తస్లిమా నస్రీన్‌కి ‘బిగ్‌బాస్’ ఆఫర్... నో చెప్పిన రచయిత్రి

  కలర్స్ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘బిగ్ బాస్’ షో గురించి చాలామందికి తెలుసు. ప్రముఖులను ఒక ఇంట్లో ఉంచి, సీసీ కెమెరాల ద్వారా వారి ప్రవర్తనను రికార్డు చేసి, ఎడిట్ చేసి టీవీలో ప్రసారం చేస్తారు. ఈ ప్రోగ్రామ్‌లో ఇప్పటికి ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు బిగ్ బాస్-8లో పాల్గొనడానికి కలర్స్ టీవీ ప్రముఖ బంగ్లాదేశ రచయిత్రి, ‘లజ్జ’ పుస్తకం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తస్లిమా నస్రీన్‌కి ఆఫర్ ఇచ్చింది. సాధారణంగా ఎవరైనా ప్రముఖులు బిగ్ బాస్ షోలో పాల్గొనే ఆఫర్ వస్తే ఎగిరి గంతేసి ఒప్పుకుంటారు. అయితే తస్లిమా మాత్రం ఈ ఆఫర్ని తిరస్కరించారు. ఈ విషయాన్ని తస్లిమా ట్విట్టర్‌లో తెలియజేశారు. బిగ్ బాస్‌లో పాల్గొనడం ద్వారా ప్రపంచానికి తస్లీమా నస్రీన్ అంటే ఏమిటో మరోసారి తెలియజేయవచ్చని, దీంతో పాటు మంచి పారితోషికం కూడా ఇస్తామని బిగ్ బాస్ వర్గాలు తనను సంప్రదించాయని తస్లీమా నస్రీన్ ట్వీట్ చేశారు. అయితే దీనిని తిరస్కరించినట్టు తెలిపారు. 1994లో బంగ్లాదేశ్ నుంచి స్వీయ బహిష్కరణ తర్వాత ఇండియన్ వీసా మీద 2004 నుంచి తస్లిమా ఇక్కడే ఉంటున్నారు. ఇటీవలే ఇండియా ఆమెకి రెసిడెన్షియల్ వీసా జారీ చేసింది.

నేపాల్‌లో మోడీ ప్రచండం

  భారత ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు నేపాల్ పర్యటనలో వున్నారు. నేపాల్‌లో ఆయనకు అఖండ స్వాగతం లభించింది. ఎక్కడకి వెళ్ళినా మోడికి బోలెడంత గౌరవం లభిస్తోంది. నేపాల్‌ దేశంలోని రోడ్ల అభివృద్ధికి మోడీ ఆరువేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయడం కూడా నేపాల్‌లో ఆయనకు భారీగా అభిమానులను పెరిగేట్టు చేసింది. అధికారంలో వున్నవారు, రాజ కుటుంబానికి చెందినవారితోపాటు నేపాల్ మాజీ ప్రధాని, యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్టు అధినేత పుష్ప కుమార్ అలియాస్ ప్రచండ కూడా మోడీ అంటే ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీతో ప్రచండ సమావేశమయ్యారు. ఇండో-నేపాల్ మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని ప్రచండ అన్నారు. నేపాల్ అభివృద్ధికి, శాంతికి చేయూతనిస్తున్న మోడీని ప్రచండ ప్రశసించారు.

మహిళా జడ్జిని డాన్స్ చేయమన్నాడు.. ఇదెక్కడి న్యాయం?

  పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు న్యాయమూర్తులందు న్యాయం కలవారు వేరయా అని అనాల్సి వస్తోంది. ఎందుకంటే ఆమధ్య ఓ పెద్ద జడ్జి గారు బోలెడంత లంచం తీసుకుని దొరికిపోయారు. పవిత్రమైన జడ్జి పదవిలో వుండి తప్పుడు పనులు చేస్తున్న వారు బయటపడుతూనే వున్నారు. తాజాగా అలాంటి మరో జడ్జి ఉదంతం బయటపడింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టులో ఒక సీనియర్ జడ్జిగా వున్న తన కోర్టులోనే అడిషనల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న మహిళను ఎప్పటి నుంచో వేధిస్తున్నాడు. ఈమధ్య కాలంలో ఆమెని ఐటమ్ సాంగ్‌కి డాన్స్ చేసి చూపించమని వేధిస్తున్నాడు. ఇంతకాలం అతగాడి వేధింపులు భరించిన ఆమె ఇక భరించలేక తన ఉద్యోగానికి రాజీనామా చేసేసింది. ఆ తర్వాత ఆ జడ్జిగారి నిర్వాకాన్ని రాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఆమె ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో జరిగే ఓ వేడుకలో ఐటం సాంగుకు నర్తించాలని ఓ అధికారి ద్వారా వర్తమానం పంపారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసులు లాఠీలతో చావగొట్టారు... కేసీఆర్ కరెంటు ఇచ్చారు...

  మెదక్ జిల్లా రామాయపేట మండలంలోని నార్సింగి గ్రామానికి చెందిన రైతులు గత వారం రోజులుగా తమకు రోజుకు ఒక్క గంట కూడా కరెంటు ఇవ్వలేదన్న ఆవేదనతో జాతీయ రహదారి 44 మీద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రభుత్వ ఆదేశాలతో రైతుల మీద లాఠీఛార్జ్ చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల మీద పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ సంఘటనలో తెలంగాణ రైతుబిడ్డలు దారుణంగా గాయపడ్డారు. కాగా, ఈ సంఘటన మీద తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రైతులను చావబాదించినందుకు సారీ చెప్పారు. కాగా, ఈ సంఘటన మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్పందించారు. కరెంటు ఇప్పుడు ఇస్తున్నట్టుగా దారుణంగా కాకుండా రోజుకు 6 గంటలు కరెంట్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశించేదేదో రైతులు రోడ్డు మీద పడకముందు, పోలీసులు వాళ్ళని చావగొట్టకముందు ఆదేశిస్తే బాగుండేది కదా ముఖ్యమంత్రి గారూ!!

మల్లికా షెరావత్‌కి కోర్టు నోటీసులు

  'డర్టీ పాలిటిక్స్‌' సినిమాలో జాతీయ జెండాను అవమానపరిచారని దాఖలైన పిటిషన్పై బాలీవుడ్ నటి మల్లికా షెరావత్కు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో చిత్ర నిర్మాతతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. డర్టీ పాలిటిక్స్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లో జాతీయ పతాకాన్ని అవమానిచే విధంగా ధరించినందుకు మానవ హక్కుల కార్యకర్త ధన్గోపాలరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. మల్లికా షెరావత్పై చర్య తీసుకోవాల్సిందిగా కోర్టుకు పిర్యాదు చేసారు. అలాగే సినిమా ఫస్ట్లుక్లో మల్లిక షెరావత్ ఒక కారుపై అభ్యంతరకరంగా త్రివర్ణ పతాకాన్ని ధరించి ఉన్నట్లుగా రూపొందించారు. కాగా ఇదే వివాదంపై రాజస్థాన్ లోనూ కేసు నమోదు అయ్యింది.

కరెంట్ అడిగితే కొడతారా? కేసీఆర్‌ని ప్రశ్నించిన పొన్నాల...

  మెదక్ జిల్లా రామాయంపేట రైతులపై లాఠీఛార్జ్‌ దారుణమని టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. మెదక్ జిల్లా నార్సింగిలో రైతులపై జరిగిన లాఠీ ఛార్జి సంఘటన మీద పొన్నాల స్పందించారు. కరెంట్‌ అడిగితే లాఠీలతో కొడతారా అంటూ నిలదీశారు. తెలంగాణ రైతులు సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై లాఠీఛార్జ్‌ బాధాకరమని, తెలంగాణ రైతులకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ డిమాండ్ చేశారు. రైతులు, విద్యార్థుల వల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని, ఈ విషయాన్ని కేసీఆర్ విస్మరించరాదని చెప్పారు. సమస్యలపై సమీక్షించడం మానేసి ‘‘ఆకర్ష’’ పథకం మీద కేసీఆర్‌ దృష్టి సారిస్తున్నారని షబ్బీర్‌ అలీ మండిపడ్డారు.

