లోటస్‌పాండ్ మీటింగ్... 20 మంది ఎమ్మెల్యేల డుమ్మా...

  వైసీపీ అధ్యక్షుడు జగన్ హైదరాబాదులోని లోటస్‌పాండ్‌లో వున్న గల తన నివాసంలో ఆదివారం పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడం రాజకీయవర్గాల్లో చర్చకి కారణమైంది. ఈ సమావేశానికి దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. ఆదివారం ఉదయం 10 గంటలకు జరగాల్సిన వైసీపీఎల్పీ సమావేశం 20 మంది పార్టీ శానససభ్యులు హాజరు కాకపోవడంతో పార్టీ అధ్యక్షుడు జగన్ వారి కోసం ఎదురుచూసి రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించారు. ఆలస్యంగా కూడా వారు రాలేదు. ప్రయాణ సౌకర్యం లేనందున, వ్యక్తిగత పనుల కారణంగా రాలేకపోతున్నట్లు కొంత మంది తెలియజేసినట్లు సమాచారం. అయితే, కొంత మంది మాత్రం ఏ విధమైన సమాచారం ఇవ్వలేదని అంటున్నారు. దీంతో జగన్ తీవ్రంగా మండిపడినట్లు చెబుతున్నారు. సమావేశానికి హాజరు కాని ఈ 20 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి చేరువ అవుతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి.

సమగ్ర సర్వేపై విచారణ పన్నెండున్నరకి వాయిదా...

  మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో విచారణ ప్రారంభమైంది. కృష్ణయ్య అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి నివాసంలో ఈ విచారణ జరుగుతోంది. ఈ విచారణకు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ హాజరయ్యారు. సమగ్ర సర్వే నిర్బంధం కాదని, ఇది ఐచ్ఛిక సర్వే అని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు ఇప్పటికే విన్నవించిన విషయం తెలిసిందే. కాగా, ఈ విచారణ మధ్యాహ్నం పన్నెండున్నరకి వాయిదా పడింది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఎలాంటి జీవో లేకుండా విచారణ జరపడం చట్ట విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ఆర్టికల్ 162 ప్రకారం ప్రభుత్వ సర్కులర్ చెల్లుబాటు కాదని న్యాయమూర్తికి విన్నవించారు. పంచాయితీరాజ్ విభాగం నుంచి కేవలం సర్కులర్ మాత్రమే జారీ చేశారని పేర్కొన్నారు. మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాత న్యాయమూర్తి ఎలా స్పందిస్తారో చూడాల్సి వుంది.

విశాఖ విమానాశ్రయం.. సినిమావాళ్ళకి భూములు...

  విశాఖపట్టణం అభివృద్ధికి సంబంధించిన వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు వివరించారు. ఇప్పటికే విశాఖలో మెట్రో రైలు ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. అంతర్జాతీయ విమానశ్రయం ఏర్పాటు చేయాలని కూడా సంకల్పించారు. అయితే ఇప్పుడున్న విమానాశ్రయం నేవీ అధీనంలో వుంది కాబట్టి కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అయితే విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటును నేవీ వ్యతిరేకిస్తోందని మంత్రి అయన్నపాత్రుడు తెలిపారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటే తప్ప విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు సాధ్యపడదు. అలాగే విశాఖ పట్టణంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే విశాఖలో సినిమా పరిశ్రమ కోసం 1500 ఎకరాల భూమిని సిద్ధం చేశారు. సినిమా పరిశ్రమ ఎప్పుడు విశాఖకు తరలి వస్తే అప్పుడు భూమి అప్పగిస్తామని మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు.

ఓడిపోతామని తెలిసినా నందిగామలో జగన్ పార్టీ పోటీ...

  కృష్ణాజిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు మరణంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఈ స్థానం నుంచి తంగిరాల కుటుంబ సభ్యులే పోటీ చేసే అవకాశం వుంది అక్కడ తంగిరాల కుటుంబానికి చెందిన వ్యక్తే గెలిచే అవకాశం వుంది. కారణం, ప్రజల్లో తంగిరాలకు ఉన్న మంచి పేరు. అయితే ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఓడిపోతామని తెలిసినప్పటికీ పోటీలో నిలవాలని జగన్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 20 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా, నందిగామ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నందిగామ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో అక్కడ రాజకీయ సందడి నెలకొంది.

