జగన్ కేబినెట్ నుంచి 18 మంది అవుట్? కొత్తగా చోటు దక్కేది వీరికేనా?

సమయం దగ్గర పడుతోంది. పాత నీటిని సాగనంపి కొత్త నీటితో కొత్త కలరివ్వాలి. ముఖ్యమంత్రి జగన్ ముందే చెప్పినట్టు రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గంలో మార్పులుంటాయని, అందుకు అందరూ సమ్మతించాలని, ఎవ్వరు కూడా తోకలు జాడించకుండా వారి నుంచి ప్రమాణ పత్రాలు కూడా జగన్ రాయించుకున్నారు ఎంతో ముందుచూపుతో. జగన్ మంత్రివర్గంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులతో పాటు 20 మంది కేబినెట్ మినిస్టర్స్ ఉన్నారు.  వచ్చే దసరాకు కేబినెట్ రీషఫుల్ చేయాలనే యోచనలో జగన్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరి సీటుకు  ఎసరొస్తుందో.. ఎవరు కంటిన్యూ అవుతారనేది వైసీపీలోనే గాక ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిగ్గా మారింది.  ఇప్పుడున్న సమాచారం ప్రకారం పద్దెనిమిది మందికి పైగా మంత్రులకు ఉద్వాసన తప్పదంటున్నారు. కొత్తవారికి చాన్స్ ఇవ్వడంతో పాటు కొన్ని సామాజికవర్గాలకు పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. తొలి దఫాలో రెడ్డి సామాజిక వర్గం నుండి నలుగురికి మాత్రమే అవకాశం కల్పించారు జగన్. అప్పట్లో ముఖ్యమంత్రి కాకుండా రెడ్డి సామాజిక వర్గం నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు), బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (కర్నూలు), మేకపాటి గౌతమ్‌రెడ్డి ( నెల్లూరు), బాలినేని శ్రీనివాస రెడ్డి ( ప్రకాశం)కి కేబినెట్ లో చోటు దక్కింది. గుంటూరు, అనంతపురం నుంచి గెలుపొందిన రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఎన్ని ప్రయత్నాలుచేసినా జగన్ కరుణించలేదు. తరువాత  చూద్దాం లే అంటూ దాటవేశారు. ఇప్పుడు వారంతా తమకు తప్పకుండా చోటు దక్కుతుందన్న భావనలో ఉన్నారు.  శ్రీకాకుళం నుంచి: ధర్మాన కృష్ణ దాస్, సీదిరి అప్పల రాజు మంత్రివర్గంలో వున్నారు. నర్సన్నపేట నియోజకవర్గం నుండి గెలుపొందిన ధర్మాన కృష్ణ దాస్ ది కొప్పులవెలమ సామాజిక వర్గం. సీదిరి అప్పల రాజు అనూహ్యంగా మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నవారు. గుంటూరు జిల్లా రేపల్లె లో వైకాపా అభ్యర్థి గా పోటీ చేసి ఓడిపోయిన మోపిదేవి వెంకటరమణరావుకి సామాజిక సమీకరణలో భాగంగా జగన్ కేబినెట్ లో చోటు దక్కింది. మోపిదేవిని ఆ మధ్య రాజ్యసభకు పంపడంతో ఏర్పడిన ఖాళీని అప్పల రాజుతో పూరించారు. ధర్మాన కృష్ణ దాస్ ను తొలగించి ధర్మాన సోదరుడు మాజీ మంత్రి అయిన శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది.  ఇక స్పీకర్ గా ఉన్న ఒకనాటి మాజీ మంత్రి కళింగ సామాజికవర్గానికి చెందిన ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. స్పీకర్ గా వైదొలిగి మంత్రి కావాలని ఉవ్విళ్లూరుతున్నారు. తూర్పు కాపు సామాజిక వర్గం నుండి పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మహిళా కోటాలో... ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ లు మంత్రి పదవి ఆశిస్తున్నా వీరిద్దరూ మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు కాబట్టి చాన్స్ లేనట్టేంటున్నారు. విజయనగరం నుంచి: చీపురుపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మంత్రి మండలిలో కొనసాగుతున్నారు. కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. గిరిజన కోటాలో అత్యున్నత పదవి పొందిన పుష్పశ్రీవాణి పనితీరు బాగుందని టాక్. అయితే జిల్లాలో బొత్స శిష్యుడు వైశ్య సామాజిక వర్గానికి చెందిన విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన వెలంపల్లి శ్రీనివాస రావు (కృష్ణా జిల్లా) ని మంత్రి మండలి నుండి తప్పిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. జిల్లాలో తూర్పు కాపులు బలమైన సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం నుండి బొత్స సత్యనారాయణ తో పాటు బొత్స సోదరులు అప్పల నర్సయ్య, మేనల్లుడు బడుకొండ అప్పల నాయుడు ఎమ్మెల్యేలు గా రాణిస్తున్నారు. పుష్పశ్రీవాణి ని మార్చాల్సి వస్తే జిల్లాలోని సాలూరు ఎమ్మెల్యే వరుసగా మూడు సార్లు గెలుపొందిన గిరిజనుడు పి. రాజన్నదొర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. విశాఖపట్నం నుంచి: విశాఖ జిల్లా మొత్తం మీద ఒకే ఒక్కడిగా మంత్రిమండలిలో వెలుగొందుతున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఎన్నికలకు ముందుగా వైకాపా లో చేరారు. అప్పటి వరకు తెదేపా ఎంపిగా అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించిన ముత్తంశెట్టి వైకాపాలో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచి ఎకాఎకిన మంత్రి అయిపోవడం వైకాపా లోని చాలామంది సీనియర్ నేతలకే అంతుచిక్కలేదు. అయితే ముత్తంశెట్టిని మార్చాల్సి వస్తే ఇదే సామాజిక వర్గానికి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.  తూర్పు కాపు (బిసి) సామాజిక వర్గం నుండి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, కొప్పుల వెలమ (బిసి)ల కోటా లో నర్సీపట్నం ఎమ్మెల్యే, సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు పి. ఉమా శంకర గణేష్ లు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉమా శంకర్ గణేష్ అప్పటి మంత్రి, తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడ్ని భారీ ఆధిక్యతతో ఓడించడం కలిసొచ్చే అంశం. కొప్పుల వెలమల నుండి ధర్మాన బ్రదర్స్ లో ఒకరికి శ్రీకాకుళం జిల్లా నుండి ఛాన్స్ ఇచ్చినా మరొకరికి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవ్వాల్సి వస్తే తనకు అవకాశం ఇవ్వాలంటూ ఉమా శంకర గణేష్ ప్రయత్నాలు వేగిరం చేశారు. ఇందుకు సోదరుడు పూరీ జగన్నాధ్ కూడా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. తూర్పు గోదావరి నుంచి: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్న బాబు, అమలాపురం ఎస్సీ రిజర్వుడు ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్, రామచంద్రాపురం నుండి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ లు మంత్రి మండలిలో వున్నారు. కురసాలను కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవి వరించనుందని ప్రచారం జరుగుతోంది. తుని ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా కూడా మంత్రి పదవి కోసం ఎప్పటినుంచో రేసులో ఉన్నారు. ఇటీవలే శాసనమండలికి ఎంపికైన తోట త్రిమూర్తులు కూడా పోటీ పడుతుండటంతో ఆసక్తికరంగా మారింది. తోట త్రిమూర్తులుకి వరసకు వియ్యంకుడైన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకి మంత్రి వర్గంలో చోటు కల్పించనున్న నేపథ్యంలో త్రిమూర్తులుకి చోటు లేనట్టేనంటున్నారు. దళిత సామాజికవర్గ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ ని మార్చబోవడం లేదు. శాఖ మారితే మారొచ్చు అంటున్నారు. ఈ జిల్లా లో కాపులుగా చలామణీ అయ్యే తెలగ బలిజ సామాజిక వర్గం నుండి కురసాల కన్నబాబును మినహాయిస్తే దాడిశెట్టి రాజా(తుని), పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ (ప్రత్తిపాడు), పెండెం దొరబాబు ( పిఠాపురం), జక్కంపూడి రాజా ( రాజానగరం), జ్యోతుల చంటిబాబు (జగ్గంపేట)తో పాటు.. తోట త్రిమూర్తులు ఒక్క ఛాన్స్ కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు.  పశ్చిమ గోదావరి నుంచి : ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), ఆచంట ఎమ్మెల్యే సి.హెచ్. శ్రీరంగనాథరాజు, కొవ్వూరు ఎస్సీ రిజర్వుడు ఎమ్మెల్యే తానేటి వనితలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఆళ్ల నాని కొనసాగనుండగా రంగనాథ రాజు, తానేటి వనితల్ని తొలగించనున్నట్టు సమాచారం. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రంగనాథరాజు స్థాననంలో నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజుకి చోటు దక్కనుండగా యాదవ సామాజిక వర్గం నుండి తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ ని మంత్రివర్గం నుండి తప్పించనున్నారన్న వార్త విస్తృతంగా ప్రచారంలో ఉండడంతో కారుమూరి నాగేశ్వరరావు తన అదృష్టాన్ని పరీక్షంచుకోబోతున్నారు. ఆళ్లనాని సామాజికవర్గానికే చెందిన భీమవరం ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓడించిన గ్రంధి శ్రీనివాస్ ఈసారి రేసులో ఉన్నారు.  కృష్ణా నుంచి: కృష్ణా జిల్లా బందరు నుండి పేర్ని వెంకట్రామయ్య (నాని), గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని), విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు మంత్రివర్గంలో ఉండగా తెలగ కాపు సామాజిక వర్గానికి చెందిన పేర్ని నానికి ఉద్వాసన కలిగించి ఇదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ భానుకి చోటు కల్పించే అవకాశం ఉందంటున్నారు. వైశ్యుల కోటాలో వెలంపల్లి శ్రీనివాసరావు ప్లేస్ మెంట్ సురక్షితంగానే కనిపిస్తున్నా... విజయనగరం నుండి వీరభద్రస్వామి, ప్రకాశం జిల్లా గిద్దలూరు నుండి అన్నా రాంబాబు తమ ప్రాధాన్యతను గుర్తించాల్సిందిగా పట్టు బడుతున్నారు. వెలంపల్లిని తప్పిస్తేనే మరొకరికి ఛాన్స్ దొరుకుతుంది. బ్రాహ్మణుల కోటాలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం ఆశిస్తున్నారు. పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థ సారథి యాదవ్, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ గౌడ్ లు వెనుకబడిన తరగతుల కోటాలో మంత్రి పదవి ఆశిస్తుండగా వీరిలో ఒకరికి తప్పక అవకాశం ఉంటుందని సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు (ఎస్సీ రిజర్వుడు) ఎమ్మెల్యే తానేటి వనితను తప్పించి ఆ ఖాళీని కృష్ణా జిల్లా నుండి భర్తీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలు ఆంధ్ర ప్రదేశ్ లోనే అతిపెద్ద జిల్లాలు కావడంతో ఈసారి మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాల నుండి ఎక్కువ సంఖ్యలో మంత్రులు కొలువు తీరే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లా నుండి నలుగురు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి ముగ్గురు గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి ఒక్కొక్క జిల్లా నుండి నలుగురికి తగ్గకుండా అవకాశం లభించే వీలుంది. గుంటూరు నుంచి: పత్తిపాడు (ఎస్సీ రిజర్వుడు) ఎమ్మెల్యే ఎం.సుచరిత హోమ్ మంత్రిగా ఉన్నారు. వెనుకబడిన తరగతుల నుండి మంత్రి పదవి పొందిన మోపిదేవి వెంకటరమణ రావు రాజ్యసభకు ఎంపికయ్యారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం నుండి కోన రఘుపతి మంత్రి పదవి ఆశిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం నుండి తీవ్రమైన ఒత్తిడి ఉంది. వరుసగా నాలుగుసార్లు గెలిచిన మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వరుసగా రెండుసార్లు గెలిచిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలలో ఒకరికి మంత్రి పదవి తప్పదనే ప్రచారం సాగుతోంది. ఆశావహులలో ప్రత్యేకించి పేర్కొన దగినవారు ఎస్సీ మాదిగ సామాజికవర్గానికి చెందిన తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, బి.సి. రజక సామాజికవర్గానికి చెందిన చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ఇరువురు మహిళలు తెలగ బలిజ కులస్తుల్ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఇరువురు మహిళా ఎమ్మెల్యేలు విద్యాధికులే. ఇటీవల విడుదల రజిని ముఖ్యమంత్రిని కలసి ప్రత్యేకంగా చర్చించడం కూడా చర్చనీయాంశం అయ్యింది.  ముస్లిం మైనారిటీల నుండి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మంత్రివర్గంలో చోటు కోసం తహతహలాడుతున్నారు. వరుసగా రెండుసార్లు వైకాపా అభ్యర్థిగా గెలిచి రావడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఇక అంబటి రాంబాబు 1989 తర్వాత మళ్లీ 2019 ఎన్నికల్లో గెలిచి వచ్చారు.తెలగ కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు సత్తెనపల్లి నుండి 2014 లో ఓడిపోయినా 2019 ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ రావు పై భారీ ఆధిక్యంతో గెలుపొంది మంత్రి పదవి ఆశించారు. భంగపాటు తప్పలేదు. ఇప్పుడు తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఈయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అల్లుడు.  ప్రకాశం నుంచి: ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎర్రగొండ పాలెం (ఎస్సీ రిజర్వుడు) ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ మంత్రులుగా కొనసాగే అవకాశం ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుండి ఎం.మహీధర్ రెడ్డి (కందుకూరు) కి అవకాశం ఉందంటున్నారు. వైశ్యుడైన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. అన్నా రాంబాబు 78 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందడం ఒక కారణంగా చూపుతున్నారు. నెల్లూరు నుంచి: నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ని మంత్రివర్గం నుండి తప్పించనుండగా, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రి వర్గంలో కొనసాగుతారు. ఒకవేళ గౌతమ్ రెడ్డిని తప్పించాల్సివస్తే.. సీనియర్ అయిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కి బెర్త్ కన్ఫర్మ్ అయ్యే చాన్సుంది.  సూళ్లూరుపేట (ఎస్సీ) రిజర్వుడ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే చిత్తూరు జిల్లాకి చెందిన ఉప ముఖ్యమంత్రి, గంగాధర నెల్లూరు (ఎస్సీ రిజర్వుడ్) ఎమ్మెల్యే కె.నారాయణ స్వామిని తప్పిస్తేనే కిలివేటి సంజీవయ్య కు ఛాన్స్ అని తెలుస్తోంది. చిత్తూరు నుంచి: పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి వర్గంలో కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దళిత సామాజికవర్గం నుండి కె.నారాయణస్వామిని తప్పిస్తే నెల్లూరు జిల్లాలో కానీ అనంతపురం, కడప జిల్లాల నుండి కానీ దళితులకి అవకాశం కల్పిస్తారు. రెడ్డి సామాజిక వర్గం నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్.కె. రోజా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కడప నుంచి: కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా కొనసాగుతారు. ఈసారి ముస్లిం మైనారిటీల నుండి మరొకరికి కూడా అవకాశం కల్పించాలనే సమీకరణాలలో భాగంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జగన్ సొంత జిల్లా కావడంతో మైనారిటీలతో పాటు దళితులకు కూడా పెద్దపీట వేయాలని యోచిస్తున్నారు. బద్వేలు (ఎస్సీ రిజర్వుడ్) ఎమ్మెల్యే జి.వెంకట సుబ్బయ్య మరణించడంతో రైల్వే కోడూరు (ఎస్సీ రిజర్వుడ్) ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఒక్కరే మిగిలారు. వరుసగా నాలుగు సార్లు గెలిచిన కొరముట్ల శ్రీనివాసులు మూడుసార్లు వైకాపా తరపున గెలిచి రావడం ఆయనకి బాగా కలిసి వస్తున్న అంశం. అయితే నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో మొత్తమ్మీద ఇద్దరు తక్కువ కాకుండా మంత్రుల్ని దళిత సామాజిక వర్గం నుండి ఎంపిక చేసే అవకాశం ఉంది.  అనంతపురం నుంచి: పెనుకొండ ఎమ్మెల్యే, కురబ(బిసి) సామాజిక వర్గానికి చెందిన ఎమ్.శంకర్ నారాయణ ప్రస్తుత మంత్రి వర్గంలో ఉన్న ఏకైక మంత్రి. కనీ వినీ ఎరుగని రీతిలో దాదాపు రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు పోటాపోటీగా మంత్రి పదవిని ఆశిస్తున్న జిల్లా అనంతపురం జిల్లా కావడం విశేషం. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే ఎల్లారెడ్డి వెంకటరామిరెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎవరి స్థాయిలో వారు మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడం కోసం రకరకాల కారణాలు చూపుతున్నా... పరిటాల సునీతపై రెండు సార్లు ఓడిపోయి పరిటాల శ్రీ రామ్ ని 2019లో ఓడించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్.పి. కూడా అయిన అనంత వెంకటరామిరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో అంతిమ విజేత ఎవరో చూడాలి. ఈ జిల్లా నుండి రెడ్డి కులస్తులెవ్వరికీ అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే ఉషశ్రీ చరణ్... రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. తను కురబ (బి.సి) సామాజిక వర్గం, భర్త రెడ్డి కావడంతో సమీకరణ సరిపోతుందంటున్నారు.  దళితుల కోటాలో శింగనమల (ఎస్సీ రిజర్వుడ్) నుండి జొన్నలగడ్డ పద్మావతి, మడకశిర (ఎస్సీ రిజర్వుడ్) నుండి డాక్టర్ ఎమ్.తిప్పేస్వామి పోటీపడుతున్నారు. తిప్పేస్వామి సీనియర్. ఆయన వరుసగా మూడుసార్లు గెలిచారు. అయితే తిప్పేస్వామి... ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న ఆదిమూలపు సురేష్ స్వయంగా బావా-బావమరుదులు. సురేష్ ని తప్పిస్తేనే తిప్పేస్వామికి అవకాశం లేకుంటే నో ఛాన్స్.  కర్నూలు నుంచి: ఆలూరు ఎమ్మెల్యే బోయ (బి.సి) సామాజికవర్గానికి చెందిన పి.జయరామ్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. తొలిసారి మంత్రివర్గ సమయంలో ఒత్తిడికి గురైన వైకాపా అధినాయకత్వం అప్పుడు తట్టుకోగలిగిన ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతోంది. శ్రీశైలం నుండి శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల నుండి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తమలో ఒకరికి అవకాశం కల్పించాల్సిందేనని పట్టు బడుతున్నారు. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్ రెడ్డి కూడా పైరవీలు చేసుకుంటున్నారు.  మొత్తానికి 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత కొందరిని సంతృప్తి పరిచిన జగన్... మరికొందరిని రెండున్నర ఏళ్ల పాటు అని ఊరించడం వల్లే ఈ తిప్పలన్నీ అంటున్నారు. మరి ఈ సస్పెన్స్ వీడాలంటే దసరా వరకు ఎదురు చూడాల్సిందే.

