బాలకృష్ణ హ్యాపీ.. 27 ఏళ్ల తరువాత గెలిచిన టిడిపి

  27 ఏళ్ల తరువాత హిందూపురం మున్సిపల్‌ స్థానాన్ని టీడీపీ గెలుచుకోవడం శుభపరిణామమని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ కోసం హిందూపురం మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎక్స్‌ ఆఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే హోదాలో బాలకృష్ణ, ఎంపీ నిమ్మల కిష్టప్ప ఓటేశారు. మున్సిపల్‌ చైర్మన్‌గా ఆర్‌.లక్ష్మి , వైఎస్‌ చైర్మన్‌గా జీపీకే రాములు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. కౌన్సిల్‌ సభ్యులందరితో సమన్వయం చేసుకుని మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు.

వైకాపా అమర్‌నాథ్‌రెడ్డిపై కిడ్నాప్ కేసు

  రాజంపేటకు చెందిన వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిపై పట్టణ పోలీసు స్టేషన్‌లో కిడ్నాప్‌, నిర్బంధ కేసు నమోదైంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటిమిట్ట మండలం నర్వకాటిపల్లె ఎంపీటీసీ స్థానంలో గంగాదేవి విజయం సాధించారు. శుక్రవారం మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నికలు జరగనుండడంతో తన భార్య గంగాదేవి ఉదయం నుంచి కనిపించడం లేదని ఆమె భర్త నరసింహులు రాజంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి ఇంట్లో నిర్బంధించినట్టు తెలియడంతో వెళ్లామని, తమను ఎమ్మెల్యే కులం పేరుతో దూషించారని నరసింహులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు విచారిస్తున్నారు.

జమ్మలమడుగులో ఉద్రిక్తత

  మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికలలో తెలుగుదేశం, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లు పోటాపోటీగా ఉన్న మున్సిపాల్టీలలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.జమ్మలమడుగు మున్సిపాలిటీలో కౌన్సిలర్‌ జానీని వైకాపా శ్రేణులు కిడ్నాప్‌ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైకాపా ఎమ్మెల్యే అనుచరులే జానీని కిడ్నాప్‌ చేసినట్టు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ముళ్లజానీ కిడ్నాప్‌పై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వెయ్యిమంది కార్యకర్తలు జమ్మలమడుగు మున్సిపల్‌ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. వైకాపా కౌన్సిలర్లతో కలిసి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైకాపా, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఇరు వర్గాలను చెదరగొట్టారు.

విజయవాడ మేయర్‌గా కోనేరు శ్రీధర్

  ఆంధ్రప్రదేశ్ లో నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలకు పరోక్ష ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌గా కోనేరు శ్రీధర్‌, డిప్యూటీ మేయర్‌గా గోగుల రమణారావు ఎన్నికయ్యారు. విజయవాడ కార్పొరేషన్ లో మొదటిసారి టిడిపి పీఠం దక్కించుకుంది. కార్పొరేషన్ లో మొత్తం 38 వార్డులు ఉండగా అందులో 37 స్థానాలను టిడిపి, ఒకస్థానంలో ఇండిపెండెంట్ గెలుపొందారు. అలాగే బాపట్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా తోట మల్లేశ్వరి, వైఎస్‌ చైర్మన్‌గా రాము ఎన్నికయ్యారు. మరోవైపు కోదాడ మున్సిపల్‌ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు టీడీపీ కౌన్సిలర్లను కాంగ్రెస్‌ పార్టీ వారు అక్రమంగా తరలించారని ఆరోపిస్తూ కోదాడ మున్సిపల్‌ కార్యాలయం వద్ద టీడీపీ కౌన్సిలర్లు ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.