సమగ్ర కుటుంబ సర్వే ఉపసంహరణ

  తెలంగాణ ప్రభుత్వం ఈనెల 19న నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేని పోలవరం ముంపు మండలాలలో ఉపసంహరించారు. ఖమ్మం జిల్లాలోని కూనవరం, వర రామచంద్రాపురం, చింతూరు, వేలేరుపాడు, కుక్కునూను, భద్రాచలం (భద్రాచలం పట్టణం మినహా) మండలాలలో కూడా సమగ్ర కుటుంబ సర్వే జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో అక్కడి ప్రజల్లో అయోమయం నెలకొంది. తాము ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవాళ్ళమా, తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళమా అనే అయోమయంలో పడిపోయారు. అయితే ఈ మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంతో ఈ ప్రాంతాలతో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. దాంతో తమ తప్పు తెలుసుకున్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ఈ మండలాలలో సర్వే నిర్వహించరాదని ఆయా మండలాల తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఈ ఆరు మండలాలలో సర్వే ఉపసంహరించుకున్నారు.

హైదరాబాదులోనే ఉంటా: చంద్రబాబు

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన తరువాత, ఇక ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా వివిధ మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను విజయవాడకు తరలించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టమని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలో గల మేధా టవర్స్ ఐటీ పార్కులో ఉన్న విశాలమయిన భవనసముదాయంలో వివిధ శాఖలకు కార్యాలయాలు కేటాయింపు మొదలయినట్లు తాజా సమాచారం. మంత్రి నారాయణ మాట్లాడుతూ త్వరలోనే శాఖల కార్యాలయాలు హైదరాబాదు నుండి విజయవాడకు తరలింపు కార్యక్రమం కూడా మొదలవుతుందని తెలిపారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ముందు చెప్పినట్లుగానే, హైదరాబాదు, విజయవాడ మధ్య తిరుగుతూ పరిపాలన కొనసాగించవచ్చును. నిజానికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వీలయినంత త్వరగా విజయవాడకు తరలిపోవాలని భావిస్తున్నప్పటికీ, జంట నగరాలలో స్థిరపడిన ఆంద్ర ప్రజల పట్ల తెలంగాణా ప్రభుత్వం వైఖరిలో మార్పు కనబడనంత వరకు అక్కడి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాదును వీడకపోవచ్చును. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ హైదరాబాదులో మరో పదేళ్ళపాటు ఉండేందుకు అవకాశం ఉన్నందున, వీలయినంత కాలం అక్కడ నుండే పరిపాలన కొనసాగిస్తానని చెప్పడం గమనిస్తే, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించినప్పటికీ, జంట నగరాలలో స్థిరపడిన ఆంధ్రప్రజలకు అండగా నిలిచేందుకే ఆయన హైదరాబాదును అంటిపెట్టుకొని ఉంటున్నారని భావించవచ్చును.

ఏపీ శాసనసభ సమావేశాలలో వైకాపా రభస

   కొద్ది సేపటి క్రితం మొదలయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వైకాపా సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో ఇప్పటికి రెండు సార్లు వాయిదాపడి, మళ్ళీ మూడవసారి మొదలయ్యాయి. కానీ వైకాపా సభ్యులు సభను కొనసాగనివ్వడం లేదు. రాష్ట్రంలో క్షీణిస్తున్నశాంతి భద్రతలపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై స్పీకర్ చర్చకు అంగీకరించేవరకు తమ ఆందోళన విరమించమని వైకాపా స్పష్టం చేసింది. వారి ఆందోళన నడుమే స్పీకర్ సభా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార తెదేపా హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని వైకాపా నేత శ్రీకాంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు మంత్రి అచ్చెం నాయుడు అంతే ధీటుగా బదులిస్తూ ఆపని చేసినవారే ప్రభుత్వాన్ని నిందించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోందని ఎద్దేవా చేసారు. ప్రస్తుతం రాష్ట్రం ఒక సంధి దశలో ఉంది. అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఈ సమస్యలన్నిటిపై అధికార, ప్రతిక్ష పార్టీలు శాసనసభలో చర్చించి, వాటి పరిష్కారం కోసం ప్రయత్నించవలసి ఉంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 12వరకు జరగవలసి ఉండగా, తెలంగాణా రాష్ట్ర శాసనసభ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని ఈనెల 6వ తేదీతోనే ముగిస్తున్నారు. జీరో అవర్లో దానిపై చర్చకు స్పీకర్ అనుమతించినప్పటికీ విలువయిన కొద్దిపాటి సమయాన్ని హత్యారాజకీయాలపై చర్చజరగాలంటూ వైకాపా సభను స్తంభింపజేయడం చాలా అనుచితం.