వైఎస్ సునీత ఫిర్యాదుపై యాక్ష‌న్‌.. రెక్కీ చేసిన మ‌ణికంఠారెడ్డి అరెస్ట్‌..

ఇంటిచుట్టూ తిరిగాడు. ఇంట్లో ఎవ‌రున్నారా అని అబ్జ‌ర్వ్ చేశాడు. గేటు బ‌య‌ట ఆగి ఎవ‌రెవ‌రికో ఫోన్లు చేశాడు. మాకు భ‌యంగా ఉంది. మా కుటుంబానికి ప్రాణ‌హాని ఉంది. వెంట‌నే ర‌క్ష‌ణ క‌ల్పించ‌మంటూ సీబీఐని, క‌డ‌ప జిల్లా ఎస్పీని కోరారు వైఎస్ వివేకానంద‌రెడ్డి కూతురు సునీత‌. ఆమె ఫిర్యాదుపై పోలీసులు రంగంలోకి దిగారు. సీసీకెమెరా ఫూటేజీని ప‌రిశీలించారు. సునీత అనుమానం వ్య‌క్తం చేసినట్టుగానే ఆ అగంత‌కుడు మ‌ణికంఠారెడ్డి అని గుర్తించారు. పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సునీత ఇంటి ద‌గ్గ‌ర రెక్కీ ఎందుకు చేశారు? ఎవ‌రి ఆదేశాల మేర‌కు చేశారు? అక్క‌డి నుంచి ఎవ‌రెవ‌రికి ఫోన్లు చేశారు? అని మ‌ణికంఠారెడ్డిని ప్ర‌శ్నిస్తున్నారు పులివెందుల పోలీసులు.  వైఎస్ సునీత ఫిర్యాదుతో శుక్ర‌వారం నుంచి పులివెందుల‌లో అల‌జ‌డి మొద‌లైంది. తమ కుటుంబానికి ప్రాణ‌హాని ఉంద‌ని.. భద్రత కల్పించాలని కడప ఎస్పీకి వైఎస్‌ సునీత లేఖ రాయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటికి స‌మీపంలో ఆగి ఎవ‌రికో ఫోన్‌ కాల్స్ చేశాడని లేఖలో సునీత తెలిపారు. ఆ వ్యక్తి మణికంఠరెడ్డి అని.. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత చెప్పారు. తన తండ్రి వైఎస్ వివేకా హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, అత‌ని అనుచ‌రుడు మ‌ణికంఠ‌రెడ్డి త‌మ ఇంటి ద‌గ్గ‌ర రెక్కీ నిర్వ‌హించడం త‌మ‌కు భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోందని సునీత వాపోయారు. త‌మ కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంతో పాటు.. త‌న తండ్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గు తేల్చాలని సీబీఐని కోరారు సునీత‌. ఆమె ఫిర్యాదుతో క‌దిలిన పోలీస్ యంత్రాంగం.. తాజాగా మ‌ణికంఠారెడ్డిని అదుపులోకి తీసుకొని రెక్కీపై విచారిస్తోంది. పులివెందుల‌లోని సునీత ఇంటి ద‌గ్గ‌ర పోలీసు బందోబ‌స్తు కూడా ఏర్పాటు చేశారు.   మ‌రోవైపు, వైఎస్ వివేక హ‌త్య కేసు విచార‌ణ వేగంగా జ‌రుగుతోంది. రెండు నెల‌లుగా సీబీఐ ఇదే ప‌ని మీద ఉంది. వాచ్‌మెన్ వాంగ్మూలం కీల‌కంగా మారింది. కొంద‌రు పెద్ద‌లు మిన‌హా అనుమానితులంద‌రినీ ప్ర‌శ్నిస్తోంది. వేరు వేరు కోణాల్లో ఎంక్వైరీ చేస్తోంది. నిందితుడు సునీల్‌ను ఇప్ప‌టికే అరెస్ట్ చేసింది. ఇంకా చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి. గొడ్డ‌లిపోటును గుండెపోటుగా ప్ర‌క‌టించిన వారినీ విచారించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సీబీఐ ద‌ర్యాప్తు వేగం పుంజుకుంటున్న నేప‌థ్యంలో.. స‌డెన్‌గా వైఎస్ వివేకా కూతురు సునీత ఇంటి ద‌గ్గ‌ర మ‌ణికంఠారెడ్డి రెక్కీ నిర్వ‌హించడం సంచ‌ల‌నంగా మారింది. పోలీస్ ఎంక్వైరీలో రెక్కీకి కార‌ణాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది. వ‌రుస ప‌రిణామాలు చూస్తుంటే.. వివేక హ‌త్య వెనుక పెద్ద త‌ల‌కాయ‌లే ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.   

విపక్ష శిబిరంలో విందు రాజకీయాల జోరు.. మోడీ టార్గెట్ గా ఏకమయ్యేనా? 