తెలంగాణాలో రూ.1000కోట్ల పెట్టుబడితో ఇనుప కర్మాగారం

  హీరో మోటార్ సైకిల్స్ ఉత్పత్తి సంస్థను దక్కించుకొన్న తెలంగాణాకు మరొక భారీ పరిశ్రమ కూడా తరలి వచ్చింది. ఆస్ట్రియాకు చెందిన యన్.యస్.యల్. కన్సోలిడేటడ్ లిమిటడ్ అనే సంస్థ రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఇనుము కర్మాగారం స్థాపించేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీన్ ఫ్రీమ్యాన్ నేతృత్వంలో ప్రతినిధి బృందం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిన్న హైదరాబాదులో కలిసి ఒప్పందం దాదాపు ఖరారు చేసుకొంది. దాని ప్రకారం కరీంనగర్ జిల్లా ఆత్మకూరు వద్ద ఒక కర్మాగారం, మెదక్ జిల్లాలో సిద్ధిపేట వద్ద మరొకటి స్థాపించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. వీటి ద్వారా దాదాపు 1,000 మందికి ప్రత్యక్షంగా అనేక వందల మందికి పరోక్షంగా ఉపాధి దొరకుతుంది. ఈ రెండు కర్మాగారాలలో ఐరన్ పిల్లట్లు (ఇనుప దిమ్మలు) తయారవుతాయి. ఇవి ఉక్కు కర్మాగారాలకు ముడి సరుకుగా ఉపయోగించబడుతాయి. ఈ రెండు జిల్లాలలో ఏడాదికి దాదాపు 200 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ లభ్యత ఉంది గనుక మొదటి దశలో కరీంనగర్ కర్మాగారం స్థాపించేందుకు రంగం సిద్దమవుతోంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నెల కూడా గడవక మునుపే రెండు భారీ పరిశ్రమలు రావడం చాలా హర్షణీయం. వీటికి అనుబంధంగా మళ్ళీ అనేక చిన్న పెద్ద పరిశ్రమలు అనేకం రావచ్చును. వాటి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా తెలంగాణా రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందడం తధ్యం.

తెలంగాణను ఇష్టపడిన హీరో

  ఈ హీరో సినిమా హీరో కాదు. భారతదేశంలో నంబర్:1 మోటార్ సైకిల్స్ ఉత్పత్తి సంస్థ ‘హీరో’ మొటోకార్ప్. ఇంతవరకు ఉత్తరాదిన ఐదు ఉత్పత్తి కేంద్రాలను స్థాపించిన ఈ హీరో మొట్టమొదటిసారిగా దక్షిణాదిన అడుగుపెట్టాలనుకొంటున్నట్లు ప్రకటించగానే, ఆ హీరోని దక్కించుకొనేందుకు ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు పోటీ పడ్డాయి. రెండు ప్రభుత్వాలు కూడా సదరు సంస్థ డైరెక్టర్ తో సంప్రదింపులు జరిపాయి. తమ రాష్ట్రంలో ఆ పరిశ్రమను స్థాపించినట్లయితే ఏమేమీ ప్రోత్సాహకాలు ఇస్తాయో తెలియజేసాయి. సదరు సంస్థ యాజమాన్యం చివరికి తెలంగాణా లోనే తమ సంస్థను స్థాపించాలని నిర్ణయించుకొన్నట్లు తాజా సమాచారం. తెలంగాణా ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇవ్వజూపడం, హైదరాబాద్ అన్ని విధాల అభివృద్ధి చెంది ఉండటం, చక్కటి సాంకేతిక నిపుణులు లభ్యత, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మొదలయిన రాష్ట్రాలను కలుపుతూ చక్కటి రోడ్లు, రవాణా సదుపాయాలు కలిగి ఉండటం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణాకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

సచిన్ ఎవరు?.. షరపోవా పొగరు!

