బాలకృష్ణ ఇంటి వద్ద చెత్త.. కార్మికుల నిరసన
posted on Nov 21, 2018 @ 10:31AM
అనంతపురం జిల్లా హిందూపురంలో నటుడు,ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పారిశుద్ధ్య కార్మికులు ఆయన ఇంటివద్ద ఆందోళనకు దిగారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 279ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే హిందూపురం మున్సిపాలిటిలో విధుల నుంచి తప్పించిన 220 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. బాలకృష్ణ ఇంటి వద్ద పెద్ద ఎత్తున చెత్త వేసి వారు తమ నిరసన తెలిపారు. అనంతరం ఇంటిలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకొని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురు కార్మికులు గాయపడ్డారు. కాగా మున్సిపల్ కార్మికుల ఆందోళనలో పాల్గొన్న సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
జీవో నెంబరు 279 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు గతంలో రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వంతో చర్చల అనంతరం 15 రోజుల తర్వాత సమ్మె విరమించారు. 279 జీవో రద్దుకు ప్రభుత్వం ఒప్పుకుందని కార్మికులకు యూనియన్ లీడర్లు సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. కానీ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని, 279 జీవో ప్రకారమే పని చేయాలని మున్సిపల్ కమిషనర్లు స్పష్టం చేయడంతో ఐదు రోజుల క్రితం కార్మికులు మళ్లీ సమ్మెలో దిగారు. ఇందులో భాగంగానే బాలకృష్ణ ఇంటిని చుట్టుముట్టారు.