ఢిల్లీలో ఇప్పుడు విందు రాజకీయాల సీజన్ నడుస్తోంది. పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న సమయంలోనే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ ఐదు రోజులు ఢిల్లీలో మకాం చేశారు. ఈ ఐదు రోజులలోనూ ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా వివిధ పార్టీల నాయకులను విడివిడిగా కలిశారు. విందులలో, తేనీటి విందులలో పాల్గొని, విపక్షాల ఐక్యతగా గీతానికి సిగ్నేచర్ ట్యూన్ సెట్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఢిల్లీ  కాన్సిట్యూషన్ క్లబ్’లో  ప్రతిపక్ష పార్టీల నాయకులకు అల్పాహర విందు ఇచ్చారు. ఇంచుమించుగా రెండు దశాబ్దాలకు పైగా క్రియాశీల రాజకీయాల్లో, 17 ఏళ్ళకు పైగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్న రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా పెద్దగా కాంగ్రెస్ గడప దాటలేదు. రాహుల్ గాంధీ కాంగ్రేస్సేతర పార్టీల నాయకులతో కలిసి కూర్చున్న సందర్భాలను వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చును. అలాంటిది ఈ మద్య ఆయన తరచూ విపక్ష పక్షాల నాయకులతో ముచ్చట్లు పెడుతున్నారు.  గత వారంలో కాంగ్రెస్ జీ 23 నాయకుడు, కపిల్ సిబల్ విపక్ష పార్టీల నాయలకు విందు నిచ్చారు.ఇక ఇప్పుడు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ వంతు వచ్చింది. ఆమె యూపీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్యమంత్రులతో పాటుగా, భావసారుప్యత ఉన్న పార్టీల ముఖ్యమంత్రులు,  ముఖ్య నేతలకు ఆగష్టు మూడవ వారంలో విందు ఏర్పాటు చేశారు. అయితే, తాజా సమాచారం ప్రకారం అందరూ ఢిల్లీ రావడం కుదరక పోవడం వల్లనో ఏమో, సోనియా గాంధీ, విందుకు బదులుగా ఆగష్టు 20 న వర్చువల్’‘గా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. తృణమూల్ అధినేత్రి  మమతా బెనర్జీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్దావ్ థాకరే, తమిలందు మ ముఖ్యమంత్రి, డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం, జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’తో పాటుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు.     ఈ సమావేశం కానీ, ఇంతకు ముందు జరిగిన, ఇక ముందు జరిగే సమావేశాలు కానీ,  అన్నిటి లక్ష్యం,అందరి లక్ష్యం ఒక్కటే, విపక్షలాను ఏకతాటిపైకి తీసుకువచ్చి, 2024 ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని మోడీని ఓడించడం. ఈ అజెండా చుట్టూనే విపక్ష పార్టీలు ప్రదక్షిణ చేస్తున్నాయి.  కిందా మీద అవుతున్నాయి.  రెండు నెలల క్రితం జూన్ నెలలో  ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిశోర్ ఒకసారి ముంబైలో మరోమారు ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ను కలవడంతో మొదలైన విపక్షాల ఐక్యత యత్నాలలో ఇంతవరకు పెద్దగా ముందడుగు పడలేదు. ఇంతవరకు   సాధించింది కూడా ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగళి  అక్కడే అన్న చందంగానే ఐక్యత కథ నడుస్తోంది అంతే కాదు, ఒక విధంగా, అలీ లేదు చూలూ లేదు కొడుకు పేరుసోమ లింగం అన్నట్లుగా, పుట్టని ఫ్రంట్ నాయకత్వం కోసం విపక్షాల మధ్య అప్పుడే పోటీ మొదలైంది. ఓ వంక నుంచి మమత, మరో వంక పవార్ మధ్యలో రాహుల్ గాంధీ, బీజేపీ, మోడీ వ్యతిరేక ‘కాషాయ ద్వేష కూటమి’ నాయకత్వం కోసం పోటీ పడుతున్నారు. అదలా ఉంటే, విపక్షాల ఐక్యతా రాగం కాంగ్రెస్’లో పార్టీలోని విబేధాలకు మరింతగా బయట పెట్టిందని విశ్లేషకులు భావిస్తున్నారు.  పార్లమెంట్ సమావేశాలు జరుగతున్న సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన అల్పాహార విందుకు, జీ 23 నేతలకు ఆహ్వానం లేదు. అందుకు ప్రతిగా జీ23 నేత కపిల్ సిబల్ ఇచ్చిన విందుకు సోనియా, రాహుల్ సహా గాంధీలు ఎవరికీ ఆహ్వానం లేదు. పైగా, సిబల్ విందులో రాహుల్ గాంధీ విందులోపాల్గొనని వైసీపీ, తెరాస, బిజు జనతా దళ్, ఆప్, శిరోమణి అకాలీదళ్  వంటి పార్టీలు కూడా హాజరయ్యాయి. అంతే కాకుండా కపిల్ సిబల్ విందుకు మీడియాలో ఎక్కువ కవరేజ్ వచ్చింది. అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ కాకుండా నేరుగా సోనియా గాంధీ రంగంలోకి దిగారు. అదలా ఉంటే. ఇలా పోటీ పోటీగా సాగుతున్న విందు రాజకీయాలను దగ్గరగా చూస్తున్న విశ్లేషకుల  విపక్షాల ఐక్యత విషయం ఎలా ఉన్నా, విపక్షలా మూలా స్థంభం కాంగ్రెస్ విబేధాలు బయట పడుతున్నాయని అనటున్నారు. అంటే కాదు,కాంగ్రెస్’లో మరో చీలిక అనివార్యంగా కనిపిస్తోందని అంటున్నారు. అలాగే, విపక్ష్ల ఐక్యతా ప్రయత్నాలు, హనుమంతుని చేయబోతే కోతి బొమ్మ తయారైంది అన్నట్లుగా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  అయితే, ఇప్పటికిప్పుడు, అంతిమ తీర్పుఇవ్వలేమని కూడా అంటున్నారు.

బీజేపీ అధ్య‌క్షుడిపై మ‌ర్డ‌ర్ అటెంప్ట్‌.. దాడి వెనుక వైసీపీ హ‌స్తం?

ఆయ‌నేమీ చిన్నాచిత‌కా నాయ‌కుడు కాదు. బీజేపీలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే లీడ‌ర్. అలాంటి నేత‌పై అటాక్ జ‌రిగింది. మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తుండ‌గా.. కాపు కాసి.. స్కెచ్ వేసి.. ప‌క్కాగా దాడి చేశారు దుండ‌గులు. కర్ర‌ల‌తో దాడి చేసి కొట్ట‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. విష‌యం తెలిసి క‌మ‌ల‌నాథులు ఉలిక్కిప‌డ్డారు. స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం చెల‌రేగింది. అస‌లు ఏం జ‌రిగిందంటే.... వినుగొండ బీజేపీ పట్టణ అధ్యక్షుడు మేడం రమేష్‌పై హత్యాయత్నం సంచలనం రేపింది. మార్నింగ్ వాక్‌కు వెళ్తున్న ఆయనపై దుండగులు ఒక్క‌సారిగా దాడి చేశారు. పట్టణంలోని డైమండ్‌ టవర్స్‌లో నివాసముండే ర‌మేశ్‌.. ద్విచక్ర వాహనంపై ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో వాకింగ్‌కు బయలుదేరారు. రోడ్డు మలుపు తిరుగుతుండగా ముఖానికి మాస్క్‌లు ధరించి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు ఆయ‌న్ను అడ్డగించారు. వెనుక నుంచి మ‌రో ముగ్గురు వ‌చ్చారు. అంతా క‌లిసి.. రౌండ‌ప్ చేసి.. కర్రలతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాల‌తో.. రక్తస్రావం అవుతూ.. కింద‌ప‌డిపోయారు ర‌మేశ్‌.  బీజేపీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు ర‌మేశ్‌పై జ‌రిగిన దాడిని చూసిన చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. ర‌మేశ్‌కు చెయ్యి విరిగింది. తలకు, కాలికి గాయాల‌య్యాయి. మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట తరలించారు. స్థానిక వైసీపీ నాయ‌కులు, వినుకొండ మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులుపై ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.   

హుజురాబాద్ లో దళిత బంధు సెగలు.. టీఆర్ఎస్ నేతల్లో గుబులు

అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. ఈ పాట ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సరిగ్గా అతికిపోయినట్లుగా మారింది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న దళిత బంధు పథకం..  ఆ పార్టీకి గండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధును ప్రవేశపెట్టారని విపక్షాలు ఆరోపిస్తుండగా.. ఇప్పుడా హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులే ఆందోళనలు చేస్తుండటం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. దళిత బంధులో తమ పేర్లు లేవంటూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ దళితులు నిరసనలకు దిగారు.  దళిత బంధుపై రెండు రోజులుగా హుజురాబాద్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దళిత బంధును అర్హులకు ఇవ్వడం లేదంటూ మండిపడుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హుజురాబాద్‌లో దళితులు ధర్నాకు దిగారు. దళితులు చేపట్టిన రాస్తారోకోతో  వరంగల్- కరీంనగర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దళిత బంధు అందరికి ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో దళితుల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు.  హుజురాబాద్ ఆర్డీవో ఆఫీసు ఎదుట నర్సింగ పూర్ గ్రామ దళితుల ఆందోళన చేశారు. గ్రామంలో ఉన్న దళితులందరికీ ఒకేసారి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరికి మొదటి దఫాలో ఇస్తే మిగతా వారికి వస్తాయన్న గ్యారెంటీ లేదని నినాదాలు చేశారు.  పోలీసులతో దళితులు వాగ్వాదానికి దిగారు. దళితుల ఆందోళనతో టీఆర్ఎస్ నేతలు కలవరపడుతున్నారు. కరీంనగర్‌లో ముగ్గురు మంత్రులు సమావేశం నిర్వహించారు. సీఎం సభ, అర్హుల ఎంపికపై సమీక్ష నిర్వహించారు.  సీఎం కేసీఆర్ పర్యటనతో పాటు దళితుల ఆందోళనలపై చర్చించారు. మరోవైపు హుజూరాబాద్‌లో ధళిత బంధు తొలి లబ్దిదారులుగా 15 మందిని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఈనెల 16 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లి గ్రామం బహిరంగ సభ వేదికగా 15 మంది దళితులకు తెలంగాణ దళితబంధు పథకం చెక్కులను సీఎం కేసీఆర్ అందజేయనున్నారు. లబ్ధిదారుల ఎంపికపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. శనివారం రాత్రి వరకూ జాబితా ఖరారు చేయనున్నారు. జాబితాను  ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా కలెక్టర్ కర్ణన్ పంపనున్నారు. సీఎం ఆమోదంతో తొలి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 

ఆంధ్రా ప్రజల కొంప ముంచటానికే జగన్ లో ఇంత మార్పా?

జగన్ లో అకస్మాత్తుగా ఇంత మార్పు ఎందుకొచ్చినట్టు? ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా అయ్యగారు అమిత్ షా దగ్గర హాజరుపడే వైఎస్ జగన్.. తాజాగా అయ్యగారే ఏపీకి వస్తే ఆ రాచమర్యాదల జాడలేవీ కనిపించలేదే. ఏమైంది వీరికి... ఎక్కడ బెడిసికొట్టింది వీరి మధ్య. ఈ గ్యాప్ రావడానికి కారణమేంటి? ఎవరూ గుర్తించనంత గ్యాప్ అంటే లైట్ తీసుకోవచ్చు. కానీ... మీడియా సాక్షిగా అందరికీ తెలిసిపోయిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. దక్షిణకాశీగా పేరున్న శ్రీశైలానికి భార్యాసమేతంగా వస్తే... జగన్ అధికార లాంఛనాలతో కనీస స్వాగతాలు పలుకలేదెందుకని అటు ఆంధ్రాలోనే కాదు.. తెలంగాణలో సైతం ప్రజలంతా చెవులు కొరుక్కుంటున్నారు. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో ఈ విషయం మీద పెద్ద చర్చే నడుస్తోంది.  అమిత్ షా భార్యాసమేతంగా వ్యక్తిగత పూజాదికాల కోసమే వచ్చారనుకుందాం. అయితే జగన్ భార్య భారతిని వెంటబెట్టుకొని రాకపోయినా.. కనీసం సింగిల్ గా నైనా వచ్చి, ఓ శాలువా కప్పి.. శ్రీశైల మల్లన్న విగ్రహమో, తిరుపతి వెంకన్న ప్రసాదమో చేతిలో పెడితే కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ జెనరేట్ అయ్యి జగన్ మీద కేంద్రానికి కాస్త ప్రేమ పెరుగుతుంది కదా. రాష్ట్రంలో ఇప్పుడు రగులుతున్న జల రాజకీయాలు కాస్తయినా చల్లబడే ఆస్కారం ఉండేది కదా.. ఈ మాత్రం లాజిక్కయినా బ్రదర్ జగన్ కు తెలియకపోతే ఎలా అంటున్నారు ఏపీ రాజకీయ మేధావులు.  కృష్ణా, గోదావరి నదుల మేనేజ్ మెంట్ బోర్డు విషయంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యాక జగన్ కోరుకున్నట్టే కేంద్రం పని పూర్తి చేసిందన్న ఫీలర్స్ వెలువడ్డాయి. కానీ ఆ తరువాత జరిగిన బోర్డు అధికారుల సమావేశాల్లో... దాని జాబితాలో ఉన్న పలు ప్రాజెక్టులను తప్పించాలని, అప్పటిదాకా కేంద్రం అడిగిన సమాచారం ఇవ్వబోమని ఏపీ అధికారులు మొండికేశారు. దీంతో కేంద్రం వైఖరికి భిన్నంగా జగన్ వ్యవహార శైలి ఉందన్న విషయం కేంద్రంలోని పెద్దలకు అర్థమైందని, అదే వారి మధ్య పొరపొచ్చాలకు దారి తీసిందంటున్నారు. ఉమ్మడి బోర్డు ఏర్పాటును తొలుత స్వాగతించిన జగన్.. ఆ వెంటనే ఇలా తొండాట ఎందుకు ఆడుతున్నారో ఢిల్లీ బాసులకు అర్థం కాలేదంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కుమ్మక్కయ్యే జగన్ కేంద్రంతో దొంగాట డ్రామాలాడుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జగన్ తాజా నిర్వాకం ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  అమిత్ షా పర్యటనను రాష్ట్రంలోని జల సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకొని ఉండాల్సిందని, వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి అనవసరంగా ఓ గోల్డెన్ అపార్చునిటీ మిస్సయ్యారంటున్నారు. అక్కడ ఢిల్లీలో అధికారికంగా కలిసి విజ్ఞాపనా పత్రం ఇచ్చినదానికీ.. అలాగే ఇక్కడికి దైవ దర్శనార్థం వచ్చినప్పుడు కలిసి విన్నవించుకునే సందర్భానికి చాలా వ్యత్యాసం ఉంటుందని... అధికారిక హోదాలో కాలేని ఎన్నో పనులు.. దైవసన్నిధిలో సాఫీగా పూర్తవుతాయంటున్నారు. అందుకే ఈ చాన్స్ ఉపయోగించుకొని.. కేజీఆర్ఎంబీ ఎలాంటి సవరణలు చేపట్టాలో సూచించి ఉన్నట్టయితే అది తప్పకుండా మేలు చేసి ఉండేదంటున్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని సవాల్ చేస్తున్న కేసీఆర్ అడుగుజాడల్లోనే జగన్ కూడా ప్రయాణిస్తున్నట్టు అర్థం చేసుకోవాల్సి వస్తోందంటున్నారు. అదే గనక నిజమైతే... జగన్ వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి రాష్ట్ర జల ప్రయోజనాలు గాలికొదిలేసినట్లేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

