ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనల వెల్లువ

  పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) సీ23 రాకెట్‌ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)తోపాటు ఇస్రో శాస్త్రవేత్తల మీద అభినందనల వర్షం కురుస్తోంది. రాకెట్ ప్రయోగాన్ని దగ్గరుండి వీక్షించిన భారత ప్రధాని నరేంద్రమోడీ శాస్త్రవేత్తలందర్నీ ఎంతో సంతోషంగా అభినందించారు. అలాగే రాకెట్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు షార్ శాస్త్రవేత్తలను అభినందనలతో ముంచెత్తారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా రాకెట్ ప్రయోగం విజయవంతం కావడానికి కారణమైన ప్రతి ఒక్కరినీ అభినందించారు.

మరో నీటిగండం: ఐదుగురు విద్యార్థుల మృతి

  ఇంజనీరింగ్ విద్యార్థుల మీద ప్రకృతి పగబట్టినట్టు కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో బీస్ నది దగ్గర జరిగిన దుర్ఘటనలో 23 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు మరణించిన విషయాన్ని ఇంకా మరువకముందే నల్లగొండ జిల్లాలోని దిండి ప్రాజెక్టు దగ్గర మరో విషాద సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారు. వీరిలో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు వున్నారు. వీరు హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. వీళ్లంతా అన్నదమ్ముల బిడ్డలు. తమ తాతయ్య దశదిన కర్మల కార్యక్రమానికి వచ్చి, ఆ తర్వాత ఆరుగురు కలిసి దిండి ప్రాజెక్టులో ఈతకు వెళ్లారు. ఐదుగురూ నీటిలో దిగిన తర్వాత ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ఈ ఐదుగురు కొట్టుకుపోయారు. ఒక్కరు మాత్రం నీటి ప్రవాహం పెరగడాన్ని గమనించి ప్రాణాలతో బయటపడ్డారు. మృతులను హర్షవర్ధన్, ప్రణీత్ రెడ్డి, అవినాష్‌రెడ్డి, దేవయాని, జ్యోత్స్నగా గుర్తించారు. మృతదేహాలు బయటపడ్డాయి.

తల్లి కాదు.. రాక్షసి!

  కన్నతల్లిని మించిన దైవం వుండదంటారు. అయితే కొంతమంది కన్నతల్లులు దైవంలా కాకుండా దయ్యంలా, రాక్షసిలా ప్రవర్తిస్తూ వుంటారు. అలాంటి తల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకరు బయటపడింది. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని పెరుమాళ్లపల్లిలో రక్తం పంచుకు పుట్టిన బిడ్డను తల్లే కర్కశంగా హతమార్చింది. ఆ రాక్షసి తల్లి పది రోజుల వయసున్న ఆడ శిశువును నీటితొట్టిలో వేసి చంపివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తల్లిని విచారిస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందన్న కారణం వల్లే ఆ తల్లి చిన్నారి శిశువును చంపినట్టు భావిస్తున్నారు. ఈ తల్లికి మొదటి కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టింది. రెండో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. చనిపోయిన పాప తల్లిదండ్రులు ప్రస్తుతం పోలీసుల అదుపులో వున్నారు.

రోడ్డు ప్రమాదం: నన్నపనేని అల్లుడికి గాయాలు

  హైదరాబాద్ శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి అల్లుడు లతీష్‌రెడ్డి గాయపడ్డారు. లతీష్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నన్నపనేని సుధకు భర్త . లతీష్‌రెడ్డి విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా హైదరాబాద్ శివార్లలో ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బ్రిడ్జిని ఢీకొని పైనుంచి కింద పడిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన లతీష్‌రెడ్డిని చికిత్స నిమిత్తం సమీప ప్రయివేటు హాస్పిటల్‌కి తరలించారు. ఈ సంఘటనలో కారు డ్రైవర్ కూడా గాయపడ్డాడు.

రాకెట్ సూపర్ సక్సెస్ అయిందోచ్!

  భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) మరో శాటిలైట్ లాంచ్ వెహికల్ (రాకెట్)ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) సీ23 రాకెట్‌ని భారత ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో సోమవారం ఉదయం 9.52 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి ప్రయోగించింది.. ఈ వాహననౌక పీఎస్‌ఎల్‌వీ సీ23 ఫ్రాన్స్‌కు చెందిన 714 కిలోల స్పాట్ 07, జర్మనీకి చెందిన 15 కిలోల ఏఐశాట్, కెనడాకు చెందిన 30 కిలోల ఎన్‌ఎల్‌ఎస్-7.1, ఎన్‌ఎల్‌ఎస్ 7.2 ఉపగ్రహాలు, సింగపూర్‌కు చెందిన 7 కిలోల వెలాక్సీ, ఇస్రోకు చెందిన 60 కిలోల అడ్వాన్స్‌డ్ ఇనర్షియల్ నావిగేషన్ సిస్టం (ఏఐఎన్‌ఎస్)ను నింగిలోకి తీసుకెళ్లింది. షార్ నుండి ఇప్పటివరకు మొత్తం 42 ప్రయోగాలు జరిగాయి. ఈ పిఎస్‌ఎల్‌వి-సి 23 ప్రయోగం 43వది కాగా పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో 27వది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ షార్‌కు చేరుకొని స్వయంగా రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించారు. ఆయనతో పాటు గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, జితేంద్ర సింగ్ ఉన్నారు. మరోసారి విజయం సాధించిన షార్ శాస్త్రవేత్తలను ప్రధాని, ఏపీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు అభినందించారు.

ప్రేమించుకున్నారని పబ్లిగ్గా తలలు నరికారు!

పాకిస్థాన్‌లో ఘోరం జరిగింది. ఒక జంట ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్న పాపానికి ఆ జంటలోని అమ్మాయి బంధువులు అందరూ చూస్తుండగా పబ్లిగ్గా ఆ జంట తలలు నరికేశారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్.లో ఈ సంఘటన జరిగింది. లాహోర్‌కి వంద కిలోమీటర్ల దూరంలోని దక్షా తెహ్సిల్ అనే గ్రామంలో నివసించే ముయాఫియా బీబీ (23) అనే యువతి పొరుగూరికి చెందిన సజ్జాద్ అహ్మద్ (27) అనే యువకుడిని ప్రేమించింది. ఈ జంట ప్రేమను ముయాఫియా బీబీ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దాంతో వీరిద్దరూ పారిపోయి జూన్ 18న పెళ్ళి చేసుకున్నారు. పదిరోజులు గడిచిన తర్వాత ఈ జంటకు ఆమె కుటుంబ సభ్యుల నుంచి ఒక సమాచారం అందింది. జరిగిందోదే జరిగిపోయింది. మేం మీ పెళ్ళిని ఆమోదిస్తున్నాం. మీరు ఇక ఇంటికి వచ్చేయొచ్చనేది ఆ సమాచారం సారాంశం. తమ పెళ్ళికి పెద్దల ఆమోదం లభించిందన్న ఆనందంతో ఆ కొత్త జంట ముయాఫియా బీబీ ఇంటికి ఆనందోత్సాహాలతో బయల్దేరింది. అయితే వాళ్ళిద్దరూ ఊళ్ళోకి అడుగుపెట్టగానే ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు ఊరి చౌరస్తాలో వారిమీద దాడి చేశారు. అందరూ చూస్తుండగానే ఆ కొత్త జంట తలలను అత్యంత కిరాతకంగా నరికేశారు. ఏ ఊరిలో అయితే తమ పరువు పోయిందో ఆ ఊరిలో అందరిముందు వారిద్దరినీ చంపడం ద్వారానే తమ పోయిన పరువు తిరిగి వస్తుందని ముయాఫియా బీబీ కుటుంబ సభ్యులు భావించారని ఆ తర్వాత పోలీసుల విచారణలో తేలింది.

