దినేష్‌రెడ్డి బీజేపీ తీర్థం?

ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వున్న మాజీ డీజీపీ దినేష్ రెడ్డి త్వరలో భారతీయ జనతాపార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. డీజీపీగా పదవీ విరమణ చేసిన దినేష్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు కేవలం లక్షా పదిహేను వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. త్వరలో ఆయన బీజేపీలో చేరతారని సమాచారం. దినేష్ రెడ్డి నెల్లూరు జిల్లాకు చెందినవారు. అయినప్పటికీ ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయనకు తెలంగాణలో బంధుత్వాలు వున్నాయి. తెలంగాణలో బీజేపీ పుంజుకునే దశలో వున్నందున ఆయన బీజేపీ తెలంగాణ నాయకుడిగానే వుండే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది.

నాలుగు రాష్ట్రాల్లో నేడు ఉప ఎన్నికలు

  కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్... ఈ నాలుగు రాష్ట్రాల్లో గురువారం నాడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రల్లో మూడేసి స్థానాలకు, పంజాబ్‌లో రెండు స్థానాలకు, బీహార్‌‌లో పది స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఉమ్మడి శత్రువైన భారతీయ జనతాపార్టీని ఎదుర్కొనడానికి ఒకరికొకరు పెద్ద శత్రువులైన నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఈ ఉప ఎన్నికల సందర్భంగా దోస్తీ కట్టారు. వీరి దోస్తీ ఫలిస్తుందో, వికటిస్తుందో ఈ ఉప ఎన్నికల ఫలితాలు చెబుతాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా ఉప్పు, నిప్పులా వున్న వీరిద్దరూ ఈ ఎన్నికల కోసం చెట్టపట్టాల్ వేసుకున్నారు. బీహార్‌లోని పది స్థానాల్లో నితీష్, లాలూ పార్టీలో చెరో నాలుగేసి స్థానాల్లో పోటీ చేస్తుండగా, వీరిద్దరితో స్నేహం కలిపిన కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. అలాగే పది స్థానాల్లో భారతీయ జనతాపార్టీ తొమ్మిది స్థానాల్లో, ఒక స్థానంలో ఎల్‌జేపీ పోటీ చేస్తున్నాయి. ఈనెల 25న ఈ నాలుగు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు వుంటుంది.

కేసీఆర్ ఇన్ సింగపూర్

  జీవితంలో మొదటిసారి దేశం దాటి బయటకి వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను అడుగు పెట్టిన మొదటి విదేశం సింగపూర్‌లో బిజీబిజీగా వున్నారు. బుధవారం ఉదయం సింగపూర్‌కు చేరుకున్న కేసీఆర్ బృందానికి ఐఐఎం పూర్వ విద్యార్థులు స్వాగతం పలికారు. కేసీఆర్ బృందం సింగపూర్‌లోని రిట్జ్ కార్టన్ హోటల్లో బస చేశారు. ఐఐఎం పూర్వ విద్యార్థులు గురువారం కార్యక్రమం నిర్వహించనున్న స్టేడియాన్ని కెసిఆర్ సందర్శించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సింగపూర్ హైకమిషనర్‌తో కేసీఆర్ భేటీ అవుతున్నారు. 23న ఉదయం సింగపూర్ నుంచి కేసీఆర్ కౌలాలంపూర్‌కు చేరుకుంటారు. ఆ రోజు అక్కడే ఉండి 24వ తేదీ రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, పరిశ్రమలశాఖ కమిషనర్ జయేష్ రంజన్, ఐటీశాఖ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్, ముఖ్యమంత్రి అదనపుకార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తదితరులు కేసీఆర్‌తోపాటు విదేశీ పర్యటనకు వెళ్ళారు.

మహిళ తలలోంచి బుల్లెట్....