ముగ్గురి ప్రాణం తీసిన ఈత సరదా

  ఈత కొట్టడానికి వెళ్ళిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన హైదరాబాద్‌లోని గండిపేట చెరువులో జరిగింది. ఈతకు వెళ్ళి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నప్పటికీ యువకులు ఈ విషయంలో జాగ్రత్తగా వుండటం లేదు. ఫలితం.. తల్లిదండ్రులకు గర్భశోకంగా మిగులుతోంది. హైదరాబాద్ గండిపేట చెరువులోకి స్నానానికి వెళ్లిన హుమాయున్ నగర్‌కు చెందిన అబ్దుల్, సల్మాన్, సతీష్ అనే యువకులు నీళ్ళలోకి దిగిన వెంటనే మునిగిపోయి చనిపోయారు. గండిపేట చెరువులో రాళ్ళు బాగా ఎత్తు పల్లాలతో వుంటాయి. అడుగు తీసి అడుగు వేస్తే నీటి లోపలకి జారిపోయే విధంగా పరిస్థితి వుంటుంది. ఈ ముగ్గురు యువకులు మరణించడానికి కూడా ఇదే కారణమని స్థానికులు భావిస్తున్నారు.

కేసీఆర్ సర్వే ఆంధ్రోళ్ళని తరిమేయడానికేనట... వీడియో

  తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఈనెల 19న నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే మీద ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. కేసీఆర్ ఈ సర్వేని సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారిని భయభ్రాంతులకు గురిచేయడానికి నిర్వహిస్తున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏదో మిలటరీ రూల్ మాదిరిగా నిర్వహిస్తున్న ఈ సర్వే మీద సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారిలో మాత్రమే కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సర్వే బలవంతంగా చేయమని, ప్రజల మీద సర్వే రుద్దమని, ఇష్టం వున్నవారే సర్వేకి సహకరించవచ్చని కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ సర్వే మీద అందర్లోనూ అనుమానాలున్నాయి. ఆ అనుమానాలకు తగ్గట్టుగానే ఈ సర్వే నిర్వహిస్తోంది తెలంగాణలోని సీమాంధ్ర విద్యార్థులను, ఉద్యోగులను తరిమేయడానికే అనడానికి ఒక వీడియో ఆధారం దొరికింది. సీఎం కేసీఆర్ పీఆర్వో విజయ్ అనే వ్యక్తి మాట్లాడినట్టుగా భావిస్తున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ప్రసాద్‌ అనే పేరుతో పేర్కొంటున్న వ్యక్తి తెలంగాణ ప్రభుత్వం ఈ సర్వే చేయిస్తున్నది సీమాంధ్రులను తరిమేయడానికేనిన స్పష్టంగా చెప్పడం భయాందోళనలు కలిగిస్తోంది. అసలు ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు... అతను నిజంగానే కేసీఆర్ పీఆర్వోనా? తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే వెనుక ఉన్న ఉద్దేశం సీమాంధ్రులను తరిమేయడమేనా? ఈ అంశాలన్నిటి మీద స్పష్టత వచ్చేలా చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద వుంది.ఈ కింది వీడియో చూస్తే అసలు విషయమంతా తెలిసిపోతుంది.