నల్లారి @ నల్లధనం

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి త్వరలో బీజేపీలో చేరే అవకాశం వుందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశం మీద రాజకీయ వర్గాల్లో పెద్దగా స్పందన ఏమీ కనిపించలేదు. ఆయన ఏ పార్టీలో వుంటే ఏంటంట అనే అభిప్రాయాలే వినిపించాయి. అయితే కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పటి నుంచి ఆయన పక్కలో బల్లెంలా వున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ అంశం మీద కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఇలా అలా కాకుండా కిరణ్ కుమార్ డొక్కలో పొడిచేలా వుంది. పెద్ద అవినీతిపరుడైన కిరణ్ కుమార్ రెడ్డి తన దగ్గర వున్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడం కోసమే బీజేపీలో చేరబోతున్నారని డొక్కా విమర్శించారు. టీడీపీ, బీజేపీ మధ్య వున్న సంబంధాలను చెడగొట్టే ఉద్దేశం కూడా నల్లారి వారికి వుందని డొక్కా వారు ఆరోపిస్తున్నారు.

ఢిల్లీలో దారుణం: టాంజానియా మహిళల రేప్!

రేప్‌ల విషయంలో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంతో ఆ పక్కనే వున్న దేశ రాజధాని ఢిల్లీ కూడా పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీలో శనివారం నాడు టాంజానియా దేశానికి చెందిన ఇద్దరు యువతులు అత్యాచారానికి గురయ్యారు. కునాల్, సతీష్ అనే ఢిల్లీలోని శాస్త్రి నగర్‌లో నివసించే ఇద్దరు యువకులు తమ మీద అత్యాచారం జరిపారని ఇద్దరు టాంజానియా యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి సదరు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో వారిద్దరూ కలసి ఇద్దరు టాంజానియా యువతులను మానభంగం చేశారని తేలింది. దాంతో వారిద్దరినీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపారు.

మొదటి ప్రపంచయుద్ధానికి వందేళ్ళు!

  ప్రపంచ గమనాన్ని సమూలంగా మార్చివేసిన మొదటి ప్రపంచ యుద్ధం మొదలై నేటికి వందేళ్ళు పూర్తయింది. జూన్ 28, 1914న మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. బోస్నియా రాజధాని సారజోవోలో ఆస్ట్రియా రాజు ఫ్రాంజ్ ఫెర్డినాండ్, ఆయన భార్య సోఫీని గావ్రిలో ప్రిన్సప్ అనే అతివాది దారుణంగా కాల్చి చంపడంతో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. రాజును, ఆయన భార్యను అతివాది కాల్చి చంపడంతో ఆస్ట్రియా బోస్నియాపై యుద్ధాన్ని ప్రకటించింది. ఆ తర్వాత రష్యా, జర్మనీ, ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలన్నీ యుద్ధరంగంలోకి దిగాయి. లక్షలమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచ గతిని మార్చేసింది.

నైజీరియా మిలిటెంట్లకి ఓ కన్య హాట్ ఆఫర్

  నైజీరియాలో‌ ఇస్లామిక్ మిలిటెంట్లు ఈమధ్యకాలంలో 276 మంది స్కూళ్ళలో చదువుకునే అమ్మాయిలను కిడ్నాప్ చేశారు. ముస్లిం అమ్మాయిలు చదువుకోకూడదన్నది ఇస్లామిక్ తీవ్రవాదుల సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి వ్యతిరేకంగా స్కూలుకు వెళ్తున్న అమ్మాయిలను తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. వారికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. కిడ్నాప్‌కి గురైన అమ్మాయిలను తీవ్రవాదుల చెర నుంచి విడిపించడానికి నైజీరియా ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అమ్మాయిలను విడిచిపెట్టాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా భార్య మిచెల్ హాలీవుడ్ తారలతో కలసి విజ్ఞప్తి చేసినా తీవ్రవాదుల మనసు కరుగలేదు. ఈ నేపథ్యంలో నైజీరియా పాప్ గాయని అడోకియేను రంగంలోకి దిగింది. తీవ్రవాదులు స్కూలు అమ్మాయిలను విడుదల చేస్తే దానికి బదులుగా తన కన్యత్వాన్ని అర్పించడానికి సిద్ధంగా వున్నానని ప్రకటించి సంచలనం సృష్టించింది. తీవ్రవాదులు తమ దగ్గర బందీలుగా వున్న అమ్మాయిలందర్నీ విడిచిపెట్టి, వారికి బదులుగా తనను అదుపులోకి తీసుకోవచ్చని, తను ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్‌కి తీవ్రవాదుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోయినప్పటికీ, ఆమె చేసిన ప్రతిపాదన మాత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