బీజేపీకి 'విష్ణు' నామాలు.. విజ‌య‌సాయి డైరెక్ష‌న్‌లో డ్రామాలు!

కోవ‌ర్టులు అన్నిపార్టీల్లోనూ ఉంటారు. కుట్ర‌లు, కుతంత్రాలు చేసే కుహానా లీడ‌ర్లకు సిద్ధాంత పార్టీగా చెప్పుకునే బీజేపీ సైతం అందుకు అతీతం కాదు. ఏపీ బీజేపీ మొత్తాన్ని జ‌ల్లెడ ప‌డితే.. అంద‌రికంటే నెంబ‌ర్‌వ‌న్ ఫ్రాడ్‌గా తేలే లీడ‌ర్ ఒక‌రున్నారు. కమలంలో ఆ ఏ1 కోవర్డు లీడరు విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి అని అంటారు. ఆయ‌న అధికార‌పార్టీలో ఉన్న ఏ2 లీడ‌ర్ డైరెక్ష‌న్‌లో ప‌నిచేస్తార‌ని చెబుతారు. అదేమి రాజ‌కీయ‌మో కానీ, ఏపీ బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉండి.. ప్ర‌భుత్వం మీద కంటే మ‌రో ప్ర‌తిప‌క్ష‌మైన టీడీపీ మీదే ఎక్కువ విమ‌ర్శ‌లు చేస్తుంటారు. రెడ్డిగా రెడ్ల పార్టీకి ఫుల్‌ స‌పోర్ట్ చేస్తుంటార‌నే విమ‌ర్శ ఉంది. క‌మ్మ నాయ‌కులే ఆయ‌న మెయిన్ టార్గెట్ అనే ఆరోప‌ణ కూడా ఉంది. అందుకే కాబోలు, వైసీపీ నాయ‌కులు సైతం విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిని ప‌ళ్లెత్తి మాట అన‌రు. ఈయ‌న మాత్రం క‌మ‌లం పువ్వుల‌తో కొట్టిన‌ట్టు.. అధికార పార్టీపై సుతిమెత్త‌ని విమ‌ర్శ‌ల‌తో దాడి చేసిన‌ట్టు భ‌లే న‌టిస్తారు. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆశీస్సులు ఈ కాషాయ కండువా క‌ప్పుకున్న నీలి మ‌నిషికి ఫుల్లుగా ఉన్నాయ‌ని అంటారు. ఈ వీర భ‌క్త‌ విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి గుండెలు చీల్చితే.. న‌రేంద్రుడు కాకుండా జ‌గ‌న్మోహ‌నుడు క‌నిపిస్తాడ‌ని ఏపీలో సెటైర్లు పేలుతుంటాయి.  ఇక గురివింద గింజ‌లా ఆయ‌న కింద ఉన్న న‌లుపునంతా కాషాయ వ‌ర్ణంతో క‌ప్పేసుకొని.. మీడియా వేదిక‌ల‌పై పేద్ద నోరేసుకొని ప‌డుతూ.. త‌న‌ పాపులారిటీ మాత్రం బాగా పెంచేసుకుంటారు. రాజ‌ధానిగా అమ‌రావ‌తికి బీజేపీ పార్టీ ప‌రంగా మ‌ద్ద‌తు పలికితే.. ఈయ‌న మాత్రం వ్య‌క్త‌గ‌తంతా అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని, నాయ‌కుల‌ను అవ‌హేళ‌న చేస్తుంటారు. క‌డుపు మండిన జేఏసీ నాయ‌కుడు.. ఓ టీవీ ఛానెల్ డిస్క‌ష‌న్‌లో చెప్పుతో కొట్టినా.. విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి డ‌బుల్‌గేమ్ పాలిటిక్స్‌లో ఏమాత్రం మార్పురాక‌పోవ‌డం సిగ్గు..సిగ్గు... ఇలాంటి కుట్ర‌లు, కుతంత్రాల‌తోనే విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి బీజేవైఎమ్ అధ్య‌క్షుడి నుంచి బీజేపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ స్థాయి వ‌ర‌కూ ఎదిగార‌ని అంటారు. ఇప్పుడు ఏకంగా బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌విపైనే క‌న్నేసార‌ని అనుమానిస్తున్నారు. ప్రొద్దుటూరు టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఎపిసోడ్‌లో అధ్య‌క్షుడు సోము వీర్రాజును ట్రాప్‌లో ఇరికించి.. ఆయ‌న ఇమేజ్‌ను డ్యామేజ్ చేసి.. సోము ప‌ద‌వికే ఎస‌రు వ‌చ్చేలా చేశారు. వీర్రాజును బ‌ద్నామ్ చేసి.. ఆయ‌న సీటును కొట్టేయాల‌నేది ఈయన స్కెచ్‌లా క‌న‌బ‌డుతోందని బీజేపీ వ‌ర్గాలే చ‌ర్చించుకుంటున్నాయి.   టిప్పుసుల్తాన్ విగ్ర‌హ రాజ‌కీయంపై పొద్దుటూరులో హైడ్రామా న‌డిచింది. విగ్ర‌హం ఏర్పాటుకు క‌డ‌ప జిల్లా క‌లెక్ట‌ర్ అనుమ‌తి నిరాక‌రిస్తూ.. జులై 23న ఉత్త‌ర్వులు ఇచ్చారు. కామెడీగా.. విగ్ర‌హ ఏర్పాటు వ‌ద్దంటూ జులై 27న సోము వీర్రాజు ఆధ్వ‌ర్యంలో ప్రొద్దుటూరులో బీజేపీ ధ‌ర్నా చేసింది. అప్పటికి నాలుగు రోజుల ముందే క‌లెక్ట‌ర్ ఉత్త‌ర్వులు ఇచ్చిన విష‌యాన్ని విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి కావాల‌నే మ‌రుగున పెట్టి.. పార్టీ అధ్య‌క్షులు సోము వీర్రాజును ఉసిగొల్పి.. ఆయ‌న‌తో ధర్నా చేయించి.. పార్టీ ప‌రువు తీయ‌డంతో పాటు అధ్య‌క్షులు వీర్రాజునూ కామెడీ పీస్‌గా మార్చేశార‌ని.. అదంతా విజ‌య‌సాయి డైరెక్ష‌న్‌లో విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి ఆడిన పొలిటిక‌ల్ డ్రామా అనేది బీజేపీ వ‌ర్గాల అనుమానం. త‌మ వాడైన విష్ణును ఏపీ బీజేపీ అధ్య‌క్ష పీఠంపై కూర్చోబెట్టాల‌నేది విజ‌య‌సాయి స్కెచ్‌. సోము వీర్రాజు సైతం త‌మ వాడేనైనా ఆయ‌న రెడ్డి కాదుగా. అందుకే, వీర్రాజును త‌ప్పించి విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిని క‌మ‌ల ద‌ళ‌ప‌తి చేసి.. టీడీపీపై దండెత్తేలా చేయాల‌నేది వైసీపీ పెద్ద‌ల స్కెచ్‌. అందుకే, విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిని రెండేళ్లుగా ప‌రోక్షంగా ప్ర‌మోట్ చేస్తూ వ‌స్తోంది అధికార పార్టీ. బీజేపీ ఇంట‌ర్న‌ల్ మేట‌ర్‌ను.. నీలి మీడియాకు లీక్ చేసేది కూడా విష్ణునే అంటారు.  ఇక విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి విష‌య ప‌రిజ్ఞానం, మేధావిత‌నం గురించి ఎంత త‌క్కువ చెబితే అంత మంచిది. ఆయ‌న చేసే ట్వీట్లలో కొన్ని మాస్ట‌ర్ పీస్‌లు ఉంటాయి. బిర బిర కృష్ణమ్మ శ్రీశైలం నుండి సాగుతు గోదావరిలో క‌ల‌వ‌డం.. గోమాత సంర‌క్ష‌ణ అంటూ ఎద్దు ఫోటో పెట్ట‌డం.. మ‌హిళ‌ల‌పై అస‌భ్య పోస్టులు.. "హేమమాలిన చర్య" లాంటి కామెంట్లు.. ఇలా తిక్క‌తిక్క‌ ట్వీట్ల‌తో త‌న ప‌ర‌మానంద‌య్య శిష్య‌రికాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌లుమార్లు  ఘ‌నంగా చాటుకున్నారు. లంక దిన‌క‌ర్ లాంటి మేధావి నాలెడ్జ్‌లో చిటికెడంత ప‌రిజ్ఞానం కూడా లేని విష్ణువ‌ర్థ‌న్‌.. కేవ‌లం రెడ్డి కార్డు మీదే బాగా నెట్టుకొస్తున్నారనే విమ‌ర్శ‌ ఉంది. టీడీపీ, క‌మ్మ నాయ‌కులే టార్గెట్‌గా.. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సూచ‌న‌ల‌తో చెల‌రేగిపోతున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  ఇక మ‌నోడి క్రైమ్ హిస్ట‌రీపైనా ఏపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. అనంతపురంలో మహిళ మిస్సింగ్ కేసు.. కల్కి ఆశ్రమంలో 30 కోట్ల దందా.. బెంగుళూరులో మెడికల్ కాలేజీ.. బినామీల పేరుతో నర్సింగ్ కాలేజీలు.. స్పా సెంటర్ల లీలలు.. అబ్బో విష్ణులీల‌ల‌పై అనేక ఆరోపణలు.. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స‌హ‌కారంతో కోట్ల రూపాయ‌ల అక్ర‌మ సంప‌ద పోగేశార‌నే విమ‌ర్శ‌లు.. ఉన్నాయి. ఇప్పుడు అదే విజ‌య‌సాయి మ‌ద్ద‌తుతో ఏకంగా ఏపీ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి కొట్టేయాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ని తెలుస్తోంది. త‌న ఎదుగుద‌ల‌కు అడ్డుగా ఉన్న సోము వీర్రాజును అడ్డు తొల‌గించుకునేందుకే.. ప్రొద్దుటూరు టిప్పు సుల్తాన్ విగ్ర‌హంపై అవుట్‌-డేటెడ్ ధ‌ర్నా చేయించి.. వీర్రాజు వెర్రివాడిని చేశార‌ని అంటున్నారు. ప్ర‌తిప‌క్షంలో అధికార‌ప‌క్ష నేత‌గా ఉన్న విష్ణు.. బీజేపీకి పంగ‌నామాలు పెడుతూ.. వైసీపీపై ఉత్తుత్తి పోరాటం చేస్తూ.. టీడీపీ-క‌మ్మ శ్రేణుల‌పై మాట‌ల‌తో క‌త్తియుద్ధం చేస్తుంటార‌ని అంటారు. విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి వ‌ల్ల బీజేపీకి ఎలాంటి అద‌న‌పు ప్ర‌యోజ‌నం లేక‌పోగా.. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కు, ప‌రోక్షంగా వైసీపీకి ఫుల్ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతున్నాయ‌ని చెబుతారు. క‌మ‌లం పూదోట‌లో క‌లుపుమొక్క విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి అనేది క‌మ‌ల‌నాథుల‌ మాట‌.

