సునందా పుష్కర్ మరణం మిస్టరీ.. హత్యా?
posted on Jul 2, 2014 @ 10:48AM
కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ భార్య సునందా పుష్కర్ ఈ ఏడాది జనవరి 17వ తేదీన దక్షిణ ఢిల్లీలోని లీలా హోటల్ సూట్ నెం.345లో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె మరణాన్ని సహజ మరణంగా వైద్యులు పేర్కొన్నారు. అయితే అప్పుడు సునంద మరణం ‘సహజం’ అని నివేదిక ఇచ్చిన ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్తా ఇప్పుడు అసలు గుట్టు విప్పారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం ప్రధాన అధికారి అయిన సుధీర్ గుప్తా అసలు విషయం బయటపెట్టారు. సునందా పుష్కర్ మృతిపై తాము చెప్పినట్లుగా నివేదిక ఇవ్వాలని ఉన్నతస్థాయి నుంచి తనమీద తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్లు డాక్టర్ సుధీర్ గుప్తా తాజాగా వెల్లడించారు. ఆయన నేతృత్వంలోనే సునందా పుష్కర్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. ఈ విషయంలో ఆయన ఇప్పుడు ఆరోగ్య మంత్రిత్వ శాఖకు, చీఫ్ విజిలెన్స్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. డ్రగ్ పాయిజనింగ్ వల్లనే ఆమె మరణించారని, అది ఆత్మహత్య అయినా కావచ్చు, లేదా కావాలనే ఆమెకు ఆ మందు ఇచ్చి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.