ఇద్దరు పెళ్ళాల మొగుడి దీనగాథ!
posted on Jul 2, 2014 @ 11:21AM
మామూలుగా సినిమాల్లో అయితే ఇద్దరు పెళ్ళాల మొగుడి పరిస్థితి బాగానే వుంటుంది. పెళ్ళాలిద్దరూ జుట్టూ జుట్టూ పట్టుకుని కొట్టుకుంటూ వుంటారు. ఇద్దరూ ఎవరికి వారే మొగుణ్ణి బాగానే చూసుకుంటూ వుంటారు. మొగుణ్ణి సంతోషంగా వుంచే విషయంలో మాత్రం ఒకరితో ఒకరు పోటీ పడుతూ వుంటారు. సినిమాలో అయితే ఈ టైపులో వుంటుంది గానీ, రియల్ లైఫ్‌లో మాత్రం ఇద్దరు పెళ్ళాలున్న మొగుడి పరిస్థితి మరో టైపులో వుంటుంది. అది ఏ టైపు అనేదానికి ఉదాహరణగా నిలిచే మొగుడు గారు కర్ణాటకలోని దొడ్డబళ్ళాపురం తాలూకాలోని కుక్కలహళ్ళి గ్రామంలో కనిపించాడు. నారాయణస్వామి అనే ఆసామికి యశోద, గంగ అని ఇద్దరు పెళ్ళాలు. నారాయణస్వామికి తండ్రి నుంచి సంక్రమించే ఆస్తి విషయంలో అన్నదమ్ములతో కొంతకాలంగా వివాదం వుంది. అయితే చివరికి అన్నయ్యలని గౌరవించి ఆస్తి విషయంలో నారాయణస్వామి అన్నయ్యలు చెప్పినట్టు వినాలని అనుకున్నాడు. అయితే ఈ విషయంలో ఆయనగారి ఇద్దరు పెళ్ళాలు ఒకేమాట మీద నిలిచి, ఆస్తి విషయంలో రాజీపడటానికి వీల్లేదని నారాయణస్వామికి వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆయన వాళ్ళు తన పెళ్ళాలే కదా అని లైట్‌గా తీసుకున్నాడు. అప్పుడు ఇద్దరు పెళ్ళాలు తమ అసలు స్వరూపం చూపించారు. యశోదమ్మ, గంగమ్మ ఇద్దరూ నారాయణ స్వామితో గొడవపడి కళ్లల్లో కారం కొట్టి కొడవలితో దాడి చేశారు. ఈ గొడవలో నారాయణస్వామి చేతి వేళ్లు తెగిపోవడంతో పాటు ఛాతీపై కొడవలి దెబ్బలు పడ్డాయి. ఇద్దరూ భార్యలూ కలసి మొగుణ్ణి ‘కొట్టరానిచోట’ కూడా కొట్టడంతో నారాయణస్వామి స్పృహతప్పి పడిపోయాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో వున్నాడు. ఇద్దరు పెళ్ళాలూ పోలీసుల అదుపులో వున్నారు. ఇరువురు భామల మధ్యలో పడి ‘నలగడం’ అంటే ఇదేనేమో!