  పోలీసు శిక్షణ సందర్భంగా చేసిన ఫైరింగ్ ఒక మహిళా రైతు ప్రాణాల మీదకి తెచ్చింది. మెదక్ జిల్లా శివ్వంపేట సమీపంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బీహెచ్‌ఇఎల్ ఆధ్వర్యంలో పోలీసు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు రైఫిల్ షూటింగ్ శిక్షణ జరుగుతోంది. అయితే ఈవిషయం తెలియక అటువైపుగా వెళ్ళిన చంద్రకళ (48) అనే మహిళా రైతు తలలోంచి బుల్లెట్ దూసుకుపోయింది. దాంతో చంద్రకళను సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి తలలోని బుల్లెట్‌ని తొలగించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు.

తమ పెరట్లోనే రాజధాని వుండాలంటే ఎలా?

  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఎవరి ఇష్టమొచ్చినట్టుగా వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. ఎవరి ఇష్టమొచ్చినట్టుగా ఏ విషయమూ మాట్లాడొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినప్పటికీ రాజధాని విషయంలో కామెంట్లు ఆగడం లేదు. అలాగే కొంతమంది నాయకులు ఆంధ్రప్రదేశ్ రాజధాని తమ ప్రాంతంలోనే పెట్టాలని, లేకపోతే ఉద్యమం లేవదీస్తామని అన్నట్టుగా నర్మగర్భ బెదిరింపులు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పేరున్న రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రాజధాని మా ప్రాంతంలో కావాలంటే మా ప్రాంతంలో కావాలని అంటున్న వారికి షాక్ తగిలేలా ఒక కామెంట్ చేశారు. ప్రతి ఒక్కరూ రాజధాని తమ పెరట్లోనే వుండాలని అన్నట్టుగా మాట్లాడుతున్నారని, ఎవరి ఇష్ట ప్రకారమో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయడం జరగదని, అన్ని ప్రాంతాలకూ అందుబాటులో వుండటం, వనరులు వుండటం, భూ లభ్యత వుండటం.. ఇలాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని రాజధాని ఏర్పాటు వుంటుందని చెప్పారు. అంచేత రాజధాని మా ప్రాంతంలో వుండాలంటే మా ప్రాంతంలో వుండాలని స్టేట్‌మెంట్లు ఇచ్చేవారు ఇకనైనా కామ్‌గా వుంటే మంచిది.

బ్లూ ఫిలిమ్స్ ముఠా అడ్డంగా దొరికింది

  విజయవాడలో కుటీర పరిశ్రమలా బ్లూఫిలిమ్స్ చిత్రీకరిస్తున్న ఒక ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాలోని ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు పరారీలో వున్నారు. ఈ ముఠా నీలిచిత్రాల చిత్రీకరణ చేస్తోందన్న అనుమానం వున్న పోలీసులు ముఠా సభ్యుల కార్యకలాపాల మీద ఓ కన్నేసి వుంచారు. గురువారం నాడు ఈ ముఠా సరికొత్త నీలిచిత్రం చిత్రీకరణకు సన్నాహాలు ప్రారంభించింది. విజయవాడలో రహస్యంగా నీలిచిత్రం చిత్రీకరణ జరుపుతుండగా పోలీసులు దాడి చేశారు. దాంతో ముఠా ‘బెడ్’హేండెడ్‌గా దొరికిపోయింది. పోలీసులకు దొరికిన ఇద్దరిని పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేట్ చేస్తున్నారు.

రాజ్‌నాథ్‌తో నరసింహన్ భేటీ... అధికారాల గురించే...

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ని, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, ఉద్యోగుల బదిలీ వంటి అధికారాలను గవర్నర్‌కి బదిలీ చేస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయంలో తన అధికారాల గురించి చర్చించడానికే గవర్నర్ ఢిల్లీకి వచ్చారని తెలుస్తోంది. కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందుకుని ఇక గవర్నర్ రంగంలోకి దిగుతారని సమాచారం. రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. తాను రాజ్‌నాథ్‌ని కలవటం వెనుక వున్న అసలు విషయం చెప్పకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య బాగుందని, రెండు రాష్ట్రాల్లో పరిస్థితులు బాగున్నాయని, త్వరలో పరిస్థితులన్నీ సర్దుకుంటాయని చెప్పారు.