న‌దిలో 132 లారీలు.. ముంచెత్తిన‌ కృష్ణా వ‌ర‌ద‌.. డ్రైవ‌ర్లు విల‌విల‌..

అది కృష్ణాన‌ది. ఎప్ప‌టిలానే ఇసుక త‌వ్వ‌కాలు జరుగుతున్నాయి. లారీ వెనుక లారీ.. అలా వంద‌లాది లారీలు.. న‌ది తీరంలో వ‌రుస క‌డుతున్నాయి. ఎప్పుడూ జ‌రిగేదే ఇది. కానీ, ఈసారి రొటీన్‌కు భిన్నంగా ప‌రిస్థితులు మారిపోయాయి. ఒక్క‌సారిగా కృష్ణ‌మ్మ పొంగిపొర్లింది. బిర‌బిరా వ‌ర‌ద పోటెత్తింది. చూస్తుండ‌గానే న‌ది నిండుగా మారిపోయింది. అంతే.. లారీల చుట్టూ నీళ్లు. నీళ్ల‌లో లారీలు. ఈ అనూహ్య ప‌రిణామం ఇప్పుడు ప్రాణాల‌తో చెల‌గాటంగా ప‌రిణ‌మించింది. న‌దిలో నుంచి బ‌య‌ట‌ప‌డే దారిలేక‌, న‌దిలో ఉండ‌లేక‌.. లారీ డ్రైవ‌ర్లు విల‌విల్లాడుతున్నారు. ఇంత‌కీ అక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉందంటే..... కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు ద‌గ్గ‌ర‌ కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. నదిలో ఇసుక కోసం వెళ్లిన వందకుపైగా లారీలు వరదలో చిక్కుకున్నాయి. అకస్మాత్తు వరదతో రహదారి కూడా కొంతమేర దెబ్బతింది. దీంతో లారీలన్నీ తిరిగి వెనక్కి రాలేని పరిస్థితిలో అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 132 లారీలు వరదలో ఇరుక్కుపోయినట్టు స‌మాచారం. ఒడ్డుకు ఎలా చేరాలో తెలీక‌ లారీ డ్రైవర్లు, యజమానులు ఆందోళన చెందుతున్నారు.   పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలను పడవల్లో ఒడ్డుకు చేర్చుతున్నారు. న‌దీ ఉధృతి త‌గ్గితేనే.. వాహ‌నాలు బ‌య‌ట‌కు తీసుకురాగ‌ల‌మ‌ని అంటున్నారు అధికారులు. 

సీఈసీ వెబ్ సైట్ హ్యాక్.. కోటి ఫేక్ ఐడీ కార్డ్స్! ఈవీఎమ్ లు సేఫేనా? 

దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. బ్యాంకింగ్ రంగాన్ని షేక్ చేస్తున్నారు కేటుగాళ్లు, సైబల్ ఛీటర్ల వలలో చిక్కుకుని జనాలు విలవిలలాడుతున్నారు. తాజాగా సైబర్ హ్యాకర్ల మరింతగా రెచ్చిపోయారు. ఏకంగా  భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ను హ్యాక్ చేశారు. హ్యాకర్లు పదివేలకు పైగా నకిలీ ఓటర్ ఐడి కార్డులను సృష్టించారని తెలుస్తోంది. ఈ కేసులో మొరెనాకు చెందిన నలుగురు యువకులను మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ పోలీసులకు గురువారం 24 ఏళ్ల విపుల్ సైనీ.. వందలాది నకిలీ ఓటర్ ఐడీలను తయారు చేస్తు పట్టబడ్డారు. సైనీ విచారణలో అసలు సంగతి బయట పడింది.  అర్మాన్ మాలిక్ ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్‌లోని హర్దా నివాసి సైనీ పనిచేస్తున్నాడని.. 3 నెలల్లో 10,000 కంటే ఎక్కువ నకిలీ ఓటర్ ఐడీలను సృష్టించాడని తేలింది. మొరెనాలోని అంబాలో నివసించే 18 ఏళ్ల హరియోమ్ ప్రమేయం గురించి UP పోలీసులు MP పోలీసులకు సమాచారం అందించారు. హరియోమ్..  సైనీతో నేరుగా సంప్రదింపులు జరిపారని.. దానిని ఇతరులకు విక్రయించడానికి ID ని ఉంచారని తెలుస్తోంది. శుక్రవారం హరియోమ్‌తో సంబంధం ఉన్న 17 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక వ్యక్తి తన వద్ద కనీసం కోటి నిజమైన .. నకిలీ ఓటర్ IDలు ఉన్నాయని పోలీసులకు తెలిపారు.  సిమ్ కార్డులు కొనడానికి, బ్యాంక్ ఖాతాలు తెరవడానికి ఆన్‌లైన్ మోసానికి ప్రధానంగా నకిలీ ఐడీలను ఉపయోగించే మోసగాళ్లకు డేటాను నిందితులు విక్రయించేవారు. పోలీసుల ప్రకారం ఈ టీనేజర్స్ వారు హరియోమ్ వద్ద పని చేస్తున్నట్లు తెలిపారు. వారు ఎంత డబ్బు సంపాదించారో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇతర ముఠా సభ్యుల గురించి మరింత తెలుసుకోవడానికి ఎంపీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులంతా పేద కుటుంబాలకు చెందినవారే. ఈ కేసులో ప్రధాన సూత్రదారిగా  అర్మాన్ మాలిక్ ను గుర్తించారు పోలీసులు. నకిలీ ఓటరు ఐడి తయారు చేయడం గురించి మాలిక్ తనకు తెలియజేసేవారని సైనీ పోలీసులకు చెప్పాడు. అతను ఓటర్ ఐడి కోసం 100 నుండి 200 రూపాయలు తీసుకున్నట్లుగా వెల్లడించారు. పని ఆధారంగా వారి బ్యాంక్ ఖాతాలో డబ్బు వచ్చేవాని నింధితులు తెలిపారు.  ఫేక్ ఓటర్ కార్డులు, వెబ్ సైట్ హ్యాకింగ్ పై ఎన్నికల సంఘం ప్రతినిధులు స్పందించారు. అసిస్టెంట్ ఎలక్టోరల్ రోల్ ఆఫీసర్లు (ఇరోస్) పౌరులకు సేవలను అందిస్తారని.. ఓటర్ ఐడి కార్డుల ముద్రణ సకాలంలో పంపిణీకి బాధ్యత వహిస్తారని చెప్పారు. AERO కార్యాలయం డేటా ఎంట్రీ ఆపరేటర్ తన ఐడి , పాస్‌వర్డ్‌ని సహరన్‌పూర్‌లోని నకుడ్‌లోని ఒక ప్రైవేట్ అనధికార సర్వీస్ ప్రొవైడర్‌కు చట్టవిరుద్ధంగా ఇచ్చారని తద్వారా అతను కొన్ని ఓటర్ కార్డులను ముద్రించగలడని ప్రతినిధి వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ప్రతినిధి తెలిపారు. ఎన్నికల కమిషన్ డేటాబేస్ పూర్తిగా సురక్షితంగా ఉందని చెప్పారు.  ఎన్నికల కమిషన్ డేటా సురక్షితంగా ఉందని అధికారులు చెబుతున్నా.. వైబ్ సైట్ హ్యాక్ కావడంపై సంచనంగా మారింది. సీఈసీ కార్యకలాపాలన్ని రహస్యంగా జరుగుతుంటాయి. తాజా ఘటనపై సీఈసీకి భద్రత లేదని తెలుస్తోంది. మరోవైపు పోలింగ్ కేసం సీఈసీ ఉపయోగిస్తున్న ఈవీఎమ్ ల భద్రపైనా మళ్లీ చర్చ మొదలైంది. ఈవీఎమ్ లను ట్యాంపరింగ్ చేయవచ్చనే ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. 2019 ఎన్నికల తర్వాత కూడా ఈ ఆరోపణలు వచ్చాయి. కొన్ని పార్టీలు ఈవీఎమ్ ల ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ట్యాంపరింగ్ కు ఎలాంటి అవకాశం లేదని సీఈసీ చెబుతున్నా.. వెబ్ సైట్ హ్యాక్ కావడం ఇప్పుడు చర్చగా మారింది. వెబ్ సైట్ కే పూర్తి రక్షణ లేనప్పుడు ఈవీఎమ్ లు ట్యాంపరింగ్ కావలని ఎలా చెప్పగలమనే ప్రశ్న వస్తోంది. 

చలానాల కుంభకోణంలో వైసీపీ పెద్దల హస్తం?

నకిలీ చలానాల కుంభకోణం ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది.  స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌లో జరిగిన అక్రమాలు ప్రభుత్వ యంత్రాంగాన్ని కుదిపేస్తున్నాయి. చలానా మార్ఫింగ్ తో దాదాపు 10 కోట్ల రూపాయల అక్రమాలకు  పాల్పడ్డారని తెలుస్తోంది. చలనాల కుంభకోణంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. గుంటూరు, కర్నూలు, కడప జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆడిట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలలో సబ్ రిజిస్ట్రార్ తో పాటు జూనియర్ అసిస్టెంట్ పై అధికారులు వేటు వేశారు. కడపలో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పటికే నకిలీ చలానాలకు సంబంధించి మొత్తం 5.5 కోట్ల రూపాయలు తేడా వచ్చినట్టు గుర్తించామని ఉన్నతాధికారులు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 17 ప్రాంతాల్లో ఇలాంటి అవకతవకలు జరిగినట్టు నిర్ధారించారు. కృష్ణా, కడప జిల్లాల్లో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేరుకున్నాయి.  నకిలీ చలానాల కుంభకోణంలో రాజకీయ నేతల హస్తం ఉందనే అనుమానాలు వస్తున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండ లేకుండా ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగే అవకాశాలు లేవని అంటున్నారు. ప్రజాప్రతినిధులకు వాటాలు ఇచ్చే కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా కుంభకోణానికి తెర తీశారనే ఆరోపణలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి చలానాల కుంభకోణంలో వైసీపీ పెద్దల హస్తం ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ఆరోపించారు. మంత్రి నుంచి అనేకమంది వైసీపీ పెద్దలకు కోట్ల రూపాయలు వాటాలు వెళ్ళాయన్నారు. చాలనాల కుంభకోణంలో మంత్రి రాజీనామా చేసి దర్యాప్తు చేస్తే కొంత అయినా నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారులపై విచారణ చేసి చేతులు దులుపుకోవాలను కోవటం కుట్రలో భాగమే అని అన్నారు. ఇది గతంలో జరిగిన నకిలీ స్టాంపుల స్కాం తెల్గిని మించి ఏపీలో వైసీపీ నాయకులు దోచేశారని వ్యాఖ్యానించారు. వైసీపీకి చిత్త శుద్ధి ఉంటే మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణ చేస్తే నిజాలు నిగ్గు తెలుతాయని బోండా ఉమా అన్నారు.  మరోవైపు నకిలీ చలానాల అంశంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో ఆయన చర్చించారు. సొమ్ము రికవరీపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సమాధానంగా ఇప్పటికే రూ. 40 లక్షలు రికవరీ చేసినట్టు సీఎంకు అధికారులు వివరించారు. రిజిస్ట్రేషన్ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ కుంభకోణంపై పూర్తి  స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

