్నికలలో తమ పూర్తి మద్దతునీయాలని కోరారు.   అయితే, లోకేష్ కేవలం తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నపుడు, తన తండ్రిని కిరణ్, జగన్ లతో పోల్చడం అనవసరం. అదే సమయంలో తన తండ్రి సమర్ధుడని చెప్పి అతనినే ఎన్నుకోమని కోరడం కూడా అసందర్భ ప్రసంగమే. ఎందుకంటే లోకేష్ తన స్వంత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు తప్ప ప్రజలను ఉద్దేశించి కాదు. తన పార్టీ కార్యకర్తలనే చంద్రబాబుకి ఓటేయమని కోరడం కొంచెం ఎబెట్టుగా ఉంది. ఎందుకంటే, పార్టీలో పనిచేస్తున్న వారికి ఆవిషయం ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పనవసరం లేదు. ఒకవేళ చెప్పవలసివస్తే అటువంటి కార్యకర్తలవల్ల పార్టీకి ఏమాత్రం ప్రయోజనం ఉండదు.   ఇంచుమించు లోకేష్ పరిస్థిలోనే ఉన్న కాంగ్రెస్ యువనాయకుడు రాహుల్ గాంధీ నిన్న డిల్లీలో తన కంటే ఏంతో సీనియర్లయిన పార్టీ నాయకులను ఉద్దేశించి చేసిన ప్రసంగం చూస్తే, వారిద్దరి మద్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా అర్ధం అవుతుంది. రాహుల్ గాంధీ తన పార్టీ నేతలకు, పార్టీలో నెలకొన్న సమస్యలను ఎత్తి చూపుతూ, వాటిని ఏవిధంగా పరిష్కరించాలో చెప్పి, పార్టీని గ్రామ స్థాయి నుండి ఏవిధంగా బలపరచాలో, గ్రామీణ కార్యకర్తలతో ఏవిధంగా అనుసంధానం అవ్వాలో తెలియజేసారు. అంతే గాకుండా వారికి స్పష్టమయిన కార్యాచరణ నిర్దేశిస్తూ తగిన ఆదేశాలు కూడా ఇచ్చారు.   ఇక్కడ ఆయన తన సీనియర్లకు ఆదేశాలు ఈయడం అనే అంశం ప్రధానం కాదు. పార్టీ సమావేశంలో ఆయన ఏవిధంగా ఆచరణాత్మక సలహాలు ఇచ్చి పార్టీ బలోపేతం చేయడానికి ప్రయత్నించారు అనేదే ప్రధాన విషయం.   లోకేష్ కూడా పార్టీ అధిష్టానం తరపున కార్యకర్తలతో మాట్లాడుతున్నపుడు, అదొక సదవకాశంగా భావించి స్థానిక సమస్యలను, పార్టీ పరిస్థితిని, కార్యకర్తల మనోభావాలను తెలుసుకొని, తన శక్తిమేర సమస్యలని పరిష్కరించడమో లేక పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారానికి కృషిచేస్తే కార్యకర్తలకి, పార్టీకి, తనకీ కూడా ప్రయోజనం కలుగుతుంది.   లోకేష్ కు ఇంకా తగిన రాజకీయ అనుభవం లేనందున, ఆయన చేసిన ఈ తొలి ప్రసంగంలో తప్పులు వెతుకనవసరం లేదు. కానీ, పార్టీ అంతర్గత సమావేశాలలోమాట్లాడవలసిన అంశాలు, బహిరంగ సభలలో ప్రజలనుద్దేశించి మాట్లాడవలసిన విషయాల మధ్యగల తేడాను లోకేష్ తెలుసుకోవడం వల్ల ఆయన మాటలకి ఒక విలువ ఏర్పడి ఆశిస్తున్న ఫలితాలు కనిపిస్తాయి.

అసమ్మత మంత్రివర్గ సమావేశం నేడే!

  మళ్ళీ మూడు నెలల విరామం తరువాత గురువారంనాడు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కాబోతోంది. సాధారణంగా మంత్రి వర్గం సమావేశం అంటే కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, శాసనసభలో ప్రతిపక్షాలను ఏవిధంగా ఎదుర్కోవాలి వంటి విషయాలను చర్చించడానికి నిర్వహిస్తారు. కానీ, ఈ మద్య జరుగుతున్న సమావేశాలలో ప్రతిపక్షాలను ఎదుర్కోవడం సంగతెలా ఉన్నా, స్వపక్షంలో విపక్షాన్ని ఎదుర్కోవడంతోనే సరిపోతోంది.   గత సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆరోగ్యశాఖామంత్రి డా.డీయల్.రవీంద్రారెడ్డికి మద్య రెవెన్యు మంత్రి ధర్మాన ప్రసాదరావును సీబీఐ విచారణ నుండి మినహాయించడంపై పెద్ద యుద్ధమే జరిగింది. ఆరోజు మంత్రి వర్గంలో కేవలం డా.డీయల్.రవీంద్రా రెడ్డి ఒక్కరే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేఖంగా మాట్లాడారు. అయితే, ఈ సారి జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ ఒకరిపై మరొకరు కత్తులు దూసేందుకు సిద్దంగా ఉన్నారు.   ఇటీవల జరిగిన సొసైటీ ఎన్నికల సందర్భంగా పార్టీ నేతల మద్యన జరిగిన ప్రచ్చన్న యుద్ధం, ఈ సారి సమావేశాన్ని రసాబాస చేసే అవకాశం ఉంది. కడప ఎన్నికలలో డా.డీయల్.రవీంద్రారెడ్డి, సి. రామచంద్రయ్య ఇద్దరూ పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడి, కాంగ్రెస్ అభ్యర్ధుల ఓటమికి కారకులయ్యారని, అందువల్ల వారిద్దరినీ పదవులలో తొలగించాలని శాసన సభ్యుడు వీరశివా రెడ్డి మరియు వరదరాజులు రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు.   ఇక, సహకార ఎన్నికలలో తనని, తన అనుచరులను ఉద్దేశాపూర్వకంగానే ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేసారని, ఆయనకీ అందరినీ కలుపుకోనిపోయే అలవాటు లేదని మంత్రి రామచంద్రయ్య బహిరంగంగానే విమర్శించారు. ఇక, పీసీసి అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ 9మంది జగన్ వర్గీయులను పార్టీ నుండి బయటకి గెంటేస్తానని రంకెలువేయడం, దాని పర్యవసానాలతో కిరణ్ కుమార్ రెడ్డి ఆయనపై గుర్రుగా ఉన్నారు.   తనను పక్కన బెట్టి, సహకార ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించినందుకు బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రిపై కోపంతో రగిలిపోతున్నారు. ఇక, ఆంధ్రా మంత్రులు, తెలంగాణా మంత్రులు మద్య ఒకరినొకరు ద్వేషించుకోనేందుకు అవసరమయిన విభజన రేఖ వారి మద్యన ఎప్పుడూ ఉంది. వీటికి తోడూ తమ నెత్తి మీద కత్తిలా వ్రేలాడుతున్న అవిశ్వాస తీర్మానం కూడా ఉండనే ఉంది.   అందువల్ల ప్రజల సమస్యలపై నిర్ణయాలు, శాసనసభలో అనుసరించవలసిన వ్యూహం మొదలయిన విషయాల కంటే ముందు మంత్రుల మధ్య ఉన్న ఈ విబేధాలే సమావేశాన్ని కబళించే అవకాశం ఉంది. ఇది ఎలాగుందంటే కలిసి కాపురం చేయడానికి ఇష్టపడని మొగుడు పెళ్ళాలు, పొరుగింటి పిన్నమ్మ సంసారాన్ని చక్కబెట్టే ప్రయత్నంలా ఉంటుంది.   ముఖ్యమంత్రితో సహా మంత్రి వర్గం సమావేశంలో పాల్గొనబోతున్న మంత్రులందరికీ ఒకరితో మరొకరికి పడనప్పుడు, మరి వారు కలిసి కూర్చొని చర్చించేదేమిటో, సాదించేదేమిటో వారికే తెలియాలి.