నిద్రపోతే పోతారట... హవ్వ...

  వరంగల్, నల్గొండ, ఖమ్మం, కృష్ణాజిల్లాలో బుధవారం రాత్రి విచిత్రమైన పుకారు షికారు చేసింది. బుధవారం నాడు నిద్రపోయినవాళ్ళు చనిపోతారని పుకార్లు వ్యాపించాయి. దాంతో చాలామంది జనం నిద్ర పోవడం మానేసి రోడ్లమీదకి చేరి కాలక్షేపం చేశారు. బుధవారం అర్ధరాత్రి ఈ పుకారు వ్యాపించింది. దాంతో అర్ధరాత్రి నుంచి జనం రోడ్ల మీదే సెటిలయ్యారు. కాస్తంత బుర్రున్నవాళ్ళు ఇవన్నీ పుకార్లని, ఇళ్ళలోకి వెళ్ళి హాయిగా నిద్రపొండని చెప్పినా జనం వినలేదు. అలా చెప్పినవాళ్ళనే పిచ్చోళ్ళని చూసినట్టు చూశారు. చాలామంది పెద్దలు నిద్ర మానుకుని కూర్చోవడమే కాకుండా ఈ మూఢ నమ్మకం గురించి పట్టించుకోకుండా హాయిగా నిద్రపోతున్న పిల్లల్ని కూడా నిద్రలేపి కూర్చోపెట్టారు. నిద్రపోతే చనిపోరు... నిద్రపోకపోతేనే చనిపోతారన్న నిజం ఈ జనాలకి ఎప్పటికి తెలుస్తుందో ఏంటో!

బడ్జెట్ గురించి జగన్‌కేం తెలుసు?

  ‘‘జగన్... నీకసలు బడ్జెట్ అంటే ఏమిటో తెలుసా?’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు జగన్‌ని సూటిగా ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్ ప్రతిపాదించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ ప్రతిపాదనల గురించి, కేంద్రం నుంచి రానున్న గ్రాంట్ గురించి కాసేపు మాట్లాడిన అనంతరం బడ్జెట్ గురించి వైసీపీ నాయకుడు జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు రాగా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అసలు జగన్‌కి బడ్జెట్ అంటే తెలుసా అని ప్రశ్నించారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన జగన్ నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా వుందని చెప్పారు. తనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం వుందని జగన్‌కి గుర్తుచేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపాలన్నిటినీ కడిగే ప్రయత్నంలా బడ్జెట్ వుందని చంద్రబాబు చెప్పారు.

నేడు హైదరాబాద్‌కి అమిత్ షా రాక

  బీజేపీ స్టార్ లీడర్, భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించున్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌కి వస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మొదటిసారి దక్షిణాది రాష్ట్రానికి వస్తున్నారు. ఆయనకు ఘనమైన స్వాగతం పలకడానికి తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం మూడున్నర తర్వాత ఆయన హైదరాబాద్‌కి వస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఇదే వేదికమీద పలువురు బీజేపీలో చేరతారు. వారిలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా వుంటారని తెలుస్తోంది. అలాగే శుక్రవారం నాడు సరూర్‌నగర్ స్టేడియంలో జరిగే బీజేపీ గ్రామాధ్యక్షుల సదస్సులో కూడా అమిత్ షా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీని మరింత పటిష్టం చేసి, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడమే అమిత్ షా పర్యటన ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. తెలంగాణ పర్యటన సందర్భంగా అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులను కూడా కలుస్తారు.