గాలి కేసులో అలా.. జగన్ కేసులో ఇలా! సీబీఐ ఎందుకిలా? 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న రఘురామ.. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆయన వేసిన పిటిషన్ పై వాదనలు విన్న సీబీఐ కోర్టు.. ఆగస్టు 25న తీర్పు ఇవ్వబోతోంది. జగన్ బెయిల్ రద్దు కేసులో ఏం జరగబోతుందన్న టెన్షన్ వైసీపీలో నెలకొంది. అంతేకాదు ఎంపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కూడా మరో పిటిషన్ వేశారు ఎంపీ రఘురామ రాజు. ఈ పిటిషన్ పై శుక్రవారం కోర్టులో విచారణ జరిగింది. విజయసాయికి కౌంటర్ కు గడవు కావాలని కోరవడంతో విచారణను ఆనెల 16కు వాయిదా వేసింది సీబీఐ కోర్టు.  జగన్, విజయసాయి రెడ్డి కేసుల సమయంలోనే గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ కేసులోనూ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జగన్, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. సీబీఐ తీరుపై కొన్ని అనుమానాలకు కారణమవుతున్నాయి. మైనింగ్ అక్ర‌మాల కేసు వెంటాడుతున్న గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కేసులో సీబీఐ వాదనకు... జగన్ , విజయసాయి కేసుల్లో  సీబీఐ వినిపిస్తున్న వాదనకు పొంతన లేకుండా ఉందనే చర్చ  రాజకీయ వర్గాల్లో సాగుతోంది. వీరిద్ద‌రి విష‌యంలో సీబీఐ కాస్త భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అభిప్రాయ ప‌డుతున్నారు.  విజ‌య‌సాయి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని ఈ నెల 7వ తేదీన ర‌ఘురామ పిటిష‌న్ వేయ‌గా.. ఆ రోజునే కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని విజ‌యసాయిని, సీబీఐని ఆదేశిస్తూ.. ఇందుకోసం మూడు రోజుల గ‌డువు విధించింది. కేసు విచార‌ణ‌ ఈ నెల 10కి వాయిదావేసింది. ఆ రోజు విచార‌ణ సంద‌ర్భంగా.. కౌంట‌ర్ దాఖ‌లుకు మ‌రికొంత స‌మ‌యం కావాల‌ని సీబీఐ కోరింది. దీంతో.. మ‌రో మూడు రోజుల గ‌డువు ఇస్తూ.. కేసును 13వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. శుక్రవారం జరిగిన విచార‌ణ‌లో సీబీఐ త‌నదైన వాద‌న ఏమీ వినిపించ‌లేదు. కోర్టు మెరిట్ ప్ర‌కార‌మే నిర్ణ‌యం తీసుకోవాల‌ని అఫిడ విట్ లో కోరింది. దాని ప్ర‌కార‌మే బెయిల్ ర‌ద్దు చేయాలా? లేదా? అనే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. సీబీఐ అఫిడ విట్ స్వీకరించిన కోర్టు.. విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ విచార‌ణ‌లోనూ సీబీఐ ఇదేవిధ‌మైన అభిప్రాయం వ్య‌క్తం చేసింది. కోర్టు మెరిట్ ప్రకార‌మే బెయిల్ ర‌ద్దు చేయాలా? వ‌ద్దా? అనే నిర్ణ‌యం తీసుకోవాల‌ని తెలిపింది.  అయితే గాలి జ‌నార్ద‌న్ రెడ్డి విష‌యంలో సీబీఐ ఇందుకు పూర్తి భిన్నంగా వ్య‌వ‌రిస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆయ‌న‌కు బెయిల్ ఇచ్చిన‌ప్ప‌టికీ.. అందులో ప‌లు ష‌ర‌తులు ఉన్నాయి. అందులో బ‌ళ్లారికి వెళ్ల‌కూడ‌ద‌నే రూల్ కూడా ఉంది. ఒక‌వేళ త‌ప్ప‌నిస‌రిగా వెళ్లాల్సి వ‌స్తే.. కోర్టు అనుమ‌తి తీసుకుని మాత్ర‌మే వెళ్లాలి. ఈ విష‌యంలో త‌న‌కు స‌డ‌లింపు ఇవ్వాల‌ని ప‌లుమార్లు ఆయ‌న కోర్టును ఆశ్ర‌యించారు. కానీ.. ఫ‌లితం రాలేదు. ఇప్పుడు మ‌రోసారి కూడా సుప్రీం కోర్టులో ఈ మేర‌కు ప్ర‌య‌త్నం చేయ‌బోతున్నారు. బెయిల్ ష‌ర‌తుల‌ను స‌డ‌లించాల‌ని కోరేందుకు చూస్తున్నారు. అయితే.. సీబీఐ మాత్రం స‌సేమిరా అని వాదిస్తోంది. ఆయ‌న బ‌ళ్లారి వెళ్ల‌డం జ‌రిగితే.. సాక్ష్యుల‌ను ప్ర‌భావితం చేస్తార‌ని సీబీఐ చెబుతోంది. అందువ‌ల్ల ఆయ‌న బెయిల్ ష‌ర‌తుల‌ను స‌డ‌లించొద్ద‌ని బ‌లంగా కోరుతోంది సీబీఐ. విజ‌య‌సాయి రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని వేసిన‌ పిటిష‌న్లో.. న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు కోర్టు దృష్టికి ప‌లు విష‌యాలు తీసుకెళ్లారు. ఆయ‌న బెయిల్ ఎందుకు ర‌ద్దు చేయాలో అందులో వివ‌రించారు. ఎంపీ విజ‌యసాయిరెడ్డి త‌న అధికారాన్ని ఉప‌యోగించి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా సాక్షుల‌ను ప్ర‌భావితం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని పేర్కొన్నారు. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసు తీర్పు వెలువ‌డ‌నున్న‌ నేప‌థ్యంలో.. ఏ2గా ఉన్న విజ‌య‌సాయి విదేశాల‌కు పారిపోయే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. అందువ‌ల్ల‌ ఆయ‌న బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరారు. స‌రిగ్గా.. ఈ విష‌యం ద‌గ్గ‌ర‌నే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి, గాలి జ‌నార్ధ‌న్ రెడ్డికి మ‌ధ్య పోలిక తెస్తున్నారు కొంద‌రు. జ‌గ‌న్‌, విజ‌య‌సాయి విష‌యంలో ఒక‌లా వ్య‌వ‌హ‌రిస్తున్న సీబీఐ.. మ‌రి, గాలి విష‌యంలో మాత్రం మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తోందా? అని చ‌ర్చించుకుంటున్నారు.  

లీటర్ పెట్రోల్ పై రూ. 3 తగ్గించిన స్టాలిన్.. ప్రజలను బాదుడే జగనన్న స్టైల్? 

దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజురోజుకు ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ రేట్ సెంచరీ ఎప్పుడో దాటేసింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ రేట్ 110 రూపాయలకు చేరువలో ఉంది. పెట్రోల్ తో పోటీ పడుతూ డీజిల్ రేటు కూడా దూసుకుపోతోంది. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ మార్కుకు చేరింది. మరికొన్ని ప్రాంతాల్లో వందకు దరిదాపులో ఉంది లీటర్ డీజిల్ ధర. గత ఏడాది మార్చి నుంచి మే మధ్య కాలంలో పెట్రోల్ పై రూ.13 డీజిల్ పై రూ.16 ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచింది. పెట్రోల్, డీజిల్ రేట్లపై ప్రతి రాష్ట్రానికి వ్యాట్ శాతంలో మార్పు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఆయిల్ ధరలు మరింత భగ్గుమంటున్నాయి. జగన్ రెడ్డి ప్రభుత్వం ట్యాక్సులు భారీగా పెంచడంతో దక్షిణాదిలో ఏపీలోనే రేట్లు ఎక్కువగా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలతో జనాలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వాలు మాత్రం ఖజనా నింపుకునేందుకు భారం మోపతూనే ఉన్నాయి. కేంద్ర సర్కార్ వల్లే ధరలు పెరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం... రాష్ట్రాలే పన్నులు తగ్గించుకోవాలని కేంద్రం చెబుతూ జనాల నడ్డి విరుస్తున్నాయి. ఏపీ సర్కార్ పెంచిన ట్యాక్సులు తగ్గించి ప్రజలపై భారం తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదు. అంతేకాదు పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు రాష్ట్రాల చేతుల్లో లేదంటూ కవరింగ్ చేసుకుంటోంది. అయితే తాజాగా తమిళనాడు సర్కార్ మాత్రం తమ ప్రజలపై భారం పడకుండా సంచలన నిర్ణయం తీసుకుంది. పెరిగిన పెట్రోల్ ధరలను తగ్గిస్తూ తమిళనాడు సీఎం స్టాలిల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ ధర లీటరుకు రూ.3 తగ్గిస్తూ  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయించారు.  తమిళనాడు ఆర్థిక శాఖా మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ఆ విషయాన్ని సభలో ప్రకటించారు. పెట్రోల్ పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకంలో రూ.3 తగ్గించామని చెప్పారు. ఇప్పటిదాకా లీటర్ పెట్రోల్ పై రూ.32.90 ఎక్సైజ్ సుంకం విధిస్తుండగా తాజా ప్రకటనతో అది రూ.29.90కు తగ్గింది. స్టాలిన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఖజానాకు ఏటా రూ.1160 కోట్లు నష్టం వాటిల్లనుంది. అయితే సామాన్యులకు మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.49 లీటర్ డీజిల్ ధర రూ.94.39గా ఉంది. స్టాలిన్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలు కూడా పెట్రోల్ రేట్లు తగ్గించాలని నెటిజన్లు కోరుతున్నారు. స్టాలిన్ నిర్ణయంతో ఏపీలోని జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.ధరల తగ్గింపు రాష్ట్రాల పరిధిలో లేదంటున్న ప్రభుత్వం.. స్ఠాలిన్ నిర్ణయంపై ఏం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికేనా ప్రజలపై బాదుడు ఆపండి జగన్ రెడ్డి గారు అంటూ పోస్టులు పెడుతున్నారు.   

రేవంత్‌-సంజ‌య్‌.. కేసీఆర్‌తో సంగ్రామంలో గెలిచేదెవ‌రు?

తెలంగాణ‌లో కేసీఆరే అంద‌రికీ రాజ‌కీయ‌ విల‌న్‌. మ‌రి, హీరో ఎవ‌రు? విల‌న్‌తో పోరాడి గెలిచేదెవ‌రు? ఈ మ‌ల్టీస్టార‌ర్ పొలిటిక‌ల్ మూవీ క్లైమాక్స్ ఎలా ఉండ‌బోతోంది? హీరోలు, విల‌న్ ఉన్న ఈ నాట‌కంలో ఎవ‌రి పాత్ర ఏంటి? చాలా ఆస‌క్తిగా సాగుతోంది తెలంగాణ సంగ్రామం. కేసీఆర్, రేవంత్‌రెడ్డి, బండి సంజ‌య్‌, ఈట‌ల రాజేంద‌ర్‌, వైఎస్ ష‌ర్మిల‌, ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌.. ఇలా అంద‌రూ కీల‌క పాత్ర‌దారులే. పోరుకు అనేక మంది ఉన్నా.. పోరాడి నిలిచేదెవ‌ర‌నేదే ఇంట్రెస్టింగ్ పాయింట్‌.   పీసీసీ చీఫ్ ప‌ద‌వితో రేవంత్‌రెడ్డి రెచ్చిపోతున్నారు. ధ‌ర్నాల‌తో ద‌డ‌ద‌డ‌లాడిస్తున్నారు. ద‌ళిత‌-గిరిజ‌న దండోరాతో కేసీఆర్ ద‌ళిత బంధు ఎత్తుగ‌డ‌కు విరుగుడు మంత్రం పారిస్తున్నారు. వ‌రుస‌బెట్టి భారీ బ‌హిరంగ స‌భ‌ల‌తో బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగుతున్నారు రేవంత్‌రెడ్డి. చేష్ట‌లుడిగి, స్త‌బ్దుగా మారిన కాంగ్రెస్‌లో పున‌రుత్తేజం నింపుతున్నారు. రెండు నెల‌లుగా తెలంగాణ‌లో రేవంత్‌రెడ్డి పేరు డైన‌మైట్‌లా పేలుతోంది. రేవంత్ దూకుడుతో వేటాడే పులిలా కాస్త వెన‌క్కిత‌గ్గిన బీజేపీ.. ఇప్పుడు పంజా విసిరి దాడి చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. బీజేపీ ర‌థ‌సార‌ధి బండి టాప్ గేర్‌లో దూసుకొస్తున్నారు. ప్ర‌జా సంగ్రామ యాత్ర‌తో తెలంగాణ‌ను చుట్టేయ‌నున్నారు. బీజేపీ బండికి ఫ‌స్ట్ టార్గెట్ హుజురాబాద్‌.. మెయిన్ టార్గెట్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌.  ఈసారి జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌లు బీజేపీకి అత్యంత కీల‌కం. ఇన్నాళ్లూ టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం తామేన‌నే ధీమాగా ఉన్న క‌మ‌ల‌నాథుల‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రూపంలో గ‌ట్టి స‌వాల్ ఎదురైంది. స్మూత్‌గా సాగుతుంద‌నుకున్న బండికి.. గ‌ట్టి హార్డిల్ అడ్డు వ‌చ్చింది. అందుకే, కాషాయ‌ద‌ళం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. హుజురాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్‌ను గెలిపించుకొని.. తెలంగాణ‌లో కేసీఆర్‌ను దెబ్బ కొట్ట‌గ‌ల మొన‌గాళ్లం తామేన‌నే మెసేజ్ పంపేలా పావులు క‌దుపుతోంది. అందుకే, హుజురాబాద్ ఎన్నిక‌ల నాటికి బీజేపీ హ‌వా బ‌లంగా వీచేలా.. పాద‌యాత్ర‌గా బ‌య‌లిదేరి వ‌స్తున్నారు క‌మ‌ల ద‌ళ‌ప‌తి. బ్రేకులు లేని బీజేపీ బండి.. ప్ర‌జా సంగ్రామ యాత్ర‌గా ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తోంది.  ఇటు రేవంత్‌రెడ్డి దూకుడు.. అటు బండి జోరు.. ఇద్ద‌రు పోటుగాళ్ల సంగ్రామం.. కేసీఆర్‌ను దెబ్బ కొడుతుందా? లేక‌, ప్ర‌భుత్వ‌ వ్య‌తిరేక‌త చీలిపోయి దొర‌కే క‌లిసొస్తుందా? ఏమో...   