  ఇంటర్నేషనల్ టెన్నిస్ స్టార్ మారియా షరపోవా కళ్ళుచెదిరే అందగత్తె మాత్రమే కాదు అద్భుతమైన టెన్నిస్ క్రీడాకారిణి కూడా. అయితే అందం, కీర్తి, డబ్బు వున్న షరపోవాకి పొగరు కూడా బోలెడంత వుంది. ఆ పొగరు ఏ స్థాయిలో వుందంటే, సచిన్ టెండూల్కరా? అతనెవరు? ఈ పేరు నేనెప్పుడూ వినలేదు అనేంత స్థాయిలో వుంది. వింబుల్డన్ పోటీలను తిలకించడానికి సచిన్ టెండూల్కర్ వెళ్ళాడు. అక్కడ ప్రముఖులు కూర్చునే గ్యాలరీలో పలువురు ప్రముఖులతో కలసి కూర్చుని షరపోవా ఆడే టెన్నిస్ చూశాడు. షరపోవా మ్యాచ్‌లో గెలిచిన తర్వాత ఒక టీవీ రిపోర్టర్ ఆమె ఇంటర్వ్యూ తీసుకున్నాడు. మీ మ్యాచ్ చూడటానికి సచిన్ టెండూల్కర్ కూడా వచ్చాడు తెలుసా అని గొప్పగా చెప్పాడు. దానికి షరపోవా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి ‘సచిన్ టెండూల్కరా.. అతనెవరు?’ అంది దాంతో తెల్లబోవడం సదరు రిపోర్టు వంతయింది. క్రికెట్ రంగంలో తనకంటే ఎక్కువ స్థాయిలో వున్న సచిన్ టెండూల్కర్ గురించి షరపోవాకి నిజంగా తెలియదా.. లేక తెలిసి కూడా పొగరు చూపించిందా? నో డౌట్.. అది పొగరే!

తెలంగాణ మండలి అధ్యక్షుడు స్వామిగౌడ్

  తెలంగాణ శాసన మండలి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఎన్నికయ్యారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన ఎన్నికలలో స్వామిగౌడ్‌కు 21 ఓట్లు వచ్చాయి. దాంతో ఆయన శాసనమండలి ఛైర్మన్‌గా ఎన్నికైనట్టు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రకటించారు. మండలి ఛైర్మన్ పదవికి ఓటింగ్‌కి ముందే కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఎన్నికకు దూరంగా వుంది. దాంతో స్వామిగౌడ్ ఎన్నిక లాంఛనప్రాయమైంది. శాసనమండలి అధ్యక్షుడిగా ఎన్నికైన స్వామిగౌడ్‌ని టీఆర్ఎస్ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ, శాసనమండలి అధ్యక్షుడిగా తన విధి నిర్వహణ సక్రమంగా చేస్తానని అన్నారు. తెలంగాణ శాసనమండలి దేశంలోనే ఆదర్శ శానసమండలిలా వుండేలా కృషి చేస్తానన్నారు.

సునంద మృతిపై విచారణ జరిపించండి: థరూర్

  తన భార్య సునందా పుష్కర్ మృతిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తే తాను అన్నిరకాలుగా సహకరిస్తానని కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం శాసనసభ్యుడు శశిథరూర్ ప్రకటించారు. సునందా పుష్కర్ మరణం సహజమేనని తనతో బలవంతంగా చెప్పించారని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం ప్రధాన అధికారి అయిన సుధీర్ గుప్తా ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశంపై దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. దాంతో శశి థరూర్ బయటకి వచ్చి వివరణ ఇవ్వక తప్పలేదు. శశి థరూర్ భార్య సునందా పుష్కర్ ఈ ఏడాది జనవరి 17వ తేదీన దక్షిణ ఢిల్లీలోని లీలా హోటల్ సూట్ నెం.345లో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె మరణాన్ని సహజ మరణంగా వైద్యులు పేర్కొన్నారు. ఇప్పుడు అసలు విషయం బయట పెట్టారు.

వీటి దుంపతెగ.. ప్రాణం తీశాయి...!

  ఖమ్మం జిల్లాలో విషాద సంఘటన జరిగింది. అడవి దుంపలు తిన్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఖమ్మం జిల్లాలోని వెంకటాపురం అటవీ ప్రాంతంలో కూలీ పనులకు వెళ్ళిన కొంతమంది అడవిలో దొరికిన తెల్లచెన్నంగడ్డ అనే దుంపలను తవ్వుకుని ఇంటికి తెచ్చుకున్నారు. ఇంటి దగ్గర ఆ దుంపలను ఉడికించుకుని తిన్నారు. అయితే అవి విషపు దుంపలు కావడంతో భద్రమ్మ అనే 55 సంవత్సరాల మహిళ మరో ఎనిమిది మంది వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. అడవిలో దొరికే అన్ని దుంపలూ తినడానికి పనికిరావని, అడవుల్లో విషపూరిత దుంపలు ఎక్కువగా వుంటాయి కాబట్టి గుర్తు తెలియని దుంపల్ని తినరాదని అధికారులు అంతా అయిపోయిన తర్వాత ప్రకటించారు.