పెళ్ళీ వద్దు, ప్రధాని పదవీ వద్దు: రాహుల్ గాంధీ

  అలనాడు సిద్దార్డుడు ప్రపంచాన్నే జయించే మహా చక్రవర్తో లేకపొతే ప్రపంచానికి శాంతి ప్రబోదించే గొప్ప సన్యాసో అవుతాడని జ్యోతిషులు చెప్పినపుడు, ఆయన తండ్రి తన కుమారుడు తప్పనిసరిగా చక్రవర్తి కావాలనే సంకల్పంతో, సిద్దార్డుడికి ప్రజల కష్టాలు, సమస్యల గురించి తెలియకుండా జాగ్రత్త పడుతూ, రాజమందిరంలోనే విద్యాబుద్దులు చెప్పించి పెళ్లి కూడా చేసాడు. అయితే, ఒకానొక రోజు ఆయన తన రాజమందిరంలోంచి బయటి ప్రపంచంలోకి వెళ్ళడం, అక్కడ తనకి తెలియని ప్రజల కష్టాలు, అశాస్వితమయిన జీవితం గురించి తెలుసుకోవడంతో, తన సంసారాన్ని, రాజ్యాన్నిత్యజించి సన్యాసిగా మారి భోదీ వృక్షం కింద తపసు చేసి బుద్ధుడుగామారి లోకానికి జ్ఞానం ప్రసాదించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.   ‘కోరికలే దుఖమునకు మూల కారణం’ అని చెప్పిన బుద్దుడి ప్రవచనాల గురించి అందరికీ తెలిసి ఉన్నపటికీ, వాటిని సాధారణ మానవులెవరూ కూడా ఇంతవరకూ జయించలేకపోతున్నారు. ఈ ఉపోద్గాతం అంత ఇప్పుడు ఎందుకంటే, కాబోయే ప్రధానిగా అభివర్ణింపబడుతున్న రాహుల్ గాంధీ కూడా నిన్నఅదే వైరాగ్య భావనలతో మాట్లాడటమే.   గౌతమ బుద్ధుడు బయటి ప్రపంచాన్ని చూడటం వల్లనే సర్వసంఘ పరిత్యాగిగా మారితే, గత 9 సం.లుగా ప్రజలమద్య జీవితం గడుపుతూ, వారి కష్ట సుఖాలను దగ్గరనుండి గమనించి అర్ధం చేసుకొన్నరాహుల్ గాంధీ బహుశః వారి కష్టాలను చూసే వైరాగ్యం పెంచుకోన్నడో, లేక దశాబ్దాలుగా తన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలిస్తున్నా వారి జీవితాలలో మార్పు తేలేకపోయినందుకు చింతిస్తూ వైరాగ్యం పెంచుకోన్నాడో తెలియదు గానీ, మొత్తం మీద గౌతమ బుద్ధుడి ‘కోరికలే దుఖమునకు మూల కారణం’ అనే ఉపదేశ సారాంశాన్ని మాత్రం బాగా వంటబట్టించుకొన్నట్లు కనిపిస్తున్నారు.   నిన్న తన పార్టీకి చెందిన యువ యమ్పీలతో మాట్లాడుతూ తానూ ఇప్పుడపుడే పెళ్లి చేసుకోనని చెపుతూ అందుకు కారణాలు కూడా వివరించారు. “పెళ్లి చేసుకొంటే సంసారం ఏర్పడుతుంది. సంసారం నుండి పిల్లలు పుట్టుకు వస్తారు. దానితో కోరికలు, స్వార్ధం కూడా పుట్టుకు వస్తాయి. నా పిల్లలే దేశంలో అధికారం చేలాయించాలనే స్వార్ధం కూడా నాలో పుట్టుకు రావచ్చును. అందువల్ల ఇప్పుడపుడే పెళ్లి ప్రసక్తి లేదని” స్పష్టం చేసారు.   అంతటి ఆగితే, కాంగ్రెస్ పార్టీ పెద్దగా చింతించేది కాదు. కానీ, ఆయన తనకు ప్రధాని పదవి మీద కూడా ఏమాత్రం ఆసక్తి లేదని బాంబు పేల్చారు. తనకు ప్రధాని పదవి కంటే కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి బలపరచడమే ప్రధానం అని అన్నారు. తన నెహ్రు-గాంధీ కుటుంబ నేపద్యమే తనకు అందలం అందుబాటులోకి తెచ్చింది తప్ప మరో కారణం లేదని కుండ బద్దలు కొట్టారు.   తన నానమ్మ ఇందిరా గాందీ కొన్ని తప్పని పరిస్తితుల్లో పార్టీలో అధికార కేంద్రం సృష్టించారని, అయితే దేశంలో ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవుగనుక, పార్టీలో, ప్రభుత్వంలో అధికార వికేంద్రీకరణ జరుగవలసిన సమయం ఆసన్నమయిందని, లక్షలాది సభ్యులుగల కాంగ్రెస్ పార్టీలో అర్హత గల ప్రతీ ఒక్కరూ కూడా అధికారంలో భాగస్వాములు కావాలని తానూ మనస్పూర్తిగా కోరుకొంటున్నానని ఆయన చెప్పారు. తద్వారా ఇక ఈ వంశపారంపర్య పాలనకు స్వస్తి చెప్పాలని అంటూ ఆయన కాంగ్రెస్ నేతల గుండెల్లో మరో బాంబు పేల్చారు.   ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకొన్న సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీ నేతలకీ ఆయన మాటలు సహజంగానే కలవరపరుస్తాయి. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా పట్టం కట్టించుకొన్న రాహుల్ గాంధీ అకస్మాత్తుగా ఇంత వైరాగ్యం ప్రదర్శించడం, అదికూడా ఎన్నికలను ఎదురుగా బెట్టుకొన్న ఈ సమయంలో పార్టీకి సారద్యం వహించి తరువాత ప్రధాని పదవిని అధిష్టించవలసిన వ్యక్తి, అలనాడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడిలా మాట్లాడటంతో కాంగ్రెస్ పార్టీ చాలా అయోమయంలో పడింది.   కాంగ్రెస్ రాజకీయాలకు పూర్తీ విభిన్నమయిన పద్దతిలో మాట్లాడుతున్న ఆయన తీరును కాంగ్రెస్ ఖండించలేక, సమర్దించలేక సతమతమవుతోంది. బహుశః ఆయన నానాటికి దిగజారుతున్న తన పార్టీ పరిస్థితిని చూసి ఆవిధంగా అన్నారో లేక తానూ ఆయాచితంగా ప్రధాని పదవిని పొందడం నిజంగా ఇష్టంలేకనే ఆయన ఆవిధంగా అన్నారో తెలియదు కానీ, వర్తమాన రాజకీయాలలో ఈ విధంగా మనసులో మాటలు బయటపెట్టడం పార్టీకి ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది తప్ప పార్టీకి మేలుచేయదు.   తద్వారా ప్రధాని పదవి గురించి ఆయన వెల్లడించిన అభిప్రాయలు పార్టీ వ్యూహాలను బట్టబయలు చేసినట్లే అవుతుంది. ఇంతవరకు “మా ప్రధాని అభ్యర్ధి రాహుల్ గాంధీ విషయంలో మాపార్టీలో ఒక స్పష్టత ఉంది. మరి మీ ప్రధాని అభ్యర్ధి ఎవరు? మోడీనా, అద్వానీయా, సుష్మా స్వరాజా లేక మరేవరయినానా? అంటూ బీజేపీని ఆట పట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకి రాహుల్ గాంధీ తాజా ప్రకటనతో గొంతులో పచ్చి వెల్లక్కాయ పడినట్లయింది. రాహుల్ గాంధీ మాటలు ఇప్పుడు బీజేపీకి ఒక ఆయాచిత వరంగా లభ్యమవగా, కాంగ్రెస్ పార్టీని మనస్పూర్తిగా ద్వేషించే ప్రతిపక్షాలకు ఒక కొత్త ఆయుధంగా దొరికింది.   రాహుల్ గాంధీ వెల్లడించిన అభిప్రాయాలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా మీడియాలో పెద్ద చర్చ మొదలయింది. ప్రతిపక్షనేతలు మొదలు మానసిక తత్వ శాస్త్ర నిపుణులు వరకు అందరూ ఈ చర్చలో పాల్గొంటూ ఆయన అభిప్రాయాలను రకరకాల కోణాలలో విశ్లేషణలు చేయడం మొదలుపెట్టారు.   ఇది, కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం మేలు చేయకపోగా పార్టీకి ఊహించని సమస్యలు తెచ్చిపెట్టింది. మరి అలనాడు అర్జునుడికి గీతోపదేశం చేసి కర్తవ్యం భోదించి యుద్ధానికి సన్నధం చేసినట్లు, రాహుల్ గాంధీకి కూడా సరయిన ఉపదేశం చేసి ఎన్నికల రణరంగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు ఉరికించగల ‘శ్రీకృష్ణుడు’ ఎవరయినా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో లేదో చూడాలి.