గెయిల్ పేలుడు: మురళీమోహన్‌కి కోపమొచ్చింది!

  నగరం గ్యాస్ పైపులైన్ దుర్ఘటన అందరికీ కదిలించింది. ఈ దుర్ఘటనలో 16 మంది మరణించగా అనేకమంది తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. పేలుడు బాధితులను పరామర్శించేందుకు అనేకమంది నాయకులు వస్తున్నారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి వచ్చిన సినీనటుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ని కొంతమంది బాధితుల తాలూకు వ్యక్తులు చుట్టుముట్టి ఆయన మీద ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ ఆందోళన చేశారు. తమకు ఎలాంటి సాయం అందలేదని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, చుట్టపుచూపుగా వచ్చి పలకరించినంత మాత్రాన ఏమీ అయిపోదని మురళీమోహన్ను నిలదీశారు. సహజంగా మృదుస్వభావి అని, ఎవరిమీదా కోపగించుకోరని పేరు వున్న మురళీ మోహన్‌కి కూడా ఈ సందర్భంగా కోపం వచ్చింది. ‘‘అనుకోకుండా జరిగిన సంఘటన విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బాధపడుతున్నాయి. భారీగా ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. ఇంకా అనేక చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ పరామర్శకు వచ్చిన వారిని ఇలా నిలదీయడం న్యాయం కాదు’’ అని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తెలిసింది.

పళ్ళు మింగితే ఆపరేషన్ చేశారు!

  భోజనం చేసే సందర్భంలో పళ్ళు కూడా తింటే ఆరోగ్యం అని అందరికీ తెలుసు. ఈ విషయాన్ని డాక్టర్లు, న్యూట్రిషన్ నిపుణులు కూడా చెబుతూ వుంటారు. అయితే నంద్యాలలోని ఓ మహిళ భోజనంతోపాటు పళ్ళు మింగేసింది. అది డాక్టర్లు సర్జరీ చేసి ఆ పళ్ళని బయటకి తీసేంత వరకూ వెళ్ళింది. ఇంతకీ ఆ మహిళ మింగింది తినడానికి పనికొచ్చే పళ్ళు కాదు.. తినడానికి ఉపయోగించే పళ్ళు.. అవేనండీ.. కట్టుడు పళ్ళు! నంద్యాలకు చెందిన లక్ష్మి అనే మహిళకి గతంలో పళ్ళు ఊడిపోవడం వల్ల కట్టుడు పళ్ళతో నెట్టుకొస్తోంది. గురువారం నాడు ఆమె భోజనం చేస్తూ అన్నంతోపాటు కట్టుడు పళ్ళ సెట్‌కూడా మింగేసింది. దాంతో ఆమెను కుటుంబ సభ్యులు హడావిడిగా ఆస్పత్రికి తీసుకెళ్ళారు. వైద్యులు చాలా శ్రమించి, చాకచక్యంగా సర్జరీ చేసి పళ్ళ సెట్టును బయటకి తీయడంతో ఆమె, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.

కౌంట్‌డౌన్ మొదలైంది... ఎవరికి?

