కోడిగుడ్డు కోర్టుకు ఈడ్చింది
posted on Jul 2, 2014 @ 11:15AM
కోడిగుడ్డు ఇరుగు పొరుగు వారి మధ్య గొడవకి కారణమైంది. చివరికి వాళ్ళు జుట్టూ జుట్టూ పట్టుకుని పోలీస్ స్టేషన్‌కి, ఆ తర్వాత కోర్టుకి వెళ్ళడానికి కారణమై కూర్చుంది. అనంతపురం జిల్లాలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి చెందిన కోడి తన యజమాని ఇంట్లో గుడ్లు పెట్టకుండా, ఎదురింట్లోకి వెళ్ళి గుడ్లు పెట్టేది. ఆ ఎదురింట్లో వుండే పెద్దమనిషి అవి తమ కోడి పెట్టిన గుడ్లే అనుకుని సదరు గుడ్లతో రోజుకో వెరైటీ వంటకం చేయించుకుని ఎంచక్కా తినేవాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కోడి ఓనరు ఫ్యామిలీ ఎదురింటి వాళ్ళతో గొడవ పెట్టుకుంది. మాటా మాటా పెరిగి రెండు కుటుంబాలు తిట్టుకుని, తన్నుకుని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. అయితే పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఈ కేసును లైట్‌గా తీసుకున్నారు. దాంతో కోడి ఓనర్ ఫ్యామిలీ ఈ కేసులో తమకు న్యాయం జరగటం లేదంటూ మానవ హక్కుల కమిషన్ దగ్గరకి వెళ్ళి మొరపెట్టుకున్నారు. అక్కడ ఇంకా ఏ విషయం తేలలేదు. ఇంతకీ ఈ గొడవలో తప్పు ఎవరిది? ఎదురింట్లో గుడ్డు పెట్టిన కోడిదా? చిన్న విషయాన్ని చాలా పెద్దదిగా మారుస్తున్న మనుషులదా?