రేవంత్ రెండో దండోరా వేదిక చేంజ్.. కోమటిరెడ్డి భయమే కారణమా? 

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దూసుకుపోతున్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. వరుస కార్యక్రమాలతో కేడర్ లో జోష్ నింపుతున్నారు. పీసీసీ చీఫ్ కాగానే ఛలో రాజ్ భవన్ నిరసనలతో రాజకీయాలను హీటెక్కించారు రేవంత్ రెడ్డి. పార్టీలోని సీనియర్లను కలుస్తూ వారి మద్దతుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత గిరిజన దండోగా సూపర్ సక్సెస్ అయిందనే భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అదే జోష్ తో ఇబ్రహీంపట్నంలో రెండో గర్జన ఉంటుందని ప్రకటించారు రేవంత్ రెడ్డి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే కొత్త సమస్య ఎదురైంది.  పీసీసీ రేసులో చివరి వరకు నిలిచిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రేవంత్ రెడ్డి నియామకం తర్వాత అసమ్మతి స్వరం వినిపించారు. అప్పటి నుంచి సమయం దొరికినప్పుడల్లా వివాదాస్పద కామెంట్లతో పార్టీలో కాక రేపుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతల కార్యక్రమానికి డుమ్మా కొట్టిన కోమటిరెడ్డి.. రేవంత్ పిలుపిచ్చిన ఆందోళన కార్యక్రమాలకు హాజరు కాలేదు. ఇంద్రవెల్లి సభకు దూరంగానే ఉన్నారు కోమటిరెడ్డి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా సీనియర్లందరిని కలిశారు కాని ఇంతవరకు కోమటిరెడ్డి బ్రదర్స్ ను మాత్రం కలవలేదు. కలిసేందుకు రేవంత్ ఆసక్తి చూపినా.. కోమటిరెడ్డి సోదరులు ఇష్టపడలేదని చెబుతున్నారు. రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి బ్రదర్స్ గ్యాప్ కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే ఇబ్రహీంపట్నంలో రెండో దళిత గిరిజిన దండోరా నిర్వహిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించడంతో వాళ్లిద్దరి మధ్య వివాదాన్ని మరింత పెంచేసింది. ఇంద్రవెల్లి సభ ముగియగానే ఇబ్రహీంపట్నం దండోరా ప్రకటించారు పీసీసీ చీఫ్. అయితే ఇబ్రహీంపట్నం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి లోక్ సభ పరిధిలోకి వస్తోంది. ఎంపీగా ఉన్న తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఇబ్రహీంపట్నంలో సభ పెట్టడంపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అంతేకాదు పార్లమెంటరి కమిటీ సమావేశాలు ఉన్నందున.. 18వ తేదీన తాను అందుబాటులో ఉండబోనని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పార్టీకి సమాచారం ఇచ్చారట. తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో సభ పెట్టడానికి వ్యతిరేకంగానే కోమటిరెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారనే చర్చ గాంధీభవన్ లో జరుగుతోంది.  పార్టీ పెద్దలకు కూడా ఈ విషయంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫిర్యాదు చేశారట, అటు పీసీసీ కూడా ఈ విషయంలో లోతుగా చర్చించదని తెలుస్తోంది. లోకల్ ఎంపీకి తెలియకుండా ఆయన నియోజకవర్గంలో సభ పెట్టడాన్ని కొందరు పార్టీ సీనియర్లు తప్పుపట్టారని సమాచారం. ఇబ్రహీంపట్నంలో జరిగే దండోరా సభకు.. లోకల్ ఎంపీ రాకపోతే పార్టీలో విభేదాలు ఉన్నాయనే అంశం తెరపైకి వస్తుందని హెచ్చరించారట. అందుకే మధ్యేమార్గంగా సభను అదే రోజు కొనసాగిస్తూనే వేదిక మార్చాలని డిసైడ్ చేసినట్లు చెబుతున్నారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించాల్సిన దళిత గిరిజన దండోరా సభను మహేశ్వరంలో నిర్వహించబోతున్నారు.మహేశ్వరం నియోజకవర్గం చేవెళ్ల లోక్ సభ పరిధిలోకి వస్తుంది. కోమటిరెడ్డికు సంబంధం లేకుండా ఉండటానికే రేవంత్ రెడ్డి టీమ్ అలా ప్లాన్ చేసిందని తెలుస్తోంది. అనుకున్న రోజు సభ పెట్టడంతో పాటు కోమటిరెడ్డి నుంచి వ్యతిరేకత లేకుండా ఇలా నరుక్కొచ్చారని చెబుతున్నారు.  మొత్తానికి ఇబ్రహీంపట్నంలో జరగాల్సిన కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా సభ మహేశ్వానికి మారడానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే కారణమని చెబుతున్నారు. దూకుడుగా వెళుతున్న రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి కొంత బ్రేకులు వేశారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

జగన్ అనుచరుడిని విచారించిన సీబీఐ... వివేకా హత్య కేసులో ట్విస్ట్! 

ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన మాజీ మంత్రి, సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. 68 రోజులుగా విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు దూకుడుగా వెళుతున్నారు. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ముఖ్యంగా సునీల్ కుమార్ యాదవ్ ను కస్టడీలోకి తీసుకుని విచారణ చేశాకా కీలక అంశాలు బయటికి వచ్చాయి. సునీల్ కుమార్ ఇస్తున్న సమాధానాల ఆధారంగానే ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు ముందుకు సాగుతోందని తెలుస్తోంది.  వైఎస్ కుటుంబం సమీప బంధువులు, సన్నిహితులపైన సీబీఐ దృష్టి సారించింది. శుక్రవారం విచారణకు  రఘునాధ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి హాజరైనారు. ఈ కేసులో మొదటిసారిగా రఘునాధ్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. రఘునాధ్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు. పులివెందులలో సీఎం క్యాంపు కార్యాలయ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. శివశంకర్‌రెడ్డి వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు. అంతేకాదు ప్రస్తుతం ఆయన వైసీపీ రాష్ట్రకార్యదర్శిగా కొనసాగుతున్నారు. శివశంకర్‌రెడ్డిని 7 గంటల పాటు  సీబీఐ విచారించింది. గతంలో కూడా శివశంకర్‌రెడ్డిని సిట్, సీబీఐ బృందాలు విచారించాయి.  శివశంకర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మణికంఠరెడ్డిపై వివేకా కుమారై సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్‌ తరువాతి డోర్‌ దగ్గర ఆగి ఫోన్‌ కాల్స్‌చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సునీతా రెడ్డి పేర్కొన్నారు. శివశంకర్‌రెడ్డి బర్త్‌ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని సీఐకి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. చివరికి ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని తెలిపారు. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత చెప్పారు. తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని సునీత కోరారు. సునీత ఫిర్యాదు ఇవ్వడం, శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించడం ఇప్పుడు చర్చగా మారింది.

గెల్లుకు టికెట్ వెనుక అసలు కారణం ఇదా.. కేసీఆర్ అంతగా భయపడ్డారా? 

తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్  స్కెచ్ గీస్తే  చాలా పక్కాగా ఉంటుంది. ముఖ్యంగా,రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన బ్రెయిన్ పాదరసంలా పనిచేస్తుంది. అలాంటి సందర్భాలలో అయన అనూహ్యంగా పావులు కదుపుతారు. రాజకీయ చతురతను చూపుతారు. మాటల గారడీ చేస్తారు. కనికట్టుతో అందరినీ కట్టిపడేస్తారు. ఇప్పుడు, కాదు ఉద్యమ కాలం నుంచి కూడా కేసీఆర్’ నైజం అదే అంటారు, ఆయనేమిటో  తెలిసిన, అయన నిజ నిజాన్నిరుచి చూసిన మాజీ మిత్రులు. నిజానికి, రాజకీయంగా ఎంతగా వత్తిడి ఎదురైతే అంతగా కేసీఆర్ నిజరూపం బయటకు వస్తుందనేది మాజీ మిత్రుల మాట.    ప్రస్తుతం కేసీఆర్ అదే పరిస్థితిలో ఉన్నారా? రాజకీయంగా వత్తిడి ఎదుర్కుంటున్నారా, అంటే అవునననే అంటున్నారు. ఒక దిక్కు నుంచి కాదు అష్ట దిక్కుల నుంచి కేసీఆర్ చిక్కులను ఎదుర్కుంటున్నారని, అంతర్గత సమాచారం తెలిసిన పార్టీ వర్గాల సమాచారం. ఈటలతో అనవసరంగా తలగోక్కుని, తిప్పలు కొనితెచ్చుకున్నారు. ఇది ఎవరో అంటున్న మాట కాదు,  వ్యక్తిగత అభిప్రాయంగా పార్టీ పెద్దలు వ్యక్త పరుస్తున్న అభిప్రాయం. కారణాలు, ఏవైనా హుజూరాబాద్  నియోజక వర్గంలో తెరాస అంటే ఈటల, ఈటల అంటే తెరాస. కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా చివరకు ఆరడుగుల బులెట్ హరీష్ రావే అయినా ఈటల తర్వాతనే. అంతే కాదు ఈటలను కాదంటే ఎన్నికలో పోటీ చేసేందుకు పార్టీకి అభ్యర్ధి దొరకడం కూడా కష్టమే. అదే ఇప్పుడు చూస్తున్నాం.  ఇంచుమించుగా రెండు నెలలకు పైగా ఆ పార్టీ వాళ్ళను, ఈ పార్టీ వాళ్ళను ఎక్కడెక్కడి వారిని తోలుకొచ్చి దొడ్లో కట్టేసుకున్నా కేసీఆర్ కు ఈటలకు సమ ఉజ్జీగా నిలిచే అభ్యర్ధి దొరకలేదంటే, పరిస్థతి ఏమిటో అర్థం చేసుకోవచ్చును. ఏ దిక్కు లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్నట్లుగా ఎవరూ లేక, ఎవరు దొరక్కనే, కేసీఆర్  చివరకు విద్యార్ధి నాయకుడు గెల్లు శ్రీనివాస్ ని బరిలో దించుతున్నారని అంటున్నారు. అలాగన  ఇంచు మించుగా 40 ఏళ్ళు దగ్గర పడిన విద్యార్ధి నాయకుదు గెల్లును ఎంపిక చేయడం వెనక వ్యూహం, ఎత్తుగడ లేదని కాదు. అయితే, ఆ వ్యూహం ఎత్తుగడ గెలిచేందుకు మాత్రమే, కాదు ఓడిపోయినా, పరువును కాపాడుకునే వ్యూహంలో భాగంగానే ఉందని, పడిపోయినా మళ్ళీ పైకి లేచే విధంగా  కేసీఆర్ గెల్లును ఏంపిక చేశారని అంటున్నారు.  నిన్న మొనంటి వరకు హుజూరాబాద్ లో పోటీ పార్టీలు, అభ్యర్ధుల మధ్య కాదు. పోటీ కేసీఆర్ వర్సెస్ ఈటల, పోటీ ఉద్యమకారులు వర్సెస్ ఉద్యమ ద్రోహుల మధ్య అనే భావన బలంగా జనంలోకి వెళ్ళింది. ఇప్పుడు, ఆ పర్సెప్షన్ కొంత మారే అవకాశం ఉందని అంటున్నారు.   ఈటల దమ్ముంటే కేసేఆర్ లేదా హరీష్ పోటీ చేయాలని సవాలు విసిరిన 24 గంటలలోనే, గెల్లు శ్రీనివాస్  పేరును ప్రకటించారు. నిజానికి ఆగష్టు 16 న దళిత బంధు ప్రారంభ సభలో ముఖ్యమంత్రి స్వయంగా సభా ముఖంగా, ఘనంగా తెరాస అభ్యర్ధి పేరును ప్రకటిస్తారని ప్రచారం జరిగిన అదేమీ లేకుండా,అందుకు ఐదు రోజులు ముందుగానే, తూతూ మంత్రం గెల్లు పేరును ప్రకటించారు. ఈటల సవాలును స్వీకరించే ధైర్యం లేకనే, ముందుగానే గెల్లు పేరును ప్రకటించారని, ఇది కూడా కేసీఆర్ వ్యూహంలో బాగమే అంటున్నారు. ఒక విధంగా చూస్తే కేసీఆర్, వ్యూహాజనిత పోటీ నుంచి కూడా  పారిపోయారు, లేదా తప్పుకున్నారు. అలాగే, ఉద్యమాల నుంచి వచ్చిన గెల్లుని  బరిలో దించడం ద్వారా ఉద్యమ వాదాన్ని కొంతవరకు పక్కకు తప్పించారు. అలాగే, బీసీ ఫాక్టర్’ను కూడా పరిగణన లోకి తీసుకునే గెల్లు ఎంపిక చేశారు.  అయితే  కేసీఆర్ స్కెచ్ ఎంత పక్కగా ప్లాన్ చేసినా, హుజూరాబాద్ ఉప ఎన్నిక బరి నుంచి కేసీఆర్ vg ప్పించుకోలేరని అంటున్నారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, హుజూరాబాద్ బరిలో నిలిచింది, కేసీఆర్, ఈటల. అంతే కాదు, అందరూ ఉహిస్తున్నట్లుగా హుజూరాబాద్ తెరాస ఓడిపోతే, అది గెల్లు ఓటమీ కాదు కేసీఆర్ ఓటమిగానే జనం చూస్తారు.అలాగే తెరాస ఓటమిని ఉద్యమ ద్రోహుల ఓటమిగానే చరిత్ర గుర్తిస్తుందని అంటున్నారు.