రైతుల్ని చావగొట్టించాం సారీ: మంత్రి పోచారం

  విద్యుత్ కోతలను నిరసిస్తూ ఆందోళన చేపట్టిన తెలంగాణ రైతులను పోలీసుల చేత చావగొట్టించిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు తీరిగ్గా సారీ చెబుతోంది. అనుకోకుండా అలా జరిగిపోయిందని అంటున్నారు. నార్సింగిలో రైతుల మీద లాఠీఛార్జ్ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విచారం వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కలిగిన మాట వాస్తవమేనని ఆయన తప్పు ఒప్పుకున్నారు. మెదక్ జిల్లాలో తెలంగాణ అన్నదాతలను పోలీసులు లాఠీలతో చావగొట్టిన అంశాన్ని సీఎం సమీక్షించారని పోచారం తెలిపారు.

తెలంగాణ రైతుల్ని చచ్చేట్టు కొట్టారు

  విద్యుత్ కోతలను నిరసిస్తూ ఆందోళన చేపట్టిన తెలంగాణ రైతులను పోలీసులు అన్యాయంగా చావగొట్టారు. బారెడు పొడుగున్న లాఠీలతో గొడ్డులను కొట్టినట్టు కొట్టారు. మెదక్ జిల్లా చేగుంటమండలం నార్సింగిలోని 44వ నంబర్ జాతీయ రహదారి వద్ద కరెంటు కోతలను నిరసిస్తూ రైతులు రాస్తారోకో చేపట్టారు. గత వారం రోజులుగా రోజుకు కనీసం గంటసేపు కూడా కరెంటు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కడుపు మండుతున్న రైతులు రాస్తారోకో చేయడంతో జాతీయ రహదారి మీద హైదరాబాద్ - నిజామాబాద్ మధ్య ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు రంగప్రవేశం చేసి కడుపు మండుతున్న తెలంగాణ రైతుబిడ్డలను ఓదార్చాల్సింది పోయి పోలీసులు రంగంలోకి దిగారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తెలంగాణ రైతు బిడ్డల మీద లాఠీఛార్జ్ చేశారు. దాంతో కోపోద్రిక్తులైన రైతులు ఎదురు తిరిగి పోలీసుల మీద రాళ్ళదాడి చేశారు. చాలామంది రైతులను పోలీసులు చావబాలదారు. చాలామందిని అరెస్టు చేశారు.

31 లోగా కౌన్సిలింగ్ పూర్తి చేయాలి: సుప్రీం కోర్టు

  ఎంసెట్ కౌన్సిలింగ్ ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎంసెట్ కౌన్సిలింగ్ మీద దాఖలైన కేసు మీద విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. ఆగస్టు 31 లోగా కౌన్సిలింగ్ పూర్తిచేసి, సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర విభజన ప్రభావం విద్యార్థుల మీద పడకూడదని, విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయవద్దని అలా రాజకీయం చేస్తున్న వారికి సూచించింది. ఈ అంశం మీద తదుపరి విచారణను ఈనెల 11వ తేదీకి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ విషయాన్ని అడిషనల్ అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ తెలియజేస్తూ, ‘‘స్థానికత, ఇతర అంశాల విషయంలో రెండు రాష్ట్రాలూ విభజన చట్టం ప్రకారం వెళ్ళాలని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీం కోర్టు వెల్లడించిన అభిప్రాయం ప్రకారం స్థానికత, ఉమ్మడి ప్రవేశాలు తదితర అంశాల్లో విభజన చట్టాన్నే అనుసరించాలి. అలాగే స్థానికత రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వుండాలి అని సుప్రీంకోర్టు చెప్పింది’’ అన్నారు.