నాగార్జున సాగర్ దగ్గర నీటి గోల!

  అధికార పార్టీ కార్యకర్తలే ధర్నా చేసే కార్యక్రమాన్ని కళ్ళారా చూసి తరించాలంటే మనం నాగార్జున సాగర్ దగ్గరకి వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిన మీదట కేంద్ర జలసంఘం జులై 8 వరకు రోజుకు ఆరువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జల సంఘాన్ని డిమాండ్ చేసింది. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర బుధవారం టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి.

తరుణ్ తేజ్ పాల్ కు బెయిల్

  లైంగిక దాడి కేసులో ఆరు నెలలుగా జైలు వాసం గడుపుతున్న తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతు విధిస్తూ జస్టిస్ విక్రమ్‌జిత్, జస్టిస్ ఎస్‌కె సింగ్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఆయనకు బెయిల్ ఇచ్చింది. తేజ్‌పాల్ పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన సుప్రీం.. విచారణ కోసం క్రమం తప్పకుండా ట్రయల్ కోర్టుకు హాజరు కావాలని పేర్కొంది. తన సహోద్యోగి అయిన పాతికేళ్ల అమ్మాయిపై లిఫ్టులో లైంగిక దాడి జరిపాడన్నది తేజ్‌పాల్‌పై ఆరోపణ. గత ఏడాది నవంబర్ 30న ఆయన్ని అరెస్టు చేశారు. అప్పటి నుంచి గోవాలోని జైల్లో ఉంటున్నాడు. తేజ్‌పాల్ తరఫున యూపీయే హయాంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా ఉన్న సల్మాన్ ఖుర్షీద్ కోర్టులో వాదిస్తుండటం విశేషం.

అమెరికాకి మోడీ సర్కార్ వార్నింగ్!

భారతదేశంలోని భారతీయ జనతాపార్టీ నాయకుల కాల్డేటాను అమెరికా తస్కరించిందన్న వార్త దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం బుధవారం అమెరికా దౌత్యవేత్తలను పిలిపించి చర్చించింది. అమెరికా అత్యుత్యాహంతో చేసే ఇలాంటి గూఢచర్య చర్యలు భారత ప్రభుత్వానికి ఆమోద యోగ్యం కాదని తేల్చి చెప్పింది. పొరపాటైపోయిందని, మళ్లీ అలాంటి తప్పు చేయమని అమెరికా భారత ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. అలా హామీ ఇచ్చినప్పటికీ చట్ట ప్రకారం అమెరికా దౌత్య అధికారులకు భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది.

ఎన్ కన్వెన్షన్‌పై చట్టాన్ని అతిక్రమించొద్దు: కోర్టు

  సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ విషయంలో కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వమైనా, ఎవరైనా చట్టాన్ని అతిక్రమించకూడదని, చట్టపరంగానే నడుచుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎన్ కన్వెన్షన్పై చర్యలు తీసుకోకూడదని ప్రభుత్వానికి తెలిపింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లోని తమ్మిడికుంట చెరువు భూమిని ఆక్రమించి తాము ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించామని ఆరోపిస్తూ రెవెన్యూ అధికారులు కన్వెన్షన్ సెంటర్‌లోని నిర్మాణాలను మార్కింగ్ చేయడాన్ని సవాలు చేస్తూ ఎన్‌ కన్వెన్షన్ యజమాని, సినీ నటుడు అక్కినేని నాగార్జున, దాని లీజుదారు ఎన్3 ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధి నల్లా ప్రీతమ్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి విచారణ ముగించారు. సర్వే చేసేటట్లయితే ముందస్తుగా యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాలని, ఏ చర్యలు తీసుకుంటారో స్పష్టంగా చెప్పాలని ఆదేశించారు. ప్రభుత్వం కూడా చట్టపరంగా నడుచుకోవాలని, చట్టాన్ని అతిక్రమించకూడదని స్పష్టంగా సూచించారు. అదే సమయంలో, ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమేనంటూ అడ్వకేట్ జనరల్ చేసిన వాదనను కూడా రికార్డు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇద్దరు పెళ్ళాల మొగుడి దీనగాథ!