  కౌంట్‌డౌన్ మొదలైంది.. ఎవరికనుకుంటున్నారు? పీఎఎస్ఎల్‌వీ సి23 శాటిలైట్ లాంచర్‌కి. జూన్‌‌ 30వ తేదీన శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించే ఈ ఉపగ్రహ లాంచర్‌కి 49 గంటల కౌంట్‌డౌన్ మొదలైంది. ఈనెల 30వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల 49 నిమిషాలకు ఈ ఉపగ్రహ లాంచర్‌ని ప్రయోగించాలని మొదట భావించారు. అయితే ఆ తర్వాత ఆ సమయాన్ని 9 గంటల 52 నిమిషాలకు మార్చారు. మనదేశంతోపాటు సింగపూర్, కెనడా, జర్మనీ సంయుక్త భాగస్వామ్యంలో రూపొందిన ఈ శాటిలైట్‌ ప్రధానంగా భూమిని నిరంతరం పర్యవేక్షించే ఉద్దేశంతో రూపొందించారు. ఈ శాటిలైట్ ప్రయోగాన్ని భారత ప్రధాని నరేంద్రమోడీ దగ్గరి నుంచి వీక్షించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఆయనతోపాటు సింగపూర్, కెనడా, జర్మనీ దేశాలకు చెందిన ప్రతినిధులు కూడా ఈ శాటిలైట్ లాంచ్ రాకెట్ అంతరిక్ష ప్రయోగ ఘట్టాన్ని వీక్షిస్తారు.

ఘనంగా పీవీ జయంతి

భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు జయంతి కార్యక్రమం హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌లో జరిగింది. పీవీ జయంతిని తెలంగాణ సర్కార్ అధికారికంగా నిర్వహించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొని పీవీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ‘‘పీవీ మా తెలంగాణ బిడ్డ... ఆయన విగ్రహం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేస్తే గుంపులో గోవింద అవుతుంది. అలా కాకుండా సమున్నత స్థానంలో ఘనంగా పీవీ విగ్రహ ప్రతిష్ట చేస్తాం. దేశం గర్వించేలా ఆ కార్యక్రమం చేపడతాం. పీవీని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరచిపోదు. అలాగే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లాల్లో ఓ జిల్లాకు పీవీ పేరు పెడతాం. దాంతో పాటు జిల్లాలో స్థాపించబోయే యూనివర్సిటీల్లో ఒక దానికి పీవీ పేరు పెట్టి ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలా చేస్తాం. పీవీ గౌరవానికి తగినట్లుగా స్మారక భవనం ఏర్పాటు చేస్తాం. దేశంలో తొలిసారి భూ సంస్కరణలు తెచ్చిన వ్యక్తి పీవీ నరసింహరావు, దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఆయనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. పీవీకి భారత రత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్రాన్నికోరతాం. ఆయన ఆదర్శాలు, సంస్కరణలు, రచనలు భావి తరాలకు ఆదర్శంగా ఉండేలా చర్యలు చేపడతాం’’ అన్నారు.

విశాఖలో అమ్మోనియం ట్యాంక్ పేలింది!

తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ పేలుడు జరిగి భారీ విషాదం నెలకొన్న సందర్భంలోనే మరో పేలుడు సంఘటన విశాఖపట్టణంలో జరిగింది. విశాఖలోని పరవాడ ప్రాంతంలో వున్న ఫార్మాసిటీలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. గ్లోకెమ్ ఫార్మా కంపెనీలో అమ్మోనియం ట్యాంక్ అకస్మాత్తుగా పేలింది. ఈ  సంఘటనలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన కార్మికులను గాజువాకలోని పలు ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో పేలుడు సంభవించడం ఇది రెండోసారి. 2013 మే 30వ తేదీన ఇదే కంపెనీలో భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తువ విషయవాయువులు వెలువడి చుట్టుప్రక్కల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గతంలో ఇలాంటి అనుభవం ఎదురైనప్పటికీ కంపెనీ యాజమాన్యం కళ్ళు తెరవకపోవడం వల్లే మరోసారి ప్రమాదం జరిగిందని స్థానికులు విమర్శిస్తున్నారు.