ఏపీలో వైభవంగా గోదావరి పుష్కరాలు

  గోదావరి పుష్కరాలను గతంలో కంటే వైభవంగా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు చెప్పారు. గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. పుష్కరాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్న ఆశాభావంతో రాష్ట్ర ప్రభుత్వం వుంది. వచ్చే ఏడాది జరగబోతున్న పుష్కరాలకు గత పుష్కరాలకంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు రాజమండ్రికి వచ్చే అవకాశం వుంది కాబట్టి అందుకు తగ్గ ఏర్పాట్లను ఇప్పటి నుంచే అధికారులు ప్రారంభించాలని మంత్రి మాణిక్యాలరావు ఆదేశించారు. పుష్కరాలకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశం మీద మంత్రి రాజమండ్రిలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య....

  నెల్లూరులో బి.నాగశ్రావణి (20) అనేఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకి పాల్పడింది. తన హాస్టల్ గదిలోనే ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆమె మరణించింది. చదువులో రాణించలేకపోతూ వుండటం, ఎంత చదివినా తక్కువ మార్కులు వస్తూ వుండటం వల్లే మనోవేదన చెందుతూ ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. నాగశ్రావణి నెల్లూరులోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతోంది. తనతోపాటు గదిలో ఉంటున్న మరో విద్యార్థిని రూమ్‌లోంచి బయటకి వెళ్ళినప్పుడు శ్రావణి తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందింది. అయితే శ్రావణి ముఖంపైన ఇబ్బందికరమైన మచ్చలుండటంతో సర్జరీ చేయించుకొందని, సర్జరీ అనంతరం కూడా ముఖం అందంగా రాకపోవడంతో తోటి విద్యార్థులకు తన ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకొని మరణించిందన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి.

టీఆర్ఎస్‌పై దత్తాత్రేయ ఫైర్: ముస్లిం రిజర్వేషన్లు...

  మైనారిటీలకు 12 శాతం కల్పిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని బీజేపీ నాయకుడు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ ఆక్షేపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తామనంటూ ప్రకటించినప్పుడు మతపర రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ కోర్టులు కొట్టివేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బాటలోనే నడుస్తున్నట్టు కనిపిస్తోందని ఆయన విమర్శించారు. ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ఓట్ల రాజకీయాల దృష్టితోనే ముస్లింల మీద ప్రేమను కురిపిస్తోందని దత్తాత్రేయ విమర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దత్తాత్రేయ పలు ప్రశ్నలు సంధించారు. తెలంగాణ పిల్లలకు మాత్రమే ఫీజు రీఎంబర్స్‌‌మెంట్ చేస్తామంటున్న ప్రభుత్వం, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పిందని గుర్తు చేశారు. అయితే తెలంగాణలో ఉన్న పేద విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుందా లేదా? ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకం కేజీ టు పీజీ విద్యలో భాగం కాదా అని ప్రశ్నించారు. స్థానికత అంశం, ముల్కీ నిబంధన ఒక్కటే కాదా? ముల్కీ ఆధారంగానే 371 (డి)కు తుది రూపమిచ్చిన విషయం వాస్తవం కాదా అని దత్తాత్రేయ ప్రశ్నించారు.

చైనాలో భూకంపం: మృతులు 360 మంది

  నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో జరిగిన భారీ భూకంపంలో 360 మంది మరణించారు. ఇప్పటి వరకు 181 మంది గల్లంతు అయినట్టు తెలుస్తోంది. 1400 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకూ ఈ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం లాంగ్‌టౌషాన్ టౌన్‌షిప్ దగ్గర భూమిలో 12 కిలోమీటర్ల లోతులో వున్నట్టు గుర్తించారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలు మీద 6.5గా నమోదైంది. భూకంప కేంద్రానికి 23 కిలోమీటర్ల దూరంలో వున్న లుడియాన్ కౌంటీలో 120 మంది మరణించారు. 180 మంది గల్లంతయ్యారు. 1300 మంది గాయపడ్డారు. ఈ భూకంప తీవ్రత కారణంగా 12 వేల ఇళ్ళు కూలిపోయాయి. 30 వేల ఇళ్ళు దెబ్బతిన్నాయి. చైనా సరిహద్దుల్లో వున్న జపాన్, నేపాల్, ఇండియాలోని కొన్ని ప్రాంతాలు కూడా ఈ భూకంపం కారణంగా కంపించాయి.