హలో బ్రదర్! అని కలవరిస్తున్న బీజేపీ!

  జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన కొత్తలో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు తప్ప రాష్ట్రంలో అన్ని చిన్న పెద్ద పార్టీలు కూడా అయన పార్టీతో చేతులు కలపాలని చూసాయి. ముఖ్యంగా మతతత్వ పార్టీలుగా ముద్రపడిన మజ్లిస్ మరియు భారతీయ జనతా పార్టీలు అయనకి స్నేహ హస్తం అందించాయి. జగన్ గనుక ఖచ్చితమయిన తెలంగాణా వైఖరిని ప్రకటిస్తే తెరాస కూడా అయన పార్టీతో పోత్తులకు సిద్దమని సంకేతాలు పంపింది.   కానీ, సరయిన రాజకీయ అనుభవం లేని కారణంగా, తగిన సలహాలు ఇచ్చే రాజకీయ అనుభవజ్ఞులు కూడా పార్టీలో లేకపోవడంతో జగన్ మోహన్ రెడ్డి తనకు తోచినదారిలో ముందుకు సాగిపోతూ చిక్కుల్లో పడ్డాడు. భారతీయ జనతా పార్టీతో సంబంధాలు పెట్టుకోనని ఆయన తెగేసి చెప్పినపటికీ, రాజకీయాలలో తలపండిన ఆ పార్టీ తొందరపడలేదు. ఎన్నికలకి ఇంకా చాల సమయం ఉనందున, అప్పటికి ఆయన ఆలోచనలో మార్పు రావచ్చని బీజేపీ ఓపికగా ఎదురుచూసింది.   కానీ, కాంగ్రెస్ పార్టీ నుండి అకస్మాత్తుగా తలాకులు చెప్పుకొని మజ్లిస్ పార్టీ విడిపోవడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఆకస్మాతుగా మారిపోయింది. మజ్లిస్ కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోతూ కిరణ్ కుమార్ రెడ్డి కంటే జగనే మంచోడు అని ఒక సర్టిఫికేట్ జారీ చేయడం, ఆతరువాత అక్బరుద్దీన్ అరెస్ట్ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మౌనం వహించడం, క్రమంగా ఆ రెండు పార్టీలు దగ్గరవుండటంతో భారతీయ జనతా పార్టీ ఇక జగన్ మోహన్ రెడ్డి తమ చేజారిపోయినట్లేనని గ్రహించింది.   తమకు బద్ద విరోధి అయిన మజ్లిస్ పార్టీతో చేతులు కలుపుతున్నజగన్ మోహన్ రెడ్డిని ఇక ఎంత మాత్రం ఉపేక్షించనవసరం లేదని భావించిన వెంటనే, అంతవరకూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కనబడని తప్పులు బీజేపీకి స్పష్టంగా కనబడటం మొదలయ్యాయి. అంతే! ఆనాటి నుండి బీజేపీకి నేత ప్రభాకర్ బ్రదర్..బ్రదర్ అంటూ బ్రదర్ అనిల్ వెంటపడటం మొదలుపెట్టారు. ఆయనకి చెందిన ఆస్తులు, వివిధ సంస్థలలో ఆయన పెట్టిన పెట్టుబడులు, ఆయన సంస్థల పేర్లు, ఆయా సంస్థలలో ఆయన బినామీల పేర్లు, ఆయన చేసిన భూభాగోతాలు అన్నిటినీ ఒకటొకటిగా ప్రస్తావిస్తూ ఆయనపై దాడి తీవ్రతరం చేసారు.   బీజేపీకి తన దాడుల పరిధిలోకి జగన్ మోహన్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యులందరినీ తెచ్చే అవకాశం ఉన్నపటికీ, ఆ పార్టీ సహజంగా మతానికి ప్రాధాన్యం ఇస్తుంది గనుక, మతప్రచారం చేస్తూ, మతమార్పిడులకు ప్రోత్సాహం పలుకుతున్న బ్రదర్ అనిల్ నే తన ప్రధాన లక్ష్యంగా చేసుకొంది. అయితే, మున్ముందు ఏర్పడే రాజకీయవాతావరణాన్ని అనుసరించి బీజేపీ తన దాడుల పరిధి మరింత పెంచి మొత్తం జగన్ కుటుంబ సభ్యులను, ఆయన పార్టీని, నేతలపై యుద్ధం ప్రకటించవచ్చును.   బీజేపీని మతతత్వ పార్టీగా ముద్ర వేసి దూరం పెట్టిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు మజ్లిస్ వంటి పార్టీతో ఏవిధంగా చేతులు కలుపుతున్నారని బీజేపీ ప్రశ్నిస్తోంది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో కేవలం సెక్యులర్ పార్టీతోనే చేతులు కలుపుతామని ప్రకటించడంతో, బీజేపీ మరింత మండిపడింది. ఆనాటి నుండి బీజేపీ క్రమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తన దాడి తీవ్రతరం చేసింది. కానీ, బీజేపీ రాష్ట్ర శాఖా అద్యక్షుడు కిషన్ రెడ్డి మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేఖంగా ఇంకా ఎందుకో నోరు విప్పలేదు. బహుశః ఆయనకీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆశలు ఏమయినా మిగిలిపోయాయేమో మరి తెలియదు.   ఒకవైపు తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడులను తిప్పి కొట్టేందుకు సతమతమవుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు బీజేపీ కూడా తోడవడంతో తట్టుకోవడం కష్టంగా మారింది. తమ పార్టీ అధినేత జైల్లో ఉండటంవల్లనే బలహీనంగా ఉన్నామని అందరికీ అలుసుగా మారామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధపడుతోంది. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రధం భూమిలోకి క్రుగిందని అర్జునుడు జాలిపడిఉంటే భారతగాధ మరో విధంగా ఉండేది. గనుక, ఇప్పుడు రాష్ట్ర రాజకీయ రణరంగంలో కూడా ఎవరూ ఎవరిపైనా జాలిపడే పొరపాటు చేయరు.