కొలిక్కి వచ్చిన సివిల్ సర్వీసెస్ విభజన

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల విభజన ఒక కొలిక్కివచ్చింది. ఈ అంశం మీద ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారం సమావేశం అయ్యింది. లాటరీ ప్రక్రియ ద్వారా రోస్టర్ విధానంతో అధికారుల కేటాయింపు పూర్తి చేసింది. లాటరీలో మొదట తెలంగాణ రాష్ట్రం పేరు రావడంతో రోస్టర్ విధానాన్ని తెలంగాణ నుంచే అమలు చేశారు. రెండు రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ పోస్టులను లాటరీ ద్వారా నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణకు ఐఏఎస్-163, ఐపీఎస్-112, ఐఎఫ్‌ఎస్-65 మంది అధికారులను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్కు ఐఏఎస్-211, ఐపీఎస్-144, ఐఎఫ్‌ఎస్-85 మంది అధికారులను కేటాయించారు. వచ్చే శనివారానికల్లా అధికారుల కేటాయింపు పూర్తవుతుంది. అధికారుల విభజన 13:10 నిష్ఫత్తిలో జరుతుతుంది.

సెప్టెంబర్ 13న మెదక్ ఉప ఎన్నిక

  మెదక్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. సెప్టెంబర్ 13న మెదక్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఈనెల 20న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈనెల 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 28న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 30 వరకు గడువు ఇస్తారు. మొత్తమ్మీద మెదక్ లోక్ సభ స్థానానికి సెప్టెంబర్ 13న పోలింగ్ జరుగుతుంది. 16న కౌంటింగ్ నిర్వహించి, అదే రోజున ఫలితాన్ని వెల్లడిస్తారు. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి ఇటీవల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నికయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి శాసనసభ్యుడిగా కొనసాగుతూ, మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. అందువల్ల ఇప్పుడీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి వస్తోంది. మెదక్ లోక్ సభ స్థానంతోపాటు దేశంలోని 9 రాష్ర్టాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

టీడీపీలోకి ఆనం వివేకానందరెడ్డి?

  నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో కాస్తంత నోరున్న, ప్రజల్లో బలమున్న నాయకుడు ఆనం వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికలలో గెలిచే అవకాశం వున్న నాయకుడు అయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో వున్న పాపానికి ఆనం వివేకానందరెడ్డి ఓడిపోవాల్సి వచ్చింది. అయితే రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఘోర తప్పిదం చేసిందని ఆయన భయపడకుండా విమర్శిస్తూ వుంటారు. మొన్నీమధ్య ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏదో ఉద్యమం చేద్దామని పిలుపు ఇస్తే, ఆనం వివేకానందరెడ్డి కాంగ్రెస్ నాయకులకు తన మాటలతో తలంటు పోశారు. ప్రజలకు పనికొచ్చే పనులు చేయండిగానీ, రాజకీయాల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయొద్దని ఆయన ఘాటుగా అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని శనివారం నాడు కలిశారు. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎంపీ ఎస్పీవై రెడ్డితో కలసి ఆయన చంద్రబాబును కలిశారు. దీంతో ఆనం వివేకానందరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

రేపు ఏపీ, టీఎస్ సీఎంల కీలక మీటింగ్

  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలనూ గవర్నర్ నరసింహన్ పక్కన కూర్చోబెట్టుకున్న గవర్నర్ ఇద్దరు సీఎంలూ పరస్పరం సహకరించుకోవాలని కోరిన విషయమూ తెలిసిందే. గవర్నర్ విజ్ఞప్తికి ఇద్దరు ముఖ్యమంత్రులూ సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదివారం నాడు భేటీ అవుతున్నారని సమాచారం. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇద్దరూ గవర్నర్ నరసింహన్ సమక్షంలో భేటీ అవుతారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లు, చీఫ్ సెక్రటరీలు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల గురించి చర్చిస్తారు. ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనడానికి ప్రయత్నిస్తారు.

పాకిస్థాన్‌లో పరిస్థితి ఘోరం...