విమానంలోనే మరణించిన కో పైలెట్

  లయన్ ఎయిర్ లైన్స్ విమానం ఒకటి థాయ్ ఎయిర్ పోర్టు నుంచి 152 మంది ప్రయాణికులతో గాల్లోకి ఎగిరింది. ఆ సమయంలో విమానాన్ని కో పైలెట్ నడుపుతున్నాడు. గాల్లోకి ఎగిరిన కాసేపటికి కో పైలెట్ పక్కనే వున్న పైలెట్ యథాలాపంగా కో-పైలెట్ వైపు చూసి అదిరిపోయాడు. కారణం.. కో పైలెట్ సీట్లో కూర్చునే మరణించి వున్నాడు. అప్పటి వరకూ విమానం అతని కంట్రోల్లో వుందని అనుకుంటూ తాపీగా కూర్చున్న పైలెట్ అలర్ట్ అయి విమానాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కో పైలెట్ విమానంలోనే మరణించిన విషయాన్ని తెలుసుకున్న అధికారులు విమానాన్ని వెంటనే వెనక్కి తెప్పించి ఎమర్జెన్సీ లాండింగ్ చేయించారు. విమానం నడుపుతున్న కో పైలెట్ మరణించాడన్న విషయాన్ని ఆ తర్వాత తెలుసుకున్న విమానంలోని 152 మంది ప్రయాణికులు బతుకు జీవుడా అనుకున్నారు.

కారెక్కిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి

హైదరాబాద్‌కి చెందిన దివంగత రాజకీయ నాయకుడు పి.జనార్దన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి కొంత కాలం కాంగ్రెస్‌ పార్టీలో వుండి, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి ఎన్నికలలో కూడా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆమె కారెక్కారు.. తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఆమె ఖైరతాబాద్ చౌరస్తాలోని తన తండ్రి పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం స్థానిక మహంకాళీ ఆలయం దగ్గర పూజలు చేశారు. ఆ తర్వాత ర్యాలీగా టీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్ళారు. ఈ ర్యాలీని తెలంగాణ ఎక్సయిజ్ శాఖ మంత్రి పద్మారావు జెండా ఊపి ప్రారంభించారు. ఒంటెలు, గుర్రాలు, కార్లు, ద్విచక్ర వాహనాలతో ఈ ర్యాలీని నిర్వహించారు.

కరుణానిధి భార్య, కుమార్తెకి బెయిలు మంజూరు

  2జీ కుంభకోణంలో 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో టెలికం మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఏడుగురు నిందితులకు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. రాజా, కనిమొళి కోర్టుకు హాజరయ్యారు. అలాగే కరుణానిధి భార్య, కనిమొళి సవతి తల్లి దయాళు అమ్మాళ్‌కు కూడా బెయిల్ లభించింది. దయాళు అమ్మాళ్‌కు బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం 5 లక్షల వ్యక్తిగత పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. అయితే, ఈ కేసులో తన పేరును తొలగించాలన్న దయాళు అమ్మాళ్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దయాళు అమ్మాల్, రాజా, కనిమొళిలతో పాటు మరో ఏడుగురికి బెయిల్ మంజూరయింది.

‘పీకే’ కొత్త పోస్టర్... అమీర్‌ఖాన్ ఒంటిమీద బట్టలున్నాయ్...

  బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తన తాజా చిత్రం ‘పీకే’ పోస్టర్ని ఆమధ్య విడుదల చేసి సంచలనం సృష్టించాడు. ఒంటిమీద బట్టల్లేకుండా ‘అక్కడ’ కేవలం ఓ పాత టేప్ రికార్డర్ మాత్రమే పెట్టుకుని కనిపించి అల్లకల్లోలం చేశాడు. రైలు పట్టాలపై టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకుని నగ్నంగా నిలబడిన అమీర్ ఖాన్ ను అనేక కేసులు, వివాదాలు చుట్టుముట్టాయి. అయినా అమీర్ ఖాన్ అందరికి ధీటుగా జవాబిచ్చారు. తాను పబ్లిసిటీ కోసం ఆ పోస్టర్ విడుదల చేయలేదని.. సినిమా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందని సమాధానమిచ్చాడు. ఆగస్టు 20 తేదిన విడుదల చేసే రెండవ పోస్టర్ లో ట్రాన్సిస్టర్ కూడా అడ్డుగా ఉండదంటూ చమత్కరించిన అమీర్ ఖాన్ బుధవారం నాడు ఈ సినిమా సెకండ్ లుక్ పోస్టర్ విడుదల చేశాడు. ఈ పోస్టర్ ఎంత సంచలనం సృష్టిస్తుందో అని అందరూ అనుకున్నారు. అయితే ఈ పోస్టర్‌లో అమీర్ ఖాన్ ఒంటి నిండా బట్టలు కప్పుకుని వుండి మళ్ళీ జనాన్ని ఆశ్చర్యచకితుల్ని చేశాడు.ఈసారి పోస్టర్లో ట్రాన్సిస్టర్ కూడా వుండదని అంటే జనాలు ఏవేవో ఊహించుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఈ పోస్టర్ వుంది.. నిజమే ఈసారి అమీర్ చేతిలో ట్రాన్సిస్టర్ కూడా లేదు. నిండుగా బట్టలేసుకుని బ్యాండ్ మేళం బూర చేతిలో పట్టుకుని నిలుచున్నాడు.

ఉదయ్ కిరణ్ ఎలా మరణించాడంటే.. ఇదిగో ఫోరెన్సిక్ రిపోర్ట్...

సినీ కథానాయకుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న ఇంతకాలానికి ఆయన మరణానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు అందింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం స్పష్టంగా వున్నప్పటికీ, ఫోరెన్సిక్ నివేదిక అందేవరకూ ‘ఆత్మహత్య’గా భావించని పోలీసులు ఉదయ్ కిరణ్‌ది అనుమానాస్పద మరణంగానే కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ రిపోర్టు అందకపోవడం వల్ల ఇప్పటి వరకు చార్జిషీట్ కూడా దాఖలు చేయలేదు. ఇప్పుడు వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్టు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని నిర్ధారించింది. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ఊపిరి ఆడకపోవడం వల్లనే ఉదయకిరణ్ మరణించారు. ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఉదయ్ కిరణ్ మద్యం సేవించాడు.

అంకెల్లో ఆశలు చూపిన యనమల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్...

  * 1,11, 824 కోట్లతో బడ్జెట్ రూపకల్పన. * 85వేల 151 కోట్ల ప్రణాళికేతర వ్యయం. * 26వేల కోట్ల ప్రణాళికా వ్యయం. * రెవెన్యూ లోటు రూ.6,064 కోట్లు. * ఆర్థిక లోటు రూ.12,064 కోట్లు. * స్థూల జాతియోత్పత్తిలో ఆర్థికలోటు 2.30 కోట్లు * స్థూల జాతియోత్పత్తిలో రెవెన్యూ లోటు 1.16 కోట్లు * ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం రెవెన్యూ లోటు 25, 574 కోట్లు * ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారం ద్రవ్య లోటు 37, 910 కోట్లు * శాంతిభద్రతలకు రూ.3,339 కోట్లు * విపత్తుల నిర్వహణకు రూ.403 కోట్లు * ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కి రూ.111 కోట్లు * ఇరిగేషన్కు రూ. 8,467 కోట్లు * ఇంధన రంగానికి రూ, 7164 కోట్లు * ఆర్ అండ్ బి కి రూ.2, 612 కోట్లు * పర్యావరణం, అడవులు, సెన్స్ అండ్ టెక్నాలజీ రూ. 418 కోట్లు * ఉన్నత విద్య: రూ.2,272 కోట్లు * ఇంటర్మీడియట్ విద్య: రూ. 812 కోట్లు * పాఠశాల విద్య: రూ.12, 595 కోట్లు * ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం: 4,388 కోట్లు   * 2012-13 రాష్ట్ర స్థూల ఉత్పత్తి: రూ.4,19,391 కోట్లు * 2013-14 రాష్ట్ర స్థూల ఉత్పత్తి: రూ.4, 75,859 కోట్లు * ప్రతి కుటుంబానికి రుణమాఫీ చెల్లిందేందుకు రూ. 1.50 లక్ష కేటాయింపు * సాంఘిక సంక్షేమానికి రూ.2,657 కోట్లు * గిరిజన సంక్షేమానికి రూ. 1150 కోట్లు * బీసీ సంక్షేమానికి రూ. 3,130 కోట్లు * మైనార్టీ సంక్షేమానికి రూ.3.371 కోట్లు * స్త్రీ శిశు సంక్షేమానికి రూ. 1059 కోట్లు * వికలాంగులు, వృద్ధులకు రూ.65 కోట్లు * యువజన సేవలు రూ.126 కోట్లు * పర్యాటక, సాంస్కృతిక రంగానికి రూ. 113 కోట్లు * గృహ నిర్మాణానికి రూ.8,808 కోట్లు * పౌరసరఫరాలశాఖ రంగానికి రూ. 2318 కోట్లు * గ్రామీణాభివృద్ధి రంగానికి రూ.6094 కోట్లు * అక్టోబర్ 2 నుంచి వృద్ధులు, వికలాంగులకు రూ. 1500 పెన్షన్ * పంచాయతీ రాజ్కు రూ. 4260 కోట్లు * గ్రామంలో నీటి సరఫరాకు రూ.1152 కోట్లు * పట్టణాభివృద్ధి రూ.3,134 కోట్లు * కార్మిక ఉపాధిరంగానికి రూ. 276 కోట్లు * 2012-13 తలసరి ఆదాయం రూ. 76, 041 * 2013-14 తలసరి ఆదాయం రూ. 85,795.