మన పార్టీలకి సర్వం రాజకీయమేనా?

  మన రాష్ట్ర రాజకీయనాయకులు వివిధ అంశాలపై ప్రతిస్పందిస్తున్న తీరు చూస్తుంటే, వారికి రాష్ట్ర ప్రయోజనాలకంటే, పార్టీ ప్రయోజనాలు, స్వప్రయోజనాలే ఎక్కువని అర్ధం అవుతుంది. మొన్న హైదరాబాద్ బాంబు ప్రేల్లుళ్ళ సంఘటనను, నిన్న బాబ్లీ ప్రాజక్ట్ పై సుప్రీం కోర్టు వెలువరిచిన తీర్పు అంశాలను పట్టుకొని వారు ఆడుకొంటున్న తీరు చూస్తే ప్రజలకి వారి పట్ల క్రమంగా ఏహ్యత పెరుగుతోంది. వారిలో ఏ ఒక్కరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేకపోయినప్పటికీ, నిస్సిగుగ్గా తాము విఫలమయిన అంశాలనే పట్టుకొని మరీ రాజకీయాలు చేయడం నిజంగా సిగ్గు చేటు.   సుప్రీం కోర్టు తీర్పు తరువాత ఆంధ్ర రాజకీయ నేతలందరూ సమిష్టిగా తమపై దండయాత్ర చేస్తారని భయపడిన మహారాష్ట్ర ప్రభుత్వం, మన రాజకీయ నేతల తీరు చూసి నవ్వు కొంటోందిప్పుడు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీం కోర్టు తీర్పువల్ల మన రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమిలేదని చెప్పడంతో, తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్ది రెడ్డి తదితరులు “మరయితే ఇంతకాలం సుప్రీం కోర్టులో ఏమి గడ్డి పీకుదామని లాయర్లను పెట్టి కేసు నడిపించారంటూ” తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణాపై సర్వ హక్కులు తనవేనన్నట్లు మాట్లాడే కేసీఆర్, హరీష్ రావులు కేంద్ర రాష్ట్ర మంత్రులుగా చేస్తున్న సమయంలోనే మొదలయిన బాబ్లీ పనులను ఎందుకు అడ్డుకోలేకపోయారని వారు ప్రశ్నించారు.   ఇక, నిజామాబాద్ యం.పీ. మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ దీనికి అంతటికీ మూల కారకుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేకర్ రెడ్డే అని ఆరోపించారు. ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ పనులు మొదలుపెట్టినపుడు వాటిని అడ్డుకోమని ఆయనను తానూ ఎంతగా ప్రాదేయపడిన్నపటికీ ఆయన నిర్లక్ష్యం చేసారని, అందుకు తన వద్ద తగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆయన ఆరోపించారు.   అదే విధంగా, కేంద్రంలో ఎన్డీయే భాగస్వామిగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన చంద్రబాబు కూడా అంతే నిర్లక్ష్యం ప్రదర్శించి మహారాష్ట్ర ప్రభుత్వానికి పరోక్షంగా ప్రోత్సహించారని ఆరోపించారు. కనుక, ఇప్పుడయినా అన్నిరాజకీయ పార్టీలు , ఈ ఆరోప,ప్రత్యారోపణలు కట్టిబెట్టి రాష్ట్రానికి న్యాయంగా దక్కవలసిన నీటికోసం ఏమి చేయాలో ఆలోచించాలని ఆయన కోరారు. అదే సమయంలో ఈ అంశాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తూ, తెలంగాణా అంశంపై నుండి ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నాలు చేయవద్దని ఆయన ప్రతిపక్షాలను హెచ్చరించారు.   అయితే, ఈ కుమ్ములాటలలో క్షణం తీరిక లేకుండా ఉన్న మన రాజకీయ పార్టీల ధోరణి చూస్తే, ఇప్పటికయినా మేలుకొంటాయని భావించలేము. బహుశః బాబ్లీ అంశం వచ్చి బాంబు దాడుల అంశాన్ని వెనక్కి నెట్టినట్లే, మళ్ళీ త్వరలో మరో చర్చనీయాంశం తెర మీదకి వచ్చే వరకు వారి ఈ పోరాటం కొనసాగవచ్చును.