  మనం స్వాతంత్ర్య దినోత్సవం ప్రశాంతంగా చేసుకున్నాం. పాపం పాకిస్థాన్ పరిస్థితే ఘోరంగా వుంది. ఆగస్టు 14న ఉద్రిక్తతల మధ్యే అక్కడ స్వాతంత్ర్య దినోత్సవం జరిగింది. 15వ తేదీకి ఆ ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, ర్యాలీలు ఊపందుకున్నాయి. తాహిరుల్ ఖాద్రి అనే మత గురువు ఇచ్చిన పిలుపు మేరకు ఆయనకి చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ (పీటీఐ) అనే సంస్థకి చెందిన కార్యకర్తలు ఇస్లామాబాద్‌లో నానా హడావిడీ చేస్తున్నారు. ఇప్పుడు ఇస్లామాబాద్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఒకపక్క పీటీఐ ఉద్యమకారులు, మరోపక్క సైన్యం.. వీళ్ళ మధ్యలో బిక్కుబిక్కుమంటున్న సామాన్య జనం. రిగ్గింగ్ చేసి గెలిచిన నవాజ్ షరీఫ్ రాజీనామా చేసేవరకు తమ ఉద్యమం ఆగదని పీటీఐ కార్యకర్తలు అంటుంటే, వాళ్ళని అణిచేస్తామని మిటలరీ అంటోంది. ఇదిలా వుంటే, రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన క్రికెటర్ ఇమ్రాన్‌ ఖాన్‌ వాహనంపై గుజ్రన్‌వాలా సిటీలో అధికార పీఎంఎల్‌ -ఎన్‌ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అధికార పార్టీ కార్యకర్తలు తనను హతమార్చేందుకు తన వాహనంపై కాల్పులు కూడా జరిపారని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. అయితే ప్రస్తుతం ఉన్న పౌర ప్రభుత్వాన్ని తొలగించేందుకు ఎవరూ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడరాదని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశాల జారీ చేసింది. అలాంటి చర్యలకు పాల్పడితే దేశ ద్రోహం అవుతుందని తెలిపింది.

ఏపీ, టీఎస్ స్పీకర్లకు గవర్నర్ హితబోధ

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రెండు రాష్ట్రాల స్పీకర్లతో భేటీ అయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ విందు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్లు శివప్రసాదరావు, మధుసూధనాచారి హాజరయ్యారు. విందు ముగిసిన తర్వాత ఇద్దరు స్పీకర్లూ తిరిగి వెళ్ళే సమయంలో గవర్నర్ నరసింహన్ ఇద్దరు స్పీకర్ల చేతులు పట్టుకుని ఇద్దరూ కలసి పనిచేయాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇద్దరూ తనకు రెండు కళ్ళు లాంటివాళ్ళని, ఇద్దరూ కలసి పనిచేస్తే అందరికీ బాగుంటుందని గవర్నర్ ఈ సందర్భంగా అన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరు స్పీకర్లూ ఎదుటి పక్షంతో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను గవర్నర్ ముందు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్ వారిద్దరినీ అనునయించారు. మొత్తమ్మీద ఇద్దరు స్పీకర్లూ కలసి పనిచేయడానికి కృషి చేస్తామని గవర్నర్‌ నరసింహన్‌కి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

క్రిమినల్... కాల్చిపారేశారు!!

  హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌రోడ్ దగ్గర ఒక క్రిమినల్ని పోలీసులు కాల్చి చంపేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన శివకుమార్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక దొంగతనాలు చేసిన గజదొంగ. ఇతని మీద 300 పైగా చైన్ స్నాచింగ్ కేసులున్నాయి. ఇతని కోసం పోలీసులు ఎంతోకాలంగా వెతుకుతున్నారు. శుక్రవారం రాత్రి ఔటర్ రింగ్‌రోడ్ దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తూ వుండగా అక్కడకు బైక్ మీద వచ్చిన శివకుమార్ పోలీసుల మీద దాడి చేశాడు. ఒక ఇన్‌స్పెక్టర్‌ని కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. దాంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం శివకుమార్ మీద కాల్పులు జరపగా అతను అక్కడికక్కడే మరణించాడు. నెల్లూరు జిల్లాలోని ఓజిలి మండలం ఆర్మేనిపాడు గ్రామానికి చెందిన శివ చైన్‌ స్నాచింగ్‌లు, ఇళ్ళలో దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తుడు. ఈమధ్య కాలంలో హైదరాబాద్‌లో పోలీసుల కాల్పుల్లో చనిపోయిన రెండో క్రిమినల్ శివకుమార్. మొన్నీమధ్య హైదరాబాద్ శివార్లలోనే ఒక దొంగనోట్ల ముఠాకు చెందిన క్రిమినల్ని పోలీసులు కాల్చి చంపారు.