  మామూలుగా సినిమాల్లో అయితే ఇద్దరు పెళ్ళాల మొగుడి పరిస్థితి బాగానే వుంటుంది. పెళ్ళాలిద్దరూ జుట్టూ జుట్టూ పట్టుకుని కొట్టుకుంటూ వుంటారు. ఇద్దరూ ఎవరికి వారే మొగుణ్ణి బాగానే చూసుకుంటూ వుంటారు. మొగుణ్ణి సంతోషంగా వుంచే విషయంలో మాత్రం ఒకరితో ఒకరు పోటీ పడుతూ వుంటారు. సినిమాలో అయితే ఈ టైపులో వుంటుంది గానీ, రియల్ లైఫ్‌లో మాత్రం ఇద్దరు పెళ్ళాలున్న మొగుడి పరిస్థితి మరో టైపులో వుంటుంది. అది ఏ టైపు అనేదానికి ఉదాహరణగా నిలిచే మొగుడు గారు కర్ణాటకలోని దొడ్డబళ్ళాపురం తాలూకాలోని కుక్కలహళ్ళి గ్రామంలో కనిపించాడు. నారాయణస్వామి అనే ఆసామికి యశోద, గంగ అని ఇద్దరు పెళ్ళాలు. నారాయణస్వామికి తండ్రి నుంచి సంక్రమించే ఆస్తి విషయంలో అన్నదమ్ములతో కొంతకాలంగా వివాదం వుంది. అయితే చివరికి అన్నయ్యలని గౌరవించి ఆస్తి విషయంలో నారాయణస్వామి అన్నయ్యలు చెప్పినట్టు వినాలని అనుకున్నాడు. అయితే ఈ విషయంలో ఆయనగారి ఇద్దరు పెళ్ళాలు ఒకేమాట మీద నిలిచి, ఆస్తి విషయంలో రాజీపడటానికి వీల్లేదని నారాయణస్వామికి వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆయన వాళ్ళు తన పెళ్ళాలే కదా అని లైట్‌గా తీసుకున్నాడు. అప్పుడు ఇద్దరు పెళ్ళాలు తమ అసలు స్వరూపం చూపించారు. యశోదమ్మ, గంగమ్మ ఇద్దరూ నారాయణ స్వామితో గొడవపడి కళ్లల్లో కారం కొట్టి కొడవలితో దాడి చేశారు. ఈ గొడవలో నారాయణస్వామి చేతి వేళ్లు తెగిపోవడంతో పాటు ఛాతీపై కొడవలి దెబ్బలు పడ్డాయి. ఇద్దరూ భార్యలూ కలసి మొగుణ్ణి ‘కొట్టరానిచోట’ కూడా కొట్టడంతో నారాయణస్వామి స్పృహతప్పి పడిపోయాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో వున్నాడు. ఇద్దరు పెళ్ళాలూ పోలీసుల అదుపులో వున్నారు. ఇరువురు భామల మధ్యలో పడి ‘నలగడం’ అంటే ఇదేనేమో!