కాంగ్రెస్ పార్టీకి చెలగాటం బీజేపీకి రాజకీయ సంకటం

  కాంగ్రెస్ పార్టీ చెలగాటం బీజేపీకి సంకటం పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్లు ఉంది ఇప్పుడు బీజేపీ పరిస్థితి. రెండు రోజుల క్రితం ఆర్ధిక మంత్రి చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో బీహార్ వెనకబాటుతనం గురించి ప్రస్తావిస్తూ, ఆ రాష్ట్రం కోసం తన బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేసానని ప్రకటించారు. అయితే, అది కాకతాళీయంగా చేసిన ప్రకటన మాత్రం కాదు. దేశంలో వివిధ రాష్ట్రాల పరిస్థితి బీహార్ రాష్ట్రానికి తీసిపోకుండా ఉన్నపటికీ, ఆయన బీహార్ రాష్ట్రం పైనే ఎందుకు ప్రత్యేక మక్కువ చూపారంటే, మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది.   నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పటిననాటి నుండి ఆ రాష్ట్రంలో గణనీయమయిన మార్పులకు శ్రీకారం చుట్టడమే కాకుండా, రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పధంలోకి తీసుకు వెళ్ళే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎన్నికల సమయంలో తప్ప మరెప్పుడు రాజకీయాలు చేయనని చెప్పే నరేంద్ర మోడీనే ఆయన ఆదర్శంగా తీసుకొని రాష్ట్రాభివృద్దికి కృషి చేస్తున్నపటికీ, ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న అయన (జనత దళ్ పార్టీ) మోడీని ప్రధాని అభ్యర్ధిగా చేయాలనే బీజేపీ నిర్ణయాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. ఒకవేళ మోడీయే ఎన్డీయేకు నాయకత్వం వహించేట్లయితే తానూ తప్పుకొంటానని కూడా స్పష్టం చేసారు.   బీజేపీ తిరిగి అధికారంలోకి రావాలంటే, ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామి అయిన జనతా దళ్, దాని అధినేత నితీష్ కుమార్ మద్దతు తప్పనిసరి. అయితే, ఇంతవరకు నితీష్ కుమార్ ను ఏదోరకంగా ఒప్పించవచ్చునని భావిస్తున్న బీజేపీకి చిదంబరం విసిరిన పాచికతో బిత్తరపోయింది.   మోడీని వ్యతిరేఖిస్తున్న నితీష్ కుమార్ ను ఎన్డీయే నుండి తమ వైపు ఆకర్షించగలిగితే, ఎన్డీయే బలం తగ్గించడమే కాకుండా, తద్వారా రాబోయే ఎన్నికలలో బీజేపీ అవకాశాలను కూడా దెబ్బతీయగలుగుతుంది. ఇప్పటికే, బీజేపీలో, ఎన్డీయేలో మోడిని వ్యతిరేఖించేవారు చాల మందే ఉన్నారు, బీజేపీ గనుక మోడిని తమ ప్రదాని అభ్యర్ధిగా ఎంచుకొంటే, మొదటగా నితీష్ కుమార్ బయటకి వచ్చేయడం ఖాయం. అది పార్టీలో, ఎన్డీయేలో విబేధాలకు దారి తీసి చివరికి ఎన్డీయే విచ్చినం అవుతుందని కాంగ్రెస్ ఆశపడుతోంది.   ఒకవేళ నరేంద్ర మోడీని కాదని మరెవరినయినా ప్రధాని అభ్యర్ధిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి అది సంతోషం కలిగించే విషయమే అవుతుంది. బీజేపీని ఎన్నికలలో గెలిపించగల సమర్దుడయిన మోడీ తప్ప మరెవరినయినా కాంగ్రెస్ పార్టీ తన యువనాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో అవలీలగా ఓడించగలదని నమ్మకంతో ఉంది. అందువల్ల బీజేపీకి ఇప్పుడు మోడీ కావాలో లేక నితీష్ కావాలో తెల్చుకోమ్మనట్లు సవాలు విసిరింది.   మోడీని కాదనుకొని నితీష్ కుమార్ ను కాపాడుకొంటే, బలహీనమయిన బీజేపీకి కాంగ్రేస్ చేతిలో ఓటమి ఖాయం. నితీష్ కుమార్ ను వదులుకొని మోడీతో ముందుకు సాగితే, పార్టీలో, ఎన్డీయేలో లుకలుకలు తప్పవు, బీజేపీకి అధికారంలో రావడానికి ఎన్డీయేలో తగిన మద్దతు సరిపోదు. ఈ ఆలోచనతో కాంగ్రెస్ చిదంబర పాచిక విసిరింది. అది ఫలిస్తుందో లేదో రానున్న కాలమే చెప్పాలి.   అయితే, నిన్న డిల్లీలోజరిగిన బీజేపీ సమావేశంలో నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మాట్లాడటం చూసినట్లయితే, బీజేపీ నితీష్ కుమార్ ను వాదులు కొని మోడీకే పట్టం కట్టాలని నిర్నయించుకొన్నట్లు కనిపిస్తోంది.

ముఖ్యమంత్రికి మరో అగ్ని పరీక్ష

  త్వరలో పదవీ విరమణ చేయనున్న ఐదుగురు శాసనమండలి-సభ్యులు పొంగులేటి సుధాకరరెడ్డి, ధీరావత్‌ భారతీ నాయక్‌, ఇంద్రసేన్‌రెడ్డి, లక్ష్మీ దుర్గేశ్‌, పుల్లా పద్మావతిలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మరో అగ్ని పరీక్షను తెచ్చిపెట్టారు. శాసన సభ్యుల కోటాలో ఎన్నికయిన వారి ఐదు స్థానాలను, మారిన రాజకీయ సమీకరణాల నేపద్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే దక్కేలా చేయడం నిజంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అగ్నిపరీక్ష వంటిదే.   ఒక్కో శాసనమండలి సభ్యుడి ఎన్నికకి 29.3 ప్రథమ ప్రాధాన్యతా వోట్లు అవసరం కాగా, కాంగ్రెస్ తన 155 మంది శాసనసభ్యుల బలంతో అవలీలగా ఐదుగురు శాసనమండలి సభ్యులను గెలిపించుకోలిగేది. కానీ, కొద్ది రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చాలా ఆర్భాటంగా జగన్ అనుచరులయిన 9మంది శాసన సభ్యులను పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేయడంతో, పార్టీ పరిస్థితి ఒక్కసారిగా తలక్రిందులయింది. 155 మంది శాసనసభ్యుల నుండి వారిని తీసేస్తే కేవలం 146 మంది మాత్రమె మిగులుతారు.   అయితే, వారు కిరణ్ కుమార్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరిస్తున్నట్లు కానీ, వారిని బొత్స సత్యనారాయణ ప్రకటించినట్లుగా ఇంతవరకు పార్టీ నుండి బహిష్కచడం గానీ జరుగనందున, ఆ 9 మంది సభ్యుల కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ లేనట్లే లెక్క. అందువల్ల పార్టీకి వారి మద్దత్తు ఉంటుందనే నమ్మకం లేదు. అందుకు ప్రధాన కారణం బొత్స చేసిన ప్రకటనేనని చెప్పక తప్పదు.   ఆయన తన ప్రకటనతో జగన్ వర్గానికి ఒక సవాలు విసిరడంతో, వారు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు వేచి చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో శాసనమండలి ఎన్నికలు ఎదుర్కోవలసి రావడంతో కిరణ్ కుమార్ రెడ్డికి కొంచెం ఇబ్బందే. ఒకవేళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది శాసన సభ్యులు, ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన మజ్లిస్‌ పార్టీతో కానీ చేయి కలిపితే వారి బలం (మజ్లిస్ 7 మంది సభ్యులతో కలిపి) మొత్తం 24 అవుతుంది. అప్పుడు, కాంగ్రెస్ పార్టీలో నేటికీ శాసన సభ్యులుగా కొనసాగుతున్న 9 మంది జగన్ అనుచరులను కూడా కలుపుకొంటే వారి మొత్తం బలం 33 అవుతుంది. ఒక శాసనమండలి సభ్యుడి ఎన్నికకి 29.3 ప్రథమ ప్రాధాన్యతా వోట్లు అవసరం కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం 33 మంది సభ్యులు ఉన్నందున, ఆ పార్టీ సులభంగా ఒక స్థానాన్ని కైవసం చేసుకోగలదు.   ఉన్న 5 స్థానాలలో ఒకటి కోల్పోవడం అంటే ప్రభుత్వానికి కొంత ఇబ్బందే గనుక ఆ ఒక్క స్థానాన్ని ఎలా తిరిగి దక్కించుకోవాలనేదే కిరణ్ కుమార్ రెడ్డికి ఒక పరీక్ష కాబోతోంది. పార్టీలో ఉన్న జగన్ అనుచరులను ఆయన నయాన్నో భయన్నో నచ్చచెప్పుకొంటారా, లేక మళ్ళీ మజ్లిస్ తో బేరాలు చేసుకొంటారా లేక ఏమయితే అయింది లెమ్మని ఒక స్థానాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వదులుకుంటారా చూడాలి.   అయితే, కిరణ్ కుమార్ రెడ్డి ఈ పరీక్షలో కూడానెగ్గినట్లయితే అది ఆయన రాజకీయ చతురతకి నిదర్శనంగా నిలబడటమే కాకుండా, సహకార ఎన్నికల గురించి లేనిపోని గొప్పలు చెప్పుకొంటున్నాడని పార్టీలో తనను విమర్శిస్తున్నవారికి కూడా జవాబు చెప్పినట్లవుతుంది. అంటే కాకుండా అవకాశం దొరికినప్పుడల్లా తన కుర్చీ కింద మంట రాజేయాలని చూస్తున్న బొత్స సత్యనారాయణకు కిరణ్ తన సత్తా చాటిచూపినట్లవుతుంది.