ఏపీ బడ్జెట్ ప్రసంగం విశేషాలు... కొన్ని...

  లక్ష కోట్లకుపైగా కేటాయింపులతో రూపకల్పన చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ విశేషాలు   * 1,11, 824 కోట్లతో బడ్జెట్ రూపకల్పన. * 85వేల 151 కోట్ల ప్రణాళికేతర వ్యయం. * 26వేల కోట్ల ప్రణాళికా వ్యయం. * రెవెన్యూ లోటు రూ.6,064 కోట్లు. * ఆర్థిక లోటు రూ.12,064 కోట్లు.   * విజన్ 2020కి కొత్త హంగులు.. విజన్ 2029 ఫార్ములాతో ముందడుగు. * వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్. * లక్షన్నర వరకు రైతు రుణాల మాఫీ. * రాష్ట్ర విభజన కారణంగా రెవిన్యూ లోటు ఏర్పడింది. అందువల్లే ఈ ఏడాదికి జనరంజకమైన బడ్జెట్‌ ఇవ్వలేకపోతున్నాం. * అన్ని పథకాలకు ఆధార్ తప్పనిసరి. * విశాఖలో విమ్స్, తిరుపతిలో స్విమ్స్ కేంద్ర నిధులతో అభివృద్ధి. * విజయవాడ- కాకినాడల మధ్య గ్రీన్‌ఫీల్డ్ పోర్టు. * రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్.   * జేఎన్ఎన్ఆర్ఎం కింద స్మార్ట్ సిటీల అభివృద్ధి. * చిత్తూరు, కాకినాడలలో ట్రిపుల్ ఐటీ. * కాకినాడలో ప్రైవేటు రంగంలో మరో వాణిజ్య పోర్టు ఏర్పాటు. * కాకినాడలో ఎల్ఎన్జీ టర్మినల్. * విశాఖ గంగంవరం పోర్టు దగ్గర మరో ఎల్ఎన్జీ టర్మినల్. * విశాఖ, విజయవాడ, తిరుపతి, కడప ఎయిర్‌పోర్టుల విస్తరణ. * వైజాగ్- చెన్నై కారిడార్‌ అభివృద్ధికి ప్రాధాన్యం. * కొత్తగా 6 ఏపీఎస్పీ బెటాలియన్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు, * పేద విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు 13 బీసీ స్టడీ సర్కిల్‌లు ఏర్పాటు * రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్.