కోడిగుడ్డు కోర్టుకు ఈడ్చింది

కోడిగుడ్డు ఇరుగు పొరుగు వారి మధ్య గొడవకి కారణమైంది. చివరికి వాళ్ళు జుట్టూ జుట్టూ పట్టుకుని పోలీస్ స్టేషన్‌కి, ఆ తర్వాత కోర్టుకి వెళ్ళడానికి కారణమై కూర్చుంది. అనంతపురం జిల్లాలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి చెందిన కోడి తన యజమాని ఇంట్లో గుడ్లు పెట్టకుండా, ఎదురింట్లోకి వెళ్ళి గుడ్లు పెట్టేది. ఆ ఎదురింట్లో వుండే పెద్దమనిషి అవి తమ కోడి పెట్టిన గుడ్లే అనుకుని సదరు గుడ్లతో రోజుకో వెరైటీ వంటకం చేయించుకుని ఎంచక్కా తినేవాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కోడి ఓనరు ఫ్యామిలీ ఎదురింటి వాళ్ళతో గొడవ పెట్టుకుంది. మాటా మాటా పెరిగి రెండు కుటుంబాలు తిట్టుకుని, తన్నుకుని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. అయితే పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఈ కేసును లైట్‌గా తీసుకున్నారు. దాంతో కోడి ఓనర్ ఫ్యామిలీ ఈ కేసులో తమకు న్యాయం జరగటం లేదంటూ మానవ హక్కుల కమిషన్‌ దగ్గరకి వెళ్ళి మొరపెట్టుకున్నారు. అక్కడ ఇంకా ఏ విషయం తేలలేదు. ఇంతకీ ఈ గొడవలో తప్పు ఎవరిది? ఎదురింట్లో గుడ్డు పెట్టిన కోడిదా? చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా మారుస్తున్న మనుషులదా?

సునందా పుష్కర్ మరణం మిస్టరీ.. హత్యా?

  కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ భార్య సునందా పుష్కర్ ఈ ఏడాది జనవరి 17వ తేదీన దక్షిణ ఢిల్లీలోని లీలా హోటల్ సూట్ నెం.345లో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె మరణాన్ని సహజ మరణంగా వైద్యులు పేర్కొన్నారు. అయితే అప్పుడు సునంద మరణం ‘సహజం’ అని నివేదిక ఇచ్చిన ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్తా ఇప్పుడు అసలు గుట్టు విప్పారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం ప్రధాన అధికారి అయిన సుధీర్ గుప్తా అసలు విషయం బయటపెట్టారు.  సునందా పుష్కర్ మృతిపై తాము చెప్పినట్లుగా నివేదిక ఇవ్వాలని ఉన్నతస్థాయి నుంచి తనమీద  తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్లు డాక్టర్ సుధీర్ గుప్తా తాజాగా వెల్లడించారు. ఆయన నేతృత్వంలోనే సునందా పుష్కర్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. ఈ విషయంలో ఆయన ఇప్పుడు ఆరోగ్య మంత్రిత్వ శాఖకు, చీఫ్ విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. డ్రగ్ పాయిజనింగ్ వల్లనే ఆమె మరణించారని, అది ఆత్మహత్య అయినా కావచ్చు, లేదా కావాలనే ఆమెకు ఆ మందు ఇచ్చి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సరయూ నదిలో వేద విద్యార్థుల గల్లంతు!

బియాస్ నదిలో  అకస్మాత్తుగా నీటి ప్రవాహం రావడంతో 23 మంది తెలుగు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు మరణించారు. నిన్నొగాక మొన్న నల్గొం జిల్లాలోని దిండి ప్రాజెక్టులో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు కొట్టుకుపోయి మరణించారు. ఇలాంటి సంఘటనలు వెంటవెంటనే జరుగుతున్నా విద్యార్థులు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. అందుకే అలాంటి ప్రమాదమే మరొకటి జరిగింది. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని వేదపాఠశాల నుంచి దాదాపు 50 మంది విద్యార్థులు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు వెళ్లారు. అందులో భాగంగా బుధవారం ఉదయం ఫోటో దిగేందుకు సరయూ నదిలోకి దిగారు. ఇంతలో బియాస్ నది తరహాలోనే అకస్మాత్తుగా నీటి ప్రవాహం వచ్చేసంది. ఆ ప్రవాహంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు.  తోటి విద్యార్థులు హాహాకారాలు చేయడంతో స్థానికులు నదిలోకి దూకి... గల్లంతైన విద్యార్థులు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. గల్లంతైన విద్యార్థులు మల్కాజ్‌గిరికి  చెందిన కిరణ్, చక్రపాణి అని తెలుస్తోంది.