తెలంగాణా అంశంపై బిజెపికి అంత ఆసక్తి దేనికో?

  భారతీయజనతా పార్టీ గత రెండు దశబ్దాలుగా దక్షిణాది రాష్ట్రాలలో తన కమలాన్ని వికసింపజేయాలని ఎంతగా ప్రయత్నిస్తున్నపటికీ, కర్ణాటకలో తప్ప మరి వేరే ఏ రాష్ట్రంలోను మొగ్గ తొడగలేకపోయింది.అధికారంలో ఉన్న ఆ ఒక్క రాష్ట్రంలో కూడా తిరుగుబాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి ఎడ్యురప్ప సొంత కుంపటి పెట్టి బీజేపీకి ఎసరు పెడుతుండటంతో, అక్కడ కూడా ఆపార్టీ పరిస్థితి (ఎడ్యురప్ప) తుమ్మితే ఊడిపోయే ముక్కులా దయనీయంగా తయారయింది.   ఇక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఉన్నబలమయిన ప్రాంతీయ పార్టీలు బీజేపీ ఆయా రాష్ట్రాలలో కాలు కాదుకదా, వేలు కూడా పెట్టేందుకు చోటు మిగల్చకపోవడంతో, మూడు రాష్ట్రాలలో ఆ పార్టీ ఉనికి అంతంత మాత్రంగానే ఉంది. అయితే, గత దశాబ్దకాలంగా సాగుతున్న తెలంగాణా ఉద్యమం, బీజేపీకి రాష్ట్రంలో ఊహించని ఒక కొత్త అవకాశాన్నిఅందజేసింది. మొదట్లో బీజేపీ తెలంగాణా విషయంలో కొంచెం సందిగ్ద పడినప్పటికీ, అదే తమకు రాష్ట్రంలో కాలుమోపేందుకు ఒక చక్కటి అవకాశం కల్పిస్తోందని గ్రహించిన బీజేపీ తెలంగాణా విషయంలో మరిక ఎన్నడూ కూడా వెనుతిరిగి చూడలేదు. నాటి నుండి నేటి వరకూ కూడా బీజేపీ తెలంగాణా ఉద్యమాలలో కీలక పాత్ర పోషిస్తూ, క్రమంగా తెలంగాణాలో తన బలం పెంచుకొనగలిగింది.   అదే సమయంలో, బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణా విషయంలో నిర్ద్వందంగా తన అభిప్రాయాన్ని ప్రకటిస్తూ, తాము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా 100 రోజుల్లోనే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. నిన్న ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ పార్లమెంటులో అదే విషయాన్నీ మరో మారు దృవీకరిస్తూ, యు.పీ.ఏ. ప్రభుత్వం గనుక తెలంగాణా ఈయకపోతే, తాము అధికారంలోకి రాగానే తెలంగాణా ఇస్తామని మరోమారు స్పష్టం చేసారు.   కాంగ్రెస్ పార్టీ నాన్చుడు ధోరణితో విసిగెత్తిపోయిన తెరాస అధినేత కేసీఆర్ కూడా యు.పీ.ఏ. కాకపొతే ఎన్డీయే మరో ప్రత్యామ్నాయం ఉందంటూ ప్రకటించాడు.   ఇక, రాష్ట్రంలో బీజేపీ విషయానికి వస్తే, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు లేని ఒక గొప్ప అవకాశం అది కలిగిఉంది. ఆ మూడు పార్టీలు కూడా రాష్ట్రంలో తమ పరిస్థితులు తలక్రిందులవుతుందనే భయంతో తెలంగాణా అంశంపై నేటికీ నోరు మెదపడానికి భయపడుతుండగా, రాష్ట్రంలో తెలంగాణాలో తప్ప మరే ఇతర ప్రాంతాలలో ప్రభావం చూపని బీజేపీ సరిగ్గా ఇదే కారణంతో ఆరెండు పార్టీలను అధిగమించి నిర్ద్వందంగా తెలంగాణా అనుకూల నిర్ణయం ప్రకటించి, చురుకుగా ఉద్యమంలో పాల్గొంటోంది.   తద్వారా బీజేపీకి రాష్ట్రంలో కొత్తగా కోల్పోయేదేమి లేకపోయినా, తెలంగాణాలో తానూ చేస్తున్న ఉద్యమాలవల్ల కనీసం తెలంగాణా ప్రాంతాలలోనయినా తన జెండా ఎగురవేయగలిగే అవకాశం దక్కుతుందని అది ఆశపడుతోంది.   అయితే, తెలంగాణా బలంగా ఉన్న తెరాసను కాదని తానూ ఒంటరిగా గెలవగలదని ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ, బీజేపీకి రాష్ట్రంలో తన ప్రాభల్యం పెంచుకొనేందుకు ఇంతకంటే వేరే ప్రత్యామ్నాయ అవకాశం కూడా లేదు గనుక తెలంగాణా అంశం పట్టుకొని ముందుకు సాగిపోతోందని చెప్పవచ్చును.   ఒకవేళ ఆ పార్టీకి కూడా ఆంద్రా ప్రాంతంలో గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉండిఉంటే, బహుశః బీజేపీ కూడా తెలంగాణా అంశంపై కాంగ్రెస్,వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రస్తుతం అనుసరిస్తున్న వైఖరినే అవలంబించి ఉండేదేమో!