ఆ విషయంలో యువరాజావారిని శంకించడానికి లేదుట

  ఎన్నికలకు ముందు వరకు రాహుల్ గాంధీని కాబోయే దేశప్రధానిగా కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. ఆ తల్లీ కొడుకులు ఎప్పుడు తలచుకొంటే అప్పుడు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొనే అవకాశం ఉన్నప్పటికీ, త్యాగ మూర్తుల కుటుంబానికి చెందిన వారు కనుక గత పదేళ్లుగా డా.మన్మోహన్ సింగును ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఆయన చెయ్యిపట్టుకొని వారే దేశాన్ని ఎంచక్కగా పరిపాలించారు. అయితే కాంగ్రెస్ చివరి రోజుల్లో యువరాజవారు తన కుర్చీపై మనసు పారేసుకొన్నారని అప్పటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ గ్రహించగానే, తను కుర్చీ కాళీ చేసేయడానికి సిద్దమని ఆయన ప్రకటించడమే కాకుండా, రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేసేందుకు కూడా తను సిద్దమని ప్రకటించారు. తీరాచేసి యువరాజవారు పట్టాభిషేకానికి అంగీకరించి దేశప్రజలను, కాంగ్రెస్ నేతలను ఉద్దరించేందుకు దయతో అంగీకరించినా వెర్రిబాగుల ప్రజలందరూ మోడీ మాయమాటలు నమ్మి ఆయనకు హ్యాండిచ్చేసారు. ఆయన కోసం మన్మోహనుల వారు ఖాళీ చేసిన కుర్చీలో మోడీ వచ్చి చటుకున్న కూర్చొండిపోయారు.   నిజానికి యువరాజు రాహుల్ గాంధీకి, అటు పార్టీలో, ఇటు దేశ ప్రజలలో కూడా తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొంటున్న నరేంద్ర మోడీని అవలీలగా ఓడించిపడేసేవాడే. గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన ఆయనకు అదేమీ పెద్దపని కాదు. కానీ మీడియా కూడా మోడీ మాయలో పడి ఆ వెర్రిబాగుల జనాలతో కలిసి యువరాజవారికి నాయకత్వ లక్షణాలు లేవని అర్ధంపర్ధం లేని ప్రచారం చేయడంతో ఆయన ఇమేజి చాలా డ్యామేజి అయిపోవడంతోనే ఆయన కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోయారు అంతే.   పదేళ్ళ సోనియా కర్రపెత్తనంలో యూపీయే ప్రభుత్వం దేశాన్ని ఎక్కడికో తీసుకుపోయింది. తను ప్రధాని కుర్చీలో కూర్చోగానే ప్రజలను ఇంకా ఎక్కడికో తీసుకుపోతానని యువరాజవారు హామీ ఇచ్చారు కూడా. కానీ ప్రజలు ఆయన మాటలు నమ్మలేదు. కానీ అవే మాయమాటలు చెప్పిన మోడీని గుడ్డిగా నమ్మేసి బీజేపీకి ఓటేసేయడంతోనే, కాంగ్రెస్ పార్టీని యువరాజవారు గెలిపించలేకపోయారని అంటోనీ కమిటీ కనిపెట్టేయగలిగింది. అయినా దేశానికి స్వాత్రంత్రం వచ్చినప్పటి దాదాపు నేటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అందులో ప్రజలను ఉద్దరిస్తూనే ఉంది. కానీ అది గుర్తించని వెర్రిబాగుల జనాలు కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్లలో చేయలేనిది మోడీ ఐదేళ్ళలో చేసి చూపిస్తానంటే గుడ్డిగా నమ్మేశారని అంటోనీ కమిటీ తన నివేదికలో ఆవేదన వ్యక్తం చేసింది. చేతిలో అధికారం ఉన్నపుడే మోడీని ఓడించలేకపోయినప్పటికీ, ఐదేళ్ళ తరువాత ఆయన వెనుక ఎంతమంది మిగిలుంటారో తెలియని పరిస్థితిలో కూడా ఆయన తన నాయకత్వ పటిమను ప్రదర్శించుతూ, మోడీని చిత్తుచిత్తుగా ఓడించి పడేయడం మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారం సంపాదించి తను ప్రధానమంత్రి అవడం తధ్యమని అంటోనీ మహాశయులు శలవిచ్చారు.