వైఎస్సాసుర‌ ర‌క్త‌చ‌రిత్ర.. ఫ్యాక్ష‌న్ మీ బ్ల‌డ్ గ్రూప్‌..

వైఎస్ వివేకానంద‌రెడ్డిని ఎవ‌రు చంపారో ఇంకా తేల‌లేదు. సీబీఐ అదే ప‌ని మీద ఉంది. విచార‌ణ జ‌రుగుతున్న క్ర‌మం చూస్తుంటే.. అంతా అనుమానించిన‌ట్టుగానే వివేక స‌న్నిహితులే హ‌త్య‌కు తెగించార‌నే విష‌యంపై కాస్త క్లారిటీ వ‌చ్చేస్తోంది. హ‌త్య వెనుక ఉన్న అస‌లు పెద్ద‌లు త‌ప్పించుకున్నా.. పాత్ర‌దారులు మాత్రం దొరికిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మ‌ర్డ‌ర్ అని సుస్పష్టంగా క‌నిపించినా.. గుండెపోటంటూ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిలు చెప్ప‌డంతో అప్ప‌ట్లో అంతా ముక్కున వేలేసుకున్నారు. మ‌రింత బ‌రితెగించి వివేక హ‌త్య‌కు చంద్ర‌బాబే కార‌ణ‌మంటూ ప్ర‌చారం కూడా చేసేశారు. ఎంత విడ్డూరం.. ఎక్క‌డో క‌డ‌ప జిల్లా పులివెందుల‌లోని వైఎస్ వివేకా ఇంట్లోకి చొర‌బ‌డి చంపేంత సాహ‌సం వేరే వారికి ఉంటుందా? ఇదంతా ఇంటిదొంగ‌ల ప‌నేన‌ని అంద‌రికీ తెలిసిందేన‌ని ఆనాడే టీడీపీ విమ‌ర్శించింది. ఆ ఇంటిదొంగ‌లే ఇప్పుడు సీబీఐ విచార‌ణ‌కు క్యూ క‌డుతుండ‌టంతో నిజాలు నిల‌క‌డ మీద తెలుస్తున్నాయ‌ని అంటున్నారు.  వైఎస్ వివేక హ‌త్య‌, సీబీఐ విచార‌ణ మీద టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. కోట్ల‌ కోసం సొంత‌ బాబాయ్‌ పైనే గొడ్డ‌లి వేటు వేయించి.. ఆ నెత్తురుని చంద్ర‌బాబు గారికి అంటించాలని చూశారని లోకేశ్ మండిప‌డ్డారు.  నారాసుర‌ ర‌క్త‌చ‌రిత్ర అంటూ విష‌ పుత్రిక సాక్షిలో అదే గొడ్డ‌లి చంద్ర‌బాబు గారి చేతికి గ్రాఫిక్స్‌లో పెట్టి మ‌రీ అచ్చేయించారన్నారు. వారి తరతరాల వైఎస్సాసుర‌ ర‌క్త‌చ‌రిత్ర అంతా నేరాల‌మ‌యమని మ‌రోసారి సీబీఐ ద‌ర్యాప్తుతో తేట‌తెల్ల‌మైందని మండిప‌డ్డారు. ఫ్యాక్ష‌న్ మీ బ్ల‌డ్ గ్రూప్ అని.. అరాచ‌కాల‌కు వైఎస్ ఫ్యామిలీ కేరాఫ్ అడ్ర‌స్ అంటూ ఓ రేంజ్‌లో ఘాటుగా ట్వీట్లు చేశారు నారా లోకేశ్‌.  సొంతింటి వేట‌కొడ‌వ‌లే వివేకాని వేటాడింద‌ని స్ప‌ష్టం అవుతోంది. డ‌బ్బు, ఆధిప‌త్యం, గ‌నులు, అక్ర‌మాల కోసం సొంత బాబాయ్‌నే చంపుకున్న వైఎస్సాసుర కుటుంబ‌ ర‌క్త‌చ‌రిత్ర‌ని నీ దొంగ పేప‌ర్ సాక్షిలో ఎలా అచ్చేస్తావో చూస్తాను జ‌గ‌న్‌రెడ్డీ! అంటూ స‌వాల్ విసిరారు లోకేశ్‌.

సునీత ఇంటి ద‌గ్గ‌ర రెక్కీ!.. ప్రాణ‌హాని ఉందంటూ ఫిర్యాదు.. అది వారి ప‌నేనా?

సీబీఐ దూకుడు పెంచింది. వైఎస్ వివేక హ‌త్య కేసు విచార‌ణ వేగంగా జ‌రుగుతోంది. రెండు నెల‌లుగా సీబీఐ ఇదే ప‌ని మీద ఉంది. వాచ్‌మెన్ వాంగ్మూలం కీల‌కంగా మారింది. కొంద‌రు పెద్ద‌లు మిన‌హా అనుమానితులంద‌రినీ ప్ర‌శ్నిస్తోంది. వేరు వేరు కోణాల్లో ఎంక్వైరీ చేస్తోంది. నిందితుడు సునీల్‌ను ఇప్ప‌టికే అరెస్ట్ చేసింది. ఇంకా చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి. గొడ్డ‌లిపోటును గుండెపోటుగా ప్ర‌క‌టించిన వారినీ విచారించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సీబీఐ ద‌ర్యాప్తు వేగం పుంజుకుంటున్న నేప‌థ్యంలో.. స‌డెన్‌గా వైఎస్ వివేకా కూతురు సునీత ఇంటి ద‌గ్గ‌ర ఓ అగంత‌కుడు రెక్కీ నిర్వ‌హించిన‌ట్టు తెలుస్తోంది. స‌కాలంలో గుర్తించిన సునీత వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. తమ కుటుంబానికి ప్రాణ‌హాని ఉంద‌ని.. భద్రత కల్పించాలని కడప ఎస్పీకి వైఎస్‌ సునీత లేఖ రాయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటికి స‌మీపంలో ఆగి ఎవ‌రికో ఫోన్‌ కాల్స్ చేశాడని లేఖలో సునీత తెలిపారు.  శివశంకర్‌రెడ్డి బర్త్‌ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని సీఐకి ఫిర్యాదు చేశానని రాశారు. చివరికి ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని.. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత చెప్పారు.  తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, అత‌ని అనుచ‌రుడు మ‌ణికంఠ‌రెడ్డి త‌మ ఇంటి ద‌గ్గ‌ర రెక్కీ నిర్వ‌హించడం త‌మ‌కు భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోందని సునీత వాపోతున్నారు. త‌మ కుటుంబానికి ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంతో పాటు.. త‌న తండ్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గు తేల్చాలని సీబీఐని కోరారు సునీత‌.   

హుజురాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో లేనట్లేనా?

హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? షెడ్యూలు ఎప్పుడు విడుదలవుతుంది? ఎప్పుడో తెలియదు కానీ, ఇప్పుడైతే కాదు. ఆగష్టు చివరి వరకు అయితే, ఖాయంగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశమే లేదు. నిన్న మొన్నటి వరకు ఆగష్టు 16 తేదీలోగానే, ఎన్నికల నోటిఫికేషన్  వచ్చేస్తుందని ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేదని, కేంద్ర ఎన్నికల సంఘం చల్లని కబురు మెల్లగా చెప్పింది. ఆగష్టు 16 లోగానే ఉప ఎన్నికల నోటిఫికేషన్ వస్చేస్తుందనే, ముఖ్యమంత్రి 16 తేదీన హుజురాబాద్ నుంచి ప్రారంభించవలసి ఉన్న దళిత బంధు పథకన్ని, అనుకున్న రీతిలో హుజూరాబాద్ లో కాకుండా, దత్తత గ్రామా వాసాలమర్రిలో ముందుగానే మమ అనిపించారు. నోటి మాటగానే ప్రారంభించినట్లే అనుకోండని ప్రకటించారు.  అయితే, తాజా సమాచారం ప్రకారం, కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్ సహా దేశంలో  ఖాళీగా ఉన్న వందకు పైగా అసెంబ్లీ, లోక్ సభ, మండలి  స్థానాలకు ఎన్నికలు/ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలానే విషయంలో ఒక నిర్ణయానికి రాలేదు. ఉప ఎన్నికలే కాదు, వచ్చేసంవత్సరం (2022)ప్రారంభంలో జరగవలసి ఉన్న ఉత్తర పదేశ్ సహా ఐదు రాష్టాల శాసన సభ  ఎన్నికల విషయంలోనూ ఈసీ, ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  ఈ పరిస్థితిని గమనిస్తే ఎన్నికల నిర్వాహణపై గతంలో ఎన్నికల సంఘానికి మద్రాసు హైకోర్టు మొట్టికాయలు వేసిన నేపధ్యంలో,  ఎన్నికల సంఘం  రాజకీయ పార్టీల అభిప్రాయాలతోనే ముందుకు వెళ్లాలని భావిస్తోంది. అంతే, కాదు, కొవిడ్ పరిస్థితులను పట్టించుకోకుండా, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన అధికారిని, ఉరి తీయాలని న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపధ్యంలో,  కేంద్ర ఎన్నికల సంఘం.  కొవిడ్ మహమ్మారి విషయంలో ఒక స్పష్టత వచ్చే వరకు అన్ని ఎన్నికలను వాయిదా వేయడమే మంచిదన్న ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది.  ఈ నేపధ్యంలోనే కేంద్ర ఎన్నికలసంఘం తాజాగా దేశంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి తమ అభిప్రాయాలు తెలియచేయాలని కోరుతూ లేఖలు రాసింది. ఉప ఎన్నికలతో పాటుగా ఐదు  రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలపై పార్టీలు తమ అభిప్రాయాలు ఆగస్టు 30 లోగా  తెలియజేయాలని లేఖలో  కోరింది. అంటే ఆగష్టు 30కి ముందు, ఎలాంటి నిర్ణయం వచ్చే అవకాశం లేదు. ఆగస్టు 30 తరువాతే హుజూరాబాద్ ఉపఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అయితే, అప్పటికీ కొవిడ్ మహమ్మారి పరిస్థితిలో మార్పు  రాకుంటే, ఉప ఎన్నిక ఇంకా వెనక్కి వెళ్ళినా ఆశ్చర్య పోనవసరం లేదు.  అదలా ఉంటే ఉప ఎన్నిక ఆలస్యం అయితే, అది అధికార పార్టీ ఉపకరిస్తుందని అంటున్నారు. మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ పట్ల ప్రస్తుతమున్న సానుభూతి చల్లారడంతో  పాటుగా, ప్రభుత్వం ఓటర్లకు వలవేసేందుకు ఉద్దేశించిన దళిత బంధు వంటి పథకాలను అమలు చేసేందుకు వెసులుబాటు లభిస్తుందని గులాబీ పార్టీలో వినవస్తోంది. మరోవంక బీజేపీ ఎన్నికలు ఎంత త్వరగా ముగిస్తే, అంట మంచిదని భావిస్తోంది.  అయితే, అల్టిమేట్’గా ఏ నిర్ణయం అయినా తీసుకోవలసింది కేంద్ర ఎన్నికల సంఘం, తీర్పును ఇవ్వవలసింది హుజూరాబాద్ ప్రజలు.