బాంబులతో రాజకీయనాయకుల బంతులాటలు

  రాష్ట్రం నుండి తెలంగాణా విడిపోతే నక్సలయిట్లకు నిలయంగా మారుతుందనే అంశంపై గతంలో రాజకీయ నేతల మద్య చాలా తీవ్ర స్థాయిలో వాదప్రతివాదాలు జరిగాయి. ఇప్పుడు హైదరాబాద్ బాంబు ప్రేలుళ్ళ నేపద్యంలో తెలంగాణా విడిపోతే హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు నిలయంగా మారుతుందని అంటూ మంత్రి టీజీవెంకటేష్ కొత్త చర్చ మొదలుపెట్టగా, దానికి విజయవాడ యం.పీ.లగడపాటి రాజగోపాల్ వంతపాడటంతో సహజంగానే మళ్ళీ తెలంగాణావాదుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి.   మొట్ట మొదట పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, “రాష్ట్ర విభజన జరగకుండా ఆపేందుకు టిజి వెంకటేష్, లగడపాటి ఇద్దరూ ఈ బాంబు ప్రేలుళ్ళలో ఏమయినా పాత్ర పోషించారా? కుట్రలో వీరికి ఏమయినా భాగం ఉందా అనే కోణంలో కూడా విచారణ చెప్పటాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు. అయితే, ఉగ్రవాదులతో, దేశద్రోహనేరంతో తోటి కాంగ్రెస్ వారిని ముడిపెట్టడం ఎంతవరకు సబబో ఆయనకే తెలియాలి. తద్వారా ప్రతిపక్షాలకు ఆయన ఎటువంటి సందేశం ఇస్తున్నారో ఆయనకి అర్ధం అయినట్లు లేదు.   వీరి గొడవ ఇలా సాగుతుంటే, మరో వైపు తెలంగాణా జేయేసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కూడా రంగ ప్రవేశం చేసి, అసలు కాంగ్రెస్ అసమర్ధ పరిపాలనవల్లనే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని, రాష్ట్రం మొత్తం ఉగ్రవాదులకు నిలయంగా మారిందని, అందుకు రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీనే తప్పు పట్టాలని అన్నారు.   దేశ భద్రతకే పెనుసవాలు విసిరిన ముష్కర మూకలను ప్రాంతాలకు, మతాలకు అతీతంగా కలిసికట్టుగా ఎదుర్కోనవలసిన ఈ తరుణంలో, ఈ విదంగా బాంబు ప్రేలుళ్ళను కూడా రాజకీయం చేసి, ప్రాంతీయవాదం, సమైక్యవాదం అంటూ మీడియాకెక్కి మరీ మన రాజకీయ నాయకులు కీచులాడుకోవడం ప్రజలకు వారిపట్ల ఏహ్యత కలిగిస్తోంది. ఇటువంటి వారిని తమ ప్రతినిధులుగా ఎన్నుకొనందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు.

వాగ్దానాలొకరివి, అమలు చేసేవారువేరొకరూ?

  జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు ఆ పార్టీలో అధికారికంగా ఏ పదవీ లేకపోయినప్పటికీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె గత కొన్ని నెలలుగా పాదయాత్ర చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీని అభిమానించేవారు ఎవరయినా ఆ పార్టీ కోసం పనిచేయవచ్చును. కనుక ఆమె పాదయాత్రను కూడా ఎవరూ తప్పుపట్టలేరు. కానీ, ఆమె ఆ పార్టీ అధ్యక్షుడి సోదరి అనే ఏకైక అర్హతతో పార్టీ తరపున వాగ్దానాలు గుప్పించడం మాత్రం సహేతుకంగా లేదు. అదేపని, పార్టీ గౌరవద్యక్షురాలిగా ఉన్న ఆమె తల్లి విజయమ్మగారో, లేదా పార్టీలో అధికారిక బాధ్యతలు నిర్వహిస్తున్న మరెవరయినా చేసి ఉంటే సహేతుకంగా ఉండేది. కానీ షర్మిల, పార్టీతో ఏ సంబంధము లేకపోయినా తన సోదరుడు జగన్ తరపున షర్మిల లెక్కలేనన్ని పెద్దపెద్ద వాగ్దానాలు అవలీలగా గుప్పించడం చాలా విడ్డూరం.   పార్టీలో ఏ అధికారిక హోదా కలిగి ఉందని ఆమె కేవలం పార్టీ అధ్యక్షుడి చెల్లెలు అనే ఏకైక హోదాతో ఈ విధంగా వాగ్దానాలు చేయడమంటే, పార్టీని కుటుంబ వ్యవహారం గా చూస్తున్నారు తప్ప ఒక రాజేకీయ వేదికగా భావించడంలేదని అనుకోవాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ఇప్పుడు ఆమె చేస్తున్న వాగ్దానల్లన్నీ కూడా నీటి మీద వ్రాతలే అనుకోక తప్పదు. ఇందుకు మరో ప్రత్యామ్నాయం ఏమిటంటే, పార్టీలో అధికారికంగా ఏదో ఒకపదవి చేప్పట్టి ఆప్పుడు ఇటువంటి వాగ్దానాలు పుంకానుపుంకాలుగా చేసుకోవచ్చును. లేదా పనిలోపనిగా ఆమె ఇప్పుడు (తన సోదరుడి తరపున) ప్రజలకు చేస్తున్నవాగ్దానాలను, అతను ఖచ్చితంగా అమలుచేస్తాడని లేదా తనే స్వయంగా అతనిచేత అమలు చేయిస్తానని, మరో ప్రత్యేక వాగ్దానం కూడా చేస్తుండటం మంచిది.   రాజకీయపార్టీలు అధికారికంగా చేస్తున్న వాగ్దానాలకే దిక్కు లేన్నపుడు, పార్టీతో ఏ సంబందమూ లేని ఆమె చేస్తున్న వాగ్దానాలను, వేరొకరు ఎలా అమలుచేస్తారని ఆలోచిస్తే, ఇదంతా ఎంత నిరుపయోగమయిన కార్యక్రమమో అర్ధం అవుతుంది. ఆమె తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి జైల్లో ఉన్న కారణంగా తమ పార్టీని బ్రతికించి ఉంచుకోవడానికి మాత్రమే పాదయాత్రలు చేస్తూ, పార్టీని గురించి ప్రచారం చేసుకొంటూ, అధికార పార్టీని విమర్శించుకొంటూ ముందుకు సాగిపోవచ్చును. ఇంకా ఆసక్తి ఉంటే,  కానీ ఈవిధంగా తన నోటికొచ్చిన వాగ్దానాలు ఎడాపెడా చేసుకుపోవడం, ప్రజలను తన అన్నకు ఓటేయమని కోరడం, అతనికి ఓటేస్తే తన వాగ్దానాలన్నిటినీ అతను నేరవేరుస్తాడని చెప్పడం విచిత్రంగా ఉంది.   ఉదాహరణకు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గనుక, అతను చేసే వాగ్దానాలకు అధికారికంగా చేసినవని చెప్పవచ్చును. (వాటిని అతను అమలు చేస్తాడా లేదా అనేది తరువాత సంగతి) కానీ, అదే అతని కుమారుడు లోకేష్ పాదయాత్రలు చేసి వాగ్దానాలు చేసినట్లయితే మాత్రం వాటికి విలువ ఉండదు.   కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీకి మొదటి నుండే ఒక అధికారం కట్టబెట్టారు. గనుక, అతని వాగ్దానాలకు కూడా అధికారికమయినవే అవుతాయి. ప్రస్తుతం అతను పార్టీ ఉపాద్య్యక్షుడు కూడా అయ్యాడు గనుక, అతని ప్రతీ వాగ్దానం కూడా పూర్తీ అధికారికంగా చెలామణి అవుతాయి.   కనుక, షర్మిల కూడా పార్టీలో అధికారికంగా ఏదయినా పదవి పుచ్చుకొని, అప్పుడు ఇటువంటి వాగ్దానాలు చేస్తే సబబుగా ఉంటుంది. లేకుంటే, ఆమె ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నట్లు భావించవలసి ఉంటుంది.

మళ్ళీ రాష్ట్రానికి అవే విదిలింపులు

  గత మూడు దశాబ్దాలుగా రైల్వేమంత్రిగా ఎవరు బాధ్యతలు చేప్పటినప్పటికీ, అందరికీ మన రాష్ట్రం అంటే చిన్న చూపే. వివిధ రాష్ట్రాలకు చేసిన కేటాయింపులతో పోలిస్తే, మన రాష్ట్రం ఎప్పుడు కూడా ఆఖరి వరుసలోనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ మనుగడకు 42 మంది యం.పీ.లను మన రాష్ట్రం అందిస్తున్నప్పటికీ, మరెందుకో తెలియదు కానీ మొదటి నుండి మన రాష్ట్రం అంటే చిన్నచూపే. అయినప్పటికీ, కేంద్రం పట్ల మన విదేయతలో వీసమంత మార్పులేదు. నిలదీసి ప్రశ్నించే ప్రసక్తే లేదు.   తమిళనాడు, ఒరిస్సా, రాజస్తాన్,బీహార్, బెంగాల్ మొదలయిన రాష్ట్రాలకు చెందిన నేతలు, తమకు అవసరమయిన ప్రాజెక్టులను, రైల్వే లయిన్లను, కొత్త రైళ్ళను తీవ్ర ఒత్తిడి చేసి మరీ సాధించుకొంటుంటే, మన రాష్ట్రానికే చెందిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సాక్షాత్ రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నపటికీ కొత్తగా సాదించింది ఏమి లేదు. ఇక రైల్వేలోఉన్న మంత్రిగారే ఏమిచేయలేన్నపుడు, ఇక మన 42 మంది యం.పీ.లు మనకి ఏదో ఓరగబెడతారనుకోవడం ఒట్టి భ్రమ.   కొంతమంది యం.పీ.లు తమకి తెలంగాణా సమస్య కంటే మరేమీ ప్రాధాన్యం లేదని బహిరంగంగానే చెపుతారు. మిగిలిన వారు రాజకీయ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడంలో, పార్టీ అంతర్గత కుమ్ములాటలతో, తమ స్వంత వ్యాపారాలు, కాంట్రాక్టులతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు.   రాష్ట్ర ప్రయోజనాలకంటే స్వప్రయోజనాలే వారికి మిన్న. ఒకవేళ ఎవరయినా యం.పీ. డిల్లీ చుట్టూ తిరిగి ఒక రైల్వే ప్రాజెక్ట్ కానీ, మరొకటి కానీ సాదించేందుకు కృషి చేస్తుంటే, తమ రాజకీయ ప్రాభల్యం ఎక్కడ దెబ్బతింటుందో అనే బెంగతో, అతని లేదా ఆమె కాళ్ళుపట్టుకు లాగడానికి ప్రయత్నించేవారే తప్ప, వారితో చేతులు కలిపి కృషిచేయడం అరుదు. కొందరికి ప్రాంతీయ వాదం అడ్డొస్తే, మరికొందరికి అసూయ, అహం, బేషజం వంటివి అడ్డొస్తాయి.   మొత్తం మీద, ప్రతీ ఏట రైల్వేమంత్రిగారు మనకి మొండి చేయడం చూపడం, మనకి రావాల్సిన, దక్కాల్సిన, రైళ్ళను, ప్రాజెక్టులను ఇరుగుపొరుగు రాష్ట్రాలవారు గద్దలా తన్నుకు పోవడం షరా మామూలే. ప్రజలు నిస్సహాయంగా చూస్తూ ఈ విధంగా ఆక్రందనలు చేయడము మామూలే.   తిరుపతి, విశాఖలలో కొత్త రైల్వే జోన్ల ఏర్పాటు, రాష్ట్రంలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను దేశంలో ప్రముఖ నగరాలతో కలుపుతూ కొత్త రైళ్ళు వంటి డిమాండ్లు చాలానే ఉన్నపటికీ, ఈసారి రైల్వే బడ్జెట్లో కర్నూల్ లో వేగన్ రిపేర్ వర్క్ షాప్, 22కొత్త లైన్ల నిర్మాణానికి అనుమతులు మాత్రమే పెర్కొనవలసినవి. ఈ కొత్త ప్రాజెక్టులు ఈ ఏడాది మొదలు పెడితే అవి ఎన్ని సంవత్సరాల తరువాత పూర్తవుతాయో ఎవరికీ తెలియదు. అందువల్ల వాటివల్ల రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు ఒరిగేదేమీ లేదు.   రాష్ట్రానికి రెండు,మూడు కొత్త రైళ్ళను విదిలించిన మన రైల్వేమంత్రి బన్సాల్ గారు, విజయవాడలో రైల్‌నీరు బాటిలింగ్‌ ప్లాంటును, విశాఖలో డిల్లీ తరహాలో (విదేశీ) పర్యాటకులకు విలాసవంతమయిన విశ్రాంతి గదులను ఏర్పాటు చేయడమే ఆయన మన రాష్ట్రానికిచ్చిన ఒక పెద్దవరం అన్నట్లు అభివర్ణించి చెప్పడం పుండు మీద కారం చల్లడమే అవుతుంది. విజయవాడలో నీళ్ళ ప్లాంటు, విశాఖలో విలాసవంతమయిన విశ్రాంతి గదులవల్ల రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల వారికి ఏమి ప్రయోజనమో ఆయనే చెప్పాలి.   ప్రజలు కోరుకొంటున్నవాటికి, ఆయన ఇస్తున్నవాటికీ ఎక్కడా పొసగదు. ప్రజలకి కొత్త రైళ్ళు కావాలి, కొత్త రైల్వే జోన్లు కావాలి, ఉపాధి కల్పించే కోచ్చ్ ఫ్యాక్టరీ కావలి తప్ప నీళ్ళ ప్లాంటులు, లిఫ్టులూ, విలాసవంతమయిన విశ్రాంతి గదులు కాదు. మన యం.పీ.లలో చైతన్యం లేనపుడు, మంత్రిగారు మాత్రం ఏమిచేస్తారు? అడగందే అమ్మయినా పెట్టదని పెద్దలు ఊరికే అనలేదు.